నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label అమ్మ చెప్పిన కథ. Show all posts
Showing posts with label అమ్మ చెప్పిన కథ. Show all posts

Tuesday, June 01, 2010

అతితెలివి పెళ్ళికొడుకు



తాతయ్య చెప్పిన కథ ని మనకు చెప్తున్నవారు శ్రీలలిత

చిన్నప్పుడు రోజూ రాత్రి మా తాతయ్యగారు మాకు కథలు చెపుతుండేవారు. ప్రతి కథ లోనూ ఒక నీతి వుండి తీరేది. కొన్ని వింటుంటే బలే నవ్వు కూడా వచ్చేది. తెలివిలేని మూర్ఖుడి గురించి కథలున్నట్టే అతితెలివి వున్న వాళ్ళ కథలు కూడా వుండేవి. అలాంటి ఒక అతి తెలివి కల పెళ్ళికొడుకు కథే ఇది.

అనగనగా ఒక వూళ్ళో రాంబాబు అనే అబ్బాయి వుండేవాడు. తను చాలా తెలివైనవాడినని అతని అభిప్రాయం. అంతే కాదు ఎదుటివాళ్ళు ఎంత తెలివితక్కువ వాళ్ళో ఉదాహరణలతో అందరికీ చూపించి వాళ్ళని చిన్నబుచ్చుతుండేవాడు. ప్రతిదానినీ తెలివిగా ఆలోచిస్తున్నాననుకుంటూ అతి తెలివికి పోయేవాడు.
అలాంటి రాంబాబు కి పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళికోసం బంధువు లందరితో కలిసి ఆడపెళ్ళివారి వూరికి బయల్దేరి వెళ్ళాడు రాంబాబు. ఆ వూరు వెళ్ళగానే రాంబాబుకి ఆడపెళ్ళివారు ఎంత తెలివి గలవారో చూడాలన్న ఆలోచన వచ్చింది. అలా తెలుసుకుందుకు వాళ్ళకి కనపడకుండా దాక్కుంటే తనని వెతుక్కోగలరో లేదో చూద్దామనుకున్నాడుట. అనుకున్నదే తడవుగా ఎక్కడ దాక్కుందామా అని తెగ ఆలోచించేసాడుట. పెళ్ళివారు తనని కనిపెట్టలేని చోటేదా అని బాగా ఆలోచించి, చాలా తెలివిగా ఆలోచించా ననుకుంటూ పెళ్ళి కోసమని వేసిన పెళ్ళింటి ముందున్న తాటాకుల పందిరి (ఇదివరకు పెళ్ళిళ్ళకి తాటాకు పందిళ్ళు వేసేవారు) యెక్కి కూర్చున్నాడుట.
ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్ళికొడుకెక్కడా కనిపించటం లేదు. ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు అందరూ కలిసి చుట్టుపక్కలంతా ఇళ్ళూ. వాకిళ్ళూ, తోటలూ, చెరువులూ అన్నీ గాలించారు. ఎక్కడా పెళ్ళికొడుకు జాడ లేదు.
వాళ్ళంతా వెతికి వెతికి విసిగిపోయి బంధువుల్లోనే వున్న మరో అబ్బాయికి ఆ ముహూర్తానికే ఆ అమ్మాయి నిచ్చి పెళ్ళి చేసేసారు.
పెళ్ళంతా అయ్యాక రాంబాబు"నన్నెతుక్కోలేకపోయారోయ్.., నన్నెతుక్కోలేకపోయారోయ్.." అని పెళ్ళివారి తెలివితక్కువతనాన్ని ఎత్తిచూపుతున్నట్టు చప్పట్లు కొట్టుకుంటూ మరీ పందిరి మీంచి దిగాడుట.
అది చూసి అతని చుట్టాలందరూ తలలు పట్టుకుని "ఓరి నీ అతితెలివి సంతకెళ్ళా.. బంగారం లాంటి అమ్మాయిని నీ పిచ్చి అతితెలివితో వదులుకున్నావు కదరా.." అంటూ చివాట్లు పెడతారన్నమాట
.
అందుకే దేనికీ అతి పనికిరాదంటారని మా తాతయ్యగారు చెప్పేవారు.

Thursday, May 27, 2010

తృష్ణ చెప్తున్న అమ్మ చెప్పిన కథ


అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ శీర్షిక కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషం గా వుంది. లలిత( తెలుగు4కిడ్స్) మధురవాణి, జ్యోతి, జయ, తృష్ణ ఇలా అందరూ తాము చిన్నప్పుడు చెప్పించుకున్న కథల గురించి, ఆ జ్నాపాకాల గురించి టపాలు రాస్తున్నారు. ఏమిటి? అంతా అమ్మాయిలే రాస్తున్నారు...అబ్బాయిలు కథలు చెప్పించుకోలేదా? లేకా గుర్తు లేవా?

ఈ శీర్షిక కోసం ఓపిక, తీరిక చేసుకొని మరీ రెండు కథలు పంపించింది తృష్ణ. అమ్మ చెప్పిన కథ చెప్పిన మరో అమ్మ తృష్ణ కి ధన్యవాదాలు.

ఈ సారి ఈ చిట్టి పొట్టి కథలు చెప్తోంది తృష్ణ ......



ఈగ కథ:

(బాగా చిన్నప్పుడు అన్నం పెడుతూ మా అమ్మ ఈ కధ చెప్పేది)

ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా? అన్నదట.

అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసు? నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసు? నేను నరికే ఈ చెట్టునడుగు" అందట.

ఈగ చెటు దగ్గరకు వెళ్ళి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసు? చెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసు? నా పొట్టలో ఉన్న పిల్లనడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట.

అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల " ఇహీ...నీ పేరు నీకు తెలియదా? నీ పేరు ఈగ" అందట.

పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

*****************************************************************

లొట్టాయ్ కథ:

అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ "లొట్టాయి" అని పిలిచేవారుట. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా తోటకూర మొక్కలు "రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్.." అని ఊగాయిట. వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి పులుసు వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.

ఆ తోటకూర పులుసు ఉడుకుతూ ఉడుకుతూ "కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్..." అందట. వాడికి ఇంకా కోపం వచ్చి పులుసంతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడుట. అది తిన్న ఆవు పాలు ఇస్తూ "చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్..." అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా "కిర్రు కిర్రు లొట్టయ్..కిర్రు కిర్రు లొట్టయ్.." అనటం మొదలెట్టాయిట. అప్పుడు వాడు వాటిని దూరంగా విసిరేసాడట.

ఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి "భౌ భౌ లొట్టయ్..భౌ భౌ లొట్టాయ్.." అని అరవటం మొదలెట్టిండట. ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట. బావిలోంచి "బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్.." అని శబ్దమ్ రాసాగిందట. ఇక వాడు ఊరుకోలేక మితిమీఇన కోపంతో బావి లోకి దూకాడుట..."బుడుంగ్ లొట్టాయ్.." అని ములిగిపోయాడుట.

ఈ కధలో ఆవుని చంపాడనగానే అదేంటమ్మా, ఆవును ఎలా చంపుతాడు? తప్పు కదా? అనడిగేవాళ్ళం అమ్మను. "ఏమో మా అమ్మ అలానే చెప్పేది. "తన కోపమే తన శత్రువు" అనే నీతిని తెలిపే కథ ఇది. దీనిలో లాజిక్కులు వెతకకూడదు" అనేది అమ్మ...:)

తృష్ణ.

http://trishnaventa.blogspot.com


Tuesday, May 25, 2010

అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ!


అమ్మ చేతి గోరుముద్దలు తినని వారు, అమ్మ చేత కథ చెప్పించుకొని వినని వారు బహుశా భూప్రపంచం లో ఎవరూ వుండరేమో! అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ ఎలా వుంటుందో , తీపిదనం రుచి మళ్ళీ చూపించారు రవికిరణ్ తమ్మిరెడ్డి మధ్య నాకు మైల్ లో . అమ్మ చెప్పిన అసలు సిసలు తెలుగు కథలు మళ్ళీ చెప్పించుకోవాలని, చదువుకోవాలని, మన పిల్లలకు మళ్ళీ కథలు చెప్పాలన్న కోరిక లేనిదేవరికి? అందుకే అమ్మ చెప్పిన తెలుగు కథలు ( కేవలం తెలుగు కథలే సుమండీ!) సేకరించాలని ఒక చిరు ప్రయత్నం శీర్షిక. మీకు మీ అమ్మ చెప్పిన కథ గుర్తుంటే రాసి పంపండి. మీ బ్లాగ్ లోనే ప్రచురిస్తే ఇక్కడ లింక్ ఇవ్వండి. ఏదైనా సరే, మళ్ళీ చిన్న పిల్లలై అమ్మ వొడిని, గోరుముద్దల్ని, వెండి గిన్నెలో పెరుగన్నాన్ని, ఆకాశాన చందమామని, ఆరు బయట నులకమంచం మీద పడుకొని ఆకాశం లో నక్షత్రాల్ని లెక్కపెట్టుకున్న తీపి జ్నాపకాన్ని, మనం ఎటు నడిస్తే అటు నడిచి వచ్చి చందమామయ్య మనల్ని అబ్బురపరిచిన వైనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందాము.

ఒక అద్భుతమైన తెలుగు కథ కోసం, లోకం మర్చిపోతున్న మంచి రచయితల కోసం చూస్తున్నానని చెపితే, మీరు అద్భుతమైన కథ కోసం చూస్తుంటే , నేను సామాన్యమైన తెలుగు కథ కోసం చూస్తున్నానని చెప్పి ఈ కథ పంపించిన రవికిరణ్ కి ధన్యవాదాలు.

ఈ శీర్షిక లో మొదట గా రవికిరణ్ తమ్మిరెడ్డి కి వాళ్ళ అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ పేను కథ ని చదవండి. ఈ కథలతో అమ్మలందరికీ జేజేలు.
పేను కథ చెప్తున్నది రవికిరణ్ తమ్మిరెడ్డి
మా అమ్మ నా చిన్నప్పుడు నాకు చాలా కథలే చెప్పింది. కథలన్నీ నేను నా కూతురుకి చెప్పేను. అన్ని కథల్లోనూ ఒక్క పేను కథ మాత్రవే అథంటిక్ తెలుగు కథ. మిగిలినవన్నీ మాయమ్మ తను చదివిన ఆంగ్ల పాఠాల్ని తెలుగు చేసి మాకు చెప్పింది. నా కూతురురికి ఇప్పుడు పదిహేనేళ్ళు, నేనాపిల్లకి ఇవి ఆంగ్ల కథలు, ఇవి తెలుగు కథలు అని చెప్ప లేదు. మా అమ్మ చెప్పిన కథలన్నీ పిల్లకి చెప్పేను. తెలుగు, ఆంగ్లం కలగలిపి. కానీ ఇప్పుడు పిల్లకి పదిహేనేల్లోచ్చినా, నువ్వది రైటంటే అది రాంగనే టీనేజి వయసొచ్చినా, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నానా పేను కథ చెప్పవా అని అడుగుతుంది. అదీ, అచ్చ తెలుగు కథ కున్న బలం.


ఒక
పేను, చక్కగా పెసర చేను వేస్తుంది. చేను ఎదిగిన తర్వాత, పెసలన్నీ ఊర్స్చి, వాటిల్తో పెసరట్లేస్తుంది. సరే పెసరట్లేసేం కదా అని, దేశపు రాజుకి కూడా ఇస్తావని కొన్ని పెసరట్లని బాక్సులో పెట్టుకుని బయలుదేరుతుంది. పేను అలా రాజు గారి దగ్గరకు పోతావుంటే, మొదట ఒక తేలొస్తుంది, పేను, పేను నాకొక పెస్రట్టియ్యవా, నేను కూదా నీకుతోడుగా రాజు గారి దగ్గరకు వస్తా అంటుంది. సరే అని అని పేను తేలుకొక పెసరట్టిస్తుంది. తర్వాత ఒక పులి, ఒకబండ రాయి, ఒక పావు అలాగే అడిగి పేనుతోపాటు రాజుగారి దగ్గరకు పోతాయి. రాజు గారి దగ్గరకి పోయిన తర్వాత, ఆయన భవనం ముందు నిలబడి పేను సేవకుడి ద్వారా రాజు గారికి తనోచ్చిన విషయం తెలుపుతుంది. కానీ రాజుగారు, అహే, పేను చేసిన పెసరట్లని, రాజుని నేను తీసుకోవడవేంది అని, అవమానంగా తలచి, ఛీ అంటాడు. పాపం పేనుచాలా అవమానం ఫీల్లవుతుంది. ఒరే రాజు నేను పేనుని, చిన్న ప్రాణిని అనేగదా నువ్వు నన్నిలా అవమానించావు, సరేనీ సంగతి చూస్తా అనుకుంటది. ఒసే తేలు నువ్వు పొయ్యి రాజు దువ్వెన పెట్టుకునే గూట్లో వుండు. పావు నువ్వు భవనం వెనక ద్వారం దగ్గర వుండు. పులి నువ్వు ముందర ద్వారం దగ్గర వుండు. బండ రాయి నువ్వు భవనంప్రక్క ద్వారం ముందున్న పందిరి మీద వుండు అని చెప్తుంది. చెప్పి సక్కా పొయ్యి రాజు గారి తల్లో చేరి కుట్టటం మొదలుపెడ్తుంది. అబ్బా జిలగా వుందని రాజు గారు దువ్వుకోడానికి దువ్వెనకోసం గూట్లో చెయ్యి పెడ్తే తేలు చటుక్కున కుడ్తుంది. అబ్బా తేలు కుట్టింది అని ముందర ద్వారం ద్వారా రాబోతే పులి అంటుంది, వెనక ద్వారం ద్వారా రాబోతే, పావుకాటేస్తానంటుంది, సరే అని ప్రక్క ద్వారం ద్వారా రాబోతే, బండరాయి నెత్తిన పడుతుంది. అప్పుడు రాజుకి విషయంతెలుస్తుంది. పేనుకు క్షమాపనలు చెప్పి, సన్మానాలు చేసి పంపిస్తాడు. ఇదీ కథ. అమ్మ చెప్పిన, అచ్చ తెలుగు కథ. దీంట్లో ఏవుంది, వుందో నాకు తెలీదు. నా మధ్య వయస్సులో నా చిన్నప్పుడు మాయమ్మ చెప్పిన కథ నాకింకాగుర్తుంది. టీనేజొచ్చిన నా కూతురు ఇంకా అప్పుడప్పుడూ ఎప్పుడన్నా నానా నాకు పేను కథ చెప్పవా అనిఅడుగుతుంది.
 
Real Time Web Analytics