ఇందాక నీతో ఫోన్ లో మాట్లాడుతుంటే సడెన్ గా లైన్ కట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న కంప్యూటర్ నేర్చుకొని ఈమెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకొమంటే వినవు కదా అమ్మా! ఇప్పుడు చూడు, నాకెంత టైమ్ వేస్టో. ఆ కాలింగ్ కార్డులతో ఫోన్ చేస్తుంటే మనిద్దరి మాటలు మధ్య లో ఉన్న మధ్యధరా సముద్రం లోనో, అరేబియా సముద్రం లోనో కలిసిపోతుంటాయి. అన్నయ్య ను అడిగితే నీకు ఈ మధ్య సరిగా వినపడటం లేదని, ఫోన్ చేసినా ఉపయోగం లేదని చెప్పాడు. ఇక తప్పుతుందా మరి అని ఈ ఉత్తరం మొదలుపెట్టాను. అమెరికా కబుర్లేమిటి అంటూ అక్కయ్య నన్ను ప్రాణం తీస్తోంది. కాన్ఫరెన్స్ కాల్ చేసి మనం ముగ్గురం ఫోన్ లో హాయి గా కబుర్లు చెప్పుకుందామంటే దిక్కు మాలిన కాలింగ్ కార్డ్ లు ఉన్నట్లుంది ఉలుకుపలుకుల్లేకుండా అవుతాయి.
నువ్వు ఊరికే బాధపడుతుంటావు కానీ అమ్మా, నాకేమైంది? ఇక్కడ నేను హాయిగా వున్నాను. నా గురించి ఊరికే దిగులు పడకు. నేను, మా ఆయన , పిల్లలం అందరం సుఖం గా ఉన్నాం. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను సరిగ్గా వండుకొని తింటున్నానో లేదో అని ఊరికే దిగులు ఇదై పోకు. ఓ పది రోజులు ఏదో నీ మాట తీసెయ్యలేక, ' అమ్మ వారు' పోసిందని జాగ్రత్తగా పథ్యం చేశాను. ఇవాళ ఆదివారం తలంటుస్నానం చెశాను కానీ పోలేరమ్మ కు పెరుగన్నం నైవేద్యం మాత్రం పెట్టడం వీలు కాలెదు. నా తెల్లటి మొహం మీద మచ్చలు పడ్డాయేమోనని నువ్వంత కంగారు పడుతున్నావు కానీ ఇక్కడ డాక్టర్లు అతి శ్రద్ధ్గగా, పరమ జాగ్రత్త గా చూసుకుంటున్నారనుకో. ' చికెన్ పాక్స్' అని తెలియగానే ఎంత హడావిడి చేశారనుకున్నావు! ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఈ జబ్బు వచ్చి ఉంటుంది అన్న దాని మీద మన వంశ వృక్షమంతా తిరగేశారు. అసలు ముందు వాళ్ళు చేసిన పనేమిటనుకున్నావు? నన్ను ఎమర్జెన్సీ రూమ్ కు పంపటం. ఎన్ని రకాల పారీక్షలు చేయవచ్చో ఒక్కటీ వదలకుండా అన్నీ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా తల ప్రాణం తోక కు వచ్చినా పేషెంట్ల పట్ల వాళ్ళ శ్రద్ధ చూసి ముచ్చటేసిందనుకో. ఓ విషయం మాత్రం తెలిసి వచ్చింది. అనంతపురం లోనే కాదు, అమెరికా లో కూడా ' అమ్మ వార్లకు' అయ్యవార్లకు కూడా మందుల్లేవని. కానీ ఇండియా
అక్కడైతే సన్నగా బక్క పీచు లాగా వున్నానని అందరూ ఏడిపించేవాళ్ళు కానీ ఇక్కడకొచ్చాక నేను మంచి రంగు వచ్చాను. అమెరికా గాలి, నీళ్ళు నాకు బాగా సరిపడ్డాయి. కాకపోతే ఇక్కడి నీళ్ళకు నా జుట్టు కాస్త చిట్లినట్లుంటే సన్నగా పిలకలా వుందని నాకే చికాకనిపించి చక్కగా భుజాల దాకా కత్తిరించేసుకున్నాను. బుద్ధిమంతుల జడ భుజాలు దాటదని నువ్వే చెప్పావు కదా. సో, అలా బుద్ధిమంతురాలినైపోయానన్న మాట.
నన్ను చూసి అయిదారేళ్ళయిందని బెంగెట్టుకున్నానన్నావు. నిజమేననుకో. నాకు రావాలనే ఉంది కానీ ఇండియా ఎప్పుడొద్దామన్న ఏదో ఒక ఇబ్బంది. వర్షాకాలం లో వస్తే మన వీధుల నుందా ఆ బురద, మట్టి, రోడ్డు పక్కన ఎట్సెట్రా... తల్చుకుంటేనే రోత. చలికాలం లో వద్దామంటే మనింట్లో హీటింగ్ లేదు. ఇంక ఎండాకాలం సెలవులకు వద్దామంటే అబ్బో..ఆ ఎండ...ఆ ఉక్కపోత...పైగా ఇక్కడ పిల్లలు సమ్మర్ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతారు. ఇక ఎప్పుడు రమ్మంటావో నువ్వే చెప్పు.
ఇందాక నువ్వడిగినదేమిటి? సంతోషంగా వున్నానా అనేనా? నీకా అనుమానం ఎందుకు వచ్చింది? అమెరికా లో ఉండటమేమిటి ఏమిటి? ఒట్టి సంతోషమా? బ్రహ్మానందంగా ఉంటుంది. స్వేచ్ఛకు ఈ దేశం పెట్టింది పేరు. కొద్ది రోజులు పోతే, అప్పుడే పుట్టిన పిల్లకు పేరు కూడా ఆ పసి గుడ్డునే అడిగి పెడతారేమో! ప్రతి మనిషి మాటకు విలువుంటుంది. ఎవరి 'ఛాయిస్' కి ఎవరూ అడ్డురారు. ఇక సౌకర్యాల విషయానికొస్తే ఈ దేశం లో వున్నన్ని సౌకర్యాలు అంతరిక్షం లో కూడా ఉండవేమోనమ్మా. నీకో నిజం చెప్పనా? శరత్ నల్లగా తుమ్మ మొద్దు లా వున్నా, ఎందుకు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నది? అతను అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడనే కదా! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళకు సూది బెజ్జం లో దారం ఎక్కించే పని కూడా ఉండదు. ఒంట్లో కొవ్వు కరగాలంటే జిమ్ కెళ్ళి వాకింగ్ నో, జాగింగ్ నో చేయాల్సిందే కానీ ఒళ్ళు అలిసే పనులే ఉండవు. ప్రతి దానికి మెషిన్లు ఉంటాయి. పర్సు లో డబ్బుల బరువు కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మెషీన్ లో పెట్టి కార్డ్ పెట్టి డబ్బులు తీసుకోవడమే.
మెషిన్లకు టైమ్ సెట్ చేసి పెడితే అన్నీ అవే చేసుకుపోతాయి. కాళ్ళున్నా , లేకపోయినా బాధ లేదు. కార్లుంటే చాలు. ఎక్కడికైనా ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. విశాలమైన రోడ్లు. పచ్చటి చెట్లు. రకరకాల పూల మొక్కలు. ముఖ్యం గా తెల్లగా, పరిశుభ్రంగా మెరిసిపోయే బాత్ రూమ్ లు. కావల్సినంత అప్పు చేసే స్వేచ్ఛ. ఇంతకన్నా ఎవరికైనా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు కావాల్సిందేముంటుంది చెప్పు. అడుగడుక్కి షాపింగ్ మాల్స్. ఒక్కో మాల్ లో లెక్కలేనన్ని షాప్ లు. తిరగటానికి ఓపిక ఉండాలే కానీ ఒక్కో దాని లో ఎన్ని వెరైటీలో! ఎప్పుడూ ఏదో ఒక క్లియరెన్స్ సేల్ ఉంటూనే ఉంటుంది. అసలు లోపలకు వెళితే బయటకు రాబుద్ధి కాదనుకో. జగదేక వీరుని కథ లో రామారావు ఒక్కో లోకానికి వెళ్ళి వస్తుంటాడు చూడు. అలాగన్న మాట. మనకు కూడా ఒక్కో మాల్ లోకి వెళ్ళి వస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంటుంది.
ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇక్కడ కూడా ఆడవాళ్ళకు బోలెడు కష్టాలుంటాయని వాదించే వాళ్లనేమనాలి? నువ్వే చెప్పు. ఇక్క డ పని మనిషి రాలేదని హడావిడి పడనక్కర లేదు. ఇడ్లీ పిండి సరిగ్గా పూలవలేడ్ని దిగులు పడక్కరలేదు. పంటలు బాగా పండ లేదనో, వర్షాలు సరిగా కురవలేదనో, పుష్కరాల కోసం చుట్టాలు ఎక్కువ వచ్చారనో, ఆడపడుచుకు డబ్బులు పంపించాలనో దిగులు మేఘాల్లేవు. అడగకుండా ఎదురింటి పిల్లలు కూడా మన ఇంటికి రారు. పంచదారో, పది రూపాయలో అప్పు అడిగే పక్కింటి వాళ్ళు లేరు. వద్దన్నా పిలిచి మరీ డబ్బులు అప్పిచ్చే దేశం లో ఆడవాళ్ళు సుఖం గా లేకపోవడమేమిటమ్మా! అంతా నీ చాదస్తం కాకపోతేనూ!
చెత్త పారేసుకోవటం దగ్గర నుంచి బస్సులు తిరగటం దాకా ఇక్కడంతా ప్రతిదీ ఓ పద్ధతి గా జరుగుతుంది. బస్సు ఏ స్టాప్ లో ఏ నిమిషానికి ఆగుతుందో స్కేడ్యూల్ లో ఉంటుంది. వాన అయినా, చలి అయినా అందులో మార్పేమి ఉండదు. మన దేశం లో నైతే స్టాప్ ఎక్కడో ఉంటుంది. బస్సు ఎక్కడో ఆగుతుంది. ఎప్పుడు ఏ బస్సు ఎందుకు వస్తుందో, అసలెందుకు బస్సు రాలేదో జ్యోతిష్కులు కూడా చెప్పలేరు కదా. పై పెచ్చు బంద్ లనీ, రాస్తారోకోలనీ ఎప్పుడూ ఏవో ఆటంకాలు. అంటే అన్నానంటావు కానీ మన వాళ్లోట్టి వెధవాయిలోయి అన్న గిరీశం మాట ఎంత నిజమనుకున్నావు!
నాకైతే ఇక్కడ ప్రాణం తెరిపిన పడ్డట్లుందనుకో. అక్కడైతే పొద్దుట పాల ప్యాకెట్లు అయిపోతాయేమోనన్న టెన్షన్ తో తెల్లారేది. కానీ ఇక్కడ అలాంటి గొడవ లేదు. కాఫీ మేకర్ లో టైమ్ సెట్ చేసి రాత్రే కాఫీ పౌడర్ వేసి పెడితే పొద్దుట కరెక్టు గా మనం లేచే సమయానికి వేడి వేడిగా పొగలు కక్కుతూ డికాక్షన్ రెడీ గా ఉంటుంది. పాల ప్యాక్తెట్లు అయిపోతాయని పొద్దుటే నాలుగుగంటలకు నువ్వు లేచి వెళ్ళేదానివి కదా. అవన్నీ గుర్తొస్తే ఇప్పటి దాకా నువ్వేన్ని కష్టాలు పడ్డావో, ఇంకా ఎన్ని కష్టాలు పడతావో తలుచుకుంటే గుండెబరువెక్కుతుందనుకో.
ఇప్పటికైనా నా మాట విను. నీ మనసు మార్చుకో. నీ వీసా పేపర్లు పంపిస్తాను. ఇక్కడకు వచ్చేయి. నీ జీవితం లో కాస్త సుఖపడటం అంటూ ఏదైనా ఉంటే, అది అమెరికా లో మాత్రమేనని మరిచిపోకు. ఇక్కడేదో చాలా చలి గా ఉంటుందని నువ్వు భయపడతావు కానీ పై నుండి కింద దాకా దట్టమైన కోట్లేసుకొని ఇంట్లో హీటింగ్ పెట్టుకొని హాయి గా ఓ పెగ్ వైన్ తాగితే చలా, గిలా ...ఇక్కడ టైమ్ ని, వాతావరణాన్ని అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుకు , వెనక్కి తిప్పుకోవచ్చు. మొన్ననే మేం టైం ని ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం కూడాను. అదేం చోద్యమే అనకు. కారణం నేను చెప్పినా నీకర్థం కాదు.
ఇక్కడన్నీ రాజభోగాలేనమ్మా, మైనస్ డిగ్రీల చలి లో కూడా పంపు తిప్పితే వేడి నీళ్ళు. ఆకలేస్తే అయిదు నిముషాలుకూడా ఆగక్కరలేకుండా ఎప్పుడూ రెడీ గా ఉండే సెరియల్స్, శాండ్ విచెస్, ఇన్ స్టంట్ రైస్. చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ తినమంటే గొడవ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఆ పట్టింపు లేదు. అమెరికా లో ముందు మనం అలవాటు చేసుకోవాల్సింది సెరియల్స్, శాండ్ విచెస్ తినటమే. టైం లేకపోతే కూరలు తరిగే పని కూడా లేదనుకో. అన్నీ ఫ్రోజెన్ వే దొరుకుతాయి. అలా సీల్ తీసి ఇలా బాణలి లో పడేయటమే. పడీ పడీ తెల్లగా మెరిసేలా గిన్నెలు తోమక్కర లేదు. ఒక్క సారి పై పైన కడిగి డిష్ వాషర్ లో పడేస్తే చాలు. గిన్నెలను శుభ్రం గా కడిగి తడి గా లేకుండా డ్రై కూడా చేసే పెడతాయి. వారానికో సారి బట్టలు, దుప్పట్లు, కర్టెన్లు అన్నీ చక్కగా వేటికవి విడి విడిగా జాగ్రత్త చేసుకొని వాషింగ్ మెషిన్లో పడేస్తే చాలు. బాత్ టబ్ లు, కమోడ్ లు వారానికో సారి గంట సేపు బ్రష్ చేస్తే వారమంతా తెల్లగా మెరుస్తుంటాయి. వారం లో అయిదు రోజులు ఆఫీస్ పని. వీకెండ్ మొత్తం ఇలా ఇంటి పని. చూశావా? నేనెంత పని మంతురాలినై పోయానో! అక్కడైతే ప్రతి పనికీ పని మనుష్యుల్నీ బతిమి లాడాలి. వాళ్ళు నాగాలు పెడితే ఎంత టెన్షన్ పడే వాళ్ళం! ఇక్కడ అలాంటి డిపెండెన్సీ ఏమీ లేదు. మన పనులు మనం చేసుకోవడం శరీరానికి ఎంత ఆరోగ్యం అనుకున్నావు. ఈ సారి మేమంతా ఇండియా వచ్చినప్పుడు పని పిల్ల చెప్పకుండా ఎగ్గొట్టిందని నువ్వేమి కంగారూ పడిపోకు. అమెరికా అమ్మాయి అంటే అసలు సిసలైన పని మంతురాలు అంటుంది నా ఫ్రెండ్ అరుణ. ఈ సారి నువ్వే చూస్తావు గా నేను బాత్ రూమ్ లు ఎంత బాగా క్లీన్ చేస్తానో, ఇల్లు ఎంత బాగా నీట్ గా పెడతానో!
వారం రోజులు ఆఫీస్ తో కొంచెం బిజీ గా అనిపించినా వీకెండ్ మాత్రం చాలా హేపీ గా , జాలీ గా రక రకాల పార్టీలతో గడిచిపోతుంటుంది. ఒక్కో వారం ఒకొక్కళ్ళ ఇంట్లో పార్టీ. అచ్చంగా మనం వారాలు చెప్పుకున్నట్లు. సగం పార్టీలు పాట్ లక్ లే. అంటే ఏమీ లేదు. ఒకొక్కళ్లం ఒక్కో వెరైటీ చేసి తీసుకెళతాం. లేదంటే అన్నీ వంటలు ఒకరే చేయాలంటే ఎంత కష్టం! ఇలా అందరూ ఎవరూ ఎక్కువ కష్టపడకుండా, ఎవరి మనసు ఎక్కువ నొప్పించకుండా నడుచుకుంటుంటారు. ఇక్కడ ఏడుపులు, నవ్వులు, పుట్టినరోజులు , చావు పలకరింపు లు ప్రతీదీ టైం సెట్ చేసి పెట్టుకున్నట్లు జరిగిపోతుంటాయి. బర్త్ డే లు, వెడ్డింగ్ యానివర్సరీలు, బేబీ షవర్లు అన్నింటికీ వీకెండే మంచి ముహూర్తం. మనకేం జరిగినా తీరిగ్గా కూర్చొని వీకెండ్ లో ఏడ్చుకోవచ్చు. అక్కడైతే ప్రతీ నెలా ఏదో ఒక పండుగ. కొత్త బట్టలు, పిండి వంటలు, పట్టు చీరలు, పేరంటాలు. మనకి ఇష్టం లేకపోయినా చుట్టు పక్కల వాళ్ళ కోసమైనా ఏవో ఒకటి చేయాల్సి వచ్చేది. అబ్బో, ఎంత హైరానో కదా. మన దీపావళి, సంక్రాంతి కంటే హేలోవిన్, థాంక్స్ గివింగ్ , క్రిస్ మస్ లైతే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే వాటికి అధిక మాసాలు, తిథుల గొడవ లేదు.
ఇవన్నీ చదివిన తర్వాత నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. నేనెంత పరమానందంగా జీవితం గడుపుతున్నానో! ఇప్పటికైనా నా గురించి దిగులు పడటం మానేసి నీకు తెలిసిన ఆడపిల్లలకు అమెరికా జీవితం గురించి, అమెరికా మొగుళ్ళతో వచ్చే లాభాల గురించి చెప్పు. మన భాష , మన దేశం, మనసు, గినసు అంటూ పెట్టుకుంటే అన్నీ కష్టాలే కానీ సుఖాలేమున్నాయి చెప్పు? కాబట్టి అలాంటి ట్రాష్ ని అక్కడే కృష్ణ లో కలిపేసి ఇక్కడున్న మెషిన్లతో పాటు మనం కూడా ఒక మెషీన్ గా మారిపోతే మనకూ లాభం, మన దేశానికి కూడా లాభం.
ఎన్నాళ్లయిందో కలం పట్టుకొని తెలుగు లో ఉత్తరం రాసి. అక్షరాలు కుదురుగా, ముత్యాల్లా లేవని తిట్టబోకు. అసలు తెలుగు ఈ మాత్రమైనా మర్చిపోకుండా నేను రాసినందుకు సంతోషించు. నీకీలా ఉత్తరం రాస్తుంటే గుండెపట్టేస్తోంది. రియాల్లీ ఐయాం మిస్సింగ్ యూ మామ్.
ఇలా నీకుత్తరం రాస్తుంటే అచ్చంగా అప్పగింతలప్పుడు వచ్చాయి చూడు అట్లా నిజం కన్నీళ్లే వచ్చేస్తున్నాయి. టిష్యూ పేపర్ కావాలి. ఇప్పటి వరకూ వాటి మీదే నీకు లెటర్ రాశాను. ఉంటానమ్మా! ఎలాగైనా ఈ మెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకో. నాకు ఈ ఉత్తరం రాసే ఆబ్లిగేషన్ తప్పుతుంది.
అదుగో మైక్రోవేవ్ లో అన్నం పెట్టాను. అయిపోయినట్లు చిన్న గంట మోగిన శబ్దం. నాలుగు పొయ్యిల మీద నాలుగు వంటలున్నాయి. మళ్ళీ పదిహేను రోజుల వరకూ వంట కుదరదు. అన్నీ ఇవాళే చేసుకోవాలి. డ్రయ్యర్ లో బట్టలు తీసి మరో లోడ్ బట్టలు వేయాలి. వచ్చే వారానికి సరిపోయే ఊపిరి కూడా ఈ వీకెండ్ లోనే పీల్చుకోవాలి...ఉం...టా....
( ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం లోనూ, తెలుగునాడి లోనూ (2004 లోనో, 2005 లోనో ) ప్రచురితం )
ఖర్జూరం పప్పులలడ్డూ
-
పిల్లలు కూడా చేయగల పిండివంట!! పంచదార లేదు. బెల్లం లేదు నెయ్యి లేదు. అవెనులూ
స్టౌలూ లేనే లేవు. రెసిపీమాట అస్సలు లేదు. ఇంతకంటె తేలికైన వంటకం ఉంటుందనుకోను
ఒట్...
3 weeks ago