నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, February 28, 2010

నవ భావ శిల్పం 'ద్రౌపది' --- బేతవోలు రామబ్రహ్మం

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్రౌపదీ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ కు ఎంపిక చేసిన ముగ్గురు న్యాయనిర్ణేతలల్లో ఒకరు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం .ఇన్నాళ్ళుగా ఆ పుస్తకం పై సాగుతున్న వాద వివాదాలు, రచ్చలు, రగడలు చూస్తూ పెదవి విప్పకుండా మౌనం గా ఉన్న న్యాయ నిర్ణేతల్లో ఒకరైన రామబ్రహ్మం గారు ఇప్పుడు ద్రౌపదీ గురించి ఈ వ్యాసం రాశారు. మార్చ్ 1, సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురితమైన ఈ వ్యాసం ఇక్కడ చదవండి.

తెలంగాణా లో ఇటీవల సంభవించిన మరణాలపై అఫ్సర్ కవితా “ కొన్ని మరణాలు “ ఇక్కడ చదవండి.

విశిష్ట జానపద సాహిత్య పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఇటీవల మృతి చెందారు. ఆయనకు నివాళీ ఆర్పీస్తూ వరవరరావు గారి నివాళి ఇక్కడ, ఆవుల మంజులత గత వారం రాసిన వ్యాసం ఇక్కడా చదవండి.
‘ కనక ప్రవాసి’ గా తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితులైన చామర్తి కనకయ్య గారు మరణించినట్లు సాక్షి లో రాపాకా ఏకాంబరాచర్ర్యులు రాసిన చిన్న నివాళి వ్యాసం వల్ల తెలిసి బాధ కలిగింది.

కనక ప్రవాసి మృతి కి నివాళి

‘ కనక ప్రవాసి’ గా తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితులైన చామర్తి కనకయ్య గారు మరణించినట్లు సాక్షి లో రాపాకా ఏకాంబరాచర్ర్యులు రాసిన చిన్న నివాళి వ్యాసం వల్ల తెలిసి బాధ కలిగింది.

కనక ప్రవాసి కథా రచయత. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పట్టభద్రులు. ఆయన కథానికల పుస్తకం “ అద్దానికి అటూ ఇటూ” , అనువాద కథల పుస్తకం “ ఒప్పందం” కి మంచి పేరు వచ్చింది. అయితే కనక ప్రవాసి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన కథల కంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద ఆయన చేసిన పరిశోధన. ఈ పరిశోధన ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆయన రీసెర్చ్ అంశం “ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథల సమగ్ర సమీక్ష “ 1986 లో ప్రచురితమై విమర్శకుల ప్రశంసలనందుకున్నది.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు లో అక్టోబర్ 24,1933 న జన్మించిన కనకయ్య తెలుగు లెక్చరర్ గా, ప్రిన్స్ పాల్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఫిబ్రవరి 21 న కాకినాడ లో కనకప్రవాసి మరణించారు.

Thursday, February 25, 2010

"ఊరి చివర" ఉప్పెనలా కవిత్వం

అఫ్సర్ గారి కవిత్వ పుస్తకం “ ఊరి చివర “ పై అంతర్యానం బ్లాగర్ కొండముది సాయి కిరణ్ కుమార్ రాసిన విశ్లేషణాత్మక పరిచయం ఇక్కడ, కవిత్వం లో సామాజిక కోణం గురించి కొండముది గారి అభిప్రాయాలు ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలపండి.
ఊరి చివర పుస్తకం కోసం ఎన్. వేణు గోపాల్ రాసిన ముందు మాట జ్ఞాపకాన్ని కవిత్వం గా మార్చే రసవిద్య ఇక్కడ చదవండి.

Wednesday, February 24, 2010

ఒక పూల పరిమళపు “ స్మృతి ” --సౌరిస్ కథ

కథానుభవం-5


సౌరిస్ కథారచయిత్రి గా కంటే కూడా .చలం కూతురు గా, ఒక యోగినిగానే ఎక్కువ మందికి తెలుసు. ఆమె రాసింది తక్కువ కథలైనా మంచి కథలు రాసింది. కాకపోతే ఆమెదొక వూహా ప్రపంచం. కలల లోకం. ఆ లోకం లో రకరకాల పూలు, తోటలు, విలక్షణ ప్రేమలు, అనుభవాల అనుభూతులు. ఆ కొత్త బంగారు లోకం లో ఆమె కథలన్నీ పుట్టాయి. ఆమె కథలు నేల మీద కాళ్ళు ఆనించి నిల్చినట్లు కనిపించదు. ఆ వర్ణన, ఆ పాత్రలు ఏదో ఒక లోకం నుంచి కిందకు దిగి వచ్చినట్లనిపిస్తాయి. ఆ విలక్షణతే ఆమె ను ఒక మంచి రచయిత్రి గా నిలబెట్టింది. అయితే, అదే విలక్షణత ఆమెను మామూలు పాఠకులకు కొంత దూరం కూడా చేసినట్లు వుంది. ఆమె కథలు చదవి ఆనందించటానికి మనం కి కూడా ఒక వూహాలోకం కావాలి. మనం చదవటం మొదలుపెట్టిన తర్వాత ఆ వూహాలోకం లోకి ఆమె మనల్ని తీసుకెళ్ళీ నిలబెడుతుంది. అయితే అలా వెళ్లగలిగే స్థితి కూడా పాఠకుడికి వుండాలి. లేకపోతే ఆమె కథల పుస్తకం చదవటం పూర్తి చేయలేము. ఎక్కడో రెండు లోలకాల మధ్య వూగిసలాడినట్లు ఆమె కథాలోకం లో, మనం వాస్తవిక ప్రపంచంలో మిగిలిపోతాము.
సౌరీస్ పేరు చలం గురించి తెలిసిన వాళ్ళకు కొంత పరిచయం వుంటుంది కానీ అంతకు మించి ఆమెకు సంబంధించిన వివరాలు తెలుగు సాహిత్య లోకం లో పెద్దగా ప్రచారం లోకి రాలేదు. సౌరిస్ జీవితాన్ని రెండు భాగాలుగా ఎవరో ప్రచురించారని నేను విన్నాను.కానీ చూడలేదు, చదవలేదు. కాబట్టి ఆమె జీవితం గురించి నాకు పెద్దగా తెలిసింది లేదు. ఆమెకున్న ఆధ్యాత్మిక నమ్మకాల వల్ల కూడా ఆమెను ఒక రచయిత్రి గా కంటే కూడా ఒక యోగిని గానే ఎక్కువమంది గుర్తు పెట్టుకున్నారనుకుంటాను.
సౌరిస్ కథల్ని పుస్తకం గా భీమునిపట్నం లోని స్నేహ ప్రచురణాల వారు ఆగస్ట్ 1997 లో ప్రచురించారు. అక్కడక్కడా సంకలనాల్లో సౌరిస్ కథలు ఒకటి ,ఆరా చదవటం తప్ప కథలన్నీ ఒక చోట చదివింది మాత్రం ఈ పుస్తకం లోనే. పుస్తకం మీద ఆమె బొమ్మ అందమైన చిరునవ్వుతో.. పుస్తకం వెనుక సౌరిస్ గురించిన ఈ పరిచయ వాక్యాలు....

“ సౌరిస్ అంటే సౌరిస్
లేత నీలపు ఓ చైతన్యం గురించి,
పచ్చని జీవితాశయం గురించి,
తాత్విక సముద్రపు లోలోతుల
చిరుచేపల కదలికల గురించి,
చెట్టు నీడన నిశ్శబ్దం గురించి,
ఆ వెనుక, దూరం గా ఓ పెద్ద అల,
ఆ ఎత్తున ఎగిరిపడి విరిగి వెనక్కి,
వెళ్ళీ ముందుకొచ్చే ఘోష గురించి,
గడ్డి పరక అంచున నిలిచిన,
నీటిబొట్టు గురించి చెప్పుకోవడం
కంటే తెలుసుకోవడమే నయం.
సౌరిస్ రచనలు అంతే.
అవి వాక్యాల మధ్య,
కథ వెనుక, సారాంశం
వెంట, అంతటా వుంటూ
అన్ని వేపులా చూస్తాయి.
కొత్తవారికి సౌరిస్ ఈ పేజీల వెనుక
పరిచయం అవుతారు.”


