నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, November 25, 2021

పరాజిత లు ప్రపంచమంతా ఉన్నారు : గీతా వెల్లంకి

 అయిదో గోడ పుస్తకం లోని ఒక కథ గురించి గీతా వెల్లంకి గారు ఫేస్ బుక్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు . ధన్యవాదాలు గీత గారు. 



*కోట్ హేంగ‌ర్
కోట్ హేంగ‌ర్ క‌థ‌ని చ‌ద‌వ‌గానే నాకు తెలిసిన ఒక స్త్రీ క‌థ గుర్తొచ్చింది.
ముందుగా కోట్ హేంగ‌ర్ క‌థ‌లో ఇద్ద‌రు ఆడ‌వాళ్ళుంటారు. ప్రీతి అబార్ష‌న్ కి ప్ర‌య‌త్నించి అరెస్ట్ అవుతుంది - ఇంకా ఇమ్మిగ్రెంట్ కాబ‌ట్టి త‌న‌తో జైల్లో ఉన్న‌వాళ్ళు కూడా కోట్ హేంగ‌ర్ అని పిలుస్తూ హేళ‌న చేస్తుంటారు.
ఇలాగే ఒక స్త్రీ అబార్ష‌న్ కి ప్ర‌య‌త్నించి లోప‌లి పిండాన్ని పూర్తిగా బ‌య‌ట‌ప‌డేయ‌టానికి కోట్ హేంగ‌ర్ ని ఉప‌యోగించి అది లోప‌ల ఇరుక్కుపోతే అలాగే హాస్పిట‌ల్ కి వెళ్ళింద‌నీ, ఇలా ఇల్లీగ‌ల్ గా అబార్ష‌న్ చేసుకునేవారిని అలా పిలిచి గేలి చేస్తార‌నీ త‌న‌ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన అప‌ర్ణ‌తో చెప్పుకుని బాధ‌ప‌డుతుంది. అప‌ర్ణ కూడా త‌న తొలి అనుభ‌వం ద్వారా ప్రెగ్నెంట్ అయి బిడ్డ‌ని క‌న‌డం - ఆ బిడ్డ‌ని త‌ల్లి ఎవ‌రికో ఇచ్చేయ‌డం - త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత ఇక త‌న బిడ్డ ఎక్క‌డుందో తెలిసే ఆస్కారం లేద‌ని చెబుతుంది. ఇద్ద‌రూ బాధ‌ప‌డుతూ ఓదార్చుకుంటారు.
ఇక నాకు తెలిసిన క‌థేమిటంటే - ఒక‌మ్మాయికి పెళ్ళ‌వుతుంది - నీకు ఇప్పుడే పిల్ల‌లు కావాలా అని భ‌ర్త అడిగితే ఒద్దు అంటుంది - ఒక రెండేళ్ళు కొద్దిగా ఉద్యోగాల‌లో సెటిల్ అయాక క‌న‌చ్చ‌ని అనుకుంటారు. అయితే ఇద్ద‌రూ ఏ ర‌క‌మైన ప్లానింగ్ చేసుకోరు. చివ‌రి నిముషంలో ప‌క్క‌కి వెళ్ళిపోవ‌డ‌మే అత‌ను పాటించిన‌ది!
ఈలోగా ఎవ‌రెవ‌రో అప్పుల‌వాళ్ళు రావ‌డం మొద‌ల‌వుతుంది. ఆమె హ‌తాశురాల‌వుతుంది. ఆమె పేరు దేవి అనుకుందాం. దేవి పుట్టింట్లో అంద‌రూ ఓపెన్‌గా అన్నీ చ‌ర్చించుకునే వాతావ‌ర‌ణం. ఇక్క‌డ ఉన్న‌ది భ‌ర్తా - త‌నూ - అత‌డి త‌ల్లీనూ! వీళ్ళు త‌మ కుటుంబ ప‌రిస్థితి గురించి త‌న‌తో ఏమీ చెప్ప‌లేదు అని తెలిసి చాలా బాధ‌ప‌డి త‌న సోద‌రితో ఆ విష‌యం పంచుకుంటుంది. ఇది భ‌ర్త‌కీ, అత్త‌కీ తెలిసి నానా గొడ‌వా జ‌రుగుతుంది.
ఇలా ఉండ‌గా - ఉన్న‌ట్టుండి ఆమె గ‌ర్భ‌వ‌తి అవుతుంది. అది త‌న మీద క‌క్ష సాధింపు చ‌ర్యేమోన‌ని దేవికి అనుమానం వ‌స్తుంది. ఎవ‌రికీ తెలియ‌కుండా ర‌హ‌స్యంగా టెస్ట్ చేయించుకుని - త‌మ పాత ఇల్లు - స్నేహితురాలు ఉన్న‌చోట‌కి వెళ్ళి అబార్ష‌న్ చేయించుకుంటుంది. అలా 2 సార్లు జరిగిన త‌ర్వాత - కొంత కాలం భ‌ర్త‌ను వ‌దిలి వేరే చోట ఉంటుంది.
తిరిగి క‌లిసి ఉండ‌టం మొద‌లుపెట్ట‌గానే మ‌ళ్ళీ ప్రెగ్నెన్సీ వ‌స్తుంది. మ‌ళ్ళీ అదే ప‌ని!
ఈసారి స్నేహితురాలు కూడా ఉండ‌దు. ఒక్క‌త్తీ వెళ్ళి - ప‌ని ముగిశాకా మ‌త్తుతో తూలుతూవ‌చ్చి ఇంట్లో చ‌పాతీలు, కూరా చేస్తుంది. ఫైనాన్షియ‌ల్ గా సెటిల్ అయ్యాక‌నే పిల్ల‌లు అని గ‌ట్టిగా అనుకుంటుంది.
త‌ర్వాత కొన్ని రోజుల‌కి ఇద్ద‌రూ కొంత స్థిర‌త్వం ఉన్న ఉద్యోగాల‌లో ఉన్నార‌న్న న‌మ్మ‌కం క‌లిగాక‌, అప్పుడు ఇంకోసారి ప్రెగ్నెన్సీ వ‌చ్చిన‌పుడు దాని గురించి ఇంట్లో చెబుతుంది. అయితే 3వ నెల‌లో గ‌ర్భం పోతుంది.
మ‌రోసారి జాగ్ర‌త్త‌గా ఉంటారు కానీ, మొత్తం 9 నెల‌లు నిండాక పుట్టిన పాప 2వ రోజు చ‌నిపోతుంది.
1 ఇయ‌ర్ అయిందో లేదో మ‌ళ్ళీ ప్రెగ్నెన్సీ - ఈ సారి 7 వ నెల‌లో ఇమ్మెచ్యూర్ బేబీ డెలివ‌రీ - డెత్‌!
మ‌ళ్ళీ 4 నెల‌ల‌కే ఇంకోసారి - ఈ సారి 5 నెల‌లకే గ‌ర్భం పోతుంది.
గంగాదేవి గురించి పురాణాల్లో అష్ట‌వ‌సువుల‌లో చివ‌రివాడిని మాత్రం తండ్రికి ఇచ్చి వెళ్ళిపోయిన‌ట్లు చ‌దివిన క‌థ గుర్తొస్తుంది - ఈ దేవి క‌థ వింటే!
మొత్తం 7 అబార్ష‌న్లు లేదా మిస్ కేరేజెస్ త‌ర్వాత చివ్వ‌రిది స‌క్సెస్ అవుతుంది.
ఇదంతా ఎందుకు జ‌రిగింది - అంటే ఫేమిలీ ప్లానింగ్ గురించి మ‌గ‌వాడికి ఏమీ ప‌ట్ట‌దు! అంతా ఆడ‌వాళ్ళు చూసుకోవ‌ల‌సిందే! వారికి ఆ టైంలో దొరికే ఆనంద‌మే ముఖ్యం కానీ - ఇలా ఇన్ని గ‌ర్భాల వ‌ల్ల ఆడ‌వాళ్ళ ఆరోగ్యం ఎంత‌గా దిగ‌జారుతుందో ప‌ట్టించుకోరు.
ఆర్థికంగా వెసులుబాటు లేన‌పుడు పిల్ల‌ల్ని క‌న‌కూడ‌ద‌న‌డం త‌ప్పేమో! కానీ, నాకు తెలిసిన ఒకావిడ త‌మ అక్క‌ల పిల్ల‌ల‌ని ఎత్తుకుని మోయ‌డం, వాళ్ళ ఏడుపులు అన్నీ చూసి పిల్లలు ఉండకూడ‌ద‌ని బ‌లంగా కోరుకుంది!
పెళ్ళి అయినా, అవ‌క‌పోయినా పిల్ల‌ల‌ని క‌నాలా, ఒద్దా అని కోరుకునే హ‌క్కు ఆడా, మ‌గా ఇద్ద‌రికీ స‌మానంగానే ఉండాలి. ఇప్పుడు జ‌న‌రేష‌న్ బాగా తెలివిన ప‌డింది. వాళ్ళ‌కి ఎప్పుడు ఏం చేయాలో కొంత వ‌ర‌కు అవ‌గాహ‌న ఉంద‌నే అనుకుంటున్నాను.
అయితే - ఈ కోట్ హేంగ‌ర్ క‌థ‌లోలాగా గ‌ర్భ విచ్ఛిత్తికి టేబ్లెట్స్ వేసుకున్నాకా ఆ ఫీట‌స్ బ‌య‌ట‌ప‌డ‌క‌పోతే దానిని కోట్ హేంగ‌ర్ తో తియ్య‌డం లాంటి ప‌నుల వ‌ల్ల - ఆ ప‌ని సంగ‌తి ఎలా ఉన్నా - లోప‌ల ఉండే నాజూకైన కండ‌రాలు దెబ్బ‌తిని ర‌క‌ర‌కాల కాంప్లికేష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.
అయినా - ఇక్క‌డ ఇండియాలో ఉంటూ మ‌నం అమెరికా ఏదో పెద్ద నాగ‌రీక దేశ‌మ‌నే అపోహ‌లో ఉంటాం! కానీ - మార్క్‌ట్వేన్ న‌వ‌ల‌ల అనువాదాల‌లో నండూరి రామ‌మోహ‌న‌రావుగారు ఎప్పుడో రాశారు - అమెరికాలో ఉండే మూఢ‌న‌మ్మ‌కాల గురించి!
ముఖ్యంగా - స్త్రీలు ఎక్క‌డ ఉన్నా వాళ్ళు ఎపుడూ ఇంకొక‌రి ఆధీనంలోనే ఉండితీరాలి అనే ప‌రిస్థితులు ప్ర‌పంచ‌మంత‌టా ఉన్నాయ‌న్న‌మాట‌!
ఈ క‌థ‌లో ఇద్ద‌రూ ఇండియ‌న్ లేడీస్ కాబ‌ట్టి - ఇలా ఉంద‌నుకోవ‌ద్దు! ప‌రాజిత‌లు ఏ దేశంలోనైనా ఉంటారు!
ఈ పుస్త‌కంలో ప్ర‌తి క‌థా ఆలోచింప‌చేసేదిగా ఉన్నా - ఎవేవో సంఘ‌ట‌న‌ల‌ను, ఎవ‌రెవ‌రినో జ్ఞాప‌కం చేసింది ఈ కోట్ హేంగ‌ర్‌!
Geeta Vellanki | Facebook ( published on Novembar 4, 2021 on Facebook) 

0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics