నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, June 02, 2013

రాజేశ్వరిలా వెళ్లలేకపోయిన కల్హార జీవితం 'తన్హాయి'"నా మనసులో నీకోసం ఒక చిన్న ప్లేస్, నా కోసం నీ మనసులో ఒక చిన్న ప్లేస్ దాచుకోవడం వల్ల ఈ పెళ్ళిళ్ళకు పెద్ద భూకంపాలు రావు'' అంటున్నాడు కౌశిక్.
"ఒకే ఒక్క రోజు మేమిద్దరం మా కోసం గడపాలని ఉంది. ఆ రోజు గడిచాక మేమిద్దరం ఒకే అనుభూతిగా మారిపోయిన తర్వాత ఆ స్మృతుల స్మరణతోనే నా జీవితమంతా గడిపేయాలని ఉంది'' పలవరిస్తోంది కల్హార.
అతి చిన్న ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణలోకి నడిచిన ఇద్దరు వివాహిత ప్రేమికుల కథ 'తన్హాయి'.


ం తొలి బ్లాగ్ సీరియల్‌గా 'తన్హాయి' నవలని పోస్ట్ చేస్తున్నపుడూ, ఆ తర్వాత మీ అనుభవాలు?
- 'తన్హాయీ' నవలను ఎప్పటికప్పుడు రాసి పోస్టు చేయడం ఒక కొత్త అనుభవమే కాకుండా ఒక మంచి అనుభవం కూడా. సీరియల్‌గా ఎప్పటిక ప్పుడు ఏ వారానికి ఆ వారం రాయడంలో కష్టసుఖాలు, మంచి చెడ్డలూ రెండూ ఉన్నాయి. తన్హాయి నవల మొదలుపెట్టే నాటికి బ్లాగుల్లో సీరియస్ సాహిత్య చర్చలు ఏవీ జరిగేవి కావు. కాబట్టి నవల బ్లాగులో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక రకమైన సంశయంతోనే ప్రారంభించాను. మొదటి నాలుగైదు వారాలు ఒకటో, అరో కామెంట్లు వచ్చేవి కానీ రీడర్స్ బాగానే చదువుతున్నట్లు హిట్స్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పాఠకుల సంఖ్య, కామెంట్లు, చర్చలు అన్నీ పెరిగాయి. నవల పూర్తి కాకుండానే దాని మీద అంచనాలు పెరిగిపోయాయి. తీవ్ర అభిమానులు, తీవ్ర వ్యతిరేకులు ఇద్దరూ ఏర్పడిపోయారు. ప్రతి వారం పోస్ట్ చేయగానే నేను రాసినది పాఠకులకు నచ్చినదో, లేదో తెలుసుకోవటానికి కామెంట్లు ఉపయోగపడినప్పటికీ, వాటి ప్రభావం నేను రాయబోయే ఇతర భాగాల మీద పడకుండా నేనురాయాలనుకున్నది రాయటానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా నా సాహిత్య కృషి అంతా ఒక ఎత్తు. తన్హాయి ఒక్కటే ఒక ఎత్తు అయింది. తన్హాయి అనేకానేక కొత్త రీడర్స్‌ని నాకు సంపాదించి పెట్టింది.

ం స్థల కాల నియంత్రణలూ మార్కెట్ ఒత్తిడులూ లేకుండా పూర్తిగా రచయితల స్వేచ్ఛపై నడిచే 'వ్యక్తిపత్రిక' లాంటిది బ్లాగ్. ఈ మాధ్యమంలో రాయడం వల్ల తన్హాయి నవల వస్తుశిల్పాలు ఏ మేరకు ప్రభావిత మయ్యాయి?
- వస్తువు విషయంలో ఎలాంటి ప్రభావం చూపించిందని నేననుకోవటం లేదు. అయితే శిల్పపరంగా కొంత ప్రభావం చూపించిం దనే అనుకుంటున్నాను. ఒక బ్లాగు పోస్టుగా ఆ వారం చదువు కోవటానికి వీలుగా రాసినప్పుడు శైలిలో కొంత పల్చదనం కానీ, లేదా మొత్తం నవలగా చూసినప్పుడు ఒకచోట ఎక్కడో ఏదో లింక్ పోయినట్లుగానో, లేదా విషయం కొంత సాగదీసినట్లుగానో అనిపించ టానికి ఆస్కారం కలిపించింది. ఉదాహరణకు నవలలో ఉత్తరం అనేది ఎలా కనుమరుగవుతోంది అన్న దాని గురించి రాసిన ఒక ఎపిసోడ్ ఉంది. అది బ్లాగులో వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ నవల మొత్తంగా చదివేటప్పుడు ఆ ఉత్తరాల గురించి కొంచెం ఎక్కువ రాసినట్లు నాకే అనిపించింది. అలాంటివి నవలలో రెండు, మూడు చోట్ల జరిగాయి.
మార్కెట్ ఒత్తిడులు లేకపోవచ్చేమో కానీ పాఠకుల కామెంట్ల ఒత్తిడి బ్లాగు రచనల మీద ఉంటుంది. ఏ రచయిత అయినా ఆ కామెంట్ల మాయాజాలంలో పడిపోయే ప్రమాదం ఉంది.
ం తన్హాయి నవలని అర్థం చేసుకోవడంలో వ్యాఖ్యానించడంలో అంత ర్జాల పాఠకులకి, ప్రింట్ పాఠకులకి మధ్య వైరుధ్యం ఏమైనా ఉన్నదా?
- చాలా తేడా ఉంది. అంతర్జాల పాఠకులు వేరు, ప్రింట్ పాఠకులు వేరు. అంతర్జాల పాఠకులు కొంత మెట్రో కల్చర్ తెలిసిన వారు. వాళ్లు నవలను అర్థం చేసుకున్న విధానానికి, ప్రింట్ పాఠకులు అర్థం చేసుకునే విధానానికి కొంత తేడా ఉంటుంది. అయితే నవల ఇద్దరినీ మెప్పించింది. ఆన్‌లైన్‌లోనూ, ప్రింట్‌లోనూ నవల సక్సెస్ అవటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే ఇప్పుడు తెలుగు సాహి త్యాన్ని ఎవరూ చదవటం లేదు, రీడర్స్ తగ్గిపోయారు అన్న వాదన, అలాగే నవలలు చదివే ఓపిక, తీరిక ఎవరికీ లేదు అన్న వాదన, అలాగే కొత్త తరం ముఖ్యంగా యువత తెలుగు పుస్తకాలు చదవటం లేదన్న వాదన.. ఈ మూడు కూడా తప్పని తన్హాయి నవలకు లభించిన స్పందనని బట్టి నాకర్థమయింది.
ఇక స్పందన విషయానికి వస్తే, నవల గురించి అంతర్జాల పాఠకులు ఏమనుకున్నారో తెలిసినట్లు ప్రింట్ పాఠకుల స్పందన నాకు పూర్తిగా తెలియలేదు. ఆన్‌లైన్ పాఠకులు ఏ వారానికి ఆ వారం నవల చదవటంలో ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి కనపర్చారు. మొత్తంగా ఒక పాత్రను అర్థం చేసుకునే వీలు కేవలం ఒక ఎపిసోడ్ చదవటంతో సాధ్యం కాదు. అయినప్పటికీ వాళ్లు ప్రతివారం ఆ ఎపిసోడ్ చదవి, దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని చర్చ చేసి మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూసేవారు. ప్రింట్ పాఠకుల విషయానికి వస్తే అలా కాదు. వాళ్లు మొత్తం పుస్తకం ఒకేసారి చదివారు, వారి స్పందన తెలిపే అవకాశం పరిమితమయింది. కేవలం ఈ మెయిల్స్, ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే చాలామంది స్పందనను తెలియచేసారు.
ం తన్హాయి నవల సాంప్రదాయక తత్వం ఉన్న పాఠకులకి రాడికల్‌గానూ, స్త్రీ పురుష సంబంధాలను రాడికల్ దృష్టి కోణంతో చూడగలిగిన పాఠకులకు సాంప్రదాయకంగానూ కనపడింది. ఈ ద్వంద్వాన్ని మీరెలా వ్యాఖ్యానిస్తారు?
- ద్వంద్వం అనటం కన్నా, ఒకొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకొని వ్యాఖ్యానించారనే నేననుకుంటున్నాను. కేవలం ముగింపు చూసి సాంప్రదాయకం, యాంటీ ఫెమినిజం అని కొందరు, అసలు వివాహా నంతర ప్రేమ అనేది రాడికల్ ఫెమినిజం అని కొందరు వ్యాఖ్యానిం చారు. నేను ఫెమినిజాన్ని సమర్ధిస్తూ, లేదా దాన్ని గౌరవిస్తూ రాయలేదని కొందరు విమర్శిస్తే, నేను అక్రమ సంబంధాలను ప్రోత్సహించటానికే ఇలాంటివి రాశానని మరి కొందరు దుయ్య బట్టారు. రెండు విమర్శలకు నా సమాధానం ఒక్కటే. అది ఏ వాదం కోసం రాసినది కాదు. అదొక నలుగురి జీవితానికి చిత్రిక. అది వాదాల్లో ఒదుగుతుందా? లేదా? అనే వాదనే అసంబద్ధం.

నవల మొత్తాన్ని ముగింపు నుంచి చూసి అది సాంప్రదాయకమని వ్యాఖ్యానించటం సరికాదేమో అంటాను. ఈ నవలలో ముగింపు కంటే కీలకమైనది కల్హార సంఘర్షణ. కుటుంబాన్ని వదిలి వెళ్ళటం, వెళ్లలేకపోవటం అనేవి ఆయా వ్యక్తుల/పాత్రల పరిస్థితులు, వ్యక్తిత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయినా నవలలో ఇచ్చిన ముగింపు ఒక విధమైన మిడిల్ స్టెప్. ఆ తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో సంఘర్షణ ఉంటుంది. నవలకు ఆ విధమైన వస్తువు తీసు కోవటంలోనే ఒక రకమైన రాడికల్ ధోరణి ఉంది.
కల్హార జీవితంలోకి కౌశిక్ వచ్చాక కల్హార ఆలోచనల్లో కలిగిన మార్పు, సంఘర్షణ, కుటుంబ జీవితం పట్ల ఆమెకున్న అభిప్రాయాలు, చైతన్యతో ఆమె నిజాన్ని ఒప్పుకున్న తీరు, రికన్సిలేషన్ ప్రాసెస్‌కు సిద్ధం కావటం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ ఆధునిక లేదా సమకాలీన జీవితపు చిత్రణ. ఇది నవలలో ఎలా చిత్రతమయింది అన్నది చూడగలిగితే బావుంటుంది.
ం స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధాలని చెప్పబడే వాటిలోని స్వేచ్ఛా రాహిత్యం, మానవీయమైన ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణ, వైవాహికేతర ఆకర్షణలున్నా అంతిమంగా కుటుంబ విలువలకే కట్టుబడి ఉండడం తన్హాయిలో కనిపించాయి. ఈ నవల ద్వారా మీరు ప్రతి పాదించదల్చుకున్న సారాంశం ఏంటి?
- నేను 2010లో తన్హాయీ రాయటానికి ముందే ఇద్దరు మహా రచయితలు రాసిన రెండు క్లాసిక్స్ నా ముందున్నాయి. ఒకటి చలం రాసిన 'మైదానం', రెండోది టాల్‌స్టాయ్ రాసిన 'అన్నా కెరీనీనా'. రెండూ నాకు ఇష్టమైన పుస్తకాలు, నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు. కానీ ఆ రెండు పుస్తకాలు ఎంత నచ్చినా ఇంకా ఏదో చెప్పలేదనే అసంతృప్తి నాకు ఉంది. రాజేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత జీవితం రాశాడు చలం. వెళ్లటానికి ముందు ఎలాంటి ఘర్షణ చూపించలేదు. అసలు ఎలాంటి ఘర్షణ ఉంటుంది, దాన్ని ఏ స్త్రీ అయినా ఎలా అనుభవిస్తుంది? లేదా ఎలా అధిగమిస్తుంది అన్నది ఎక్కడా ప్రస్తావనకు రాదు 'మైదానం'లో. అలాంటి ఘర్షణ రాయాల్సిన అవసరం లేని నవల 'మైదానం'. అన్నా కెరీనీనా ది మరో రకమైన ఘర్షణ, వేదన. అయితే ఆ ముగింపును, ఆ ఘర్షణను కూడా ఒకొక్కరూ ఒక్కోలా చూస్తుంటారు. ఒకసారెప్పుడో నా ముందు తరం రచయిత ఒకరు ఏదో మాటల సందర్భంలో నాతో, అలాంటి పనులు చేస్తే అలాంటి ముగింపే లభిస్తుందని స్త్రీలకు హెచ్చరికగా టాల్‌స్టాయ్ ఆ ముగింపు ఇచ్చాడు అన్నారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాను. ఆ రెండు పాత్రలకు మధ్య ఉన్న ఎందరో స్త్రీలు నా కళ్ల ముందు కనిపించారు. అలా వెళ్లలేకపోయిన ఎంతోమంది కల్హారల జీవితం తన్హాయి. చలం మైదానం వచ్చాక కూడా కుటుంబాన్ని వదిలి వెళ్లగలిగిన రాజేశ్వరుల కంటే, వెళ్లకుండా ఉండిపోయిన కల్హారలే ఎక్కువమంది ఉన్నారు. వెళ్లలేక పోవటంలోని బాధను, వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధ ఘర్షణను రాశాను. అలాగే వివాహానంతరం కూడా ఇష్టాలు కలగవచ్చునన్నది నవలలో చర్చించిన అంశం, అయితే ఆ ఇష్టం ప్రస్తుత సంబంధం మీద నిరసనతోనో, తిరుగుబాటుగానో కలగడం కాదు. కేవలం ఇష్టం, ఇష్టంగా మాత్రమే నవలలో నేను చిత్రీకరించాను. ఒక వ్యక్తి మీద కలిగే ఇష్టాన్ని ఒక పూలమాల కట్టినట్లు రాశాను. ఆ క్రమ వర్ణన నవలకు ఓ ప్రత్యేకతను, ఓ విశిష్టతను చేకూ ర్చిందనుకుంటున్నాను.
ఈ వందేళ్లలో ఎంతోమంది రాజేశ్వరులను, అన్నా కెరీనినాలను ఈ సమాజం చూసి ఉంటుంది. అయితే ఎంతమంది మేము రాజేశ్వరులం అని ధైర్యంగా ప్రకటించుకున్నారు? ఎంతమంది రాజేశ్వరితో తమను తాము కనెక్ట్ చేసుకున్నారు? అన్నది ఆలోచించాలి. తన్హాయి వచ్చాక ఎంతోమంది పాఠకులు ధైర్యంగా మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని రాశారు. ఒక పాత్ర నచ్చటం వేరు, ఆ పాత్రతో కనెక్ట్ కావటం వేరు. రీడర్స్ కల్హారతో కనెక్ట్ అయ్యారు. అది ముఖ్యం. ఒక రచయితకు కానీ, ఒక పుస్తకానికి కానీ అంతకుమించి కావాల్సిందే ముంటుంది?

ం తన్హాయి నవల రాస్తున్నపుడు మీలోని వ్యక్తికీ రచయితకూ మధ్య ఏకీభావం ఉన్నాదా? (ఘర్షణ ఉంటే ఏ అంశాల్లో?)
- సాహిత్య సృజనలో అన్నీ మన నమ్మకాలకు, విశ్వాసాలకు, దృక్పథాలకు సంబంధించినవి మాత్రమే రాయలేము. మనం అంగీకరిం చని విషయాలను కూడా పాత్రల స్వభావాల రీత్యా రాయాల్సి వస్తుంది. పాత్రలను మన చెప్పు చేతల్లో పెట్టుకోకుండా, స్వేచ్ఛగా వాటిని ప్రవర్తింపచేయటం సరైనదని ప్రతి రచయిత నమ్ముతారు. అయితే అది ఒక్కోసారి సాధ్యం అవుతుంది. కాకపోతుంది. తన్హాయి విషయానికి వస్తే, నాలోని వ్యక్తికి, రచయితకు మధ్య ఏకీభావంతోనే రాశాను.
ం తన్హాయి ద్వారా మీకు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి కదా.. ఆ ప్రస్పందనల్లో మీకు దొరికిన ఆణిముత్యాలు? (వ్యక్తుల పేర్లు కాకుండా సామూహికమైన స్పందనలను చెప్పాల్సిందిగా మనవి.)
- హాహాహాహా. అభిమాన సంఘాల్లేవు. ఏమీ లేవు. ఫేస్‌బుక్‌లో తన్హాయీ నవల మీద చర్చించడానికి ఒక గ్రూప్ ఏర్పడింది. పుస్తకం వచ్చి ఏడాది దాటింది అయినా ఇప్పటికీ ఎవరో ఒకరి నుంచి మీ నవల చదివాము. బాగా నచ్చింది అంటూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒక రచయితగా నా కృషి సఫలమైందని సంతోషంగా అనిపిస్తుంది. ఆణి ముత్యాలు అరుదుగా ఉంటాయి కానీ నాకు తన్హాయి విషయంలో ఎక్కువగానే లభించాయి. నవలలో చిన్న చిన్న తప్పులు సరిచేసుకొని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే తెలుగులో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటిగా మిగిలిపోయి ఉండేదన్న సద్విమర్శను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.