అంతే. సౌరిస్ గురించి ఈ వాక్యాలు తప్ప ఆమె జీవితం గురించి, ఆమె సాహిత్య ప్రస్థానం గురించి, చలం కూతురి గా ఆమె అనుభవాల గురించి మొత్తంగా ఆమె జీవితం గురించి ఈ పుస్తకం లో ఎలాంటి సమాచారం వుండదు. అలాంటి వివరాలు కావాలంటే వేరే రకంగా సంపాదించుకోవటమే. ఈ పుస్తకం మీద సౌరిస్ బొమ్మ వుందటం ద్వారా కథలు చదవటానికి ముందే ఆమె ఎవరో మనకు బాగా తెలిసిన వ్యక్తి లా అనిపిస్తుంది. ఆ కథలు చదువుతున్నంత సేపూ ఆమె నవ్వు గుర్తుకు వస్తుంటుంది. అంతర్లీనం గా ఆమెను కథల్లో గుర్తుపడుతుంటాము. ప్రచురుణ కర్తలు చెప్పినట్లు సౌరిస్ కథలన్నీ చదవటం అయిపోయిన తర్వాత కొత్తవారికి అప్పుడు ఆ కథ ల ద్వారా అసలైన సౌరిస్ అంటే ఏమిటో అర్ధమవుతుంది.
ఈ పుస్తకం లో వున్నవి 8 కథలు. ఉష అనే కథ 1936 లోనూ, సుమిత్ర అనే కథ 1937 లోనూ, స్మృతి కథ 1946-47 లోనూ రాసినట్లు పేర్కొన్నారు. మిగతా కథలు ఎప్పుడు రాసినది , ఎక్కడ ప్రచురితమైనది లాంటి వివరాలు ఇందులో లేవు. సౌరిస్ లాంటి రచయిత్రుల కథల్ని ఒక పుస్తకం గా ఒకే చోట దొరికేలా ప్రచురించటం నిజంగా మంచి పని. ఆమె గొప్పతనం తెలిసి వుండబట్టే ఈ పనికి పూనుకొని వుంటారు. అలాంటప్పుడు సౌరిస్ జీవితం గురించి కూడా ఒక చిన్న వ్యాసం లాంటిది ఈ పుస్తకం లో వుండి వుంటే ఆమెను, ఆమె కథల్ని పాఠకులు మరింత బాగా అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
కథానుభవం శీర్షిక కోసం నేను ఎంచుకున్న కథ స్మృతి.
“ ఎంత చక్కగా వుందో ఎండ? ఎంత పచ్చగా వున్నాయో చెట్లు?” అంటూ కథ మొదలవుతుంది.

ఆస్ప్రతి లో వున్న రత్నం అనే ఆమె మోనోలాగ్ ఇది.
“ ఎందుకింత ఆనందం చెట్లను, గాలిని, ఎండను చూసి! “ అనుకుంటూ వుంటుంది ఆమె.
కొద్దికాలం పాటు అన్నింటిని మర్చిపోయిన ఆమెకు ఒకొక్కటిగా నెమ్మదిగా గుర్తుకు వస్తుంటాయి.
జబ్బుతో ఇన్నాళ్ళు ఆస్పత్రి మంచం మీద పడుకోని వున్న ఆమెను కొంచెం సేపు తోటలో తిరుగు బావుంటుంది అని చెప్తుంది నర్స్. ఆ తోటలో తిరుగుతుంటే ఆమెకు మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్లనిపిస్తుంది. ఆమె లో ఏదో ఒక కొత్త శక్తి సూర్య కాంతి లా. ఎప్పటేప్పటిదో ఒక పూల పరిమళం ఆమెను కమ్ముకుంటుంది.
ఆ పూలను, ఆ చెట్టును చుట్టుకున్న ఒక జ్ఞాపకం ఆమె లో మళ్ళీ జీవం పోసుకుంటుంది. ఆమెకు ఆ పూల వాసన ఎంతో పరిచితం గా అనిపిస్తుంది. ఆ పూలు, పరిమళం , ఆ చెట్టు అన్నీ ఎంతో తెలిసినట్లు అనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ ఏదీ గుర్తు లేనట్లు అనిపిస్తుంది.
ఇన్నాళ్ళు ఈ పూలను వదిలి ఎలా బతికాను, ఎలా బతికి వున్నాను అని తనలో తానే అనుకుంటూ వుంటుంది.
“ ఏవో అందమైన జ్ఞాపకపు తళుకులు. పగిలిపోయి, మెరిసే రంగు గాజు పెంకుల్లాగా చెదిరిన జ్ఞాపకాలు. మనసులో తలపుకు వస్తున్నాయి అస్పష్టం గా....
ఎప్పుడో అనుభవైంచి , ఏ కారణం వల్లనో మర్చిపోయిన, నాకే తెలీని, అనుభవాలని, జ్ఞాపకం తెచ్చుకుని, అనుభవిస్తున్నాయి, నా నరాలు, నా రక్తం, నా మనస్సు, నా హృదయం, నేను మర్చిపోయాను. అవి రహస్యం గా భద్రం గా, నాకు తెలీకుండా దాచుకున్నాయి. ఆ అపురూపమయిన, ప్రియామయిన స్మృతులని, తేనెటీగలు మధువును పోగు చేసి దాచుకున్నట్లు.
నాకు స్పష్టం గా చెప్పవు “.

ఆ పూల చెట్టు పేరు కామిని. ఆమె అతనికి ఓ పూల రాణీ. ఆ పూలు, ఆ పూల చెట్టు, అతని నిర్మలమైన ప్రేమ. ఇప్పుటికీ ఆమె స్మృతులు.
ఢిల్లీ నుంచి వచ్చిన గొప్ప సంబంధం తో ఆమెకు పెళ్ళైపోయింది. సన్నాయి చివరి స్వరం లాగా చీకట్లో అతను కరిగి మాయమై పోయాడు. అంతే. ఆ విషయం తెలిసిన ఆమె ఆ పూలను, అతన్నీ కూడా తనను తానే హింసించుకొని మరీ మర్చిపోయేలా చేసుకుంది. పిచ్చిపిల్ల. అతన్ని, ఆ పూలను ఎప్పటికీ మర్చిపోయాననుకుంది.
మళ్ళీ ఆ కామిని పూలను చూసేసరికి ఆమె హృదయం అడుగున తనకే తెలియకుండా దాచిపెట్టుకున్నా ఆ రూప స్మృతులు మళ్ళీ గుర్తుకువచ్చాయి. ఆ కామిని పూలకు, ఈ కామిని పూలకు మధ్య ఆమె ఒక జీవితం పూర్తి అయింది. కానీ ఆ గడిచిపోయిన జీవితం లో ఆమె లేదు. కేవలం ఆమె స్మృతులు తప్ప.
ఆమె ఇప్పుడు పూల రాణీ కాదు. భార్య, తల్లి. అత్తగారు. అమ్మమ్మ....
ఇదేనా జీవితం?
ప్రేమ విలువ, పూల విలువ తెలుసుకోవాల్సిన సమయంలో తెలుసుకోలేకపోతే ఆ తర్వాత అవి తిరిగి రావు. వాడిపోతాయి. వోడిపోతాయి. ఎవరికైనా మిగిలేది స్మృతులే. జీవితం కాదు.
ఈ కథ ఇంగ్లిష్ వెర్షన్ ఇక్కడ చదవచ్చు.

http://www.thulika.net/2007January/Souris.htm

కల్పనారెంటాల


( ఈ పుస్తకం ప్రతుల కోసం అరుణా పబ్లిషింగ్ హౌస్ , ఏలూరు రోడ్డు, విజయవాడ వాళ్ళని సంప్రదించండి. ఈ పుస్తకం ఇంకా మార్కెట్ లో లభ్యమవుతోందో, లేదో నాకైతే తెలియదు.)

కురిసి మెరిసిన మంచు స్నేహితుడికి....


ఆత్మీయ స్నేహితుడా!

ఎన్నాళ్లయింది నిన్ను చూసి. నిన్ను సుతి మెత్తగా కౌగిలించుకొని. సుతారంగా ముద్దాడి. అప్పుడెప్పుడో మాడిసన్ లో వున్నపుడు ఆత్మీయం గా, ఆప్యాయం గా ఏటికేడాది మరింత సంతోషంగా వచ్చి మా ముంగిట ముగ్గులు పెట్టి వెళ్ళేవాడివి. నిన్ను వదిలేసి ఆస్టిన్ వచ్చామని అలిగావా? పోనీ లే ఇప్పటికైనా పాత స్నేహితుల్ని గుర్తు పెట్టుకొని మాకోసం ఇంత దూరం వచ్చావు. చూడు, నీ రాక ఇక్కదెంత మందిని ఆనందింపచేసిందో. మరి ఇలాగే వీలు కుదిరినప్పుడలా వచ్చి వెళుతూవుండు. నువ్వేప్పుడూ మాకు చిరకాల స్నేహితుడివే. మేమెప్పుడూ నీ ఆత్మీయులమే. మేము నిన్ను మర్చిపోలేదు.నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోకూ. ఇలాగే అనుకోని అతిథి లా వచ్చి మమ్మల్ని పలకరించి వెళుతూ వుండూ.

మా వూర్లో కురిసి మెరిసిన మంచు స్నేహితుడికి....

Thursday, February 18, 2010

ఆస్టిన్ లో ఏడంతుస్తుల భవనాన్ని ఢీ కొన్న విమానం

ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయానికి ( ఫిబ్రవరి 18, గురువారం మధ్యాహ్నానికి .) మా వూరు ఆస్టిన్ ( టెక్సాస్ ) వైపు ప్రపంచం అంతా చూస్తోంది. మా ఇంటి కి రెండున్నర మైళ్ళ దూరం లో జరిగిన విమాన ప్రమాదం తో ఒక్కసారి ఆస్టిన్ నగరం ఉలిక్కిపడింది. 2001 తర్వాత ఏ విమాన ప్రమాదమైనా అందరి అనుమానం ఒక్కటే. తీవ్రవాదమే అందరి మదిలో మెదులుతుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అది తీవ్రవాద చర్య కాదు కానీ ఇదొక “ గృహ తీవ్రవాద “ సమస్య. అదొక్కటే కాకుండా నిందితుడికి ప్రభుత్వ రెవెన్యూ విభాగం IRS పని తీరు పట్ల వున్న తీవ్ర కోపం కూడా విమాన, భవన ప్రమాదానికి దారితీసింది.

