నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, December 30, 2009

కొన్ని కొత్త బ్లాగు లు !

ఇటీవల మా స్నేహితులు ఇద్దరు తమ కొత్త బ్లాగులు ప్రారంభించారు. చిరకాల స్నేహితుడు , జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ కొత్త బ్లాగ్ ఇక్కడ చూడండి.శ్రీనివాస్ పెద్దగా కవిత్వం రాయని కవి. అతని వచనం నిండా కవిత్వమే. అందుకే ప్రత్యేకంగా కవిత్వం రాయడు కాబోలు అనుకుంటాను. శ్రీనివాస్ సంపాదకీయాలు, తన కాలమ్ సంభాషణ చదివే వారికి నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుంది. పత్రికా రచనల్లో కూడా తన కవిత్వాన్ని పోగొట్టుకోకుందా పదిలంగా కాపాడుకుంటున్నందుకు శ్రీనివాస్ ని అభినందించాలి.

అలాగే, మరో చిరకాల మిత్రుడు, కవి, కథకుడు వంశీకృష్ణ కూడా తన బ్లాగ్ ప్రారంభించారు. దానిని ఇక్కడ చదవచ్చు. వంశీ. కవిత్వం గురించి చెప్పటం కన్నా చదవటం మంచి అనుభూతి. అతని బ్లాగు నిజమైన కవిత్వ అభిమానులకు ఓ సెలయేరు. నా మాట తప్పు కాదని మీరు కూడా వొప్పుకుంటారు ఒక సారి చదివితే. భావుకత్వం, సున్నితత్వం , వాటికి తోడు ఒక ప్రేమానుభూతి. ఇవన్నీ వంశీ మార్క్ రచనలు.

ఇక చివరగా నేను కూడా మరో కొత్త బ్లాగ్ కి శ్రీకారం చుట్టాను. అది ఇక్కడ చదవండి.

Monday, December 28, 2009

వైరుధ్యాల పంజరంలో అజంతా!





-----అఫ్సర్




శిబిరంలోనూ, సమూహంలోనూ మనిషి నిజానికి దూరమవుతాడు. శిబిరం పాక్షికత్వానికీ, సమూహం నిష్పాక్షికమే అయినా నిష్ప్రయోజనమైన కట్టుగొయ్యకూ ప్రతీకల్లాంటివి. అవి రెండూ సత్యానికి సమాధి కట్టేవే, సత్యాన్వేషణ కోసం మనిషి ఒకో సందర్భంలో వొంటరివాడవక తప్పదు. లక్ష్యం మరిచిన రాజకీయ శిబిరాల మధ్య, అవసరాల బానిసత్వంలో రక్తాన్ని చంపుకున్న సమూహాల మధ్యా మనిషికి సామూహిక వ్యక్తిత్వం వుండదు. వుండేదల్లా అస్తిత్వ వేదన.


ఇలాంటి సంక్లిష్ట దశ లోంచి పుట్టుకు వచ్చినవే అధివాస్తవికత లాంటి వాదాలన్నీ –మనిషి సహజత్వాలను వెతికి పట్టుకోవడం కోసం ఉపయోగపడిన సర్రియలిజం సహజంగానే రాజకీయ వాదుల్ని భయపెట్టింది; రాజకీయ పక్షి మూకల్లో కలవరం సృష్టించింది. తనను చుట్టుముట్టిన కలుషిత సామాజిక వాస్తవాల మధ్య నుంచి తనని ఒక అడుగు పైకెత్తి కనుమరుగవుతున్న నిజాలలోకి తొంగి చూసే అవకాశమిచ్చిన అరుదైన వాదం అధివాస్తవికత. రాజకీయ వొత్తిళ్ళకు అధివాస్తవికత వాదం నలిగి పోయినా దాని పరిమాళాలు ఇప్పటికీ మిగిలివున్నాయి. నిజం కోసం వెతుక్కునే తరం ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే వుంటుంది.


శిబిరాల్లో, సమూహాల్లో వూపిరాడక పారిపోయిన సత్యాన్ని ఈ తరం వెతుక్కుంటుంది. అప్పటి అన్నీ సాధారణ ప్రమాణాల శిఖరాగ్రం పైనా ఆ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది కొత్తతరం. అలాంటి సంక్షోభ తరానికి ఉత్తమ ప్రతినిధి అజంతా. వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన అక్షరం అతని సంతకం.


కవిగా అజంతా నలభైయేళ్ళ చరిత్ర ని చూశాడు. నలభైయేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైరుధ్యాలలో నలిగిపోయిన మనిషి అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. హతుడూ, హంతకుడూ తానే అవుతున్న ఆధునిక మానవుడి క్షణ క్షణ బీభత్సాన్ని ఆయన కవీత్వాకరించాడు. ‘ అగ్ని స్పర్శ ‘ లో అజంతా చాలా స్పష్టం గా కనిపిస్తాడు. అజంతా కవి తత్త్వాన్నంతా ప్రతిబింబించే ముఖచిత్రం అది.


‘ బాధ నా ముఖ చిత్రం
బాధాగ్ని లో పునీతుడైన మనిషి పాదధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్ఛాగీతాన్ని రచిస్తాను ‘


కరిగిపోతున్న కాలం ముందు నిల్చోని అరచేతి కాన్వాస్ పై అశ్రు బింబాన్ని రచిస్తున్న అధివాస్తవిక స్వాప్నికుడు సాల్వదార్ డాలీ ‘ అగ్ని స్పర్శ ‘ చదూతున్నంతసేపూ మన చుట్టూ గాలి లా అల్లుకుపోతాడు. భయం, విభ్రమం ఆవులిస్తున్న అగాధంలో చిటికెలు వేస్తున్న మృత్యువు ఎండుటాకులా అల్లాడిపోతున్న మనిషి, శవం రాల్చి వెళ్లిన పూలతో తనని తాను అలంకరించుకుంటున్న రోడ్డు- ఇలాంటి ఒక దృశ్యం పాఠకుడి ఆలోచనలో చిక్కుకుపోతుంది. భాదాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న మనిషి ఎప్పుడూ క్షతగాత్రుడే.


“ జీవన కుడ్యాలపై ఆకలి ఆకర్ణాంత నేత్రాలు
కన్నీళ్ళలో ప్రేమికుల ప్రతిబింబాలు
అన్నీ ఒకే దృశ్యం వెనుక భస్మరాసులే
కంటక చతురస్రాల మధ్య నిరీక్షణ అసహ్యం నాకు ‘


ఈ వాక్యాలు చదువుతున్నప్పుడూ అజంతా రాసిన వొకే వొక్క కథ “చతురస్రం” గుర్తుకొస్తుంది. దృశ్యం మారుతుంది. కానీ సారం ఒక్కటే. ప్రతిబింబం మారుతుంది. కానీ రూపాలు అవే. రేఖలు కాన్వాస్ దాటి రంగులు బలహీనపడుతున్నప్పుడు ఆలోచన అక్షరంలోకి జారుతుంది. రంగు గీతా పలచబారి అక్షరం కొనదేలుతున్న ఆ అసహన రేఖ మీద సాల్వడార్ దాలీతో అజంతా కరచాలనం చేస్తుంటాడు. డాలీ కళ్ళల్లో అవ్యక్తం గా మిగిలిన అనుభూతి కొస కాంతులు అజంతా అక్షర ఛాయలోకి ప్రయాణిస్తాయి. ఎప్పుడో జారిపోయిన కల మీద ఆకాశం భూతద్దంలా కన్ను విప్పుతుంది. ఆ తర్వాత అక్కడ కెరట కెరటాలుగా మెలి తిరుగుతున్న వెయ్యి సముద్రాలు మేల్కోంటాయి.

సమాజం నుంచి విసిరేసిన మనిషి ఆ తీరమ్మీద రాలిపడ్తాడు. అక్కడి ఇసుక తిన్నెల మీద అతని నీడ పల్చగా సాగుతుంది. చెవుల్ని సముద్రాల చేతుల్లో మూసుకొని అక్కడ అతను మళ్ళీ మళ్ళీ వొంటరి వాడవుతాడు. ఇది వొంటరి తనం లోకి నిరంతరంగా సాగే ప్రయాణం. మనిషి సహజం గా ఏకాకి. వొంటరితనం అతని సహజాతం. పుస్తకాలు, సిధ్ధాంతాలు, జెండాలు అతన్ని కప్పి వేసే ఆచ్ఛాదనలు.


మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనిషి మళ్ళీ ఎప్పుడో ఒకసారి తన అమాయకత్వంలోకి వెళ్ళాల్సివస్తుంది. వర్తమానం వంచనగా మారినప్పుడు, గతం అగాధంగా పరిగణిస్తున్నప్పుడు భవిష్యత్తు శూన్యంగానే విస్తరిస్తుంది. శూన్యం మనిషికి ఒక అవరోధం. అతని అడుగుల్నీ వెనక్కి చుట్టిపెట్టే ఒక గాయం. శూన్యంతో పోరాటం ఎప్పుడైనా అనివార్యమే. అది మనిషిని వెక్కిరించే గోడ. ఆ గోడ ఒక్కోసారి సంప్రదాయం. ఇంకోసారి కుహానా సిధ్ధాంతవాదం. గోడని పడగొట్టడమే మనిషి కర్తవ్యం.ఆ గోడలో నియమాల ఇటుకలుంటాయి. అది అప్పుడప్పుడూ కొరడా విప్పే మేనిఫెస్టో కూడా. అక్కడ పూర్వీకుల సంతకాలుంటాయి. వాటిని బుధ్ధిగా అనుకరించు లేదా యుధ్ధానికి తలపడాలి. నిజమే. అది శూన్యంతో పోరాటమే. శూన్యంలో కత్తులు దూయడమే. అయినా సరే పోరాటం అనివార్యం. అప్పుడు


నీవు గోడతో మాట్లాడుతున్నావు
సంకెళ్ళు పడిన చేతులను స్పృశిస్తున్నావు


గోడలు మాట్లాడవు. నడకని సాసిస్తాయి. గోడలు పోట్లాడవు. కాళ్ళూ చేతులకు సంకెళ్ళు వేస్తాయి. మనిషి అధికారాల్ని స్వంతం చేసుకొని జులుం చేస్తుంది గోడ. గోడ ఎదుట మనిషి ముసుగు ధరిస్తాడు.


