నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label రచయిత్రులు. Show all posts
Showing posts with label రచయిత్రులు. Show all posts

Sunday, March 12, 2023

నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం

 



ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్ సమావేశం. నిజంగా స్త్రీల సాహిత్య చరిత్ర లో నా వరకు ఇదొక శుభ సందర్భం. చారిత్రక సన్నివేశం.

ఆరేడు వందల ఏళ్ల క్రితం తాను తెలుగీకరిస్తున్న రామాయణం గురించి, తన గురించి ఎందరో స్త్రీలు ఇలా తలుచుకుంటారని మొల్ల ఊహించి ఉండదు. మాలతి గారి సాహిత్య కృషి గురించి కూడా కేవలం ఈ రోజే కాకుండా ముందు తరాల వాళ్ళు కూడా ఆమె కృషిని గుర్తించి గౌరవించి చర్చించుకొని మాట్లాడుకునే సందర్భాలు రాబోయే తరాల్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.

చారిత్రక మొల్ల కు, భవిష్యత్తు మాలతి గారికి మధ్య వారధి ఈ సమావేశం .

మొల్ల పేరుతోనే ఎందుకీ సత్కారం? అంటే---

80 ల నుంచి స్త్రీల సాహిత్య కృషిని ప్రత్యేక చారిత్రక దృక్పథం తో విమర్శకు పెట్టె సాధనాలు సమకూర్చుకున్న తర్వాత గార్గి గురించి, మైత్రేయి గురించి కూడా మాట్లాడుకోగలిగాము. మొల్ల తొలి తెలుగు కవయిత్రి. ఆమె కాలం గురించి, కులం గురించి, శీలం గురించి కూడా ఏవేవో పుక్కిట పురాణపు కథలు ప్రచారం లో ఉన్నాయి. అవి మనం లెక్క లొకి తీసుకోనక్కర లేదు. స్పష్టం గా కంటికి కనిపించే ఆధారం జాను తెలుగు లో, అప్పటి వ్యావహారికం లో సంస్కృత రామయాణాన్ని ధైర్యం గా తెలుగు లొ తనదైన శైలి లో రాసిన రచయిత్రి మొల్ల. ఈ కాలం లోనే స్త్రీల రచనలను ఎలా అంచనా వేస్తున్నారో చూశాక, ఆ కాలం లో ఆమె ఎదుర్కొన్న సమాజాన్ని కొంత ఊహించవచ్చు. అందుకు మొల్లను మనం గుర్తుంచుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు.

స్వాతంత్ర్యానంతరం రచయిత్రులు ఎంతొ మంది ఎన్నొ రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఇందులో ఎంత మంది ని మళ్ళీ మళ్ళీ మనం రీ రీడింగ్ అంటే పునర్ మూల్యంకనం చేసుకో గలుగుతున్నాము? ఆ దిశ గా ఆలోచించినప్పుడు ముందు మనకు గుర్తొచ్చే పేరు నిడదవోలు మాలతి గారు. 60 ల నాటి స్త్రీల సాహిత్య కృషిని గురించి ఆమె విశ్లేషణాత్మక మైన రచనలు చేశారు. అవి తెలుగు లోనే రాసి ఉంటే వాటి ప్రయోజనం కొంత మేరకే అయి ఉండేది. అయితే ఆమె ఈ కృషిని ఇంగ్లీష్ లో చేశారు. తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్ లో ఎంత మేరకు కృషి జరుగుతోందీ, అదీ ముఖ్యంగా స్త్రీల సాహిత్యం గురించి అన్న విషయం నేను ప్రత్యేకంగా మరో సారి గుర్తు చేయక్కర లేదు. నిడదవోలు మాలతి గారి కలం నుంచి వచ్చిన విశిష్ట రచనలలో ఆ వ్యాసాల సంకలనం ముందుంటుంది. ఆ రకంగా  తెలుగు లో వచ్చిన స్త్రీల సాహిత్యాన్ని ముందు తరాల వారికి పదిలం చేశారు. అందువల్ల మొల్ల పేరుతో సాహిత్య సత్కారం అనుకోగానే నాకు మొదట మెదిలిన పేరు మాలతి గారు మాత్రమే.

ఆమె బయో డేటా చదవటానికే నాకు పది నిముషాలు పడుతుంది. అన్ని రచనలు చేశారు.దాదాపు అన్నీ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె రాసిన కథలు ఎనిమిది సంకలనాలు. నాలుగు కథా మాలతీయాలు అయితే మరో నాలుగు ఎన్నెమ్మ కథా సంకలనాలు. వ్యాసాల సంకలనాలు మరో నాలుగు. ఇవి కాక చాతక పక్షులు, మార్పు రెండు నవలలు. అచ్చమైన డయాస్పోరా నవలను రాసింది మొదట మాలతి గారే. ఇవి కాక ఆమె అనువాదాలు, ఇంగ్లీష్ తెలుగు తూలిక వెబ్ సైట్లు. చాలా మంది అనువాదకులు సృజనాత్మక రచనలు తక్కువ చేస్తారు. లేదా వైస్ వర్సా. అయితే మాలతి గారు ఎన్ని చేతులతో ఇన్ని రచనలు చేశారో ఊహించటం కూడా కష్టం. తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్ లో చదవాలంటే రీసెర్చ్ స్కాలర్స్ కైనా , మామూలు చదువరులకైనా  authentic వెబ్సైట్ ఇంగ్లీష్ తూలిక. ఇంకా ఎన్నొ ఉన్నాయి ఆమె సాహిత్య కృషి ని గురించి చెప్పుకుంటూ పోతే.

నాకు మాలతి గారు రెండు దశాబ్దాల నుంచి తెలుసు. ఎన్నొ సాహిత్య చర్చలు ఫోన్ లోను, వీడియో, ఆడియోల రూపం లో నిర్వహించాము.



మాలతి గారి లాంటి రచయిత్రి  కన్నడం లోనో, మలయాళం లోనొ ఉంటే నెత్తిన పెట్టుకొని పూజించే వారు. దురదృష్ట వశాత్తూ ఆమె తెలుగు వారయ్యారు. అందులోనూ అమెరికా తెలుగు వారయ్యారు. అందుకే ఆమె కు రావలసిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంటుంది.

ఈ మొల్ల సత్కారం గురించి కూడా రెండు మాటలు చెప్తాను.

ఇది నగదు సత్కారం కాదు. దుశశాలువలు లేవు. వక్తలలో ఒకరు ముఖ్యలు, మరొకరు విశిష్టులు లేరు. అందరం సమానం. ఒక రచయిత్రి రచనల గురించి చదివి చర్చించుకోవటం ఒక్కటే పరమ ప్రయోజనం ఈ కార్యక్రమానికి. సత్కార గ్రహీతల విషయం లో కేవలం సాహిత్యం తప్ప, ప్రాంతీయ,కుల,అజెండా లకు మార్కులు లేవు. ఈ సత్కారం ఏడాదికోకసారి అనుకుంటున్నాను. సమయం, సహకారం ఉంటే ఏడాదికి రెండు సార్లు కూడా హాయిగా జరుపు కోవచ్చు. ఇతరుల సాహిత్యం గురించి మాట్లాడదాము. మన సాహిత్యం గురించి మరొకరు మాట్లాడటానికి దారి వేద్దాము.

మొల్ల సత్కారం గురించి నా ఆలోచనలు ఇవి. మీరందరూ ఈ సత్కారానికి ఎవరు అర్హులు అనుకుంటున్నారో తెలియ చేయండి. పరస్పరం మాట్లాడుకొని ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యం లో ఆదరణ కు నోచుకోని రచయిత్రుల రచనల గురించి మాట్లాడుకుందాము.

Thursday, July 21, 2011

ఎన్నడూ విచారణకు అంగీకరించకూ!


కథానుభవం-8

' మృణ్మయనాదం' లో అహల్య హెచ్చరిక

అపురూప సౌందర్య రాశి అహల్య ను నైతికానైతికతల త్రాసు లో తూచి చలనం లేని శిల ను చేశారు. రాముడి పాద స్పర్శ తో శాప విమోచనం జరిగిందని చెప్పి అసలు విషయం మీద జరగాల్సిన చర్చకు అవకాశం ఇవ్వకుండా అహల్య కథ ను ముగించేశారు. పంచ మహా పతివ్రతల్లో ఒకరుగా ఆమె ను చేర్చి ఆ తర్వాత ఘనకీర్తులందించారు.అహల్య మారు వేషం లో వున్న ఇంద్రుడిని గుర్తించిందా? లేదా? మారు వేషం లో వచ్చింది ఇంద్రుడని తెలిసి తెలిసీ అహల్య ఆ తప్పు చేసిందా ? లేక ఇంద్రుడి చేతిలో ఆమె మోసగించబడ్డదా? యుగాల నుంచి అహల్య తప్పొప్పుల గురించి ఈ చర్చ జరుగుతూనే వుంది.
" విచారణ జరపడం అంటే అపనమ్మకమే కదా. దాని కంటే ఏదో ఒక నమ్మకం నయం కదా!" అన్న ప్రధానమైన ప్రశ్న ను అహల్య పాత్ర ద్వారా లేవనెత్తుతుంది ఓల్గా తన ' మృణ్మయ నాదం ' కథలో. .మన మీద ఒకరు అధికారం తో, పశు బలం తో చేసే విచారణ వెనుక వున్న కుట్ర గురించి అహల్య మాట్లాడుతుంది. నా తప్పొప్పులను మీరు నిర్ణయించటం కాదు, అసలు వాటిని విచారించే అధికారం మీకెవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది . అంతేకాదు." ఎవరి సత్యం వారిది.సత్యాసత్యాలు నిర్ణయించగలిగే శక్తి ఈ ప్రపంచం లో ఎవరికైనా వుందా?" అని కూడా నిలదీస్తుంది.
అహల్య నుంచి , సీత నుంచి, రేణుక నుంచి ఇప్పటి దాకా కుటుంబాల్లో, చట్టాల్లో, కోర్టుల్లో, నడి రోడ్డు మీద స్త్రీలుతమ మనసు ల్లో ఏమనుకుంటున్నారో, శరీరాలు ఏం కోరుకుంటున్నాయో, ఏం చేస్తున్నాయో ఎన్ని సార్లు చర్చలు, విచారణలు జరిగి ఉంటాయో కదా! ఈ రోజు కి కూడా ఎక్కడో ఓ చోట, ఎవరో ఒక స్త్రీ మీద ఏదో ఒక రకమైన విచారణ జరుగుతూనే వుంది. ఆమె తప్పొప్పులను ఎవరో ఒకరు వెయ్యి కళ్ళతో నిర్ధారిస్తూనే వున్నారు. ఓల్గా ఈ కథ ద్వారా మాట్లాడుతోంది దాని గురించే. మన మనఃశరీరాల విచారణలో ముందు స్త్రీలకు తమ మీద తమకు అధికారం ఉంటుంది. అది మరెవ్వరి హక్కు కాదు. సొంతం కాదు అని అహల్య పాత్ర ద్వారా ఓల్గా మరో సారి స్పష్టం చేస్తోంది.
తొలి సారి అహల్య ని కలిసినప్పుడు " మీరు చేయని తప్పుకు దోషి గా నిలబడ్డారు " అని సీత ఆమె పట్ల జాలిపడుతుంది.
" ఈ లోకం లో అనేక మంది ఆడవాళ్ళు అలా నిలబడాల్సిందే గదా సీతా!" అంటుంది అహల్య.
" మీకు తెలియదు గదా అతను మీ భర్త కాదని" అన్న సీత సందేహానికి
" మారు వేషం లో వచ్చింది నా భర్త కాదని నేను గుర్తించానా, లేదా? లోకం లో అనేక మందిని వేధించే ప్రశ్న ఇది. నా భర్త కు మాత్రం ఆ తేడా లేదు. నాకు తెలిసినా, తెలియకపోయినా ఆయనాకొకటే. ఆయన వస్తువు తాత్కాలికంగా నైనా పరహస్తమయింది. మైలపడింది. మైల, శౌచం, పవిత్రం, అపవిత్రం, శీలం, పతనం -- ఈ పదాలను బ్రాహ్మణ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తే లేదు. విచక్షణే లేదు" అన్న అహల్య సమాధానం ఎంత సూటిగా, ఎంత నిర్భయంగా, ఎంత స్పష్టం గా ఉందో చూడండి.
అహల్య అంత స్పష్టం గా చెప్పినా సీత కు ఇంకా పూర్తిగా అనుమాన నివృత్తి కాలేదు. రాముడి మాటలు నిజమేనేమో, అహల్య సౌశీల్యవతి కాదేమో అనుకుంది. అప్పుడు అహల్య మరింత స్పష్టంగా యుగాల తరబడి తన మనసు లో దాచుకున్నవాటిని ప్రకటించించింది.
" నాలా మాట్లాడే స్త్రీలను భరించటం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలి పడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకెవరిచ్చారంటే మాత్రం ఎవరూ సహించరు".
" ఆ అధికారం గౌతమ మహర్షి కి కూడా లేదా?" భార్యల శీలం మీద భర్తలకు అధికారం వుంటుందని అందరూ చెప్పే మాటలను నమ్ముతూ అమాయకంగా ప్రశ్నిస్తుంది సీత.
" లోకం ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది. నేనివ్వలేదు. నేనివ్వనంత వరకూ ఎవరూ నా మీద అధికారాన్ని పొందలేరు" అంటుంది అహల్య.
చేసిన తప్పుకు అహల్య శిలలా పడి ఉందని అందరూ అనుకునే దానికి అహల్య చెప్పిన సమాధానం ఇది " ఇన్నేళ్లూ నేను ఈ విశ్వం లో నా అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ప్రపంచం ఏ నీతుల మీదా, ధర్మాల మీద నడుస్తోందో, వాటికి మూలమేమితో తెలుసుకున్నాను. నేనెంతో జ్నానమ్ సంపాదించాను. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే వుండదని, నిరంతరం మారుతూ ఉంటుందని తెలుసుకోవటమే నేను సంపాదించిన జ్నానం. "
సీత, అహల్య ల కలయిక, వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా కూడా అరణ్యవాస సమయం లో జరిగింది. చివరగా వెళ్లబోయే ముందు అహల్య, సీత కి ఒక హెచ్చరిక లాంటి సలహా కూడా ఇస్తుంది. " ఎన్నడూ విచారణకు అంగీకరించకూ సీతా. అధికారానికి లొంగకు" .
రావణ సంహారం తర్వాత సీత ను అగ్నిపరీక్షకు సిద్ధం కమ్మని లక్ష్మణుడు రాముడి ఆజ్న ను తీసుకువచ్చినప్పుడు సీత కు మొట్టమొదట అహల్య గుర్తొచ్చింది. ఆమె చెప్పిన ప్రతి మాట స్ఫురణకు వచ్చింది. అయినా సరే సీత రాముడి కోసం అగ్నిపరీక్ష కు సిద్ధపడింది. లోకం ముందు రాముడు నిస్సహాయుడు, బలహీనుడు అని సీత కు అర్థమయింది. లోకమంటే అది చెప్పే నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు అని సీత కు తెలుసు. లోకం నుంచి తన రాముడి ని రక్షించడానికి, అతని కన్నీరు తుడిచి అతనికి బలం ఇవ్వటానికి తాను తప్ప ఆ సమయం లో మరెవ్వరూ సహాయం చేయలేరని సీత కు తెలుసు. తాను అగ్ని పరీక్ష కు సిద్ధపడి రాముడి ని లోకం ముందు ధర్మం తప్పనివాడిగా నిలబెట్టింది సీత.
అగ్నిపరీక్ష తర్వాత అయోధ్య కి తిరిగివచ్చాక సీత కు అహల్య ని చూసి ఆమె తో మాట్లాడాలని బలంగా అనిపించింది. అందుకోసం ఒక సారి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి రావాలనుకుంది. ఆమె అరణ్యానికి ఒక సారి వెళ్ళి రావాలని ఒకందుకు కోరుకుంటే , రాముడు ఆమె ను శాశ్వతంగా మళ్ళీ అరణ్యవాసానికి పంపించివేశాడు. నిండు గర్భిణీగా వున్న సీత ను ఏమైనా కావలసినది ఉంటే సందేహించక చెప్పమని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు అహల్య ని చూడాలనుకుంటున్నానని చెప్తుంది సీత.
రావణ సంహారం తర్వాత నుంచి గడ్డకట్టుకుపోయిన సీత మనసు అహల్య ని చూడగానే , ఆమె స్నేహ స్పర్శ లో అది కరిగి నీరైపోయింది. సత్యాసత్యాల గురించి ఆనాడు అహల్య చెప్పిన మాటల అర్థం ఈ జరిగిన వాటన్నింటి వల్ల తనకు తెలిసినట్లు సీత వొప్పుకుంది. అంతే కాదు, తాను విచారణకు సిద్ధమయింది కేవలం రాముని కోసమే కానీ, తన కోసం కాదని చెప్తూనే అయినప్పటికీ అది ఎప్పటికీ అలా వెంటాడుతూనే వుంటుందా? అని సీత అడిగినప్పుడు " రాముని కోసం కాక నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునేవరకూ ఇది నిన్ను వెంటాడుతూనే వుంటుంది సీతా. నువ్వున్నావు. బాధ అనుభవిస్తునావు. ఎవరి కోసమో అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. ఎవరి కోసమో కర్తవ్యాన్ని పాలించావని అనుకుంటున్నావు. నీ ధైర్యం, నీ మనో నిబ్బరం అన్నీ పూర్తిగా ఇతరులకిచ్చావు. నీ కోసం ఏం మిగుల్చుకున్నావు?" అని అడుగుతుంది అహల్య.
నేనంటే ఎవరిని ? అని సీత అడిగినప్పుడు " నువ్వు శ్రీరాముని భార్యవు మాత్రమే కాదు. అంతకు మించినది, అసలైనదీ నీలో వుంది. అదేమిటో తెలుసుకోవాలని స్త్రీలకెవరూ చెప్పరు. పురుషుల అహం ఆస్తులలో, ప్రతాపాలలో, విద్యలో, కులగోత్రాలలో ఉంటే స్త్రీల అహం పాతివ్రత్యం లో, మాతృత్వం లో ఉంటుంది.ఆ అహంకారాన్ని దాటాలని స్త్రీలకెవరూ చెప్పరు. విశాల ప్రపంచం లో తాము భాగమని వారు గుర్తించరు. ఒక వ్యక్తి కి, ఒక ఇంటికి, ఒక వంశ గౌరవానికి పరిమితమవుతారు. ఆహాన్ని పెంచుకోవడం, ఆ అహం లోనే కాలీ బూడిదై పోవడం స్త్రీల గమ్యమవుతుంది. సీతా, నువ్వేవరో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నం ఆపకు. చివరకు తెలుసుకుంటావు. నీకా శక్తి ఉంది. శ్రీరామచంద్రుడిని కాపాడగలిగిన దానివి నిన్ను నువ్వు కాపాడు కోలేవా--ఇదంతా ఎందుకు జరిగిందని విచారించకు.ఇది నీ మంచి కోసమే. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం లో భాగం గానే జరిగింది.ఆనందం గా ఉండు. ఈ ప్రకృతి ని, సకల జీవ రాశి పరిణామ క్రమాన్ని పరిశీలించు. అందులో నిరంతరం జరిగే మార్పు ని గమనించు. అరణ్యం లో ఆశ్రమాలే కాదు, అనేక జాతుల ప్రజలున్నారు. వాళ్ళ జీవితాలు గమనించు. ఈ మొత్తం ప్రపంచం లో నువ్వున్నావు. ఒక్క రామునికే కాదు. నీకు మాతృత్వం అనుభవమవబోతోంది. దానిని కూడా ఆనందించు. ఏ కోరికలు, ఆశలు పెంచుకోకుండా లేడి పిల్లలను పెంచినల్టు నీ పిల్లలను పెంచు ."
నీ జీవితం, నీ కర్తవ్యం మొత్తం భర్త, పిల్లలు,ఆ కుటుంబం కోసం మాత్రమే కాదు. నీకు నువ్వు మిగలాలి. నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అహల్య అనుభవ పూర్వకంగా చెప్పిన ఈ మాటలు ఆ సీత కే కాదు, ఆధునిక సీత లకు కూడా నిస్సందేహంగా ఉపయోగపడే జ్నాన సంపద.
చెప్పవలసిన దంతా సీతకు చెప్పాక " సీతా! నా విషయం లో సత్యమేమిటో చెప్పమంటావా?" అన్న అహల్య మాటలకు సీత " వద్దక్కా, ఏదైనా ఒకటే. దానికే అర్థం లేదు" అంటుంది. నిజమే , అహల్య చేసింది తప్పో, వొప్పో తెలుసుకోవాలని ఇవాళ ఏ స్త్రీ ఆతృతపడటం లేదు.
అహల్య అందించిన జ్నానాన్ని, తన స్వానుభవ సారాన్ని మేళవించుకున్నాక, లవకుశులను ఆదరించి అక్కున చేర్చుకొని తన కోసం రాముడు చాచిన చేతిని అందుకోకుండా సీత తన గమ్యాన్ని తాను నిర్ణయించుకొని తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంటుంది.
"సీత సహాయం లేని రాముడు జీవితం లో మొదటి సారి ఓటమిని రుచి చూశాడు. బయట నుంచి వచ్చే అధికారానికి లొంగని సీత, తన లోపల తన మీద తనకున్న అధికార శక్తిని మొదటి సారి సంపూర్ణంగా అనుభవించింది. "
ఇతిహాస పాత్రలను నేటి సమాజానీకనుగుణంగా ఎలా అర్థం చేసుకోవాలో చెపుతూ ఓల్గా ఒక వరుస క్రమం లో రాసిన కథల సమాహారం " విముక్త". ఈ పుస్తకం లో ఈ మృణ్మయ నాదం కథ తో పాటు, సమాగమం, సైకత కుంభం, విముక్త, బంధితుడు కథలున్నాయి. ఒక్కో కథ మీద ఒక చిన్న పరిచయం ఇలాగే మీ కోసం....

Thursday, August 05, 2010

గిరిజనుల చీకటి బతుకుల్లో దీపం మహాశ్వేతా దేవి!


మారుమూల అడవుల్లో వొదిగి వుండే అమాయక జనం-గిరిజనం. నది వొడ్డుని ఆనుకుని, ఏ కొండ కొమ్ము నో కాసింత నీడ వెతుక్కొని , ప్రకృతి ప్రసాదించిన ఏ కొద్దిపాటి ఆహార వనరులనో నమ్ముకొని బతికే గిరిజనానికి బయటి లోకపు పోకడలేమీ తెలియవు. బయటి లోకపు రోడ్లు, వంతెనలు, ఇతరేతర సౌకర్యాలు ఏవీ వాళ్ళ దరి చేరవు.కానీ పట్టేడు నేల కనిపిస్తే చాలు , కబళీంచి కాసులుచేసుకోవాలనుకునే దురాశ జీవులు ఇప్పుడు కొండల్ని కరిగిస్తున్నారు. చెట్లని నరికెస్తున్నారు. అడవుల్లో దొరికే ప్రతి సంపదనీ కొల్లగొట్టి, లాభాలతో తమ సంపదల్ని పెంచుకుంటున్నారు.గిరిజనం జన్మ హక్కయిన భూముల్ని ఆక్రమించి , ఆ భూమ్మీద బతికే గిరిజనాన్ని వెళ్ళగోడ్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళని, దోపిడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారు. లెక్కలు,పట్టాలు, దస్తావేజులు, చట్టాలు ఏమీ తెలియని అమాయక ఆదివాసులు నమ్ముకున్న భూమిని వదులుకొని, చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళే కాదు, ప్రకృతి అందాలన్నీ చెదిరిపోతున్నాయి. వాళ్ళ ఆటలూ పాటలతో ప్రతిద్వణించాల్సిన అడవులు దెయ్యాల గూళ్ళవుతున్నాయి.అలా చెదిరిపోతున్నఆదివాసులకు ఏ ప్రభుత్వామూ అండగానిలవడం లేదు. వాళ్ళ హక్కులేమిటో వాళ్లకే తెలియక అజ్నానమ్ లో , ఆవిద్య లో , అంధకారం లో కూరుకుపోతున్న ఆదివాసీ జన సమూహాల్లోకి, వాళ్ళ చీకటి బతుకుల్లో ఒక దీపం లా నడిచి వచ్చింది మహాశ్వేతా దేవి.


ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతేగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అడవుల్లోకీ వెళ్లింది. నగర జీవితం లో పుట్టి పెరిగిన మహాశ్వేతా దేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనల్నీ వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్ర్యం, అమాయకత్వం ....వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకుఅమ్మ. తరతరాల దోసిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశ లోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యం గా పోరాడి గెలిచిన యోధ మహా శ్వేత దేవి.


ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకా లోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబం లో పుట్టిన మహా శ్వేతా దేవి చిన్న వయస్సులోనే ‘ గణ నాట్య ‘ అనే ఒక ధియేటర్ బృందం తో కలిసి పని చేసింది. 1930,40 ల్లో ‘ గణ నాట్య ‘ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్ లోని పల్లె సీమల్లో ‘ గణ నాట్య ‘ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘ గణ నాట్య ‘ అడుగు పెట్టిన చోట అజ్నానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయం లో ఆంగ్ల సాహిత్యం లో ఎమ్మే చదువుతున్న కాలం లో కూడా మహాశ్వేత ‘ గణ నాట్య ‘ ప్రభావం తో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగం లో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలం లోనే ఆమె అధ్యాపకురాలిగా , పత్రికా రచయితగా ఉద్యోగ జీవితం లోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారం గా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన “ ఝాన్సీర్ రాణి ‘ తో ఆమె సాహిత్య జీవితం 1956 లో మొదలైంది.


కేవలం గ్రంధాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలో ఝాన్సీ లక్ష్మీ బాయి ఎలా శాశ్వతం గా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకం లో ఆ వీరనారి జ్నాపకాలు ఏ విధంగా సజీవం గా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహా శ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబం లో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్ ఖాండ్ కి ప్రయాణమైంది మహా శ్వేత. బుందేల్ ఖాండ్ చుట్టూరా ఎన్నో ఉర్లు తిరిగింది. మామూలు జనం తో ముఖ్యం గా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ ఝాన్సీర్ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితం లో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభా కి నిలువుటద్దాలు. భారత దేశం లోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్నానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ ఆసియా నోబెల్ ‘
గా పేరు పొందిన రామన్ మెగాసెసే అవార్డ్ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోష ని అక్షరబద్ధం చేసిన ‘ హజార్ చౌరాసీ మా ‘నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వం లో చిత్రం గా వెలువడి , ఆమె కీర్తి ని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది.


1965 లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేత లో చాలా మార్పు వచ్చింది. “ ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధన స్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమి ని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోటి మట్టికొట్టి విలాసం గా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితం లో ఇన్ని వ్యత్యాసలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్న చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.


తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది.


ఒక వైపు దేశం 21 వ శతాబ్దం లోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశ లోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రి గా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్త గా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.
గిరిజనల బతుకుల్లో వెలుగులు నింపే దశ లో ఆమె మొదటి మెట్టు: వాళ్ళ ఆర్ధిక స్థాయి ని పెంచడం, జీవన స్థితి ని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటు లో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారం గా తీసుకొని , వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయం గా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయం లో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటు లో వున్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్క పంట వేసి, భూమిని పోడు తో పాడు చేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమి లో మూడు పంటలు వేసే స్థితి కి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్ధిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కోంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తి సామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యం తో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.


ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకు వచ్చిన వెలుగులు లెక్కలేనన్నీ. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగం లోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన , కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యం తో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నామయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.


కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితం గా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహా శ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియా లోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులు గానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథం లో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే , పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులు గానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతం తో ఈ పోరాటానికి నాంది పలికింది మహా శ్వేత. బుధాన్ ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్ కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత . ఈ పోరాటం లో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్ర లో మొట్ట మొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.


మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెత్తివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్ చేసింది. “ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ “ అనే ఒక సంష్ట ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశం లోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధి లోకి తీసుకువచ్చింది.


2006 లో ఫ్రాంక్ఫర్డ్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిధిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశం లో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పాడింది. దుష్ట శక్తుల పన్నాగం లో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.


( 2007 లో ఈటీవీ -2 మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి ఇచ్చిన స్క్రిప్ట్)

Saturday, July 31, 2010

మహాశ్వేత రచనలు తెలుగు లో ఎవరూ చదవలేదా?

‘ ప్రమాదో ధీమతా మపి’ ---బుద్ధిమంతులు కూడా పొరపాటు పడతారు. పొరబడటం అనేది సర్వజన సామాన్యం అని తెలుసు. కాబట్టి ఈ కింద నేను పేర్కొనే అంశాలు మాలతి చందూర్ గారి మీద గౌరవ ప్రపత్తులతో మాట్లాడుతోందే అని గమనించగలరు.


“ నన్ను అడగండి” శీర్షిక కింద జూన్ 25 వ తేదీ స్వాతి సపరివారిపత్రికలో “ లిటరేచర్” కేటగిరీలో అడిగిన ప్రశ్నకు మాలతి చందూర్ గారి సమాధానం నన్ను నివ్వెరపరిచింది. ఆ ప్రశ్న, ఆమె ఇచ్చిన సమాధానం,దానికి నా ప్రతిస్పందన చదవండి.

“ శరత్ చంద్రుని పోలిన తెలుగు నవలాకార్లు లేరనేవారు. అలాగే మహాశ్వేతాదేవిని పోలిన రచయిత్రులు ఎవరూలేరా?” అన్నది ప్రశ్న.
మాలతి చందూరి గారి సమాధానం చదవండి:

వేలూరి శివరామశాస్త్రి బెంగాలీ నుంచి తెలుగు లోకి అనువదించిన “ రాముని బుద్ధిమంతనం’, తీరని కోరికలు’ అనూహ్య పాఠకాదరణ పొందాయి.

ఆ తర్వాత చక్రపాణీ, బొందలపాటి శివరామకృష్ణ , గద్దె లింగయ్య వంటి వారెందరో శరత్ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ముప్పైల ద్వితీయార్థం లోనే ‘ దేవదాసు’ పిక్చర్, సైగల్ హీరో గా బెంగాలీ, హిందీలలో కలకత్తా నుంచి వచ్చింది.

వేలూరి వారి ‘ రాముని బుద్ధి మంతనం’ ప్రకాష్ ప్రొడక్షన్స్ ‘ దీక్ష’ గా యాభైల నాటికే తెరకెక్కింది. ఇక మహా శ్వేతా దేవి విషయమంటారా? కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకొను.

తెలుగు వచనారచనా ప్రపంచం ప్రాంతాల వారీ, జిల్లాలా వారీ గీతాలు గీసుకుంటోంది. మేము ఏనాడో రాష్త్రేతరాంధ్రులయ్యాము కాబట్టి మమ్మల్ని ఇవేమీ తాకవు.

మహాశ్వేతాదేవి తో కేరళ లోని తుంజన్ మెమోరియల్ సెంటర్లో గడపగలడం మా అదృష్ట్రం. ఉదయం పూట చెట్ల మధ్య తిరుగుతూ ఎన్నెన్నో అపూర్వ విషయాలు చెప్పేవారు. సన్మిత్రులు జ్నానపీఠ్ అవార్డ్ గ్రహీత పద్మ భూషణ్ వాసుదేవన్ నాయర్ కేరళ లోని తుంబన్ కేంద్ర వ్యవస్థాపకులు , కార్య నిర్వాహకులూను. మూడు రోజుల సెమినార్. కానీ రెండో రాత్రే మహాశ్వేతా దేవి బొంబాయి వెళ్ళి పోయారు. అక్కడేదో పని వుండటం వల్ల ఆ రెండు రోజులు స్మృతి వాటికలో పచ్చనాకులా భాసిస్తాయి.

తన ముప్పైయవ ఏట 1956 లో మొదటి నవలా రచనకు పూనుకున్నారామే. ఆంగ్లేయులు తన రాజ్యాన్ని కబళీంచకుండా ఆశ్విక యుద్ధం లో కత్తి ఝళిపిస్తూవీరోచితంగా పోరాడి నెలకొరిగిన ధీరనారి ఝాన్సీ రాణి అని మనకందరికీ తెలుసు. కానీ మహాశ్వేతా దేవి ఆ నవలకు రూపకల్పన చేసే ముందు చారిత్రాకాంశాలు క్షుణ్ణంగా చదివారు. అర్కైవ్స్ పూర్తిగా పరిశీలించారు.

ఝాన్సీ నగరం వెళ్లారు. ఝాన్సీ రాణి గురించి ఎడారి తెగలు పాడుకొనే పాటలు, మైదానాల్లోని జానపదుల గీతాలు శ్రద్ధగా ఆలకించి , నిగూఢ వృత్తాంతాన్ని ఆకళింపు చేసుకొని మనోముద్రితమైన వాటితో నవలారచనకి ఉపక్రమించినప్పుడు అదేలా వుంటుందో వేరే చెప్పాలా?

ఇదీ మాలతి చందూరి గారి సమాధానం. ఆమె తన సమాధానం లో “ కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకోనూ”. అన్నారు. విశ్వసాహిత్యాన్ని చదువుకున్న రచయిత్రి మాలతి చందూర్ గారి కలం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ని చదివి నేను ఆశ్చర్యపోయాను.

మహాశ్వేత దేవి ని పోలిన రచయిత్రులు తెలుగు లో ఎవరూ వుండి వుండకపోవచ్చు. కానీ మహా శ్వేత దేవి రచనలు కూడా ఎవరూ చదివి వుండరని వ్యాఖ్యానించడం శోచనీయం. మహాశ్వేత దేవి రచనల్లో ముఖ్యమైనవి తెలుగు లో అనువాదమయ్యాయి. ఆ అనువాదాలే కాక ఇంగ్లిష్ లో అనువాదమైన ఆమె ముఖ్యమైన రచనలు ( గాయత్రి చక్రవర్తి స్పైవాక్ క్రిటికల్ అనాలిసిస్ తో సహా) నేను చదివి కొన్నేళ్ళ క్రితం వార్త ఆదివారం దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. నాతో పాటు అనేకమంది రచయిత్రులు మహాశ్వేత దేవి రచనలు చదివి విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. బహుశా ఆంధ్ర దేశ సాహిత్యానికి దూరం గా వుందటం వల్ల మాలతి చందూర్ గారికి మహాశ్వేతాదేవి కథలు తెలుగు లోకి అనువాదమయ్యాయన్న విషయమైనా తెలిసో లేదో నాకు తెలియదు.

మహాశ్వేతాదేవి రచనలు ఒక తల్లి ( హజార్ చౌరాసీ మా), ఎవరిదీ అడవి? ( జంగల్ కి అధికార్), దయ్యాలున్నాయి జాగ్రత్త ( దాయిన్) బషాయిటుడు, రుడాలీ కథలు, చోళీకే పీచే ....ఇవన్నీ కేవలం హెచ్ బి టి వాళ్ళు చేసిన ప్రచురణలు. మాలతి చందూర్ గారు భ్రమపడినట్లు తెలుగు రచయిత్రులే కాదు మామూలు పాఠకులు కూడా ఎవరైనా ఇప్పటివరకూ ఆమె రచనలు చదివి వుండకపోతే( నేననుకొను) బహుశా ఇప్పుడు పైన నేను చెప్పిన పుస్తకాలన్నీ హెచ్ బి టీ వాళ్ళ దగ్గర ఇంకా దొరుకుతూ వుండవచ్చు. ప్రయత్నించి చూడండి.

ఇవి కాక ఆమె రచనలు దాదాపుగా అన్నీ ఇంగ్లీష్ లో విరివిగా దొరుకుతాయి.

ఒక బాధ్యతాయుతమైన రచయిత్రిగా, విజ్నురాలిగా మాలతి చందూర్ లాంటి ప్రముఖులు కూడా తోటి రచయిత్రుల పట్ల బాధ్యాతారహితంగా, పత్రికాముఖం గా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు.

నేను పోగొట్టుకున్న రచనల్లో మహాశ్వేతా దేవి రచనల మీద రాసిన వ్యాసం కూడా వుంది. కాబట్టి ప్రస్తుతానికి అది ఇక్కడ పెట్టలేను కానీ. ఈటీవీ లో మార్గదర్శి కార్యక్రమం కోసం మహాశ్వేతా దేవి జీవితం గురించి 2006-07 మధ్య నేను రాసి ఇచ్చిన వ్యాసం త్వరలో పోస్ట్ చేస్తాను.

Saturday, July 03, 2010

కార్పొరేట్ సంస్కృతి కి అక్షర చిత్రం “ రాతిపూలు”




తొలి నవల ‘ సుప్త భుజంగాలు ‘ తోనే తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సాహిత్య లోకం లో సంపాదించుకున్న రచయిత్రి సి. సుజాత కలం నుండి దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత వెలువడ్డ మరో నవల “ రాతిపూలు”. రంగుల కల లాంటి సినీ పరిశ్రమకు, ఆధునిక కార్పొరేట్ జీవితానికి దర్పణం ఈ నవల. కార్పొరేట్ సంస్కృతి కాళ్ళ కింద నలిగిపోయిన జీవితాల్లోని సంఘర్షణ ఈ నవలకు ఆయువుపట్టు. కాలక్షేపం కోసం కాకుండా ఈనాటి నగర జీవన సంస్కృతి అనే వూబి లో కూరుకుపోతున్న జీవితాలను గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారు తప్పక చదవాల్సిన, చదివింపచేసే గుణం వున్న నవల ‘ రాతిపూలు’.


హైదరాబాద్ రణగొణద్వనుల మధ్య పరుగులు పెట్టె ట్రాఫిక్ లో పగలు, రాత్రి మన చుట్టూరా కనిపించే వ్యక్తుల అసలు సిసలు తెరవెనుక జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ నవల. పట్టణం లో అందంగా కనిపించే అబద్ధపు జీవితాలు ప్రాణం లేని, వాసన రాని రాతిపూల లాంటివి.చూడటానికి అందంగా వుండి, సున్నితంగా కనిపిస్తూ ఎప్పటికీ వాడిపోకుండా నిత్య నూతనంగా ఉంటాయి ఈ రాతిపూలు. కానీ జీవం,పరిమళం లేని వొట్టి రాతిపూలు అవి.


నగర జీవితమంటే ఇవాళ అందరికీ కనిపిస్తున్నది వస్తు వ్యామోహమే. కానీ దాని వెనుక విఫలమైన ప్రణయాల్ని, కూలిపోయిన కాపురాల్ని చూపిస్తుంది రచయిత్రి ఈ నవల లో. భవంతుల కోసం భార్యల్ని తాకట్టు పెట్టే రసజ్నలు, వస్త్రాపహరణాలు చేసి దోచుకునే సురేంద్ర లు, తప్పని తెలిసి ఆ తప్పును చేయకుండా నిగ్రహించుకోలేకపోయిన అహల్య లాంటి శమంతల కథ ఇది.

ఈ నవలలోని ప్రధాన స్త్రీ పాత్రలన్నీ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చి కెరియర్ నిచ్చెన మెట్లు ఎక్కి పైకి ఎదగాలనుకొని ఆశపడి, ఆ క్రమం లో తమ వ్యక్తిత్వాల్ని, తమ నమ్మకాల్ని, తమ ఆశల్ని, జీవితం పట్ల తమ ప్రేమని పణంగా పెట్టి వొడిపోయిన వాళ్ళే. డబ్బు చుట్టూ అల్లుకున్న సక్సెస్ వూబిలో పడి కూరుకుపోయినవాళ్ళే. నైతికానైతికాల త్రాసు లో తూచి ఈ నవలలోని పాత్రల్ని విశ్లేషించలేము. నగర జీవిత చిత్రణ లో రచయిత్రి కున్న జర్నలిస్ట్ వృత్తి అనుభవం, సామాజిక సమస్యల పట్ల అవగాహన మనకు ఈ నవలలో కనిపిస్తుంది. శమంత, కిన్నెర, జమున లాంటి స్త్రీల మీద జాలో, సానుభూతో, లెదంటే అసహ్యమో కాకుండా ఓ మనిషి లో వుండే మామూలు బలహీనతలతో వాళ్ళను అర్ధం చేసుకోవాలనిపిస్తుంది ఈ నవల చదివాక.

ఒక సారి చదవటం మొదలుపెట్టాక ఆపకుండా చదివించే శైలితో సాగుతుంది. ఈ నవల చదవటం పూర్తి చేశాక, ఒక అద్దం లో నగరాన్ని, మన జీవితాల్నీ కలిపి ఎదురుగా అక్షర కాన్వాస్ మీద చూస్తున్నట్లు అనిపిస్తుంది .


కార్పొరేట్ జీవన శైలిలో ఒక్కోసారి కుటుంబం, మానవ సంబంధాలు, కట్టుబాటు అన్నీ ఎట్లా దూదిపింజెల్లా ఎగిరిపొతాయో. కోరుకున్న జీవితం కోసం శరీరం తో, మనసు తో వ్యాపారం చేయడం ఒక్కోసారి ఎలా అనివార్యమవుతుందో విశ్లేషిస్తుంది రచయిత్రి ఈ నవల లో. ఒక మనిషి ఉనికిమొత్తం డబ్బే అయినప్పుడు లెక్కలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి. అనుబంధాలన్నీ మారిపోతాయి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలతో హాయిగా వుండాలనుకుంటాం. ఆ దారిలో నడుస్తాం. గమ్యం చేరాక నిజంగానే ఆనందం గా వుంటామనుకుంటాము. కానీ అది నిజం కాకపోవచ్చు. ఆ దారి లో మనం ఎన్నింటినో, ఎందరినో కోల్పోతాం . మనం కోరుకున్న, ఆశపడ్డ డబ్బులు మనకు అందాక మన దగ్గర చూసుకుంటే శాంతి వుండదు. ప్రశాంతత మిగలదు. డబ్బు తెచ్చే సౌఖ్యాలు, ఎలాంటి సంతోషాన్ని మిగల్చవు. నడిచొచ్చిన దారి, మనం పోగొట్టుకున్నవి అప్పుడు స్పష్టం గా కనిపిస్తాయి. కానీ జీవితాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోలేము.కేవలం పశ్చాత్తాపపడటమో,బాధపడటమో తప్ప.

ఈ నవలలో కథానాయిక శమంత అందుకే తను చేసిన వాటిని తప్పొప్పులతో పోల్చుకోదు. వాటిని కేవలం పనులుగా చూస్తుంది.ఎందుకంటే ఆమె తన శరీరంతో, మనసుతో చేసిన దాన్ని ఒక వ్యాపారంగానే భావించింది. జీవితాన్ని వ్యాపారం గా మలుచుకోవటం లో ఒక రాతిపువ్వు లాగా మారిన శమంత మళ్ళీ కావాలనుకుంటే మనిషి గా మారగలదా? ఆ ప్రయత్నం అటు రసజ్న, ఇటు శమంత ఇద్దరూ మొదలుపెట్టాలి. అది కష్టమైనా అసాధ్యం కాదు. అలా జీవితం పట్ల తిరిగి ఆ ప్రేమ ను, ఆ నమ్మకాన్ని ఈ నవల ద్వారా రచయిత్రి సి. సుజాత అందిస్తుంది.


రాతి పూలు (నవల)
నవ్య వీక్లీ లో ధారావాహిక ప్రచురణ
ప్రతులకు:అన్నీ పుస్తకాల షాప్ లు
రచయిత్రి ఫోన్ నెం: 9553586086
ఈమైల్ : sujata.c@hmtv.in


(ఈ చిన్న పరిచయం వ్యాసం నుంచి కొంత భాగం జూలై 4 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైంది)

కల్పనారెంటాల

Tuesday, January 12, 2010

నా జ్ఞాపకాల పేటికలో సాహితి ‘లత‘ !

తెలుగు సాహిత్య రంగంలో సుప్రసిధ్ధ నవలా రచయిత్రి తెన్నేటి హేమ లత. లత అంటే మోహనవంశీ లతా, ఊహాగానం లత. సాహిత్యం ఆమె ప్రాణం.అందుకే ఆమె సాహితీ లత ‘. మోహనవంశీ వేణు నాద తరంగధ్వనులు ఆమె ఉచ్చ్శ్వాస నిశ్వాసలు. వంశీ మోహనుడ్ని అణువణువునా నింపుకున్న రాధ ఆమె. .సంచలనాలకు, ఊహాగానా లకు, వాద వివాదాలకు మారుపేరు ఆమె. ఆడ చలం గా పేరు పొందిన లత వందకు పైగా నవలలు, నాటికలు, అనువాదాలు, కాలమ్స్ ,ఆత్మ కథలు రాశారు . ఆమె రచనలు ఒక ఎత్తు. ఆమె రేడియో ప్రసంగాలు, నాటకాలు ఒక ఎత్తు. ఆమె రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అక్కర్లేదు కూడా.

లత అంటే నిర్భీతి అన్న విశేషణం గుర్తుకు వస్తుంది. ఆమె మాటల్లో కానీ, చేతల్లో కానీ , రాతల్లో కానీ భయం అన్నది లేశమాత్రమైనా కనిపించదు. నిక్కచ్చిగా మాట్లాడుతుంది. రాస్తుంది. ఒక రచయిత కి వ్యక్తిగతం గానూ, రచనాపరం గానూ వుండవలసిన సూటిదనం, నిజాయితీ ఆమెలో పుష్కలంగా వున్నాయి. ఏమంటే ఏం ముంచుకొస్తుందో, ఏం రాస్తే ఏం వివాదం అవుతుందో అన్న భయం లేని అతి కొద్దిమంది రచయితల్లో లత ఒకరు.