రోజూ లాగానే ఆస్టిన్ హైవే హడావిడిగా కార్లతో కళకళలాడుతూ వున్నప్పుడు ఉదయం దాదాపు 10 గంటలప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన జోసెఫ్ స్టాక్ స్థానిక పైలట్. గత రాత్రి ఇంట్లో భార్య తో స్టాక్ గొడవపడ్డాదని తెలుస్తోంది. స్టాక్ భార్య, సవతి కూతురు ఇద్దరూ రాత్రి ఇంటి నుంచి హోటల్ కి వెళ్ళిపోయి పొద్దుటే వచ్చారని తెలుస్తోంది.స్టాక్ ఇంట్లో సమస్యలోక్కటేఈ ప్రమాదానికి కారణం కాదు. అతనికి ఎంతో కాలంగా ప్రభుత్వ పని తీరు పట్ల, ముఖ్యం గా ఐ ఆర్ ఎస్ పని తీరు పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.

భార్య తో గొడవపడ్డ స్టాక్ 9-15 నిముషాలకు తన సొంత ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించేలా చేసి నార్త్ ఆస్టిన్ కి 20 మైళ్ళ దూరం లో వున్న జార్జి టౌన్ విమానాశ్రయం నుంచి ఒక చిన్న డబల్ సీటర్ చెరోకీ పైపర్ విమానం తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరగా వున్న ఏడంతస్తుల బిల్డింగ్ ని ఢీ కొట్టాడు. ఈ భవనం లోనే ఐ ఆర్ ఎస్, ఇంకా కొన్ని ప్రభుత్వ ఆఫీసులున్నాయి.
53 ఏళ్ళ స్టాక్ సొంత సాఫ్ట్ వేఱ్ కంపెనీ వుంది. తన సొంత వెబ్ సైట్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాసాలతో పాటు అతని ఆత్మహత్య నోట్ కూడా వుంది. ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రకటించటానికి ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తా సంస్థల కథనాలు. “ హింస ఒక్కటే సమాధానం “ అని స్టాక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని కూడా తెలుస్తోంది.
ఈ అగ్ని ప్రమాదం లో గాయపడ్డ వారి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ లో వచ్చిన పెను మార్పులు కొందరి ప్రజల్లో ఎంత అసమ్ప్తృప్తి ని రగిలిస్తున్నాయో ఈ సంఘటన ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి దుందుడుకు చర్య చేసేలా ప్రేరేపించింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తో పాటు,కుటుంబ సమస్యలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైనా, ఒక వ్యక్తి కున్న తీవ్ర కోపం ఎంత విద్వాంసానికి, ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందో కదా.

(ఈ స్పందన కేవలం ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసి రాసినదే.)

కల్పనా రెంటాల

Wednesday, February 17, 2010

తెలుగు సాహిత్యం పై అంత చిన్న చూపు ఎందుకు?


మొన్నామధ్య పుస్తకం.నెట్ లో హేలీ రాసిన వ్యాసం “ మనం “ ఫాంటసీ “ బస్సు మిస్ అయినట్లేనా?” చదివిన తర్వాత నా అభిప్రాయాలు ఇవి. హేలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇవి నా ఎదురు ప్రశ్నలు అనుకోండి. తెలుగు సాహిత్యం పై నా అభిప్రాయాలు ఇవి.
హేలీ తన వ్యాసం లో తానే వొప్పుకున్నాడు. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న అని.. హేలీ ఒక కొత్త తరానికి పాఠక ప్రతినిధిగా వూహించుకుంటే అతను వేసిన ప్రశ్నలు కేవలం వ్యక్తిగతం కాకుండా ఒక తరానికున్న అభిప్రాయాలుగా నేను భావించాను. అందుకే వాటికి సమాధానాలు అని కాదు కానీ నా గోడు కూడా కాస్త చెప్పుకోవాలనిపించింది. తెలుగు సాహిత్యానికి, ఇంగ్లీష్ సాహిత్యానికి పోలికలు తెచ్చి మాట్లాడటం ఎందుకు వీలు పడదో ప్రధానంగా చెప్పటం నా ఉద్దేశం.
తెలుగు సాహిత్యం అంటే హేలీ లాంటి కొత్త తరం యువతకు ఎందుకు ఈ చిన్న చూపు ? తెలుగు సాహిత్యం లో వాళ్ళు నచ్చిన స్థాయిలో, వాళ్ళు మెచ్చుకోదగ్గ స్థాయిలో పుస్తకాలు రాలేదని హేలీ లాగానే చాలా మంది అభిప్రాయం . ఈ మాట తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళు ఎవరైనా చెపితే మనం ఒక క్రమ పద్ధతిలో చర్చించుకోవచ్చు.తెలుగు సాహిత్యం చదివి ఇలా మాట్లాడుతున్నారా, అసలు చదవకుండా ఇలాంటి అభిప్రాయాలు ఎవరైనా ఏర్పర్చుకుంటున్నారా అని నాకొక సందేహం.
నేటి తెలుగు యువతకు రావిశాస్త్రి, విశ్వనాధ, శ్రీశ్రీ వద్దు. ఒక వూపు వూపిన యద్ధనపూడి, యండమూరి కూడా పనికి రారు. ఇంకేమిటి కావాలి వాళ్ళకు? కేవలం ఫాంటసీ సరిపోతుందా? ఒక్క ప్రక్రియ మన మొత్తం తెలుగు సాహిత్యానికి దర్పణం పట్టగలదా?
మన తెలుగు సాహిత్యం నన్నయ్య మహాభారతం అనువాదం మొదలుకొని తాజా కేశవ రెడ్డి “ మునెమ్మ” వరకూ వచ్చిన అనేకానేక మంచి పుస్తకాల్లో , ఈ తరం యువత ఎన్ని ప్రక్రియాల్లో , ఎన్ని పుస్తకాలు చదివి వుంటుంది ?తెలుగు సాహిత్యం గొప్పతనం అర్ధం కావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. పీరియడ్.ఆ పని చేయకుందా హఠాత్తుగా ఏదో ఒక ఉదయం జ్నానోదయమై కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే మనకు నచ్చిన పుస్తకాలు మన చేతిలో వచ్చి పడవు. అది ఎంత “ ఫాంటసీ” ప్రపంచమైనా.
గొప్ప తెలుగు సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?
గత రెండు , మూడు తరాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకొని తెలుగు మాట్లాడటమే గొప్ప , అరుదు అయిన సందర్భాల్లో పాపం తెలుగు రచయితలు ఎవరి కోసం రాసుకుంటారు? తెలుగు పుస్తకాలకు పాఠకులు ఎవరు? పిల్లలా, యువత నా, నడి వయస్కులా?, ముసలివాళ్ళా? ఆర్ధికంగా, సామాజిక పరం గా, భాషా పరం గా కూడా .వీళ్ళంతా ఏ స్థాయిలో వారు?
ఇటీవల కాలంలో అనేక మంది ఇంగ్లీష్ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి తెస్తున్న అకారణ, అనవసర పోలిక చూస్తే కోపం , కొంత జాలి కూడా కలుగుతోంది. మన దగ్గర ఏ పుస్తకాలు లేవో మాట్లాడుకునే ముందు మన దగ్గర ఏమున్నాయో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరముంది.

కనీసం గత శతాబ్దంలో వచ్చిన ఉత్తమ, లేదా ప్రాచుర్యం పొందిన పుస్తకాల్లో నేటి యువత ఎన్ని చదివి వుంటుంది? అసలు నేటి యువతరం లో తెలుగు చదవటం, అచ్చుతప్పులు లేకుండా రాయగలిగిన వాళ్ళు ఎంత మంది వుండి వుంటారు? దీనికి కారకులు ఎవరు? పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చేర్పిస్తున్న తల్లి తండ్రులదా? ఇంట్లో తెలుగు మాట్లాడటం తప్ప, తెలుగు పుస్తకాలు పరిచయం చేయని పెద్దలదా? క్లాస్ పుస్తకాలు బట్టీలు కొట్టించడం, నూటికి నూరు శాతం మార్కుల కోసం రెసిడెన్షియల్ కాలేజీల్లో బండ మీద చేపల్ని తోమినట్లు తోముతూ జీవితానికి సంతృప్తి నిచ్చే ( వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కాదు) పుస్తక పఠనం ఒక అభిరుచి లాగా ప్రోత్సహించలేని విద్యా వ్యవస్థ దా?

తెలుగు సాహిత్యం లో ఎన్ని ప్రక్రియలు వున్నాయో, ఎందులో ఎవరెవరు ఏమీ రాస్తున్నారో కనీస పరిజ్నానమ్ కూడా లేని వాళ్ళకు తెలుగు సాహిత్య క్రమ పరిణామం, గొప్పతనం ఎలా తెలుస్తుంది?

