నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, January 09, 2022

అయిదో గోడ...అన్నీ మన కథలే : పద్మ మీనాక్షీ

 అయిదో గోడ...అన్నీ మన కథలే. ఇవి మా కథలు కాదు అంటూ పక్కకు తప్పుకునేందుకు లేదు. ఇవి అమెరికా కథలు మాత్రమే కాదు. ప్రతీ దేశంలో ఉండే మహిళల కథలే. ఎమోషన్స్ కి జెండర్ ఉందా?


కల్పన అయిదో గోడగా దేనిని ప్రస్తావించారో నేను చెప్పను. ఎందుకంటే ఆ గోడను చేధించాలంటే పుస్తకం చదవాలి.
మహిళలు అయిదో గోడ బద్దలు కొట్టలేకపోవడం కాదు. నాలుగో గోడను కూడా బద్దలు కొట్టలేకపోతున్నారు.

కథల విషయానికి వస్తే ప్రతీ కథా విభిన్నంగా ఉంది. కొన్ని పాత్రలు గోడలను బద్దలుకొట్టినట్లు చూపించారు. కొన్ని బద్దలుకొట్టలేక నలిగిపోయిన కధలను వినిపించారు.

నేను నా వృత్తిలో భాగంగా రకరకాల కథలు వింటూ ఉంటాను. ఏ కథ విన్నా..కామన్ గా వినిపించే పదం..సమాజం ఏమంటుందో? ఇంట్లో వాళ్ళు ఏమంటారో? పరువు తీశానంటారేమో? మనం బద్దలుగొట్టాల్సింది...ఐదో గోడ కంటే ముందు ఈ ప్రశ్నను... సమాజం ఎప్పుడూ వేళ్ళు చూపిస్తుంది. కానీ, అవి నా కళ్ళకు కనిపించటం లేదని అనుకుంటూ పక్కకు తొలగిన నాడు అక్కడ మరొక విశాలమైన తనదైన ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటుంది. వేలెత్తి చూపిన వెళ్లే చేతులు జోడించి నమస్కరిస్తాయి. అయితే, సమాజాన్ని మారమని మనం చెప్పలేం కాబట్టి, మనమే మారి చూపించాలని నేనంటాను.

అది జరగాలంటే ఇలాంటి ఆలోచింప చేసే కథలు రావాలి.

స్త్రీ భుజాల మీద సంస్కృతి పరిరక్షణను మోపినంతవరకూ మనం ఆ బరువును దించుకునేందుకు ఒప్పుకోము. మనకీ ఇష్టమే ఆ బరువు మోయడం.

అబ్బాయి రెండో పెళ్లి చేసుకోవాలంటే అవసరం అంటారు. ఒక్కడే ఎలా బ్రతకగలడు అంటారు.
అదే ప్రతిపాదన అమ్మాయి చేస్తే కామం కోసమే అంటారు. ఇలాంటి ఉదాహరణలు, బ్యాక్ ల్యాష్ సెలెబ్రిటీ విషయంలో చూసాం. రేణు దేశాయ్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు, సునీత రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు విపరీతమైన విమర్శలు. ఆమెను ప్రశ్నించి తీర్పులిచ్చే హక్కు మనకెక్కడుందని అనుకుంటామా?

లేదు. ఈ గోడను ఇప్పటికే చాలా మంది చేధించారు.

మధ్య తరగతిలో అట్టడుగు వర్గాల వారు చేసినంత సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఇది నా జీవితం. ఇలా గడుపుతాను అని మహిళా చెప్పలేకపోతోంది. కల్పన కథ ఆ గోడను బద్దలుగొట్టి కొంతమందికైనా ప్రేరణ కలిగిస్తుందని అనుకుంటున్నాను.
కథలో శారద కూతురు ఆమోదిస్తుంది. నిజ జీవితంలో ఆమోదిస్తుందా? మొన్ననే ఒక కథ విన్నాను.

నెలల పిల్ల గా ఉన్నప్పుడే, తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. టీనేజ్ వచ్చాక తల్లి గురించి తెలుసుకుని ఇంటికి వెళితే, నేనొక వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో నా జీవితంలోకి ఎందుకొచ్చావని ప్రశ్నించింది ఆ తల్లి. ఇది కథ కాదు. ఆ ఇంట్లో గెస్ట్ గా ఉండలేక ఆ అమ్మాయి తిరుగు ప్రయాణమయింది.
ఒక ఉదాహరణ మాత్రమే. మన చుట్టూ జరుగుతున్న కథలని అందుకే అన్నాను.

చాలా మంది పిల్లలు, సమాజం కూడా పిల్లల్ని చూసుకుని హాయిగా ఉండక మరొక తోడు అవసరమా? అని తేలికగా అంటారు. ఆ మరొక తోడు మిగిలిన వారికి ఏ విధంగా ఇబ్బందో ఎవరూ వివరించలేరు.

రేప్ కిట్ కథ నేటి సమాజపు పరిస్థితిని కళ్ళకు కట్టింది. నేను చాలా మంది విక్టింస్ తో మాట్లాడుతున్నప్పుడు చెబుతారు. చాలా లైంగిక హింసకు గురైన విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఎలా వివరించాలి. ఇలా జరిగిందని తెలిస్తే, కుటుంబం పరువు ఏమవుతుందని?
ఈ కుటుంబ పరువు అనే గోడను బద్దలు గొడితే, మరిన్ని కథలు బయటకు వస్తాయి.

