నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label జ్నాపకాలు. Show all posts
Showing posts with label జ్నాపకాలు. Show all posts

Sunday, June 21, 2015

పితరౌ వందే !

ఆది గురువు లాంటి తండ్రి ని తల్చుకోవటానికి ప్రత్యేకంగా రోజులు అక్కరలేదని తెలిసినా, ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు పత్రిక కోసం నేను రాసిన చిరు వ్యాసం.




పితరౌ వందే !
ఒక వ్యక్తిగా , ఒక రచయిత గా నా మీద మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారి  ప్రభావం ఎంతగానో ఉంది. నాకు ఉహా తెలిసేనాటికే మా నాన్నగారు ప్రసిద్ధ రచయిత. ఆయన ఒక తండ్రిగా కంటే ఒక రచయిత గానే నాకు ఎక్కువ తెలిసినట్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది. ఆయన తన పిల్లల్ని చిన్నతనం నుంచే ఒక మంచి రచయిత, లేదా మంచి పాఠకులు అయ్యేలాగా పెంచారు. ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి,ఎందుకు చదవాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి లాంటి విషయాలను చాలా చక్కగా, ఓపికగా వివరించేవారు. అది మాకు నిత్యజీవితం లో మామూలు చదువులకు, సాహిత్య పఠనానికి రెండింటికీ ఉపయోగపడింది.
ఒక రచయితకు సాహిత్యం పట్ల ఎలాంటి నిబద్ధత ఉండాలో దాదాపు 200 పుస్తకాలు రాసిన  మా నాన్న గారిని చూసి నాతొ సహా, ఈ తరం రచయితలందరూ తప్పక నేర్చుకోవాల్సిన జీవన పాఠం .
 ఆయనకు రచన ఒక passion. ఒక తపస్సు.  ప్రతి రోజూ ఉదయం నియమంగా క్రమం తప్పకుండా రాసేవారు. జర్నలిస్ట్ గా తీవ్ర పని ఒత్తిడుల మధ్య కూడా ఆయన అన్ని పుస్తకాలు రాయగలిగారంటే ఆయనకు సాహిత్యం పట్ల ఉన్న ప్రేమ, ఆయనకు అందులో ఉన్న ప్రావీణ్యం రెండూ అర్థం చేసుకోవచ్చు. ఇవాళ, రేపు అలాంటి రచయితలు మనకు కనిపించటం లేదు.  కేవలం బుద్ధి పుట్టినప్పుడు రాయడం, డబ్బు కోసమో, కీర్తి కోసమో రాయటమో కాదు ఆయన  చేసినది. ఆయనకు  రచన ఒక  సామాజిక బాధ్యత గా కూడా అర్థమయింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో,ఎలా రాయాలో తెలిసి ఆ పని చేసారు. ఒక రచయితగా  కేవలం రాయటం మాత్రమే కాకుండా, తప్పనిసరిగా ప్రతి రోజూ ఏదో ఒక పుస్తకం  చదివేవారు. భారతీయ భాషల సాహిత్యం తో పాటు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ లాంటి ఇతర దేశాల సాహిత్యం కూడా చదివి ఆకళింపు చేసుకొని వాటిని అనువాదం చేసేవారు. మా నాన్నగారి తరం లో వచ్చినన్ని అనువాదాలు ఇప్పుడు రాకపోవటం ఒక విషాదం.
మా ఇంట్లో మాకున్న అతి విలువైన ఆస్తి రెండు పెద్ద బీరువాల్లోని  పుస్తకాలు. చదవటానికి పిల్లలకు ఒక్కో పుస్తకం మాత్రమే ఇచ్చేవారు. అది చదివి, అర్థం చేసుకున్నాకే మరొక పుస్తకం తీసుకోవాలనే నిబంధన పెట్టారు. దానివల్ల మాకు పుస్తకాల విలువ, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం రెండూ అర్థమయ్యాయి. పుస్తకాలు చదివాక వాటి గురించి  ఆయన తో చర్చించటం వల్ల రచనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలిసేది. ఇలా రచయితలకు, పాఠకులకు  ఉండాల్సిన లక్షణాల్ని ఆయన చిన్నతనం నుంచే మాకు నేర్పించారు. రచయితలు గా, జర్నలిస్టు లు గా  స్థిరపడింది మా పెద్దన్నయ్య జూనియర్ రెంటాల,  నేను, మా తమ్ముడు జయదేవే బయట ప్రపంచానికి తెలిసినప్పటికీ మిగతా పిల్లలందరూ కూడా మంచి పుస్తకాలు  చదువుతారు, వాటి గురించి విశ్లేషణాత్మకం గా మాట్లాడతారు.
ఆయన ఏ రోజూ తన రచనలకు ఇంత కావాలని అడిగి తీసుకోలేదు. పబ్లిషర్ ఇచ్చేది అతి చిన్న మొత్తమే అయినా కూడా ఆయన ఏ రోజూ బాధపడలేదు. ఇంత కావాలని బేరం పెట్టలేదు. సరస్వతి ని అమ్ముకోవటం తప్పని బాధపడేవారు. అందువల్లే పబ్లిషర్ ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఒక్కో పుస్తకం ఎన్ని ముద్రణలు జరిగినా పబ్లిషర్ నుంచి అదనపు పారితోషకం అడగలేదు. కనీసం తనకంటూ కొన్ని పుస్తకాలు కూడా అడిగి తీసుకునేవారు కాదు. అందుకే ఇవాల్టికి మా దగ్గర మా నాన్నగారి పుస్తకాలు మొదటి ముద్రణలే చాల శిథిలావస్థ లో ఉన్నాయి. కాకాపోతే తను రాసిన ప్రతి రచన పదిలంగా దాచి ఉంచేవారు. అంత పెద్ద రచయిత జీవితపు చరమాంకం లో కవిత్వ పుస్తకం కూడా సొంతంగా వేసుకునే ఆర్ధిక స్థోమత లేక కన్నుమూసారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన గురించి ఎన్నో విషయాలు, ఒక రచయిత గా నేను , నాతొ పాటు ఈ తరం రచయితలందరూ తెలుసుకొని ఆచరించాల్సినవి. సాహిత్య రచన అనేది మనం జీవించటానికి ఒక కెరియర్ కాదు. అది మనల్ని జీవింప చేసే ఒక ప్రాణవాయువు. ఆయన జీవితం ద్వారా నేను తెల్సుకున్న జీవిత సత్యం ఇదే.
--కల్పనారెంటాల 


Saturday, September 03, 2011

'నండూరి' సంస్మరణ లో !

సుప్రసిద్ద పత్రికా సంపాదకుడు , రచయిత, కవి, అనువాదకుడు నండూరి రామ్మోహనరావు గారు రెండు వారాలుగా తీవ్ర అస్వస్థత తో వున్నారన్న వార్తలు వింటూనే వున్నా, ఆయన మరణం తో నిన్నటి రోజంతా ఆయన జ్నాపకాల తలపోత తో గడిచిపోయింది.
నా జర్నలిజం కెరియర్ లో తొలుత నేను పని ప్రారంభించినది నలుగురు అగ్ర శ్రేణి పత్రికా సంపాదకుల దగ్గర కావటం నా అదృష్టం. ఆంధ్ర జ్యోతి వార పత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహన రావు, స్వాతి సపరివార పత్రికాధినేత వేమూరి బలరాం, ఆంధ్రభూమి సంపాదకుడు ఏ.బి.కె. ప్రసాద్ ల దగ్గర నా జర్నలిజం వృత్తి మొదలయింది. ఫ్రీలాన్సు జర్నలిస్టు గా కెరియర్ ప్రారంభించటం తో మొదటి ముగ్గురి దగ్గర ఏక కాలం లో పని చేశాను. అది 1985-86 మధ్య కాలం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూకూడా లీడింగ్ లో వుండేవి. నేను జర్నలిజం రంగం లోకి రావటానికి కారకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఒకమీటింగ్ కి నేను వ్యాఖ్యాత గా వ్యవహరించినప్పుడు ఎంతో ప్రేమగా వచ్చి పలకరించి, రేపు ఆఫీస్ కి వచ్చి కనిపించుఅన్నారు.సరే అని వెళ్ళి కనిపిస్తే ' మాకు కాలమ్ రాస్తావా?' అని అడిగారు. అలా జర్నలిజం లో నా రంగప్రవేశంనేరుగా ఒక ప్రసిద్ధ వార పత్రిక లో ' టీవీ సమీక్ష ' కాలమ్ తో మొదలయింది. అది చూసి నండూరి వారు తన ఆఫీస్ కిపిలిపించారు. విజయవాడ లో జరిగే అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నండూరి వారిని అనేక సార్లు అంతకు ముందు చూసినప్పటికీ ఆయన దగ్గర పని చేయటానికి గాను మొదటి సారి వెళ్ళి ఆయనను కలుసుకోవటం మాత్రం మర్చిపోలేని సంఘటన. ఆంధ్రజ్యోతి వారపత్రిక లో నా కాలమ్ చూసి, బాగా రాస్తున్నావని మెచ్చుకొని మాకు కల్చరల్ రిపోర్టింగ్ చేస్తావా? అని అడిగారు.
అలా ఆయన దగ్గర ఆంధ్రజ్యోతి దిన పత్రిక కోసం విజయవాడ లో జరిగే సంగీత, సాహిత్య, నృత్య, నాటక
కార్యక్రమాలకు హాజరై వాటి మీద సమీక్షలు రాసి అందచేసేదాన్ని.
నండూరి చాలా మితభాషి. మాటలోనూ, రాత లోనూ కూడా అనవసర వాక్యం కానీ, వ్యాఖ్య కానీ వుండదు. అందుకే
నండూరి దగ్గర మాట్లాడటమంటే అప్పట్లో భయం గా ఉండేది. కానీ పురాణం , నండూరి వారికి పూర్తి వ్యతిరేకం.
పురాణం వారు మంచి హాస్య చతురులు. మనతో చాలా ప్రేమ గా, ఆప్యాయంగా వుండటంతో పాటు బోలెడు జోకులు
వేస్తారు. ఆయన మన దగ్గర ఫ్రీ గా మెలుగుతారు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడటానికి మనకు కూడా ఎలాంటి సంకోచాలు వుండవు.
నేను నండూరి తో ఎక్కువ సేపు గడిపింది 1998 లో ఆయనకు అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ తరఫున 'ప్రతిభా
మూర్తి' జీవిత పురస్కారాన్ని రాజమండ్రి సభలో అందచేసినప్పుడు మాత్రమే. ఆయనకు అవార్డు అందచేసిన ఆ
సభలో ఆయన పరిచయ, సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నాను. నండూరి , వారి సతీమణి తో అప్పుడు రాజమండ్రి లో గడిపిన ఆ నాలుగు రోజులతో వ్యక్తిగతంగా వారు మరింత ఆత్మీయులయ్యారు.