ఇప్పుడు హేలీ కెంత వయస్సుందో, హేలీ పుట్టినప్పుడు నాకు అంతకన్నా ఒక నాలుగేళ్ళు తక్కువ వయస్సు ఉంది. అప్పటికి నేను తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పుస్తకాలు చదివి వున్నాను. ఆ వయస్సులో నేను చదివిన ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా వుంటే అవి మిల్స్ అండ్ బూన్స్ సిరీస్ మాత్రమే. మిగతావన్నీ నేను చదివినవి అనువాదాలే. ఇప్పుడున్న కొందరు ప్రముఖ రచయితల్లో చాలా మంది ఆ తరంలో హేలీ లాగానే యవ్వనం లో వున్నారు. అప్పుడు మేం చదివిన పుస్తకాలు ఇప్పుడు హేలీ చెప్తున్న ఇంగ్లీష్ పుస్తకాల జాబితా లాంటిది మాత్రం ఖచ్చితం గా కాదు. తెలుగు మీడియం స్కూల్స్ లో చదువుకొని, ఇంగ్లీష్ ని రెండో భాషగా మాత్రమే అవసరార్ధం నేర్చుకున్న తరం మాది. తెలుగు ని రెండో భాష గా నేర్చుకున్న తరం హేలీ లాంటి వారిది .అది ప్రధాన తేడా. అదే అసలైన తేడా. ఆ ప్రధాన తేడా నే ఇవాల్టీ తెలుగు సాహిత్యం పరిస్థితి. అది దుస్థితి అని నేననుకోవడం లేదు. ఆ తేడా ని గుర్తించకుండా, ఆ తేడా ను అంగీకరించకుండా తెలుగు సాహిత్యం తీరు తెన్నుల గురించి ఇప్పుడేమీ మాట్లాడలేం.

20 ఏళ్లలో ఆంగ్ల సాహిత్య ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పుస్తకాల్ని హేలీ తన వ్యాసం లో ప్రస్తావించారు. అసలు తెలుగు లో ‘ బెస్ట్ సెల్లర్స్ “ కాన్సెప్ట్ నే లేదు.మనకున్నదల్లా మూడో ముద్రణా, పదో ముద్రణా లాంటి లెక్కలు మాత్రమే. ఒక్కసారి శ్రీపాద, మల్లాది కథలుపుస్తకాలు ఎన్నేసి ముద్రణాల్లో వున్నాయో చూస్తే, అవి తరతరాలుగా ఎందుకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నారో తెలుస్తుంది. అవన్నీ మన తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని కొంత వరకైనా అంచనా వేయటానికి పనికి వస్తాయి. ఎప్పటికప్పుడు కాలానుగుణం గా వస్తున్న రామాయణ భారతాలే కాదు, మాండలీకపు సాహిత్యం, అస్తిత్వ సాహిత్యం ఇవన్నీ హేలీ అడిగిన 20 ఏళ్ళ కాలంలో వచ్చినవే. హేలీ అడిగింది మొత్తం తెలుగు సాహిత్యం గురించి కాదు, ఫాంటసీ ఫిక్షన్ గురించే. అయినా సరే, తెలుగు సాహిత్యం మీద అతని కున్న చిన్న చూపు వల్ల ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను. కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లాంటివి చదివి చిన్నతనంలో మాకంటూ ఒక వూహా లోకాన్ని సృష్టించుకున్నాము ఆ రోజుల్లో. వేల సంవత్సరాల తరబడి దక్షిణ దేశం లో వీధి నాటకంగా ప్రదర్శించబడుతూ వచ్చిన ఈ కథ కొవ్వలి కలం నుంది వెలువడినది ఒక్కసారి చదివితే పెద్దలకు కూడా రోమాంచితమవుతుంది. దానికి హేరీ పాటర్ ఎదురు నిలబడగలదు అని కూడా నేను అనుకోవటం లేదు. ఇక మీరు చెప్పిన గోల్డెన్ కంపాస్ లాంటి పుస్తకాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు మనకు పంచతంత్రం వుంది.
ఇప్పటి పిల్లలు ఆ పుస్తకాలన్నీ చదివి , హెరీ పాటర్ కూడా చదివితే రెండింటికి వున్న తేడా తెలుస్తుంది. అంతే కానీ, తెలుగు లో వున్న ఫాంటసీ పుస్తకాలు చదవటం మానేసి, హేరీ పాటర్ లాంటి ఫిక్షన్ కోసం తెలుగు లో ఎదురు చూడటం అనవసరం.అది మన సంస్కృతి కాదు. మన సాహిత్యం మన సంస్కృతి నుంచి వస్తుంది. లేదా మీలాగా బాగా చదువుకున్న యువతరం తెలుగు లో కలం పట్టి సరికొత్త రచనలు చేస్తే వస్తుంది.

మనకు హేరీ పాటర్ ( పొట్టర్ కాదు) లార్డ్ ఆఫ్ రింగ్స్ లాంటివి ఎందుకు రాలేదని ప్రశ్న. అసలెందుకు రావాలి అనేది నా ప్రశ్న. విశ్వవ్యాప్తంగా పిల్లల్ని మంత్ర తంత్రాలు, దెయ్యాలు, భూతాలు, అడవి నక్కలు (వేర్ ఉల్ఫ్స్ ) వాంపైర్లు, జాంబీ లతో ఫాంటసీ ప్రపంచం చుట్టూ తిప్పటం అద్భుతం గా కనిపిస్తోంది. మనదగ్గరేమో ఒక్కప్పుడు చెప్పుకున్న భేతాళుడి కథలు, విక్రమార్కుడి సాహసాలు లాంటివి పిల్లలకు చెప్పాలంటే అవన్నీ అభివృద్ధి నిరోధకాలు అనిపించి పక్కన పెట్టేస్తున్నారు. చందమామ కి , ఇంగ్లీష్ పుస్తకాల్ని ముడిపెట్టడం అంత అన్యాయం మరొకటి లేదు. ఇప్పటికీ బ్లాగ్స్ లో కూడా ఉన్న చందమామ అభిమానులకు అది అవమానమే.చందమామ మన సంస్ర్కుతి. మీరు చెప్పే ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళ సంస్కృతి. ఆ సంస్కృతి ని అభిమానించవచ్చు. కానీ , మన సంస్కృతి ని అగౌరవపరచనక్కరలేదు.
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో క్రియేటీవ్ రైటింగ్ కోర్సులకు ఎంత డిమాండ్ వుంటుందో చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటాను. MFA కోర్సులంటే క్రేజ్. కానీ , మనకు రచన ఒక అభిరుచి. ఒక వృత్తి కాదు. అదొక ప్రవృత్తి. గ్లోబలైజేషన్ తో మన సమాజం లో వచ్చిన పెను మార్పుల్ని పట్టుకొని రచనల్లో చూపిస్తున్న రచయితలే ఇంకా తక్కువ మనకు. మన సమాజం, మన సంస్కృతి, మన జీవన విధానం నుంచి మన రచయితలు పుట్టుకొస్తారు. మన రచనలు పుట్టుకొస్తాయి . మాజిక్ స్కూల్స్, మంత్ర తంత్రాలు, వాం ఫైర్ లు లాంటివి మన సమాజం లో అంత విస్తృతంగా ప్రాచుర్యం లో లేవు. కాబట్టి ఇక్కడ నుంచి హెరీ పాటర్ రాదు. రాలేదు కూడా. వచ్చినా అది చాలా కృతకంగా కూడా వుంటుందెమో మరి. కాబట్టి వాటికి, మన దగ్గర వస్తున్న పుస్తకాలకు పోలికలు తెచ్చి వెతకడం వృధా ప్రయాస.
మన దగ్గర “ ట్వైలైట్ “ లాంటి పుస్తకాలు రాసే రచయితలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అని అడిగితే సరి కొత్త రచయితల నుంచి వస్తాయీ అని నేను చెప్తాను. . ప్రతి తరం నుండి భిన్నమైన రచయితలు వస్తే మీరు అడుగుతున్న పుస్తకాలు కాకపోయినా కొంతైనా విభిన్నమైన రచనలు వస్తాయి. పిల్లలకు, యూత్ కి మన దగ్గర కావాల్సిన సాహిత్యం లేదని ఒక నిందారోపణ. ఇప్పటి యూత్ ఎంతమంది తెలుగు సాహిత్యం చదువుతున్నారో ఎవరైనా లెక్కలు తీయగలిగితే ఎందుకు రావటం లేదో వూహించవచ్చు. యువత తెలుగు పాఠకుల లిస్ట్ లో పెద్ద సంఖ్యలో వున్నారని నేననుకోవటం లేదు. ఉంటే మంచిదే.

విభిన్న రచనలకు ఒక ఉదాహరణ చెప్తాను. యండమూరి తులసీదళం కున్న సాహిత్య విలువల్ని కాసేపు పక్కన వుంచి, ఒక సాహిత్య ప్రయోగం గా తీసుకొని మాట్లాడితే దాని మీద రచయితలు, సాహిత్యాభిమానులు చేసిన రచ్చ ఇప్పటి యువతరానికి తెలిసి వుండదు.కాష్మోరా , చేతబడులు లాంటివి మాట్లాడినందుకు, రాసినందుకు యండమూరిని ఊరి తీసినా తప్పు లేదన్నవాళ్ళున్నారు. తెలుగు సంస్కృతి ని యండమూరి భ్రష్టు పట్టించాడు అని దుమ్మెత్తి పోసిన వాళ్ళున్నారు. అయినా సరే, మామూలు పాఠకులు ఎగబడి ఆ పుస్తకాలు కొన్నారు, చదివారు, మెచ్చుకున్నారు.
ఒక తరం వరకూ నవలలంటే యద్ధనపూడి, లేదా యండమూరి. ఆ మూస ను బద్దలు కొట్టి ఒక మంచి నవల , సమాజానికి అవసరమైన నవల ఒకటి భిన్నమైన దృక్పథంతో , భిన్నమైన ఇతివృత్తం తో వచ్చింది. అదే “ దృశ్యాదృశ్యామ్”. చంద్రలత రాసిన నవల. చంద్రలత ఆ నవల ఎలా రాయగలిగింది? ఆమె కు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో వున్న పట్టు, ఆమెకున్న ఎక్స్ పోజర్, విస్తృత ప్రపంచ సాహిత్య పరిజ్నానమ్, గ్లోబర్ వార్మింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన, వీటన్నింటి కి తోడు తెలుగు జీవన సరళి మీద ఆమెకున్న పట్టు అదీ ఆమె ఆ నవల రాసేలా చేయగలిగింది. ఆ నవల ను ఒక వాసిరెడ్డి సీతాదేవో, ఒక యద్ధనపూడి నో, చివరకు ఒక వోల్గా కూడా రాయగలిగివుండేవారు కాదు.

ఒక్కో తరం నుండి ఎప్పటికప్పుడు కొత్త తరం రచయితలు పుట్టుకు రావాలి. వారి నేపధ్యం నుంచి కొత్త రకం రచనలు వస్తాయి. మన పని ఏమిటంటే అలా వచ్చిన కొత్త రచనల్ని చదివి, బావుంటే మెచ్చుకొని ప్రోత్సహించడం. ఆ ఉత్సాహంతో మరో కొత్త రచయిత కి అవకాశం ఇవ్వడం.అప్పటి దాకా తెలుగు సాహిత్యం ఇలానే నెమ్మదిగా పురోగమిస్తూ వుంటుంది. తెలుగుగడ్డ మీద పుట్టిన తెలుగు పిల్లలకు తెలుగే రెండో భాషగా ఉన్నంత కాలం మన సాహిత్యం ఇలాగే వుంటుంది. పారడైమ్ షిఫ్ట్ ఇక్కడ ఉన్నట్లుండి ఒక ఉదయం జరిగి పోతుందని నేననుకోవటం లేదు.
..మన తెలుగు సమాజం లో ఇప్పుడున్న ఫ్యూచర్ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ కాదు, కాబోయే అమెరికన్, కెనెడియన్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. వారికి కావాల్సింది ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే. తెలుగు పుస్తకాలు కాదు. మాలాంటి వాళ్ళకు అభిరుచి దృష్ట్యా ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా, మనస్సంతా తెలుగు పుస్తకాల చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. తెలుగు సాహిత్యానికి కూడా ఒక గొప్పతనం ఉంది, దాన్ని గౌరవించడం అంటే ఆ భాషలో మాట్లాడటం, ఆ భాషలో రాయడం, ఆ భాషలో రచన చేయడం అని మాలాంటి వాళ్ళు కొందరు ఇంకా భ్రమపడుతున్నారు వెనకబడ్డ మాలాంటి తెలుగు అభిమానుల్ని ఇలా వదిలేయ్యండి. మమ్మల్ని ఇలా తెలుగు సాహిత్యాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెట్టె మహోన్నత స్థితి కి మమ్మల్ని తీసుకెళ్లద్దు. మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే వుండనివ్వండి.

(తెలుగేప్పుడూ రెండో భాషనే అంటూ నిడదవోలు మాలతి గారు రాసిన మరో మంచి వ్యాసం ఇక్కడ చదవండి.)


కల్పనారెంటాల

Monday, February 15, 2010

అఫ్సర్ కవిత్వ పుస్తకం “ ఊరి చివర “ పై ఈనాడు లో సమీక్ష





స్మృతులు...వేదనలు!

అఫ్సర్‌ కవితలతో మన జ్ఞాపకాల్ని మనమే తవ్వుకున్నట్టు, మన ఎదలోతుల్ని మనమే తడుముకున్నట్టు... అదో ప్రపంచంలోకి వెళ్లిపోతాం. బలమైన వూహాశీలత, సృజనాత్మక ఉద్విగ్నతలు అనుక్షణం వెంటాడతాయి. 'గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు/గుక్కెడు నీళ్లే జాతీయగీతం మాకు' అన్న 'ఎడారి నుంచి కాస్త తడి'లో కనిపించేది కంటతడే. 'ముక్కలయిన పగుళ్ల కొసల్లోంచి/వొలికి వొలకని రక్త చారికనై రాలిపోతానింక'... గుండె చెదిరే 'బాడీ లాంగ్వేజ్‌' దృశ్యం! 'ఒక సూఫీ సాయంత్రం'లో 'ఎవరూ కనిపించడంలేదు/కత్తులు తప్ప/ఏమీ వినిపించడం లేదు/కొస ప్రాణం అరుపులు తప్ప'. 'నాదో/ప్రాణాంతక జననయుద్ధం/వాయిదా వెయ్యలేను/ఇలాగేలే అనీ ఉండలేను' అంటాయి 'రెండంటే రెండు మాటలు'. 'నాదంతా నెత్తుటి తలబోత/అప్పుడప్పుడూ ఈ నెమలీకల్ని మరిచిపోతే బాగుణ్ణు'... అంతరంగాలను తడిమిన 'నెత్తుటి నెమలీక'. 'ఇప్పుడు మనం తిరుగుతోంది/కేవలం గులకరాళ్ల మధ్యనే!'...నిజం చెప్పేసిన 'వొకానొక అసందర్భం'. గతం, వర్తమానం అటుఇటుగా తూగేవేళ కదలాడే స్మృతులే జీవితమైతే... అదే అఫ్సర్‌ కవిత్వమనిపిస్తోంది.






వూరి చివర (కవితాసంకలనం); రచన: అఫ్సర్‌; సంపాదకుడు: గుడిపాటి పేజీలు: 142; వెల: రూ.60/-; ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌ 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌ మలక్‌పేట, హైదరాబాద్‌-36.
ఫోన్ నెంబర్ 9848787284



- జి.వి.ఎన్‌.మూర్తి

నామినీ, కొంచెం బడాయి తగ్గించుకో! (రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన)

(ఫిబ్రవరి 15 ఆంధ్ర జ్యోతి వివిధ లో వచ్చిన వ్యాసం ఇది. నామిని వ్యాఖ్యలపై ఎలాంటి నిరసనను ప్రచురించకుండా వున్న ఆంధ్రజ్యోతి ఎట్టకేలకు రంగనాయకమ్మ గారి వ్యాసం ప్రచురించింది. రంగనాయకమ్మ సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా రాసిన వ్యాసం ఇది.)

ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయినా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు.

నువ్వు 'పచ్చనాకు సాక్షి' కబుర్లు చెప్పిన కాలంలో, నిన్ను గోర్కీగా ఎంచుకుని ముచ్చటపడ్డాం. కానీ, అసలు గోర్కీలో ఎక్కడా మిడిసిపాటు కనపడలేదు. ఇవ్వాళ నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఏ మనిషి అయినా, 'నేను అందరికన్నా చాలా గొప్ప వాణ్ణి' అన్నాడంటే, అనుకున్నాడంటే, ఆ మనిషి, మొదట అల్పుడు! తర్వాత మూర్ఖుడు! నువ్వు చాలా గొప్పవాడివే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.

ఇంత చిన్న విషయం తెలయని ఏ మనిషి అయినా, గొప్ప వాడయ్యేది, అల్పత్వంలోనే! నువ్వు నీ సన్మానాల గురించి సంజాయిషీలు మొదలు పెట్టావెందుకు? ఈ ప్రపంచం నిండా సన్మానాలూ, బహుమానాలూ, బిరుదులూ, అవార్డులూ, తమ శ్రమతో ఏ మాత్రమూ సంబంధం లేని ధన రాసుల్ని నొల్లుకోడాలూ, అన్నీ గొప్ప సంస్కృతిగా చలామణీ అయిపోతూనే వున్నాయి. వాటి కోసం కళాకారులందరూ ఎగబడుతూనే ఉన్నారు. అందరూ చేసే పనే నువ్వూ చేశావు. చేస్తావు.

దానికి నిన్నెవరు తప్పు పట్టారు? తప్పు పడతారు? నీ సన్మానం గురించి నిన్నెవరో నిందిస్తారన్నట్టు రక రకాల దబాయింపు వాదనలు సాగించావెందుకు? 'నాకు ఉద్యోగం లేదు. బీదతనం వచ్చింది. అందుకే సన్మానాలు చేయించుకుంటున్నా' అని, నీ సన్మానాలకి ఒక కారణం చెప్పుకున్నావు. మళ్ళీ దానికే విరుద్ధంగా, 'నాకు సన్మానాలు చెయ్యవలసింది నా బీదతనం చూసి జాలితో కాదు; నా విద్వత్తుని చూసి చెయ్యాలి' అన్నావు.

నీకు సన్మానం చేసిన వాళ్ళు నీ విద్వత్తుకే చేశారు. నీ బీదతనానికి కాదు. బీదలు లోకం నిండా కుప్పతెప్పలుగా వున్నారు. ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయి నా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దానధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు. బీదతనాల్ని చూసి జాలిపడే వాళ్ళ దగ్గర సన్మానాలు చేసేటంతంత ధనరాసులు వుండవు. నీకు జరిగే సన్మానం, నీ బీదతనాన్ని చూసి కాదు; పుస్తకాలు రాశావు అనే కారణానికే.

'నాది బీదతనం కాబట్టి , సన్మానాలు చేయించుకుంటా' అని ఒక వేపూ, 'నా బీదతనానికి కాదు, నా విద్వత్తుకే సన్మానం జరగాలి' అని ఇంకో వేపూ- రెండూ నువ్వే అంటున్నావు. సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు. ఎందుకింత కష్టం నీకు? 'అందరూ చేసేదే నేనూ చేస్తాను' అంటే సరిపోదూ? నీకు సన్మానాలు చేసే వాళ్ళూ, చేయించే వాళ్ళూ, నీ కుల సంఘాల వాళ్ళూ, అంతమంది నీ చుట్టూ వున్నప్పుడు, నీ సన్మానాలకు ఆ కారణాలు చాలవూ? నిన్నెవరైనా, ఏమైనా అంటే, 'నాకు సన్మానాలు చేసే నా వాళ్ళు వున్నారు, మీకూ మీ వాళ్ళు వుంటే మీరూ చేయించుకోండి!' అంటే చాలదూ? అసలు ఆ మాటలు మాత్రం ఎందుకు? సన్మానం ఎందుకని ఎవరు అడిగారు నిన్ను? 'పిల్లలకి, పెద్దలకి అందరికీ పనికివచ్చే పుస్తకాలు రాశాను.

నా పుస్తకాలు చదివితే మంచి మంచి రసాలు ఊరతాయి. అంత మంచి పుస్తకాలు మీరందరూ ఎందుకు కొనరు? నా పుస్తకాలు కొంటే, ఆ డబ్బుతో నేను బతుకుతాను కదా? నా పుస్తకాలు మీరు ఎందుకు కొనరు?' అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఇదేం తగువు? ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. ఇతర రచయితల పుస్తకాల్లో మంచి రసాల పుస్తకాలన్నీ నువ్వు కొంటున్నావా? కొనకపోయినా ఎలాగో సంపాదించి చదువుతున్నావా?

నీ పుస్తకాలు కొందరైనా కొన్నారు. చదివారు. చదివిన వాళ్లందరికీ మంచి రసాలే ఊరినట్టయితే వాళ్ళు నీ పుస్తకాల్ని చాలా ప్రచారం చెయ్యాలి. వాళ్లు అలా చెయ్యటం లేదంటే, వాటి వల్ల మంచి రసాలు ఊరలేదేమో అనే ప్రశ్న నీకు రావాలి. రాలేదా?

నువ్వు నీకు తెలిన మాండలీకంలో, నీకు తెలిసిన బీద రైతు జీవితాల్ని చిత్రించావు. కొన్నిచోట్ల ముచ్చటగొలిపేలా రాశావు; కొన్నిచోట్ల చీదర పుట్టేలా రాశావు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరలకైనా రక్షణ దొరుకుతుంది. ఎవరు ఎలాంటి పుస్తకం రాసినా, దాన్ని చదివే వాళ్ళూ; కొనే వాళ్ళూ; కొనేసి చదవని వాళ్ళూ, కొనకుండా చదివే వాళ్ళూ; రకరకాలుగా వుంటారు. నువ్వూ అలాగే వుంటావు. మంచి పుస్తకాలన్నీ నువ్వు మాత్రం కొనగలవా?

'నా పుస్తకాలు మీరు కొనరు కాబట్టి నేను బీదవాణ్ణి అయ్యాను' అన్నావంటే, నీకు లోకజ్ఞానమే లేనట్టు కనపడుతోంది. పుస్తకాల మీద బతికే రచయిత లెవరూ ఈ దేశంలో లేరు. పాఠకులు, రచయితలందరి పుస్తకాలూ కొనేసి, రచయితలు పెట్టిన డబ్బు అంతా లాభాలతో సహా తిరిగి వచ్చే లాగచెయ్యాలంటే, మొదట పాఠకులందరూ బికారులై కూర్చుంటారు.

రచన అనేది ఒక 'కళే' గానీ, ఒక 'వృత్తి' కాదు. ఏ రచయిత అయినా, తన జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవలిసిందే. నీకు పత్రికలవాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ వృత్తినే మార్చుకోవాలని, మహా రచయితవి నీకు తెలీదా? ఆటోనో, టాక్సీనో నడుపుకోలేవూ? వాచ్‌మన్ పనిచేసుకోలేవూ? ప్రైవేట్లు చెప్పుకోలేవూ? ఒకటిరెండు స్కూళ్ళలో, టీచరు పని చేసుకోలేవూ?

గోర్కీ బండ వృత్తులు అనేకం చేశాడు. గోర్కీ అంతటి నువ్వూ అలాగే చేసుకోవాలి. లోకంలో పత్రికల వాళ్ళే ఉన్నారా ఉద్యోగాలివ్వడానికి? 'చేస్తే పత్రికలో పనే చేస్తా. ఇంకే పనీ చెయ్యను' అలా అంటావా? అలాగైతే, బీదగా బతకడానికే సిద్ధపడాలి. మాటి మాటికి బీద అరుపులు అరిచే నీకు, తాగుడు ఖర్చు ఎందుకు? బీదలు కూడా తాగుళ్ళకి అలవాటుపడతారు. కానీ వాళ్లు 'బీదలం, బీదలం' అనుకోరు. వాళ్ళ కోసం ఎవరో ఏదో చెయ్యాలనీ ఆశించరు. వాళ్లు, ఒక పని పోతే ఇంకో పని చేసుకుంటారు.

వాళ్ళ డబ్బు తోటే వాళ్ళు తాగుతారు. వాళ్ళు గొప్ప రచయితలు కారు కాబట్టి, బీదరికలో కూడా వాళ్ళు తాగుడు తప్పు చేస్తారు. కానీ, నువ్వు గొప్ప రచయితవి! నీ పుస్తకాలు మంచి రసాలు ఊరిస్తాయి! పుస్తకాల వల్ల డబ్బు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, తాగుడు కోసం ఖర్చు పెట్టే వాడికి, లేదా ఇతరులు పోయిస్తే తాగే వాడికి, జీవితం మీద ఎంత బాధ్యత ఉన్నట్టు? మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?

నీ సన్మానాలకోసం డబ్బు అందించినవాళ్లకి, నీ పుస్తకాల మీద లక్ష్యం లేదని నువ్వే అంటున్నావు. నీ పుస్తకాలు నీలో ఆత్మాభిమాన రసాన్ని ఊరించలేదా? 'నేను బీదగా వున్నాను కాబట్టి, డబ్బుకోసం సన్మానాలు చేయించుకుంటా' అంటున్నావంటే, నీ వాదంలో, బీద గా వున్నందుకూ సన్మానమే; విద్వత్తు ఉన్నందుకూ సన్మానమే! చాలా తెలివైన దారి!

'ఒక్క ఎకరం వున్న తండ్రి గల వాణ్ణి కాబట్టే బీదరైతుల జీవితాల్ని బాగాచెప్పగలిగాను; ఐదెకరాల ఇంట్లో పుడితే అలాచెప్పలేకపోదును' అన్నావు. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు నువ్వు 10 లక్షల వాడివయ్యావు. ఇంకా అవుతావు కూడా. ఇక ఇప్పటి నించీ నువ్వు చెప్పగలిగే మంచి రసాల రచనలేవీ వుండవని అర్ధమేకదా? నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్న మాటే కదా?

నామినీ, ఎందుకిలా నీ భుజాలు నువ్వు తడుముకుంటున్నావు? సంజాయిషీలతో మొదలుపెట్టి, దబాయింపుల్లోకి దిగిపోయావు. 'నేను ఇంత గొప్ప, అంత గొప్ప' అని మిడిసిపాటు ప్రదర్శించావు. బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు.

కొంచెం వివేకం తెచ్చుకో! నీ సన్మానాల గురించి ఎవరైనా నిన్ను తప్పు పడితే, 'అందరూ చేసే పనే నేను చేశాను' నా కన్నా ముందు సన్మానాలు జరిగిన వాళ్ళందర్నీ తప్పు పట్టి, ఆ తర్వాత నన్ను తప్పు పట్టండి' అని చెప్పు, సరిపోతుంది. నువ్వు గతంలో ఎప్పుడైనా సన్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడివుంటే, 'అప్పుడు బుద్ధి లేక అలా మాట్లాడాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను' అని చెప్పు! అది ఇంకా సరిపోతుంది.

కులసంఘాల వాళ్ళ నించీ డబ్బు అందుకుని, 'వికారంగా కులసంఘా ల డబ్బు' అంటూ బడాయి మాటలు విసిరి, కులసంఘాల వాళ్ళకి ఒళ్ళు మండించకు! ఎందుకీ తుంటరి మాటలు? నీ విద్వత్తుకో, నీ బీదరికానికో, దేనికో దానికి నిన్ను స్థితిమంతుణ్ణి చేస్తోంటే, వాళ్ళకి వినయం చూపించు.

వాళ్ళకి అణగి మణిగి వుండు. చక్కగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో, వంది మాగధులతో ఎబికె ప్రసాద్ వంటి మహా మేధావుల ఆశీస్సులతో, బడా పారిశ్రామిక వేత్తల జ్యోతి ప్రజ్వలనాలతో, వందన సమర్పణలతో, రంగరంగ వైభవంగా సన్మానం చేయించుకో! ముచ్చటగా నెలకో సన్మానంతో నెలకో లక్ష అందుకో! ఎంతకాలం దాకా ఇస్తారో అంతకాలం దాకా అందుకో! వాళ్ళు ఇచ్చింది వాళ్ళ కష్టార్జితం కాదులే. వాళ్ళు దోచుకునే దాంట్లో నువ్వూ ఒక వాటా సంపాదించుకో.

