నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, July 31, 2010

మహాశ్వేత రచనలు తెలుగు లో ఎవరూ చదవలేదా?

‘ ప్రమాదో ధీమతా మపి’ ---బుద్ధిమంతులు కూడా పొరపాటు పడతారు. పొరబడటం అనేది సర్వజన సామాన్యం అని తెలుసు. కాబట్టి ఈ కింద నేను పేర్కొనే అంశాలు మాలతి చందూర్ గారి మీద గౌరవ ప్రపత్తులతో మాట్లాడుతోందే అని గమనించగలరు.


“ నన్ను అడగండి” శీర్షిక కింద జూన్ 25 వ తేదీ స్వాతి సపరివారిపత్రికలో “ లిటరేచర్” కేటగిరీలో అడిగిన ప్రశ్నకు మాలతి చందూర్ గారి సమాధానం నన్ను నివ్వెరపరిచింది. ఆ ప్రశ్న, ఆమె ఇచ్చిన సమాధానం,దానికి నా ప్రతిస్పందన చదవండి.

“ శరత్ చంద్రుని పోలిన తెలుగు నవలాకార్లు లేరనేవారు. అలాగే మహాశ్వేతాదేవిని పోలిన రచయిత్రులు ఎవరూలేరా?” అన్నది ప్రశ్న.
మాలతి చందూరి గారి సమాధానం చదవండి:

వేలూరి శివరామశాస్త్రి బెంగాలీ నుంచి తెలుగు లోకి అనువదించిన “ రాముని బుద్ధిమంతనం’, తీరని కోరికలు’ అనూహ్య పాఠకాదరణ పొందాయి.

ఆ తర్వాత చక్రపాణీ, బొందలపాటి శివరామకృష్ణ , గద్దె లింగయ్య వంటి వారెందరో శరత్ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ముప్పైల ద్వితీయార్థం లోనే ‘ దేవదాసు’ పిక్చర్, సైగల్ హీరో గా బెంగాలీ, హిందీలలో కలకత్తా నుంచి వచ్చింది.

వేలూరి వారి ‘ రాముని బుద్ధి మంతనం’ ప్రకాష్ ప్రొడక్షన్స్ ‘ దీక్ష’ గా యాభైల నాటికే తెరకెక్కింది. ఇక మహా శ్వేతా దేవి విషయమంటారా? కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకొను.

తెలుగు వచనారచనా ప్రపంచం ప్రాంతాల వారీ, జిల్లాలా వారీ గీతాలు గీసుకుంటోంది. మేము ఏనాడో రాష్త్రేతరాంధ్రులయ్యాము కాబట్టి మమ్మల్ని ఇవేమీ తాకవు.

మహాశ్వేతాదేవి తో కేరళ లోని తుంజన్ మెమోరియల్ సెంటర్లో గడపగలడం మా అదృష్ట్రం. ఉదయం పూట చెట్ల మధ్య తిరుగుతూ ఎన్నెన్నో అపూర్వ విషయాలు చెప్పేవారు. సన్మిత్రులు జ్నానపీఠ్ అవార్డ్ గ్రహీత పద్మ భూషణ్ వాసుదేవన్ నాయర్ కేరళ లోని తుంబన్ కేంద్ర వ్యవస్థాపకులు , కార్య నిర్వాహకులూను. మూడు రోజుల సెమినార్. కానీ రెండో రాత్రే మహాశ్వేతా దేవి బొంబాయి వెళ్ళి పోయారు. అక్కడేదో పని వుండటం వల్ల ఆ రెండు రోజులు స్మృతి వాటికలో పచ్చనాకులా భాసిస్తాయి.

తన ముప్పైయవ ఏట 1956 లో మొదటి నవలా రచనకు పూనుకున్నారామే. ఆంగ్లేయులు తన రాజ్యాన్ని కబళీంచకుండా ఆశ్విక యుద్ధం లో కత్తి ఝళిపిస్తూవీరోచితంగా పోరాడి నెలకొరిగిన ధీరనారి ఝాన్సీ రాణి అని మనకందరికీ తెలుసు. కానీ మహాశ్వేతా దేవి ఆ నవలకు రూపకల్పన చేసే ముందు చారిత్రాకాంశాలు క్షుణ్ణంగా చదివారు. అర్కైవ్స్ పూర్తిగా పరిశీలించారు.

