నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label కథానుభవం. Show all posts
Showing posts with label కథానుభవం. Show all posts

Thursday, July 21, 2011

ఎన్నడూ విచారణకు అంగీకరించకూ!


కథానుభవం-8

' మృణ్మయనాదం' లో అహల్య హెచ్చరిక

అపురూప సౌందర్య రాశి అహల్య ను నైతికానైతికతల త్రాసు లో తూచి చలనం లేని శిల ను చేశారు. రాముడి పాద స్పర్శ తో శాప విమోచనం జరిగిందని చెప్పి అసలు విషయం మీద జరగాల్సిన చర్చకు అవకాశం ఇవ్వకుండా అహల్య కథ ను ముగించేశారు. పంచ మహా పతివ్రతల్లో ఒకరుగా ఆమె ను చేర్చి ఆ తర్వాత ఘనకీర్తులందించారు.అహల్య మారు వేషం లో వున్న ఇంద్రుడిని గుర్తించిందా? లేదా? మారు వేషం లో వచ్చింది ఇంద్రుడని తెలిసి తెలిసీ అహల్య ఆ తప్పు చేసిందా ? లేక ఇంద్రుడి చేతిలో ఆమె మోసగించబడ్డదా? యుగాల నుంచి అహల్య తప్పొప్పుల గురించి ఈ చర్చ జరుగుతూనే వుంది.
" విచారణ జరపడం అంటే అపనమ్మకమే కదా. దాని కంటే ఏదో ఒక నమ్మకం నయం కదా!" అన్న ప్రధానమైన ప్రశ్న ను అహల్య పాత్ర ద్వారా లేవనెత్తుతుంది ఓల్గా తన ' మృణ్మయ నాదం ' కథలో. .మన మీద ఒకరు అధికారం తో, పశు బలం తో చేసే విచారణ వెనుక వున్న కుట్ర గురించి అహల్య మాట్లాడుతుంది. నా తప్పొప్పులను మీరు నిర్ణయించటం కాదు, అసలు వాటిని విచారించే అధికారం మీకెవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది . అంతేకాదు." ఎవరి సత్యం వారిది.సత్యాసత్యాలు నిర్ణయించగలిగే శక్తి ఈ ప్రపంచం లో ఎవరికైనా వుందా?" అని కూడా నిలదీస్తుంది.
అహల్య నుంచి , సీత నుంచి, రేణుక నుంచి ఇప్పటి దాకా కుటుంబాల్లో, చట్టాల్లో, కోర్టుల్లో, నడి రోడ్డు మీద స్త్రీలుతమ మనసు ల్లో ఏమనుకుంటున్నారో, శరీరాలు ఏం కోరుకుంటున్నాయో, ఏం చేస్తున్నాయో ఎన్ని సార్లు చర్చలు, విచారణలు జరిగి ఉంటాయో కదా! ఈ రోజు కి కూడా ఎక్కడో ఓ చోట, ఎవరో ఒక స్త్రీ మీద ఏదో ఒక రకమైన విచారణ జరుగుతూనే వుంది. ఆమె తప్పొప్పులను ఎవరో ఒకరు వెయ్యి కళ్ళతో నిర్ధారిస్తూనే వున్నారు. ఓల్గా ఈ కథ ద్వారా మాట్లాడుతోంది దాని గురించే. మన మనఃశరీరాల విచారణలో ముందు స్త్రీలకు తమ మీద తమకు అధికారం ఉంటుంది. అది మరెవ్వరి హక్కు కాదు. సొంతం కాదు అని అహల్య పాత్ర ద్వారా ఓల్గా మరో సారి స్పష్టం చేస్తోంది.
తొలి సారి అహల్య ని కలిసినప్పుడు " మీరు చేయని తప్పుకు దోషి గా నిలబడ్డారు " అని సీత ఆమె పట్ల జాలిపడుతుంది.
" ఈ లోకం లో అనేక మంది ఆడవాళ్ళు అలా నిలబడాల్సిందే గదా సీతా!" అంటుంది అహల్య.
" మీకు తెలియదు గదా అతను మీ భర్త కాదని" అన్న సీత సందేహానికి
" మారు వేషం లో వచ్చింది నా భర్త కాదని నేను గుర్తించానా, లేదా? లోకం లో అనేక మందిని వేధించే ప్రశ్న ఇది. నా భర్త కు మాత్రం ఆ తేడా లేదు. నాకు తెలిసినా, తెలియకపోయినా ఆయనాకొకటే. ఆయన వస్తువు తాత్కాలికంగా నైనా పరహస్తమయింది. మైలపడింది. మైల, శౌచం, పవిత్రం, అపవిత్రం, శీలం, పతనం -- ఈ పదాలను బ్రాహ్మణ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తే లేదు. విచక్షణే లేదు" అన్న అహల్య సమాధానం ఎంత సూటిగా, ఎంత నిర్భయంగా, ఎంత స్పష్టం గా ఉందో చూడండి.
అహల్య అంత స్పష్టం గా చెప్పినా సీత కు ఇంకా పూర్తిగా అనుమాన నివృత్తి కాలేదు. రాముడి మాటలు నిజమేనేమో, అహల్య సౌశీల్యవతి కాదేమో అనుకుంది. అప్పుడు అహల్య మరింత స్పష్టంగా యుగాల తరబడి తన మనసు లో దాచుకున్నవాటిని ప్రకటించించింది.
" నాలా మాట్లాడే స్త్రీలను భరించటం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలి పడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకెవరిచ్చారంటే మాత్రం ఎవరూ సహించరు".
" ఆ అధికారం గౌతమ మహర్షి కి కూడా లేదా?" భార్యల శీలం మీద భర్తలకు అధికారం వుంటుందని అందరూ చెప్పే మాటలను నమ్ముతూ అమాయకంగా ప్రశ్నిస్తుంది సీత.
" లోకం ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది. నేనివ్వలేదు. నేనివ్వనంత వరకూ ఎవరూ నా మీద అధికారాన్ని పొందలేరు" అంటుంది అహల్య.
చేసిన తప్పుకు అహల్య శిలలా పడి ఉందని అందరూ అనుకునే దానికి అహల్య చెప్పిన సమాధానం ఇది " ఇన్నేళ్లూ నేను ఈ విశ్వం లో నా అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ప్రపంచం ఏ నీతుల మీదా, ధర్మాల మీద నడుస్తోందో, వాటికి మూలమేమితో తెలుసుకున్నాను. నేనెంతో జ్నానమ్ సంపాదించాను. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే వుండదని, నిరంతరం మారుతూ ఉంటుందని తెలుసుకోవటమే నేను సంపాదించిన జ్నానం. "
సీత, అహల్య ల కలయిక, వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా కూడా అరణ్యవాస సమయం లో జరిగింది. చివరగా వెళ్లబోయే ముందు అహల్య, సీత కి ఒక హెచ్చరిక లాంటి సలహా కూడా ఇస్తుంది. " ఎన్నడూ విచారణకు అంగీకరించకూ సీతా. అధికారానికి లొంగకు" .
రావణ సంహారం తర్వాత సీత ను అగ్నిపరీక్షకు సిద్ధం కమ్మని లక్ష్మణుడు రాముడి ఆజ్న ను తీసుకువచ్చినప్పుడు సీత కు మొట్టమొదట అహల్య గుర్తొచ్చింది. ఆమె చెప్పిన ప్రతి మాట స్ఫురణకు వచ్చింది. అయినా సరే సీత రాముడి కోసం అగ్నిపరీక్ష కు సిద్ధపడింది. లోకం ముందు రాముడు నిస్సహాయుడు, బలహీనుడు అని సీత కు అర్థమయింది. లోకమంటే అది చెప్పే నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు అని సీత కు తెలుసు. లోకం నుంచి తన రాముడి ని రక్షించడానికి, అతని కన్నీరు తుడిచి అతనికి బలం ఇవ్వటానికి తాను తప్ప ఆ సమయం లో మరెవ్వరూ సహాయం చేయలేరని సీత కు తెలుసు. తాను అగ్ని పరీక్ష కు సిద్ధపడి రాముడి ని లోకం ముందు ధర్మం తప్పనివాడిగా నిలబెట్టింది సీత.
అగ్నిపరీక్ష తర్వాత అయోధ్య కి తిరిగివచ్చాక సీత కు అహల్య ని చూసి ఆమె తో మాట్లాడాలని బలంగా అనిపించింది. అందుకోసం ఒక సారి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి రావాలనుకుంది. ఆమె అరణ్యానికి ఒక సారి వెళ్ళి రావాలని ఒకందుకు కోరుకుంటే , రాముడు ఆమె ను శాశ్వతంగా మళ్ళీ అరణ్యవాసానికి పంపించివేశాడు. నిండు గర్భిణీగా వున్న సీత ను ఏమైనా కావలసినది ఉంటే సందేహించక చెప్పమని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు అహల్య ని చూడాలనుకుంటున్నానని చెప్తుంది సీత.
రావణ సంహారం తర్వాత నుంచి గడ్డకట్టుకుపోయిన సీత మనసు అహల్య ని చూడగానే , ఆమె స్నేహ స్పర్శ లో అది కరిగి నీరైపోయింది. సత్యాసత్యాల గురించి ఆనాడు అహల్య చెప్పిన మాటల అర్థం ఈ జరిగిన వాటన్నింటి వల్ల తనకు తెలిసినట్లు సీత వొప్పుకుంది. అంతే కాదు, తాను విచారణకు సిద్ధమయింది కేవలం రాముని కోసమే కానీ, తన కోసం కాదని చెప్తూనే అయినప్పటికీ అది ఎప్పటికీ అలా వెంటాడుతూనే వుంటుందా? అని సీత అడిగినప్పుడు " రాముని కోసం కాక నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునేవరకూ ఇది నిన్ను వెంటాడుతూనే వుంటుంది సీతా. నువ్వున్నావు. బాధ అనుభవిస్తునావు. ఎవరి కోసమో అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. ఎవరి కోసమో కర్తవ్యాన్ని పాలించావని అనుకుంటున్నావు. నీ ధైర్యం, నీ మనో నిబ్బరం అన్నీ పూర్తిగా ఇతరులకిచ్చావు. నీ కోసం ఏం మిగుల్చుకున్నావు?" అని అడుగుతుంది అహల్య.
నేనంటే ఎవరిని ? అని సీత అడిగినప్పుడు " నువ్వు శ్రీరాముని భార్యవు మాత్రమే కాదు. అంతకు మించినది, అసలైనదీ నీలో వుంది. అదేమిటో తెలుసుకోవాలని స్త్రీలకెవరూ చెప్పరు. పురుషుల అహం ఆస్తులలో, ప్రతాపాలలో, విద్యలో, కులగోత్రాలలో ఉంటే స్త్రీల అహం పాతివ్రత్యం లో, మాతృత్వం లో ఉంటుంది.ఆ అహంకారాన్ని దాటాలని స్త్రీలకెవరూ చెప్పరు. విశాల ప్రపంచం లో తాము భాగమని వారు గుర్తించరు. ఒక వ్యక్తి కి, ఒక ఇంటికి, ఒక వంశ గౌరవానికి పరిమితమవుతారు. ఆహాన్ని పెంచుకోవడం, ఆ అహం లోనే కాలీ బూడిదై పోవడం స్త్రీల గమ్యమవుతుంది. సీతా, నువ్వేవరో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నం ఆపకు. చివరకు తెలుసుకుంటావు. నీకా శక్తి ఉంది. శ్రీరామచంద్రుడిని కాపాడగలిగిన దానివి నిన్ను నువ్వు కాపాడు కోలేవా--ఇదంతా ఎందుకు జరిగిందని విచారించకు.ఇది నీ మంచి కోసమే. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం లో భాగం గానే జరిగింది.ఆనందం గా ఉండు. ఈ ప్రకృతి ని, సకల జీవ రాశి పరిణామ క్రమాన్ని పరిశీలించు. అందులో నిరంతరం జరిగే మార్పు ని గమనించు. అరణ్యం లో ఆశ్రమాలే కాదు, అనేక జాతుల ప్రజలున్నారు. వాళ్ళ జీవితాలు గమనించు. ఈ మొత్తం ప్రపంచం లో నువ్వున్నావు. ఒక్క రామునికే కాదు. నీకు మాతృత్వం అనుభవమవబోతోంది. దానిని కూడా ఆనందించు. ఏ కోరికలు, ఆశలు పెంచుకోకుండా లేడి పిల్లలను పెంచినల్టు నీ పిల్లలను పెంచు ."
నీ జీవితం, నీ కర్తవ్యం మొత్తం భర్త, పిల్లలు,ఆ కుటుంబం కోసం మాత్రమే కాదు. నీకు నువ్వు మిగలాలి. నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అహల్య అనుభవ పూర్వకంగా చెప్పిన ఈ మాటలు ఆ సీత కే కాదు, ఆధునిక సీత లకు కూడా నిస్సందేహంగా ఉపయోగపడే జ్నాన సంపద.
చెప్పవలసిన దంతా సీతకు చెప్పాక " సీతా! నా విషయం లో సత్యమేమిటో చెప్పమంటావా?" అన్న అహల్య మాటలకు సీత " వద్దక్కా, ఏదైనా ఒకటే. దానికే అర్థం లేదు" అంటుంది. నిజమే , అహల్య చేసింది తప్పో, వొప్పో తెలుసుకోవాలని ఇవాళ ఏ స్త్రీ ఆతృతపడటం లేదు.
అహల్య అందించిన జ్నానాన్ని, తన స్వానుభవ సారాన్ని మేళవించుకున్నాక, లవకుశులను ఆదరించి అక్కున చేర్చుకొని తన కోసం రాముడు చాచిన చేతిని అందుకోకుండా సీత తన గమ్యాన్ని తాను నిర్ణయించుకొని తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంటుంది.
"సీత సహాయం లేని రాముడు జీవితం లో మొదటి సారి ఓటమిని రుచి చూశాడు. బయట నుంచి వచ్చే అధికారానికి లొంగని సీత, తన లోపల తన మీద తనకున్న అధికార శక్తిని మొదటి సారి సంపూర్ణంగా అనుభవించింది. "
ఇతిహాస పాత్రలను నేటి సమాజానీకనుగుణంగా ఎలా అర్థం చేసుకోవాలో చెపుతూ ఓల్గా ఒక వరుస క్రమం లో రాసిన కథల సమాహారం " విముక్త". ఈ పుస్తకం లో ఈ మృణ్మయ నాదం కథ తో పాటు, సమాగమం, సైకత కుంభం, విముక్త, బంధితుడు కథలున్నాయి. ఒక్కో కథ మీద ఒక చిన్న పరిచయం ఇలాగే మీ కోసం....

Saturday, October 09, 2010

మధుర మీనాక్షి- కథ ముగింపు

ఈ కథ గురించి రాసిన తొలి పలుకులు ఇక్కడ చదవవచ్చు.

కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.

మొదటి సారి ఈ కథ చదవటం పూర్తి చేసినప్పుడు నాకు కూడా వెంటనే అర్థమైనట్లు అనిపించలేదు. మీనాక్షి తో ఆ రాత్రి అతనికి కలిగిన అనుభవం ఒక భ్రాంతి నా? లేక వాస్తవమా? అది ఒక కలనా? ఆ కలయిక జరిగిందని వూహించుకున్నాడా? నిజంగా జరిగిందా?

మొదట నిజంగా జరిగిందనుకుందాము....నిజంగా జరిగితే అనుభవం తాలూకు అనుభూతి గుర్తుండి అసలేం జరిగిందో ఎలా గుర్తుండకుండా వుంటుంది? ఎంత గొప్ప అనుభూతికి లోనైనా అతను మీనాక్షి ఇంటి నుంచి హోటల్ కి ఎలా నడిచోచ్చాడో కూడా ఎలా గుర్తుండకుండా వుంటుంది? అతను ఆమె తో పొందాను అనుకుంటున్న అనుభవం అసలు భౌతికమైనదా? లేక కేవలం మానసికమైనదా? అది లైంగికపరమైన కలయికనా? ఇలా అనేకానేక సందేహాలు వస్తాయి.

రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో అది అక్షరాల్లో , పదాల్లో, వాక్యాల్లో , ఒక అనుభవం గా , ఒక గాఢమైన అనుభూతి గా మన ముందు వుంది. అక్కడితో రచయిత పాత్ర అయిపోయింది. మిగిలింది పాఠకుడి పాత్రే. అక్కడ చెప్పిన దాన్ని, చెప్పకుండా వదిలేసిన దాన్ని బట్టి సొంత వూహాలతో కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.

మొదటి సారి చదివినప్పుడు ( ఎన్ని సంవత్సరాల క్రితమో గుర్తు లేదు) నాకు కథ పూర్తి కాగానే సంపూర్ణం గా అర్థం కాకపోయినా రచయిత చాలా బాగా రాశారు అనిపించింది. ఆ బాగా రాయటం కొంచెం సంక్లిష్టం గా చెప్పటం వల్లనా, లేక అర్థమై కాకుండా వదిలేయటం వల్ల వచ్చిన ఒక సొగసు వల్లనా? లేక మన మామూలు పరిధులకు అర్థమైనా కాకపోయినా రచయిత ఒక తాత్త్విక పరిధిలో ఈ కథను చెప్పారన్న మామూలు అవగాహన కలగటం వల్లనా ? ఏమో తెలియదు. ఇదీ అని చెప్పలేని కారణం. ఇలా చాలా రకాలా కారణాల వల్ల ఈ కథ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఇలా నాకు నచ్చిన , లేదా నేను మెచ్చిన కథల్ని పరిచయం చేయటం కోసమే కథానుభవం శీర్షిక ప్రారంభించాను.

మళ్ళీ ఈ కథ ఇప్పుడు సంపాదించినప్పుడు , మొదటి సారి చదివినప్పుడు ఏం అర్థమైంది అన్నది అసలు మనసు లో లేకుండా ఇప్పుడే మొదటి సారి ఈ కథ చదువుతున్నట్లు మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక మళ్ళీ అదే అనుభవం. ఏం చెప్తున్నారు? అని. వెనక్కూ, ముందుకూ మళ్ళీ మళ్ళీ చదివాక ఒక చిన్న విషయం ఏదో అర్థమైనట్లు అనిపించింది. ఈ ముగింపు ని ఎలాగైనా చెప్పుకోవచ్చు.

నా అవగాహన తప్పో, వొప్పో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఇది కేవలం నాకు కలిగిన అనుభూతి. మీకు కూడా ఇలాగే అనిపించవచ్చు. వేరేలాగా అనిపించవచ్చు. ఎలా అనిపించినా కరెక్టే అని నేననుకుంటున్నాను.

ఆ రాత్రి కథకుడు పొందిన భౌతికానుభవం మానవ మీనాక్షితోనే అయినప్పటికీ మానసికంగా ఆ సమయం లో అతని మనస్సు ఆలయం లోని మీనాక్షి పై లగ్నమై వుంది. అందువల్లనే అతనికి అదొక అనిర్వచనీయమైన అనుభవంగా , తనను తాను మర్చిపోయేంత గాఢమైన అనుభవంగా మిగిలింది. ఆ అనుభవం లో అతను మిగలలేదు. అనుభవం ఒక్కటే మిగిలింది. అందుకే అతనికి ఆ సమయం లో మీనాక్షి ఏం మాట్లాడిందో , అసలు ఏమైనా మాట్లాడిందో లేదో కూడా తెలియలేదు. తను హోటల్ రూమ్ లోకి వచ్చి ఒక నిద్ర లోకి వెళ్లక హోటల్ సర్వర్ వచ్చి రాత్రి ఎనిమిది గంటలప్పుడు లేపితే మెలకువ వచ్చింది. సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకూ అంటే వున్నది దాదాపు ఒక రెండు, మూడు గంటలు.

ఈ రెండు మూడు గంటల్లో ఏం జరిగిందో కొన్ని వివరాలు ఇచ్చారు రచయిత. నిజానికి ఇలా వాక్యం వాక్యం తీసి వివరణ ఇచ్చుకుంటూ పోతే ఆ కథ లోని సౌందర్యం మొత్తం విరిగిన అద్దం ముక్కల్లాగా కనిపించటం తథ్యం. ఈ తాత్త్వికమైన ముగింపు ని ఎవరికి వారు అర్థం చేసుకోవటం సులువు కానీ ఇలా చెప్పటం అంటే అందులోని ఆనందాన్ని ఇలా భాగభాగాలుగా చేయక తప్పటం లేదు.అందుకు క్షమించాలి.
అతను కలిసింది దేవాలయం లోని మీనాక్షి తో అని నేను స్పష్టం గా అనుకోవటానికి...నాకు లభించిన వివరాలు...

మీనాక్షి చనిపోయింది అని జ్నానాంబ చెప్పగానే అతనికి బాధ, దుఃఖం కలగకుండా ...మాయ గా ఆశ్చర్యం గా అనిపించింది. ఎందుకలా?
ఫోటో లోని మీనాక్షి కి, అతను తన అంతఃచక్షువులతో చూసిన ఆమె అద్భుత సౌందర్యానికి అసలు ఏ మాత్రం పోలికలే కనిపించలేదు.

మీనాక్షి తో కథకుడు తన అనుభూతి ని ఆమె మరణం తర్వాత తర్కించుకొని చూసినప్పుడు అతనికి గుర్తున్నదల్లా పుష్కరిణి దగ్గర ఆమె చెప్పిన అద్వైతం మాటలే. ఆమె ఇంటి దగ్గర కథకుడు తనని గురించి తాను చెప్పకున్నాడు తప్ప మీనాక్షి వివరాలేమీ చెప్పిన గుర్తు లేదు.

కథకుడు ఆమె మరణాన్ని కథలో ఎక్కడా మృత్యువు గా, మరణం గా ఒక్కసారి కూడా పేర్కొనకపోవడం...ఆమె దగ్ధమై, అంతర్ధానమై పోయింది అంటాడు . అలాగే జ్నానాంబ చెప్తున్న మీనాక్షి కి , తన స్వానుభవం లో తన అనుభూతి లో సత్యమై నిలిచిన మీనాక్షి కి ఎక్కడా పోలిక లేదని కథకుడు స్పష్టం గా గుర్తించగలగటం.

జ్నానాంబ ఇంట్లో అద్దెకుంటున్న ఫిలాసఫీ లెక్చరర్ , స్వయంగా అద్వైతీ, కథకుడి కి అద్వైతానుభూతి ని విశదం గా వివరించి చెప్పిన మీనాక్షి సాక్షాత్తూ ఆ అమ్మవారి భౌతిక స్వరూపమే. కనీసం కథకుడి అనుభవం వరకూ. తామిద్దరి కలయిక లో ధార్మిక విచికిత్స పొడచూపనే లేదు అని కథకుడి ద్వారా స్పష్టం గా చెప్పించిన దాన్ని బట్టి కథకుడు మధుర మీనాక్షి లో ఒక శృంగార స్త్రీమూర్తి ని చూశాడు. అమ్మవారిని అలా చూడటం అనేది సర్వ సాధారణం కాదు కానీ అసాధారణం కూడా కాదు. మీరా కృష్ణుడిని భర్తగా ఆరాధించటంలో, శ్రీరంగనాథుడ్ని గోదా దేవి ప్రేమించడం లో లేని అభ్యంతరం మీనాక్షి దేవి ని ఒక సంపూర్ణ స్త్రీ గా ఒక పురుషుడు చూడగలగటం లో ఉండనక్కరలేదు. అది ఒక రకమైన తంత్రసాధనేమో కూడా.

లోకాలనేలే ఒక అమ్మ గా కాకుండా మధుర మీనాక్షి ని కథకుడు ఒక అద్భుత సౌందర్య రాశి గా ఆమె లోని అపూర్వమైన సౌందర్యాన్ని ఛూశాడు, ఆమె పట్ల ఒక లైంగికేచ్చ ను కలిగి వున్నాడు అన్నది ప్రధానంగా రచయిత ఈ కథ లో ప్రతిపాదించదలుచుకున్న విషయం . అది ఎంత మాత్రం తప్పు కాదు అని చెప్పటం తో పాటు, దానికొక అద్వైత తాత్త్వికత ను కూడా జోడించి అందించారు.
కథలోని ప్రతి వాక్యం ఎంతో ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా వుంది.

మీనాక్షి అతనికి చేసిన బోధ ఒకటే. ఇద్దరు మీనాక్షులు లేరు.ఉన్నది ఒకటే. అందుకే కథకుడు మానవ మీనాక్షి తో లైంగికంగా కలిస్తే అతను అమ్మవారితో ఐక్యం చెందినట్లు అనుభూతి చెందాడు. అంత మధురమైన అనిర్వచనీయమైన సుఖాన్ని పొందాక అతను ఒక రాత్రి ఒక పగలు అలా మత్తుగా నిద్రపోతున్నప్పుడు కథకుడికి ఒక కల వస్తుంది. అతను చనిపోయినట్లు వచ్చిన కల అది. ఆ అనుభవం ద్వారా అతను తాను ,తన శరీరం వేరు అన్న భావం నుండి ఆ రెండూ ఆ అనుభవం తో, ఆ అనుభూతి తో, ఆ అనుభూతి ప్రసాదించిన మీనాక్షి అనే స్వస్వరూపం తో ఏకమైపోయాడు అని రచయిత ప్రతీకాత్మకం గా చెప్పాడు.

కథలోనే ఒక చోట చెప్పినట్లు ఆశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దాని ద్వారానే పొందటం సాధ్యమవుతుంది. ఆశాశ్వతమైన మీనాక్షి ద్వారానే కథకుడు శాశ్వతమైన దేవత ని పొందగలిగాడు.ఆ తాదాత్మ్యాన్ని చెప్పటమే మొత్తం మధుర మీనాక్షి కథ.

వున్నవి రెండు కాదు, ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ఒక కథలో ఇంత చక్కగా, ఇంత అందంగా చెప్పగలగటం మామూలు రచయితల వల్ల జరిగే పని కాదు. ఫిలాసఫీ ని జీవితమంతా అధ్యయనం చేసి పాశ్చాత్య, భారతీయ తత్త్వ శాస్త్రాలకు ఒక అనుసంధానం చేయాలని జీవితమంతా తపించి అందుకోసమే కృషి చేసి తన రచనలన్నింటి ద్వారా తాను నమ్మిన, తాను అవగతం చేసుకున్న ఫిలాసఫీ ని అందించే ప్రయత్నం చేసిన ఆర్. ఎస్. సుదర్శనం లాంటి రచయిత మాత్రమే రాయగలిగిన కథ మధుర మీనాక్షి. మళ్ళీ అలాంటి కథ తెలుగు లో మరొకటి వస్తుందన్న నమ్మకం లేదు కానీ వస్తే మంచిదే.


Sunday, October 03, 2010

మార్మిక సౌందర్యాన్ని ప్రతిబింబించే ఆర్.ఎస్. సుదర్శనం గారి “ మధుర మీనాక్షి”!

కథానుభవం-7

తన్హాయి వెల్లువలో నా కథానుభవాలు, కవిత్వానుభవాలు, వచనానుభవాలు అన్నీ గత నాలుగు నెలలుగా తాత్కాలికంగా తెర మరుగై పోయాయి. కథలు చదవడం ఆపేయ్యలేదు గానీ చదువుతున్న వాటి గురించి రాయడం మాత్రం కుదరలేదు.

మొన్నా మధ్య సౌమ్య రాసిన మధుర యాత్ర స్మృతి గురించి చదువుతున్నప్పుడు ఆ పోస్ట్ లోని విషయాల మీద దృష్టి కన్నా నా మనసు మధుర ఆర్. ఎస్. సుదర్శనం గారి “ మధుర మీనాక్షి “ కథ ను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత రాస్తున్న ఈ కథానుభవం లో ఈ సారి నాకు బాగా నచ్చిన , చాలా మంది మెప్పు ని పొందిన విశిష్టమైన కథ చోటు చేసుకోవటం చాలా సంతోషం గా ఉంది..
ఆర్. ఎస్. సుదర్శనం గారి రచనల గురించి, వారి సాహిత్య దృక్పథం గురించి ఒకటి రెండు మాటలు కాదు ఒక వివరమైన వ్యాసం రాయాల్సినంత విషయం ఉంది. ఆయన కథలే కాకుండా తెలుగు సాహిత్య విమర్శ మీద ఆయన రాసిన పుస్తకం “ సాహిత్యం లో దృక్పథాలు” చదవవలసిన పుస్తకాల్లో ఒకటి. తాత్త్విక చింతన వున్న కథకుల్లో ఆర్. ఎస్. సుదర్శనం అగ్రగణ్యుడు అన్న మాటకు ఉదాహరణ గా ఆయన రాసిన ఆణి ముత్యం “ మధుర మీనాక్షి” కథను చెప్పుకోవచ్చు. ఈ కథ ద్వారా ఆయన రచనా కౌశలాన్ని ఎలాంటి వారైనా అర్థం చేసుకోవచ్చు.

ఈ కథ గురించి కేవలం ఒక సారి చదివి రాస్తున్న కథానుభవం కాదు ఇది. చాలా సార్లు చదివాను. మళ్ళీ మళ్ళీ ఆలోచించాను. ప్రతి సారి ఈ కథ ఒక్కోరకమైన అనుభూతి ని, ఒక్కో రకమైన ఆలోచన ఇచ్చింది. అందుకే ఇది నాకు నచ్చిన కథ అయింది. ఒక రచయతగా ఆర్.ఎస్. సుదర్శనం గారి మీదున్న గౌరవం మరింత ఎక్కువైంది. నా అభిరుచి మేరకు( అందరికీ ఈ కథ నాకు నచ్చినంత నచ్చక పోవచ్చు. లేదా నేను చూసిన అంశాలు, ఇతరులకు కనిపించిన అంశాలు వేర్వేరు గా ఉండవచ్చు. కాబట్టి ఇది కేవలం నా వ్యక్తిగత అభిరుచితో మాత్రమే విశ్లేషిస్తున్నానని అర్థం చేసుకోగలరు) అనేక రకాలుగా ఇదొక ప్రత్యేకమైన కథ. మనసు పెట్టి కథ చదివి ఆలోచిస్తే అనేక సున్నితమైన అంశాలు, అస్పష్ట కోణాలు అర్థమవుతాయి. అద్వైత సందేశం చుట్టూ ఇంత మంచి కథ అల్లగలిగిన ఆలోచన, నైపుణ్యం కేవలం ఆర్. ఎస్. సుదర్శనం గారి సొత్తు మాత్రమే అనిపించింది ఈ కథ చదివాక.

ఈ మధుర మీనాక్షి కథ ఇదీ అంటూ చెపితే అందులోని గొప్పతనం అర్థమై పోయే కథ కాదు ఇది. నిదానంగా చదవాలి. సంపూర్ణ తాత్త్వికత తో నిండి వున్న ఈ కథ అలవోకగా చదివితే బహుశా ఆ గొప్పతనం, ఆ సౌందర్యం మన జ్నానేంద్రియాలకు పట్టకపోవచ్చు. కథ పూర్తయ్యేక ఆ ( ఏముందిలే ఈ కథ లో అనిపించదు. ఈ కథ లో ఇంకా ఏమేం చెపుతున్నారు అని ఆలోచించబుద్ధి వేస్తుంది. మనస్తత్త్వ చిత్రణ, తాత్త్వికత , ఆ రెంటికి మించి ఓ మార్మిక సౌందర్యం కనిపిస్తుంది ఈ కథ లో.

ఎవరైనా మొదట ఈ కథ చదివాలనుకుంటే ఇక్కడితే ఆపేసి నాకోక మైల్ చేయండి. నేను కథ పంపిస్తాను. అది చదివాక అప్పుడు మీకు కలిగిన అనుభవాల్ని, నా మాటల్ని పోల్చుకోవచ్చు. లేదూ, అసలు కథ లో ఏముందో తెలుసుకొని ఆ తర్వాత కథ చదవాలో, వద్దో నిర్ణయించుకోవాలనుకుంటే ముందుకు సాగండి.

కథ ఉత్తమ పురుష లో సాగుతుంది. కథకుడి పేరు తెలియదు. ఊరూ తెలియదు. అలాగే అతని వయస్సు కూడా ఇంత అని కచ్చితం గా తెలియదు. కాకపోతే నలభై దాటిన మధ్య వయస్కుడు అని అర్థమవుతుంది.కథకుడు రెండేళ్ళ క్రితం భార్య ను పోగొట్టుకున్న ఓ వ్యాపారి. కథకుడి కి మధుర వూరు అన్నా, ఆ వూర్లోని మధుర మీనాక్షి అన్న పేరన్నా ఏదో ఒక తెలియని ఇష్టం. ఉన్నట్లుండి ఒక రోజు తన వొంటరితనం నుండి ఎక్కడికైనా దూరం గా పారిపోవాలనిపించి రైలెక్కి మధుర చేరుకుంటాడు.అక్కడ అమ్మవారిని, చేతి లో చిలుక పట్టుకొని వయ్యారం గా నిలబడిన ఆ అద్భుత సౌందర్య రాశిని , శృంగార మూర్తి ని చూసి మైమరచిపోతాడు. ఆలయం నుంచి బయటకు వస్తుంటే మరో అద్భుత సౌందర్యరాశి కనిపిస్తుంది.గుడి లో దేవత పేరు మీనాక్షి. కథకుడి మనసు దోచుకున్న దేవేరి పేరు కూడా మీనాక్షి నే. ఒకరు విగ్రహం . ఒకరు మనిషి. ఒకరు మాట్లాడరు. ఒకరు మాట్లాడతారు. మానవ రూపం లో వున్న మీనాక్షి ఓ కాలేజీ లో ఫిలాసఫీ లెక్చరర్. అద్వైతి. అంతా మాయ, ఇద్దరు లేరు, వున్నది ఒక్కరే అంటుంది.

ఒక రెండు రోజులు గడిచాక వున్నట్లుండి ఓ సంధ్య వేళ ఎలాంటి మాటలు, ఎలాంటి సంకోచాలు, ఎలాంటి భయాలు, ఎలాంటి ధార్మిక విచికిత్స లేకుండా ఆ ఇద్దరూ ఒకటవుతారు. “ తర్వాత ఏం జరిగిందో మాటల్లో చెప్పలేను.చెప్పటానికి మాటలు లేవు. చాలవు కాబట్టి. అక్కడ ఎంత సేపున్నానో గుర్తు లేదు. ఒక మహదానందం తో తాదాత్మ్యం తప్ప మరొక స్పృహ లేదు.” ఇదీ మీనాక్షి గది నుంచి హోటల్ రూమ్ కి ఎలా వచ్చి పడ్డాడో కూడా తెలియని కథకుడి మానసికానుభవం.

ఈ కథ కి ఇది కాదు ముగింపు. అసలు కథ లో మలుపు ఆ తర్వాత జరుగుతుంది.

కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.
మొత్తం 20 పేజీలున్న ఈ పెద్ద కథ లో చివరి అయిదు పేజీల్లోనే అసలు కథ అంతా వుందనిపించింది నాకు. అప్పటి దాకా జరిగిన కథ అంతా ఒక ఎత్తు గానూ, చివరి అయిదు పేజీ ల్లో రచయత ఈ కథ ద్వారా పైకి చెప్తున్న విషయాలు కాకుండా ఇంకేవో గూఢార్థం తో చెప్పాలనిపిస్తున్నట్లు తోచింది నాకు. ఆ చివరి పేజీల్లో మనకు కథ ఏం అర్థమైంది అన్న దానిని బట్టి మళ్ళీ మొదటి కి వెళ్ళి కథ మొత్తం మొదటి నుంచి చదవాలనిపిస్తుంది. అప్పుడు కథ స్వరూపం మొత్తం మరో రకంగా వేరే కోణం నుంచి అర్థమవుతుంది.

నేను ఆ చివరి ముగింపు, నాకేలా అర్థమైందో చెప్పకపోతే మీరంతా కూడా ఈ కథ చదువుతారని ఆశ. అందుకే అది ప్రస్తుతానికి చెప్పకుండా వదిలేస్తున్నాను.

ముగింపు తో సంబంధం లేకుండా నాకు ఈ కథ లో నచ్చిన మరి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.

గుడి లోకి వెళ్ళి మొదటి సారి అమ్మవారిని చూసినప్పుడు కథకుడి కి కలిగిన అనుభూతి...

“ అమ్మవారు లీలగా తప్ప స్పష్టం గా దృష్టి కి ఆనలేదు. ఆలయం యొక్క గంభీర వాతావరణం నన్ను ఆకట్టుకున్నది. కాలం ఘనీభవించినట్లు, కాల సముద్రం లోతుల్లోకి మునిగినట్లూ, చరిత్ర లో ఏదో వెనక్కి వెళ్ళినట్లు ఒక విశేషమైన భావం మనస్సు ని ఆవరించింది”.

సుదర్శనం గారి మనస్తత్త్వ చిత్రణకు దర్పణం రైల్లో తోటి ప్రయాణీకుల ప్రవర్తన గురించి కథకుడి ఆలోచనల ద్వారా రచయత మనకు చెప్తారు. ఆ సన్నివేశం ఎలా సాగుతుందో చదవండి.

“ సాధారణం గా మనం మనుష్యుల్ని ఒక అర్థం తో చూస్తూ ఉంటాము. వీడు ఫలానా, వీడి తో ఈ పని, ఈమె ఫలానా వారి తాలూకు, ఈమె గుణం యిలాంటిది అన్న దృష్టి వ్యక్తుల్ని గూర్చిన పరిచయం మూలాన, నిత్యమూ కొన్ని ప్రయోజనాల్ని అన్వేషిస్తూ వ్యవహార దృష్టి తో చూస్తుండటం తప్ప, ఆయా వ్యక్తుల్లో వున్న వింతలూ, చమత్కారాలు మనం గమనించం. అదీగాక మనిషి మామూలు మనిషి అన్న భావంతో గాక ఒక యంత్రం, ఒక బొమ్మ, ఒక వింత మృగం అనే దృష్టి తో చూస్తే మరి కొన్ని చమత్కారాలు కనిపిస్తాయి. రైల్లో నా ఎదురుగా ఒక కుటుంబం, అంటే భార్యా భర్తలు, వాళ్ళ ఆరేళ్ళ కూతురు కూర్చున్నారు. చూడగానే వాళ్ళ పరస్పర సంబంధం వగైరాలు అర్థమయినవి. కానీ నా మనస్సు ప్రస్తుతం అనుభవిస్తున్న వింత స్థితి లో వాళ్ళకు ఒకరితో సంబంధం లేదనుకుంటూ వాళ్ళను గమనించాను. ఆ అవగాహన అద్భుతం గా ఉంది. ఎవరికి వాళ్ళు ఒంటరివాళ్ళే. నాలాగ పైన ఏవో శబ్దాలు, చేష్టలూ, వాటికి ఏవో అర్థాల మూలంగా మనస్సు లో ఒక ఎడతెగని భ్రమ! అంతే!భర్త కొన్ని నిముషాలు మరుగుదొడ్డి లోకి వెళ్ళాడు.వెంటనే భార్య హావభావాల్లో మార్పు కనిపించింది. నా వైపు సిగ్గు విడిచి ఆసక్తిగా సాహసం గా పరిశీలనగా చూచింది. అటూ ఇటూ కదిలింది. వస్తువుల్ని సావరిస్తూ కూతురితో ఏదో అన్నది. నాకూ ఏదో వ్యక్తం చేసింది. భర్త తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఆమె మళ్ళీ పూర్వపు ధోరణి లో ‘ అణకువ’ ( subdued) గా స్తబ్దం గా మారింది. భర్త సాన్నిధ్యం ఆమె నిజ స్వరూపాన్ని కప్పిపెడుతూ ఉన్నట్లు నాకు తోచింది. ఇందులో ఆమె భర్తను ఏదో మోసం చేస్తున్నదని కపటం గా ప్రవర్తిస్తున్నదనీ నా ఆరోపణ కాదు.నైతిక వ్యతిక్రమణం ఏమీ లేదు. ఆమె వ్యక్తిత్వం మాత్రం భర్త ఎదురుగుండా ఉండటం వల్ల ఒకానొక ధోరణి లోనూ, లేకపోయినా క్షణాల్లో మరొక ధోరణిలో అంటే స్వేచ్ఛగానూ ఉంటుందనేది నాకు నిశ్చయంగా తెలిసింది. ఆమె లోని ఆ రెండవ ధోరణి , దాని సౌందర్యం ఆ భర్తకు ఎన్నడూ కనిపించదు. ఊహామాత్రంగా కూడా అంతు చిక్కదు. ఇదీ జీవితం లో వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల్లోని వైచిత్రి. కేవలం భార్య భర్తల మధ్యే కాదు. ఒకానొక రామారావు నాకు చాలా సౌమ్యుడిగా ఓర్పు గలవాడు గా మాత్రమే తెలుసు. మరొకరికి రామారావు అంటే ముంగి. లోపలి మనిషి. నమ్మదగినవాడు కాదు. ఈ విభేదాలు ఎందువల్ల వస్తున్నాయి?”

శత వసంతాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న తెలుగు కథ నుంచి మంచి కథల ఎంపిక చేస్తే తప్పక ఉండాల్సిన కథ ఈ “ మధుర మీనాక్షి”.


(ఈ కథను అడగగానే ఓపికగా స్కాన్ చేసి పంపించిన కథారచయత కొత్తపాళీ గారికి కృతజ్నతలు.)

Wednesday, June 16, 2010

నిడదవోలు మాలతి కథ-నవ్వరాదు!

కథానుభవం-6
దాదాపు మూడు నెలల విరామం తర్వాత కథానుభవం-శీర్షిక లో ఈ సారి రాస్తున్న కథ నిడదవోలు మాలతిది. మాలతి గురించి బ్లాగు లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఒక విషయం లో మాలతి గురించి పరిచయం చేయాలి. అది ఆమె రాసిన కథల గురించి.

సుమారుగా ఆరు దశాబ్దాల సాహిత్య కృషి ఆమె ది. బహుముఖాలుగా సాగే ఆమె విస్తృత సాహిత్య కృషికి దర్పణాలు ఇంగ్లీష్, తెలుగు తూలిక లు. కథ రాసినా, ఊసుపోక అంటూ నవ్విస్తూ చురకలు వేసినా, రచయతల గురించి వ్యాసాలు రాసినా, డయాస్పోరా జీవితాన్ని మొదటి సారి తెలుగు లో నవల గా చిత్రించినా ఆమె ది ఒక ప్రత్యేక దృష్టి. తెలుగుతనపు నుడికారపు భాష, ఒక అరుదైన శైలి ఆమె రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పాత తరం రచయతల గురించి తనదైన శైలి లో విస్తృత పరిశోధన చేసి, ఒక్కో వ్యాసం లో ఒక డాక్టరేట్ కి కావాల్సినంత సమాచారం అందిస్తూ ముందు తరాలకు నిజంగా ఉపయోగపడే ఒక రిసెర్చ్ స్కాలర్ గా ఆమె సాహిత్య కృషి కి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది మాత్రం నిష్టూరసత్యం. చాలా మంది విమర్శకులు కొందరి సాహిత్యాన్ని పరిచయం చేసేటప్పుడు “ ఈ రచనలు విశ్వసాహిత్యం లో వుండాల్సినవి “ అని అలవోక గా రాసేస్తుంటారు. అలాంటి అతిశయపు మెచ్చుకోళ్ళు కావి ఇప్పుడు నేను మాలతి గారి గురించి రాసిన మాటలు. నిజంగా ఆమె సాహిత్య కృషి ని నేను గుర్తించి , మిగతావారు గుర్తించాల్సిన అవసరంగా చెప్పటమే ఇది. ఈ నాలుగు మాటలు కూడా ఆమె కు తెలియటం కోసం కాదు. ఈ కథానుభవం రాస్తున్న సందర్భంగా మరో సారి ఆమె సాహిత్య కృషి ని గుర్తు చేసుకోవటమే.

దాదాపు వంద కథల దాకా రాసి వుంటారేమో ఆమె. అందులోంచి ఏదో ఒక కథను ఎంపిక చేసుకొని దాని గొప్పతనం గురించి మాత్రమే రాయటం ఒక విధమైన అన్యాయమే. అయితే అసలు రాయకుండా మిగిలిపోవడం కన్నా ఒక్క కథ గురించైనా మాట్లాడటం అవసరమనుకున్నాను. ఆ ఒక్క కథ ఎంపిక మాత్రం కష్టమైంది. దాదాపుగా ఆమె కథలన్నీ నాకు ఇష్టమే. అయితే ఏ కథ ఎక్కువ ఇష్టం అంటే నేను నిద్ర లో లేపి అడిగినా చెప్పే కథలు రెండు.ఒకటి ‘ నవ్వరాదు ‘, రెండు ‘ మంచు దెబ్బ ‘. ఈ రెండు కథలు మొదటిసారి నేను ఆరేళ్ళ క్రితం చదివాను. నవ్వరాదు చదివి నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అందరిని ఆ కథ అంతగా కదిలిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే బాగా కదిలిపోయాను. ఆమె కథల గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ముందు దాని గురించే మాట్లాడటం న్యాయం.అందుకే ఈ సారి కథానుభవం లో ఆ కథ గురించి ....

హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఈ లోకం అనే సర్కస్ లో కామెడీ క్వీన్ లా వుండే అమ్మాయి కమలిని జీవితం పాతికేళ్ళకే ముగిసిన కథ ఇది. నవ్వే ఆడపిల్లల జీవితం లోని వైరుధ్యం ఈ కథలో కనిపించినంతగా ఇంకెక్కడా కనిపించదేమో..ఆడపిల్లల్ని నవ్వొద్దు నవ్వొద్దు అంటారు తప్ప హాయిగా స్వేచ్ఛగా, పరవళ్లు తోక్కే నది లా నవ్వే అదృష్టం అందరికీ వుండదు. ఆ నవ్వు ఎల్లకాలం అందరి జీవితం లో చివరి వరకూ వుండదు.

కమలిని పువ్వు పూసినంత స్వేచ్ఛగా నవ్వగలిగిన అమ్మాయి. పెళ్ళి చేయాలి కాబట్టి చదువుకోనివ్వని తల్లితండ్రులు, పెళ్ళి కాకపోవడం తో అన్న వదినలకోసం ఇంటి చాకిరీకి పరిమితమై పోవడం, ఎప్పటికో పెళ్ళి అయినా కడుపు నిండా నాలుగు మెతుకులు కూడా పెట్టని అత్తింటివారు ..ఇలాంటి జీవితం చాలు ఓ ఆడపిల్ల హృదయపు లోతుల్లోంచి వచ్చే నవ్వు ని పెదాల మీదకు రానివ్వకుండా మర్చిపోవటానికి. మనం ఏడ్చినా, నవ్వినా ఒకటే అన్న నిర్ణయానికి రావటానికి. అత్తింటివారు కడుపు నిండా అన్నం పెట్టకపోతే స్నేహితురాలికి తన కష్టాలు చెప్పుకోకుండా మనుష్యుల్ని స్టడీ చేయడానికి నాకింత మంచి అవకాశం దొరుకుందనుకోలేదే అని తన హాస్యం చాటున తన కన్నీళ్ళను కప్పెట్టుకొని మనల్ని ఏడిపిస్తుంది.

ఇలాంటి విషమ పరిస్థితుల్లో చావు దగ్గరకొస్తున్నా , “ యముడు ఎన్టీ రామారావు లా వుంటాడా? ఎస్వీ రంగారావు లా వుంటాడా? ఎవరి వెనక పడితే వారి వెనక పోలేను కదా” అని స్నేహితురాలి తో కమలిని హాస్యమాడుతుంది. ఆమె చావు గురించి మాట్లాడుతుంటే బాధతో స్నేహితురాలు సరస్వతి, చిన్నప్పటి నుంచి కమలిని ని ఎరిగున్నది కూడా , నువ్వలా నవ్వకే నాకు భయమేస్తోంది అంటుంది. నువ్వు కూడా నవ్వొద్దనే అంటావా సరసూ అని విషాదం గా అడిగే కమలిని ప్రశ్న నవ్వుల్ని పోగొట్టుకున్న ఎందరో స్త్రీలు అడుగుతున్న ప్రశ్న గా అనిపిస్తుంది. నేనెప్పటికీ మర్చిపోలేని పాత్ర కమలిని.

ఈ కథ 1968 లో ప్రచురితమైంది. ఈ కథ లోని పరిస్థితులు యథాతథంగా ఇప్పుడు వుండకపోవచ్చు. నవ్వుతూ సరదాగా వున్న అందరి ఆడపిల్లల జీవితాలు అన్నీ ఇలా విషాదంగా అర్ధాంతరం గా ముగిసిపోవటం లేదు. సన్నివేశాలు మారినా ఇప్పటికీ కొందరి స్త్రీల జీవితాలు అసలేప్పుడూ తనివితీరా నవ్వకుండానే, నవ్వే అవకాశం కూడా లేకుండానే ముగిసిపోతుంటాయి.

మాలతి గారి కథల పుస్తకం “ నిజానికి –ఫెమినిజానికి మధ్య” లో మొదటి కథ ఇది.
యీ కథ ఇక్కడ చదవండి.

Wednesday, February 24, 2010

ఒక పూల పరిమళపు “ స్మృతి ” --సౌరిస్ కథ

కథానుభవం-5


సౌరిస్ కథారచయిత్రి గా కంటే కూడా .చలం కూతురు గా, ఒక యోగినిగానే ఎక్కువ మందికి తెలుసు. ఆమె రాసింది తక్కువ కథలైనా మంచి కథలు రాసింది. కాకపోతే ఆమెదొక వూహా ప్రపంచం. కలల లోకం. ఆ లోకం లో రకరకాల పూలు, తోటలు, విలక్షణ ప్రేమలు, అనుభవాల అనుభూతులు. ఆ కొత్త బంగారు లోకం లో ఆమె కథలన్నీ పుట్టాయి. ఆమె కథలు నేల మీద కాళ్ళు ఆనించి నిల్చినట్లు కనిపించదు. ఆ వర్ణన, ఆ పాత్రలు ఏదో ఒక లోకం నుంచి కిందకు దిగి వచ్చినట్లనిపిస్తాయి. ఆ విలక్షణతే ఆమె ను ఒక మంచి రచయిత్రి గా నిలబెట్టింది. అయితే, అదే విలక్షణత ఆమెను మామూలు పాఠకులకు కొంత దూరం కూడా చేసినట్లు వుంది. ఆమె కథలు చదవి ఆనందించటానికి మనం కి కూడా ఒక వూహాలోకం కావాలి. మనం చదవటం మొదలుపెట్టిన తర్వాత ఆ వూహాలోకం లోకి ఆమె మనల్ని తీసుకెళ్ళీ నిలబెడుతుంది. అయితే అలా వెళ్లగలిగే స్థితి కూడా పాఠకుడికి వుండాలి. లేకపోతే ఆమె కథల పుస్తకం చదవటం పూర్తి చేయలేము. ఎక్కడో రెండు లోలకాల మధ్య వూగిసలాడినట్లు ఆమె కథాలోకం లో, మనం వాస్తవిక ప్రపంచంలో మిగిలిపోతాము.
సౌరీస్ పేరు చలం గురించి తెలిసిన వాళ్ళకు కొంత పరిచయం వుంటుంది కానీ అంతకు మించి ఆమెకు సంబంధించిన వివరాలు తెలుగు సాహిత్య లోకం లో పెద్దగా ప్రచారం లోకి రాలేదు. సౌరిస్ జీవితాన్ని రెండు భాగాలుగా ఎవరో ప్రచురించారని నేను విన్నాను.కానీ చూడలేదు, చదవలేదు. కాబట్టి ఆమె జీవితం గురించి నాకు పెద్దగా తెలిసింది లేదు. ఆమెకున్న ఆధ్యాత్మిక నమ్మకాల వల్ల కూడా ఆమెను ఒక రచయిత్రి గా కంటే కూడా ఒక యోగిని గానే ఎక్కువమంది గుర్తు పెట్టుకున్నారనుకుంటాను.
సౌరిస్ కథల్ని పుస్తకం గా భీమునిపట్నం లోని స్నేహ ప్రచురణాల వారు ఆగస్ట్ 1997 లో ప్రచురించారు. అక్కడక్కడా సంకలనాల్లో సౌరిస్ కథలు ఒకటి ,ఆరా చదవటం తప్ప కథలన్నీ ఒక చోట చదివింది మాత్రం ఈ పుస్తకం లోనే. పుస్తకం మీద ఆమె బొమ్మ అందమైన చిరునవ్వుతో.. పుస్తకం వెనుక సౌరిస్ గురించిన ఈ పరిచయ వాక్యాలు....

“ సౌరిస్ అంటే సౌరిస్
లేత నీలపు ఓ చైతన్యం గురించి,
పచ్చని జీవితాశయం గురించి,
తాత్విక సముద్రపు లోలోతుల
చిరుచేపల కదలికల గురించి,
చెట్టు నీడన నిశ్శబ్దం గురించి,
ఆ వెనుక, దూరం గా ఓ పెద్ద అల,
ఆ ఎత్తున ఎగిరిపడి విరిగి వెనక్కి,
వెళ్ళీ ముందుకొచ్చే ఘోష గురించి,
గడ్డి పరక అంచున నిలిచిన,
నీటిబొట్టు గురించి చెప్పుకోవడం
కంటే తెలుసుకోవడమే నయం.
సౌరిస్ రచనలు అంతే.
అవి వాక్యాల మధ్య,
కథ వెనుక, సారాంశం
వెంట, అంతటా వుంటూ
అన్ని వేపులా చూస్తాయి.
కొత్తవారికి సౌరిస్ ఈ పేజీల వెనుక
పరిచయం అవుతారు.”


అంతే. సౌరిస్ గురించి ఈ వాక్యాలు తప్ప ఆమె జీవితం గురించి, ఆమె సాహిత్య ప్రస్థానం గురించి, చలం కూతురి గా ఆమె అనుభవాల గురించి మొత్తంగా ఆమె జీవితం గురించి ఈ పుస్తకం లో ఎలాంటి సమాచారం వుండదు. అలాంటి వివరాలు కావాలంటే వేరే రకంగా సంపాదించుకోవటమే. ఈ పుస్తకం మీద సౌరిస్ బొమ్మ వుందటం ద్వారా కథలు చదవటానికి ముందే ఆమె ఎవరో మనకు బాగా తెలిసిన వ్యక్తి లా అనిపిస్తుంది. ఆ కథలు చదువుతున్నంత సేపూ ఆమె నవ్వు గుర్తుకు వస్తుంటుంది. అంతర్లీనం గా ఆమెను కథల్లో గుర్తుపడుతుంటాము. ప్రచురుణ కర్తలు చెప్పినట్లు సౌరిస్ కథలన్నీ చదవటం అయిపోయిన తర్వాత కొత్తవారికి అప్పుడు ఆ కథ ల ద్వారా అసలైన సౌరిస్ అంటే ఏమిటో అర్ధమవుతుంది.
ఈ పుస్తకం లో వున్నవి 8 కథలు. ఉష అనే కథ 1936 లోనూ, సుమిత్ర అనే కథ 1937 లోనూ, స్మృతి కథ 1946-47 లోనూ రాసినట్లు పేర్కొన్నారు. మిగతా కథలు ఎప్పుడు రాసినది , ఎక్కడ ప్రచురితమైనది లాంటి వివరాలు ఇందులో లేవు. సౌరిస్ లాంటి రచయిత్రుల కథల్ని ఒక పుస్తకం గా ఒకే చోట దొరికేలా ప్రచురించటం నిజంగా మంచి పని. ఆమె గొప్పతనం తెలిసి వుండబట్టే ఈ పనికి పూనుకొని వుంటారు. అలాంటప్పుడు సౌరిస్ జీవితం గురించి కూడా ఒక చిన్న వ్యాసం లాంటిది ఈ పుస్తకం లో వుండి వుంటే ఆమెను, ఆమె కథల్ని పాఠకులు మరింత బాగా అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
కథానుభవం శీర్షిక కోసం నేను ఎంచుకున్న కథ స్మృతి.
“ ఎంత చక్కగా వుందో ఎండ? ఎంత పచ్చగా వున్నాయో చెట్లు?” అంటూ కథ మొదలవుతుంది.

ఆస్ప్రతి లో వున్న రత్నం అనే ఆమె మోనోలాగ్ ఇది.
“ ఎందుకింత ఆనందం చెట్లను, గాలిని, ఎండను చూసి! “ అనుకుంటూ వుంటుంది ఆమె.
కొద్దికాలం పాటు అన్నింటిని మర్చిపోయిన ఆమెకు ఒకొక్కటిగా నెమ్మదిగా గుర్తుకు వస్తుంటాయి.
జబ్బుతో ఇన్నాళ్ళు ఆస్పత్రి మంచం మీద పడుకోని వున్న ఆమెను కొంచెం సేపు తోటలో తిరుగు బావుంటుంది అని చెప్తుంది నర్స్. ఆ తోటలో తిరుగుతుంటే ఆమెకు మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్లనిపిస్తుంది. ఆమె లో ఏదో ఒక కొత్త శక్తి సూర్య కాంతి లా. ఎప్పటేప్పటిదో ఒక పూల పరిమళం ఆమెను కమ్ముకుంటుంది.
ఆ పూలను, ఆ చెట్టును చుట్టుకున్న ఒక జ్ఞాపకం ఆమె లో మళ్ళీ జీవం పోసుకుంటుంది. ఆమెకు ఆ పూల వాసన ఎంతో పరిచితం గా అనిపిస్తుంది. ఆ పూలు, పరిమళం , ఆ చెట్టు అన్నీ ఎంతో తెలిసినట్లు అనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ ఏదీ గుర్తు లేనట్లు అనిపిస్తుంది.
ఇన్నాళ్ళు ఈ పూలను వదిలి ఎలా బతికాను, ఎలా బతికి వున్నాను అని తనలో తానే అనుకుంటూ వుంటుంది.
“ ఏవో అందమైన జ్ఞాపకపు తళుకులు. పగిలిపోయి, మెరిసే రంగు గాజు పెంకుల్లాగా చెదిరిన జ్ఞాపకాలు. మనసులో తలపుకు వస్తున్నాయి అస్పష్టం గా....
ఎప్పుడో అనుభవైంచి , ఏ కారణం వల్లనో మర్చిపోయిన, నాకే తెలీని, అనుభవాలని, జ్ఞాపకం తెచ్చుకుని, అనుభవిస్తున్నాయి, నా నరాలు, నా రక్తం, నా మనస్సు, నా హృదయం, నేను మర్చిపోయాను. అవి రహస్యం గా భద్రం గా, నాకు తెలీకుండా దాచుకున్నాయి. ఆ అపురూపమయిన, ప్రియామయిన స్మృతులని, తేనెటీగలు మధువును పోగు చేసి దాచుకున్నట్లు.
నాకు స్పష్టం గా చెప్పవు “.

ఆ పూల చెట్టు పేరు కామిని. ఆమె అతనికి ఓ పూల రాణీ. ఆ పూలు, ఆ పూల చెట్టు, అతని నిర్మలమైన ప్రేమ. ఇప్పుటికీ ఆమె స్మృతులు.
ఢిల్లీ నుంచి వచ్చిన గొప్ప సంబంధం తో ఆమెకు పెళ్ళైపోయింది. సన్నాయి చివరి స్వరం లాగా చీకట్లో అతను కరిగి మాయమై పోయాడు. అంతే. ఆ విషయం తెలిసిన ఆమె ఆ పూలను, అతన్నీ కూడా తనను తానే హింసించుకొని మరీ మర్చిపోయేలా చేసుకుంది. పిచ్చిపిల్ల. అతన్ని, ఆ పూలను ఎప్పటికీ మర్చిపోయాననుకుంది.
మళ్ళీ ఆ కామిని పూలను చూసేసరికి ఆమె హృదయం అడుగున తనకే తెలియకుండా దాచిపెట్టుకున్నా ఆ రూప స్మృతులు మళ్ళీ గుర్తుకువచ్చాయి. ఆ కామిని పూలకు, ఈ కామిని పూలకు మధ్య ఆమె ఒక జీవితం పూర్తి అయింది. కానీ ఆ గడిచిపోయిన జీవితం లో ఆమె లేదు. కేవలం ఆమె స్మృతులు తప్ప.
ఆమె ఇప్పుడు పూల రాణీ కాదు. భార్య, తల్లి. అత్తగారు. అమ్మమ్మ....
ఇదేనా జీవితం?
ప్రేమ విలువ, పూల విలువ తెలుసుకోవాల్సిన సమయంలో తెలుసుకోలేకపోతే ఆ తర్వాత అవి తిరిగి రావు. వాడిపోతాయి. వోడిపోతాయి. ఎవరికైనా మిగిలేది స్మృతులే. జీవితం కాదు.
ఈ కథ ఇంగ్లిష్ వెర్షన్ ఇక్కడ చదవచ్చు.

http://www.thulika.net/2007January/Souris.htm

కల్పనారెంటాల


( ఈ పుస్తకం ప్రతుల కోసం అరుణా పబ్లిషింగ్ హౌస్ , ఏలూరు రోడ్డు, విజయవాడ వాళ్ళని సంప్రదించండి. ఈ పుస్తకం ఇంకా మార్కెట్ లో లభ్యమవుతోందో, లేదో నాకైతే తెలియదు.)

Monday, February 08, 2010

బైరాగి కథ “ జేబు దొంగ “




కథానుభవం-4

‘ నూతిలో గొంతుకలు ‘ కవిగా ఆలూరి బైరాగి గురించి, చదివినది అర్ధం చేసుకొని తిరిగి మాట్లాడగలిగే స్థితి వచ్చినప్పటినుంచి వింటున్నాను. ఆధునిక్రాంధ్ర కవులల్లో ఉత్తమ కవిగా పేరుపడ్డ బైరాగి గురించి మా ఇంట్లో జరిగిన సాహిత్య చర్చల్లో నాకు అర్ధమైనంత వరకు అతనొక నిరాశావాద కవి అని. అజంతా అంటే మృతువు కవి అన్నట్లే బైరాగి అనగానే ఏకాంతం, నిరాశ స్పురిస్తాయి. ఆ రెండూ ఆయనకిష్టమైనవనీ, ఆయన కవిత్వమంతా వాటి చుట్టూనే తిరుగుతుంటుందని ఒక వాదన. అది అలా నా మనస్సులో ముద్ర పడిపోయింది. కానీ బాగా పెద్దయ్యాక కవిత్వం తీరుతెన్నులు పర్వాలేదు అర్ధమవుతాయి అనుకున్నప్పుడు బైరాగి కవిత్వం చదివితే “ నాక్కొంచెం నమ్మకమివ్వు “ అని అడిగిన ఆ కవి కేవలం నిరాశావాది కవి కాదని తెలిసివచ్చింది. శ్రీశ్రీ శబ్ద సౌందర్యం , కృష్ణశాస్త్రి కున్న సౌకుమార్యం రెండింటికి మధ్యనున్న కవి బైరాగి అనిపించేది. బైరాగి కున్నదల్లా భావసౌందర్యం. ఆ భావానికి తగ్గట్లు కవిత్వ భాషనుపయోగించే మంచి కవి అతను. చిక్కనైన కవిత్వం రాసిన బైరాగి తన కథల్లో కూడా ఆ కవిత్వాన్ని చిలకరించాడు. అతని కథల పుస్తకం “ దివ్య మందిరం “ , నవల “ పాప పోయింది” చదువుతున్నంతసేపు , అతని వచన కవిత్వం అంతా వాక్య వాక్యాలుగా విడిపోయి మళ్ళీ కొన్ని కథలుగా జీవం పోసుకున్నాయనిపించింది.

బైరాగి కథాసంపుటి “ దివ్య భవనం” మొదటి ముద్రణ 1955 లో వెలువడింది. ఆ తర్వాతదొరికిన మరో నాలుగు కథలు కలిపి ద్వితీయ ముద్రణా ఏప్రిల్ 2006 లో వెలువడింది. మొత్తం ఈ సంపుటిలో 11 కథలున్నాయి. బహుశా బైరాగి రాసిన మొత్తం కథలు ఇవే కాబోలు. ముందు నాకు నచ్చిన కథల గురించి కాకుండా నాకు పెద్దగా నచ్చని కథల గురించి చెప్తాను. నాకు బోరు కొట్టించిన కథ పుస్తకం లోని ఆఖరు కథ “ తండ్రులు-కొడుకులు”. ఒక కొడుకు గురించి తండ్రి చేసే త్యాగం. ఇతివృత్తం అంత బలమైనది కాకపోవటం ఒకటైతే, కథనం కూడా విసుగు తెప్పించింది. పుస్తకం చివర్లో వుంది కాబట్టి వద్దనుకున్న వారు చదవకుండా వదిలేయవచ్చు. బైరాగి కథల్లోని గొప్పతనం ఏమిటంటే అర్ధమైనా , కాకపోయినా అన్నీ కథలు చదివింపచేస్తాయి. అర్ధం అయి ఆలోచింపచేయటం కాదు.కొన్ని మనల్ని అర్ధం కానివ్వకుండా కూడా ఆలోచింపచేస్తాయి. ఒక గంట జీవితం, దివ్య భవనం లాంటి కథలు చదవటం పూర్తయ్యాక ఏదో తెలియని ఒక బహుచిక్కనైన భావం మన హృదయమంతా ఆక్రమిస్తుంది. అది బాధో, నిరాశో, దుఃఖమో, ఆర్ద్రమో తెలియని భావం తో మనస్సు నిండిపోతుంది. ఒక తీవ్ర కవితావేశంతో , భావ తీవ్రతతో కవి బైరాగి ఆ కథలు రాశాడు కాబోలు. నేను ఆ కథలు చదువుతున్నంత సేపు నా మానసిక స్థితి అతని భావతీవ్రతను అందుకోలేక పోయిందనిపించింది.

కథ చదువుతుంటే బావుండి, అర్ధం అవుతున్నట్లు మనల్ని భ్రమింపచేసి, అర్ధం చేసుకునేందుకు మనల్ని ఆలోచింపచేసి, చివరకు అసలు కథ ఏమిటో తెలియకుండా ముగింపుకు వచ్చేసే కథే “ దివ్య భవనం”. కవులు కథ రాస్తే ఇలాగే వుంటాయి అని చాలా మంది ఎప్పుడూ చేసే కామెంట్ కి అనుకూలం గా వుంది ఈ కథ. ఈ పుస్తకానికి ఆ కథ పేరే పెట్టడం, అదే పుస్తకంలో మొదటి కథ కావటం వల్ల మనకు అర్ధం కాకపోయినా బహుశా సంపాదకులకు ఈ కథ యొక్క గొప్పతనం ఏదో అర్ధమై వుండి వుండాలనిపిస్తుంది. బైరాగి ఇంకా బతికే వుంటే ఈ ఒక్క కథ గురించే ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఆ కథలో కొన్ని వర్ణనలు ఇలా వుంటాయి.

“ అది ఒక మేడ. మామూలు ఇటుక, సున్నం తో కట్టిన ఇల్లు కాదు. ఇనుము, రాగి మొదలైన లోహాలతో పోతపోసి వుంటారు. అదెప్పుడూ నిశ్శబ్దంలో చీకటి గా నిలబడి వుంటుంది. దాంట్లో దీపాలు వెలగవు కానీ ఆ మేడ నే దేవతల దీపంలా అలౌకిక కాంతితో మెరుస్తూ వుంటుంది. అది గాలితో, శూన్యంతో కట్టబడి వుండి. అందువల్ల దానికి హృదయం లేదు. కానీ అది గాజులాగా పారదర్శకంగా వుంటుంది. మరో విశేషం ఆ మేడకు దర్వాజాలు లేవు. మేడ మెట్లన్నీ నెత్తుటి మరకలతో నిండిపోయినాయి. అసంఖ్యాక మానవుల నిరాశ శిరస్పాలనంతో వారి ఎర్రని జీవ రుధిరం ట్రాగి ఆ మెట్లు చేవ దేలి నునుపెక్కాయి. ఆ మెడలో ఎవరైనా ఎలా ప్రవేశించగలుగుతారో ఎవ్వరికీ తెలీదు. అది ఒక బ్రహ్మ రహస్యం.” ఈ కధ కూడా మనకు ఒక బ్రహ్మ రహస్యం గానో, ఒక బ్రహ్మ పదార్ధం గానో అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఈ కథలో కథకుడికి అప్పుడప్పుడు ఆ మెడలో షేక్స్పియర్, దాస్తోవిస్కీ, కాళీదాసు, బుధ్ధుడు, గాంధీ, క్రీస్తు, అశోకుడు, న్యూటన్, గెలీలియో వంటి వాళ్ళు కనిపించారట. ఎవరైనా ఈ కథ ఎందుకు అర్ధం కాదో, ఎలా అర్ధం కాదో తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవండి.

ఇక కథ, కథనం అర్ధమై నేను ఎంజాయ్ చేయగలిగిన కథలు జేబుదొంగ, బీజాక్షరి, స్వప్నసీమ, దరబాను, కన్నతల్లి, కిమానీ, నాగమణి. బాగా నచ్చింది జేబుదొంగ. ఈ సారి కథానుభవం లో జేబు దొంగ గురించి....

“ ఆద్యంతాలు లేని మహా సముద్రపు హోరు.

మర ఫిరంగుల జోల పాట, మత్తుగల మేలుకొలుపు చీకట్ల కోనేట్ల పసరు నీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అంటూ మొదలవుతుంది ఈ కథ. “అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అన్న వాక్యంతోనే ఈ కథ ముగుస్తుంది. దీన్ని బట్టి ఈ కథలో ఆ ఒక్క ముక్తి క్షణం ఎంత మధురమైనదో, ఎంత ముఖ్యమైనదో అర్ధం చేసుకోవచ్చు. ఆ ముక్తి నొసగేది పైన ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉన్నాడో, లేదో తెలియని, నీకు కనిపిస్తాడో, కనిపించడో, సగుణ స్వరూపుడో, నిర్గుణ స్వరూపుడో అయిన దేవుడు కాడు. కేవల మనుష్యుడు. మరీ ఆశ్చర్యకరంగా అతనొక జేబు దొంగ. ఈ కథ చదువుతుంటే ఆశ్చర్యకరంగా, కథ చెపుతుంటే వింతగా, కథ గురించి మాట్లాడుతుంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలు కథే లేని కథ ఇది.

ఇదొక అతి సాధారణ మనిషి ప్రసాదరావు అనుభవం. ఉద్యోగం లేక బాధపడుతూ అవసరముండి డబ్బు అప్పు అడిగితే డబ్బు ఇస్తానో, ఇవ్వనో చెప్పకుండా, ఎంత ఇస్తాడో అసలే తెలియకుండా సాయంత్రం తాను మద్రాస్ వెళ్లిపోతున్నందువల్ల స్టేషన్ కి రమ్మంటాడు ఒక డబ్బున్న పూర్ణచంద్రరావు. అలా మన ప్రసాదరావు తెనాలి స్టేషన్ లో ప్లాట్ ఫారం మీద కూర్చొని ఉంటాడు. చుట్టూ వున్న జనాన్ని పరికిస్తూ, అంచనా వేస్తూ, ఆలోచిస్తూ పూర్ణచంద్రరావు చెప్పే ఏవేవో విషయాల్ని పరధ్యానంగా వింటూ వుంటాడు. రైలు కదిలేముందు పూర్ణచంద్ర రావు నుంచి మన ప్రసాదరావు కి దక్కింది కేవలం అయిదు రూపాయలు. ఆ డబ్బు తీసుకొని రోడ్డు మీద నడుస్తుంటే ఒక 14,15 ఏళ్ళ పిల్లవాడు ఆ డబ్బు కొట్టేస్తాడు. కథ గా అంతే. ఆ పిల్లవాడు డబ్బు కొట్టేసిన క్షణం జీవిత రక్తోజ్వల ముక్తి క్షణం. ఆ క్షణమే కథకు ఆయువు పట్టు.

అసలే డబ్బు లేనప్పుడు దక్కిన అయిదు రూపాయలు మరో దొంగ కొట్టుకుపోతుంటే కోపం, ద్వేషం రాకుండా అతని మీద ప్రేమ , జాలి, కరుణ ఎందుకు కలుగుతాయి? కేవల ఆ ఒక్క క్షణం ఎందుకు ముక్తిని, ఒక జీవితానుభవాన్ని అందించిందో తెలియాలంటే కథ చదవాలి. ప్రసాదరావు మనఃస్థితి , అతని మనో ప్రపంచం అర్ధం కావాలి. అప్పుడు కానీ ఆ జీవిత రక్తోజ్వల ముక్తి క్షణంమనకు కూడా అనుభవంలోకి రాదు. పూర్ణచంద్రరావు గారు డబ్బు ఇవ్వకముందే ప్రసాదరావు కి ఒక ఆత్మానుభవం కలిగింది. తనను తాను భౌతికంగా వేరు చూసి చూసుకున్నాడు. ఉన్న డబ్బు అవసరం, అది లేకపోతే వచ్చే కష్టాలు అవన్నీ కేవలం ప్రసాదరావు అనే దేహానికి సంబంధించినవి గా అతను తన నుండి తనను వేరు చూసి చూసుకున్నాడు. అలా రెండు ప్రపంచాల్లోంచి తనని తాను తెలుసుకున్నాడు.” అందులో ఒక ప్రపంచం రెండో దాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది.ఈ రెండు ప్రపంచాలకూ మధ్య వంతెన లాగా అతని డబ్బు అవసరం. బాహ్య ప్రపంచంతో అతనికి సంపర్కాన్ని కలిగిస్తూ గూడా, ఆ సంపర్కాన్ని తనతో నింపివేసి కల్మష పరుస్తున్నది.” చేతిలో లేని డబ్బు కోసం ఏ మార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత అతనికి జ్నానోదయం కలిగింది. అతనొకానొక ప్రశాంతతతో వున్నాడు. అందువల్లే ఇదివరకేన్నడూ గమనించని విషయాలు అతను గమనించగలిగాడు. “ పూర్ణచంద్రరావు గారు సాయంత్రమల్లా చెప్పిన మాటలూ , అతని ఆలోచనలూ, ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అతిథిలా ఒక్క క్షణం వాకిలి దగ్గర ఆగి, ఒక ఇష్టం లేని వెనక చూపుతో మనస్సులో ప్రతిధ్వనులతో సహా చెరిగిపోయాయి”. జనసందోహంతో కిక్కిరిసిన ఆ ప్లాట్ ఫారం ని వదిలి ఆ రాత్రి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు “ అకస్మాత్తుగా అతను రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స్పర్శను అనుభవించాడు. సముద్రపు నిలువ నీరుకంటే గూడా ఎక్కువ నీలంగా వుండి ఆకాశం. నక్షత్రాలు నల్లని మొఖమల్ మీద బంగారపు పూలలా మెరుస్తున్నాయి. నగరమంతా మెలకువకూ, నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈ పాటికి ఎక్కువ మంది నిద్రపోయి ఉండరు. కానీ అంతా నిద్ర పోదామని ఆశిస్తూ ఉండి ఉంటారు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి పంకిస్తూ ఉండి వుంటారు. ఈ నీడల నాటక రంగం మీద కలల కాంతిలో జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఒక హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతి నిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడేవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళడు. ఇదే రోజు వారీగా చేసే యాత్రాల గమ్యస్థానం” అనుకొంటాడు ప్రసాదరావు. అప్పుడు జరుగుతుంది ఆ సంఘటన. ఒక 15 ఏళ్ల పిల్లవాడు జేబులోంచి ఆ మిగిలిన అయిదురూపాయలు లాక్కున్నాడు. ఇక ప్రసాదరావు కి ఈ లోకంలో ఏ ఒక్క బంధం లేదు. ఆ పిల్లవాడి రెండు కళ్ళు రెండు బ్యాటరీ లైట్ల కాంతిలా, జాలిని, భయాన్ని, ఆశ్చర్యాన్నీ, చెప్పతరం గాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ అతని నిర్దాక్షిణ్యాన్ని, క్రూరత్వాన్ని దూషిస్తున్నట్లు, నిందిస్తున్నట్లు , చూస్తూ, అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. “ ఆ ఒక్క క్షణం అతనికి విశ్వరూపసందర్శనానుభవం కలిగింది. తన అల్పత్వం అర్ధమైంది. ఆ కుర్రవాడితో అతను సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఈ విశాల భూతలం మీద కళ్ళు తెరిచిన మొట్టమొదటి రోజు నుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. ఈ భూమి మీద తను బతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు”.

అహో జీవితపు రక్తోజ్వాల ముక్తి క్షణం స్వానుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక్క ప్రసాదరావు దా? బైరాగి దా? కథ చదివిన వారందరికినా?

“ఒక్క క్షణం రాత్రి పూట వచ్చిన వాణ్ణి. నీ వాకిట ముందు ముగ్గులు పెట్టి పోయిన వాణ్ని. నీవు నిదురపోతున్నప్పుడు చల్లగా, మెల్లగా, తల్లిలా వచ్చి నిశ్శబ్దంగా నీ నొసలు ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిన వాణ్ణి చూచావు. ఒక్క క్షణం అతడు నీ నీరసతధ్యాల చింకిబట్టలు విప్పి దూరం గా పారేసి, స్వీయ తేజస్సుతో నిజ స్వరూపంతో నిలబెట్టాడు. బహుశా నీవతన్ని మళ్ళా చూడలేవేమో? అయితేనేం? అతడు ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాడు. నీ దైనిక జీవితపు భయంకర నిద్రలో అతని ముద్దుల స్పర్శ సహస్ర రూప రసగంధ పులకిత స్వప్నా సుమాలుగా వికశించి, మానవుణ్ణి మానవుణ్ణిగా చేయకలిగిన కళాసాహిత్యాలు, వేదాంత విజ్నానాలు సృష్టిస్తుంది. బ్రతుకుల ఊబిలోంచి నిన్ను పైకెత్తుతుంది. దేవతుల్యుణ్ణిగా చేస్తుంది”. అంతే.అదీ బైరాగి కున్న నమ్మకం. ఈ కథ చదివాక మనకు కూడా ఒక్క క్షణం ఈ బతుకు, అనేకానేక భౌతిక, మానసిక అవసరాలు అన్నీ నిమిత్తమాత్రంగా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్షణం అందరి బతుకుల్లోకి అంత సులభంగా చొచ్చుకురాదు. ఒక ప్రసాదరావు కో, ఒక బైరాగి కో తప్ప. బైరాగి తాత్త్విక చింతనకు ఈ కథ ఒక తార్కాణం. ఇది బైరాగి మాత్రమే రాయగలిగిన కథ అనిపిస్తుంది.

కల్పనారెంటాల

 
Real Time Web Analytics