నేనూ-నండూరి 'టాం సాయర్'
ఇదంతా వ్యక్తిగత పరిచయం. కానీ ఓ రచయితగా నండూరి మొదట తెలిసినది మాత్రం ' టామ్ సాయర్ ' తోనే.టాంసాయర్, హకిల్బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, టాంసాయర్ ప్రపంచయాత్ర,కాంచనద్వీపం లాంటి పుస్తకాలు
ఎంతో ఇష్టం గా చదువుకున్న చిన్న నాటి జ్నాపకాలు ఎంత పెద్ద అయినా మనల్ని వదలవు. అన్నింటికంటే
నాకు బాగా నచ్చినది ' టాం సాయర్'. నిజంగా ఆ పుస్తకం అప్పట్లో తెలుగు అనువాదం చదివి వుండకపోతే అసలు
మార్క్ ట్వేయిన్ లాంటి రచయిత తెలుగు పిల్లలకు పరిచయమయ్యే అవకాశమే లేదు. అది కదా అనువాదం లోని
గొప్పతనం. టాం సాయర్, హాకిల్ బేరీ ఫిన్ లాంటి రచనలతో పెరగని బాల్యం ఒక బాల్యమే కాదు అని చెప్పవచ్చు.
టాం సాయర్ చదివి ఆహా, వొహో అని మురిసిపోవటం ఒక ఎత్తు. నా కిష్టమైన ఆ రచనను మనకిష్టమైన రేడియో
నాటకం గా వినటం మరో ఎత్తు. ఆ నాటకం లో ఒక పాత్ర పోషించే మంచి అవకాశాన్ని నాకు అందచేసి నన్ను
మొదటి సారి రేడియో స్టేషన్ లో అడుగుపెట్టేలా చేసింది మా ఏల్చూరి మురళి. అప్పటి దాకా రేడియో లో ఆయన
గొంతు విని విపరీతంగా అభిమానం పెంచేసుకున్న ' రామం' అన్నయ్య ని కలుసుకొని ఆయన ఆధ్వర్యం లో
సంభాషణ లు ఎలా పలకాలో నేర్చుకున్న ఆ తీపి జ్నాపకం తల్చుకున్న ప్రతి సారీ నన్నోక పసిపిల్ల గా
మార్చేస్తుంది. ఆ నాటకం సందర్భంగా ' రామం' ని, ప్రయాగ రామకృష్ణ ని కలుసుకోవటం , ఆ తర్వాత అదే రేడియో
స్టేషన్ లో వారితో కలిసి పని చేయటం నేను కల లో కూడా వూహించని విషయాలు. వారం వారం రేడియో లో ' టాం
సాయర్' శ్రవ్య నాటిక ( మేము నటించినది) ప్రసారమవుతున్నప్పుడు చెవులొగ్గి విని , మళ్ళీ ఒక సారి ఎవరికి వాళ్లమే
' టాం సాయర్' అయిపోయినట్లు వూహాలోకం లో విహరించేవాళ్లం. ఆ నాటకం లో పాల్గొన్నందుకు నాకు పారితోషికం
కూడా అందచేశారు. నేనందుకున్న ఆ చెక్ నా తొలి సంపాదన. నండూరి వారి టాం సాయర్ తెలుగు
అనువాదానికి ఆ రేడియో నాటిక అనుసరణ. దానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంభాషణ లు రాశారు. ఇలా
నండూరి వారి ' టాం సాయర్' పసి తనం నుంచి నా జీవితం లో కొన్ని ప్రధాన ఘట్టాలకు నాందీవాచకమయింది.
( రామం అన్నయ్య గురించి, టాం సాయర్ శబ్ద నాటకం గురించి మరిన్ని విశేషాలు తృష్ణ రాసినది ఇక్కడ చదవండి)

' అమ్మో ఫిలాసఫీ' అనే భయాన్ని పోగొట్టిన ' విశ్వ దర్శనం'

పసి తనం లో ' టాం సాయర్' ' రాజు-పేద' పుస్తకాల రచయిత గా తెలిసిన నండూరి తర్వాతర్వాత ఒక
సంపాదకీయుడిగా అర్థమయ్యారు. ఆయన సాహిత్య సంపాదకీయాల ద్వారా ప్రముఖ సాహితీవేత్తలెందరి గురించో
తెలుసుకునే వీలు కలిగింది. అన్నింటికంటే నాకు బాగా నచ్చినది ఆయన ' విశ్వ దర్శనం'. 'అమ్మో ఫిలాసఫీ నా '
అన్న భయాన్ని, అది మనకు కోరుకుడు పడని, అవసరం లేని సబ్జెక్టు అన్న అనవసర దురభిప్రాయాన్ని రెండింటిని
ఏక కాలం లో పోగొట్టగలిగిన రచన అది. ' విశ్వ దర్శనం' అప్పట్లో 1980-87 మధ్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో
ధారావాహికగా వచ్చేది. అమ్మబాబోయి ఫిలాసఫీనా అనుకునేవారిని ఆహా ఫిలాసఫీ అనిపించేలా మారుస్తుంది ఈ
పుస్తకం . పేరు చూసి విజ్నాన శాస్త్రమేమో ( సైన్సు) అనుకున్నాను. ఇది తత్త్వ విజ్నానమని చదువుతుంటే
అర్థమయింది. చాలా క్లిష్టమైన విషయాన్ని కూడా సరళంగా, సూటిగా ,అర్థమయ్యేలా రాయగలగటం నండూరి
ప్రత్యేకత. తత్త్వ శాస్త్రం లో ఆసక్తి వున్న వారు చదవగలరు కానీ ఆ విషయ పరిజ్నానం , ఆసక్తి లేని వారిని కూడా
చదివింపచేసి దాని పట్ల అభిరుచి, అనురక్తిని పెంచగలిగే రచన ఇది. అందుకు నండూరి ఎంచుకున్న రచనావిధానం
కారణమన్నది నిర్వివాదాంశం. విశ్వదర్శనం ( మొదటిభాగం) పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత దర్శనం. రెండో భాగం
భారతీయ తత్త్వ చింతనా రచన. అసలే ఫిలాసఫీ, పైగా పాశ్చాత్య తత్త్వశాస్త్రం అనగానే భయమో, బోరుగా
ఉంటుందేమో అన్న చిన్న అనుమానం మొదట కలగటం సహజం. ఆ విషయం ఆ రచన ప్రారంభించటానికి ముందే
నండూరి కి తెలుసు. అందుకే ఆయన భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. పాశ్చాత్య తత్త్వ శాస్త్ర పరిచయాన్ని
కేవలం సిద్ధాంతం ద్వారా చెప్పకుండా దార్శనికుల ద్వారా చెప్పారు. కేవలం దార్శనికుల సిద్ధాంతాల పరిచయానికే
కట్టుబడకుండా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓ కథ లాగా మధ్యలో కలగలిపి చెప్పారు. అలా చెప్పటం వల్ల
విషయం సులభంగా అర్థమవటమే కాకుండా చాలా సాఫీ గా సాగిపోయింది. పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత పరిచయ
ఉపోద్ఘాతం ఆయన రాముడు ,వశిష్టుడు వారి దగ్గరకు వెళ్ళి యోగవాశిస్ఠమ్ చెప్పించుకునే పరిచయం తో
ప్రారంభించారు. అలా అవాకాశం దొరికినప్పుడల్లా మనకు తెలిసిన భారతీయ తత్త్వ సిద్ధాంత ఉదాహరణలతో
చెప్పటం వల్ల పాఠకుడి కి అదేదో అసలు తమకు సంబంధం లేని విషయం అని ఏ మాత్రం అనిపించదు. పైగా నండూరి
ది ఒక ప్రత్యేకమైన సున్నితమైన హాస్యం. అది మనకు ఆయన రచనలన్నింటిలోనూ కనిపిస్తూఉంటుంది. దాని వల్ల
కూడా అంత సీరియస్ విషయాన్ని కూడా పాఠకుడు చాలా హాయిగా చదివి అర్థం చేసుకోగలుగుతాడు. సోక్రటీస్ '
సింపోజియం ' గురించి రాసినప్పుడు అగాథాన్ అందరికీ మద్యం అందిస్తున్నాడు అని మామూలుగా రాయకుండా '
మధ్య మధ్యే పానీయం సమర్పయామి' అన్నట్లు అందరికీ మద్యం పోశాడు అని రాశారు. పూజా తంతు లోని ఒక
చర్య ను నండూరి ఆ సందర్భం లో వాడినప్పుడు పాఠకుడికి ఆ సీన్ కళ్ల ముందు కదిలి పెదవులపై ఒక హాస్య రేఖ
మెరిసే వీలుంది.
అలాగే సోక్రటీసు, ప్లేటో ల మధ్య గురు శిష్య సంబంధాన్ని చెప్పేందుకు ఆయన వాడిన పోలిక వారిద్దరూ రామకృష్ణ
పరమహంస, వివేకానందుడు లాంటి వారు అని. ఆ ఉదాహరణ ఒక్కటి చాలు సోక్రటీస్, ప్లేటో ల సంబంధాన్ని సరిగ్గా
అర్థం చేసుకునేందుకు. ఇలా నండూరి ఆ వ్యాసాలు కదళీపాకం లా వుండేందుకు కావల్సిన అన్నీ
జాగ్రత్తలు ఇంత శ్రద్ధగా తీసుకోవటం వల్లనే ' విశ్వ దర్శనం' మామూలు పాఠకుడి హృదయం లోకి చేరి అక్కడ అలా
నిలిచిపోయింది . తత్త్వ శాస్త్రం లో విషయం కన్నా ముందు ఆ పరిభాష అర్థమవటానికి కొంచెం కష్టపడాలి.
ఆ విషయాన్ని ముందే అర్థం చేసుకున్న నండూరి ప్రతి తెలుగు అనువాదానికి ఇంగ్లీష్ పదాన్ని కూడా బ్రాకెట్ లలో
ఇచ్చి, పుస్తకం గా వేసినప్పుడు మొత్తం పారిభాషిక పదాల లిస్ట్, ఆసక్తి మరింత వుంటే లోతైన విశ్లేషణ కోసం
చదవాల్సిన పుస్తకాల జాబితా కూడా అందచేశారు. ఈ రకంగా ఒక పాఠకుడు ఒక రచన ను చదివి అర్థం
చేసుకోవాలంటే ముందు రచయిత ఏమేం చేయాలో అవన్నీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతో నండూరి చేసి
పెట్టడం వల్ల ' విశ్వ దర్శనం' నేరుగా పాఠకుడి కి చేరవలసిన పద్ధతి లో సులువు గా చేరింది. అప్పట్లో ఆ ధారావాహిక
కు, తర్వాత పుస్తకం గా వేసినప్పుడు కూడా మంచి పేరు లభించింది. మొత్తంగా ఆ సీరియల్ పూర్తయ్యేటప్పటికి (
ఏడేళ్ళ సుదీర్ఘ కాలమనుకోండి) నాలాంటి కొందరికీ తప్పనిసరిగా ఫిలాసఫీ అన్న బెరుకు పోయి ఉంటుంది. ఆయన
ఆ రచన రాసిందే అందుకు. ఆ విషయం లో ఆయన కృతకృత్యులయ్యారు. ఒక రచయిత గా తాను
రాయవలసినవన్నీ రాసేసి ,తరతరాల తెలుగు వారికోసం 'విశ్వదర్శనా'న్ని అందించిన 'నరావతారం' నండూరి
శాశ్వత నిద్ర లోకి జారుకున్నారు. ఇప్పుడు మేల్కొనాల్సింది ఆయన రచనలు చదవకుండా నిద్రాణమైనవారు.

