నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, October 31, 2021

స్నేహ శీలి సుజాత కి ప్రేమతో..

 

జీవితం నాకిచ్చిన కొందరు మంచి స్నేహితుల్లో సి.సుజాత ఒకరు. 

ఎప్పటి స్నేహం మా ఇద్దరిదీ
? విజయవాడ లో 90 ల నాటి మాట. ఆంధ్రభూమి లో ఉద్యోగం, రేడియో లో కాజువల్ న్యూస్ రీడర్, స్వాతి లో వ్యాసాలు, అనువాదాలు, అప్పటికే ఆంధ్రజ్యోతి వార పత్రిక లో కాలమిస్ట్ గా పేరు. నీలి మేఘాలు వచ్చిన కొత్తల్లో దూసుకొచ్చిన ఉత్సాహం. సుజాత అప్పుడు ఉదయం పత్రిక లో  పని చేసేది. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఇంకా రాలేదు. ఆటో నగర్ లో ఆంధ్రభూమి ఆఫీసు నుంచి బయటకు రాగానే అక్కడున్న టెలిఫోన్ ఆఫీసు ముందున్న బూత్ లో నిలబడి సుజాత ఆఫీసు కో, ఇంటికో ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. కథా చర్చల నుంచి సాహిత్య లోకం లో అప్పుడు నడుస్తున్న గాసిప్స్ దాకా. సుజాత జోకులకు ఇటు పక్క నా నవ్వులు చూసి ఆ వైపు నడిచి వెళ్ళే వాళ్ళు నేను ఎవరితో ఫోన్ లో ఉన్నానో అన్నట్లు చూసే అనుమానపు చూపుల్ని మరింత బాగా ఎంజాయ్ చేసిన సందర్భం అది అప్పట్లో. 

ఉదయం ఆదివారం సండే లో వచ్చే కథల గురించి బోలెడు చర్చలు. సుజాత రాసిన నీడ , రెప్ప చాటు ఉప్పెన, సుప్తభుజంగాలు నవల, మహీధర రామ్మోహన్ గారి రథచక్రాల గురించి సీరియస్ గానే సాహిత్య చర్చలు నడిచేవి ఆ ఫోన్ కాల్స్ లో. అందులోనే కన్నీళ్ళు, నవ్వులు, బాధలు అన్నీ. రెప్ప చాటు ఉప్పెన చదివాక బద్దలు కానీ స్త్రీ హృదయం ఉంటుందా అనేదాన్ని సుజాత తో. ఎంతో నవ్వించే సుజాత, అలా ఏడిపించే కథలు రాయగలదు అని, అలాంటి కథకురాలు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరికి వారు అనుకునేంత స్నేహశీలి. గబగబా, లొడలొడ  మాట్లాడుతుందని కొందరు తిట్టుకుంటారు మనసులో సుజాత ని. ఆ విషయం కూడా మా ఇద్దరికీ తెలుసు. వాళ్ళకు స్నేహం విలువ తెలియదని కూడా మా ఇద్దరికీ తెలుసు.

కాలం లో సంవత్సరాలు దొర్లాయి. బాధలు తగ్గి సంతోషం ముందుకొచ్చింది. లేదా రివర్స్. సంతోషం తగ్గి బాధలు ఎక్కువయ్యాయి. ఫోన్ కాల్స్ ఈమైల్స్ అయ్యాయి. లేదా వాట్స్ఆప్ మెసేజ్ లు  గానో, ఫేస్ బుక్ పోస్ట్ లు గానో మారిపోయాయి. 


సోషల్ మీడియా  విస్తృతమయ్యాక స్నేహాలు లైక్ లు గాను, ఫ్రెండ్స్ అన్ ఫ్రెండ్స్ అవటం లేదా బ్లాకు చేయబడటం  చాలా మామూలు అయిపోయింది. నేను బ్లాగు లోకం లోకి వచ్చాను. సుజాత కూడా బ్లాగు తెరిచింది. తన్హాయి తర్వాత నేను మళ్ళీ వేరే పనులతో బిజీ అయిపోయాను. మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. కానీ తన విషయాలు నాకు, నా విషయాలు తనకూ తెలుస్తూనే ఉండేవి. ఎంత దూరం లో ఉన్నా, మాట్లాడుకోకపోయినా, మా స్నేహం అలాగే నిలిచి ఉంది. 

మేము సారంగ వెబ్ మాగజైన్ మొదట ప్రారంభించినప్పుడు మళ్ళీ సుజాత నా స్మృతి పథం లో మెదిలింది. సుజాత రాసిన 24/7 నవల ను సీరియలైజ్ చేశాము. అదో గొప్ప వేడుక మళ్ళీ మా ఇద్దరి స్నేహానికి. 

ఇన్నింటి మధ్యా నా అయిదో గోడ వచ్చింది. ముందు మాట నో , వెనుక మాట నో రాయరాదా అని పుస్తకం వేసేటప్పుడు సుజాత ని అడిగాను. నేను రాయకపోయినా నీ స్నేహితురాలినే అని చెప్పగలిగిన నిగర్వి. మంచి కథకురాలు. స్నేహితురాలు సుజాత.సుప్త భుజంగాలు తర్వాత మరో మంచి నవల రాసినా కూడా ఆ మొదటి నవల తోనే తెలుగు సాహిత్యం లో నిలిచి పోగలిగిన రచయిత్రి. తన చుట్టూరా ఉన్న స్నేహితులను, కోలీగ్స్ ని అందరినీ  ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి, తనను తాను లిఫ్ట్ చేసుకోలేకపోయిన ఒక మంచి రచయిత్రి, నా స్నేహితురాలు సుజాత కు ఏమివ్వగలను కాసింత ప్రేమ, స్నేహం పంచి ఇవ్వటం తప్ప.

స్నేహితురాలికి రాసుకున్న ఈ  ప్రేమలేఖలో ఎడిట్స్ రిగ్రెట్స్ లేవు.

ప్రౌడ్ ఆఫ్ యు సుజాత !

కల్పనారెంటాల 

అక్టోబర్ 30, 2021


0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics