నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, December 21, 2010

మనవి మాటలు!



‘ అయిపోయింది’ అన్న అయిదు అక్షరాల్ని కలిపి రాసేటప్పటికి మనసంతా బెంగ గా , ఏదో తెలియని ఉద్వేగంగా అనిపించింది.
ఎనిమిది నెలలుగా నన్ను కదిలించి, కవ్వించి, మరిపించి, మురిపించి, అబ్బురపరిచి, ఓ విధమైన ఆవేదనకు గురిచేసిన నా పాత్రలన్నీ నన్ను వదిలివెళ్లిపోతాయెమో అనుకోగానే ఇదీ అని చెప్పలేని ఒక భావం నా గుండెనంతా నింపేసింది. పాత్రలు రక్త మాంసాల కొత్త జీవం తో నా లోపలకు ఎలా నడిచి వచ్చాయో అలాగే వెళ్లిపోతాయనీ, వెళ్లిపోవాలని కూడా తెలుసు. అయినా వాటి మీద ఏదో ఒక మమకారం. వాటితో ఇదీ అని చెప్పలేని పెనవేసుకుపోయిన బంధం.

తన్హాయి రాయాలని ఆలోచించినప్పుడు కల్హార, కౌశిక్, చైతన్య, మృదుల కొన్ని పాత్రలు. కానీ కథ మొదలుపెట్టాక పాత్రల్లో జీవం పోసుకుంది. వారు నవలలో ఓ నాలుగు పాత్రలుగా మిగిలిపోలేదు. నాతో సహా చదివిన ప్రతివారు, ఎవరికి వారు వారిలో తమని తాము చూసుకున్నారు. తమకు తెలిసిన వారిని వెతుక్కున్నారు. తమ చుట్టూ జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనల్ని, సన్నివేశాల్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు బాధపడితే పాఠకులు అయ్యో అని సానుభూతి ప్రకటించారు. వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాలని చూశారు. మంచేదో, చెడేదో చెప్పే ప్రయత్నం చేశారు. కొందరు తమ వ్యక్తిగత జీవితం లోని సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఉద్వేగంగా కామెంట్లు పెట్టారు,మెయిల్స్ పంపారు. ఇంకొందరు ప్రపంచం అంతా సుభిక్షంగా, పెళ్ళిలన్నీ వెయ్యేళ్ళు వర్ధిల్లుతుంటే నేను ఇలాంటి నవలలు రాస్తున్నానని కత్తులు దూశారు.

ఇలా నా పాఠకులు, ఆ పాఠకులతో నా సంభాషణ, వారి ఆలోచనలు, వారి తర్కాలు, వారి సందేహాలు, వారి సమర్థనలు ఇవన్నీ నాలో ఒక కొత్త వూపిరిని , సరి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. అనేకరకాలుగా తన్హాయి రాయటం నాకొక కొత్త అనుభవాన్ని, అనుభూతిని అందించింది.

ఇది నా మొదటి నవల. మామూలుగా నవల రాయటం వేరు. బ్లాగ్ లో ఎప్పటికప్పుడు, ఏ వారానికి ఆ వారం ఏ భాగానికి ఆ భాగం రాయడం వేరు. ఒక పత్రికలో ఒక సీరియల్ అచ్చు కావటం వేరు, అక్కడ రీడర్స్ రెస్పాన్స్ కొన్ని ఉత్తరాలకు పరిమితం. కానీ బ్లాగ్ లో నవల ద్వారా నా పాఠకులు నాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంభాషించే వీలు ఉంది. అందులో అర్థం చేసుకోవటం ఉంది, అపార్థం చేసుకోవటం కూడా ఉంది.
ఒక వారం ఆలస్యమయితే అలిగారు, అడిగారు, తొందరపెట్టేశారు. నచ్చినప్పుడు ఆహా, వోహోఅన్నారు, నచ్చనప్పుడు పెదవి విరిచి చెప్పేశారు. మొహమాటాలు, ముఖస్తుతులు లేవు. నవల ని నవల గా చదివారు.నవల లోని పాత్రల్ని తమ కు తెలిసిన మనుష్యులతో, తమ చుట్టూ వున్న సమాజం తో పోల్చి చూసుకున్నారు. వారిని తమ కుటుంబం లో ఒకరిగా అక్కున చేర్చుకున్నారు. వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని భయపడ్డారు, ప్రమాదాలు కొద్ది లో తప్పిపోయినప్పుడు అమ్మయ్యా అని వూపిరి పీల్చుకున్నారు. పాత్రల ఆలోచనలు తప్పుగా అనిపిస్తే చర్చించారు. కొత్తగా అనిపిస్తే స్వాగతించారు. కొత్త ప్రతిపాదనలో, కొత్త ఆలోచనలో కనిపిస్తే ఆగి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా నవల రాసిన నాకే కాకుండా, ఇది చదివిన వాళ్ళకు కూడా ఒక మంచి " ఎక్సర్సైజ్" అయింది.
తన్హాయి నవల ఇతివృత్తం భిన్నమైనది. సమాజం లో మన చుట్టూ రోజూ కనిపించే, వినిపించే అనేకానేక సంఘటనల నుంచి తీసుకొని రాసినదే తప్ప ఇందులో ప్రత్యేకంగా నవల కోసం నేను సృష్టించి రాసినది ఏదీ లేదు. మీకు నచ్చినా, నచ్చకపోయినా రెండింటికి అదే కారణం.
ఈ నవల రాయటం లో రచనాపరంగాఎన్నో సాధక బాధకాలు . ఏ భాగానికి ఆ భాగం రాయడంవల్ల కొన్ని సాంకేతికపరమైన పొరపాట్లు దొర్లి వుండవచ్చు. అలాంటివి ఏమైనా వుంటే నేను త్వరలోనే సరిదిద్దే ప్రయత్నం మొదలుపెడతాను.

నవల రాయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీలో అనేకమందికి ఇప్పటివరకూ వున్న అనేకానేక సందేహాలను చర్చ కు పెట్టండి. అయితే అది మీరు ప్రశ్నలు అడగటం, నేను చెప్పటం అన్న పద్ధతి లో కాకుండా... కలిసి మాట్లాడుకుందాము. రాయటం ద్వారా నేను చెప్పాల్సింది చెప్పేసాననే అనుకుంటున్నాను. అయితే మీ అందరి చర్చల్లో ఒక రచయిత గా నా వైపు నుంచి ఏవైనా తప్పనిసరిగా చెప్పాల్సిన అంశం వుంటే నేను మాట్లాడతాను. లేకపోతే..మీరందరూ మాట్లాడుతుంటే నేను ముందు వినదల్చుకున్నాను. మరింత లోతుగా మీ అభిప్రాయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను.

తన్హాయి చదివాక అనేక మంది పాఠకులు కామెంట్ ఏం రాయాలో తెలియక ఆగిపోయామనేవారు. ఇప్పుడు నవల మొత్తం మీ చేతిలో వుంది. ఎవరెవరు ఎందుకు ఎలా ప్రవర్తించారు అన్న దాని మీద మీ అవగాహనను, మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని ఇక్కడ పంచుకోండి. మీ విశ్లేషణలు, మీ విమర్శలు ( నవల నచ్చినా, నచ్చకపోయినా సరే) నాకు ముందుగా మెయిల్ చేస్తే కామెంట్ గా కాకుండా తూర్పు-పడమర లో బ్లాగ్ పోస్ట్ గా ప్రచురించే ఉద్దేశం ఉంది. మీ మీ బ్లాగ్ ల్లోనే తన్హాయి మీద ఏమైనా పోస్ట్ లు రాస్తే దయచేసి ఇక్కడ ఒక లింక్ ఇస్తే....తన్హాయి కి సంబంధించిన చర్చ అంతా ఒకే చోట లభ్యమవుతుంది.

ఇన్ని నెలలుగా ఈ తన్హాయి రచనలో పడి స్నేహితులకు మెయిల్స్ ఇవ్వటం ,ఫోన్లు చేయటం తగ్గిపోయింది. కొందరు విసుక్కున్నారు.. మరి కొందరు నొచ్చుకున్నారు. మా అమ్మ లాంటి వాళ్ళు నాలుగు అక్షింతలు కూడా వేశారు. నా పుస్తక పఠనం,మిగతా వ్యాపకాలు అన్నీ మూలాన పడ్డాయి. అయినా సరే, నా మీదున్న ప్రేమతో, స్నేహం తో..నా పరిస్థితి ని అర్థం చేసుకొని సహకరించిన సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ...ముఖ్యంగా నా మీద నమ్మకంతో ఈ నవల ను మొదటి నుంచి చదివి ఇంత గొప్ప ప్రోత్సాహాన్ని,మీ ఆదరాభిమానాల్ని నాతో పంచుకున్న పాఠకులకి నా ధన్యవాదాలు. మీరందరూ నా పక్కన లేకపోతే ఈ నవల రాసి ముగించటం నావల్ల అయ్యేది కాదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

మీ
కల్పనారెంటాల
డిసెంబర్ 16, 2010.

17 వ్యాఖ్యలు:

భాను said...

నా అభిప్రాయాలు ఇక్కడ
http://bhanu67.blogspot.com/2010/12/blog-post_18.html

మాగంటి వంశీ మోహన్ said...

వ్రాసానన్నారు, బానే ఉంది. పాత్రలు సృష్టించానన్నారు బానే ఉంది. సృష్టించాక జీవం పోసానన్నారు బానే ఉంది. వాటితో బంధాలు పెంచుకుంటున్నారు చూడండి. అది ప్రమాదకరం. :)

"బ్రహ్మ" చిత్తంతో నిశ్చింతగా సృష్టిస్తూ పోతూ ఉండండి. పనికిరానివాటిని ప్రకృతి ఎలా చెత్తకుప్పలో పడేస్తుందో, పనికొచ్చేవాటిని పాఠకులు అంతగానూ ఆదరిస్తారు. పనికిరాకపోతే చెత్తకుప్ప ఉండనే ఉందిగా!

ఒకడి అభిప్రాయాల కోసం చూస్తూ కూర్చోవద్దని, వ్రాస్తూ ఉంటే పదును అవే తేలతాయనీ మీకు చెప్పనఖ్ఖరలేదనుకుంటా. పదును తేలకపోతే పాఠకుల ఖర్మ అనుకోవటమే. ఆ ఖర్మను భరించలేని ఉద్రేకపూరితుల గొడవ వేరేగా ఎలాగూ బయటపడుతుందిగా....

ఇంకొకరి అభిప్రాయాలతో, ప్రశ్నలతో మీ వ్రాతలకు పదును పెట్టుకోవాలని అనుకోవద్దని చెప్పటం. :) అర్థం అయ్యిందని అనుకుంటూ...

చివరిగా ఓ మాట - చూడఁదగినవస్తువును జూచి శిరఃకంపనము చేయనివాఁడు పశువులలోనధముడు అని పానుగంటివారు జంఘాలశాస్త్రిచే చెప్పిస్తారు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు...అదండీ సంగతి... :)

Anonymous said...

Maam,

Do you have any plan to arrange a PDF for us?

Regards.
Kumar

కొత్త పాళీ said...

కల్పన, సంకల్పించినందుకు పట్టు విడవకుండా తణాయిని పూర్తి చేసినందుకు అనేకానేక అభినందనలు. అక్కడక్కడా కొన్ని కామెంత్లు చూడగా చాలామంది మీ రచనని ఉత్కంఠతో ఫాలో అయినట్టు అర్ధమయింది. అలా పాఠకుల అభిమానం సంపాయించుకున్నందుకు మరికాసిని అభినందనలు. పూర్తయింది అని తెలిసిన వెంటనే చదవడం మొదలు పెట్టాను .. ఇక నా చదవడం ఎప్పటికి పూర్తవుతుందో! :)

మాలతి said...

కల్పనా, నువ్వు ఇక్కడ చెప్పిన మాటలు - ఒక బృహత్కార్యం పూర్తి చేసినతరవాత రచయిత అనుభూతి చాలా బాగా విశదీకరించేవు. నువ్వన్నట్టు, వ్యాఖ్యలతోనూ, నీ అనుభవంతోనూ మరొకసారి సమన్వయించుకుని, నవలగా ప్రచురించగలవని ఆశిస్తున్నాను. హృదయపూర్వకశుభాకాంక్షలు. కొత్తసంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు చేపట్టగలవని ఆశిస్తూ.. - మాలతి

మంచు said...

కల్పనా జీ : తరువాతి సీరియల్ ఎప్పుడు :-)

Kalpana Rentala said...

భాను,

థాంక్స్.

వంశీ గారు, మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను.జంఘాల శాస్త్రి గారు మన బ్లాగ్ ల కోసం కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పినట్లున్నారు.:-))

కుమార్, పిడిఎఫ్ చేస్తున్నాను. కొంచెం వోపిక పట్టండి.
కొత్తపాళీ, మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తాను.
మాలతి గారు, కొత్తసంవత్సరం లో కొత్త ప్రయోగాలా...అమ్మో మీరు నన్ను తిడుతున్నారు:-))

మంచు, ఇంకో సీరియలా! తప్పదా! మరి మీ అందరూ ఎలాంటి సీరియల్ కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఆదిరాస్తానని కాదు కానీ వూరికె మీ అందరి అభిప్రాయాలు తెలుస్తాయి కదా!

జ్యోతి said...

వంశీగారు, మీ మాట శిరోధార్యం.. మీరు కల్పనకు చెప్పినా నేను వాటిని అప్పు తీసుకోవచ్చా??

మాగంటి వంశీ మోహన్ said...

కల్పన గారూ

:) జంఘాలశాస్త్రిగారి మాటలు బ్లాగులకేం ఖర్మం, దేనికైనా పనికొస్తాయి....

బైదవే, మీ రచన "తన్హాయి"లో నేను ఒక్క ముక్క కూడా చదవలేదు...మీరు మనవి మాటలన్నారనీ, బోల్డు భాగాలున్నాయని చూసాను కాబట్టీ, మీరు రాసిన ఈ టపా మీద నా అభిప్రాయం ఆ పై కామెంటు రూపంలో వ్రాసాను. పి.డి.ఎఫ్ చేసాక లంకె పంపించండి, అప్పుడు తప్పక తీరిక చేసుకుని చదువుతా...అభిప్రాయం చెబుతా...

అనుకోనంటే ఓ మాట - కల్హార, కౌశిక్ అనే పేర్లు ఎందుకో నాకు పడవు, కానీ రచనను రచనగా చూడాలి, చదవాలి కాబట్టి చదువుతా, తర్వాత అభిప్రాయం చెబుతా...ధన్యవాద్!

జ్యోతిగారూ - అప్పులు , పప్పులూ ఏవీ ఉండవు నా దగ్గర. అప్పు రేపు అన్న బోర్డు మటుకు ఉన్నది. ఇహ మీ ఇష్టం... :)

Anonymous said...

Dear Kalpana garu,

ippude modalu pettanu, chadivina taruvata mee 'pani'tanam cheputhanu. pdf aithey baguntundemonani naaku anipinchindi. endukante idi venakku velli muduku vocche vyavaharam kada.
luv
Himabindu.S

Anonymous said...

tanhaayi serial chaduvudaam ani ee blog open cheste
asalu emi kanipinchatledu..
seial complete links ivvagalaru pls.

Kalpana Rentala said...

సారీ, ఆ నవల ఇక బ్లాగ్ లో లభ్యం కాదు. తీసేశాను. పుస్తకం కింద త్వరలో బయటకు వస్తుంది.

Anonymous said...

motham tisinattu leru..
konni parts kanipistunnay...
is there any reason ???

Kalpana Rentala said...

పొరపాటు న ఒక భాగం వదిలేసినట్లు వున్నాను. ఇప్పుడు తీసేశాను. ఇంకా ఏమైనా కనిపిస్తుంటే చెప్పండి. తీసేస్తాను. :-))

Anonymous said...

నవల గా వస్తుంది అంటే,కొనుక్కుని చదవాల్సిందేనా?మా లాగా విదేశాలలో ఉన్న వారి సంగతో?పీడీఎఫ్ చేసి త్వరగా ఇవ్వండి నేను కొంత చదివి మధ్యలో ఒక నెల్లాళ్ళు చదవలేదు బ్లాగులు. మీ బ్లాగుకొచ్చి చూస్తే ఆ సీరియలేమో ఇప్పుడు లేదు.

Ennela said...

kalpana garu, mee tanhayi gurinchi bhanu garu, ashok garu chepaaga vinnanu...konchem ekkadundo chepparuu please..naaku kanabada ledu..

prakatana:kanabaduta ledu.
Kalpana gaari Tanhayi kanabaduta ledu...vetikichchina vaariki...tagina bahumati ivvabadunu....gaduvu tedee...15janavari 2011. 15 taruvaata vachchina entreelu sveekarinchabadavu...

Kalpana Rentala said...

అనానిమస్ గారు,
క్షమించాలి. నవల పిడిఎఫ్ గా అందించటం కుదరదు. విదేశాల్లో వున్న వారు కూడా నవల కొనుక్కునే సదుపాయం కల్పిస్తాము. కొంచెం వోపిక పట్టండి.
ఎన్నెల గారు,
ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతం. తన్హాయి ఇక ఈ బ్లాగ్ లో కనిపించదు. కారణం ఇంతకు ముందే చెప్పాను. అది నవల గా విడుదల కాబోతోంది. అప్పుడు పుస్తకం గా చదువుదురుగానీ..

 
Real Time Web Analytics