కల్పనారెంటాల

Monday, July 18, 2011

ఓ నాన్న!...ఓ సాహితీ తపస్వీ!




( మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా మా తమ్ముడు జయదేవ రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది.దాన్ని ఇక్కడ చూడగలరు. నిజానికి ఈ వ్యాసం మా తమ్ముడి ఇష్టపది బ్లాగు లో రావాల్సింది. కానీ జయదేవ ప్రయాణం లో ఉండి నెట్ కి దూరం గా వుండటం తో నేను ఇక్కడ పంచుకుంటున్నాను)

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే! ఆ గది ఓ ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాంకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , ' బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.
ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది. గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడ కు వచ్చేశారు. ' పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట ' రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75 వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.
నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--' ఎర్ర జెండాల ' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో ' ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న ' జయంతి పబ్లికేషన్స్ ' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండ లు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం ( అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశం లో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమ గా కొనసాగిన కాలం లో ఆయనకు సహచరులు, సహవ్రతులు.
నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గం లో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే ' సినిమా పేజీ ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం . ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు .( రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80 ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు). ' పంచకళ్యాణి- దొంగలరాణి', ' కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే. సాయంత్రం సినిమా సభ లో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన ' దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు. చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్ష ను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు ' బాలజ్యోతి' మాస పత్రిక లో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడి గా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్యనూ ( రెంటాల సత్యనారాయణ) మా అక్కయ్యను ( కల్పనా రెంటాల), నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.
నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ , పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు --ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ' రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, ' అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గది లో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజం లోకి తలుపులు తెరిచాయి.
గమ్మత్తేమిటంటే, నరసరావు పేట లో ' నవ్య కళా పరిషత్' వారి ' నయాగరా' ( అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన ' కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన ' సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన ' సర్పయాగం' కవితా సంపుటాలు, ' శిక్ష ', ' ఇన్స్పెక్టర్ జనరల్', ' అంతా పెద్దలే ' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు. " అమ్మా! ఉమా ! రుమా! హీరోషిమా! విలపించకూ పలపించకూ..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టి ని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవిత ను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబం లో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి ' అరసం ' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, ' నవభారతి' పత్రిక కు ' మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వానాథ ను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు ' ఆంధ్రప్రభ' దినపత్రికలో ' వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు ' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారం లోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యం లో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకే వెళ్ళిపోయారు.
నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాత్తమ్ సంపాదకత్వం లో గుంటూరు నుంచి వచ్చిన ' దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య ' నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వం లో ' ఆంధ్రప్రభ ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు. సమాజాన్ని సరైన దోవ లో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి--ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ' స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా ' ఆంధ్ర ప్రభ' ' స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.
నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం ' శివధనువు ' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18 న కీర్తి శేషులయ్యారు. ఆ పైన ' శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.
' అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకం లో మేము ' నవగ్రహాలు' అన్న మాట! ( చిన్న తనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యం లో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.
నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ-- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ --ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.
అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్గానే, ' ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. ' ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పనా కవిత లో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

Monday, September 27, 2010

ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా?

" గుర్తుకొస్తున్నాయి " శీర్షికన ఏమైనా రాయమని అడిగారు ప్రమదావనం ప్రమదలు. ఏం గుర్తుకొస్తున్నాయి? ఏం రాద్దాం? అనుకుంటూ ఒక కప్పు కాఫీ పెట్టుకుందామని వంటింటి లోకి వెళ్ళగానే దేని మీద రాయొచ్చో ఒక అవుడియా వచ్చేసింది. అమ్మాయిలకు వంటింటి లోకి వెళ్ళగానే అమ్మ గుర్తుకు వస్తుంది. నాకు మాత్రం మా నాన్న గుర్తుకు వస్తారు. నన్నూ, నా వంటింటి ని అంతంగా ప్రభావితం చేసిన ఆయన మహోపకారం కూడా గుర్తుకువస్తుంది.


నేను టెన్త్ లోనో,ఇంటర్ లోనో వున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారితో సంఖ్యాశాస్త్రం నుంచి సాహిత్యం దాకా సవాలక్ష విషయాల్లో సందేహాలను అడుగుతున్న సమయాన మా అమ్మ వచ్చి " ఎప్పుడూ చూసినా మీ నాన్న తో కబుర్లేనా? వంటింటి లోకి రా, కనీసం కూరలు తరిగి పెడుదువు గానీ!” అంటూ ఆర్డర్ పాస్ చేసింది.

అప్పుడు నా పితృదేవుడు మా అమ్మ ఆర్డర్ ని ధీటుగా ఎదిరించి " ఛత్ నా కూతురికి వంట నేర్చుకునే ఖర్మెమిటి? దానికి నేను పెట్టిన పేరేమిటి? నువ్వు చెయ్యమంటున్న పనులేమిటి? అరిసెలు వత్తడం ఎవరైనా చేస్తారు. నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ మంచి పుస్తకాలు చదవడం, రాయడం అందరికీ వచ్చే విద్య కాదు. " అంటూ ఎదురు క్లాస్ తీసుకుంటే మా అమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి లోపలకు వెళ్ళిపోయింది.



అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ రాయటం ఏదో కష్టపడి నేర్చుకుంటే వంట చెయ్యక్కరలేదనుకున్నాను. అలా మొదలైంది నాలో రాయాలన్న తపన..తృష్ణ...

అలా మా నాన్న నన్ను వంటింటి లోకి వెళ్ళకుండా రక్షణ కల్పించటం వల్ల చాలా మంది అమ్మాయిలు పద్ధతి ప్రకారం వైనంగా నేర్చుకునే కుట్లు,అల్లికలు, పూలు మాలలు కట్టడం, కంది పచ్చడి రోట్లో మెత్తగా రుబ్బడం లాంటివి ఏవీ రాకుండానే పెద్దదాన్ని అయిపోయాను.
సామాన్యం గా మగవాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే స్వేచ్ఛ పోతుందని భయపడిపోతారు. కానీ నేను పెళ్ళి చేసుకుంటే వంట చేయాల్సి వస్తుందని భయపడి పోయాను.

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా!

అలా అనుకోని పోనీలే, వంటే కదా, పక్కవాళ్లకు నేర్పిద్దాం లే అని పెళ్ళి చేసుకున్నాను.

ఇక వంటింటి లోకి వెళితే కుక్కర్ ఎలా పెట్టాలో తెలియదు, ( ఇంట్లో మనం చేసిన పని ఏదైనా వుంటే...పది విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయ్యటమే)ఇడ్లీ పిండికి ఏ కొలతలు, గ్రైండర్ ఎలా పనిచేస్తుంది, అది ఆగకపోతే రీసెట్ బటన్ ఎక్కడుంటుంది లాంటి జనరల్ నాలెడ్జి బొత్తిగా నిల్.

నా ఖర్మ చాలక నేను వంటింట్లో కుస్తీలు పడుతున్న రోజుల్లో మా ఇంట్లోకి రెండు కూరగాయలు వచ్చి నా ప్రజ్నా పాటవాల్ని మరింత బట్టబయలు చేశాయి. ఒకటి పొట్లకాయ, రెండోది సొరకాయ . రెండూ వేటికవే గొప్ప కూరగాయలు లెండీ! ఇక చూస్కొండి నాకు డౌట్స్ మీద డౌట్స్. పొట్ల కాయకు చెక్కు తీయాలా, వద్దా? సొరకాయ కి తొక్కు తీస్తారని తెలుసు( కొంచెం పనిమంతురాలినే కదా) . అప్పటికే మనకి కొద్ది మందికి తాట తీసిన అనుభవం వుంది కదా. ఆ రెండింటి కి లోపల అదేమిటో తెల్లగా బ్రహ్మ పదార్ధం, కొన్ని గింజలు కనిపించాయి. అవేం చేయాలో తెలియలేదు. పారేయ్యాలా? లేక అవి కూడా ముక్కలతో పాటు వేసి కూర చేయాలా? అని.


అలా అప్పటి నుంచి నేను , నా వంట కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చాము. ఇప్పుడు ఈ దేశం లో ఏదైనా పాట్ లక్ ఫంక్షన్ అంటే ఏవో నాలుగైదు రకాల వంటలు చేసుకొని తీసుకెళ్లగలిగే స్థాయి కి ఎదిగాను.

అయినా కూడా విధికి నా మీదేప్పుడూ చిన్న చూపే!

సునాయాసం గా వంట చేయగలిగే స్థాయి కి ఎదిగినా సరే...నాకు తెలుగు భాష లో నచ్చని అనేక పదాల్లో ఒకటి " రెసెపీ". అసలు ఎవరైనా ఏదైనా ఇలా చేయండి అని చెప్తే తింగరిబుచ్చి లాగా తప్పకుండా అలా చేయకుండా వుండెలా జాగ్రత్త పడతాను.

ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి అన్నం వండమని ఎవరైనా చెపితే ఒకటి కి ఒకటిన్నరో, రెండున్నరో పోసి ఎలా వస్తుందో చూడాలని నాకు మహా ఉత్సాహం గా, క్రియేటీవ్ అవుడియాలు అన్నీ వస్తుంటాయి.

ఇండియా లో ఎప్పుడూ ఈ రెసెపీ ల అవసరం పడలేదు. బండి ఎలాగోలా నెట్టుకొచ్చేసాము. అదృష్టవశాత్తూ పేపర్ ఆఫీస్ లో ఉద్యోగం..మధ్యాహ్నం వెళితే ఏ రాత్రి 11 కో, 12 కో ఇంటికి చేరటం.చేతి కింద నలుగురు పనివాళ్ళతో " సర్వ స్వతంత్రం " గా బతికాను. నేను వంట బాగా చేయాల్సిన టైం వచ్చేసరికి ఇండియా లో రెస్టారెంట్ల కల్చర్, కర్రీ పాయింట్ల కల్చర్ పెరిగింది. అలా అవన్నీ నన్నూ, నా మాంగల్యాన్ని కాపాడాయి.

నా జాతకం లో మహర్దశ అయిపోయేటప్పటికి నేను అమెరికా వచ్చి పడ్డాను. ఇక మా నలుగురు పని మనుషులు చేసే పని, మా ఇంట్లో మా ముగ్గురి పని ( నా పని కూడా నేనే చేసుకోవాల్సి వచ్చిందని ప్రత్యేకం గా మనవి చేసుకుంటున్నాను.) కూడా నేనే చేయాల్సి వచ్చింది.

వారం వారం ఎక్కడో అక్కడ పాట్ లక్ లు. ఏదో ఒక మహత్తర వంటకం చేసి తీసుకెళ్ళాలి. అక్కడితో మన పని అయిపోదు. అది తిన్నాకా వావ్, వీవ్ అంటూ కాకుల్లా ఏవో ధ్వనులు చేసి ఎలా చేయాలి అంటూ రెసెపీ లు అడుగుతారు. ఏమిటి చెప్పటం నా మొహం వాళ్ళకు...మనకు అన్నీ ఉజ్జాయింపు గా వేయటమే తెల్సు కానీ కొందరేమో సుతారం గా ఉప్పు వేయటానికి కూడా ఒక స్పూన్ తీసుకొని తయారవుతారు. ఇంత ఉప్పు తీసుకొని అలా పడేసి ఆ చేతిని ఇలా నైటీ కో, ఫాంట్ కో పులుముకోవడం మన సంప్రదాయం, ఆచారం . ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నేను మాత్రం ఇలాంటి ఆచారాల్ని తూచా తప్పకుండా పాటిస్తాను..

మొదట్లో ఈ పాట్ లక్ లకు పులిహోర చేసి తీసుకెల్ళేదాన్ని.అదైతే వీజీ...వీజీ...అప్పట్లో మా దగ్గర ఒక్క తెలుగు మొహంకూడా వుండేది కాదు. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటూ ఏది తీసుకెళ్ళినా మొత్తం గిన్నె అంతా ఖాళీ చేసెసేవారు. కానీ ప్రతి సారీ అదే తీసుకెళ్లలేమ్ కదా. అలా తీసుకేళితే మనకు పెద్దగా వంటలు రావన్న విషయం తెలిసి పోతుంది కదా. పైగా వాళ్ళేమే కష్టపడి రాజ్మా కూర్మా లాంటివి చేసుకొస్తుంటే మనకు కూడా ప్రేస్టేజి పాయింట్ వచ్చేసింది. అది నాకె కాదు మొత్తం సౌత్ కె అవమానం గా ఫీల్ అయి వెరైటీ వంటలు నేర్చుకోక పోతే ఇక్కడ ఐడెంటిటీ ఇస్యూ వస్తుందని భయపడ్డాను.

ఇక అప్పటి నుంచి నా కష్టాలు మొదలండీ బాబూ...రెసెపీ ల కోసం వెతకటం..నెట్ ఎక్కి కూర్చొని ఆంధ్ర వెజిటేరియన్ అని కొట్టగానే వందలాది వెబ్సైట్లు, రెసెపీలు, యూ ట్యూబ్ లింక్ లు కూడా. ఇండియాలో వున్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తినడం, లేకపోతే కొనుక్కోని తినడం తప్ప..ఈ కుక్ బుక్ ల కల్చర్ బొత్తిగా మనకు అలవాటు లేదయ్యే! అలాంటిది నెట్ లో నుంచి రెసెపీ లు ప్రింట్ చేసుకోవడం, పక్కన పెట్టి అది చదువుతూ వంట చేయడం...

అదేమిటో నేను రెసెపీ ప్రకారమే చేద్దామని కొన్ని సార్లు అనుకునేదాన్ని కానీ ఎప్పుడూ కూడా అందులో చెప్పినవి ఒకటో రెండో నా దగ్గర వుండేవి కావు. పోనీలే లేని వాటిని వదిలేసి వున్న వాటితో చేసుకుందాం అని అలా చేసెసేదాన్ని. ఈ సారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు గుర్తు గా అవి తెచ్చేదాన్ని. కానీ ఇంకో రెసెపీ లో ఇంకేవో అడిగేవాడు.ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు.

ఇలా వుండగా...నాకు ఇంట్లోనే ప్రతిపక్షం తయారైంది.

నాకెమో ఏవీ లేకపోతే వేడి అన్నం, కంది పచ్చదో, పొడి నో వుంటే చాలు. అఫ్సర్ కెమో కక్కా, ముక్కా తిన్న నోరు....మనమేమో ప్యూర్ ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ తో సంవత్సరాల తరబడి వాయించేస్తున్నాము. కంది పొడి తోనా అంటూ అయోమయం గా చూస్తాడు. మా చిన్నూ గాడికి మాటలు రానంత కాలం అన్నం నోట్లో కుక్కేస్తే సరిపోయేది. వూహ తెలిశాక, ఇదేమిటి అని అడగటం కాకుండా, ఎందుకిలా వుంది అని ప్రశ్నించటం కూడా నేర్చుకున్నాడు. అలాంటప్పుడు మాత్రం ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని పగల గొట్టాలనిపిస్తుంది. వాడు నెమ్మదిగా ఎదిగాడు.ఎంత దాకా ఎదిగాడు అంటే రోజూ నా వంటకు మార్కులు వేసే వరకూ...పప్పో, కూరో నోట్లో పెట్టుకొని పది కి మూడు, పోనీలే నాలుగు అంటాడు...అవి నాకు ఆ రోజు వచ్చిన వంట కి మార్కులన్న మాట. నేను నోట్లో పెట్టుకొని తిని బాగానే వుంది కదరా అంటూ వాడి వైపు, చెప్పవేమిటి అంటూ తన వైపు ( ఎవరో తెలుసు లే మీకు) ఉరిమి చూస్తే...” మీ టేస్ట్ బడ్స్ పాడైపోయాయి.” అంటాడే గానీ వాడి అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోడు.

ఇలా అమెరికా లో ఏదో మా ఇంట్లో మా వంటలు మేం తిని మా మానాన మేం బతుకుతూ వుంటే ఇండియా నుంచి ఒక స్నేహితుడు అమెరికా ట్రిప్ కి వచ్చాడు. నేను అలవాటు ప్రకారం రోజూ ఎవడు వంట చేస్తాడు అనుకోని అతను వచ్చిన మొదటి రోజు ప్రేమ గా సాంబారు , కూర, పప్పు చేశాను. అందరం తిన్నాక ఇంకా బోలెడు మిగిలింది. అన్నీ ఫ్రిజ్ లో పెట్టాను. అవి అయితే కానీ కొత్తవి చేయటానికి లేదు. ఎందుకంటే అవి మిగిలితే పెట్టడానికి ఫ్రిజ్ లో ఖాళీ వుండోద్దు? ఈ రకమైన టెక్నికల్ డిఫికల్తీ వల్ల అతను వున్న మూడు రోజులు అదే సాంబారు, పప్పు, కూర పెట్టి పంపించాను. అందుకని ఇప్పటికీ నన్ను దెప్పుతుంటాడు " మీ ఇంటికి వస్తే చద్ది కూడు పెట్టారు " అని.
అదేమిటో ఎవ్వరూ అర్థం చేసుకోరూ....!

ఇది ఇలా వుండగా...నా టైం బాగుండక క్రితం సారి ఇండియా వచ్చినప్పుడు మా వాడు మా అమ్మ చేతి వంట, మా అక్క చేతి వంట తిన్నాడు. మా అక్క చాలా బాగా వంట చేస్తుంది. అన్నింటి లో మనకు పూర్తి వ్యతిరేకం. మా అక్క అచ్చంగా " డొక్కా సీతమ్మ" టైపు. పెద్దల ఎదుట నోట్లోంచి మాట రాదు. వినయ విధేయతలు పూర్తిగా పుణికి పుచ్చుకున్న సాధ్వీమ తల్లి. ఇక్కడకు తిరిగి వచ్చేసే ముందు మా అక్క వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేసాకా మా వాడు " ఆమ్మా! నువ్వు కూడా అమెరికా వచ్చేసి మాతో వుండిపో" అని తెగ గొడవ చేస్తుంటే మా అక్క అబ్బా, వీడికి నా మీద ఎంత ప్రేమ అని మా బావ గారికి చెప్పి మురిసిపోతుంటే...ఓసీ పిచ్చిమొహమా! అది నీ మీద ప్రేమా కాదే తల్లీ,,,నువ్వు వస్తే హాయిగా కడుపు నిండా భోజనం చేయచ్చని వాడి ఆశ అంటే..ఇక మా అక్క....పిల్లాడికి ఇష్టం గా వంట చేసి పెట్టక నువ్వు చేసే పనేమిటే అని నాకు హితబోధలు మొదలుపెట్టింది.

నేను విననట్లు పక్కకెళ్లిపోయాను. అంతకన్నా మనమేం చేయగలమ్ చెప్పండి....

ఏదో ఇలా వంట వచ్చీ రాక...ఇలా బ్లాగుల్లో కళ్ళనీళ్ళు వత్తుకుంటూ ఏవో నా బాధలు రాసుకుంటూ బతికేస్తుంటే...ఇప్పుడు నా ప్రాణానికి జ్యోతక్క తయారైంది. షడ్రుచుల పేరుతో...ఏవో ఒకటి రాయడం, ఇది చాలా ఈజీ..చాలా టేస్టీ అంటూ ఏదో ఒక పోస్ట్ రాయడం , దానికి రెసెపీ లు ఇవ్వడం,పైగా నోరూరిస్తూ ఫోటోలు ఒకటి....

వొట్స్ తో ఇవి చేసుకోవచ్చు. అవి చేసుకోవచ్చు. ఓట్స్ దద్దోజనం, ఓట్స్ పులిహోర, ఓట్స్ పాయసం, ఓట్స్ తద్దినం అంటూ....ఒక చేంతాడంతా లిస్ట్.

అది చూశాక ప్రాణం వొప్పదు. తెల్లారి లేచి వంటింటిలోకి వెళితే అక్కడ ఆ ఓట్స్ డబ్బా కనిపిస్తుంది. చేయాలో, వద్దో తెలియదు. మళ్ళీ ఆ కంప్యూటర్ మీదకెక్కి ఆ రెసెపీ చదివి వచ్చి అలా చేసి అది ఎందుకు అంత బాగా రాలేదో అర్థం కాక బాధపడి, మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టి, ఆమె మరో సలహా ఇచ్చి ...ఇదంతా నాకిప్పుడు అవసరమా....అనుకోని కామ్ గా అంతఃసాక్షి ని, మనఃసాక్షి ని. ...ఇంకేం సాక్షులున్నాయో వాటినన్నింటిని అణగతొక్కేసుకొని ఎప్పటిలాగానే అందులో ఇన్ని పాలు పోసుకొని ఒక నిముషం మైక్రో వేవ్ లో వేడి చేసుకొని హాయి గా తింటూ " Eat, Pray, Love” చదువుకున్నాను.

అది అయిపోయిందా ఆండీ...మళ్ళీ మొన్న రకరకాల సమోసాలు అంటూ...ఇంకో పోస్ట్ పెట్టింది. అసలు సమోసాలు చేయటమే కొంచెం టైం తో కూడుకున్న వ్యవహారం. చాలా వోపికగా, నిదానం గా, కొన్ని గంటలు వంటింటి లో కష్టపడితే ఓ కే ... కొన్ని సమోసాలు వస్తాయి. మనమేమో వారానికి ఒకసారి ఆ ఇండియన్ షాప్ కి వెళ్ళి డాలర్ కి ఒక సమోసా కొనుక్కోని తినేసి వస్తున్నాం కదా. మళ్ళీ ఇదంతా ఎవరు పడతారు అనుకోని చూసీ చూడనట్లు వూరుకున్నాను.

