నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, September 21, 2012

ఐ పాడ్ , ఐ ఫోన్ ల్లో సారంగ బుక్స్ లభ్యం


సారంగ పుస్తక ప్రచురణలు నవంబర్, 2010 లో ప్రారంభించినప్పుడు తెలుగు పుస్తకాలను కేవలం ప్రింట్ రూపం లోనే కాకుండా యాపిల్  ఐ బుక్స్,  ఇతర ఈ –బుక్స్ గా  కూడా అందివ్వాలని సంకల్పించాము. ఆ చిరకాల స్వప్నం ఇవాళ సాకారమయింది. సారంగ ప్రచురణలు యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో కూడా సెప్టెంబర్ 20,2012 నుంచి  లభ్యమవుతున్నాయని సగర్వంగా, సంతోషంగా తెలియచేస్తున్నాము. సారంగ సంస్థ నుంచి ప్రచురితమైన ప్రతిష్టాత్మక పుస్తకాలు తన్హాయి , యమకూపం నవలలు ఇప్పుడు ఐపాడ్, ఐ ఫోన్, ఐ పాడ్ టచ్  లేదా ఏదైనా ఐఓఎస్ సాధనం ( డివైస్) లో చదువుకోవచ్చు. ఈ ఐ పుస్తకాలను సారంగ వెబ్ సైట్ లో అందచేసిన లింక్ ద్వారా యాపిల్ ఐ బుక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. యాపిల్ ఐ బుక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవటం తో పాటు,  చదివాక పుస్తకం ఎలా ఉందో రివ్యూ చేసే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరలో సారంగ తొలి ప్రచురణ, అఫ్సర్, వంశీకృష్ణ ల సంపాదకత్వం లో వెలువడిన కవిత్వ సంకలనం “అనేక”  కూడా ఐ బుక్స్ లో అందుబాటు లోకి వస్తుంది.
యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో తెలుగు పుస్తకాలు అందుబాటు లోకి రావటం అటు తెలుగు సాహిత్యానికి, ఇటు సారంగ ప్రచురణలకుకూడా ఓ శుభ వార్త. తెలుగు సాహిత్య ప్రచురణ రంగం లో ఈ ఐ బుక్స్  అతి పెద్ద మలుపు. మంచి తెలుగు పుస్తకాలను మరిన్ని ఇతర డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లోకి కూడా అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం లో సారంగ కు తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు నిరంతరం అండగా నిలుస్తాయని ఆశిస్తున్నాము.
నోట్ : ప్రస్తుతానికి ఈ ఐ బుక్స్ కొనుగోళ్ళు  ఇండియా బయట మాత్రమే సాధ్యం . ఇండియా లో వున్న వారు ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేది యాపిల్ సంస్థ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
యాపిల్ ఐ బుక్స్ కొనుగోళ్ళు, మొదలైన వాటి గురించి మీ అభిప్రాయాలూ, సలహాలు, సందేహాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. సంప్రదించాల్సిన ఈమైల్ kalpana@saarangabooks.com
తన్హాయి ఐ బుక్ కొనుక్కునే లింక్ ఇది 
 యమకూపం ఐ బుక్ కొనుక్కునే లింక్ ఇది 

Friday, August 17, 2012



స్వరం మార్చిన ఒక మాట

 
నీతో మాట్లాడలేక....
పెదవి ఒంపుల నుంచి
ఓ వెల్లువై రాబోతున్న
మాటల జల్లు
ఓ వలయం లా వెనక్కు తిరిగి
గుండెలోతుల్లో జారిపోయింది.

ఎవరెవరి కళ్ల మీదుగానో
జారిపోతున్న నిన్ను చూడలేక .....
కనుపాపల చీకటి కొసల నుంచి
జాలువారే ఓ నీటి చుక్క
కళ్లెదుట కాలిపోతున్న కలల్ని చూసి
అలలు లేని సముద్రమై
లోపల్లోపల ఎండిపోయింది.

మాటలు లేని పగళ్ళు,
నిద్ర లేని రాత్రుళ్లు
స్పర్శ  లేని సహజీవనాలు
ప్రేమ లేని అనుబంధాలు
శాంతినివ్వని యుద్ధాలు

ఈ జీవితం ఓ అసంపూర్తి మరణం !
అందుకోసమే ఎదురుచూపులు!!

ఆగస్ట్ 17, 2012   
కల్పనారెంటాల

Monday, July 30, 2012

విస్మృతి



నిద్ర నాకు గాయాన్ని కానుక చేసింది
గాయం నాకు రాత్రిని కానుక చేసింది
ఈ రాత్రినేం చేసుకోను?
ఈ చీకటి ని ఎలా మూట కట్టుకోను?

నిద్ర పెట్టె తీసి
చంద్రకాంత శిలా నేత్రాలను తెరిచాను
కన్నీటి ని దాచుకుంది దుఃఖం

నిద్ర రాదు
కలలూ రావూ
నిజాల్ని అబద్ధాలుగా చూడటం ఎలా?

నిద్రంటే
నిజాల్ని దాచుకోవటమేగా?
కలలంటే
స్మృతుల్ని ఎగరేయటమేగా?
ఏ నిజ సూర్య కిరణం లోంచో
నిద్ర వస్తూ ఉంటుంది
నా పార్ధివ కాంక్షల్ని
భుజాన మోసుకెళ్ళేందుకు

వెళుతూ వెళుతూ
ఓ అబద్ధాన్ని జారవిడిచింది
అది పగలై నన్ను నిద్రపుచ్చింది
పసిపాపై జోల పాడింది

(ప్రజాతంత్ర సాహిత్య సంచిక , 2001 )


 
Real Time Web Analytics