నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, December 22, 2010

సారంగ వెబ్సైట్ ప్రారంభం!



మంచి సాహిత్యాన్ని పాఠకుల దగ్గరకు తీసుకెళ్ళాలన్న సదాశయం తో ప్రారంభించిన ప్రచురణ సంస్థ సారంగ. తెలుగు నేలకు దూరంగా బతుకుతున్నప్పటికీ తెలుగు సాహిత్యం గురించి మరిచిపోకుండా ఎంతో ప్రేమ తో, అభిమానం తో , ఎన్నో లక్ష్యాలతో మా స్నేహితుడు రాజ్ కారంచేడు ఈ “ సారంగ”కు శ్రీకారం చుట్టారు.

సారంగ పబ్లిషింగ్ సంస్థ మంచి రచయితల కోసం, మంచి పాఠకుల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అందుబాటు లో లేని పాత రచనలను పునర్ముద్రించాలనుకుంటోంది. ఇతర భారతీయ భాషలతో పాటు, ప్రపంచం లోని ఇతర దేశాలకు సంబంధించిన క్లాసిక్స్ ని, ఇప్పుడు ఆయా భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యాన్ని తెలుగు లో అందించాలన్నది సారంగ ప్రయత్నం. ఇది వినటానికి, చెప్పటానికి బావుంటుంది.కానీ ఆచరణ లోకి వచ్చేటప్పటికి ఎంత కష్టమో మీ అందరికి తెలియనిది కాదు. ఈ బృహత్కార్యం లో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు ఎలాంటి పుస్తకాలు చదవాలనుకుంటున్నారో సూచించండి. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటు లో లేని మంచి పుస్తకాల గురించి మాకు తెలియపర్చండి. వేరే భాష లో మీరేదైనా మంచి పుస్తకం చదివి దాన్ని తెలుగు లోకి అనువదించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. వీటన్నింటి తో పాటు మేము ప్రచురించబోయే మంచి పుస్తకాల్ని కొనుక్కొని చదవండి .

సారంగ కి సంబంధించి ఇవి ప్రాధమికమైన ఆలోచనలు. మీ సలహాలతో, సూచనలతో మరింత మెరుగుపరుచుకునే అవకాశం మాకు అందివ్వండి.

తెలుగు సాహిత్యాభిమానులకు సారంగ తొలి కానుక గా “ అనేక” ను అందిస్తోంది. అఫ్సర్, వంశీకృష్ణ ల సంపాదకత్వం లో , 2000 నుంచి 2009 వరకు వచ్చిన తెలుగు కవిత్వంలోని మౌలికమైన మార్పులకు ప్రతిబింబంగా దాదాపు 200 కవితల సంకలనం “ అనేక” త్వరలో మీ ముందుకు రానున్నది. www.saarangabooks.com సందర్శించి మీ ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలు, మీ సలహాలు, సూచనలు, మీ అభిమాన పుస్తకాల జాబితాలు మాకు అందచేయండి.

Tuesday, December 21, 2010

మనవి మాటలు!



‘ అయిపోయింది’ అన్న అయిదు అక్షరాల్ని కలిపి రాసేటప్పటికి మనసంతా బెంగ గా , ఏదో తెలియని ఉద్వేగంగా అనిపించింది.
ఎనిమిది నెలలుగా నన్ను కదిలించి, కవ్వించి, మరిపించి, మురిపించి, అబ్బురపరిచి, ఓ విధమైన ఆవేదనకు గురిచేసిన నా పాత్రలన్నీ నన్ను వదిలివెళ్లిపోతాయెమో అనుకోగానే ఇదీ అని చెప్పలేని ఒక భావం నా గుండెనంతా నింపేసింది. పాత్రలు రక్త మాంసాల కొత్త జీవం తో నా లోపలకు ఎలా నడిచి వచ్చాయో అలాగే వెళ్లిపోతాయనీ, వెళ్లిపోవాలని కూడా తెలుసు. అయినా వాటి మీద ఏదో ఒక మమకారం. వాటితో ఇదీ అని చెప్పలేని పెనవేసుకుపోయిన బంధం.