ఇంతలో లాప్ టాప్ మీద నుంచో,లోపల నుంచో ఒక కేక....ఎందుకంటే ఆ లాప్ టాప్ ఎదురుగుండా చాలా సేపు కూర్చున్నాక ఏమవుతుంది అంటే వారే వీరు, వీరే వారు అయిపోతారు. ఎవరు లాప్ టాప్ నో? ఎవరు రూప స్వరూపమో తెలియదు. అలా ఒక కేక వినిపిస్తే వెళ్ళి మళ్ళీ ఏంటీ అని అడిగితే....ఎన్ని రకాల సమోసాలో చూడు...కొంచెం ట్రై చేయచ్చు కదా...ఆ తన్హాయి రాసుకునేబదులు రోజంతా..అన్నాడు. ఇక చూడు...నా సామి రంగా...అరికాలి మంటలు ఇలా మౌస్ మీదకు వచ్చేశాయి.

చాలా మంది మహిళలు ఇలా తమకు వచ్చిన వంటలన్నీ రెసెపీలు, ఫోటోలతో కూడా బ్లాగుల్లో పెట్టడం వల్ల నాలాంటి అమాయక స్త్రీలు ఇంట్లో నానా రకాలా వేధింపులకు గురవుతున్నారని , కాబట్టి ఇక నుంచి వంటలు అని టాగ్ వున్న బ్లాగుల్నీ ముఖ్యం గా షడ్రుచుల్ని యాగ్రి గేటర్ ల నుంచి తీసేయ్యాల్సింది గా కోరుతూ కూడలి,మాలిక, హారం,జల్లెడ కి ఒక విజ్నాపనపత్రం పంపించేశాను.

ఇప్పుడు చెప్పండి.ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా? పంపిస్తే....


( సరదాగా రాసిన ఈ పోస్ట్ లో ....జ్యోతి, షడ్రుచుల పేర్లను వాడుకున్నందుకు క్షమాపణలు)

Wednesday, July 28, 2010

ఈ ఇల్లొక నిశ్శబ్ద నది!

దీవారోం సే మిల్ కర్ రోనా...



ఇప్పుడు మా ఇల్లొక నిశ్శబ్ద నది లా వుంది. అఫ్సర్ మాడిసన్ లో వున్నాడు. మా అనిందు ఫ్రెండ్స్ తో కలిసి కాలిఫోర్నియా వెళ్ళాడు. ఆహా, ఇంట్లో ఎవరూ వుండరు. నేనొక్కదాన్నే. హాయి గా పుస్తకాలు చదువు కోవచ్చు. రాసుకోవచ్చు. రోజూ వంట చేయాల్సిన పని లేదు. ఏదో ఒకటి చేసుకొని తినేయచ్చు. మరీ ముఖ్యం గా నా నవల పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఈ విలువైన ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో రెండు, మూడు నెలలుగా కలలు కన్నాను.


తీరా ఆ సమయం వచ్చేసరికి... నన్ను వదిలి మా బాబు దూరం గా ఒక పదిరోజులు వెళ్ళే సమయం వచ్చేసరికి...దృశ్యం మొత్తం మారిపోయింది. వాడు అలా నా బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను గట్టి గా పట్టుకొని బై చెప్పి వెళుతుంటే నాకు ఏడుపు ఆగలేదు. కారు కదిలి వెళ్లిపోయాక ఇంట్లో కి వస్తే అది ఇల్లు లా కాక ఒక దిగులు గూడు లా అనిపించింది. రేపు వాడు పెద్దఅయి కాలేజీకని దూరంగా వెళ్లిపోతే అమ్మో, అప్పుడు ఇలా వుంటుందా అని అనుభవం లోకి వచ్చి కన్నీళ్ళు ఆగలేదు.


నాలుగు రోజులు గా ఇల్లు మొత్తం ఒక భయకర నిశ్శబ్దమైంది.కీ బోర్డ్ శబ్దాలు, పుస్తకం లో పేజీలు తిప్పే చిన్న శబ్దాలు, అప్పుడప్పుడూ మోగే టెలిఫోన్ రింగ్ లు.. వింటున్న కొద్దీ మనసు ని మెలిపెట్టే కొన్ని పాటలు...
నా ఒంటరితనాన్ని గుర్తించి మేమున్నాము కదా అని పలకరించబోయి ఆగిపోతున్న కల్హార, కౌశిక్ లు..

దీవారోం సే మిల్ కర్ రోనా...

గోడలతో కలిసి దుఃఖించటమంటే ఏమిటో కొంచెం తెలిసినట్లనిపించింది.

Friday, April 23, 2010

తొలి పుస్తకపు ప్రణయాలు- కొన్ని స్మృతులు!



అక్షరం పరః బ్రహ్మ స్వరూపం
పుస్తకం పరమౌషధం

కొందరి జీవితాలు పుస్తకాల చుటూ తిరుగుతుంటాయి. అందులో నాది కూడా ఒకటనుకుంటాను. ఆ మాటకొస్తే చాలా మంది జీవితాలు తెరిచిన పుస్తకాల్లాంటివి. అయితే ఒక్కోసారి ఆ పుస్తకం లోని పేజీల్లో అక్షరాలు మాయమైపొతాయి మంత్రజాలం లాగా. కొన్ని పేజీలు చిరిగిపోతాయి. మరికొన్ని నలిగిపోతాయి. కొన్ని కావాలని ఎవరో ఒకరు బలవంతంగా చింపేస్తారు. అంత మాత్రాన అది పుస్తకం కాకపోతుందా? మనది జీవితం కాకుండా పోతుందా?

అయిదేళ్ళకే విష్వక్సేనుడు శుధ్ధంగా పలకటం వచ్చేసిన తర్వాత పెద్దబాలశిక్ష ముందు వేసుకొని అలా అక్షరాల్ని గుర్తు పట్టుకుంటూ , చదువుకుంటూ వెళ్ళిపోవటం.అలా మొదలైంది నా సారస్వత ప్రయాణం.తెలియని అంటే చదవటానికో , పలకటానికో కష్టం గా వున్న పదాల్ని ఒకసారి అడిగి చెప్పించుకున్న తర్వాత ఇక మళ్ళీ అడగటానికి వీల్లేదు.. గుర్తు పెట్టుకు తీరాల్సిందే. తెలుగు మాట్లాడటము, చదవటం విషయంలో మాత్రం మానాన్నగారు నిరంకుశం గానే వ్యవహరించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ నాలుగు మాటలైనా రాయగలుగుతున్నానంటే అది ఆదిగురువైన మా నాన్నగారు పెట్టిన భిక్షే.

ఏడేళ్ళకే భగవద్గీత చదివి స్థితప్రజ్ఞుడు అంటే ఓస్! ఇంతేనా, ఇంత తేలికగా అంతా అర్ధమైపొతుంటే గీత చాల కష్టం, అర్ధంకాదు అంటారేమిటి? అని నాకు నేనే అనేసుకొని మా నాన్నగారికి అప్పుడే చెప్పేసాను. నేను పెద్దయ్యాక గొప్పదాన్ని తప్పక అవుతానని. దానికి నేను చెప్పిన వివరణ ఏమిటంటే పెద్దవాళ్ళకు కూడా అర్ధం కాని , కొరుకుడు పడని స్థితప్రజ్ఞత్వం నాకు అర్ధమైపోవటం వల్ల నేను ఖచ్చితంగా గొప్పదాన్ని అయిపోతానని నాకు గాఢ నమ్మకం. మా నాన్నగారు ఎందుకు ముసిముసిగా నవ్వుకున్నారో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది ఆ నవ్వు వెనుక వున్నదేమిటో!ఆ పదానికి నిర్వచనం తెలియటం కాదు,అది ఆచరించి చూపిన నాడు అది నిజంగా అర్ధమైనట్టు అని ఇప్పుడు కదా తెలిసింది. అయితేనేమి అలా నా మీద నాకొక ఆత్మవిశ్వాసం కలిగించి నా వూహలకు రెక్కలు తొడిగించాయి భగవద్గీత లాంటి పుస్తకాలు. ఇప్పుడొకొక్కసారి ఆ పసితనపు ఆత్మవిశ్వాసం ఎక్కడ దాక్కుందా అని వెతుక్కుంటుంటాను.
తెలుగు నవలా సాహిత్యంలో నేను మొదట చదివిన పుస్తకం ద్వివేదుల విశాలాక్షి గారి 'గోమతి నవల. ఆ నవలలో కధానాయిక గోమతి పడే కష్టాలు, బాధలు చూసి అలా ఎందుకు బతకాలి,గట్టిగా ఎదురుమాట్లాడి తనకెలా కావాలో అలా వుండచ్చు కదా అని బోలెడంత ఆవేశం తెచ్చుకొని మా నాన్నగారితో వాదనేసుకున్నాను. అప్పుడు మా నాన్నగారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా తెలివిగా ఇంకేవొ విషయాలు చెప్పారు అచ్చమైన ఆడపిల్ల తండ్రిలాగా. ఆ రచయత్రి కధనాయికకు గోమతి అని ఎందుకు పేరు పెట్టిందో చెప్పారు. ఆ వివరణ అప్పట్లోనే అంత చికాకు తెప్పించిందంటే ఇప్పుడిక చెప్పక్కరలేదు. అదేమిటంటే గోమతి అనేది నది పేరు. నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టకూడదని, ఎందుకంటే ఆ నదుల జీవితాల్లాగే వాళ్ళ జీవితాలు కూడా దుఃఖభాజితాలవుతాయని. పాపం పిచ్చి నాన్న,ఈ ప్రపంచంలో నదుల పేర్లు పెట్టుకోని ఆడపిల్లల జీవితాలు కూడా లాటరి టికెట్ల లాంటివని ఆయనకు తెలియలేదు.
అలా నాకు అయిదేళ్ళ వయస్సు నుంచి ఒక్కో అక్షరాన్ని, ఒక్కో పదాన్ని, ఒక్కో పదానికి అర్ధాన్ని కూడబలుక్కుంటూ క్రమంక్రమంగా అర్ధం చేసుకుంటూ, అబ్బురపడిపోతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, పగలబడి నవ్వుకుంటూ, భక్తితో కళ్ళకద్దుకుంటూ, నవరసభావాలతో, నవవిధ భక్తి భావనలతో మొదలెట్టిన చదువు ఇంకా పూర్తి కాలేదు. తల్లీ నిన్ను దలంచి అంటూ చెప్పుకున్న పద్యాలు, గురుః బ్రహ్మ,గురుః విష్ణు అంటూ చెప్పుకున్న శ్లోకాలు అన్ని నరనరాన, అణువణువునా నిండిపోయాక, ఇప్పటికీ కాళ్ళకు ఏ పుస్తకమో, ఒక చిన్న కాగితముక్కో తగిలితే బాబోయి చదువు రాదేమో అన్న భయమే మొదట నా మనసులో మెదిలేది.