ఝాన్సీ నగరం వెళ్లారు. ఝాన్సీ రాణి గురించి ఎడారి తెగలు పాడుకొనే పాటలు, మైదానాల్లోని జానపదుల గీతాలు శ్రద్ధగా ఆలకించి , నిగూఢ వృత్తాంతాన్ని ఆకళింపు చేసుకొని మనోముద్రితమైన వాటితో నవలారచనకి ఉపక్రమించినప్పుడు అదేలా వుంటుందో వేరే చెప్పాలా?

ఇదీ మాలతి చందూరి గారి సమాధానం. ఆమె తన సమాధానం లో “ కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకోనూ”. అన్నారు. విశ్వసాహిత్యాన్ని చదువుకున్న రచయిత్రి మాలతి చందూర్ గారి కలం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ని చదివి నేను ఆశ్చర్యపోయాను.

మహాశ్వేత దేవి ని పోలిన రచయిత్రులు తెలుగు లో ఎవరూ వుండి వుండకపోవచ్చు. కానీ మహా శ్వేత దేవి రచనలు కూడా ఎవరూ చదివి వుండరని వ్యాఖ్యానించడం శోచనీయం. మహాశ్వేత దేవి రచనల్లో ముఖ్యమైనవి తెలుగు లో అనువాదమయ్యాయి. ఆ అనువాదాలే కాక ఇంగ్లిష్ లో అనువాదమైన ఆమె ముఖ్యమైన రచనలు ( గాయత్రి చక్రవర్తి స్పైవాక్ క్రిటికల్ అనాలిసిస్ తో సహా) నేను చదివి కొన్నేళ్ళ క్రితం వార్త ఆదివారం దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. నాతో పాటు అనేకమంది రచయిత్రులు మహాశ్వేత దేవి రచనలు చదివి విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. బహుశా ఆంధ్ర దేశ సాహిత్యానికి దూరం గా వుందటం వల్ల మాలతి చందూర్ గారికి మహాశ్వేతాదేవి కథలు తెలుగు లోకి అనువాదమయ్యాయన్న విషయమైనా తెలిసో లేదో నాకు తెలియదు.

మహాశ్వేతాదేవి రచనలు ఒక తల్లి ( హజార్ చౌరాసీ మా), ఎవరిదీ అడవి? ( జంగల్ కి అధికార్), దయ్యాలున్నాయి జాగ్రత్త ( దాయిన్) బషాయిటుడు, రుడాలీ కథలు, చోళీకే పీచే ....ఇవన్నీ కేవలం హెచ్ బి టి వాళ్ళు చేసిన ప్రచురణలు. మాలతి చందూర్ గారు భ్రమపడినట్లు తెలుగు రచయిత్రులే కాదు మామూలు పాఠకులు కూడా ఎవరైనా ఇప్పటివరకూ ఆమె రచనలు చదివి వుండకపోతే( నేననుకొను) బహుశా ఇప్పుడు పైన నేను చెప్పిన పుస్తకాలన్నీ హెచ్ బి టీ వాళ్ళ దగ్గర ఇంకా దొరుకుతూ వుండవచ్చు. ప్రయత్నించి చూడండి.

ఇవి కాక ఆమె రచనలు దాదాపుగా అన్నీ ఇంగ్లీష్ లో విరివిగా దొరుకుతాయి.

ఒక బాధ్యతాయుతమైన రచయిత్రిగా, విజ్నురాలిగా మాలతి చందూర్ లాంటి ప్రముఖులు కూడా తోటి రచయిత్రుల పట్ల బాధ్యాతారహితంగా, పత్రికాముఖం గా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు.

నేను పోగొట్టుకున్న రచనల్లో మహాశ్వేతా దేవి రచనల మీద రాసిన వ్యాసం కూడా వుంది. కాబట్టి ప్రస్తుతానికి అది ఇక్కడ పెట్టలేను కానీ. ఈటీవీ లో మార్గదర్శి కార్యక్రమం కోసం మహాశ్వేతా దేవి జీవితం గురించి 2006-07 మధ్య నేను రాసి ఇచ్చిన వ్యాసం త్వరలో పోస్ట్ చేస్తాను.

Wednesday, July 28, 2010

ఈ ఇల్లొక నిశ్శబ్ద నది!

దీవారోం సే మిల్ కర్ రోనా...



ఇప్పుడు మా ఇల్లొక నిశ్శబ్ద నది లా వుంది. అఫ్సర్ మాడిసన్ లో వున్నాడు. మా అనిందు ఫ్రెండ్స్ తో కలిసి కాలిఫోర్నియా వెళ్ళాడు. ఆహా, ఇంట్లో ఎవరూ వుండరు. నేనొక్కదాన్నే. హాయి గా పుస్తకాలు చదువు కోవచ్చు. రాసుకోవచ్చు. రోజూ వంట చేయాల్సిన పని లేదు. ఏదో ఒకటి చేసుకొని తినేయచ్చు. మరీ ముఖ్యం గా నా నవల పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఈ విలువైన ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో రెండు, మూడు నెలలుగా కలలు కన్నాను.


తీరా ఆ సమయం వచ్చేసరికి... నన్ను వదిలి మా బాబు దూరం గా ఒక పదిరోజులు వెళ్ళే సమయం వచ్చేసరికి...దృశ్యం మొత్తం మారిపోయింది. వాడు అలా నా బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను గట్టి గా పట్టుకొని బై చెప్పి వెళుతుంటే నాకు ఏడుపు ఆగలేదు. కారు కదిలి వెళ్లిపోయాక ఇంట్లో కి వస్తే అది ఇల్లు లా కాక ఒక దిగులు గూడు లా అనిపించింది. రేపు వాడు పెద్దఅయి కాలేజీకని దూరంగా వెళ్లిపోతే అమ్మో, అప్పుడు ఇలా వుంటుందా అని అనుభవం లోకి వచ్చి కన్నీళ్ళు ఆగలేదు.


నాలుగు రోజులు గా ఇల్లు మొత్తం ఒక భయకర నిశ్శబ్దమైంది.కీ బోర్డ్ శబ్దాలు, పుస్తకం లో పేజీలు తిప్పే చిన్న శబ్దాలు, అప్పుడప్పుడూ మోగే టెలిఫోన్ రింగ్ లు.. వింటున్న కొద్దీ మనసు ని మెలిపెట్టే కొన్ని పాటలు...
నా ఒంటరితనాన్ని గుర్తించి మేమున్నాము కదా అని పలకరించబోయి ఆగిపోతున్న కల్హార, కౌశిక్ లు..

దీవారోం సే మిల్ కర్ రోనా...

గోడలతో కలిసి దుఃఖించటమంటే ఏమిటో కొంచెం తెలిసినట్లనిపించింది.

Monday, July 26, 2010

ఆడియో బ్లాగింగ్ –రెండు కవితలు



కవిత్వం ఒక ప్రదర్శనా కళ ( performing art)అనుకుంటాను నేను. అందమైన కవితల్ని ( ఇక్కడ అందం అంటే ఆకాశం, పూలు లాంటి ప్రకృతి సౌందర్యం కాదు—శబ్ద, లయ సౌందర్యం ) మౌనం గా లోపల్లోపల చదవటం కన్నా పైకి చదవటం వల్ల, పైకి చదివినది శ్రధ్ధగా వినటం వల్ల మరింత ఎక్కువగా మనసుకి హత్తుకొని దగ్గరవుతుందనిపిస్తుంది.
రచనా లాగే సంభాషణ కూడా ఒక ప్రవృత్తి నాకు. చిన్నప్పుడు రేడియో లో పిల్లల నాటకాలు వేయటం దగ్గర నుంచి ఆకాశవాణి లో ప్రాంతీయ వార్తలు, వార్తా కథనాలు చదవటాన్ని కూడా అందుకనే నేను బాగా ఎంజాయ్ చేయగలిగాను. నా పేరు చెప్పకముందే నా గొంతు వినగానే మీరు ఫలానా కదా అని గుర్తు పట్టి అందరూ అడుగుతుంటే అప్పట్లో అదో రకమైన సంతోషం. ఇప్పుడదంతా గత వైభవమే అనుకోండి. ఆ మధ్య ఎప్పుడో నా పేరు చూసి నెమలికన్ను మురళి మీరు వార్తలు చదివే వారు కదా అంటే ఓహ్! ఇంకా కొంతమంది గుర్తుపెట్టుకున్నారనుకొని పొంగిపోయాను.
నాకున్న ఈ రెండు ప్రవృత్తుల్ని కలిపి నా కవితల్ని ఆడియో గా అందించాలని ఎప్పటినుంచో ప్రయత్నం. చాలా సార్లు అనుకోవటం, మళ్ళీ ఇప్పుడు కాదులే , తర్వాత అని వాయిదా వేయటం జరిగింది . మొన్న మాలతి గారు, నేను కలిసి మళ్ళీ ఈ ఆడియో బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాలనుకున్నాము. మాలతి గారు తన కథలు , నేను నా కవితల్ని చదివి ఆడియో గా అందించాలని నిర్ణయించాము. ఈ ప్రయత్నం లో తొలి అడుగు గా ఇవాల్టీ ఆడియో టపా లో నేను రెండు కవితలు చదివాను. వీటిపై మీ అభిప్రాయం తెలియచేయగలరు. మాలతి గారి కథ ఆడియో లో ఇక్కడ వినండి.

Saturday, July 03, 2010

కార్పొరేట్ సంస్కృతి కి అక్షర చిత్రం “ రాతిపూలు”




తొలి నవల ‘ సుప్త భుజంగాలు ‘ తోనే తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సాహిత్య లోకం లో సంపాదించుకున్న రచయిత్రి సి. సుజాత కలం నుండి దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత వెలువడ్డ మరో నవల “ రాతిపూలు”. రంగుల కల లాంటి సినీ పరిశ్రమకు, ఆధునిక కార్పొరేట్ జీవితానికి దర్పణం ఈ నవల. కార్పొరేట్ సంస్కృతి కాళ్ళ కింద నలిగిపోయిన జీవితాల్లోని సంఘర్షణ ఈ నవలకు ఆయువుపట్టు. కాలక్షేపం కోసం కాకుండా ఈనాటి నగర జీవన సంస్కృతి అనే వూబి లో కూరుకుపోతున్న జీవితాలను గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారు తప్పక చదవాల్సిన, చదివింపచేసే గుణం వున్న నవల ‘ రాతిపూలు’.


హైదరాబాద్ రణగొణద్వనుల మధ్య పరుగులు పెట్టె ట్రాఫిక్ లో పగలు, రాత్రి మన చుట్టూరా కనిపించే వ్యక్తుల అసలు సిసలు తెరవెనుక జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ నవల. పట్టణం లో అందంగా కనిపించే అబద్ధపు జీవితాలు ప్రాణం లేని, వాసన రాని రాతిపూల లాంటివి.చూడటానికి అందంగా వుండి, సున్నితంగా కనిపిస్తూ ఎప్పటికీ వాడిపోకుండా నిత్య నూతనంగా ఉంటాయి ఈ రాతిపూలు. కానీ జీవం,పరిమళం లేని వొట్టి రాతిపూలు అవి.


నగర జీవితమంటే ఇవాళ అందరికీ కనిపిస్తున్నది వస్తు వ్యామోహమే. కానీ దాని వెనుక విఫలమైన ప్రణయాల్ని, కూలిపోయిన కాపురాల్ని చూపిస్తుంది రచయిత్రి ఈ నవల లో. భవంతుల కోసం భార్యల్ని తాకట్టు పెట్టే రసజ్నలు, వస్త్రాపహరణాలు చేసి దోచుకునే సురేంద్ర లు, తప్పని తెలిసి ఆ తప్పును చేయకుండా నిగ్రహించుకోలేకపోయిన అహల్య లాంటి శమంతల కథ ఇది.

ఈ నవలలోని ప్రధాన స్త్రీ పాత్రలన్నీ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చి కెరియర్ నిచ్చెన మెట్లు ఎక్కి పైకి ఎదగాలనుకొని ఆశపడి, ఆ క్రమం లో తమ వ్యక్తిత్వాల్ని, తమ నమ్మకాల్ని, తమ ఆశల్ని, జీవితం పట్ల తమ ప్రేమని పణంగా పెట్టి వొడిపోయిన వాళ్ళే. డబ్బు చుట్టూ అల్లుకున్న సక్సెస్ వూబిలో పడి కూరుకుపోయినవాళ్ళే. నైతికానైతికాల త్రాసు లో తూచి ఈ నవలలోని పాత్రల్ని విశ్లేషించలేము. నగర జీవిత చిత్రణ లో రచయిత్రి కున్న జర్నలిస్ట్ వృత్తి అనుభవం, సామాజిక సమస్యల పట్ల అవగాహన మనకు ఈ నవలలో కనిపిస్తుంది. శమంత, కిన్నెర, జమున లాంటి స్త్రీల మీద జాలో, సానుభూతో, లెదంటే అసహ్యమో కాకుండా ఓ మనిషి లో వుండే మామూలు బలహీనతలతో వాళ్ళను అర్ధం చేసుకోవాలనిపిస్తుంది ఈ నవల చదివాక.

ఒక సారి చదవటం మొదలుపెట్టాక ఆపకుండా చదివించే శైలితో సాగుతుంది. ఈ నవల చదవటం పూర్తి చేశాక, ఒక అద్దం లో నగరాన్ని, మన జీవితాల్నీ కలిపి ఎదురుగా అక్షర కాన్వాస్ మీద చూస్తున్నట్లు అనిపిస్తుంది .


కార్పొరేట్ జీవన శైలిలో ఒక్కోసారి కుటుంబం, మానవ సంబంధాలు, కట్టుబాటు అన్నీ ఎట్లా దూదిపింజెల్లా ఎగిరిపొతాయో. కోరుకున్న జీవితం కోసం శరీరం తో, మనసు తో వ్యాపారం చేయడం ఒక్కోసారి ఎలా అనివార్యమవుతుందో విశ్లేషిస్తుంది రచయిత్రి ఈ నవల లో. ఒక మనిషి ఉనికిమొత్తం డబ్బే అయినప్పుడు లెక్కలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి. అనుబంధాలన్నీ మారిపోతాయి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలతో హాయిగా వుండాలనుకుంటాం. ఆ దారిలో నడుస్తాం. గమ్యం చేరాక నిజంగానే ఆనందం గా వుంటామనుకుంటాము. కానీ అది నిజం కాకపోవచ్చు. ఆ దారి లో మనం ఎన్నింటినో, ఎందరినో కోల్పోతాం . మనం కోరుకున్న, ఆశపడ్డ డబ్బులు మనకు అందాక మన దగ్గర చూసుకుంటే శాంతి వుండదు. ప్రశాంతత మిగలదు. డబ్బు తెచ్చే సౌఖ్యాలు, ఎలాంటి సంతోషాన్ని మిగల్చవు. నడిచొచ్చిన దారి, మనం పోగొట్టుకున్నవి అప్పుడు స్పష్టం గా కనిపిస్తాయి. కానీ జీవితాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోలేము.కేవలం పశ్చాత్తాపపడటమో,బాధపడటమో తప్ప.

ఈ నవలలో కథానాయిక శమంత అందుకే తను చేసిన వాటిని తప్పొప్పులతో పోల్చుకోదు. వాటిని కేవలం పనులుగా చూస్తుంది.ఎందుకంటే ఆమె తన శరీరంతో, మనసుతో చేసిన దాన్ని ఒక వ్యాపారంగానే భావించింది. జీవితాన్ని వ్యాపారం గా మలుచుకోవటం లో ఒక రాతిపువ్వు లాగా మారిన శమంత మళ్ళీ కావాలనుకుంటే మనిషి గా మారగలదా? ఆ ప్రయత్నం అటు రసజ్న, ఇటు శమంత ఇద్దరూ మొదలుపెట్టాలి. అది కష్టమైనా అసాధ్యం కాదు. అలా జీవితం పట్ల తిరిగి ఆ ప్రేమ ను, ఆ నమ్మకాన్ని ఈ నవల ద్వారా రచయిత్రి సి. సుజాత అందిస్తుంది.


రాతి పూలు (నవల)
నవ్య వీక్లీ లో ధారావాహిక ప్రచురణ
ప్రతులకు:అన్నీ పుస్తకాల షాప్ లు
రచయిత్రి ఫోన్ నెం: 9553586086
ఈమైల్ : sujata.c@hmtv.in


(ఈ చిన్న పరిచయం వ్యాసం నుంచి కొంత భాగం జూలై 4 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైంది)

కల్పనారెంటాల
 
Real Time Web Analytics