నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, March 12, 2023

నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం

 



ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్ సమావేశం. నిజంగా స్త్రీల సాహిత్య చరిత్ర లో నా వరకు ఇదొక శుభ సందర్భం. చారిత్రక సన్నివేశం.

ఆరేడు వందల ఏళ్ల క్రితం తాను తెలుగీకరిస్తున్న రామాయణం గురించి, తన గురించి ఎందరో స్త్రీలు ఇలా తలుచుకుంటారని మొల్ల ఊహించి ఉండదు. మాలతి గారి సాహిత్య కృషి గురించి కూడా కేవలం ఈ రోజే కాకుండా ముందు తరాల వాళ్ళు కూడా ఆమె కృషిని గుర్తించి గౌరవించి చర్చించుకొని మాట్లాడుకునే సందర్భాలు రాబోయే తరాల్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.

చారిత్రక మొల్ల కు, భవిష్యత్తు మాలతి గారికి మధ్య వారధి ఈ సమావేశం .

మొల్ల పేరుతోనే ఎందుకీ సత్కారం? అంటే---

80 ల నుంచి స్త్రీల సాహిత్య కృషిని ప్రత్యేక చారిత్రక దృక్పథం తో విమర్శకు పెట్టె సాధనాలు సమకూర్చుకున్న తర్వాత గార్గి గురించి, మైత్రేయి గురించి కూడా మాట్లాడుకోగలిగాము. మొల్ల తొలి తెలుగు కవయిత్రి. ఆమె కాలం గురించి, కులం గురించి, శీలం గురించి కూడా ఏవేవో పుక్కిట పురాణపు కథలు ప్రచారం లో ఉన్నాయి. అవి మనం లెక్క లొకి తీసుకోనక్కర లేదు. స్పష్టం గా కంటికి కనిపించే ఆధారం జాను తెలుగు లో, అప్పటి వ్యావహారికం లో సంస్కృత రామయాణాన్ని ధైర్యం గా తెలుగు లొ తనదైన శైలి లో రాసిన రచయిత్రి మొల్ల. ఈ కాలం లోనే స్త్రీల రచనలను ఎలా అంచనా వేస్తున్నారో చూశాక, ఆ కాలం లో ఆమె ఎదుర్కొన్న సమాజాన్ని కొంత ఊహించవచ్చు. అందుకు మొల్లను మనం గుర్తుంచుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు.

స్వాతంత్ర్యానంతరం రచయిత్రులు ఎంతొ మంది ఎన్నొ రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఇందులో ఎంత మంది ని మళ్ళీ మళ్ళీ మనం రీ రీడింగ్ అంటే పునర్ మూల్యంకనం చేసుకో గలుగుతున్నాము? ఆ దిశ గా ఆలోచించినప్పుడు ముందు మనకు గుర్తొచ్చే పేరు నిడదవోలు మాలతి గారు. 60 ల నాటి స్త్రీల సాహిత్య కృషిని గురించి ఆమె విశ్లేషణాత్మక మైన రచనలు చేశారు. అవి తెలుగు లోనే రాసి ఉంటే వాటి ప్రయోజనం కొంత మేరకే అయి ఉండేది. అయితే ఆమె ఈ కృషిని ఇంగ్లీష్ లో చేశారు. తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్ లో ఎంత మేరకు కృషి జరుగుతోందీ, అదీ ముఖ్యంగా స్త్రీల సాహిత్యం గురించి అన్న విషయం నేను ప్రత్యేకంగా మరో సారి గుర్తు చేయక్కర లేదు. నిడదవోలు మాలతి గారి కలం నుంచి వచ్చిన విశిష్ట రచనలలో ఆ వ్యాసాల సంకలనం ముందుంటుంది. ఆ రకంగా  తెలుగు లో వచ్చిన స్త్రీల సాహిత్యాన్ని ముందు తరాల వారికి పదిలం చేశారు. అందువల్ల మొల్ల పేరుతో సాహిత్య సత్కారం అనుకోగానే నాకు మొదట మెదిలిన పేరు మాలతి గారు మాత్రమే.

ఆమె బయో డేటా చదవటానికే నాకు పది నిముషాలు పడుతుంది. అన్ని రచనలు చేశారు.దాదాపు అన్నీ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె రాసిన కథలు ఎనిమిది సంకలనాలు. నాలుగు కథా మాలతీయాలు అయితే మరో నాలుగు ఎన్నెమ్మ కథా సంకలనాలు. వ్యాసాల సంకలనాలు మరో నాలుగు. ఇవి కాక చాతక పక్షులు, మార్పు రెండు నవలలు. అచ్చమైన డయాస్పోరా నవలను రాసింది మొదట మాలతి గారే. ఇవి కాక ఆమె అనువాదాలు, ఇంగ్లీష్ తెలుగు తూలిక వెబ్ సైట్లు. చాలా మంది అనువాదకులు సృజనాత్మక రచనలు తక్కువ చేస్తారు. లేదా వైస్ వర్సా. అయితే మాలతి గారు ఎన్ని చేతులతో ఇన్ని రచనలు చేశారో ఊహించటం కూడా కష్టం. తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్ లో చదవాలంటే రీసెర్చ్ స్కాలర్స్ కైనా , మామూలు చదువరులకైనా  authentic వెబ్సైట్ ఇంగ్లీష్ తూలిక. ఇంకా ఎన్నొ ఉన్నాయి ఆమె సాహిత్య కృషి ని గురించి చెప్పుకుంటూ పోతే.

నాకు మాలతి గారు రెండు దశాబ్దాల నుంచి తెలుసు. ఎన్నొ సాహిత్య చర్చలు ఫోన్ లోను, వీడియో, ఆడియోల రూపం లో నిర్వహించాము.



మాలతి గారి లాంటి రచయిత్రి  కన్నడం లోనో, మలయాళం లోనొ ఉంటే నెత్తిన పెట్టుకొని పూజించే వారు. దురదృష్ట వశాత్తూ ఆమె తెలుగు వారయ్యారు. అందులోనూ అమెరికా తెలుగు వారయ్యారు. అందుకే ఆమె కు రావలసిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంటుంది.

ఈ మొల్ల సత్కారం గురించి కూడా రెండు మాటలు చెప్తాను.

ఇది నగదు సత్కారం కాదు. దుశశాలువలు లేవు. వక్తలలో ఒకరు ముఖ్యలు, మరొకరు విశిష్టులు లేరు. అందరం సమానం. ఒక రచయిత్రి రచనల గురించి చదివి చర్చించుకోవటం ఒక్కటే పరమ ప్రయోజనం ఈ కార్యక్రమానికి. సత్కార గ్రహీతల విషయం లో కేవలం సాహిత్యం తప్ప, ప్రాంతీయ,కుల,అజెండా లకు మార్కులు లేవు. ఈ సత్కారం ఏడాదికోకసారి అనుకుంటున్నాను. సమయం, సహకారం ఉంటే ఏడాదికి రెండు సార్లు కూడా హాయిగా జరుపు కోవచ్చు. ఇతరుల సాహిత్యం గురించి మాట్లాడదాము. మన సాహిత్యం గురించి మరొకరు మాట్లాడటానికి దారి వేద్దాము.

మొల్ల సత్కారం గురించి నా ఆలోచనలు ఇవి. మీరందరూ ఈ సత్కారానికి ఎవరు అర్హులు అనుకుంటున్నారో తెలియ చేయండి. పరస్పరం మాట్లాడుకొని ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యం లో ఆదరణ కు నోచుకోని రచయిత్రుల రచనల గురించి మాట్లాడుకుందాము.

కాలానికి ముందే నిలచిన కె. రామలక్ష్మి “ పార్వతి కృష్ణమూర్తి” కథలు!



కె. రామలక్ష్మి అంటే కేవలం ఆరుద్ర సతీమణి మాత్రమే కాదు. ఆమె కంటూ చాలా ప్రత్యేకతలున్నాయి. రచయిత్రి గా ఆమె కొక విలక్షణత కూడా ఉంది. స్వాతంత్ర్యానంతర తొలి తరం రచయిత్రుల జాబితాలో మొదటి వరుస లో ఉంటుంది కె. రామలక్ష్మి పేరు. 50 వ దశకానికే  స్వతంత్ర ఇంగ్లీష్ దినపత్రిక లో సబ్ ఎడిటర్ గా పని చేసిన ఘనత ఆమెది. ఖాసా సుబ్బారావు లాంటి జర్నలిస్ట్ వద్ద శిక్షణ పొందారు ఆమె. ఆమె తొలి కథా సంపుటి “ విడదీసే రైలు బళ్ళు ” 1954 లోనే ప్రచురించారు. అప్పటి నుంచి దాదాపు ఏడెనిమిది ఏళ్ల క్రితం వరకూ ఆమె కథా సంపుటాలు, నవలలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఆమె రాసిన “ పార్వతీ కృష్ణమూర్తి కథలు” 50 వ దశకం నుంచీ అందరి అభిమానానికి నోచుకున్నాయి . కె. రామలక్ష్మి అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేవి ఆ కథలే. అవి ఇప్పుడు అందుబాటు లో లేవనుకుంటాను నాకు తెలిసినంతవరకూ. తర్వాతర్వాత ఆమె కథల నుంచి నవలా రచనలోకి మళ్ళారు.

అయితే ఆమె కథా రచనను మలుపు తిప్పిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని ఆమె ఒక చోట చెప్పుకున్నారు. రామలక్ష్మి మొదట్లో చిన్నచిన్న కథలు రాసే వారు. అయితే ఒక రోజు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వచ్చి “ ఈ గాజులు తొడిగించుకునే కథలు ఎన్ని రాసినా ఒకటే ! ఇవి తగ్గించి కొత్త పంథా తొక్కితే బావుంటుందేమో ఆలోచించు” అన్నారట. ఆ సలహాతో ఆమె “ పార్వతి కృష్ణమూర్తి” పాత్రలను సృష్టించి కొత్త స్త్రీపురుష లోకాన్ని సృజించారు. “ ఇప్పుడు నువ్వు దారి కనిపెట్టావు. ఇవి రాయి. చూడ ముచ్చటైన జంట అవుతారు. కుర్ర పఠితల మనసు తాకుతారు” అని ఆశీర్వదించారట. తన సాహిత్య జీవితాన్ని మలుపు తిప్పిన మల్లాది వారికి తానెప్పుడూ కృతజ్ఞురాలిగానే ఉంటానని ఆమె “పెళ్లి” అనే నవలకు రాసిన ముందు మాట లో చెప్పుకున్నారు. “ మల్లాది వారికి ఋణపడి ఉన్నాను. లేకపోతే ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఆత్మహత్యలు, లేచి పోవడాలు ఇవే రాస్తూ ఉండే దాన్నేమో” అని కూడా ఆమె రాసుకున్నారు. స్త్రీ వాదం అనే మాట వినపడక ముందే రామలక్ష్మి కథలలో పార్వతి తో సహా సుందరి లాంటి పాత్రలు కాలాని కంటే ముందుగా ఆలోచించి స్వతంత్రం గా నిలబడిన సందర్భాలను సృష్టించిన రచయిత్రి ఆమె.

ఆనాటి, ఈనాటి రచయిత్రి కె. రామలక్ష్మి మరణం తో మళ్ళీ అందరూ ఒక్క సారి గా ఆమె రచనలను గుర్తు చేసుకోవటం అవసరం. అభినందనీయం కూడా.

ఒకే ఒక్క రామలక్ష్మి !

కొంత మంది ఉంటారు, వాళ్ళ లాగే మరెవ్వరూ ఉండలేరన్నట్లు. ఎవరేం అన్నా పట్టించుకోనట్లు ఉంటారు. ఎవరిని ఏం అనాలన్నా జంకు,గొంకు లేకుండా మొహం మీద బోలెడు కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళను, ఇంకెవరూ ఏమీ అనలేకపోవటం కాదు. ఎవరేం అన్నా జానే దో అన్నట్లు వాళ్ళుంటారు.  ఇలాంటి కొంత మంది ఆడవాళ్ళ గురించి తెలుగు లో ‘గయ్యాళి గంపలు’ “నోటి దురుసు”లాంటి మాటలున్నాయి. రామలక్ష్మి గారి గురించి, ఈ మాటల  విశేషణాలతో కలిపి విన్నాను కొంత సాహిత్య ఊహ తెలిసిన పిల్ల వయసులో. దాదాపు ఇలాంటి పొగడ్తలతో వున్న మరో రచయిత్రి మా విజయవాడ లోనే కళ్లెదుటే కనిపించే వారు. ఒకరు లత. మరొకరు రామలక్ష్మి. వాళ్ళను చూడటం, వాళ్ళతో మాట్లాడటం చాలా ఫాసినేషన్ గా ఉంటుంది. రామలక్ష్మి ని  నేను రెండు,మూడు సందర్భాలలో కలిశాను. మన గురించి ఆమె ఏం అనుకుంటున్నారో, మనతోనే చెప్పగలిగిన ధైర్యశాలి. అందుకు ఆమె ను మెచ్చుకోవాలి.

అందరూ నడిచిన దారిలో నడవని ఇలాంటి రచయిత్రుల వ్యక్తిత్వం గురించి సమాజానికి చాలానే అభిప్రాయాలుంటాయి. వాటిని ధిక్కరించి వాళ్ళ మొహం మీదనే తిరిగి ఉమ్మేసేంత ధైర్యం ఉన్న రచయిత్రులు మన తెలుగు సాహిత్యం లో  వేళ్ళ మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మార్చి 3 వ తేదీ మరణించిన కె. రామలక్ష్మి.

రామలక్ష్మి గురించి ఇలాంటి మాటలు  వ్యాసంలో  రాయటం నాకేం సంతోషం కాదు. కానీ తప్పదు. నిజాయితీ గా మాట్లాడాల్సిన సందర్భం ఇది.





స్త్రీల గురించి చెప్పటానికి సభ్య సమాజం ( అది సాహిత్య సమాజం కూడా ) కి ఉన్న రెండు ముఖ్య ఉపకరణాలు వారి వైవాహిక జీవితం, రెండోది వారి శీలం లేదా బాహ్య ప్రవర్తన. రామలక్ష్మి, లత లాంటి వాళ్ళ విషయం లో ఇది బాగా నిరూపణ అయింది. రామలక్ష్మి ని రచయిత్రి గా చూడటానికి ముందు ఆమె ను ఆరుద్ర భార్య గా, భర్త ను ‘ అదుపు’లో పెట్టి పెత్తనం చెలాయించే వ్యక్తిగా చూడటం తో పాటు ఆమె “నోటి దురుసు తనం” గురించి మాట్లాడతారు. స్త్రీల గయ్యాళి తనం గురించి మాట్లాడగలిగే సమాజానికి, మగ మహానుభావుల తప్పుల గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఇటీవల కొద్ది కాలం క్రితం కొన్ని వీడియో ఇంటర్వ్యూల్లో  ఆమె చేసిన వివాదాస్పద వాఖ్యలతో  నేను కూడా వంద శాతం విభేదిస్తాను. కానీ రామలక్ష్మి  గురించి మొదటి నుంచికూడా ఇలాంటి మాటలతోనే మాట్లాడేవారు కానీ ఆమె సాహిత్యం గురించి మాట్లాడిన వారు తక్కువే.

శ్రీశ్రీ తాగుబోతు తనం గురించి, ఆయన వైవాహిక జీవితం గురించి బాహాటంగా తెలిసినా, ఆయన రచనల వైశిష్ట్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ ఆపలేదు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన సాహిత్య గౌరవ మర్యాదలకు ఏ మాత్రం ఆటంకం కాలేదు. కానీ స్త్రీల విషయం లో అలా జరగదు. ఎప్పుడూ వారి వ్యక్తిగత జీవితమే సాహిత్య సమాజానికి చర్చనీయాంశం అవుతుంది.

భార్య భర్తలిద్దరూ ( లేదా సహచరులిద్దరూ) రచయితలైతే, ఫలానా వారి భార్య గానే వారికి  గుర్తింపు తప్ప వారి రచనలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. శివరాజు సుబ్బలక్ష్మి గారికి మరణానికి కొద్ది కాలం క్రితం వరకూ, బుచ్చిబాబు గారి భార్య గానే గుర్తింపు. రామలక్ష్మి విషయం అందుకు మినహాయింపు కాదు. రామలక్ష్మి  మరణ వార్త కు మీడియా వెంటనే ఎన్నుకున్న శీర్షిక “ ఆరుద్ర సతీమణి కన్నుమూత”. తర్వాత దాన్ని మార్చుకున్నాయి. మొన్న మొన్నటి వరకు వికీ లో కూడా రామలక్ష్మి గురించి ఉన్న సమాచారం కేవలం ఆమె ఆరుద్ర భార్య అని మాత్రమే. నిడదవోలు మాలతి పూనుకొని దాన్ని మార్చారు.





రామలక్ష్మి ముందు చనిపోయి ఉంటే “ ఆరుద్ర కు సతీ వియోగం” శీర్షిక గా పెట్టి ఉండే వారు. ఆరుద్ర చనిపోయినప్పుడు “ రామలక్ష్మి కి భర్తృ వియోగం” అని పెట్టలేదు, పెట్టరు కూడా. ఎన్ని పోరాటాలు చేసినా,ఎన్ని ఉద్యమాలొచ్చినా సహచరికి, సహచరుడి పేరు ప్రఖ్యాతులతోనే గుర్తింపు, గౌరవం. ఎప్పటికీ ఆమె ఫలానా వారి భార్య నే.

ఇలాంటి రెండు నాల్కల ధోరణి మీద నే రామలక్ష్మి లాంటి రచయిత్రుల ధిక్కరింపు. చాలా మంది రచయితలు దొంగ చాటు గా మాట్లాడుకునే విషయాలను తప్పుకో, ఒప్పుకో రామలక్ష్మి బహిర్గతం చేశారు. అది శ్రీశ్రీ, ఆరుద్ర ల తగువు కావచ్చు. మరొకటి కావచ్చు. రామలక్ష్మి తాను ఎంపిక చేసుకున్న దారి లో నడిచారు. అది ముళ్ళ బాటే అయినా పూల బాట గా స్వీకరించారు. రామలక్ష్మి సాహిత్య వ్యక్తిత్వం, ఆమె రచనలు దాన్నే ప్రతిబింబించాయి. 60 ల నాటి తరం లో మరో రచయిత్రిని కోల్పోయాము. ఎప్పటిలాగానే, ఎవరైనా చనిపోయినప్పుడే వాళ్ళను , వాళ్ళ రచనలను గుర్తిద్దాము.ముఖ్యం గా రచయిత్రుల విషయం లో.

కల్పనారెంటాల

 

 

 

 

 

 

 
Real Time Web Analytics