మా ఇల్లొక అక్షర దేవాలయము. అక్కడ దొరకని పుస్తకం లేదు. మా నాన్నగారు మాకు వివరించి చెప్పలేని కఠినమైన విషయం లేదు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు మా నాన్నగారొక వారధిలాగా కనిపించేవారు.భారతం, భాగవతం, రామాయణం, పంచ మహాకావ్యాలతో పాటు శరత్ సాహిత్యం, నవలలు, కధలు, అభ్యుదయ కవితాలు, రష్యన్ సాహిత్యపు అనువాదాలు అన్నీ మా సొంత లైబ్రరి లో వుండేవి. అందుకే మాకు వ్యాసుడు, వాల్మీకి తో పాటు టాల్ స్టాయి, దోస్తోవిస్కీ, అలెగ్జాండర్ కుప్రిన్ కూడా అంత బాగా తెలుసు. ఒక పక్క భారతం, మరో పక్క యుధ్ధం-శాంతి చదివిన తర్వాత ఇక జీవితంలో యెటువంటి పరిస్థితుల్లో కూడా యే దేశమైనా,ఏ దేశప్రజలపైనైనా యుధ్ధం చెయ్యటం ఎంత తెలివితక్కువ పనో అప్పుడే బలంగా నాటుకుపోయింది. ఇలా ఒక్కో పుస్తకం నుండి ఒక్కో పాఠం నేర్చుకున్నాను.
అనుబంధాలు, ఆకలి, మరణం --ఇవన్నీ కలిసి ఒక సమగ్రజీవితమనిపిస్తాయి. నన్ను బాగా కదిలించిన పుస్తకాలు అన్నా కెరినినా, మృత్యు ముఖంలో తుదిరోజు (సుప్రసిధ్ధ ఫ్రెంచ్ రచయత విక్టర్ హ్యుగో రచన ' ది కండెమ్నడ్ ' కి తెలుగు అనువాదం), ఆకలి((నోబెల్ బహుమతి గ్రహీత నట్ హాంసన్ రచన ' హంగర్ ' కి తెలుగు అనువాదము). .జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితో, మనసుకి ఒక దుఃఖపు తెరో తాకినప్పుదు వెంటనే మనసు జ్ఞాపకపు పొరల నుంచి ఏదో ఒక పుస్తకాన్ని గుర్తు చేస్తుంది. అది తీసుకొని చదివాక, దాని నుండి ఏదో ఒక గొప్ప బలం వచ్చేది. ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి దొరికినట్టనిపించేది. 1995 లో అలా ఒక మానసిక సంఘర్షణని తట్టుకునే శక్తి నాకు ' అన్నా కెరినినా ' ఇచ్చింది. ఇక కళాపూర్ణోదయం, మాళవికాగ్నిమిత్రం,క్రీడాభిరామం చదివినప్పటి అనుభూతులు అందరికి పైకి చెప్పేవి కావు పదిలంగా పుస్తకంలో నెమలీకల్లా దాచుకోవాల్సినవే. ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఒక్కో దశలో ఒక్కో పుస్తకం నిజమైన స్నేహితునిలా ఓదార్చేది. అమ్మలా ఆదరించేది. రహస్య ప్రణయంలా కొన్ని తీపి కలలనిచ్చేవి.
అందుకే నాశనం లేని అక్షరానికి, ఆదిగురువైన కన్న తండ్రికి అంజలి ఘటిస్తూ.....

కల్పనారెంటాల

Saturday, April 10, 2010

మా ఇంటి జ్ఞాపకాల భరిణ మూత తీసి చూస్తే.....!



ఏప్రిల్ 1, 2010: కొత్త ఇంట్లోకి మారాము.

ఇల్లు మారటం గురించి బాల్యం నుంచి ఎన్నో జ్ఞాపకాల పుటలు / వూహల ఉయ్యాలలు.

చిన్నప్పటి నుంచి ఇల్లు మారటం అంటే ఎంతో ఇష్టంగా వుండేది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు ఒకే ఇంట్లో వున్నాను. ఆ ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో తీపి గురుతులు. అయినా కొత్త ఇంటికి మారటం, ఆ ఇంటిని మనకు కావాల్సిన పద్ధతి లో సర్దుకోవటం అక్కడ కొత్త జీవితం మొదలుపెట్టడం ఇలాంటి మధురమైన వూహాలు ఏ పసితనంలో, యే యవ్వన వనం లో వుండవు?


సత్యనారాయణ పురం రైల్వే గేటుకి ఆనుకొని వున్న ఓ సందులో చివరాఖరున వున్న ఇళ్ళల్లో మాది ఒకటి. మా ఇంటి పక్కన ఓ ఇల్లు. ఆ ఇంటి తర్వాత రైలు పట్టాలు. పాతిక అడుగుల దూరం లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్. మా అమ్మా, నాన్నగారు పెళ్ళి అయ్యాక ఆ ఇంట్లోకి వచ్చారు. మా అన్నయ్య దగ్గర నుంచి ఆఖర్ణ తమ్ముడు వరకూ ఆరుగురం ఆ ఇంట్లోనే పుట్టాము. మేము ఆ ఇంట్లో వున్నప్పుడు పుట్టడం కాదు. ఆ ఇంట్లోనే పుట్టాము. మా అమ్మ అన్నీ పురుడ్లు ఇంటి దగ్గరే పోసుకుంది. ప్రసవం నొప్పులు వచ్చేవరకూ అన్నీ పనులు తానే చేసుకునేదట. నొప్పులు వస్తుంటే నర్స్ కి కబురు పెట్టి వేడి నీళ్ళు, బట్టలు కూడా సిధ్ధం చేసుకొని రెడీ గా వుండేదట. ఆ విషయాలు మా అమ్మతో ఎన్ని సార్లు చెప్పించుకున్నా ప్రతి సారీ కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా నొప్పులు మొదలు కాకుండానే బెంబేలెత్తిపోయి సిజేరియన్ చేసేయమని అడిగే తల్లులు, కూతుర్లు, డబ్బులు ఎక్కువ వస్తాయని అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసే కొందరు డాక్టర్లు వున్న ఈ కాలం లో మా అమ్మ తరం స్త్రీలు నాకేప్పుడూ నమ్మలేని నిజాలుగా, అచ్చంగా నిలువెత్తు గాయలుగా కనిపిస్తుంటారు.


మా అందరి పెళ్ళిళ్లు, వాళ్ళకు పిల్లలు అన్నీ ఆ ఇంట్లో వుండగానే జరిగాయి. అయిదో, పదో రూపాయల అద్దెతో చేరిన మేము ఆ ఇంటి నుంచి ఇక తప్పనిసరై దాదాపు ఓ పదేళ్ళ క్రితం ఖాళీ చేసాము. ఇంతా చేసి అదేమీ పది గదుల బంగళా కాదు. ముచ్చటగా మూడు ఏక వరుస గదులు. వెనక ఓ పెద్ద బావి. దాని చుట్టూ ఒక చప్టా. దానికి ముందు నిత్యం ఉదయ, సాయంత్రాలు దీపారాధనతో వెలిగిపోయే తులసి కోట. గదుల కంటే పెద్ద గా వుండే పెరడు. అందులో కొబ్బరి, అరటి, కాకర, బూడిదాగుమ్మడి, సొర పాదులు. ఆ పక్కనే ఒక రెండు బాత్ రూమ్ లు. ఇదీ మా రాజ సౌధం. ఇల్లు ఎంత ఇరుకుగా వుండేదో నేను ప్రత్యేకం గా చెప్పక్కరలేదు. కానీ మనసులు, ప్రేమలు ,అనుబంధాలు, ఆత్మీయతలు మా మధ్య విశాలంగానే వుండేవి.


స్కూల్లో కొత్త వూర్ల నుంచి వచ్చే స్నేహితులు, సందులో ఏవో కొన్ని ఇళ్ళల్లోకి ఎప్పటికప్పుడు వచ్చి చేరే కొత్త మనుష్యులు వాళ్లందరిని చూసి అబ్బా, మనకు కూడా ట్రాన్సఫర్ అయితే బాగుండు, ఏదైనా కొత్త ఇంట్లో చేరవచ్చు. సామానంతా తీసేసి ఈ ఇల్లు ఖాళీగా బోసిగా వుంటే ఎలా వుంటుందో చూడొచ్చు. కొత్త ఇల్లు ఇంకొంచెం పెద్దగా వుంటే, ఎవరికి వారికి విడిగా గదులు వుంటే, వాటిని మనకిష్టం వచ్చినట్లు సర్దుకోవచ్చు.కొత్త ఇంట్లో సరికొత్తగా జీవితం మొదలుపెట్టవచ్చు అనుకుంటూ రకరకాల రంగుల కలలు కనేదాన్ని.


మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచీ ఒకటే ఉద్యోగం లో వున్నారు. ఆ ఉద్యోగం మారేది లేదు. అందులో ట్రాన్స్ ఫర్లు లేవు. అయినా కూడా ఇల్లు మారవచ్చు. కానీ మా నాన్నగారికి ఎందుకనో ఆ ఇల్లు వదలటం ఇష్టం వుండేది కాదు. ఆయనకు తన సొంత వూరు, సొంత ఇల్లు పల్నాడు వదిలి రావటం ఎంత తీవ్రమైన వేదనో చివరి క్షణం వరకూ చెప్తూనే వున్నారు. ఇంక అద్దె ఇల్లు అయినా ఇదే మన ఇల్లు అనేవారు. సొంత ఇల్లు , సొంత వూరు, పొలాలు వదులుకోవటం అంత వేదనను కలిగిస్తుందని మా నాన్న ను చూసి తెలుసుకున్నా నాకు అప్పట్లో ఆయనవి అన్నీ పెద్దవాళ్ళ చాదస్తాలుగా అనిపించేవి . ఇల్లు మారితే ఏమవుతుంది? మన పాత ఇంటి జ్ఞాపకాల పెట్టెలు, బట్టలు, వస్తువులుమనతోనే వుంటాయి కదా, అది కోల్పోవటం ఎందుకవుతుంది అనుకునేదాన్ని. ఇల్లు , వూరు, దేశం, భాష మారటం లో వున్న ఇబ్బందులు స్వానుభవం లోకి వచ్చాక మానాన్న బాధ ఏమిటో తెలిసి వచ్చింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందనుకుంటాను.


జీవితం లో ఒక వయస్సులో ఎప్పుడూ ట్రాన్సఫర్లు అవుతూ వుండేవాడిని పెళ్ళి చేసుకోవాలనుకున్న నా వూహ కు ఇప్పుడు నవ్వొస్తుంది. పెళ్ళి అంటే మరీ అంత చవక ఆలోచనలు అప్పట్లో వుండేవా అని.
సరే, బాల్యం నుంచి అలా ఇల్లు మారటం ఒక తీరని కోరికగా జీవితం లో ఒక దశ వరకూ మిగిలింది. 95 నుంచి నా మూవింగ్ టైం స్టార్ట్ అయింది. 97 దాకా ఏవో చిన్న చిన్న ఇళ్ళ మార్పులు. 97 లో హైదరాబాద్ కి నివాసం మార్పు. పెట్టెల నిండా పుస్తకాలు, కాగితాలు. ఏవో నామ్ కే వాస్తే లాగా కొన్ని బట్టలు, గిన్నెలు.