‘ అంతా ముసుగు వేసుకున్నవాళ్ళే
అక్షరాలకు ముసుగు ఆలోచనలకు ముసుగు
ముఖం వెనుక మరో ముఖం, స్వచ్ఛమైన
సూర్యోదయాలను అంతా భూస్థాపితం చేసుకున్నవాళ్ళే ‘
ఛద్మ వేషధారుల ప్రపంచం అది. ఆచ్ఛాదన అవసరమై వచ్చి శాసనంగా మారిన విషాదం అది.
‘ జీవన వ్యూహంలో మనిషి
శిలా విగ్రహంగా మారుతున్న దృశ్యం చూడలేను చూడలేను
నిత్యం అదే జీవితం అదే రోడ్డు అదే గోడ
అదే గడియారం అవే ముఖాలు దుస్సహం, దుర్భరం ‘

దృశ్యం మారదు . మనిషి పెదాల మీద అతికించుకున్న మాటల పోగులు మారవు. చీకటి స్తంభంగా దిగడిపోయిన మనిషి వీడు. కాలాన్ని మరిచిపోయి ఒక చోట కరిగిపోయిన మనిషి. కట్టుగొయ్య దగ్గర పాత గడ్డిని కరుచుకుతింటున్నాడు. అన్వేషణ లేదు, అవగాహన లేదు, అంతస్సు అంతకన్నా లేదు. మనిషి అడుగులు స్తంభించిన సంక్షోభం ఇది. ఆ మంచుని అగ్నితో స్పర్శించే వేళ్ళు కావాలి. ఆ సంక్షోభాన్ని సందేహంతోనో, సంశయం తోనో విడగొట్టే మార్గం ఏదైనా కావాలి. చుట్టూ గోడలు నిర్మించుకున్న మనిషి ని ఈ తలుపుల్లోంచి నడిపిస్తారో ఇక?
ప్రశ్నకు సమాధానం ప్రశ్న
పెద్దపులి గుండెల్లో కత్తులు విసురుతున్న మనిషిని నేను
అక్కడే శాశ్వత విశ్రాంతి లేదా విక్రాంతి


అజంతా మృత్యువు ని ప్రేమిస్తాడు. జీవితాన్ని ద్వేషించాడు. నిరాశాని ప్రేమిస్తాడు. కానీ ఆశాని ద్వేషించాడు. అక్షరాన్ని సాధనగా మిగుల్చుకున్న అజంతా బాధతో, నిరాశతో, నిస్పృహతో వక్తీకరణకు పదును తెఛ్చుకుంటాడు. బాధ లోంచి, నిరాశ లోంచి మనిషిని తనతో పాటు నడిపిస్తాడు. అతని ప్రయాణం ఒక సందేహం నుంచి ఒక సంశయం నుంచి విస్తృతమవుతున్న ఆలోచనల్లోకి---


దురదృష్టవశాత్తూ కవిత్వాన్ని విశ్లేషించడంలో మనం ఇంకా చిన్న పిల్లలమే. వేటినో నమ్ముకొని వేటినో వెతుక్కోవడం మనం ఇంకా మానుకోలేదు. నిజమే, శుధ్ధ కవిత్వం, శుష్క కవిత్వం ఎక్కడా వుండదు. కలుషితమైన సమాజంలో నిష్కల్మషమైన కవిత్వాన్ని వూహించడం నేరం. అక్షరం మీద పడే అన్నీ నీడలు సమాజ కల్పితాలే. అక్షరాన్ని శాసించే అన్నీ నియమాలు సమాజపరమైనవే.


కవిత్వం కోసం కవిత్వం ఎవరూ రాయరు. కవిత్వం ఒక వెతుకులాట. దాని పరిధి విస్తృతమైంది. మనమే విధించుకున్న నియమాలు వ్యక్తీకరణలో తాత్కాలిక అవరోధాలు గా పరిణమిస్తాయి తప్ప వాటి నీడల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. అజంతా స్వాతంత్రోదయానికి అటూ ఇటూ గా రాసిన కవితలే దానికి మంచి ఉదాహరణ. ఆధునిక కవిత్వాన్ని సంప్రదాయిక చీకటి పాషాణ హస్తాల నుంచి కాపాడుకోలేనంతవరకూ అజంతా మనకు పరాయి కవిగానే కనిపిస్తాడు.




( 1993లో అచ్చు అయిన అఫ్సర్ “ఆధునికత – అత్యాధునికత” పుస్తకం నుంచి )

Friday, December 25, 2009

మృత్యువు కవి అజంతా!


తెలుగులో చిక్కనైన కవిత్వం –చెరిగిపోని సంతకం అజంతాది. అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి . అజంతా ఆయన కలం పేరు. స్వప్న లిపి ఆయన కవిత్వ పుస్తకం. అజంతా ఒకరకం గా మృతువు కవి. ఆయన నిరంతరం మృతువు ని ప్రేమిస్తున్నాడనిపిస్తుంది ఆయన కవిత్వం చదువుతుంటే. ఆయనొక నిరాశావాద కవి అని కొందరి అపోహ. అపోహ అని ఎందుకన్నానంటే ఆయన కవిత్వం అర్ధం కాకపోతే అనుకునే మాట అది. ఆయన కవిత్వాన్ని కేవలం పదాలుగా, వాక్యాలుగా, కొన్ని పద చిత్రాలుగా చూస్తే అజంతా రాసే కవిత్వాన్ని చదివి ఈయనకు జీవితం అంటే ద్వేషం, నిరాశ. అందుకే ఎప్పుడూ మృతువుని కలవరించి పలవరిస్తాడు అనుకుంటారు. కానీ, ఆయన తన జీవితాన్ని, తన చుట్టూ వున్న వారి జీవితాల్నీ ప్రేమించాడు కాబట్టే అనివార్యమైన మృత్యువు ని కూడా ప్రేమించాడు అంతే ఇష్టం తో.

‘ అగ్ని స్పర్శ ‘ అనే కవితలో అజంతా ఏమంటారంటే...
‘బాధ నా ముఖచిత్రం
భాదాగ్ని లో పునీతుడైన మనిషి పాడధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్చాగీతాన్ని రచిస్తాను ‘

చాలా మంది కవుల్లాగా ఆయన ఎక్కువ రాసి, ఎక్కువ మాట్లాడి, ఎక్కువ పొగిడించుకోలేదు. తక్కువ రాశాడు. మరీ తక్కువ మాట్లాడాడు. ఇక పొగిడించుకున్నదీ, పొంగిపోయింది ఏమైనా వుందా అంటే అది స్వల్పాతిస్వల్పం. కనీసం కవిత్వ పుస్తకం కూడా ఆయన చివరి దశలో వచ్చింది. స్వప్న లిపి పుస్తకం వచ్చే వరకు ఆయన మౌనంగా, ఋషి లా వుండిపోయాడు తప్ప ఒక పేరున్న కవిలా బతకలేదు.

ఇలాంటి మంచి కవి గురించి నాకు పసితనం నుంచి పరిచయం వుందటం కేవలం నా అదృష్టమే. మా నాన్న గారు,కవి, రచయత, జర్నలిస్ట్ రెంటాల గోపాలకృష్ణ, కవి అజంతా ఇద్దరూ సమకాలీకులు. ఇద్దరూ కవులు, ఇద్దరూ ఆంధ్రప్రభ పత్రికాఫీసులో ఒకేసారి పనిచేశారు. అజంతా ఇల్లు మా ఇంటికి ఓ రెండు మూడు సందుల అవతల. వాళ్ళ అమ్మాయి అపర్ణా, మా చెల్లి శ్రీవిద్య కలిసి చదువుకున్నారు. అలా నిరంతరం మేము వాళ్ళ ఇంటికి వెళుతూవుండేవాళ్ళమూ. కానీ ఆయనతో సంభాషణ లు చాలా తక్కువ, ఏవో కొన్ని కొన్ని పొడి మాటలు తప్ప. ఇక కవిత్వ చర్చల్లాంటివి అసలు శూన్యం. నేను కవిత్వం రాయటం మొదలుపెట్టేటప్పటికి ఆయనతో భౌతికం గా దూరమైపోయాను.
మళ్ళీ హైదరాబాద్ లోకి మా నివాసం మారినప్పుడు, అక్కడ అఫ్సర్, వాళ్ళ మిత్రబృందంతో జరిగే కవిత్వ చర్చల్లో మళ్ళీ అజంతా మా మధ్యకు వచ్చేవారు. ఆయన మరణ వార్త వినటానికి కొన్ని నెలల ముందే మాకు హైదారాబాద్ నుంచి అనంతపూర్ కి బదిలీ అయింది.

జీవించినంత కాలం మృత్యువుని ప్రేమించి, ఎదురుచూపులతో, కలవరించి, పలవరించిన అజంతా డిసెంబర్ 25, 1999 కన్నుమూశారు.
ఆ తర్వాత మళ్ళీ అజంతాతో నా పునః జ్ణాపకం 2002 లో. అజంతా మరణం తర్వాత మిత్రులు, కుటుంబసభ్యులు కలిసి అజంతా అవార్డ్ నెలకొల్పారు. ప్రతి ఏటా వచ్చిన ఉత్తమ కవిత్వ సంకలనానికి ఆ అవార్డ్ అందచేస్తారు. 2001 లో నా కవిత్వ సంకలనం “ నేను కనిపించే పదం “ విడుదల కాగా 2002 లో నా కవిత్వ పుస్తకానికి, మరో స్త్రీవాదకవయత్రి కె. గీత పుస్తకం “ ద్రవ భాష “ కి కలిపి సంయుక్తం గా అజంతా అవార్డ్ అందచేశారు. అవార్డ్ సభ డిసెంబర్ 25, 2002 హైదరాబాద్ లో జరిగింది. ఆ అవార్డ్ సభలో, అవార్డ్ అందుకునేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక ఆడ పిల్ల కు పుట్టింటి నుంచి పసుపు,కుంకుమలు ఇచ్చినప్పుడు ఎలా వుంటుందో ఆ అవార్డ్ అందుకునేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగింది నాకు. దానికి కారణం పసి తనం నుండి అజంతా గారి గురించి తెలిసి వుండటమే. నా కవిత్వ పుస్తకం వచ్చేటప్పటికి మా నాన్నాగారు జీవించిలేరు. అజంతా లేరు. కానీ నా మొదటి పుస్తకానికి మా నాన్నగారి స్నేహితుడిగానే కాకుండా తెలుగు కవిత్వంలో అజంతాది ఒక ప్రత్యేక స్థానం. నాకేమిటో, ఆ సభలో మా నాన్నగారు, అజంతా వున్నట్లే అనిపించింది.

డిసెంబర్ 25, అజంతా గారి వర్ధంతి. హైదరాబాద్ లో అవార్డ్ సభ ఏమైనా జరిగిందో,లేదో నాకు తెలియదు. అవార్డ్ లు మన ప్రతిభాకు తప్పనిసరి గీటురాళ్ళు అని నేను నమ్మను కానీ ఈ అవార్డ్ రావటం మాత్రం వ్యక్తిగతం గా నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. దానికి కారణం కేవలం ఒక కవిగా అజంతా మీద నాకున్న ప్రేమ, గౌరవం మాత్రమే. అలాగే ఆ అవార్డ్ కింద అందచేసిన చిన్నపాటి మొత్తాన్ని కూడా పనిపిల్లల పిల్లలకు చదువు ఉచితం గా చెప్పేందుకు కృషి చేస్తున్న ఒక సేవాసంస్థకు అందచేయగలగటం నాకు అంతకన్నా ఎక్కువ మానసిక ఆనందాన్ని అందచేసింది. వర్ధంతులు, జయంతులు మొక్కుబడిగా కాకుండా కనీసం వారిని స్మరించుకొని వారు చేసిన మంచిపనులో, సమాజానికి ఉపయోగపడ్డ తీరునో స్మరించుకున్నా చాలు. అదే వారికి నివాళి.
కల్పనారెంటాల

Tuesday, December 22, 2009

ఈ కథ మీకు అర్ధమయిందా?

కథా రచయత గా జాన్సన్ చోరగుడి ఎన్ని కథలు రాసారో నాకు లెక్క తెలియదు కాని ఆయన రాసిన ఒక కడలూర్ వెళ్ళాలి నీలిమ కోసం ( పేరు తప్పై ఉండవచ్చు....ఇలాగే ఏదో వుంటుంది ) అనేది మాత్రం మంచి కథ. అదే నేను చదివిన ఆయన మొదటి కథ.. ఆ తర్వాత ఏవో కొన్ని కథలు చూసాను కానీ పెద్దగా గుర్తుండిపోయినవి నాకు తక్కువే. ఈ కథ మొన్న ఆదివారం ( డిసెంబర్ ఇరవై ) సాక్షి ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. మొదటి సారి చదువుతున్నప్పుడే సరిగా అర్ధం కాలేదు. మళ్ళీ నెమ్మదిగా చదివే ప్రయత్నం చేశాను. కథ ముక్కలు ముక్కలుగా అర్ధమైంది. మొత్తంగా కథ మాత్రం అర్ధం కాలేదు. కథ పేరు కి కధ కి సంబంధం అసలు అర్ధం కాలేదు. మూడో సారి పట్టు విడవకుండా మళ్ళీ చూద్దామని వెళితే కథ కి వేసిన బొమ్మ కనిపించింది. అది పరీక్ష గా చూస్తే జరగలేదు కి ఒక పక్కన ఆ మీటింగ్ అని కనిపించింది . కూడబలుక్కొని చూస్తే ఆ మీటింగ్ జరగలేదు. అమ్మయ్య కథ పేరైనా అర్ధమైంది అనుకున్నాను. నాకు కథలు రాయటం రాదని తెలుసు, చదవటం కూడా రాదేమో అని ఈ కథ చదివాక అనిపించింది. మీకేవరికైనా ఈ కథ అర్ధం అయితే ఇక్కడ రాయరా?నేను కూడా అర్ధం చేసుకుంటాను.
ఈ కథ ఇక్కడ చదవండి.

Monday, December 21, 2009

మూడు సాహిత్య పరమైన ఆహ్వానాలు,ప్రకటనలు - విజ్ఞప్తులు



ఒకటవ ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి
15వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

గత 14 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "వికృతి" నామ సంవత్సర ఉగాది (మార్చ్ 16, 2010) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 15 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. విదేశాలలో తెలుగు భాషనీ, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ, మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.
ఉత్తమ కథానిక: (రెండు బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
ఉత్తమ వ్యాసం: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116


ఈ సంవత్సర ప్రత్యేకం
"నా మొట్ట మొదటి కథ"
కథ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ కథలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త కథా రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా "నా మొట్టమొదటి కథ" అనే ప్రక్రియ మొదలుపెడుతున్నాం. తమ మొట్టమొదటి గా పేర్కొంటూ, నూతన కథకులను తమ కథలని పంపించమని కోరుతున్నాం. వాటినన్నింటినీ మా న్యాయ నిర్ణేతలు పరిశీలించి , కనీసం రెండు కథలకి ఒక్కొక్కటీ $116 చొప్పున బహుమతీ, ప్రశంసాపత్రమూ ఇచ్చి గుర్తిస్తారు. ఇవే కాక, అర్హత ఉన్న ఇతర కథలన్నింటినీ రాబోయే "అమెరికా తెలుగు కథానిక - పదకొండవ సంకలనం" లో ప్రచురిస్తాం. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులందరినీ ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. "నా మొట్టమొదటి కథ" అనే శీర్షికతో అని మీరు మాకు పంపిస్తే చాలు. "నేను ఇదివరకూ ఎక్కడా నా కథలు ప్రచురించ లేదు” అని మీ మాటగా మేము నమ్ముతాం.. ఇది నిజానికి "పోటీ" కాని "పోటీ".

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చును. నవలకు పేజీల పరిమితి లేదు కానీ మిగిలిన వన్నీ వ్రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది.
తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్నా పరవా లేద
బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి ప్రచురించబడతాయి.
ఫలితాలు మే నెల 15, 2010 వ తారీకు లోపుగా ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోపుగా తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని రచయితలను కోరుతున్నాం.
విజేతల ఎన్నిక లో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is: March 16, 2010 (Ugadi)
Please see below on how to send entries

రెండవ ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి

20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కవిత
(మా రాబోయే ప్రచురణ -2010)

20 వ శతాబ్దంలో, ఇంచుమించు 1960 ప్రాంతాలనుండీ ఉత్తర అమెరికా వలస వచ్చిన అనేక మంది, తమదే అయిన స్ఫూర్తి తో, సృజనాత్మకతో, తెలుగులో ఎన్నెన్నో కవితలు రచించి, ఎంతో గొప్పదైన మన తెలుగు కవితను సుసంపన్నం చేశారు. అటు సుదీర్ఘమైన కావ్యాలతో బాటు, ఇటు ఆధునిక వచన కవితలు మొదలైన అనేక అనేక ప్రక్రియలలో రచించి ఉత్తర అమెరికాలో తెలుగు కవితకి పునాదులు వేశారు. ఆయా రచయితల కృషికి గుర్తింపుగానూ, మొదటి మూడు, నాలుగు తరాల అమెరికా కవుల కవితలో మంచి ప్రమాణాలతో వైవిధ్యం గల కవితలను తగినంత సంఖ్యలో ఎంపిక చేసి “20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కవిత “ పేరిట రాబోయే 2010 వ సంవత్సరంలో ప్రచురించాలని సంకల్పించాం. ఆయా కవితల సేకరణలో మీ సహాయ, సహకారాలను ఈ క్రింది విధంగా అర్ధిస్తున్నాం.
20 వ శతాబ్దంలో మీరు రచించి, ప్రచురించిన కవితలలో మీకు నచ్చిన ఐదు కవితలను మాకు పంపించడం.
మీ స్వీయ కవితలు కాకపోయినా, మీకు నచ్చిన ఇతరుల కవితలను సేకరించి మాకు పంపించడం, లేదా వివరలు మాకు తెలియజేయడం
ఏ కవితలు పంపించినా, పూర్తి ప్రచురణ వివరాలు (పత్రిక పేరు, సంవత్సరం, వాటి కవి పేరు, ఫోన్ నెంబర్ లాంటి మీకు తెలిసిన కాంటాక్ట్ విశేషాలు) మొదలైనవి మాకు తెలియపరచి, చారిత్రాత్మకమైన మా ఈ ప్రయత్నంలో సహకరించమని హృదయ పూర్వకంగా అందరినీ కోరుతున్నాం. మీ అందరి అద్వితీయమైన సహకారమే ముఖ్య కారణంగా మేము ఈ సంవత్సరం (2009) లో ప్రచురించిన "20 వ శతాబ్దంలో అమెరికా కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం" చారిత్రాత్మక ప్రాధాన్యత ను సంచరించుకున్న విషయం మీకు తెలినదే!
మీ కవితలూ, కవితా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: జనవరి 15, 2010.
Please see below on how to send entries

మూడవ ప్రకటన - ఆహ్వానం –విజ్ఞప్తి
అమెరికా తెలుగు కథానిక - 11 వ సంకలనం

(మా రాబోయే ప్రచురణ -2010)

1995 నుంచీ మేము ప్రచురిస్తున్న అమెరికా తెలుగు కథానిక -11 వ సంకలనం వచ్చే ఏడు వెలువడుతుంది. ఉత్తర అమెరికా తెలుగు రచయితల కథా సంకలనాలగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ పుస్తకంలో ప్రచురణార్ధం గత రెండు, మూడు సంవత్సరాలలో ఎక్కడైనా ప్రచురించబడిన మంచి కథలను మా పరిశీలనకు పంపించమని ఉత్తర అమెరికా కథకులనూ, సాహితీవేత్తలనూ, పాఠకులనూ కోరుతున్నాం. ఒక్కొక్కరూ మీకు నచ్చిన నాలుగు కథలు పంపించవచ్చును. కథ కాపీ, మరియు ప్రచురణ వివరాలు కూడా మాకు తెలియపరచండి. కథల సేకరణ మరియు ఎంపిక విషయాలలో తమ సహకారాన్ని అందించమని పత్రికలూ, వెబ్ మేగజీన్ సంపాదకులూ, స్వీయ బ్లాగులూ, వెబ్ ప్రచురణలూ ఉన్న కథకులనూ, ప్రత్యేకంగా అర్ధిస్తున్నాం.
మీ కథలూ, కథా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: జనవరి 15, 2010.
Address to send entries for all of the above three requests are:
Soft copies by e-mail (PDF or Unicode attachments preferred):
phspvr@physics.emory.edu and copy to rvanguri@wt.net
Fax: 1-866 222 5301
Postal/Snail Mail: Vanguri Foundation of America
P.O. Box 1948
Stafford, TX 77497
For any additional details, please contact any of the following:
Pemmaraju Venugopala Rao
Phone:407 727 4297
E-mail:phspvr@physics.emory.edu

Chitten Raju Vanguri
Phone:832 594 9054
E-mail:vangurifoundation@yahoo.com

Sunday, December 20, 2009

తెలంగాణ పై అమెరికా రచయతల అభిప్రాయాలు!

రాష్ట్రంలో ప్రస్తుతం రగులుతున్న ప్రత్యెక తెలంగాణా అంశం పై కొందరు రచయతల అభిప్రాయలు ఆంధ్రజ్యోతి వివిధ కోసం సేకరించాము. అవి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు, సోమవారం ప్రచురితమయ్యాయి. అవి ఇక్కడ మళ్ళీ మన బ్లాగ్ మిత్రుల కోసం...ఇక్కడ




Saturday, December 19, 2009

‘ ఇట్స్ కాంప్లికేటెడ్ ‘ సినిమా సమీక్ష

రొమాంటిక్ కామెడి ‘ ఇట్స్ కాంప్లికేటెడ్ ‘ సినిమాపై నేను రాసిన చిన్న సమీక్ష ‘ నవతరంగం ‘ లో ప్రచురితమైంది. ఇక్కడ చదవండి.

Thursday, December 17, 2009

From Eve



పెదాలు గాయపడ్డపుడు కదా తెలిసేది
మనం పండు కొరికామని!


హృదయాన్ని పోగొట్టుకున్నప్పుడు కదా తెలిసేది
మనం ప్రేమించామని!


స్వప్నాలేవీ రానప్పుడు కదా తెలిసేది
మనం పుట్టుగుడ్డివాళ్ళమని!


భాష రాక, స్పర్శ లేక దేహం ఏడ్చినప్పుడు కదా తెలిసేది
మనకూ వాంఛలున్నాయని!


మానమో, అభిమానమో పోయినప్పుడు కదా తెలిసేది
మనం ఆడవాళ్ళమని!


( ఈ కవిత ఒక online పత్రికలోనూ, వార్త ఆదివారం అనుబంధం లోనూ 2002 లో ప్రచురితం)

Monday, December 14, 2009

మైదానం - కొన్ని ప్రతిపాదనలు - అనేక ప్రశ్నలు

మైదానం మీద రఘురామరాజు పోస్ట్ మోడర్నిజం ఆధారంగా చేసిన ప్రతిపాదనల మీద నా అభిప్రాయాలు వ్యాసం గా రాసి రెండు భాగాలు గా అందించాను. మైదానం పై సర్రియలిజం ఆధారం గా మహేష్ కొన్ని ప్రతిపాదనలు చేసారు. అయితే అవి కామెంట్ల రూపం లో వుండటం వల్ల వాటిల్లోంచి ముఖ్యమైన వాటిని, వాటి మీద నాకున్న ప్రశ్నలు అనండి, లేదా సందేహాలు అనండి ఇక్కడ పెట్టాను. మొత్తం చర్చ అంతా కామెంట్ల రూపం లో వుండకుండా...మహేష్ , మీరు కూడా మీ ప్రశ్నల్ని మీ బ్లాగ్ లో పోస్ట్ లాగ పెడితే ఇక్కడ మాట్లాడటం ఇష్టం లేని అనేకమంది అక్కడ మాట్లాడే అవకాశం వుంది.

మహేష్ తన కామెంట్ లో అన్న మాటల మీద నాకు వచ్చిన సందేహాలు ఇవి. అయితే ఇవన్నీ పాపం కామెంట్ పెట్టిన పాపానికి మహేష్ సమాధానం చెప్పాలని కాదు నేను అడుగుతున్నది. ఈ పాయింట్లతో ఆలోచిస్తే ఇంకో కోణం ఏమైనా మనకు కనిపిస్తుందా అని మాత్రమే...మీరు ఇప్పటికే సర్రియలిజం ద్వారా కొంత విశ్లేషణ చేసానన్నారు కాబట్టి మీకే ఈ ప్రశ్నలన్నీ. మీకు అర్ధం అయితె, ఇక్కడ చెపితే ఒక కొత్త కోణం లో మైదానాన్ని చూడవచ్చు.

మహేష్ అభిప్రాయాలు ఇవి:

"నావరకూ, రాజేశ్వరి చేసింది న్యాయమా,అన్యాయమా,అపవిత్రమా లాంటి భౌతిక ప్రశ్నలు మైదానం విశ్లేషణలో అప్రస్తుతాలు. రాజేస్వరిద్వారా చలం సమాజానికి కొన్ని ప్రశ్నలు సంధించి, ఛాలెంజ్ విసిరాడు. సమాజం ఇలాగే ప్రవర్తిస్తే ఎందరో రాజేశ్వరిలకు మనోలోకాలే భావప్రాప్తి జగత్తులౌతాయని వార్నింగ్ ఇచ్చాడు.సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (ఫ్రగ్మెంతెద్ చొన్స్చిఔస్నెస్స్)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.ఒక వ్యక్తి వ్యక్తిగా బ్రతకలేనినాడు, తన వాంఛల్నీ,కోరికల్నీ,ఆకాంక్షల్నీ అణగదొక్కిననాడు సామాజిక పతనం ఆరంభమవుతుందని బలంగా నమ్మినవాడు చలం. రాజేశ్వరి విషయంలో కూడా అదే చెప్పాడు.పురుషులకు కనీసం ఎలుగెత్తి అరిచే స్వతంత్రమన్నా ఉంది.ఠెయ్ హవె అ వెంత్ ఫొర్ థైర్ ఫ్రుస్త్రతిఒన్. కానీ స్త్రీకి మైదానం సమయానికి అదికూడా లేదు.కాబట్టి ఆ చెప్పుకోలేని, పోరాడలేని,అసహాయమైన సప్రెషన్ లోంచి రాజేశ్వరి ఒక ఊహాజనిత మైదానాన్ని సృష్టించింది.అందులో తన ప్రేమవాంఛ, మాతృకాంక్షల ఆపూర్తికై తపించిందని నాకనిపిస్తుంది. వాటికి ప్రతీకలే అమీర్,మీరా.అదొక ప్రయత్నం. అదొక మనోజనిత కాంక్ష.అదొక కాల్పనిక వాస్తవం. భౌతికంగా కాకపోయినా, మానసికమైన "నిజం". అందుకే రాజేశ్వరిని ఈ కాల్పనిక వాస్తవంలోకి వెళ్ళడానికి ఏర్పడ్డ పరిస్థితి/కారణాలు ఆ లోకంలో తను చేసిన ప్రయత్నం ముఖ్యమౌతాయిగానీ వాటి ఫలితం, ఆ ఫలితాల మీద మన "అభిప్రాయం" కాదు "

నా ప్రశ్నలు ఇవి:

మనం రాజేశ్వరి ప్రవర్తన గురించి మాట్లడనప్పుడు ఇక మనం మైదానం లో ఏ అంశాల గురించి మాట్లాడుకోవాలి? రాజేశ్వరి ద్వారా చలం సమాజానికి సంధించిన ప్రశ్నలు ఏవేమిటి (మనకు మరింత క్లియర్ గా అర్ధం కావటానికి )? అందులో ముఖ్యంగా పురుషులకు? మైదానం లో వున్న పురుష పాత్రలు రాజేశ్వరి భర్త, అమీర్, మీర్ వీరిలో చలం చూపించిన అంశాలు ఏమిటి? మనం మైదానం అంటే ఎప్పుడు రాజేశ్వరి కి ఇచ్చిన ప్రాధాన్యత అమీర్, మీర్ లకు ఎందుకు ఇవ్వం? మగవాళ్ళు అలా ప్రవర్తించటం కొత్త కాదు అనుకోవటమా? లేకా వారి ప్రవర్తన కు ఒక ఆమోద ముద్ర అప్పటికీ, ఇప్పటికీ వుందా? అమీర్, రాజేశ్వరి లొ అనుబంధం కంటే, మీర్, రాజేశ్వరి ల అనుబంధం ఎందుకు చాలా మందికి చికాకు తెప్పిస్తుంది? అందులో రాజేశ్వరి పాత్ర ఏమిటి? మీర్ పాత్ర ఏమిటి? సన్సారాలు, దాంపత్యాలు ఇలా ఏడవటంలో పురుషుల పాత్ర, స్త్రీల పాత్ర ఏమేమిటి? మైదానంలో స్త్రీలలో మాత్రమే మీరు చెప్పిన ఫ్రగ్మెంతెద్ చొన్స్చిఔస్నెస్స్ కనిపిస్తుందా? అమీర్, మీర్ ల్లో కూడా అలాంటిదేమైనా వుందా? రాజేశ్వరి మాత్రమే కోరికల్ని అణుచుకుందా? మీర్, అమీర్ మాటేమితి? వాళ్ళది నైతిక పతనం అని ఎవరు ఎందుకు మాట్లడరు? తన సుప్రెస్సిఒన్ లో నుంచి రాజేశ్వరి మానసిక ప్రపంచం గా మైదానాన్ని సృష్టించుకుంటే అమీర్, మీర్ పెర్ఫెక్ట్ గా వుండాలి కదా..తన వూహజనిత ప్రపంచంలో కూడా మగవాడిని రాజేశ్వరి అలాగె వూహించుకుందా?

నాకైతే అప్పటికీ , ఇప్పటికీ ఒకటే మాట. ఎందులోంచి చూసినా మనకు ప్రశ్నలే తప్ప సమాధానాలు కనిపించవు. రాజేశ్వరి తను అలా ప్రవర్తించాలనుకుందో అలా ప్రవర్తించింది . ఒక దార్శనికుడైన రచయత గా చలం దాన్ని వీక్షించాడు.. సృజన చేశాడు. చాలా మంది మగవాళ్ళు, రాజేశ్వరి లాగా స్త్రీలు మైదానంలోకి తమతో వచ్చేయాలని కోరుకుంటారు. అది చలం పైకి చెప్పటమే కాకుండా మరో అడుగు ముందుకు వేసి అలాంటప్పుడు కూడా ఆ మైదానం లో మగవాళ్ళ ప్రవర్తన, ఆడవాళ్ళ వాంఛలు ఎలా వుంటాయో చలం వూహించి బైటపెట్టేసాడు అనుకుంటాను. అందుకే నాకు మైదానాన్ని ఏ థియరీ తో చూసినా ఒక్కటి కూడా సమగ్రంగా అర్ధం చేసుకోవటానికి ఉపకరించనట్లు అనిపించదు.

Saturday, December 12, 2009

' పోస్ట్ మోడర్న్ ' అద్దంలో చిన్నబోయిన రాజేశ్వరి (రెండవ భాగం)


బాల్యంలో కన్నతల్లి ప్రేమ పొందలేకపోయి అశ్రధ్ధ కాబడినానన్న భావం రాజేశ్వరికి వున్నందు వల్లే తననే నిరంతరం చూపులతో చుట్టుకునే అమీర్ కనిపించగానే ఆమె లోపల దాగి వున్న దాహం పైకి వచ్చిందని, ఆ దాహాన్ని అమీర్ తీర్చాడన్నారు రఘురామరాజు. " తాను కోల్పోయిన బాల్యాన్ని తన సంతానం ద్వారానైనా పొందాలనే తపనతో, అతీతమైన కోరికతో రాజేశ్వరి అమీర్ తో మైదానం లోకి లేచిపోయింది. అది కూడా కుదరక తాను శారీరకంగా ఇవ్వలేనిది, పొందలేనిది, కోల్పోయింది, మానసికంగానైనా పొందాలని తాపత్రయపడుతుంది. ఈ తాపత్రయమే మీరా -రాజేశ్వరి సంబంధానికి పునాది. రాజేశ్వరి మీరాలో బిడ్డనీ, తమ్ముణ్ణీ చూస్తే మీరా ఆమె లోని స్త్రీ దేహ లైంగిక దృక్పథంతో చూస్తాడు. మొదట రాజేశ్వరి మీరాని తికమక పెట్టినా, మీరా చివరకు రాజేశ్వరిని ఓ చీకటి రాత్రి అనుభవించడం ద్వారా తన కోరికను తీర్చుకుని రాజేశ్వరి లోని మాతృత్వ తపనను దగ్ధం చేస్తాడు.. అలా ఆమె జీవితంలో తటస్థపడిన ఇతర పురుషుల జాబితాలో చేరిపోతాడు. మాతృప్రేమను పొందనీకుండా చేస్తాడు. కానీ ఆమెలోని తల్లి ప్రేమ చాలా గాఢమైంది " అంటూ తేల్చారు రచయత. రాజేశ్వరికి బాల్యంలో తల్లి ప్రేమ దక్కక అశ్రధ్ధ కు గురైందని, తన కడుపున పుట్టే పిల్లల ద్వారా, కోల్పోయిన బాల్యాన్ని పొందటం కోసమే ఆమె అమీర్ తో లేచిపోయిందని, మీర్ తో సంబంధం పెట్టుకుందని, ఈ మొత్తం వ్యవహారంతో పిల్లల కోర్ట్ లో చలం, రాజేశ్వరి మాతృప్రేమ అభాసుపాలైందని స్థూలం గా రాజేశ్వరి పాత్రను నిర్ధారించారు రచయత. రాజేశ్వరి బాల్యం గురించి చలం ఎక్కడా ఎక్కువగా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. రాజేశ్వరితో ఆమె మామయ్య మాట్లాడుతూ " పోనీ అమ్మను తలుచుకో. నిన్ను పెంచి పెద్దదాన్ని చెసి, ఏదో మా అందరికీ ప్రతిష్ట తెస్తావని అంటాడు. పెంచి పెద్దదాన్ని చేసి అన్నాడు గానీ కని పెంచి అనలేదు కాబట్టి రాజేశ్వరి కి కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు అన్న అభిప్రాయానికి వచ్చారు రచయత. అలాగే మరో సందర్భంలో మ పెత్తల్లి సూరమ్మ్మ గారికి నా మీద కోపం వస్తుంది అని రాజేశ్వరి అన్నది కాబట్టి కచ్చితంగా రాజేశ్వరి పెంపుడు తల్లి దగ్గర పెరిగిందని, తల్లి ప్రేమ కొరవడటం, అశ్రధ్ధ కాబడినానన్న భావం రాజేశ్వరిలో చూచాయగా లోపల వుందని రచయత వాదన.

మైదానం మొత్తంలో పుట్టింటి నుంచి రాజేశ్వరితో మాట్లాడిన పాత్ర ఆమె మామయ్య ఒక్కడే. తల్లి రాజేశ్వరితో మాట్లాడి వుంటే ' నిన్ను కనిపెంచి పెద్దదాన్ని చేస్తే’ అనే పదం వాడటం ఆ పాత్రకు సముచితమే. దాన్ని బట్టి రాజేశ్వరి కి కన్న తల్లి లేదని, పెంపుడు తల్లి దగ్గర పెరిగిందని నిర్ధారించలేం. ఇక పెత్తల్లి సూరమ్మ గారి ప్రస్తావన విషయానికి వస్తే, పూర్వకాలం లో వుమ్మడి కుటుంబాల్లో పిల్లలు కేవలం తల్లుల దగ్గరే కాకుండా పెత్తల్లి, పినతల్లుల దగ్గర కూడా పెరిగేవారు. మడీ, ఆచారం లాంటి విషయాల్లో వీరి మాటలకు ఎంతో విలువుండేది. కాబట్టి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలు తల్లితో పాటుగా అవసరమైతే వీరందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. రాజేశ్వరి మాటల్లో తల్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మ అనే అంటుంది. అమీర్ వదిలేసివెళ్ళినప్పుడు కూడా పోనీ అమ్మ దగ్గర చేరితే అనుకుంటుంది.

రాజేశ్వరి తన లోని మాతృత్వ తపనను తీర్చుకోవడానికే మొదటి నుంచి ప్రయత్నించిదన్న రచయత వాదన మరీ అసంబధ్ధమైంది. అసలు మైదానం లో ఎక్కడా రాజేశ్వరిలో పిల్లలు లేరన్న బాధ కానీ, పిల్లలు పుట్టాలన్న వాంఛా కానీ రేఖా మాత్రంగా కూడా కనిపించదు. తాను కడుపుతో వున్నానని తెలిసినప్పుడు, ఆ కడుపును తీయించేసుకోవాలని అమీర్ శాసించినప్పుడు మాత్రం రాజేశ్వరి చేత చలం అనిపించిన మాట " ఎలా తీయించేసుకోను? అమీర్ బిడ్డ " అంటుంది. ఆ కడుపు తన భర్త వల్ల వచ్చి వుంటే అప్పుడు రాజేశ్వరి నిర్ణయమో, ఆమె వైఖరో ఎలా వుండేదో కానీ ఆ కడుపు అమీర్ వల్ల రావడం, అది తాను అమితంగా ప్రేమించిన అమీర్ బిడ్డ కావడం వల్ల కూడా ఆమె అబార్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఆ తరువాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అనేకానేక కారణాలు కనిపిస్తాయి. చలం తన స్త్రీ పాత్రల్ని ఇప్పటివరకూ సమాజరీతిగా సాగుతూ వస్తున్న ఒక సానుభూతి చట్రం నుండి చూపే ప్రయత్నం చేయలేదు. స్తీని అబలగానో, పతివ్రత గానో చూపటానికి చలమే అవసరం లేదు. ఆ పనిని తరతరాలుగా చాలా మందే చేశారు. ప్రేమో, ఆకర్షణో,, మోహమో, వాంఛా వుధృతో ఏదైనా స్త్రీలకు కలగడం సహజమే అని, అది వివాహానికి పూర్వమైతే, తర్వాతైతే అన్న చర్చ అసంబధ్ధమని చలం నమ్మిక. ఇద్దరు, లేకా ఇంకా అనేక మంది స్త్రీల పట్ల పురుషులకు మోహం కలగటం ఎంత సహజమో, స్త్రీకి కూడా అనేకమంది పురుషుల పట్ల ఆకర్షణ కలగటం అంతే సహజమన్నది ఆయన వాదం. పెళ్ళికైనా, మాతృత్వానికైనా ప్రేమ తప్పనిసరి. ప్రేమ లేని సెక్స్ భార్య భర్తల మధ్య జరిగినా అది వ్యభిచారమేనంటాడు చలం. ఏ రచయత అయినా తాను నమ్మిన సిధ్ధాంతానికనుగుణంగానే తన రచనలు సాగిస్తాడు. రాజేశ్వరి కి అందమైన బాల్యం లేదని, తల్లి ప్రేమ దక్కలేదని , పిల్లల కోసమే అమీర్ తో లేచిపోయిందని, మీర్ తో సంబంధం పెట్టుకుందని చెప్పటమే చలం ఉద్దేశమైతే అప్పుడు రాజేశ్వరి పాత్ర మరో రకంగా వుండేది తప్ప ఇంత నిర్భీతిగా, ఇంత ఆనందంగా వుండేది కాదు. మైదానం లో తను గడిపిన జీవితం గురించి కానీ, అమీర్, మీర్ లతో తన అనుబంధం గురించి కానీ రాజేశ్వరి లో చలం ఎక్కడా ఏ సందర్భంలోనూ అపరాధ భావన చూపించలేదు. అందుకు అవకాశమున్న రెండు సంఘటనల్లో కూడా రాజేశ్వరి చేత ' ప్రాక్టికల్ ' గా ఆలోచింపచేశాడు చలం.

ఆ రెండు సంఘటనలు --ఒకటి అమీర్ తోళ్ళసాహెబ్ కూతురిని మోహించటం, రెండోది రాజేశ్వరి అబార్షన్ చేయించుకోవాల్సి రావడం. ఈ రెండు సందర్భాల్లో కూడా రాజేశ్వరి సంయమనంతో, ప్రాక్టికల్ గానె ఆలోచించింది, ప్రవర్తించింది. మైదానం మొదటి పేజీ లోనే చలం రాజేశ్వరి చేత ఏం చెప్పించాడో చూడండి " ఆ జీవితమంతా సుందరమైన, దివ్యమైన స్వప్నం వలె, ఆ యెడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత వున్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్ ని, మీరానీ అనుభవించిన తర్వాత, మన చుట్టూ బతికె ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుష్యులేనా అనిపిస్తుంది నాకు" అంటుంది. రాజేశ్వరి లేచిపోవడానికి రచయత ఓ బలహీనమైన కారణం వెతికారు. ఆ పేలవమైన పునాది నుండి ఆమె లో ఎక్కడా లేశమాత్రమైనా కనిపించని మాతృత్వ తపనతో ముడిపెట్టి ఆమె మాతృప్రేమ అభాసుపాలైందన్నారు. ఆమెతో పాటు చలాన్ని కూడా పిల్లల కోర్ట్ లో అపరాధిగా నిలబెట్టారు. స్త్రీని ఒక భార్య గానో, ఒక తల్లి గానో, ఒక కూతురిగానో, ఒక మేనకోడలుగానోచూడటానికి సమాజం అలవాటుపడింది. దానికి భిన్నంగా ఆమెకున్న విభిన్న పాత్రల నుండి దూరంగా, మానసికంగా , శారీరకంగా ఆమెలో జరిగే సంఘర్షణ, భావావేశాల ఆధారంగా ఆమెను ఓ స్త్రీగా చూపించే ప్రయత్నం చేశారు చలం. స్త్రీలను కేవలం భార్యలుగా, తల్లులుగా చూడటం వాటి పరిధి నుండి వాళ్ళ జీవితాలను నిర్ణయించాలనుకోవడం అంటే వారిని ఇంకో రకమైన నీతి చట్రంలో బంధించటమే. రాజేశ్వరి లేచిపోవడానికి, బాల్యం, యవ్వనంలో ఎదురైనా నిరాదరణో, లేక భర్త దుర్మార్గాలో, అతను పెట్టే చిత్రహింసలో కాదు. నిజంగా ఇందులో ఏ ఒక్కటైనా ఆమె నిర్ణయానికి కారణమైతే ఆమె ' లేచిపోవడానికి ' ఒక లైసెన్స్ దొరికినట్లే. రాజేశ్వరి సంప్రదాయ కుటుంబాల్లోని హిపోక్రసీని మొత్తంగా తూర్పారబడుతుంది. చచ్చు మొగుళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారో విమర్శిస్తుంది. ప్రత్యేకంగా భర్త లోని దుర్గుణానేమీ బైటపెట్టదు. ఏవో ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు తప్ప. పైగా నవల మొదటి పేజీలోనే రాజేశ్వరి తన స్నేహితురాలితో అన్న మాటలు గుర్తు చేసుకుంటే..." లేచిపోవడానికి నీ భర్త లోఫమేమైనా వుందా? అన్న ప్రశ్నకు అమీరే కనిపించకపోతే ఈనాటికీ ఇంకా నా పెనిమిటితో కాపురం సుఖంగా, మత్తుగా చేస్తూ పడివుండేదాన్ని. అమీర్ తో నీకో, ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే మీరూ లేచిపోయే వుందురు. అతని ఆకర్షణను నిగ్రహించలేక " అంటుంది. అమీర్ పట్ల వున్న బలమైన ఆకర్షణ వల్లనే ఆమె కుటుంబ వ్యవస్థ నుండి బైటకు వచ్చింది. అమీర్ రాకతో, చూపులతో ఆమె లో నిద్రాణం గా దాగి వున్న ప్రేమ, వాంఛా, మోహోధృతి, పురుషుడి పట్ల వుండే సహజమైన ఆకర్షణ అన్నీ బైటకు వచ్చాయి. అలా ఒకసారి తనను తాను తెలుసుకున్న రాజేశ్వరిని ఏ సమాజం, ఏ నీతిచట్రాలు, ఏ కుటుంబ వ్యవస్థలు నిరోధించలేకపోయాయి. ఇక మీర్-రాజేశ్వరి ల సంబంధం ఒక కొరకరాని కొయ్య . ఒక ఎనిగ్మా. ఈ క్లిష్టమైన సంబంధాన్ని చాలా మంది కేవలం నీతి-అవినీతి పేటికల్లో బంధించి సరిపెట్టుకున్నారన్నారు రచయత. అంతేకాదు ముందే చెప్పుకున్నట్లు రాజేశ్వరి లోని మాతృత్వ తపనను మీర్ తన దేహ లైంగిక దృక్పథం తో తీర్చుకున్నాడన్నారు. కానీ అమీర్ లాగా మీర్ రాజేశ్వరిని చూడటమే మోహంతో చూడలేదు. అతను ఆమెను అనుమానంతో, విరోధంతో, భయంతో చూసేవాడు. అప్పుడు రాజేశ్వరే తన పని సానుకూలం చేసుకోవటానికి అతనితో సొగసుగా, వయ్యారంగా కులుకుతూ మాట్లాడింది. మళ్ళీ రాజేశ్వరి, మీర్ లాంటి తమ్ముదో, కొడుకో వుంటే బావుండ్ననుకుంటుంది. కానీ అతడిని కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వొళ్ళొ పడుకోబెట్టుకోవడంతో సహా అన్నీ చేస్తుంది. ఈ క్రమంలో రాజేశ్వరి, మీర్ ల మధ్య సాన్నిహిత్యంతో పాటు ఓ విధమైన ప్రేమ కూడా పెరుగుతుంది. అయితే మీర్, రాజేశ్వరిని శారీరకంగా కోరుకుంటున్నా దాన్ని వ్యక్తం చేసే ధైర్యం లేక, రాజేశ్వరి నుంచి సరైన ప్రోత్సాహం లేక ' దీదీ ' అన్న పిలుపు వెనుక దాక్కుంటాడు. అమీర్ కు రాజేశ్వరి మీద వున్నది బలమైన ఆకర్షణ అయితే, మీర్ కు రాజేశ్వరి పట్ల వున్నది ప్రేమతో కూడిన ఆకర్షణ. మీర్ ఆమెను అనుక్షణం వెన్నంటి రక్షించాడు. రాజేశ్వరి అందమొక్కటే కాదు అతనిని ఆకర్షించింది. అమీర్ ని మరో స్త్రీకి అప్పగించినప్పుడే అతనికి రాజేశ్వరి మనసు, ఆమె ఔన్నత్యం అర్ధమైనాయి. రాజేశ్వరి త్యాగాన్ని మొదట్నుంచి అమీర్ పట్టించుకోలేదు. కడుపు తీయించుకున్నప్పుడైనా అతను కనీసం ఓ మెచ్చుకోలు మాట కూడా మాట్లాడలేదు. తిరిగివచ్చాక మీర్, రాజేశ్వరిల సాన్నిహిత్యం చూసి ఏమనలేక రాజేశ్వరి కి రవికెలు తెచ్చి ఇచ్చి ఇక నుండి వేసుకోమంటాడు. చివరికి మీర్, రాజేశ్వరిల శారీరక సంబంధాన్ని చూసి తన ఓటమిని అంగీకరించలేక, తురకబిడ్డను ఇంకొకడితో నిన్ను పంచుకుంటాననుకున్నావా అంటూ తనను తాను పొడుచుకు చచ్చిన భీరువు. అమీర్ తన కళ్ళెదుటే పరస్త్రీతో తనతో ఎల్లా ప్రవర్తించాడొ సరిగ్గ అల్లా ప్రవర్తిస్తే తట్టుకోగలిగింది.అందులోనే ఆనందం వెతుక్కోగలిగింది. కానీ అమీర్ ఒక్క క్షణం కూడా స్థిమితం గా ఆలోచించుకోలేకపోయాడు. రాజేశ్వరే అమీర్ ని చంపేసి వుంటుందేమోననని వూహించిన మీర్ ఆ తప్పు తన మీద వేసుకున్నాడు. మీర్ హత్యానేరం తన మీద మోపుకోవడం చూసిన రాజేశ్వరి మీర్ ని రక్షించడం కోసం ఆ నేరాన్ని తానే చేశానని చెప్పి ఖైదుకెళుతుంది. నిజమైన ప్రేమ అంటూ ఏదైనా వుంటే అది మీర్, రాజేశ్వరిల మధ్య వున్నది మాత్రమే అని సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

చలాన్ని ఫెమినిజం లోకి ఇమిడ్చే ప్రయత్నం ఓల్గా లాంటి స్త్రీవాదులు చేశారని, కానీ రాజేశ్వరిలో ఫెమినిజానికి కావాల్సిన పట్టుదల, స్వాతంత్ర్యం , స్వేచ్ఛ లాంటి లక్షణాలు లేవని రచయత అభిప్రాయపడ్డారు. అయితే రాజేశ్వరి తనకు నచ్చని కుటుంబ వ్యవస్థ నుండి బైటపడి అమీర్ తో మైదానంలో స్వేచ్ఛగా జీవించగలిగింది. అర్ధరాత్రి అమీర్ వదిలివెళ్ళినప్పుదు కూడా నిబ్బరంగా ఒక్కతే ఒంటరిగా గుడిసెలో వుండగలిగింది. అమీర్ ని సంతోషపెట్టటం కోసమే కాకుండా తామిద్దరి జీవితానికి సంబంధించిన విషయంగా అబార్షన్ చేయించుకోవాలన్న నిర్ణయం తీసుకోగలిగింది. అమీర్ దగ్గర నిస్సంకోచంగా మీర్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. వీటన్నింటితో పాటు తన జీవితానికి సంబంధించి తాను స్వతంత్రించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి వుంది. జైలు జీవితం అనుభవించి బైటకు వచ్చిన తర్వాత తనను చూడవచ్చిన స్నేహితురాలితో తన జీవితాన్ని ఓ ఆత్మకథలా చెప్పుకున్నప్పుడు కూడా ఎక్కడా కించిత్తు బాధను వ్యక్తం చేయలేదు. మైదానంలో జీవితం ఆమెకు అమృతతుల్యం లానే కనిపించింది. ఫెమినిజానికి కావాల్సిన పట్టుదల, స్వాతంత్ర్యం, , స్వేచ్ఛ ఏవైతే రాజేశ్వరిలో లేవని రచయత అభిప్రాయపడ్డారో అవన్నీ ఆమెలో మనకు స్పష్టం గా కనిపిస్తాయి.


" చలం రచనల్లోని స్త్రీ పాత్రలు సంఘం బయట, లోపలా చాలా రొమాంటిక్ గా , ' కవితాకన్యలు లాగా ' ఏదో వేరే ప్రపంచంలో వున్నట్లుంటారు. ఇందులో విప్లవం నిండుగా వున్నా వాస్తవికత తక్కువే " అంటారు రచయత. రాజేశ్వరి విప్లవాత్మకమైన పాత్ర అని అంగీకరిస్తూనే రచయత ఆమెలో వాస్తవికత పాలు తక్కువన్నారు. కానీ ఈ నవల పరిధిలో ఆమె ఎక్కడా కూడా అవాస్తవికంగా, అసహజంగా ప్రవర్తించలేదు. సహజమైన భావప్రకటనా స్వేచ్ఛనే రాజేశ్వరి కి నిజమైన ఆభరణం. ఆమెను తెలుగు సాహిత్యంలో విలక్షణ స్థాయిలో నిలబెట్టింది ఆమె లోని ఈ అంశమే. మైదానం ఒక అద్భుతమైన రచన, గొప్ప శిల్పం అని చెబుతూనే ఉద్యమంగా ఈ రచన యొక్క అవసరం ముఖ్యంగా ప్రస్తుతం స్త్రీవాద రచనల ప్రభావంతో , కొంచెం తగ్గిన సందర్భంలో మైదానాన్ని వాచకంగా గుర్తించాల్సిన అవసరముందని రచయత అభిప్రాయపడ్డారు. స్త్రీవాదానికి మైదానం అవసరమా, కాదా అన్న చర్చను పక్కనబెడితే మైదానాన్ని కేవలం ఓ వాచకం గా చూచే క్రమంలో ' మైదానం ' లోని వాస్తవికతనీ, రాజేశ్వరి, అమీర్, మీర్ ల బంధంలోని సహజ చిత్రీకరణనీ గుర్తించలేకపోవడమే రఘురామరాజు పరిశీలన లోని ప్రధానమైన లోపం. మైదానాన్ని ఒక వాచకం గా గుర్తించటానికి , పరిశీలించడానికి పోస్ట్ మోడర్నిజం కావాల్సి వస్తుందేమో కానీ ఒక రాజేశ్వరినో, ఒక అరుణనో, మరో శశిరేఖ నో అర్ధం చేసుకోవడానికి మాత్రం కాదు. పోస్ట్ మోడర్న్ విమర్శనాపనిముట్ల మధ్య కూడా సంప్రదాయ భావనలతో రాజేశ్వరి పాత్ర మరింత అపార్ధానికి గురైందని ఈ పుస్తకం ద్వారా మరో సారి స్పష్టమైంది.

Friday, December 11, 2009

'పోస్ట్ మోడర్న్ ' అద్దంలో చిన్నబోయిన రాజేశ్వరి! (మొదటి భాగం )



చలం రాజేశ్వరికిప్పుడు 75యేళ్ళ పైమాటే. 1927 లో తొలిసారిగా 'లేచిపోయిన ' రాజేశ్వరి అప్పటినుంచి ఎన్నో చర్చలకు కారణమైంది. ఇంకెన్నో ప్రశ్నల్ని రెచ్చగొట్టింది. జాతియోద్యమం నుంచి ఇప్పటి ప్రపంచీకరణ వరకూ, సంస్కరణోద్యమాల నుండి ఇప్పటి పోస్ట్ మోడర్న్ ధోరణి వరకూ ఎక్కడా యే సందర్భంలోనూ రాజేశ్వరి లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. అమె వునికి ప్రతి చర్చలోను ఏదో ఒక సందర్భంలో తప్పనిసరి కావడం అమె లేవనెత్తిన ప్రశ్నల పర్యవసానమే. అయితే, ఆ ప్రశ్నలకు జవాబులు వెతకడానికి ఇప్పటికి మన దగ్గర ఎలాంటి సాధనాలు లేకపోవడం, అందివచ్చిన సాధనాలన్ని వాటి వాటి పరిమితుల్లో రాజేశ్వరిని బంధించే ప్రయత్నం చెయడం వల్ల మొత్తంగా జీవితాన్ని, సాహిత్యాన్ని దర్శించే మన పధ్ధతిలోనే లోపం వుందని అనుకోవాల్సి వస్తోంది. ఆ లోపం ఇటీవలి పోస్ట్ మోడర్న్ పరిశీలన 'మైదానం లోతుల్లోకి....'లో కూడా కనిపించడం అసహజమేమి కాదు.

రాజేశ్వరి ఇవాళ్టికీ ఇంకా నీతి, అవినీతి, పాతివ్రత్యపు ఇనుప కచ్చడాల మధ్య సరికొత్త పోస్ట్ మోడర్న్ పనిముట్లతో విమర్శలకు గురవుతూనే వుండటం విషాదం. చలం సాహిత్యాన్ని, చలం స్త్రీపాత్రలను మొదటనీతి-అవినీతి, వివాహ వ్యవస్థ, మతం, సంఘం కట్టుబాట్ల లాంటి పునాదుల మీద చర్చించారు. తరువాత చలంసాహిత్య దృక్పథాన్ని, చలం స్త్రీపాత్రల నేపథ్యాన్ని, వారిని ఎలా అర్ధం చేసుకోవాలనే విషయాలను స్త్రీవాద దృక్కోణంతోస్త్రీవాదులు చర్చించారు. ఇప్పుడు చలం మైదానాన్ని పోస్ట్ మోడర్న్ దృక్పథం నుండి అడ్లూరు రఘురామరాజు పరిశీలనచేసారు.


ఒక వాచకాన్ని(text) ఎలా చదవవచ్చు, అక్షరం, అక్షరం శ్రద్ధగా చదవటం వల్ల వాచకాన్ని పాఠకులు మరింత బాగా ఎలాఅర్ధం చేసుకోగలుగుతారు అన్న విషయం మీద సునిశితమైన చర్చ చేశారు రచయత తన పుస్తకం 'మైదానంలోతుల్లోకి...పోస్ట్ మోడర్న్ పరిశీలన 'లో. మైదానం లోని పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాల్లోని లోతుపాతుల్ని, పాత్రల రచయత గా చలం ఆలోచనల భావధారను విశదంగా చర్చకు పెట్టారు. ఒక వాచకాన్ని ఎలా చూడాలి, రచయతను దాటి రచనను ఎలా అర్ధం చేసుకోవచ్చు లాంటి అంశాలను కూలంకషంగా పోస్ట్ మోడర్న్ దృక్పథంతోచర్చించారు. తన కృషి వెనుక దేశీయ సాహిత్య పధ్ధతుల కంటే పోస్ట్ మోడర్న్ విమర్శనా పధ్ధతి పైనే అయన ఎక్కువఆధారపడినట్టు స్పష్టంగానే కనిపిస్తుంది. మైదానాన్ని సునిశితంగా పరిశీలించేందుకు చలం ఇతర రచనల్ని మర్చిపోయేప్రయత్నం చేసారు రఘురామరాజు (ముందుమాట).



అయితే మైదానం లోని పాత్రలు ముఖ్యంగా రాజేశ్వరి పాత్రను అర్ధం చేసుకోవాలంటే చలం ఇతర స్త్రీ పాత్రలను కూడా అర్ధం చేసుకోవడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే మనకు రాజేశ్వరి పాత్ర తత్వం సంపూర్ణంగా అర్ధమై చలం రాజేశ్వరిని ఎందుకు అలా మలిచాడొ స్పష్టంగా అవగతమయ్యే అవకాశం వుంటుంది. ఇప్పటివరకు సమాజంలో స్త్రీ అంటే వున్నఅభిప్రాయాన్ని, స్త్రీత్వం, పాతివ్రత్యం అంటే వున్న నిర్వచనాల్ని, స్త్రీల విషయంలో కుటుంబం లోపలా, బైటా చెలామణిఅవుతున్న నీతిసూత్రాల్ని వీటన్నింటిని బద్దలుగోడుతూ చలం తన స్త్రీ పాత్రల్ని మలిచాడు.చలం స్త్రీపాత్రలు, వాళ్ళఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన వెనుక వున్న కారణాలు, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు అర్ధం కావటానికి మనకు వందేళ్ళ కంటేఎక్కువ కాలమే పడుతుందేమో. చలం తన స్త్రీ పాత్రల్ని సమాజం నుండి సానుభూతి కోరే పాత్రలుగా చిత్రించలేదు. చలంస్త్రీ పాత్రలు ప్రేమ లేని పెళ్ళిని ధిక్కరించి, పెళ్ళి అక్కరలేని ప్రేమను కోరుకున్నాయి. దిశగా స్త్రీల సంఘర్షణఅర్ధవంతమైందని, సహజమైందని చెప్పదల్చుకున్నడు చలం. సంఘర్షణ, అన్వేషణ అర్ధమైనప్పుడు స్త్రీలు పెళ్ళిని, కుటుంబ వ్యవస్థను ఎందుకు ధిక్కరిస్తున్నారొ, స్త్రీ విముక్తి లైంగికత్వంతోనే ఎందుకు మొదలవుతుందోఅర్ధమవుతుంది.( ఇంకా వుంది...)


( ఈ పుస్తక సమీక్ష ఈమాట లో అయిదారేళ్ళ క్రితం ప్రచురితమైంది)

Monday, December 07, 2009

' మూస ' పోసిన సాహిత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు?



(నిడదవోలు మాలతి గారి పుస్తకానికి నేను రాసిన ముందు మాట డిసెంబర్ 7 వ తేదీ ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమైంది. అది ఇక్కడ మీ కోసం.... ఈ పుస్తకం పొట్టి శ్రీరాములు యూనివర్సిటి వారి దగ్గర దొరుకుతుంది. వెల రూ. 45/-.వీలున్న వారు పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాలు, సూచనలు మాలతి గారికి తెలియచేయగలరు. )



వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర మనది. ఒక మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ల మీద లెక్కించి స్త్రీలసాహిత్య చరిత్రను, వారి కృషిని ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో పార్శ్వ్యంగా మాత్రమే చూపించే ప్రయత్నంఇన్నేళ్ళుగా సాగింది. సాహిత్యంలోనూ, సామాజిక శాస్త్రరంగాల్లోనూ, స్త్రీల భాగస్వామ్యాన్ని పాయగామాత్రమే చూపించటానికి అలవాటు పడ్డ పురుషస్వామ్య చరిత్ర విధానం మనది. తెలుగు సంస్కృతిపైఆధునికత ప్రభావం పడ్డప్పటి నుంచి, స్త్రీల భావ ప్రపంచం మారుతూ వచ్చింది. అది సాహిత్యంలోనూ, శాస్త్ర, సామాజిక రంగాల్లోనూ ప్రతిఫలించింది. అయితే, స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనల్లో వచ్చినమార్పుల గురించి చెప్పినంతగా, చుట్టూ వున్న సమాజంలో స్త్రీల మేధో భాగస్వామ్యం పెరుగుతూ వచ్చినక్రమాన్ని , వారి ఆలోచనాస్రవంతిలో వచ్చిన మార్పుని వివరించిన ప్రయత్నాలేవీ అసలు జరగలేదు.


ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన మూస చరిత్ర రచనా విధానాన్ని ప్రశ్నించి, ప్రత్యామ్నాయ చరిత్రను రచించే క్రమం ఒకటి మొదలైంది. ఇది కేవలం నలుగురు వ్యక్తులకో, నాలుగు పుస్తకాలకో పరిమితం కావడం లేదు. స్త్రీ చైతన్య క్రమాన్ని అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నారు. తెలుగు సాహిత్య రంగంలో స్త్రీల విశేష కృషిని పాక్షిక దృష్టితో చూస్తూ ఓ దశాబ్ధానికో, ఒక నలుగురు రచయిత్రులకో పరిమితం చేస్తూ కొనసాగిన చరిత్రను తమ విస్తృత పరిశోధనలతో చర్చకు పెట్టే ప్రయత్నం మొదలైంది. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో నిడదవోలు మాలతి ఒకరు. స్వాతంత్ర్యానంతర కాలంలో తెలుగు కధా చరిత్రను గురించి ఇప్పటివరకూ రికార్డైన సాహిత్య చరిత్రను ఆమె కొత్త దృక్కోణంలో చర్చిస్తున్నారు






తెలుగు కధా చరిత్రలో రచయిత్రులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నవలా రచయత్రులుగానో, లేక 80 ల తర్వాత వచ్చిన స్త్రీవాదుల గురించో వుంటుంది తప్ప అంతకు మించిన సమగ్ర చర్చ ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్ర్యానికి ముందు సంఘసంస్కరణ జాతీయోధ్యమాల కాలంలో కధానికలు రాసినంత మంది రచయిత్రులు, స్వాతంత్ర్యానంతరం రాయలేదు. ముద్రణా సౌకర్యం, మహిళా చైతన్యం, విద్యా సౌకర్యాలు పెరిగి, వస్తువైవిద్యానికి ఆస్కారం కలిగిన కాలంలో మహిళా కధకుల సంఖ్య తులనాత్మకంగా చూచినప్పుడు అంతకు ముందు కన్నా తక్కువ. స్వాతత్ర్యానంతరం మహిళలు కధానికను వదిలి నవల వైపు మొగ్గడం ఇందుకు కారణమై అంటారు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (తెలుగు కధకులు-కధనరీతులు-మూడవ భాగం పేజీ 111). అయితే, అది తప్పని, అందరూ అనుకుంటున్నట్టు 1950 నుండి 1975 వరకూ రచయిత్రులు కేవలం నవలలు మాత్రమే రాయలేదని, అనేక మంచి కధలు రాసారని చెపుతూ వారు తీసుకున్న ఇతివృత్తాల్ని, వారి రచనా విధానాన్ని, శైలిని నిడదవోలు మాలతి తన పుస్తకం Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 లో సమగ్రంగా చర్చించిన విధానం స్త్రీల సాహిత్య విమర్శలో ఓ మైలురాయి లాంటి ప్రయత్నం. స్త్రీవాదం అన్న పదం వాడకపోయినా, స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వ ప్రస్తావన అనేది కేవలం 80 ల నుండి మాత్రమే మొదలు కాలేదని, అది '50 ల తరం నాటి రచయిత్రుల్లో ఎంత స్పష్టం గా ప్రకటితమైందో ' ఎదురు చూసిన ముహుర్తం' (పి. సరళాదేవి) లాంటి కధల ద్వారా ఆమె సోదాహరణంగా చెప్పినప్పుడు వెనకటి తరం రచయిత్రుల కృషి మీద మరింత గౌరవ భావం కలుగుతుంది.