తన్హాయి రాయాలని ఆలోచించినప్పుడు కల్హార, కౌశిక్, చైతన్య, మృదుల కొన్ని పాత్రలు. కానీ కథ మొదలుపెట్టాక పాత్రల్లో జీవం పోసుకుంది. వారు నవలలో ఓ నాలుగు పాత్రలుగా మిగిలిపోలేదు. నాతో సహా చదివిన ప్రతివారు, ఎవరికి వారు వారిలో తమని తాము చూసుకున్నారు. తమకు తెలిసిన వారిని వెతుక్కున్నారు. తమ చుట్టూ జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనల్ని, సన్నివేశాల్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు బాధపడితే పాఠకులు అయ్యో అని సానుభూతి ప్రకటించారు. వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాలని చూశారు. మంచేదో, చెడేదో చెప్పే ప్రయత్నం చేశారు. కొందరు తమ వ్యక్తిగత జీవితం లోని సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఉద్వేగంగా కామెంట్లు పెట్టారు,మెయిల్స్ పంపారు. ఇంకొందరు ప్రపంచం అంతా సుభిక్షంగా, పెళ్ళిలన్నీ వెయ్యేళ్ళు వర్ధిల్లుతుంటే నేను ఇలాంటి నవలలు రాస్తున్నానని కత్తులు దూశారు.

ఇలా నా పాఠకులు, ఆ పాఠకులతో నా సంభాషణ, వారి ఆలోచనలు, వారి తర్కాలు, వారి సందేహాలు, వారి సమర్థనలు ఇవన్నీ నాలో ఒక కొత్త వూపిరిని , సరి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. అనేకరకాలుగా తన్హాయి రాయటం నాకొక కొత్త అనుభవాన్ని, అనుభూతిని అందించింది.

ఇది నా మొదటి నవల. మామూలుగా నవల రాయటం వేరు. బ్లాగ్ లో ఎప్పటికప్పుడు, ఏ వారానికి ఆ వారం ఏ భాగానికి ఆ భాగం రాయడం వేరు. ఒక పత్రికలో ఒక సీరియల్ అచ్చు కావటం వేరు, అక్కడ రీడర్స్ రెస్పాన్స్ కొన్ని ఉత్తరాలకు పరిమితం. కానీ బ్లాగ్ లో నవల ద్వారా నా పాఠకులు నాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంభాషించే వీలు ఉంది. అందులో అర్థం చేసుకోవటం ఉంది, అపార్థం చేసుకోవటం కూడా ఉంది.
ఒక వారం ఆలస్యమయితే అలిగారు, అడిగారు, తొందరపెట్టేశారు. నచ్చినప్పుడు ఆహా, వోహోఅన్నారు, నచ్చనప్పుడు పెదవి విరిచి చెప్పేశారు. మొహమాటాలు, ముఖస్తుతులు లేవు. నవల ని నవల గా చదివారు.నవల లోని పాత్రల్ని తమ కు తెలిసిన మనుష్యులతో, తమ చుట్టూ వున్న సమాజం తో పోల్చి చూసుకున్నారు. వారిని తమ కుటుంబం లో ఒకరిగా అక్కున చేర్చుకున్నారు. వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని భయపడ్డారు, ప్రమాదాలు కొద్ది లో తప్పిపోయినప్పుడు అమ్మయ్యా అని వూపిరి పీల్చుకున్నారు. పాత్రల ఆలోచనలు తప్పుగా అనిపిస్తే చర్చించారు. కొత్తగా అనిపిస్తే స్వాగతించారు. కొత్త ప్రతిపాదనలో, కొత్త ఆలోచనలో కనిపిస్తే ఆగి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా నవల రాసిన నాకే కాకుండా, ఇది చదివిన వాళ్ళకు కూడా ఒక మంచి " ఎక్సర్సైజ్" అయింది.
తన్హాయి నవల ఇతివృత్తం భిన్నమైనది. సమాజం లో మన చుట్టూ రోజూ కనిపించే, వినిపించే అనేకానేక సంఘటనల నుంచి తీసుకొని రాసినదే తప్ప ఇందులో ప్రత్యేకంగా నవల కోసం నేను సృష్టించి రాసినది ఏదీ లేదు. మీకు నచ్చినా, నచ్చకపోయినా రెండింటికి అదే కారణం.
ఈ నవల రాయటం లో రచనాపరంగాఎన్నో సాధక బాధకాలు . ఏ భాగానికి ఆ భాగం రాయడంవల్ల కొన్ని సాంకేతికపరమైన పొరపాట్లు దొర్లి వుండవచ్చు. అలాంటివి ఏమైనా వుంటే నేను త్వరలోనే సరిదిద్దే ప్రయత్నం మొదలుపెడతాను.

నవల రాయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీలో అనేకమందికి ఇప్పటివరకూ వున్న అనేకానేక సందేహాలను చర్చ కు పెట్టండి. అయితే అది మీరు ప్రశ్నలు అడగటం, నేను చెప్పటం అన్న పద్ధతి లో కాకుండా... కలిసి మాట్లాడుకుందాము. రాయటం ద్వారా నేను చెప్పాల్సింది చెప్పేసాననే అనుకుంటున్నాను. అయితే మీ అందరి చర్చల్లో ఒక రచయిత గా నా వైపు నుంచి ఏవైనా తప్పనిసరిగా చెప్పాల్సిన అంశం వుంటే నేను మాట్లాడతాను. లేకపోతే..మీరందరూ మాట్లాడుతుంటే నేను ముందు వినదల్చుకున్నాను. మరింత లోతుగా మీ అభిప్రాయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను.

తన్హాయి చదివాక అనేక మంది పాఠకులు కామెంట్ ఏం రాయాలో తెలియక ఆగిపోయామనేవారు. ఇప్పుడు నవల మొత్తం మీ చేతిలో వుంది. ఎవరెవరు ఎందుకు ఎలా ప్రవర్తించారు అన్న దాని మీద మీ అవగాహనను, మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని ఇక్కడ పంచుకోండి. మీ విశ్లేషణలు, మీ విమర్శలు ( నవల నచ్చినా, నచ్చకపోయినా సరే) నాకు ముందుగా మెయిల్ చేస్తే కామెంట్ గా కాకుండా తూర్పు-పడమర లో బ్లాగ్ పోస్ట్ గా ప్రచురించే ఉద్దేశం ఉంది. మీ మీ బ్లాగ్ ల్లోనే తన్హాయి మీద ఏమైనా పోస్ట్ లు రాస్తే దయచేసి ఇక్కడ ఒక లింక్ ఇస్తే....తన్హాయి కి సంబంధించిన చర్చ అంతా ఒకే చోట లభ్యమవుతుంది.

ఇన్ని నెలలుగా ఈ తన్హాయి రచనలో పడి స్నేహితులకు మెయిల్స్ ఇవ్వటం ,ఫోన్లు చేయటం తగ్గిపోయింది. కొందరు విసుక్కున్నారు.. మరి కొందరు నొచ్చుకున్నారు. మా అమ్మ లాంటి వాళ్ళు నాలుగు అక్షింతలు కూడా వేశారు. నా పుస్తక పఠనం,మిగతా వ్యాపకాలు అన్నీ మూలాన పడ్డాయి. అయినా సరే, నా మీదున్న ప్రేమతో, స్నేహం తో..నా పరిస్థితి ని అర్థం చేసుకొని సహకరించిన సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ...ముఖ్యంగా నా మీద నమ్మకంతో ఈ నవల ను మొదటి నుంచి చదివి ఇంత గొప్ప ప్రోత్సాహాన్ని,మీ ఆదరాభిమానాల్ని నాతో పంచుకున్న పాఠకులకి నా ధన్యవాదాలు. మీరందరూ నా పక్కన లేకపోతే ఈ నవల రాసి ముగించటం నావల్ల అయ్యేది కాదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

మీ
కల్పనారెంటాల
డిసెంబర్ 16, 2010.
 
Real Time Web Analytics