హైదరాబాద్ లో వున్నది రెండేళ్ళు. మారింది మూడు ఇళ్ళు. ఆ తర్వాత అనంతపురంకు మకాం మార్పు. అక్కడ వున్నది నాలుగేళ్ళు కానీ ఒకటే ఇంట్లో వున్నాము.అక్కడి నుంచి ఎవరో తన్నినట్లు అమెరికా వచ్చి పడ్డాము.మాడిసన్ లో వున్న నాలుగేళ్ళలో రెండు ఇళ్ళు . 2007 లో ఆస్టిన్ వచ్చాక ఈ మూడేళ్ళలో ఇది ముచ్చటగా మూడో ఇల్లు. ఈ దెబ్బతో అసలు ఇల్లు మారటం మీదున్న మోహం, వ్యామోహం మొత్తం వదిలిపోయాయి. మొహం మొత్తేసింది. పాకింగ్, ఆన్ పాకింగ్ లో బోలెడు మెలకువలు, ఎదురుదెబ్బలు, విసుగులు, నిట్టూర్పులు, చికాకులు.అనేక పాఠాలు నేర్చుకున్నాము. పుస్తకాలే జీవితం, ప్రాణం అనిపించినా ఇల్లు మారేటప్పుడు మాత్రం వాటి అసలు బరువు అర్ధమవుతుంది. గిన్నెలు, బట్టలు సునాయాసం గా , ఎలాంటి సంకోచాలు లేకుండా అవతల పారెయ్యగలం కానీ ఒక్క కాగితం ముక్క కూడా అబ్బా, దీనితో పనేముందిలే పడేద్దాము అనిపించదు. ప్రతి పేపర్ అదేదో పెద్ద పెన్నిధి లాగా, ఎప్పుడూ అవసరం వస్తుందో అన్నట్లు భుజం మీద పెద్ద మూటల్లాగా భేతాళుడిలా మోసుకు తిరగటం. కొత్త ఇంట్లోకి రాగానే ఏమైనా కానీ ఇక ఇల్లు మారకూడదు అనుకోవటం. ఏదో ఒక కారణం తో రెండేళ్ళకు మళ్ళీ పిల్లి పిల్లల్ని మోసుకు తిరుగుతున్నట్లు ఇంకో ఇంటికి మారటం ఆనవాయితీ గా వస్తోంది. ఆ ఆనవాయితీ ని బ్రేక్ చేయాలని మనం అనుకున్నంత మాత్రానా సరిపోతుందా? కాలం కలిసి రావద్దా?


ఇల్లు మారటం బాధనా ? సంతోషమా? అంటే ఇదీ అని చెప్పలేని ఒక అనుభూతి. పాత ఇల్లు వదిలిపెడుతున్నప్పుడు లోపల నుంచి తన్నుకొచ్చే ఫీలింగ్ ని ఇదీ అని నిర్వచించలేము. ఆ ఇంటికున్నవి కేవలం గోడలేనా? అందులో వున్నది ఇసుక, సిమెంటు, కొన్ని చెక్కలేనా? గడపలు, ద్వారబంధాలేనా? ఇన్నాళ్ళు మనం ఆ ఇంట్లో వున్నప్పుడు ఆ గోడలతో మనం చాలా మాట్లాడి వుంటాము. మన మాటలు ఆ ఇల్లు చెవి వొగ్గి చాలానే విని వుంటుంది. .మన రహస్యాలన్నీ దానికి తెలిసిపోయి వుంటాయి. మన ప్రణయ కలహాలు, తీపి కబుర్లు, చిలిపి అలకలు, పిల్లల అల్లరి. వాళ్ళ బాల్యపు మిఠాయి వుండలు ఎన్ని వుంటాయి ఒక్కో ఇంట్లో? మనం వచ్చేశాక, మరో జంట అందులోకి వస్తుంది. వాళ్ళ పిల్లలు కొత్త ఆశల నిచ్చెనలు వేసుకుంటారు. ఆ జంట చేయి చేయి పట్టుకొని ఎన్నో వూసులు ఆ గదుల్లో చెప్పుకుంటారు. మనం ఒకరి తర్వాత ఒకరం వస్తూ వుంటాము. వెళ్ళి పోతూ వుంటాము. ఇల్లొక రైల్వే స్టేషన్. కొన్ని అరైవల్స్, కొన్ని డిపార్చర్స్. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు, మౌనం గా, నిశ్శబ్దం గా , మూగగా మనకు ఆహ్వానాలు, వీడ్కోలు పలుకుతూ ఆ నాలుగు గోడల గదులు మరో అయిదో గోడను మన అపరిచిత, అపరిష్కృత సంక్షోభాల్ని, సంభాషణల్ని భుజాల మీద మోస్తూ గోమటేశ్వరుడి లాగా నిలబడి వుంటాయి.


ఇప్పుడు వదిలి వచ్చిన ఇంటి వెనక ఓ పెద్ద అడివి లాంటిది వుంది. కాన్యన్ సీనరీ. పెద్ద పెద్ద చెట్లు, వాటి మీద వాలే రంగు రంగుల పక్షులు, వాటి కూతలు, రాత్రి కాగానే మా ఇంటికి ఆతిధ్యానికి విచ్చేసే రెండు నల్లగా భీకరం గా కనిపించే రకూన్ లు. అవన్నీ తిథి వార నక్షత్రాలు చూడకుండా మా ఇంటికి వచ్చేసే అతిథులు. రకూన్స్ నా అని కంగారు పడకండీ. మొదట మేము కూడా కొంచెం భయపడ్డాము కానీ. మంచి గా కనిపించి క్రూరం గా మసిలే మనుష్యుల కన్నా క్రూరంగా కనిపించినా మంచిగా మసీలేవీ ఆ రకూన్ లు. నేను బయట పెట్టిన బ్రెడ్, అన్నం, ఏదైనా సరే తినేసి ఇంకాస్త పెడతారా అన్నట్లు ఆ పేటియో తలుపు వెనకాల నుంచి చూస్తూ నిలబడేవి. వుయి మిస్ దెమ్.


ఇప్పుడు మారిన మా కొత్త ఇల్లు బావుంది. కానీ కాన్యన్ లేదు. ఒక చిన్న పేటియో. మన భాష లో పెరడు అనుకోండి. పెరట్లో ఓ మూలన పెద్ద కుంకుడుకాయ చెట్టు లాంటి చెట్టు. దానికి ఆకుల కన్నా కాయలే ఎక్కువేమో అనిపిస్తాయి. తెల్లవారేటప్పటికి పెరడంతా ఆకులు, కాయలు, పూల ధూళి అంతా ఆకుపచ్చగా పర్చుకొని వుంటుంది. ఆ చెట్టు మీద కూడా రకరకాల పక్షులు వాలతాయి. తెల్లారగట్ల ముందుకూ వెనక్కూ వూగే రాకింగ్ ఛైర్ లో కూర్చుంటే గతం లోకి, భవిష్యత్తు లోకి వెళ్ళి వస్తున్నట్లు వుంటుంది. అక్కడ కూర్చొని నా మొదటి కాఫీ తాగుతున్నప్పుడో, వంటింటిలో వంట చేస్తున్నప్పుడో ఆ పక్షులు, కొత్తగా ఆ చెట్టు కి తగిలించిన కొన్ని గాలిగంటల ( విండ్ చైమ్) శబ్దాలు ఏవేవో కబుర్లు చెప్తూ నన్ను పొద్దుపుచ్చుతాయి. ఆ గాలి గంటలతో నేస్తం చేసేందుకు మల్లె, మందార మొక్కల్ని కూడా తెచ్చిపెట్టాము. ఇవాళే ఒక మందారం పూసింది. గుండు మల్లె చెట్టు కి మొగ్గలున్నాయి. తొందర్లోనే మా పెరడంతా , నా మనసంతా మల్లెపూల గుబాళింపు పరిమళం. ఆ గాలి గంటల మృదు మధుర మంజీర నాదాల మధ్య మా పాత ఇంటిని పూర్తిగా మర్చిపోలేదు కానీ ఈ కొత్త ఇంటిని సరికొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాను.


ఇల్లు మారటం అంటే ఉగాది పచ్చడి లా తీపి, చేదు, వగరు, పులుపు, కారం అనేక రుచుల సమ్మిళితం.


ఈ ఇళ్ళు మారటం లో నేను ఏం పొందాను అనే దానికన్నా ఎన్నెన్ని పోగొట్టుకున్నాను అన్నది మరో సారి....ఎప్పుడో...ఇంకో ఇల్లు మారటానికి ముందు.....

ఇంతే సంగతులు.
ఇట్లు
ఓ అద్దె ఇంటి అమ్మాయి






Wednesday, January 13, 2010

ఏవీ తల్లీ నిన్న మొన్నటి పండగలు?

ప్రియమైన అమ్మకు,

అక్కడి సంగతులతో నీ ఉత్తరం.

అందులో నీ బాధ కూడా వుందనుకో. నిజమే. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. మనుష్యులు మారినట్లే పండుగలూ మారిపోతున్నాయి. నిన్నటి అనుబంధాలు ఇవాళ వున్నాయంటావా? నిన్నటి కళ ఇప్పుడేది? పండగలు, పబ్బాలు, నోములు, వ్రతాల్లో కళా, కలకలం తగ్గిందన్న నీ బాధ సహజమైనదే. వున్న వూళ్ళోనే ఇంత మార్పు వుంటే, ఇంక ప్రవాసంలో ఏం చెప్పమంటావు? పుట్టిన నేలకు దూరంగా ఉన్నాం కాబట్టి ప్రతి నోమూ ఇక్కడ మిస్ కాకుండా చేసుకోవాలనుకుంటాం. అలాగే చేసుకుంటూ ఉంటాం కానీ అందుకో చాలా ముఖ్యమైనదేదో కోల్పోయినట్లు అనిపిస్తుంటుంది. ఏదో తెలియని కృతిమత్వం కనిపిస్తుంటుంది. అసలు సంక్రాంతి పండుగ మీ కాలంలో ఎలా జరిగేదో నువ్వూ, నాన్నా కథలు కథలుగా చెపుతుంటే మేం ఎంత ఆసక్తి గా వినేవాళ్లం. మరీ మీ కాలంలో లాగా కాకపోయినా
మా చిన్నప్పుడూ కూడా పండగలు బాగానే జరిగేవి.

ఇంటి ముందు పెద్ద పెద్ద గోబ్బెమ్మలతో కొలువైన రంగల్లులు , “ ఆనాటి అక్కల్లారా..చంద్రగిరి భామల్లారా..గొబ్బియల్లోగొబ్బియల్లో..” అంటూ పాటలు...హరిదాసులు, గంగిరెద్దులు, పులివేషాలు. మానింతో భోగి అంటే ఎంత హడావిడి ఉండేది. సాయంత్రం బొమ్మల కొలువులతో, పేఱంటాలతో క్షణం తీరిక ఉండేది కాదు. భోగి పళ్ళు పోసినప్పుడు వాటి మధ్యలో వేసే చిల్లర, చెరుకు ముక్కలు ఏరుకోవడం ఎంత సరదా! చిల్లర డబ్బులతో పప్పు బిళ్ళలు, పీచు మిఠాయిలు కొనుక్కోని తినడంలో ఎంత ఆనందం! సంక్రాంతి అంటే నాకు ఇప్పటికీ మన ఊరుగుర్తొస్తుంది. హరిదాసులు, గంగిరెద్దులూ, పులివేషాలూ మనం చూస్తుండగానే మాయమైపోయాయిగా! తెల్లవారుఝామునేహరిలో రంగ హారీఅన్న హరిదాసు గొంతు వినిపించగానే అతని నెత్తి మీద గిన్నెలో బియ్యం పోయడానికి నేను, శ్రీవిద్యా పోటీలు పాడేవాళ్ళం కాదా? గుళ్ళో పెట్టే చక్రపోంగాలీ, పెరుగన్నం తీసుకోవడానికి తెల్లారగట్లే లేచి పరుగెత్తుకుంటూ గుడికి వెళ్ళేటప్పుడు ధనుర్మాసపు చలీ గిలీ శరీరానికీ, మనసుకీ పట్టేవా?

ఇక్కడ మేం మొన్న మా పిల్లలకు భోగిపళ్ళు పోసాం. ఇక్కడ రేగిపళ్ళు దొరకావు కాబట్టి మాకు దొరికే చెర్రీ పళ్లతోనే కానిచ్చాం. చెర్రీపళ్ళతో పాటు క్వార్టర్ కాయిన్లు కూడా వేశాను. మాకు తెలిసిన నాలుగైదుగురు ఇండియన్ ఫామిలీస్ వాళ్ళని, వాళ్ళ పిల్లలను పిచ్చాను. వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చి కూర్చున్నారు తప్ప ఆ కాయిన్లు ఏవీ తీసుకోలేదు. పైగా వాటిని తీసుకోవచ్చని నేను చెపితే అదోలా నా వంక చూశారు. నిజానికి అక్కడైతే మన వీధిలో చిన్నపిల్లలంతా రేగిపళ్ళు, చాక్లెట్లు, చిల్లర డబ్బుల్ని పోటీపడుతూ ఎలా తీసుకునేవాళ్ళు? అంతే కాదు వాటితో మేమంతా మన వీధి చివర రాజన్ కిళ్ళీ కొట్లో చిరుతిండ్లు ఎలా కొనుక్కుతినేవాళ్ళమో నాకింకా గుర్తే.
ఏవీ ఇవన్నీ ఇప్పుడు? హరిదాసులు, గంగిరెద్దులూ, పులివేషాలు మనం చూస్తుండగానే మాయమైపోయాయిగా! ఈ కాలం పిల్లలకు అసలు గంగిరెద్దు మేళం తెలుసా? గోబ్బమ్మల్ని ఈ కాలం అమ్మాయిలు ఎంత వరకూ ఆనండించగలుగుతున్నారు? మనం ఎంత వర్ణించి చెపితే మాత్రం కళ్ళతో చూసిన అనుభవం వేరు. పుస్తకాల్లో చదువుకోవడం , సినిమాల్లో చూడటం వేరు కదా.

అసలు సంక్రాంతి కున్న మరో పేరు పెద్ద పండగ. అది అసలు సిసలు రైతుల పండగ. ఏదీ...ఎన్నేళ్ళయింది ఆంధ్రదేశంలో రైతులు అచ్చమైన సంక్రాంతి జరుపుకొని. చేతికొచ్చిన కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నాలు, ఉద్ది వాదాలు, అరిసెలు చేసుకునేవారు ఒకప్పుడు. పంచభక్ష్య పరమాన్నాలతో కాదు ఇప్పుడు పట్టెడన్నమైనా తినేస్థితిలో రైతులున్నారా? పది మందీ కలిసి సంతోషంగా చేసుకునేది పండగ. ఇరుగుపొరుగువారందరి మధ్య ఈ సమిష్టి భావన కనిపించడంలేదని నువ్వు బాధపడుతున్నావు. అక్కడే అలా వుంటే ప్రవాసం లో మాటేమిటి?

ఇక్కడున్న తెలుగు వాళ్ళంతా చేతనైన రీతిలో సంక్రాంతి, వినాయక చవితి, దీపావళీ, దసరా అన్నీ జరుపుకుంటూనే వుంటారు. కానీ ఎలా అని మాత్రం అడగకు. మనింట్లో మనం తలుపులేసుకొని భోగిపళ్ళు పోసుకుంటే, వినాయకుడ్ని పెట్టుకొని వ్రతం చేసుకుంటే అది పండగ అవుతుందా? అమ్మయ్య, భోగిపళ్ళు పోసుకున్నాము, సంక్రాంతి కి అరిసెలు చేసుకున్నాం అని సంబరపడటం కాదు కదా పండగ పరమార్ధం. ‘ మన సంక్రాంతి ‘ అంటూ మా వూర్లో సంక్రాంతి వెళ్లిన పక్షం రోజులకు ఓ సాయంత్రం ఫంక్షన్ పెట్టారు. సరేలే అని సరదా పడి వెళితే ఏముంది? పది సినిమా పాటలు...అయిదు భరత నాట్యాలు...రెండు జానపద గీతాలు. కాకపోతే మన తెలుగువాళ్ళందరం కలిశామనన్న సంతృప్తి ఉందనుకో. ఇదేనా పండగలు జరుపుకునే పధ్ధతి? అంటే ఏమో....ఎంత చెట్టు కి అంత గాలి లాగా....ఎంత ఊరు కి అంత ....అనుకోవాలేమో!

ఇప్పుడివన్నీ కేవలం మన తీపి జ్ఞాపకాలు. మన లోపలి ఊహాలు మాత్రమే. నేనిక్కడ ఇంత దూరంలో అలాంటివాటిని ఊహించలేకపోవడం విశేషం కాదేమో గానీ, అక్కడే ఉన్న నువ్వు ఇలాంటి దృశ్యాల్ని చూసి ఎంత కాలమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అన్నీ అంతే! మనలో మార్పు కి ఇవి బయటకు కనిపించే కొండగుర్తులు. మార్పు మంచికా, చెడు కా? అని ఆలోచించే వ్యవధి కూడా లేకుండా- రెప్పపాటులోఅంటామే, కచ్చితంగా అలాగే జరిగిపోతుంది. అదంతా గతించినా గతం అనిపిస్తుంది.

ఇక్కడ మేం అలాంటి గతం కోసం అప్పుడప్పుడూ వెతుక్కుంటాం. పిల్లలు ఎంత సేపటికీ క్రిస్మస్, థాంక్స్ గివింగ్, హేలోవీన్ మాత్రమే గుర్తుంచుకొని, తలచుకొని సంబరపడిపోతున్నప్పుడు మన సంక్రాంతి, ఉగాది, మన దీపావళి అని గుర్తు చేయాలనిపిస్తుంది. యానిమేషన్ల మాయాజాలానికి కళ్ళు అతికించుకొని పోయిన పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవన్నీ చెప్పాలనిపిస్తుంది. కానీ వాళ్ళు వింటే కదా? మామూలు రోజుల్లో అయితే వినరు కాబట్టి పండగ రోజుల్లోనైనా పనిమాలా అవన్నీ వాళ్ళ నెత్తిన బలవంతానా రుద్దాలనిపిస్తుంది. నువ్వు చేసిన పధ్ధతిలో అన్నీ చేయాలనుకుంటాను. సంక్రాంతి పండక్కి అలాగే చేయబోయాను. చెర్రీలు నెత్తిన వేస్తే, చిన్నూ నా వైపు జాలిగా చూశాడు. వాడికి అందులో ఈ సరదా కనిపించలేదు. ఆ టైం లో వాడి టీవీ షో మిస్ అయ్యామన్న బాధ తప్ప. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూర్చుంటే, ఒక్క క్షణం మనసు కుదురు గా ఉంటే కదా? ఎందుకంటే నవగ్రహ పూజకు కనీసం వక్కలు కూడా దొరకలేదు. సాయంత్రం పూజకు రావడానికి ఈ మైనస్ డిగ్రీల చలిలో ఎవరికి కుదురుతుంది? బంధువులో, స్నేహితులో, కనీసం పూజ చేయించే బ్రాహ్మణుడు కూడా లేకుండా క్యాసెట్ పెట్టుకొని మనసు తృప్తీ కోసం ఏదో అయిందంటేఅయిందనిపించాం వ్రతాన్ని. ఇలా వుంటాయమ్మా ఇక్కడి పండగలూ, వ్రతాలు.

పల్నాడు కి, బెజవాడ కీ ఎంత దూరమో, బెజవాడకీ అమెరికా కీ అంతే దూరం. ఈ దూరాన్ని నువ్వు ఒక్కసారి మానసికంగా కొలిచి చూడు. పల్నాడులో వున్నట్లు నువ్వు బెజవాడ లో వున్నావా? మేం బెజవాడ లో వున్నట్లు ఇక్కడ వుండగలమా? ఉండలేం. మార్పుని ఎలా చెప్పాలి? అసలు మార్పు గమనించే స్థితి మనకి ఉంటుందా? కొన్ని సార్లు కొన్ని కలలో వచ్చి మాయమైపోయినట్లు ఉంటాయి. ఇంటి ముందు తులసి మొక్క ఒక కల. హరిదాసు వచ్చి వెళ్ళిపోవడం ఒక కల. అవి ఒకప్పుడు నిజాలు.

ఇప్పుడు మాత్రం చటుక్కున వచ్చి వెళ్ళిపోయే జ్ఞాపకాలు
అందుకే దూరాన్ని కొలవాల్సింది భౌగోళీకంగా కాదు. మానసికంగా!

దూరానికి ఎల్లలు దేశాల మధ్య లేవు. మనలోనే ఉన్నాయి. నిన్నటికీ ఇవాళ్టికీ ఎంత దూరం! మారకుండా వుండటం మనిషి కి వీలు కాదు. కదలని కొండలు కూడా కాలంతో పాటు మారతాయి. ఇక ఎప్పుడూ చలించే, ఆలోచించే మనిషి మారకుండా ఉందడం అసాధ్యం. కానీ అప్పుడప్పుడూ మార్పు ఎక్కడ మొదలై ఎటు పోతుందో చూసుకుంటే మనకే ఆశ్చర్యం గా ఉంటుంది. నిన్నటి బాధగా ఉంటుంది.
సరే, ఇక ఉంటానమ్మా,
నీ
చిన్ని.
 
Real Time Web Analytics