గురజాడ వారి ' దిద్దుబాటు ' తొలి తెలుగు కధగా పేర్కొంటూ ఇప్పటిదాకా ప్రచారమైన తెలుగు కధా చరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పము. భండారు అచ్చమాంబ తొలి తెలుగు కధకురాలన్న గుర్తింపు ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కఠోర సత్యము. ప్రధానా స్రవంతి కధాసాహిత్య విమర్శల్లో, తొలితరం తెలుగు కధానికా సంకలనాల్లో గురజాడ, శ్రీపాద, మల్లాది గురించి చెప్పినంతగా ఎవరూ ఈ నాటికి కూడా భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి,పి.శ్రిదేవి,ఆదిమధ్యం రమణమ్మ మొదలైన రచయిత్రుల గురించి ఎవరూ ఎక్కడా చెప్పలేదు, చర్చించలేదు.కధకు సంభందించిన చర్చలన్నింటిలోనూ, '50ల నాటి రచయిత్రుల ప్రస్తావనలు దాదాపుగా ' నాంకే వాస్తే ' పద్ధతిలో మాత్రమే కనిపిస్తాయి. తెలుగు కధ మీద ఇప్పటివరకూ వచ్చిన అనేకానేక పుస్తకాలు, అనేకానేక వ్యాసాలు పరిశీలించినప్పుడు వారి కృషి ఓ ముగ్గురి, నలుగురి పేర్లతో ........ఫలానా వారు కూడా రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం చూడవచ్చు. వారి కధల గురించి, వాటి ఇతివృత్తాలు, శైలి మొదలైన వాటి గురించి సీరియస్ గా ఎవరూ చర్చించినట్టు మనకు ఎక్కడా దఖాలాలు లేవు. మరీ కాకుంటే మొత్తం రచయిత్రులందరి గురించి ఒక వ్యాసం వుంటుంది కానీ ప్రధాన సాహిత్య చరిత్రలో భాగంగా తొలి తరం రచయిత్రుల కృషిని సమగ్రంగా విశ్లేషిచినట్ట్లు కనిపించదు. నిస్సందేహంగా గురజాడ, మల్లాది, శ్రీపాద గొప్ప రచయతలే కానీ రచయిత్రుల కధల్ని గురించి చర్చించినప్పుడు కదా వారు కూడా దీటుగా కధలు రాయగలిగారా, లేదా అన్న సంగతి అర్ధమయ్యేది.






గురజాడ ' దిద్దుబాటు ' ని, భండారు అచ్చమాంబ ' స్త్రీవిద్య ' లేదా 'ఖన ' లాంటి కధల్ని పక్కన బెట్టి చూసినప్పుడు దిద్దుబాటు కంటే ఆ కధలు ఏ రకంగానూ తీసిపోవన్న నగ్నసత్యం బోధపడుతుంది. 1900 నాటికే విద్యావంతురాలైన భండారు అచ్చమాంబ రాసిన స్త్రీల చరిత్రను, ఆమె రాసిన కధల్ని ఎవ్వరూ కూడా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోనందువల్ల ఆమె కృషి విస్మృత చరిత్రగా మిగిలిపోయింది. విక్రమాదిత్యుని ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కధ స్త్రీలు అప్పటికే సమాజం లో తమ స్థితిగతుల్ని గుర్తించారనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలు దెబ్బతీసిన వైనాన్ని, జాతీయోద్యమ ప్రాముఖ్యాన్ని ఓ తల్లి పాత్ర ద్వారా చెప్పించిన కనుపర్తి వరలక్షమ్మ లాంటి రచయిత్రుల్ని, ' కుటీరలక్ష్మి ' (1924) లాంటి కధల్ని పట్టించుకున్న వారు తక్కువే. తొలి తరం స్త్రీల సాహిత్య కృషిని అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా పురుష నిర్మిత సాహిత్య విమర్శనా పనిముట్లతో పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నరు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిద్యం ఇవ్వలేదన్నది నిష్టూర సత్యం.

స్వాతంత్ర్య, సంస్కరణోద్యమాలు, పత్రికల వ్యాప్తి, స్త్రీవిద్యలో భాగంగా మాత్రమే రచయిత్రుల్ని చూస్తారు తప్ప అంతకుమించి వారి సాహిత్యానికి ప్రత్యేకత ఏమి ఇచ్చినట్టు కనిపించదు. ఆనాటి స్త్రీలు తాము చదువుకొని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్న సంగతి కంటే కూడా స్త్రీలు చదువుకోవాలని, అది ' కుటుంబానికి ' చాలా ప్రయోజనకరమంటూ మగవారు ప్రోత్సహించిన దానికే చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. స్త్రీ విద్య, స్త్రీ అభివృధ్ధి కోసం కంటే కూడా ఇంటిని చక్కదిద్దటానికి, పిల్లల్ని బాగా పెంచడానికి మాత్రమే సంస్కరణవాదులు కోరుకున్నారు. వ్యక్తిగా ఆమె వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశంగా స్త్రీవిద్యను సంస్కరణవాదులు భావించినట్టు కనిపించదు. స్త్రీవిద్య గురించి గురజాడ కున్న పాక్షిక దృష్టిని మాలతి తన పుస్తకంలో తేటతెల్లం చేశారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు. ' తెలుగు కధ-సామాజిక స్పృహ ' అన్న అంశం మీద రాసిన వ్యాసంలో " చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది"(తెలుగు కధ విమర్శానాత్మక వ్యాస సంపుటి- అంధ్రసారస్వత సమితి ప్రచురణ, 1974)అని పురాణం బాహాటంగా, నిసిగ్గుగా అనగలిగారు. అయితే ఆ పురాణం గారే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను 1976 లో అనేక సాహిత్య ప్రక్రియలకు ప్రకటించి అందులో ఫిక్షన్ కేటగిరి ని వదిలేసినప్పుడు ఆంధ్రజ్యొతి వారపత్రికలో (19 నవంబర్, 1976) రాసిన లేఖ చదివినప్పుదు ఆశ్చర్యపోతాము


ఆ లేఖ సారాంశం ఇది. " గతంలో అకాడమి అవార్డ్ పొందిన నవలలు ఉత్తమైన రచనలు అయి వుండవచ్చు.అంతమాత్రాన ఇప్పుడు ప్రచురితమవుతున్న నవలలుకూడా వాటికి నాణ్యతా ప్రమాణాల్లో ఏమాత్రం తీసిపోవు. ఉదాహరణకి, మాదిరెడ్డి సులోచన తెలంగాణ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన నవలలు రాశారు. వాటిల్లో మచ్చుకు కొన్ని తరం మారింది, పూల మనసులు, మతము-మనిషి. అలాగే యద్దనపూడి సులోచనారాణి ఆంధ్రుల అభిమాన నవలారచయిత్రి. ఆమె నవలలు జీవన తరంగాలు, బందీ, ప్రేమలేఖలు ఆమె రాసిన మంచి నవలల్లో కొన్ని. ఈ నవలల్లో ఏదో ఒకటైనా మీ అవార్డ్ ప్రమాణాలకు సరితూగుతాయి. అంతే కాకుండా డి. కామేశ్వరి, పరిమళా సోమేశ్వర్ ,ఐ.వి.యస్. అచుత్యవల్లి లాంటి ఇంకెందరో నవలా రచయిత్రులు కూడా మంచి నవలలు రాసారు. తెలుగు నవలా యుగంలో రికార్డ్ స్థాయిలో పబ్లిషర్లు 300 కొత్త నవలలు ప్రచురించారు". ఇక్కడ మనకు రెండు విషయాలు బోధపడతాయి. ఒకటి తెలుగు నవలా స్వర్ణ యుగంలాంటి సమయంలోనే మంచి నవలలు రాసినా కూడా ఏ మహిళా రచయిత్రి కూడా సాహిత్య అకాడమి అవార్డ్ కు అర్హురాలు కాకపోవడము. రెండొ విషయము...ఒక పత్రికా సంపాదకుడు, అగ్రశ్రేణి సాహిత్య విమర్శకుడైన పురాణం లాంటి వారు స్త్రీల సాహిత్య సృజనకు సంబందించి ఎంత నాసిరకమైన అభిప్రాయాలు కలిగివున్నారో కూడా మనకు అర్ధమవుతుంది.


అలాగే కధకుడు, విమర్శకుడు కేతు విశ్వనాధరెడ్డి ఒక చోట " రచయిత్రులు నవల జోలికి వెళ్ళినంతగా కధానిక జోలికి వెళ్ళలేదు. శ్రీదేవి, సరళాదేవి, తురగా జనకీరాణి, కళ్యాణ సుందరీ జగన్నాధ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మల ప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు కూడా కధానిక శిల్పంలో సాధించిన ప్రత్యేకత వుందని చెప్పలేం. దానికి కారణం ఆధునికి చైతన్యాన్ని అలవర్చుకోవటంలో పురుషుల కంటే స్త్రీలు ఇంకా వెనుకబడి వుండటమే. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు రచయిత్రులు కధనసారళ్యంలో కూడా ప్రత్యేకంగా సాధించిందేమి లేకపోవడమే" అని వ్యాఖ్యానిస్తారు.(దృష్టి -సాహిత్య వ్యాస సంపుటి -పేజీ 73)
తెలుగు కధానికకు సంభందించి చర్చలు జరిగినప్పుడల్లా విమర్శకులు రాసే మాటలు పైన చెప్పుకున్నట్టు వుంటాయి. తెలుగు నాట సాహిత్య విమర్శ వ్యక్తుల్ని బట్టి, కాలాన్ని బట్టి రకరకాలుగా ఎలా మారుతూ వుంటుందో చెప్పటానికి ఇవి కొన్ని వుదాహరణలు మాత్రమే.


ఇలాంటి సాహిత్య విమర్శలు అలవాటైన తెలుగు సాహిత్య లోకానికి అతి ముఖ్యమైన ఓ పాతికేళ్ళ కాలంలో స్త్రీల సాహిత్య కృషిని, అప్పటి సామాజిక సందర్భానికి అన్వయిస్తూ వస్తుపరంగా, రూపపరంగా, శైలీపరంగా విశ్లేషిస్తూ నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకం అసలైన తెలుగు సాహిత్య చరిత్రను గురించి పరిశోధించేవారికి మరింత బాగా వుపయోగపడుతుందనటం అక్షర సత్యం.
( తెలుగు విశ్వవిద్యాలయం వారు త్వరలో ప్రచురించనున్న నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి...)

కల్పనారెంటాల
September 27,2004
Madison, Wisconsin

Sunday, December 06, 2009

నగ్ననది

నదిలోకి అయిదు గులకరాళ్ళు వేశాను
ఒకటికి రెండై జ్ఞాపకాలు కొట్టుకువచ్చాయి

నదిలోకి నాలుగు దుఃఖాల్ని పంపాను
వొడ్డుకు నాలుగు యుగాల స్త్రీలు పుట్టుకు వచ్చారు

నది లోకి మూడు కాగితపు పడవల్ని వదిలాను
తీరంలో కొన్ని ఆశలు మొలకెత్తాయి

నదిలోకి రెండు చేపల్ని వదిలాను
ఆశ్చర్యం ఒక వల బైటకు వచ్చింది

నదిలోకి ఒక కుబసాన్ని వదిలేసాను
గట్టు మీద ఒక ఇంద్రధనుస్సు విరిసింది

నేనే నదిగా ప్రవహించాను
నగ్నత్వాన్ని తర్పణం చేస్తూ...
 
Real Time Web Analytics