సుప్రసిద్ద పత్రికా సంపాదకుడు , రచయిత, కవి, అనువాదకుడు నండూరి రామ్మోహనరావు గారు రెండు వారాలుగా తీవ్ర అస్వస్థత తో వున్నారన్న వార్తలు వింటూనే వున్నా, ఆయన మరణం తో నిన్నటి రోజంతా ఆయన జ్నాపకాల తలపోత తో గడిచిపోయింది.
నా జర్నలిజం కెరియర్ లో తొలుత నేను పని ప్రారంభించినది నలుగురు అగ్ర శ్రేణి పత్రికా సంపాదకుల దగ్గర కావటం నా అదృష్టం. ఆంధ్ర జ్యోతి వార పత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహన రావు, స్వాతి సపరివార పత్రికాధినేత వేమూరి బలరాం, ఆంధ్రభూమి సంపాదకుడు ఏ.బి.కె. ప్రసాద్ ల దగ్గర నా జర్నలిజం వృత్తి మొదలయింది. ఫ్రీలాన్సు జర్నలిస్టు గా కెరియర్ ప్రారంభించటం తో మొదటి ముగ్గురి దగ్గర ఏక కాలం లో పని చేశాను. అది 1985-86 మధ్య కాలం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూకూడా లీడింగ్ లో వుండేవి. నేను జర్నలిజం రంగం లోకి రావటానికి కారకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఒకమీటింగ్ కి నేను వ్యాఖ్యాత గా వ్యవహరించినప్పుడు ఎంతో ప్రేమగా వచ్చి పలకరించి, రేపు ఆఫీస్ కి వచ్చి కనిపించుఅన్నారు.సరే అని వెళ్ళి కనిపిస్తే ' మాకు కాలమ్ రాస్తావా?' అని అడిగారు. అలా జర్నలిజం లో నా రంగప్రవేశంనేరుగా ఒక ప్రసిద్ధ వార పత్రిక లో ' టీవీ సమీక్ష ' కాలమ్ తో మొదలయింది. అది చూసి నండూరి వారు తన ఆఫీస్ కిపిలిపించారు. విజయవాడ లో జరిగే అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నండూరి వారిని అనేక సార్లు అంతకు ముందు చూసినప్పటికీ ఆయన దగ్గర పని చేయటానికి గాను మొదటి సారి వెళ్ళి ఆయనను కలుసుకోవటం మాత్రం మర్చిపోలేని సంఘటన. ఆంధ్రజ్యోతి వారపత్రిక లో నా కాలమ్ చూసి, బాగా రాస్తున్నావని మెచ్చుకొని మాకు కల్చరల్ రిపోర్టింగ్ చేస్తావా? అని అడిగారు.
అలా ఆయన దగ్గర ఆంధ్రజ్యోతి దిన పత్రిక కోసం విజయవాడ లో జరిగే సంగీత, సాహిత్య, నృత్య, నాటక
కార్యక్రమాలకు హాజరై వాటి మీద సమీక్షలు రాసి అందచేసేదాన్ని.
నండూరి చాలా మితభాషి. మాటలోనూ, రాత లోనూ కూడా అనవసర వాక్యం కానీ, వ్యాఖ్య కానీ వుండదు. అందుకే
నండూరి దగ్గర మాట్లాడటమంటే అప్పట్లో భయం గా ఉండేది. కానీ పురాణం , నండూరి వారికి పూర్తి వ్యతిరేకం.
పురాణం వారు మంచి హాస్య చతురులు. మనతో చాలా ప్రేమ గా, ఆప్యాయంగా వుండటంతో పాటు బోలెడు జోకులు
వేస్తారు. ఆయన మన దగ్గర ఫ్రీ గా మెలుగుతారు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడటానికి మనకు కూడా ఎలాంటి సంకోచాలు వుండవు.
నేను నండూరి తో ఎక్కువ సేపు గడిపింది 1998 లో ఆయనకు అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ తరఫున 'ప్రతిభా
మూర్తి' జీవిత పురస్కారాన్ని రాజమండ్రి సభలో అందచేసినప్పుడు మాత్రమే. ఆయనకు అవార్డు అందచేసిన ఆ
సభలో ఆయన పరిచయ, సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నాను. నండూరి , వారి సతీమణి తో అప్పుడు రాజమండ్రి లో గడిపిన ఆ నాలుగు రోజులతో వ్యక్తిగతంగా వారు మరింత ఆత్మీయులయ్యారు.
నేనూ-నండూరి 'టాం సాయర్'
ఇదంతా వ్యక్తిగత పరిచయం. కానీ ఓ రచయితగా నండూరి మొదట తెలిసినది మాత్రం ' టామ్ సాయర్ ' తోనే.టాంసాయర్, హకిల్బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, టాంసాయర్ ప్రపంచయాత్ర,కాంచనద్వీపం లాంటి పుస్తకాలు
ఎంతో ఇష్టం గా చదువుకున్న చిన్న నాటి జ్నాపకాలు ఎంత పెద్ద అయినా మనల్ని వదలవు. అన్నింటికంటే
నాకు బాగా నచ్చినది ' టాం సాయర్'. నిజంగా ఆ పుస్తకం అప్పట్లో తెలుగు అనువాదం చదివి వుండకపోతే అసలు
మార్క్ ట్వేయిన్ లాంటి రచయిత తెలుగు పిల్లలకు పరిచయమయ్యే అవకాశమే లేదు. అది కదా అనువాదం లోని
గొప్పతనం. టాం సాయర్, హాకిల్ బేరీ ఫిన్ లాంటి రచనలతో పెరగని బాల్యం ఒక బాల్యమే కాదు అని చెప్పవచ్చు.
టాం సాయర్ చదివి ఆహా, వొహో అని మురిసిపోవటం ఒక ఎత్తు. నా కిష్టమైన ఆ రచనను మనకిష్టమైన రేడియో
నాటకం గా వినటం మరో ఎత్తు. ఆ నాటకం లో ఒక పాత్ర పోషించే మంచి అవకాశాన్ని నాకు అందచేసి నన్ను
మొదటి సారి రేడియో స్టేషన్ లో అడుగుపెట్టేలా చేసింది మా ఏల్చూరి మురళి. అప్పటి దాకా రేడియో లో ఆయన
గొంతు విని విపరీతంగా అభిమానం పెంచేసుకున్న ' రామం' అన్నయ్య ని కలుసుకొని ఆయన ఆధ్వర్యం లో
సంభాషణ లు ఎలా పలకాలో నేర్చుకున్న ఆ తీపి జ్నాపకం తల్చుకున్న ప్రతి సారీ నన్నోక పసిపిల్ల గా
మార్చేస్తుంది. ఆ నాటకం సందర్భంగా ' రామం' ని, ప్రయాగ రామకృష్ణ ని కలుసుకోవటం , ఆ తర్వాత అదే రేడియో
స్టేషన్ లో వారితో కలిసి పని చేయటం నేను కల లో కూడా వూహించని విషయాలు. వారం వారం రేడియో లో ' టాం
సాయర్' శ్రవ్య నాటిక ( మేము నటించినది) ప్రసారమవుతున్నప్పుడు చెవులొగ్గి విని , మళ్ళీ ఒక సారి ఎవరికి వాళ్లమే
' టాం సాయర్' అయిపోయినట్లు వూహాలోకం లో విహరించేవాళ్లం. ఆ నాటకం లో పాల్గొన్నందుకు నాకు పారితోషికం
కూడా అందచేశారు. నేనందుకున్న ఆ చెక్ నా తొలి సంపాదన. నండూరి వారి టాం సాయర్ తెలుగు
అనువాదానికి ఆ రేడియో నాటిక అనుసరణ. దానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంభాషణ లు రాశారు. ఇలా
నండూరి వారి ' టాం సాయర్' పసి తనం నుంచి నా జీవితం లో కొన్ని ప్రధాన ఘట్టాలకు నాందీవాచకమయింది.
( రామం అన్నయ్య గురించి, టాం సాయర్ శబ్ద నాటకం గురించి మరిన్ని విశేషాలు తృష్ణ రాసినది ఇక్కడ చదవండి)
' అమ్మో ఫిలాసఫీ' అనే భయాన్ని పోగొట్టిన ' విశ్వ దర్శనం'
పసి తనం లో ' టాం సాయర్' ' రాజు-పేద' పుస్తకాల రచయిత గా తెలిసిన నండూరి తర్వాతర్వాత ఒక
సంపాదకీయుడిగా అర్థమయ్యారు. ఆయన సాహిత్య సంపాదకీయాల ద్వారా ప్రముఖ సాహితీవేత్తలెందరి గురించో
తెలుసుకునే వీలు కలిగింది. అన్నింటికంటే నాకు బాగా నచ్చినది ఆయన ' విశ్వ దర్శనం'. 'అమ్మో ఫిలాసఫీ నా '
అన్న భయాన్ని, అది మనకు కోరుకుడు పడని, అవసరం లేని సబ్జెక్టు అన్న అనవసర దురభిప్రాయాన్ని రెండింటిని
ఏక కాలం లో పోగొట్టగలిగిన రచన అది. ' విశ్వ దర్శనం' అప్పట్లో 1980-87 మధ్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో
ధారావాహికగా వచ్చేది. అమ్మబాబోయి ఫిలాసఫీనా అనుకునేవారిని ఆహా ఫిలాసఫీ అనిపించేలా మారుస్తుంది ఈ
పుస్తకం . పేరు చూసి విజ్నాన శాస్త్రమేమో ( సైన్సు) అనుకున్నాను. ఇది తత్త్వ విజ్నానమని చదువుతుంటే
అర్థమయింది. చాలా క్లిష్టమైన విషయాన్ని కూడా సరళంగా, సూటిగా ,అర్థమయ్యేలా రాయగలగటం నండూరి
ప్రత్యేకత. తత్త్వ శాస్త్రం లో ఆసక్తి వున్న వారు చదవగలరు కానీ ఆ విషయ పరిజ్నానం , ఆసక్తి లేని వారిని కూడా
చదివింపచేసి దాని పట్ల అభిరుచి, అనురక్తిని పెంచగలిగే రచన ఇది. అందుకు నండూరి ఎంచుకున్న రచనావిధానం
కారణమన్నది నిర్వివాదాంశం. విశ్వదర్శనం ( మొదటిభాగం) పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత దర్శనం. రెండో భాగం
భారతీయ తత్త్వ చింతనా రచన. అసలే ఫిలాసఫీ, పైగా పాశ్చాత్య తత్త్వశాస్త్రం అనగానే భయమో, బోరుగా
ఉంటుందేమో అన్న చిన్న అనుమానం మొదట కలగటం సహజం. ఆ విషయం ఆ రచన ప్రారంభించటానికి ముందే
నండూరి కి తెలుసు. అందుకే ఆయన భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. పాశ్చాత్య తత్త్వ శాస్త్ర పరిచయాన్ని
కేవలం సిద్ధాంతం ద్వారా చెప్పకుండా దార్శనికుల ద్వారా చెప్పారు. కేవలం దార్శనికుల సిద్ధాంతాల పరిచయానికే
కట్టుబడకుండా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓ కథ లాగా మధ్యలో కలగలిపి చెప్పారు. అలా చెప్పటం వల్ల
విషయం సులభంగా అర్థమవటమే కాకుండా చాలా సాఫీ గా సాగిపోయింది. పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత పరిచయ
ఉపోద్ఘాతం ఆయన రాముడు ,వశిష్టుడు వారి దగ్గరకు వెళ్ళి యోగవాశిస్ఠమ్ చెప్పించుకునే పరిచయం తో
ప్రారంభించారు. అలా అవాకాశం దొరికినప్పుడల్లా మనకు తెలిసిన భారతీయ తత్త్వ సిద్ధాంత ఉదాహరణలతో
చెప్పటం వల్ల పాఠకుడి కి అదేదో అసలు తమకు సంబంధం లేని విషయం అని ఏ మాత్రం అనిపించదు. పైగా నండూరి
ది ఒక ప్రత్యేకమైన సున్నితమైన హాస్యం. అది మనకు ఆయన రచనలన్నింటిలోనూ కనిపిస్తూఉంటుంది. దాని వల్ల
కూడా అంత సీరియస్ విషయాన్ని కూడా పాఠకుడు చాలా హాయిగా చదివి అర్థం చేసుకోగలుగుతాడు. సోక్రటీస్ '
సింపోజియం ' గురించి రాసినప్పుడు అగాథాన్ అందరికీ మద్యం అందిస్తున్నాడు అని మామూలుగా రాయకుండా '
మధ్య మధ్యే పానీయం సమర్పయామి' అన్నట్లు అందరికీ మద్యం పోశాడు అని రాశారు. పూజా తంతు లోని ఒక
చర్య ను నండూరి ఆ సందర్భం లో వాడినప్పుడు పాఠకుడికి ఆ సీన్ కళ్ల ముందు కదిలి పెదవులపై ఒక హాస్య రేఖ
మెరిసే వీలుంది.
అలాగే సోక్రటీసు, ప్లేటో ల మధ్య గురు శిష్య సంబంధాన్ని చెప్పేందుకు ఆయన వాడిన పోలిక వారిద్దరూ రామకృష్ణ
పరమహంస, వివేకానందుడు లాంటి వారు అని. ఆ ఉదాహరణ ఒక్కటి చాలు సోక్రటీస్, ప్లేటో ల సంబంధాన్ని సరిగ్గా
అర్థం చేసుకునేందుకు. ఇలా నండూరి ఆ వ్యాసాలు కదళీపాకం లా వుండేందుకు కావల్సిన అన్నీ
జాగ్రత్తలు ఇంత శ్రద్ధగా తీసుకోవటం వల్లనే ' విశ్వ దర్శనం' మామూలు పాఠకుడి హృదయం లోకి చేరి అక్కడ అలా
నిలిచిపోయింది . తత్త్వ శాస్త్రం లో విషయం కన్నా ముందు ఆ పరిభాష అర్థమవటానికి కొంచెం కష్టపడాలి.
ఆ విషయాన్ని ముందే అర్థం చేసుకున్న నండూరి ప్రతి తెలుగు అనువాదానికి ఇంగ్లీష్ పదాన్ని కూడా బ్రాకెట్ లలో
ఇచ్చి, పుస్తకం గా వేసినప్పుడు మొత్తం పారిభాషిక పదాల లిస్ట్, ఆసక్తి మరింత వుంటే లోతైన విశ్లేషణ కోసం
చదవాల్సిన పుస్తకాల జాబితా కూడా అందచేశారు. ఈ రకంగా ఒక పాఠకుడు ఒక రచన ను చదివి అర్థం
చేసుకోవాలంటే ముందు రచయిత ఏమేం చేయాలో అవన్నీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతో నండూరి చేసి
పెట్టడం వల్ల ' విశ్వ దర్శనం' నేరుగా పాఠకుడి కి చేరవలసిన పద్ధతి లో సులువు గా చేరింది. అప్పట్లో ఆ ధారావాహిక
కు, తర్వాత పుస్తకం గా వేసినప్పుడు కూడా మంచి పేరు లభించింది. మొత్తంగా ఆ సీరియల్ పూర్తయ్యేటప్పటికి (
ఏడేళ్ళ సుదీర్ఘ కాలమనుకోండి) నాలాంటి కొందరికీ తప్పనిసరిగా ఫిలాసఫీ అన్న బెరుకు పోయి ఉంటుంది. ఆయన
ఆ రచన రాసిందే అందుకు. ఆ విషయం లో ఆయన కృతకృత్యులయ్యారు. ఒక రచయిత గా తాను
రాయవలసినవన్నీ రాసేసి ,తరతరాల తెలుగు వారికోసం 'విశ్వదర్శనా'న్ని అందించిన 'నరావతారం' నండూరి
శాశ్వత నిద్ర లోకి జారుకున్నారు. ఇప్పుడు మేల్కొనాల్సింది ఆయన రచనలు చదవకుండా నిద్రాణమైనవారు.
కల్పనారెంటాల
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
9 hours ago
6 వ్యాఖ్యలు:
ఆలస్యంగా తెలిసింది. నండూరి వారు ఇక లేరని. దిగులు/విచారం అనే భావం గుండె అనుభవించటం తెలిసింది.
మీరు ఈ ఆర్టికల్ లో విశ్వదర్శనం గురించి చాలా భాగం రాయటం, సముచితం అనిపించింది. ఆ పుస్తకం నా మీద ఓ బైబిల్ లాగా పనిచేసి, అక్కణ్ణుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్లిన పుస్తకం అది.
ఓ మహానుభావుడు భూమ్మీదనుంచి నిష్క్రమించడం, విచారకరం. ఆయన మనందరికీ తెరచిన కొత్త ద్వారాలు, తద్వారా విశాలమయిన మన మేథలో ఆయన సజీవంగానే ఉంటారెప్పటికీ.
అంతటి మహానుభావుణ్ణి మన తెలుగునాడు లో పుట్టించినందుకు, దేవుడికి కృతజ్ణతలతో..
చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు! ఫిలాసఫీ అంటే అదేదో బ్రహ్మ పదార్థమనుకుని దూరంగా ఉంచిన వాళ్లందరినీ విశ్వ దర్శనంతో ఒక చోట చేర్చి చప్పట్లు కొట్టించారు నడూరి!
మొదటి సారి రేడియో స్టేషన్ లో అడుగుపెట్టేలా చేసింది మా ఏల్చూరి మురళి_________మా ఏల్చూరి మురళి..:-))
మధ్య మధ్యే పానీయం______నిజం! ఇలాంటి సున్నితమైన హాస్యం ఆయన పుస్తకాల్లో రుచి చూడ్డం చాలా బాగుంటుంది. తత్వ శాస్త్రం పరిచయం చేయడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి గురించి మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను!
చివరి పేరా అక్షర సత్యం!
నండూరి గారితో మీ జ్ఞ్యాపకాలు బాగున్నాయి. విశ్వ దర్శనం గురించి బాగా చెప్పారు. చదవాలని తెచ్చి పెట్ట , ఇకనైనా చదవాలి.
చాలా బాగుంది వ్యాసం. అభినందనలు. మిగతావి కూడా నెమ్మదిగా చదవాలి, :))
బాగా రాశారండీ.
నండూరి గారి రచనలంటే నాకు చాలా, చాలా ఇష్టం. పోయిన జనవరిలో (2011) ఆయన్ని నేను కలవగలిగే అవకాశం చిక్కేనాటికే వారి ఆరోగ్యం, ముఖ్యంగా జ్ఞాపకశక్తి, బాగా దెబ్బతిన్నాయి. కనుక, ఎక్కువగా మాట్లాడలేకపోయారు. కానీ, విశ్వదర్శనం పుస్తకం ఆరోజు ఇంకో షాపులో కొని ఉండటంతో...ఆటోగ్రాఫ్ అడిగాను. వెంటనే చేసిచ్చారు. ఇవ్వాళ ఈ వ్యాసం చదువుతూ ఉంటే, ఆరోజు ఆయన్ని కలవడం గుర్తొచ్చింది..
Nice to read the article. Very interesting and informative.Thank you .
Post a Comment