నువ్వు ఇప్పుడు ఒక్క ఎకరం బీద రైతు కుమారుడివి కావు; బడా బడా పారిశ్రామికవేత్తల అత్యున్నత దేవస్థానం ప్రముఖుల ముద్దబిడ్డవి! ఇన్నా ళ్ళూ బీదరైతుల కథలు రాసిన నీ కలం నించి, ఇక ఇప్పటి నించి, సన్మానా లూ, ధనరాసులూ, ఎంత రుచికరమైనవో, నీ వంటి గొప్ప రచయితలకు అవి అందడం ఎంత న్యాయమో, ఎంత అభ్యుదయమో వర్ణిస్తూ నీ వాదనలతో రాబోయే నీ కొత్త రసాల రచన కోసం ఎదురు చూస్తాం నామినీ! సరేనా?

- రంగనాయకమ్మ



Monday, February 08, 2010

బైరాగి కథ “ జేబు దొంగ “




కథానుభవం-4

‘ నూతిలో గొంతుకలు ‘ కవిగా ఆలూరి బైరాగి గురించి, చదివినది అర్ధం చేసుకొని తిరిగి మాట్లాడగలిగే స్థితి వచ్చినప్పటినుంచి వింటున్నాను. ఆధునిక్రాంధ్ర కవులల్లో ఉత్తమ కవిగా పేరుపడ్డ బైరాగి గురించి మా ఇంట్లో జరిగిన సాహిత్య చర్చల్లో నాకు అర్ధమైనంత వరకు అతనొక నిరాశావాద కవి అని. అజంతా అంటే మృతువు కవి అన్నట్లే బైరాగి అనగానే ఏకాంతం, నిరాశ స్పురిస్తాయి. ఆ రెండూ ఆయనకిష్టమైనవనీ, ఆయన కవిత్వమంతా వాటి చుట్టూనే తిరుగుతుంటుందని ఒక వాదన. అది అలా నా మనస్సులో ముద్ర పడిపోయింది. కానీ బాగా పెద్దయ్యాక కవిత్వం తీరుతెన్నులు పర్వాలేదు అర్ధమవుతాయి అనుకున్నప్పుడు బైరాగి కవిత్వం చదివితే “ నాక్కొంచెం నమ్మకమివ్వు “ అని అడిగిన ఆ కవి కేవలం నిరాశావాది కవి కాదని తెలిసివచ్చింది. శ్రీశ్రీ శబ్ద సౌందర్యం , కృష్ణశాస్త్రి కున్న సౌకుమార్యం రెండింటికి మధ్యనున్న కవి బైరాగి అనిపించేది. బైరాగి కున్నదల్లా భావసౌందర్యం. ఆ భావానికి తగ్గట్లు కవిత్వ భాషనుపయోగించే మంచి కవి అతను. చిక్కనైన కవిత్వం రాసిన బైరాగి తన కథల్లో కూడా ఆ కవిత్వాన్ని చిలకరించాడు. అతని కథల పుస్తకం “ దివ్య మందిరం “ , నవల “ పాప పోయింది” చదువుతున్నంతసేపు , అతని వచన కవిత్వం అంతా వాక్య వాక్యాలుగా విడిపోయి మళ్ళీ కొన్ని కథలుగా జీవం పోసుకున్నాయనిపించింది.

బైరాగి కథాసంపుటి “ దివ్య భవనం” మొదటి ముద్రణ 1955 లో వెలువడింది. ఆ తర్వాతదొరికిన మరో నాలుగు కథలు కలిపి ద్వితీయ ముద్రణా ఏప్రిల్ 2006 లో వెలువడింది. మొత్తం ఈ సంపుటిలో 11 కథలున్నాయి. బహుశా బైరాగి రాసిన మొత్తం కథలు ఇవే కాబోలు. ముందు నాకు నచ్చిన కథల గురించి కాకుండా నాకు పెద్దగా నచ్చని కథల గురించి చెప్తాను. నాకు బోరు కొట్టించిన కథ పుస్తకం లోని ఆఖరు కథ “ తండ్రులు-కొడుకులు”. ఒక కొడుకు గురించి తండ్రి చేసే త్యాగం. ఇతివృత్తం అంత బలమైనది కాకపోవటం ఒకటైతే, కథనం కూడా విసుగు తెప్పించింది. పుస్తకం చివర్లో వుంది కాబట్టి వద్దనుకున్న వారు చదవకుండా వదిలేయవచ్చు. బైరాగి కథల్లోని గొప్పతనం ఏమిటంటే అర్ధమైనా , కాకపోయినా అన్నీ కథలు చదివింపచేస్తాయి. అర్ధం అయి ఆలోచింపచేయటం కాదు.కొన్ని మనల్ని అర్ధం కానివ్వకుండా కూడా ఆలోచింపచేస్తాయి. ఒక గంట జీవితం, దివ్య భవనం లాంటి కథలు చదవటం పూర్తయ్యాక ఏదో తెలియని ఒక బహుచిక్కనైన భావం మన హృదయమంతా ఆక్రమిస్తుంది. అది బాధో, నిరాశో, దుఃఖమో, ఆర్ద్రమో తెలియని భావం తో మనస్సు నిండిపోతుంది. ఒక తీవ్ర కవితావేశంతో , భావ తీవ్రతతో కవి బైరాగి ఆ కథలు రాశాడు కాబోలు. నేను ఆ కథలు చదువుతున్నంత సేపు నా మానసిక స్థితి అతని భావతీవ్రతను అందుకోలేక పోయిందనిపించింది.

కథ చదువుతుంటే బావుండి, అర్ధం అవుతున్నట్లు మనల్ని భ్రమింపచేసి, అర్ధం చేసుకునేందుకు మనల్ని ఆలోచింపచేసి, చివరకు అసలు కథ ఏమిటో తెలియకుండా ముగింపుకు వచ్చేసే కథే “ దివ్య భవనం”. కవులు కథ రాస్తే ఇలాగే వుంటాయి అని చాలా మంది ఎప్పుడూ చేసే కామెంట్ కి అనుకూలం గా వుంది ఈ కథ. ఈ పుస్తకానికి ఆ కథ పేరే పెట్టడం, అదే పుస్తకంలో మొదటి కథ కావటం వల్ల మనకు అర్ధం కాకపోయినా బహుశా సంపాదకులకు ఈ కథ యొక్క గొప్పతనం ఏదో అర్ధమై వుండి వుండాలనిపిస్తుంది. బైరాగి ఇంకా బతికే వుంటే ఈ ఒక్క కథ గురించే ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఆ కథలో కొన్ని వర్ణనలు ఇలా వుంటాయి.

“ అది ఒక మేడ. మామూలు ఇటుక, సున్నం తో కట్టిన ఇల్లు కాదు. ఇనుము, రాగి మొదలైన లోహాలతో పోతపోసి వుంటారు. అదెప్పుడూ నిశ్శబ్దంలో చీకటి గా నిలబడి వుంటుంది. దాంట్లో దీపాలు వెలగవు కానీ ఆ మేడ నే దేవతల దీపంలా అలౌకిక కాంతితో మెరుస్తూ వుంటుంది. అది గాలితో, శూన్యంతో కట్టబడి వుండి. అందువల్ల దానికి హృదయం లేదు. కానీ అది గాజులాగా పారదర్శకంగా వుంటుంది. మరో విశేషం ఆ మేడకు దర్వాజాలు లేవు. మేడ మెట్లన్నీ నెత్తుటి మరకలతో నిండిపోయినాయి. అసంఖ్యాక మానవుల నిరాశ శిరస్పాలనంతో వారి ఎర్రని జీవ రుధిరం ట్రాగి ఆ మెట్లు చేవ దేలి నునుపెక్కాయి. ఆ మెడలో ఎవరైనా ఎలా ప్రవేశించగలుగుతారో ఎవ్వరికీ తెలీదు. అది ఒక బ్రహ్మ రహస్యం.” ఈ కధ కూడా మనకు ఒక బ్రహ్మ రహస్యం గానో, ఒక బ్రహ్మ పదార్ధం గానో అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఈ కథలో కథకుడికి అప్పుడప్పుడు ఆ మెడలో షేక్స్పియర్, దాస్తోవిస్కీ, కాళీదాసు, బుధ్ధుడు, గాంధీ, క్రీస్తు, అశోకుడు, న్యూటన్, గెలీలియో వంటి వాళ్ళు కనిపించారట. ఎవరైనా ఈ కథ ఎందుకు అర్ధం కాదో, ఎలా అర్ధం కాదో తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవండి.

ఇక కథ, కథనం అర్ధమై నేను ఎంజాయ్ చేయగలిగిన కథలు జేబుదొంగ, బీజాక్షరి, స్వప్నసీమ, దరబాను, కన్నతల్లి, కిమానీ, నాగమణి. బాగా నచ్చింది జేబుదొంగ. ఈ సారి కథానుభవం లో జేబు దొంగ గురించి....

“ ఆద్యంతాలు లేని మహా సముద్రపు హోరు.

మర ఫిరంగుల జోల పాట, మత్తుగల మేలుకొలుపు చీకట్ల కోనేట్ల పసరు నీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అంటూ మొదలవుతుంది ఈ కథ. “అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అన్న వాక్యంతోనే ఈ కథ ముగుస్తుంది. దీన్ని బట్టి ఈ కథలో ఆ ఒక్క ముక్తి క్షణం ఎంత మధురమైనదో, ఎంత ముఖ్యమైనదో అర్ధం చేసుకోవచ్చు. ఆ ముక్తి నొసగేది పైన ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉన్నాడో, లేదో తెలియని, నీకు కనిపిస్తాడో, కనిపించడో, సగుణ స్వరూపుడో, నిర్గుణ స్వరూపుడో అయిన దేవుడు కాడు. కేవల మనుష్యుడు. మరీ ఆశ్చర్యకరంగా అతనొక జేబు దొంగ. ఈ కథ చదువుతుంటే ఆశ్చర్యకరంగా, కథ చెపుతుంటే వింతగా, కథ గురించి మాట్లాడుతుంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలు కథే లేని కథ ఇది.

ఇదొక అతి సాధారణ మనిషి ప్రసాదరావు అనుభవం. ఉద్యోగం లేక బాధపడుతూ అవసరముండి డబ్బు అప్పు అడిగితే డబ్బు ఇస్తానో, ఇవ్వనో చెప్పకుండా, ఎంత ఇస్తాడో అసలే తెలియకుండా సాయంత్రం తాను మద్రాస్ వెళ్లిపోతున్నందువల్ల స్టేషన్ కి రమ్మంటాడు ఒక డబ్బున్న పూర్ణచంద్రరావు. అలా మన ప్రసాదరావు తెనాలి స్టేషన్ లో ప్లాట్ ఫారం మీద కూర్చొని ఉంటాడు. చుట్టూ వున్న జనాన్ని పరికిస్తూ, అంచనా వేస్తూ, ఆలోచిస్తూ పూర్ణచంద్రరావు చెప్పే ఏవేవో విషయాల్ని పరధ్యానంగా వింటూ వుంటాడు. రైలు కదిలేముందు పూర్ణచంద్ర రావు నుంచి మన ప్రసాదరావు కి దక్కింది కేవలం అయిదు రూపాయలు. ఆ డబ్బు తీసుకొని రోడ్డు మీద నడుస్తుంటే ఒక 14,15 ఏళ్ళ పిల్లవాడు ఆ డబ్బు కొట్టేస్తాడు. కథ గా అంతే. ఆ పిల్లవాడు డబ్బు కొట్టేసిన క్షణం జీవిత రక్తోజ్వల ముక్తి క్షణం. ఆ క్షణమే కథకు ఆయువు పట్టు.

అసలే డబ్బు లేనప్పుడు దక్కిన అయిదు రూపాయలు మరో దొంగ కొట్టుకుపోతుంటే కోపం, ద్వేషం రాకుండా అతని మీద ప్రేమ , జాలి, కరుణ ఎందుకు కలుగుతాయి? కేవల ఆ ఒక్క క్షణం ఎందుకు ముక్తిని, ఒక జీవితానుభవాన్ని అందించిందో తెలియాలంటే కథ చదవాలి. ప్రసాదరావు మనఃస్థితి , అతని మనో ప్రపంచం అర్ధం కావాలి. అప్పుడు కానీ ఆ జీవిత రక్తోజ్వల ముక్తి క్షణంమనకు కూడా అనుభవంలోకి రాదు. పూర్ణచంద్రరావు గారు డబ్బు ఇవ్వకముందే ప్రసాదరావు కి ఒక ఆత్మానుభవం కలిగింది. తనను తాను భౌతికంగా వేరు చూసి చూసుకున్నాడు. ఉన్న డబ్బు అవసరం, అది లేకపోతే వచ్చే కష్టాలు అవన్నీ కేవలం ప్రసాదరావు అనే దేహానికి సంబంధించినవి గా అతను తన నుండి తనను వేరు చూసి చూసుకున్నాడు. అలా రెండు ప్రపంచాల్లోంచి తనని తాను తెలుసుకున్నాడు.” అందులో ఒక ప్రపంచం రెండో దాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది.ఈ రెండు ప్రపంచాలకూ మధ్య వంతెన లాగా అతని డబ్బు అవసరం. బాహ్య ప్రపంచంతో అతనికి సంపర్కాన్ని కలిగిస్తూ గూడా, ఆ సంపర్కాన్ని తనతో నింపివేసి కల్మష పరుస్తున్నది.” చేతిలో లేని డబ్బు కోసం ఏ మార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత అతనికి జ్నానోదయం కలిగింది. అతనొకానొక ప్రశాంతతతో వున్నాడు. అందువల్లే ఇదివరకేన్నడూ గమనించని విషయాలు అతను గమనించగలిగాడు. “ పూర్ణచంద్రరావు గారు సాయంత్రమల్లా చెప్పిన మాటలూ , అతని ఆలోచనలూ, ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అతిథిలా ఒక్క క్షణం వాకిలి దగ్గర ఆగి, ఒక ఇష్టం లేని వెనక చూపుతో మనస్సులో ప్రతిధ్వనులతో సహా చెరిగిపోయాయి”. జనసందోహంతో కిక్కిరిసిన ఆ ప్లాట్ ఫారం ని వదిలి ఆ రాత్రి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు “ అకస్మాత్తుగా అతను రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స్పర్శను అనుభవించాడు. సముద్రపు నిలువ నీరుకంటే గూడా ఎక్కువ నీలంగా వుండి ఆకాశం. నక్షత్రాలు నల్లని మొఖమల్ మీద బంగారపు పూలలా మెరుస్తున్నాయి. నగరమంతా మెలకువకూ, నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈ పాటికి ఎక్కువ మంది నిద్రపోయి ఉండరు. కానీ అంతా నిద్ర పోదామని ఆశిస్తూ ఉండి ఉంటారు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి పంకిస్తూ ఉండి వుంటారు. ఈ నీడల నాటక రంగం మీద కలల కాంతిలో జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఒక హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతి నిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడేవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళడు. ఇదే రోజు వారీగా చేసే యాత్రాల గమ్యస్థానం” అనుకొంటాడు ప్రసాదరావు. అప్పుడు జరుగుతుంది ఆ సంఘటన. ఒక 15 ఏళ్ల పిల్లవాడు జేబులోంచి ఆ మిగిలిన అయిదురూపాయలు లాక్కున్నాడు. ఇక ప్రసాదరావు కి ఈ లోకంలో ఏ ఒక్క బంధం లేదు. ఆ పిల్లవాడి రెండు కళ్ళు రెండు బ్యాటరీ లైట్ల కాంతిలా, జాలిని, భయాన్ని, ఆశ్చర్యాన్నీ, చెప్పతరం గాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ అతని నిర్దాక్షిణ్యాన్ని, క్రూరత్వాన్ని దూషిస్తున్నట్లు, నిందిస్తున్నట్లు , చూస్తూ, అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. “ ఆ ఒక్క క్షణం అతనికి విశ్వరూపసందర్శనానుభవం కలిగింది. తన అల్పత్వం అర్ధమైంది. ఆ కుర్రవాడితో అతను సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఈ విశాల భూతలం మీద కళ్ళు తెరిచిన మొట్టమొదటి రోజు నుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. ఈ భూమి మీద తను బతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు”.

అహో జీవితపు రక్తోజ్వాల ముక్తి క్షణం స్వానుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక్క ప్రసాదరావు దా? బైరాగి దా? కథ చదివిన వారందరికినా?

“ఒక్క క్షణం రాత్రి పూట వచ్చిన వాణ్ణి. నీ వాకిట ముందు ముగ్గులు పెట్టి పోయిన వాణ్ని. నీవు నిదురపోతున్నప్పుడు చల్లగా, మెల్లగా, తల్లిలా వచ్చి నిశ్శబ్దంగా నీ నొసలు ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిన వాణ్ణి చూచావు. ఒక్క క్షణం అతడు నీ నీరసతధ్యాల చింకిబట్టలు విప్పి దూరం గా పారేసి, స్వీయ తేజస్సుతో నిజ స్వరూపంతో నిలబెట్టాడు. బహుశా నీవతన్ని మళ్ళా చూడలేవేమో? అయితేనేం? అతడు ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాడు. నీ దైనిక జీవితపు భయంకర నిద్రలో అతని ముద్దుల స్పర్శ సహస్ర రూప రసగంధ పులకిత స్వప్నా సుమాలుగా వికశించి, మానవుణ్ణి మానవుణ్ణిగా చేయకలిగిన కళాసాహిత్యాలు, వేదాంత విజ్నానాలు సృష్టిస్తుంది. బ్రతుకుల ఊబిలోంచి నిన్ను పైకెత్తుతుంది. దేవతుల్యుణ్ణిగా చేస్తుంది”. అంతే.అదీ బైరాగి కున్న నమ్మకం. ఈ కథ చదివాక మనకు కూడా ఒక్క క్షణం ఈ బతుకు, అనేకానేక భౌతిక, మానసిక అవసరాలు అన్నీ నిమిత్తమాత్రంగా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్షణం అందరి బతుకుల్లోకి అంత సులభంగా చొచ్చుకురాదు. ఒక ప్రసాదరావు కో, ఒక బైరాగి కో తప్ప. బైరాగి తాత్త్విక చింతనకు ఈ కథ ఒక తార్కాణం. ఇది బైరాగి మాత్రమే రాయగలిగిన కథ అనిపిస్తుంది.

కల్పనారెంటాల

 
Real Time Web Analytics