సాహిత్య పరంగానూ, వ్యక్తిగతం గానూ లత నాకు సుపరిచితురాలు. విజయవాడ లో పుట్టి పెరిగి, లత గురించి తెలియని సాహితిప్రియులు వుండరు. చలంకు, లత కు ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన అప్రతిష్ట. సెక్స్ విశృంఖలంగా రాస్తారని. నాకైతే ఇద్దరి విషయంలోనూ సమాజం అపార్ధం చేసుకుందనే అనిపిస్తుంది. కీర్తి, అపకీర్తి రెండింటిని సమంగా మోసిన రచయిiతలంటే నాకు వాళ్ళిద్దరే గుర్తుకు వస్తారు. లత రచనలు ఒక ఎత్తు. ఆమె స్వీయ చరిత్ర, ఆత్మ కధ, లేదా డైరీ ఒక ఎత్తు. లత రాతల్లోని వాతల గురించి మాట్లాడాలంటే ఒక ఉద్గ్రంధమే తయారవుతుంది. ముందు ఆమెతో నాకున్న అనుబంధం గురించి మాట్లాడి తర్వాత తీరిక చిక్కినప్పుడు ఆమె రచనల గురించి రాస్తాను .

లతని అనేక సార్లు విజయవాడ లో చిన్నతనం నుంచి కలుసుకున్నాను. 1995-96లో విజయవాడ లో సిటీ కేబుల్ వారి కోసం లత ని ఇంటర్వ్యూ చేశాను. అదే నేను ఆమె తో చివరి సారిగా మాట్లాడటం, చివరి సారి ఆమెను చూడటం. 1997 లో ఆమె కన్ను మూశారు.15, 16 ఏళ్లకే “ గాలి పడగలు –నీటి బుడగలు” నవలతో సాహిత్య రంగం లో ఆమె కాలు మోపింది. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెకు 58 నో, 59 నో వయస్సు. విజయవాడ హనుమాన్ పేట లో మేడ మీద వున్న ఇంట్లో ఆమెను ఇంటర్వ్యూ చేశాం. టీవీ ఇంటర్వ్యూ అంటే వుండే హడావిడీ, హంగామా గురించి ప్రత్యేకం గా చెప్పక్కరలేదు. మేకప్, ఇంటి అలంకరణ లేకుండా ఏ టీవీ షూటింగ్ జరగదు. కానీ ఆ షూటింగ్ లో న్యూస్ ఎడిటర్, ప్రొడ్యూసర్ చంద్ర శేఖర్ , సిటీ కేబుల్ కెమెరామెన్ , నా హడావిడీ తప్ప ఆమె ఏమీ పట్టనట్లు, పట్టించుకోనట్లు , నిశ్చలంగా, నిశ్చింతగా కూర్చొని వున్నారు ఆమె . మా బలవంతం మీద కాబోలు ఆమె మోహానికి కాస్త పౌడర్ అద్దుకున్నారు.” నాకేమిటే మేకప్పు లం...ముం...!. అతి లోక సౌందర్యవతిని. ఎప్పుడూ రాధనే నేను....” అనేవారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు నాతో సరదాగా. పూర్వకాలం బ్రాహ్మణ కుటుంబాల్లో లం...ముం....తిట్లు ముద్దుగా, ప్రేమతో తిట్టే తిట్లు. ప్రేమ మరీ ఎక్కువైతే బ్రాహ్మణులకు అంతకన్నా మంచి పదం మరొకటి నోటికి వచ్చేది కాదనుకుంటాను. ఇవాళ్టి సంస్కారాల ప్రకారం అది తప్పో, అనాగరికమో కానీ అది ఆమె సహజ ప్రవృత్తి. ఇంటర్వ్యూలో కూడా ఆమె ఆ పదాలు ఎక్కడ వాడేస్తారేమోనని నేను హడలిచచ్చాను కానీ పాపం ఆమె అంత పని చేయలేదు. పైగా ఆమె నాకంటే ముందు నుంచీ ఆకాశవాణిలో పనిచేసిన అనుభవజ్నురాలు. ఏ పదం మైక్ ముందు, టీవీ ముందు వాడాలో, వాడకూడదో తెలియకుండా వుంటుందా..నా పిచ్చిగాని.

కేబుల్ టీవీ కి ఆమె ను చేసింది సాధారణ రొడ్డకొట్టుడు ఇంటర్వ్యూ అన్నట్లు గుర్తుంది. ( ఈ సారి ఆ కాసెట్ సంపాదించాలి ఎక్కడైనా) మీరెక్కడా పుట్టారు? మీ మొదటి పుస్తకం ఏమిటి? ఎన్ని అవార్డులు వచ్చాయి టైప్ అన్న మాట. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకునేటప్పుడు నవ్వులే నవ్వులు. మాటలే మాటలు. ఆమె వేసే చెణుకులకు, మామూలుగానే ఒక మాటకు పది సార్లు నవ్వే నేను మరింత ఎక్కువగా నవ్వాను ఆ రోజు. ఆమె కి భేషజాలు లేవు. నేను ఇంత పెద్ద రచయిత్రి అంటూ గొప్పలు వుండేవి కావు. ఎవరితోనైనా అలా ఆత్మీయంగా మాట్లాడేస్తుంది. వొట్టి మాటలే కాదు విమర్శించేస్తుంది కూడా. ఆమె ను అర్ధం చేసుకోలేనివాళ్ళు మొదటి పరిచయంలో కొంత బెంబేలు పడిపోయినా నెమ్మదిగా ఆమె ప్రేమ అర్ధమైతే అంతే ఆత్మీయంగా ఆమె తో కలిసిపోతారు. ఆ ఇంటర్వ్యూ కోసం వెళితే ఆమె కానీ, వాళ్ళ ఇల్లు కానీ ప్రత్యేకంగా ఏమీ సర్ది లేదు. ఎప్పుడూ వున్నట్లే ఆ హాలు నిండా పుస్తకాలు, ఆమె అవార్డులు. ఈ రూమ్ కాస్త సర్దితే బావుంటుందెమో , మీరు కొంచెం ఆ చీర సరిచేసుకుంటే బావుంటుందెమో అని అంటే, ఒరేయి, ఓ అబ్బాయి, (ఆమె అందర్నీ ఇలాగే పిలుస్తుంది) నేనేమిటో అందరికి ఇలాగే తెలుసు. నీక్కావాలంటే నువ్వే సర్దేసుకో నాయనా అనేసింది. ఇక తప్పుతుందా, అలా షూట్ చేయలేక మా వాళ్ళే అవన్నీ సర్ధి ఆమె ఇంటర్వ్యూ ని షూట్ చేశారు. అలా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టడంతో మేమిద్దరం చాలా సేపే మాట్లాడుకున్నాం. మా నాన్నగారితో తన స్నేహం గురించి, ఆయన దగ్గర ఆమెకు ఏమీ నచ్చవో అన్నీ చెప్పుకొచ్చింది.

అప్పటి ఆమె రూపు ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. పొడుగాటి జుట్టు వదులుగా అలా వదిలేస్తుంది. ఆ చీర కట్టూ అంతే. భౌతికమైన విషయాలకు ఆమె అంత ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించదు. టాపు వేసుకోకుండా రిక్షాలో ఒక్కతే విశాలంగా కూర్చొని వెళుతుంటుంది. మధ్యలో మనమేవరైనా కనిపిస్తే అక్కడ ఆ రిక్షా అబ్బిని ఆపి “ ఏమోయ్ ! రెంటాల! ఎక్కడిదాకా?” అంటూ కబుర్లు మొదలెడుతుంది. కంఠస్వరమేమో చిన్నది కాదు. ఆమె మాటలు ఆ రోడ్దంతా వినిపిస్తూ వుండేవి. వెళ్ళేవాళ్ళంతా ఆగి, విచిత్రంగా చూసుకుంటూ వెళ్తున్నా ఆమె ఏమీ పట్టించుకోదు. ఆమె మీద వచ్చిన దుమారాల్నే పట్టించుకోని ఆమెకు ఇలాంటి విషయాలు ఒక లెక్కా?

విజయవాడ అంటే కళలకు పుట్టినిల్లు. రోజూ వూర్లో ఎక్కడో ఓ చోట సినిమా సభనో, సాహిత్య సమావేశమో, సంగీత కచేరీనో, నృత్య ప్రదర్శన నో జరుగుతుంది. సామాన్యం గా అన్నింటికీ నేను, మా నాన్నగారు క్రమం తప్పక హాజరు. మా నాన్నగారిది జర్నలిస్ట్ గా ఉద్యోగా బాధ్యత. నేను కల్చరల్ రిపోర్టర్ ని కాకముందు నుంచి కూడా మా నాన్నగారితో కలిసి వాటన్నింటికి హాజరు. బాలమురళి , వోలేటి, చిట్టిబాబు తదితరుల కచేరీలకు లతా కూడా వచ్చేవారు. మొదటి సారి ఆమెను చూసినప్పుడు “ మన లత “ తెలుసు కదా అన్నారు మా నాన్నగారు ఏక వాక్యంలో. అవును అంటూ నేను తలూపటం, మన అమ్మాయా?” అంటూ ఆమె ఆప్యాయంగా పలకరించటం ఒక మధుర స్మృతి. లత రెండో అబ్బాయి పేరు మోహనవంశీ. వాసిరెడ్డి కనకదుర్గ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నప్పుడు అతను నాకు సహపాఠి. మోహనవంశీ ఇప్పుడెలా వున్నాడో కానీ వాళ్ళ అమ్మ లా కాదు. చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. అన్నీ భావాలు ఆ కళ్ళతో పలికించేవాడు. లత కి మాత్రం ముక్తసరిగా మాట్లాడటం, రాయటం నప్పదు. ఆమె మాట్లాడినా, రాసినా గంగా ప్రవాహంలా వుండాల్సిందే. మధ్య మధ్యలో “ స్వైరిణి అన్నారే నన్ను శ్యామసుందరా ..” అంటూ రజని పాటనో, అలవోకగా గాలిబ్ నో, ఉమర్ ఖయ్యాం నో ఎవరినో ఒకరిని కోట్ చేస్తూ వుంటుంది. ఆమె వాగ్ధాటి ముందు మనం తట్టుకోలేం అనిపిస్తుంటుంది. అంత బలమైన వ్యక్తిత్వం ఆమెది, ఆమె సాహిత్యానిది. ఆమె ని మర్చిపోకుండా వుండటం అంటే ఆమె రచనలు తరుచూ చదువుతూ వుండటమే. ఆమె డైరీల్లో ఈ తరం వాళ్ళకు తెలియని ఎన్నో సాహిత్య విశేషాలు, గొడవలు, దుమారాలు వున్నాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు బయట లభ్యమవుతాయో, లేదో తెలియదు కానీ , వీలైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించినవి అప్పుడప్పుడూ టపాలుగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. కాలం మర్చిపోలేని సాహితిమూర్తి లత.

లత రచనల గురించి నిడదవోలు మాలతి గారు తన బ్లాగ్ లో రాసిన సమగ్ర వ్యాసం ఇక్కడ చదవండి.

కల్పనారెంటాల

Monday, December 07, 2009

' మూస ' పోసిన సాహిత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు?



(నిడదవోలు మాలతి గారి పుస్తకానికి నేను రాసిన ముందు మాట డిసెంబర్ 7 వ తేదీ ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమైంది. అది ఇక్కడ మీ కోసం.... ఈ పుస్తకం పొట్టి శ్రీరాములు యూనివర్సిటి వారి దగ్గర దొరుకుతుంది. వెల రూ. 45/-.వీలున్న వారు పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాలు, సూచనలు మాలతి గారికి తెలియచేయగలరు. )



వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర మనది. ఒక మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ల మీద లెక్కించి స్త్రీలసాహిత్య చరిత్రను, వారి కృషిని ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో పార్శ్వ్యంగా మాత్రమే చూపించే ప్రయత్నంఇన్నేళ్ళుగా సాగింది. సాహిత్యంలోనూ, సామాజిక శాస్త్రరంగాల్లోనూ, స్త్రీల భాగస్వామ్యాన్ని పాయగామాత్రమే చూపించటానికి అలవాటు పడ్డ పురుషస్వామ్య చరిత్ర విధానం మనది. తెలుగు సంస్కృతిపైఆధునికత ప్రభావం పడ్డప్పటి నుంచి, స్త్రీల భావ ప్రపంచం మారుతూ వచ్చింది. అది సాహిత్యంలోనూ, శాస్త్ర, సామాజిక రంగాల్లోనూ ప్రతిఫలించింది. అయితే, స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనల్లో వచ్చినమార్పుల గురించి చెప్పినంతగా, చుట్టూ వున్న సమాజంలో స్త్రీల మేధో భాగస్వామ్యం పెరుగుతూ వచ్చినక్రమాన్ని , వారి ఆలోచనాస్రవంతిలో వచ్చిన మార్పుని వివరించిన ప్రయత్నాలేవీ అసలు జరగలేదు.


ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన మూస చరిత్ర రచనా విధానాన్ని ప్రశ్నించి, ప్రత్యామ్నాయ చరిత్రను రచించే క్రమం ఒకటి మొదలైంది. ఇది కేవలం నలుగురు వ్యక్తులకో, నాలుగు పుస్తకాలకో పరిమితం కావడం లేదు. స్త్రీ చైతన్య క్రమాన్ని అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నారు. తెలుగు సాహిత్య రంగంలో స్త్రీల విశేష కృషిని పాక్షిక దృష్టితో చూస్తూ ఓ దశాబ్ధానికో, ఒక నలుగురు రచయిత్రులకో పరిమితం చేస్తూ కొనసాగిన చరిత్రను తమ విస్తృత పరిశోధనలతో చర్చకు పెట్టే ప్రయత్నం మొదలైంది. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో నిడదవోలు మాలతి ఒకరు. స్వాతంత్ర్యానంతర కాలంలో తెలుగు కధా చరిత్రను గురించి ఇప్పటివరకూ రికార్డైన సాహిత్య చరిత్రను ఆమె కొత్త దృక్కోణంలో చర్చిస్తున్నారు






తెలుగు కధా చరిత్రలో రచయిత్రులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నవలా రచయత్రులుగానో, లేక 80 ల తర్వాత వచ్చిన స్త్రీవాదుల గురించో వుంటుంది తప్ప అంతకు మించిన సమగ్ర చర్చ ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్ర్యానికి ముందు సంఘసంస్కరణ జాతీయోధ్యమాల కాలంలో కధానికలు రాసినంత మంది రచయిత్రులు, స్వాతంత్ర్యానంతరం రాయలేదు. ముద్రణా సౌకర్యం, మహిళా చైతన్యం, విద్యా సౌకర్యాలు పెరిగి, వస్తువైవిద్యానికి ఆస్కారం కలిగిన కాలంలో మహిళా కధకుల సంఖ్య తులనాత్మకంగా చూచినప్పుడు అంతకు ముందు కన్నా తక్కువ. స్వాతత్ర్యానంతరం మహిళలు కధానికను వదిలి నవల వైపు మొగ్గడం ఇందుకు కారణమై అంటారు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (తెలుగు కధకులు-కధనరీతులు-మూడవ భాగం పేజీ 111). అయితే, అది తప్పని, అందరూ అనుకుంటున్నట్టు 1950 నుండి 1975 వరకూ రచయిత్రులు కేవలం నవలలు మాత్రమే రాయలేదని, అనేక మంచి కధలు రాసారని చెపుతూ వారు తీసుకున్న ఇతివృత్తాల్ని, వారి రచనా విధానాన్ని, శైలిని నిడదవోలు మాలతి తన పుస్తకం Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 లో సమగ్రంగా చర్చించిన విధానం స్త్రీల సాహిత్య విమర్శలో ఓ మైలురాయి లాంటి ప్రయత్నం. స్త్రీవాదం అన్న పదం వాడకపోయినా, స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వ ప్రస్తావన అనేది కేవలం 80 ల నుండి మాత్రమే మొదలు కాలేదని, అది '50 ల తరం నాటి రచయిత్రుల్లో ఎంత స్పష్టం గా ప్రకటితమైందో ' ఎదురు చూసిన ముహుర్తం' (పి. సరళాదేవి) లాంటి కధల ద్వారా ఆమె సోదాహరణంగా చెప్పినప్పుడు వెనకటి తరం రచయిత్రుల కృషి మీద మరింత గౌరవ భావం కలుగుతుంది.



గురజాడ వారి ' దిద్దుబాటు ' తొలి తెలుగు కధగా పేర్కొంటూ ఇప్పటిదాకా ప్రచారమైన తెలుగు కధా చరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పము. భండారు అచ్చమాంబ తొలి తెలుగు కధకురాలన్న గుర్తింపు ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కఠోర సత్యము. ప్రధానా స్రవంతి కధాసాహిత్య విమర్శల్లో, తొలితరం తెలుగు కధానికా సంకలనాల్లో గురజాడ, శ్రీపాద, మల్లాది గురించి చెప్పినంతగా ఎవరూ ఈ నాటికి కూడా భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి,పి.శ్రిదేవి,ఆదిమధ్యం రమణమ్మ మొదలైన రచయిత్రుల గురించి ఎవరూ ఎక్కడా చెప్పలేదు, చర్చించలేదు.కధకు సంభందించిన చర్చలన్నింటిలోనూ, '50ల నాటి రచయిత్రుల ప్రస్తావనలు దాదాపుగా ' నాంకే వాస్తే ' పద్ధతిలో మాత్రమే కనిపిస్తాయి. తెలుగు కధ మీద ఇప్పటివరకూ వచ్చిన అనేకానేక పుస్తకాలు, అనేకానేక వ్యాసాలు పరిశీలించినప్పుడు వారి కృషి ఓ ముగ్గురి, నలుగురి పేర్లతో ........ఫలానా వారు కూడా రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం చూడవచ్చు. వారి కధల గురించి, వాటి ఇతివృత్తాలు, శైలి మొదలైన వాటి గురించి సీరియస్ గా ఎవరూ చర్చించినట్టు మనకు ఎక్కడా దఖాలాలు లేవు. మరీ కాకుంటే మొత్తం రచయిత్రులందరి గురించి ఒక వ్యాసం వుంటుంది కానీ ప్రధాన సాహిత్య చరిత్రలో భాగంగా తొలి తరం రచయిత్రుల కృషిని సమగ్రంగా విశ్లేషిచినట్ట్లు కనిపించదు. నిస్సందేహంగా గురజాడ, మల్లాది, శ్రీపాద గొప్ప రచయతలే కానీ రచయిత్రుల కధల్ని గురించి చర్చించినప్పుడు కదా వారు కూడా దీటుగా కధలు రాయగలిగారా, లేదా అన్న సంగతి అర్ధమయ్యేది.






గురజాడ ' దిద్దుబాటు ' ని, భండారు అచ్చమాంబ ' స్త్రీవిద్య ' లేదా 'ఖన ' లాంటి కధల్ని పక్కన బెట్టి చూసినప్పుడు దిద్దుబాటు కంటే ఆ కధలు ఏ రకంగానూ తీసిపోవన్న నగ్నసత్యం బోధపడుతుంది. 1900 నాటికే విద్యావంతురాలైన భండారు అచ్చమాంబ రాసిన స్త్రీల చరిత్రను, ఆమె రాసిన కధల్ని ఎవ్వరూ కూడా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోనందువల్ల ఆమె కృషి విస్మృత చరిత్రగా మిగిలిపోయింది. విక్రమాదిత్యుని ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కధ స్త్రీలు అప్పటికే సమాజం లో తమ స్థితిగతుల్ని గుర్తించారనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలు దెబ్బతీసిన వైనాన్ని, జాతీయోద్యమ ప్రాముఖ్యాన్ని ఓ తల్లి పాత్ర ద్వారా చెప్పించిన కనుపర్తి వరలక్షమ్మ లాంటి రచయిత్రుల్ని, ' కుటీరలక్ష్మి ' (1924) లాంటి కధల్ని పట్టించుకున్న వారు తక్కువే. తొలి తరం స్త్రీల సాహిత్య కృషిని అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా పురుష నిర్మిత సాహిత్య విమర్శనా పనిముట్లతో పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నరు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిద్యం ఇవ్వలేదన్నది నిష్టూర సత్యం.

స్వాతంత్ర్య, సంస్కరణోద్యమాలు, పత్రికల వ్యాప్తి, స్త్రీవిద్యలో భాగంగా మాత్రమే రచయిత్రుల్ని చూస్తారు తప్ప అంతకుమించి వారి సాహిత్యానికి ప్రత్యేకత ఏమి ఇచ్చినట్టు కనిపించదు. ఆనాటి స్త్రీలు తాము చదువుకొని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్న సంగతి కంటే కూడా స్త్రీలు చదువుకోవాలని, అది ' కుటుంబానికి ' చాలా ప్రయోజనకరమంటూ మగవారు ప్రోత్సహించిన దానికే చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. స్త్రీ విద్య, స్త్రీ అభివృధ్ధి కోసం కంటే కూడా ఇంటిని చక్కదిద్దటానికి, పిల్లల్ని బాగా పెంచడానికి మాత్రమే సంస్కరణవాదులు కోరుకున్నారు. వ్యక్తిగా ఆమె వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశంగా స్త్రీవిద్యను సంస్కరణవాదులు భావించినట్టు కనిపించదు. స్త్రీవిద్య గురించి గురజాడ కున్న పాక్షిక దృష్టిని మాలతి తన పుస్తకంలో తేటతెల్లం చేశారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు. ' తెలుగు కధ-సామాజిక స్పృహ ' అన్న అంశం మీద రాసిన వ్యాసంలో " చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది"(తెలుగు కధ విమర్శానాత్మక వ్యాస సంపుటి- అంధ్రసారస్వత సమితి ప్రచురణ, 1974)అని పురాణం బాహాటంగా, నిసిగ్గుగా అనగలిగారు. అయితే ఆ పురాణం గారే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను 1976 లో అనేక సాహిత్య ప్రక్రియలకు ప్రకటించి అందులో ఫిక్షన్ కేటగిరి ని వదిలేసినప్పుడు ఆంధ్రజ్యొతి వారపత్రికలో (19 నవంబర్, 1976) రాసిన లేఖ చదివినప్పుదు ఆశ్చర్యపోతాము


ఆ లేఖ సారాంశం ఇది. " గతంలో అకాడమి అవార్డ్ పొందిన నవలలు ఉత్తమైన రచనలు అయి వుండవచ్చు.అంతమాత్రాన ఇప్పుడు ప్రచురితమవుతున్న నవలలుకూడా వాటికి నాణ్యతా ప్రమాణాల్లో ఏమాత్రం తీసిపోవు. ఉదాహరణకి, మాదిరెడ్డి సులోచన తెలంగాణ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన నవలలు రాశారు. వాటిల్లో మచ్చుకు కొన్ని తరం మారింది, పూల మనసులు, మతము-మనిషి. అలాగే యద్దనపూడి సులోచనారాణి ఆంధ్రుల అభిమాన నవలారచయిత్రి. ఆమె నవలలు జీవన తరంగాలు, బందీ, ప్రేమలేఖలు ఆమె రాసిన మంచి నవలల్లో కొన్ని. ఈ నవలల్లో ఏదో ఒకటైనా మీ అవార్డ్ ప్రమాణాలకు సరితూగుతాయి. అంతే కాకుండా డి. కామేశ్వరి, పరిమళా సోమేశ్వర్ ,ఐ.వి.యస్. అచుత్యవల్లి లాంటి ఇంకెందరో నవలా రచయిత్రులు కూడా మంచి నవలలు రాసారు. తెలుగు నవలా యుగంలో రికార్డ్ స్థాయిలో పబ్లిషర్లు 300 కొత్త నవలలు ప్రచురించారు". ఇక్కడ మనకు రెండు విషయాలు బోధపడతాయి. ఒకటి తెలుగు నవలా స్వర్ణ యుగంలాంటి సమయంలోనే మంచి నవలలు రాసినా కూడా ఏ మహిళా రచయిత్రి కూడా సాహిత్య అకాడమి అవార్డ్ కు అర్హురాలు కాకపోవడము. రెండొ విషయము...ఒక పత్రికా సంపాదకుడు, అగ్రశ్రేణి సాహిత్య విమర్శకుడైన పురాణం లాంటి వారు స్త్రీల సాహిత్య సృజనకు సంబందించి ఎంత నాసిరకమైన అభిప్రాయాలు కలిగివున్నారో కూడా మనకు అర్ధమవుతుంది.


అలాగే కధకుడు, విమర్శకుడు కేతు విశ్వనాధరెడ్డి ఒక చోట " రచయిత్రులు నవల జోలికి వెళ్ళినంతగా కధానిక జోలికి వెళ్ళలేదు. శ్రీదేవి, సరళాదేవి, తురగా జనకీరాణి, కళ్యాణ సుందరీ జగన్నాధ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మల ప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు కూడా కధానిక శిల్పంలో సాధించిన ప్రత్యేకత వుందని చెప్పలేం. దానికి కారణం ఆధునికి చైతన్యాన్ని అలవర్చుకోవటంలో పురుషుల కంటే స్త్రీలు ఇంకా వెనుకబడి వుండటమే. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు రచయిత్రులు కధనసారళ్యంలో కూడా ప్రత్యేకంగా సాధించిందేమి లేకపోవడమే" అని వ్యాఖ్యానిస్తారు.(దృష్టి -సాహిత్య వ్యాస సంపుటి -పేజీ 73)
తెలుగు కధానికకు సంభందించి చర్చలు జరిగినప్పుడల్లా విమర్శకులు రాసే మాటలు పైన చెప్పుకున్నట్టు వుంటాయి. తెలుగు నాట సాహిత్య విమర్శ వ్యక్తుల్ని బట్టి, కాలాన్ని బట్టి రకరకాలుగా ఎలా మారుతూ వుంటుందో చెప్పటానికి ఇవి కొన్ని వుదాహరణలు మాత్రమే.


ఇలాంటి సాహిత్య విమర్శలు అలవాటైన తెలుగు సాహిత్య లోకానికి అతి ముఖ్యమైన ఓ పాతికేళ్ళ కాలంలో స్త్రీల సాహిత్య కృషిని, అప్పటి సామాజిక సందర్భానికి అన్వయిస్తూ వస్తుపరంగా, రూపపరంగా, శైలీపరంగా విశ్లేషిస్తూ నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకం అసలైన తెలుగు సాహిత్య చరిత్రను గురించి పరిశోధించేవారికి మరింత బాగా వుపయోగపడుతుందనటం అక్షర సత్యం.
( తెలుగు విశ్వవిద్యాలయం వారు త్వరలో ప్రచురించనున్న నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి...)

కల్పనారెంటాల
September 27,2004
Madison, Wisconsin

Thursday, November 19, 2009

మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!




అజర్ నఫిసీ – ఇరాన్ కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.

అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.



నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.


ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.


నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…


ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.

కల్పనారెంటాల

 
Real Time Web Analytics