వందలాది కామెంట్లు నుంచి నేను మర్చిపోలేని కామెంట్ ఆనానిమస్ పేరుతో వచ్చింది. జరిగిన విషయం చైతన్యతో కల్హార, చెప్పేశాక వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ తర్వాత ఆ అమ్మాయి ఆ కామెంట్ బ్లాగులో పోస్ట్ చేసింది. కల్హార చెప్పినట్లు తాను చెప్పలేకపోయానని, ఈ నవలను నేను ఇంకొంచెం ముందు రాసి ఉంటే తన జీవితమే మారిపోయి ఉండేదని, ఆమె ఎప్పటికీ నన్ను మర్చిపోలేనని కామెంట్ రాసింది. ఇలా నిజజీవితంలో నుంచి ఎందరో కల్హారలు ధైర్యంగా ముందుకు వచ్చి మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని చెప్పారు. అవన్నీ నాకు దొరికిన ఆణిముత్యాలే. పుస్తకాలు మనుష్యులను ప్రభావితం చేస్తాయన్న విషయం మనందరికీ స్వానుభవమే అయినా ఒక రచయితగా కొంతమంది పాఠకులకు ఈ పుస్తకం ఎంత ఇష్టమయిందో, ఎంత అపురూపమయిందో తెల్సుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను.

ం తన్హాయి ముగిసిందా? కొనసాగుతుందా?
- తన్హాయి పూర్తి కాలేదు. పుస్తకంగా ఒక ముగింపు ఇచ్చాను. నేనిచ్చిన ముగింపు తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో ఘర్షణ ఉంటుంది. కథను కొనసాగిస్తూ ఆ ఘర్షణను కూడా చిత్రిస్తూ తన్హాయి రెండో భాగం రాయమని ఎంతోమంది అడుగుతున్నారు కానీ రాయగలనో, లేదో చెప్పలేను. తన్హాయికి మరో రకమైన కొనసాగింపుతో ఇంకో నవల మాత్రం రాస్తున్నాను.
కల్పనా రెంటాల
ఫోన్: 001-512-535-5895

(ఆంధ్రజ్యోతి వివిధ లో జూన్ 3 వ తేదీ ప్రచురితం) 
 
Real Time Web Analytics