ఇక వ్యవస్థలో ఉన్న ఇంసెన్సిటివిటీస్. ఈ కథలో పరువు, తండ్రి రెసిస్టన్స్, కనిపిస్తాయి. రేప్ చేసిన వ్యక్తి పేరున్న వాడు కావడంతో, కేసు వాపసు తీసుకోమని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ, మామూలు వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్ కి వెళితే, ఎదురయ్యేది , ఎందుకమ్మా కేసు, వెనక్కి తీసుకో.. మీరూ మీరూ సెట్టిల్ చేసుకోండి అని. ఇంట్లో న్యాయం దొరకదు. నేరస్థుడ్ని క్షమించమంటారు.
ఎలాగూ న్యాయం దొరకదు, మాటలు కూడా పడాలని అమ్మాయిలు ఫిర్యాదు చేసే ఆ ఐదో గోడ బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్ళరు.

కొంత మంది సెక్సువల్ హరాస్మెంట్ విక్టింస్ అడుగుతూ ఉంటారు. మేడం... ఇవన్నీ పోలీసులకు ఎలా చెప్పమంటారు మేడం అని. వ్యవస్థ ఎక్కడ మారాలి అని ఆలోచిస్తూ ఉండిపోతాను.

ఎండమావుల కథ నన్ను చాలా బాధపెట్టింది. తన జీవితం గురించి తాను డెసిషన్ తీసుకోగలదు. సరదాగా ఉండగలదు. కానీ, ఆ అమ్మాయి అన్నీ బాయ్ ఫ్రెండ్ ఆర్ సహచరుడు కోసం చేసింది. అందుకే కాదంటే కుంగిపోయింది. అంత స్వతంత్రంగా ఉన్న అమ్మాయి తన స్వతంత్రాన్ని జీవితాన్ని కాపాడలేకపోవడం ఇంకా అమ్మాయిల్లో భర్తకు నచ్చినట్లు ఉండాలనే ఐదవ గోడను దాటలేకపోతున్నారని అనిపించింది. సహచరుడు అయినా, భర్త అయినా తనకు నచ్చిన విధంగా తానుంటే జీవితం హాయిగా ఉంటుందని అమ్మాయిలు గ్రహించిన నాడు, ఐదవ గోడ దానంతట అదే బద్దలైపోతుంది.

ఎప్పుడో చూడాల్సిందే.

కల్పన కథల్లో ప్రీచింగ్ లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఎక్కడా చెప్పలేదు. కేవలం మహిళ మనోభావాలను చెప్పి, ఏది సమంజసమో తేల్చుకోమని పాఠకుల పై వదిలేశారు. ఆ పాయింట్ నాకు నచ్చింది. తమిళ, మళయాళ సినిమాల్లో ముగింపు సస్పెన్స్ తో ఉంటుంది.
కల్పన కథల్లో ముగింపు అందంగా ఉంది. ఆలోచన రేకెత్తిస్తోంది.

సాజరాక్ ప్రేమ వైఫల్యానికి కుంగిపోనవల్సిన అవసరం లేదని చెప్పింది. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తెలుసుకోవలసిన అర్ధం చేసుకోవలసిన లోతైన అర్ధం ఉంది ఈ కథలో.

అంతెందుకు, ఒక విడాకులు తీసుకున్న మహిళో, భర్త మరణించిన మహిళో, తయారై, బయటకు వెళితే, ఎవరో ఉన్నారు, డేట్ కి వెళుతోందనే అంటారు. ప్రేమలో ఫెయిల్ అయితే కుంగిపోనవసరం లేదని ఈ కథలో పాత్రతో కల్పన బాగా చెప్పారు.

ఎల్ జీ బీ టీ సంబంధాల పట్ల ఇంకా మన సమాజంలో ఆమోదం రాలేదు. ఇంకా వారిని వివక్షతోనే చూస్తారు. ఇవాళే ఒక కథ విన్నాను. అస్సాంలో ఒక పల్లెటూరిలో ఒక అమ్మాయి భర్తకు పెళ్లి తర్వాత హోమో సెక్సువల్ అని తెలిసి తన లైంగిక హక్కుల కోసం పోరాడుతోంది. కానీ, ఆ అబ్బాయి, కుటుంబం మాత్రం పరువు కోసం ఆమెను ఇంటిలోనే కోడలిగా ఉండమంటున్నారు.

Its not okay, ఇక గౌరవం లేని బంధాల కొనసాగింపు. సాధారణంగా భర్త తిడతాడు, అత్తగారు సాధిస్తారు. అంటే, ఎదురు తిరగమని చెప్పరు, భరించు భర్తే కదా అంటారు. అసలీ భర్తే కదా , భరించు అనే గోడను ముందు బద్దలుగొట్టాలి. అందుకు తర్వాత తరానికి మనం కనీసం అడ్జస్ట్ అయి బ్రతకండి అని చెప్పకుండా ఉంటె చాలు. మిగిలినది వాళ్ళు చూసుకుంటారు.

లింగ సమానత్వమే ఎప్పటికి సాధిస్తామో తెలియనప్పుడు, సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ ను ఆమోదించడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో?.

సెక్సువాలిటీకి పరువుకు సంబంధం లేదని ఎప్పటికి మనమంతా అర్ధం చేసుకుంటామో. వేచి చూడాలి.

కల్పన మీ నుంచి మరెన్నో స్త్రీల కథల కోసం ఎదురు చూస్తూ....

( డిసెంబర్ 19 వ తేదీ డిల్లీ ఆంధ్రా అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో జరిగిన చర్చా కార్యక్రమం లో బీబీసీ లో పని చేసే పద్మ మీనాక్షీ గారు చేసిన ప్రసంగ పాఠం ఫేస్ బుక్ లో ఆమె వాల్ మీద పెట్టారు. 
 పద్మ మీనాక్షీ గారి సమీక్ష జనవరి భూమిక సంచిక లో ప్రచురితం.) 

0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics