నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, October 24, 2010

చైనా చరిత్రలోని చీకటి కోణపు కథనమే " ఉమన్ ఫ్రం షాంగై"!

చైనా ప్రముఖ వివాదస్పద రచయితల్లో జియానహుయ్ యాంగ్ ఒకరు. మావో కాలం లో అతి క్రూరమైన వాటిగా ప్రాచుర్యం పొందిన లేబర్ క్యాంపుల్లో జీవితం ఎలా వుండేదో అనే దాని గురించి పరిశోధానాత్మక వాస్తవాల  ఆధారంగా రాసిన కథల సమాహారం " ఉమన్ ఫ్రం షాంగై".. ఇందులో చెప్పినవి  కట్టుకథలు కావు. ఫస్ట్ హేండ్ సమాచారం ఉపయోగించి రాసినవి. ఈ సమాచారం ఇంగ్లీష్ లోకి రావటం  ఈ పుస్తకం ద్వారానే ప్రథమం.

వెనుకబడ్డ ఈశాన్య చైనా ఎడారి ప్రాంతంలో జియబియాంగ్ అనేది మావో కాలం నాటి బలవంతపు లేబర్ క్యాంపు పేరు. 1957-60 మధ్య దాదాపు మూడు వేల మంది చైనా దేశస్తులు కమ్యూనిస్ట్ పార్టీ చేత " రైటిస్ట్" లు గా ముద్ర వేయించుకొని నిషేధానికి గురైనారు. ఇలా నిషేధానికి గురైన వారందర్ని  ఈశాన్య చైనా లోని గాన్సు ఎడారి ప్రాంతం లోని జియబియాంగో అనే ప్రదేశానికి తరలించారు.

వీరిలోమేధావులు, గాన్స్ లోని  మాజీ ప్రభుత్వ అధికారులు వున్నారు.అలా అక్కడ ప్రవాస కారాగారానికి పంపివేయబడ్డ స్త్రీ, పురుషులు అనేక రకాల చిత్రహింసలకు గురైనారు. ఈ కార్యక్రమాన్ని కమ్యునిస్ట్ పార్టీ " అత్యధిక శ్రమ ద్వార తగ్గించివేత " అని పిలిచేది. వీరంతా కూడా ఛైర్మన్  మావో సోషలిస్ట్లు విధానాల పట్ల అసంతృప్తి ప్రకటించినవారో,పార్టీ అధికారుల్ని ప్రశ్నించినందుకో " రైటిస్ట్లు " గా ముద్ర వేయించుకున్నవారో. మరికొంతమంది ఎందుకు " రైటిస్ట్లు" అయ్యారంటే, వారి తండ్రులో, తాతలో భూస్వాములో, పెట్టుబడీదారి వర్గానికి చెందిన వారు కావడం వల్ల. 1961 కల్లా ఇక్కడ జరిగిన మరణాల వల్ల ఈ క్యాంప్ ని మూసివేసారు. దాదాపు మూడు వేల మంది ఖైదీల్లో 500మంది దాకా మాత్రమే బతికి బట్ట కట్టగలిగారు.

1997 లో యాంగ్, గాన్స్ కి ప్రయాణం చేసి దాదాపు అయిదు ఏళ్ళ పాటు అక్కడ క్యాంపు నుండి బైటపడ్డ వంద మందికి పైగా పాత ఖైదీలని ఇంటర్వ్యూ చేసి   ఆ మారణ హింసాకాండకు సంబంధించిన అనేకమైన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో 13 కథలున్నాయి. చైన ప్రభుత్వపు నిషేధం బారి నుండి తప్పించుకునేందుకు రచయత ఈ నిజాల నిజాయితినీ, శక్తిని పోగొట్టకుండా కాల్పనిక సాహిత్య కథలుగా మలిచారు. జర్నలిజం, సాహిత్యం రెండూ మేళవించిన సృజన ఇది.

ఈ లేబర్ క్యాంపు లో ఖైదీలు రోజంతా జైలు గార్డుల పర్యవేక్షణలో దుర్భరమైన  ఎడారి ప్రాంతంలో పంటలు పండించటం, పశువుల పెంపకం లాంటి పనులు చేసి రాత్రిళ్ళు మావో రచనలు చదివి " ఆత్మ విమర్శలు " లేదా గతంలో వారు చెసిన తప్పిదాలకు పశ్చాత్తాపాలు రాసుకోవాలి.

జియబియాంగో చుట్టుపక్కల భూములన్నీ ఓ మొక్కైనా మొలవని ఉప్పుమేతల ఎడారి ప్రాంతం.. ఇక క్యాంపు విషయానికి వస్తే, అది ప్రధానం గా 40,50 మంది నేరస్తులు పట్టే ప్రదేశం. అలాంటిదానిలోకి కొత్తగా తీసుకువచ్చిన మూడువేల మంది ఖైదీలను వుంచారు. ఈ మొత్తం ఖైదీలందరికీ ఎలాంటి ఆహార పదార్ధాల సరఫరాకు ప్రభుత్వం వొప్పుకోకుండా తిరస్కరించింది. అందువల్లే రైటిస్ట్ లు ఆ క్యాంపు కి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆహారం దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది.

1960 ఆకురాలు కాలంలో ఆహార పధార్దాల కొరత మరీ తీవ్రం కావడంతో రైటిస్ట్ ల్లో అధికభాగం ఆకలికి తట్టుకోలేక మరణించడం మొదలుపెట్టారు. పచ్చిక బయళ్ళలో ఆహారం కోసం వెతుక్కొని ఆకులు,అలమలు, చిన్న చిన్న పురుగుల్ని, ఎలుకల్ని, చివరకు తోటి ఖైదీలు మరణిస్తే వారి మాంసాన్ని, అంతే కాకుండా పశువుల, మానవ మలాన్ని కూడా తమ ప్రాణాలు నిలుపుకోవటానికి వారు తినాల్సి వచ్చింది. అంతేకాకుండా చెట్టుబెరడు  నుంచి తీసిన ఒక రకమైన జిగురు లాంటిదాన్ని సూప్ గా తాగితే తాత్కాలికంగా ఆకలి వుండకపోయినా లోపల ఇంటెస్టిన్స్ కి అది అతుక్కుపోయి చనిపోతామని తెలిసినా ఇక గత్యంతరం లేక అదే తాగి చనిపోయిన వారెందరో. మృతదేహాలకు కనీస ఖనన సంస్కారాలు కూడా లేక అవి అలా మట్టిదిబ్బల మీద పడివుండేవి.

ఎట్టకేలకు జియబియాంగ్  దురంతం బీజింగ్ లోని  సీనియర్ పార్టీ అధికారుల  దృష్టికి రావడంతో ప్రభుత్వం హడావిడిగా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి పంపేసింది. అలా బతికి  బైటపడిన వారు కేవలం 500 మంది మాత్రమే. ఈ విషాదం గురించి ఎప్పుడూ ప్రభుత్వం అధికార ప్రకటన చేయలేదు. మెడికల్ రికార్డ్స్ తిరగరాయించి ఖైదీలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినట్లు తప్పుడు నివేదికలు తయారుచేయించింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అలా క్యాంపు లో జరిగిన విషాద సంఘటనల వివరాలు ఒక మిస్టరీ గానే మిగిలిపోయాయి.

ఇక ఈ పుస్తకానికి శీర్షిక గా పెట్టిన కథ గురించి...ఆమె జైలుశిక్ష పడ్డ ఓ రైటిస్ట్ భార్య . ఆమె పేరు  గు. ఆమె భర్త పేరు డోంగ్. తన భర్త ఆ ప్రవాస జైలు జీవితం నుండి ఎప్పటికైనా షాంగై తిరిగివస్తాడని ఆమె నమ్మకం. ఒకసారి ఆమె తన భర్త ని చూడటానికి జియబియాంగ్ వస్తుంది. ఆమె రావటానికి ముందే ఆమె భర్త చనిపోతాడు. జైల్లో భర్త స్నేహితుడు, తోటీ ఖైదీ ఆమెకు డోంగ్ మరణవార్త చెప్తాడు. ఆమె ఎలాగైనా భర్త మృతదేహాన్ని చివరిసారిగా చూడాలనుకుంటుంది. కానీ అసలు నిజం తెలిసిన తోటి  ఖైదీ ఆమెకు  రకరకాల అభ్యంతరాలు చెప్తాడు. అయినా ఆమె తన పట్టు విడవకుండా నిరాహారదీక్ష సైతం చేస్తుంది. ఇక తప్పక తోటి ఖైదీ ఆమెను డొంగ్ మృతదేహం పడివున్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. అప్పటికే డొంగ్ మృతదేహం లోని ముఖ్యమైన భాగాల్ని కొందరు ఖైదీలు తినేసారన్న కఠిన నిజమే అతను గు తన భర్త మృతదేహం చూడకుండా అడ్డుపడటానికి కారణం. మట్టిదిబ్బల మీద సగం శరీర భాగాలు కూడా లేకుండా పడి వున్న భర్త మృతదేహాన్ని చూసి చలించిపోతుంది గు. అయినాసరే, అక్కడే తన భర్తకు ఎలాగైనా దహనసంస్కారాలు చేసి ఆ ఎముకల్ని, చితాభస్మాన్ని షాంగై తీసుకెళ్ళలన్నది ఆమె ప్రయత్నం. ఆమె దగ్గర ఎముకలు మోసుకెళ్ళేందుకు కూడా ఏమి మిగలని పరిస్థితుల్లో సహచర ఖైదీ ఆమెకు తను ఎంతో కాలం గా ప్రాణప్రదం గా కొరియన్ వార్ కి గుర్తుగా దాచిపెట్టుకున్న అమెరికన్ బ్లాంకెట్ ని ఇస్తాడు. అందులో ఆమె అతి పదిలం గా తన భర్త ఎముకల్ని దాచుకొని తిరిగి షాంగై వెళ్ళిపోతుంది. గు పట్టుదల అతని మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆమెను అతను మర్చిపోలేకపోతాడు. క్షమాభిక్షతో బయటపడ్డ కొన్నేళ్ళ తర్వాత షాంగై వెళ్ళినప్పుడు ఆమె ఆచూకి కోసం ప్రయత్నించి కూడా చివరకు ఆమెను కల్సుకోకుండానే వెనక్కు మళ్ళుతాడు.అలా ఆ షాంగై  మహిళ ఆ ఖైదీల్లోనే కాకుండా ఈ పుస్తకం చదివే పాఠకుల మనస్సులో కూడా చెరగని ముద్ర వేస్తుంది.

ఇలా ఆ లేబర్ క్యాంపులో రైటిస్ట్ లు ప్రతి రోజు ఎదుర్కొనే సంఘర్షణలే ఈ కథలు.

సిటీ వేర్ హౌస్ నుండి విత్తనాలు గా పాతిపెట్టెందుకు బంగాళదుంపల్ని తీసుకొచ్చే క్రమంలో కొందరు ఖైదీల గ్రూప్ వాటిల్లో కొన్ని బంగాళదుంపల్ని దాచి వుడికించి తిన్నందువల్ల ఎదురైన తీవ్ర పరిణామాలు చెప్తుంది " ది పోటాటో ఫీస్ట్". ఓ మహిళా ఖైదు క్యాంపులో పుట్టిన తన బిడ్డను పెంచడంలో ఎలాంటి కష్టాలు పడిందో, తోటి మహిళా ఖైదీలు తమకే తినటానికి లేకపోయినా ఆ తల్లి తన బిడ్డకు పాలిచ్చేందుకు తమ ఆహరంలోంచి కొంత భాగాన్ని ఆమెకు ఇవ్వడం, ఆ బిడ్డ, తామందరి బిడ్డగా భావించే వైనం చెప్పిన " జియా నాంగ్" మనల్ని కూడా కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. ఓ ఖైదీ ఎలాగైనా సరే ఆ క్యాంపు సంకెళ్ళ గోడలల్ని బద్దలు కొట్టి బైట పడాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన విధానాన్ని అందిస్తుంది " ఎస్కేప్ ". ఇలా ఈ కథలన్నీ ఖైదీలు పడ్డ కష్టాల్ని మన ముందుంచి చైనా ప్రభుత్వపు అమానుషత్వానికి, అమానవీయ చర్యలకు  దర్పణం పడతాయి. చైనా చరిత్రలో దాగి వున్న ఓ చీకటి కోణాన్ని  బహిర్గతం చేసే కథనాలివి.

అసలు ఈ పుస్తకం లోని కథనాలు ఎలా వెలుగు చూసాయంటే...

ఈ పుస్తక రచయత జియాన్ హుయ్ గాన్స్ ప్రాంతానికి చెందినవాడు. యాంగ్ మొదటగా ఈ జియబియాంగ్ గురించి 1965 లో విన్నాడు. అప్పుడు యాంగ్ 19 ఏళ్ల హైస్కూల్ గ్రాడ్యుయేట్ . అతనిలో పూర్తిగా విప్లవ భావాలు నిండివుండేవి. చైనా లో వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతాన్ని అభివృధ్ధి చేసేందుకు పట్టణ జీవితాన్ని వదిలి వేలాదిమంది యువత చేపట్టిన కార్యచరణలో యాంగ్ కూడా భాగస్వామి. అక్కడ మిలట్రి తరహా కలెక్టివ్ ఫారం లో యాంగ్ కి ఖైదు జీవితాన్ని పూర్తి చేసుకొని ఆ ఫారం లో పని చేసేందుకు నియమితులైన కొందరు రైటిస్ట్ లతో పరిచయమైంది. ఒకరోజు యధాలాప సంభాషణలో ఎవరో జియబియాంగ్ విషాద మరణాల గురించి అనధికారికంగా ప్రస్తావించారు. యాంగ్ దానిగురించి మరిన్ని వివరాలు అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పటానికి నిరాకరించి ఆ విషయాన్ని అక్కడితో ఆపేసాడు.
 
ఆ సంభాషణ చిన్నదే అయినప్పటికీ యాంగ్ లో ఒక ఆసక్తి రేకెత్తించింది. కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి అమానుషాల్ని తన సొంత ప్రజల పట్ల చేయడం అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని గురించి మరింత ఎక్కువ తెల్సుకోవాలనుకున్నడు. జియబియాంగ్ గురించి తెల్సుకునే ప్రయత్నమంటే  ఒకరకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కిందే లెక్క. అలా యాంగ్ ఆ కలెక్టివ్ ఫారం లో 1981 వరకు 16 ఏళ్ళ పాటు వున్నాడు. ఆ కాలంలో చైనాలో అనేక చెప్పుకోదగ్గ మార్పులు సంభవించాయి. మావో 1976 లో చనిపోయిన తర్వాత ఆయన అనుచరుడు డెంగ్ జియోపింగ్  మావో రాడికల్ కమ్యూనిస్ట్ విధానాలకు స్వస్తి చెప్పి చైనా ను రాజకీయ, ఆర్ధిక సంస్కరణల మార్గం లో నిలబెట్టాడు. 70 ల తర్వాత రైటిస్ట్ వ్యతిరేక ప్రచారం లో జరిగిన తప్పుల్ని గుర్తించి రైటిస్ట్ ల మీద విధించిన తీర్పుల్ని ప్రభుత్వం తిరగ రాసింది. ఆ క్రమం లో చాలా మంది ఖైదీల్ని విడుదల చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఆ విషాదానికి సంబంధించిన  బాధ్యతను స్వీకరించే ఆలోచన ఏది చేయలేదు.

యాంగ్ 1988 లో వృత్తిరీత్యా రచయత గా మారి టియాంజిన్ పోర్ట్ సిటి కీ నివాసం మార్చుకొని  అనేక కథలు, నవలలు రాశాడు. అయితే అతనెప్పుడూ జియానియాంగ్ గురించి మర్చిపోలేదు. 97 లో మావో యాంటి రైటిస్ట్ క్యాంపైన్ 14 వ వార్షికోత్సవం సందర్భంగా యాంగ్ అధికారికంగా తన ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. ఈ విషయం చుట్టూ నెలకొని వున్న రాజకీయ వొత్తిడులు కొంచెం పలచబడినట్లనిపించడంతో అతను తిరిగి గోబీ ఎడారికి ప్రయాణమయ్యాడు. ఈ విషాదం నుండి బతికి బైటపడ్డవారికోసం వెతకటం ప్రారంభించాడు. అయిదేళ్ళ పాటు సాగిన ఈ అన్వేషణలో యాంగ్ వందమంది  మాజీ ఖైదీలను, వాళ్ళ బంధువుల్ని ఇంటర్వ్యూ  చేసాదు.

వారిలో కొందరు మళ్ళీ ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో వివరాలు చెప్పటానికి తిరస్కరించారు. కొందర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ దారుణాలు వినలేక మధ్యలో ఇంటర్వ్యూ ఆపి బయటకువెళ్ళి కళ్ళనీళ్ళు తుడుచుకొని వచ్చి మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టేవాడు యాంగ్.  మొదటగా " వుమన్ ఫ్రం షాంగై" కథ ప్రచురితమైనప్పుడు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించింది. అలా తను సేకరించిన కథనాలన్నింటినీ ఒక సిరీస్ గా ప్రచురించాడు. అయితే యాంగ్ చేసినది ఒక జర్నలిస్టిక్ పని. కాని అతను దాన్ని కధలు గా మార్చి రాయటానికి ఒక కారణం వుంది. యాంగ్ రాసింది " డాక్యుమెంటరి లిటరేచర్". 80ల్లో చైనా  రచయితలు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో తమ జర్నలిస్టిక్ వర్క్ కి కొంత సృజనాత్మకతను జోడించటం ప్రధాన అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పనిసరి అంటాడు  యాంగ్.

 " పత్రికా స్వాతంత్ర్యం ఒక సంప్రదాయం గా వున్న పశ్చిమ దేశాల్లో ఇది కనీసం వూహించను కూడా వూహించలేము. అక్కడ సాహిత్యమంటే సాహిత్యం. వార్తలంటే వార్తలు. ఎవరు కూడా ఈ రెంటినీ కలిపెయ్యరు.చైనా రచయితలకు ఈ తేడా  తెలియక కాదు. సమకాలీన జీవితంలో నిక్లిష్టమైన పరిస్థితుల వల్ల ఇలా ఆ రెంటిని కలగలిపి రాయడం తప్ప వాళ్ళకు మరో అవకాశం లేదు" అంటాడు యాంగ్.

యాంగ్ కథనాల్ని ప్రచురించిన ఎడిటర్లు ఒక అడుగు ముందుకేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాపగాండ కళ్ళ నుండి  తప్పించుకునేందుకు కథనాల్ని ఫిక్షన్ కేటగిరి కింద ప్రచురించారు. ఈ పుస్తకానికి వచ్చిన ప్రజాదరణ వల్ల , ఈ దారుణ కాండ నుంచి బతికి బయటపడ్డ అనేకమంది బాధితులు, అంతకు ముందు అనేక దశాబ్దాలుగా వీటి గురించి పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడని వారు, ఇప్పుడు ముందుకు వచ్చి యాంగ్ తో తమ కథలు చెప్పుకుంటున్నారు.
 
కల్పనారెంటాల
 
  ( ఈ వ్యాసం పాలపిట్ట అక్టోబర్ సంచిక లో ప్రచురితం)
 
 
 
 
 
 

Sunday, October 17, 2010

తకిట తధిమి తందానా..తన్హాయి తిల్లానా!పేరడీల మాస్టర్ మలకపేట రౌడీ కి, రీమిక్స్ చేసిన జ్యోతి కి కృతజ్ఞతలు
.

Saturday, October 09, 2010

మధుర మీనాక్షి- కథ ముగింపు

ఈ కథ గురించి రాసిన తొలి పలుకులు ఇక్కడ చదవవచ్చు.

కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.

మొదటి సారి ఈ కథ చదవటం పూర్తి చేసినప్పుడు నాకు కూడా వెంటనే అర్థమైనట్లు అనిపించలేదు. మీనాక్షి తో ఆ రాత్రి అతనికి కలిగిన అనుభవం ఒక భ్రాంతి నా? లేక వాస్తవమా? అది ఒక కలనా? ఆ కలయిక జరిగిందని వూహించుకున్నాడా? నిజంగా జరిగిందా?

మొదట నిజంగా జరిగిందనుకుందాము....నిజంగా జరిగితే అనుభవం తాలూకు అనుభూతి గుర్తుండి అసలేం జరిగిందో ఎలా గుర్తుండకుండా వుంటుంది? ఎంత గొప్ప అనుభూతికి లోనైనా అతను మీనాక్షి ఇంటి నుంచి హోటల్ కి ఎలా నడిచోచ్చాడో కూడా ఎలా గుర్తుండకుండా వుంటుంది? అతను ఆమె తో పొందాను అనుకుంటున్న అనుభవం అసలు భౌతికమైనదా? లేక కేవలం మానసికమైనదా? అది లైంగికపరమైన కలయికనా? ఇలా అనేకానేక సందేహాలు వస్తాయి.

రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో అది అక్షరాల్లో , పదాల్లో, వాక్యాల్లో , ఒక అనుభవం గా , ఒక గాఢమైన అనుభూతి గా మన ముందు వుంది. అక్కడితో రచయిత పాత్ర అయిపోయింది. మిగిలింది పాఠకుడి పాత్రే. అక్కడ చెప్పిన దాన్ని, చెప్పకుండా వదిలేసిన దాన్ని బట్టి సొంత వూహాలతో కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.

మొదటి సారి చదివినప్పుడు ( ఎన్ని సంవత్సరాల క్రితమో గుర్తు లేదు) నాకు కథ పూర్తి కాగానే సంపూర్ణం గా అర్థం కాకపోయినా రచయిత చాలా బాగా రాశారు అనిపించింది. ఆ బాగా రాయటం కొంచెం సంక్లిష్టం గా చెప్పటం వల్లనా, లేక అర్థమై కాకుండా వదిలేయటం వల్ల వచ్చిన ఒక సొగసు వల్లనా? లేక మన మామూలు పరిధులకు అర్థమైనా కాకపోయినా రచయిత ఒక తాత్త్విక పరిధిలో ఈ కథను చెప్పారన్న మామూలు అవగాహన కలగటం వల్లనా ? ఏమో తెలియదు. ఇదీ అని చెప్పలేని కారణం. ఇలా చాలా రకాలా కారణాల వల్ల ఈ కథ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఇలా నాకు నచ్చిన , లేదా నేను మెచ్చిన కథల్ని పరిచయం చేయటం కోసమే కథానుభవం శీర్షిక ప్రారంభించాను.

మళ్ళీ ఈ కథ ఇప్పుడు సంపాదించినప్పుడు , మొదటి సారి చదివినప్పుడు ఏం అర్థమైంది అన్నది అసలు మనసు లో లేకుండా ఇప్పుడే మొదటి సారి ఈ కథ చదువుతున్నట్లు మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక మళ్ళీ అదే అనుభవం. ఏం చెప్తున్నారు? అని. వెనక్కూ, ముందుకూ మళ్ళీ మళ్ళీ చదివాక ఒక చిన్న విషయం ఏదో అర్థమైనట్లు అనిపించింది. ఈ ముగింపు ని ఎలాగైనా చెప్పుకోవచ్చు.

నా అవగాహన తప్పో, వొప్పో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఇది కేవలం నాకు కలిగిన అనుభూతి. మీకు కూడా ఇలాగే అనిపించవచ్చు. వేరేలాగా అనిపించవచ్చు. ఎలా అనిపించినా కరెక్టే అని నేననుకుంటున్నాను.

ఆ రాత్రి కథకుడు పొందిన భౌతికానుభవం మానవ మీనాక్షితోనే అయినప్పటికీ మానసికంగా ఆ సమయం లో అతని మనస్సు ఆలయం లోని మీనాక్షి పై లగ్నమై వుంది. అందువల్లనే అతనికి అదొక అనిర్వచనీయమైన అనుభవంగా , తనను తాను మర్చిపోయేంత గాఢమైన అనుభవంగా మిగిలింది. ఆ అనుభవం లో అతను మిగలలేదు. అనుభవం ఒక్కటే మిగిలింది. అందుకే అతనికి ఆ సమయం లో మీనాక్షి ఏం మాట్లాడిందో , అసలు ఏమైనా మాట్లాడిందో లేదో కూడా తెలియలేదు. తను హోటల్ రూమ్ లోకి వచ్చి ఒక నిద్ర లోకి వెళ్లక హోటల్ సర్వర్ వచ్చి రాత్రి ఎనిమిది గంటలప్పుడు లేపితే మెలకువ వచ్చింది. సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకూ అంటే వున్నది దాదాపు ఒక రెండు, మూడు గంటలు.

ఈ రెండు మూడు గంటల్లో ఏం జరిగిందో కొన్ని వివరాలు ఇచ్చారు రచయిత. నిజానికి ఇలా వాక్యం వాక్యం తీసి వివరణ ఇచ్చుకుంటూ పోతే ఆ కథ లోని సౌందర్యం మొత్తం విరిగిన అద్దం ముక్కల్లాగా కనిపించటం తథ్యం. ఈ తాత్త్వికమైన ముగింపు ని ఎవరికి వారు అర్థం చేసుకోవటం సులువు కానీ ఇలా చెప్పటం అంటే అందులోని ఆనందాన్ని ఇలా భాగభాగాలుగా చేయక తప్పటం లేదు.అందుకు క్షమించాలి.
అతను కలిసింది దేవాలయం లోని మీనాక్షి తో అని నేను స్పష్టం గా అనుకోవటానికి...నాకు లభించిన వివరాలు...

మీనాక్షి చనిపోయింది అని జ్నానాంబ చెప్పగానే అతనికి బాధ, దుఃఖం కలగకుండా ...మాయ గా ఆశ్చర్యం గా అనిపించింది. ఎందుకలా?
ఫోటో లోని మీనాక్షి కి, అతను తన అంతఃచక్షువులతో చూసిన ఆమె అద్భుత సౌందర్యానికి అసలు ఏ మాత్రం పోలికలే కనిపించలేదు.

మీనాక్షి తో కథకుడు తన అనుభూతి ని ఆమె మరణం తర్వాత తర్కించుకొని చూసినప్పుడు అతనికి గుర్తున్నదల్లా పుష్కరిణి దగ్గర ఆమె చెప్పిన అద్వైతం మాటలే. ఆమె ఇంటి దగ్గర కథకుడు తనని గురించి తాను చెప్పకున్నాడు తప్ప మీనాక్షి వివరాలేమీ చెప్పిన గుర్తు లేదు.

కథకుడు ఆమె మరణాన్ని కథలో ఎక్కడా మృత్యువు గా, మరణం గా ఒక్కసారి కూడా పేర్కొనకపోవడం...ఆమె దగ్ధమై, అంతర్ధానమై పోయింది అంటాడు . అలాగే జ్నానాంబ చెప్తున్న మీనాక్షి కి , తన స్వానుభవం లో తన అనుభూతి లో సత్యమై నిలిచిన మీనాక్షి కి ఎక్కడా పోలిక లేదని కథకుడు స్పష్టం గా గుర్తించగలగటం.

జ్నానాంబ ఇంట్లో అద్దెకుంటున్న ఫిలాసఫీ లెక్చరర్ , స్వయంగా అద్వైతీ, కథకుడి కి అద్వైతానుభూతి ని విశదం గా వివరించి చెప్పిన మీనాక్షి సాక్షాత్తూ ఆ అమ్మవారి భౌతిక స్వరూపమే. కనీసం కథకుడి అనుభవం వరకూ. తామిద్దరి కలయిక లో ధార్మిక విచికిత్స పొడచూపనే లేదు అని కథకుడి ద్వారా స్పష్టం గా చెప్పించిన దాన్ని బట్టి కథకుడు మధుర మీనాక్షి లో ఒక శృంగార స్త్రీమూర్తి ని చూశాడు. అమ్మవారిని అలా చూడటం అనేది సర్వ సాధారణం కాదు కానీ అసాధారణం కూడా కాదు. మీరా కృష్ణుడిని భర్తగా ఆరాధించటంలో, శ్రీరంగనాథుడ్ని గోదా దేవి ప్రేమించడం లో లేని అభ్యంతరం మీనాక్షి దేవి ని ఒక సంపూర్ణ స్త్రీ గా ఒక పురుషుడు చూడగలగటం లో ఉండనక్కరలేదు. అది ఒక రకమైన తంత్రసాధనేమో కూడా.

లోకాలనేలే ఒక అమ్మ గా కాకుండా మధుర మీనాక్షి ని కథకుడు ఒక అద్భుత సౌందర్య రాశి గా ఆమె లోని అపూర్వమైన సౌందర్యాన్ని ఛూశాడు, ఆమె పట్ల ఒక లైంగికేచ్చ ను కలిగి వున్నాడు అన్నది ప్రధానంగా రచయిత ఈ కథ లో ప్రతిపాదించదలుచుకున్న విషయం . అది ఎంత మాత్రం తప్పు కాదు అని చెప్పటం తో పాటు, దానికొక అద్వైత తాత్త్వికత ను కూడా జోడించి అందించారు.
కథలోని ప్రతి వాక్యం ఎంతో ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా వుంది.

మీనాక్షి అతనికి చేసిన బోధ ఒకటే. ఇద్దరు మీనాక్షులు లేరు.ఉన్నది ఒకటే. అందుకే కథకుడు మానవ మీనాక్షి తో లైంగికంగా కలిస్తే అతను అమ్మవారితో ఐక్యం చెందినట్లు అనుభూతి చెందాడు. అంత మధురమైన అనిర్వచనీయమైన సుఖాన్ని పొందాక అతను ఒక రాత్రి ఒక పగలు అలా మత్తుగా నిద్రపోతున్నప్పుడు కథకుడికి ఒక కల వస్తుంది. అతను చనిపోయినట్లు వచ్చిన కల అది. ఆ అనుభవం ద్వారా అతను తాను ,తన శరీరం వేరు అన్న భావం నుండి ఆ రెండూ ఆ అనుభవం తో, ఆ అనుభూతి తో, ఆ అనుభూతి ప్రసాదించిన మీనాక్షి అనే స్వస్వరూపం తో ఏకమైపోయాడు అని రచయిత ప్రతీకాత్మకం గా చెప్పాడు.

కథలోనే ఒక చోట చెప్పినట్లు ఆశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దాని ద్వారానే పొందటం సాధ్యమవుతుంది. ఆశాశ్వతమైన మీనాక్షి ద్వారానే కథకుడు శాశ్వతమైన దేవత ని పొందగలిగాడు.ఆ తాదాత్మ్యాన్ని చెప్పటమే మొత్తం మధుర మీనాక్షి కథ.

వున్నవి రెండు కాదు, ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ఒక కథలో ఇంత చక్కగా, ఇంత అందంగా చెప్పగలగటం మామూలు రచయితల వల్ల జరిగే పని కాదు. ఫిలాసఫీ ని జీవితమంతా అధ్యయనం చేసి పాశ్చాత్య, భారతీయ తత్త్వ శాస్త్రాలకు ఒక అనుసంధానం చేయాలని జీవితమంతా తపించి అందుకోసమే కృషి చేసి తన రచనలన్నింటి ద్వారా తాను నమ్మిన, తాను అవగతం చేసుకున్న ఫిలాసఫీ ని అందించే ప్రయత్నం చేసిన ఆర్. ఎస్. సుదర్శనం లాంటి రచయిత మాత్రమే రాయగలిగిన కథ మధుర మీనాక్షి. మళ్ళీ అలాంటి కథ తెలుగు లో మరొకటి వస్తుందన్న నమ్మకం లేదు కానీ వస్తే మంచిదే.


Wednesday, October 06, 2010

బాలగోపాల్ వర్ధంతి సభలు హైదరాబాద్ , టెక్సాస్ ల్లో!

మానవ హక్కుల ఉద్యమ నేత కె. బాలగోపాల్ మరణించి ఈ అక్టోబర్ 8 కి ఏడాది ముగుస్తోంది. ఒక దుఃఖం ఇంకా పచ్చి గా గుండెను మెలిపెడుతున్నట్లే వుంది. బాలగోపాల్ అకాల మరణం తాలూకు వేదన ఆ కుటుంబానిదొక్కటే కాక సమాజానికి కూడా ఇంకా ఒక తీరని లోటు గానే కనిపిస్తోంది. హైదరాబాద్ లో జరిగే వర్ధంతి సభలో ఆయన రాసిన వ్యాసాలు, ఆయన చేసిన ప్రసంగాల నుండి తయారైన పుస్తకాలను ఒక సీడీ ని ఆవిష్కరిస్తారు.

“మతతత్త్వం పై బాలగోపాల్” (హెచ్ బీ టి) ,” హక్కుల ఉద్యమం-తాత్త్విక దృక్పథం” ( హెచ్.ఆర్.ఎఫ్.)” రాజ్యం సంక్షేమం-బాలగోపాల్ ఉపన్యాసాలు” (పర్స్పెక్టివ్స్) “ మా బాలగోపాల్- హెచ్.ఆర్. ఎఫ్. బులెటిన్-4 “ “ డెమొక్రసీ డైలాగ్స్ –ఇంటర్వ్యూ/స్పీచెస్ బై బాలగోపాల్ ( సీడీ) –ఇవన్నీ కూడా ప్రముఖ పుస్తకాల షాపులన్నింటి లోనూ లభ్యమవుతాయి.

వీలున్నవాళ్ళు తప్పక ఆ సభకు హాజరై బాలగోపాల్ చేసిన కృషి ని స్మరించుకోవచ్చు.

టెక్సాస్ లోని డాలస్ లో కూడా బాలగోపాల్ వర్ధంతి సభ అక్టోబర్ 10 వ తేదీ వాలీ రాంచ్ లైబ్రరీ లో జరుగుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్, చంద్ర కన్నెగంటి, కె.సి. చేకూరి, సాజీ గోపాల్, ఉదయ భాస్కర్ ,రత్నాకర్ రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు.

Sunday, October 03, 2010

మార్మిక సౌందర్యాన్ని ప్రతిబింబించే ఆర్.ఎస్. సుదర్శనం గారి “ మధుర మీనాక్షి”!

కథానుభవం-7

తన్హాయి వెల్లువలో నా కథానుభవాలు, కవిత్వానుభవాలు, వచనానుభవాలు అన్నీ గత నాలుగు నెలలుగా తాత్కాలికంగా తెర మరుగై పోయాయి. కథలు చదవడం ఆపేయ్యలేదు గానీ చదువుతున్న వాటి గురించి రాయడం మాత్రం కుదరలేదు.

మొన్నా మధ్య సౌమ్య రాసిన మధుర యాత్ర స్మృతి గురించి చదువుతున్నప్పుడు ఆ పోస్ట్ లోని విషయాల మీద దృష్టి కన్నా నా మనసు మధుర ఆర్. ఎస్. సుదర్శనం గారి “ మధుర మీనాక్షి “ కథ ను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత రాస్తున్న ఈ కథానుభవం లో ఈ సారి నాకు బాగా నచ్చిన , చాలా మంది మెప్పు ని పొందిన విశిష్టమైన కథ చోటు చేసుకోవటం చాలా సంతోషం గా ఉంది..
ఆర్. ఎస్. సుదర్శనం గారి రచనల గురించి, వారి సాహిత్య దృక్పథం గురించి ఒకటి రెండు మాటలు కాదు ఒక వివరమైన వ్యాసం రాయాల్సినంత విషయం ఉంది. ఆయన కథలే కాకుండా తెలుగు సాహిత్య విమర్శ మీద ఆయన రాసిన పుస్తకం “ సాహిత్యం లో దృక్పథాలు” చదవవలసిన పుస్తకాల్లో ఒకటి. తాత్త్విక చింతన వున్న కథకుల్లో ఆర్. ఎస్. సుదర్శనం అగ్రగణ్యుడు అన్న మాటకు ఉదాహరణ గా ఆయన రాసిన ఆణి ముత్యం “ మధుర మీనాక్షి” కథను చెప్పుకోవచ్చు. ఈ కథ ద్వారా ఆయన రచనా కౌశలాన్ని ఎలాంటి వారైనా అర్థం చేసుకోవచ్చు.

ఈ కథ గురించి కేవలం ఒక సారి చదివి రాస్తున్న కథానుభవం కాదు ఇది. చాలా సార్లు చదివాను. మళ్ళీ మళ్ళీ ఆలోచించాను. ప్రతి సారి ఈ కథ ఒక్కోరకమైన అనుభూతి ని, ఒక్కో రకమైన ఆలోచన ఇచ్చింది. అందుకే ఇది నాకు నచ్చిన కథ అయింది. ఒక రచయతగా ఆర్.ఎస్. సుదర్శనం గారి మీదున్న గౌరవం మరింత ఎక్కువైంది. నా అభిరుచి మేరకు( అందరికీ ఈ కథ నాకు నచ్చినంత నచ్చక పోవచ్చు. లేదా నేను చూసిన అంశాలు, ఇతరులకు కనిపించిన అంశాలు వేర్వేరు గా ఉండవచ్చు. కాబట్టి ఇది కేవలం నా వ్యక్తిగత అభిరుచితో మాత్రమే విశ్లేషిస్తున్నానని అర్థం చేసుకోగలరు) అనేక రకాలుగా ఇదొక ప్రత్యేకమైన కథ. మనసు పెట్టి కథ చదివి ఆలోచిస్తే అనేక సున్నితమైన అంశాలు, అస్పష్ట కోణాలు అర్థమవుతాయి. అద్వైత సందేశం చుట్టూ ఇంత మంచి కథ అల్లగలిగిన ఆలోచన, నైపుణ్యం కేవలం ఆర్. ఎస్. సుదర్శనం గారి సొత్తు మాత్రమే అనిపించింది ఈ కథ చదివాక.

ఈ మధుర మీనాక్షి కథ ఇదీ అంటూ చెపితే అందులోని గొప్పతనం అర్థమై పోయే కథ కాదు ఇది. నిదానంగా చదవాలి. సంపూర్ణ తాత్త్వికత తో నిండి వున్న ఈ కథ అలవోకగా చదివితే బహుశా ఆ గొప్పతనం, ఆ సౌందర్యం మన జ్నానేంద్రియాలకు పట్టకపోవచ్చు. కథ పూర్తయ్యేక ఆ ( ఏముందిలే ఈ కథ లో అనిపించదు. ఈ కథ లో ఇంకా ఏమేం చెపుతున్నారు అని ఆలోచించబుద్ధి వేస్తుంది. మనస్తత్త్వ చిత్రణ, తాత్త్వికత , ఆ రెంటికి మించి ఓ మార్మిక సౌందర్యం కనిపిస్తుంది ఈ కథ లో.

ఎవరైనా మొదట ఈ కథ చదివాలనుకుంటే ఇక్కడితే ఆపేసి నాకోక మైల్ చేయండి. నేను కథ పంపిస్తాను. అది చదివాక అప్పుడు మీకు కలిగిన అనుభవాల్ని, నా మాటల్ని పోల్చుకోవచ్చు. లేదూ, అసలు కథ లో ఏముందో తెలుసుకొని ఆ తర్వాత కథ చదవాలో, వద్దో నిర్ణయించుకోవాలనుకుంటే ముందుకు సాగండి.

కథ ఉత్తమ పురుష లో సాగుతుంది. కథకుడి పేరు తెలియదు. ఊరూ తెలియదు. అలాగే అతని వయస్సు కూడా ఇంత అని కచ్చితం గా తెలియదు. కాకపోతే నలభై దాటిన మధ్య వయస్కుడు అని అర్థమవుతుంది.కథకుడు రెండేళ్ళ క్రితం భార్య ను పోగొట్టుకున్న ఓ వ్యాపారి. కథకుడి కి మధుర వూరు అన్నా, ఆ వూర్లోని మధుర మీనాక్షి అన్న పేరన్నా ఏదో ఒక తెలియని ఇష్టం. ఉన్నట్లుండి ఒక రోజు తన వొంటరితనం నుండి ఎక్కడికైనా దూరం గా పారిపోవాలనిపించి రైలెక్కి మధుర చేరుకుంటాడు.అక్కడ అమ్మవారిని, చేతి లో చిలుక పట్టుకొని వయ్యారం గా నిలబడిన ఆ అద్భుత సౌందర్య రాశిని , శృంగార మూర్తి ని చూసి మైమరచిపోతాడు. ఆలయం నుంచి బయటకు వస్తుంటే మరో అద్భుత సౌందర్యరాశి కనిపిస్తుంది.గుడి లో దేవత పేరు మీనాక్షి. కథకుడి మనసు దోచుకున్న దేవేరి పేరు కూడా మీనాక్షి నే. ఒకరు విగ్రహం . ఒకరు మనిషి. ఒకరు మాట్లాడరు. ఒకరు మాట్లాడతారు. మానవ రూపం లో వున్న మీనాక్షి ఓ కాలేజీ లో ఫిలాసఫీ లెక్చరర్. అద్వైతి. అంతా మాయ, ఇద్దరు లేరు, వున్నది ఒక్కరే అంటుంది.

ఒక రెండు రోజులు గడిచాక వున్నట్లుండి ఓ సంధ్య వేళ ఎలాంటి మాటలు, ఎలాంటి సంకోచాలు, ఎలాంటి భయాలు, ఎలాంటి ధార్మిక విచికిత్స లేకుండా ఆ ఇద్దరూ ఒకటవుతారు. “ తర్వాత ఏం జరిగిందో మాటల్లో చెప్పలేను.చెప్పటానికి మాటలు లేవు. చాలవు కాబట్టి. అక్కడ ఎంత సేపున్నానో గుర్తు లేదు. ఒక మహదానందం తో తాదాత్మ్యం తప్ప మరొక స్పృహ లేదు.” ఇదీ మీనాక్షి గది నుంచి హోటల్ రూమ్ కి ఎలా వచ్చి పడ్డాడో కూడా తెలియని కథకుడి మానసికానుభవం.

ఈ కథ కి ఇది కాదు ముగింపు. అసలు కథ లో మలుపు ఆ తర్వాత జరుగుతుంది.

కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.
మొత్తం 20 పేజీలున్న ఈ పెద్ద కథ లో చివరి అయిదు పేజీల్లోనే అసలు కథ అంతా వుందనిపించింది నాకు. అప్పటి దాకా జరిగిన కథ అంతా ఒక ఎత్తు గానూ, చివరి అయిదు పేజీ ల్లో రచయత ఈ కథ ద్వారా పైకి చెప్తున్న విషయాలు కాకుండా ఇంకేవో గూఢార్థం తో చెప్పాలనిపిస్తున్నట్లు తోచింది నాకు. ఆ చివరి పేజీల్లో మనకు కథ ఏం అర్థమైంది అన్న దానిని బట్టి మళ్ళీ మొదటి కి వెళ్ళి కథ మొత్తం మొదటి నుంచి చదవాలనిపిస్తుంది. అప్పుడు కథ స్వరూపం మొత్తం మరో రకంగా వేరే కోణం నుంచి అర్థమవుతుంది.

నేను ఆ చివరి ముగింపు, నాకేలా అర్థమైందో చెప్పకపోతే మీరంతా కూడా ఈ కథ చదువుతారని ఆశ. అందుకే అది ప్రస్తుతానికి చెప్పకుండా వదిలేస్తున్నాను.

ముగింపు తో సంబంధం లేకుండా నాకు ఈ కథ లో నచ్చిన మరి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.

గుడి లోకి వెళ్ళి మొదటి సారి అమ్మవారిని చూసినప్పుడు కథకుడి కి కలిగిన అనుభూతి...

“ అమ్మవారు లీలగా తప్ప స్పష్టం గా దృష్టి కి ఆనలేదు. ఆలయం యొక్క గంభీర వాతావరణం నన్ను ఆకట్టుకున్నది. కాలం ఘనీభవించినట్లు, కాల సముద్రం లోతుల్లోకి మునిగినట్లూ, చరిత్ర లో ఏదో వెనక్కి వెళ్ళినట్లు ఒక విశేషమైన భావం మనస్సు ని ఆవరించింది”.

సుదర్శనం గారి మనస్తత్త్వ చిత్రణకు దర్పణం రైల్లో తోటి ప్రయాణీకుల ప్రవర్తన గురించి కథకుడి ఆలోచనల ద్వారా రచయత మనకు చెప్తారు. ఆ సన్నివేశం ఎలా సాగుతుందో చదవండి.

“ సాధారణం గా మనం మనుష్యుల్ని ఒక అర్థం తో చూస్తూ ఉంటాము. వీడు ఫలానా, వీడి తో ఈ పని, ఈమె ఫలానా వారి తాలూకు, ఈమె గుణం యిలాంటిది అన్న దృష్టి వ్యక్తుల్ని గూర్చిన పరిచయం మూలాన, నిత్యమూ కొన్ని ప్రయోజనాల్ని అన్వేషిస్తూ వ్యవహార దృష్టి తో చూస్తుండటం తప్ప, ఆయా వ్యక్తుల్లో వున్న వింతలూ, చమత్కారాలు మనం గమనించం. అదీగాక మనిషి మామూలు మనిషి అన్న భావంతో గాక ఒక యంత్రం, ఒక బొమ్మ, ఒక వింత మృగం అనే దృష్టి తో చూస్తే మరి కొన్ని చమత్కారాలు కనిపిస్తాయి. రైల్లో నా ఎదురుగా ఒక కుటుంబం, అంటే భార్యా భర్తలు, వాళ్ళ ఆరేళ్ళ కూతురు కూర్చున్నారు. చూడగానే వాళ్ళ పరస్పర సంబంధం వగైరాలు అర్థమయినవి. కానీ నా మనస్సు ప్రస్తుతం అనుభవిస్తున్న వింత స్థితి లో వాళ్ళకు ఒకరితో సంబంధం లేదనుకుంటూ వాళ్ళను గమనించాను. ఆ అవగాహన అద్భుతం గా ఉంది. ఎవరికి వాళ్ళు ఒంటరివాళ్ళే. నాలాగ పైన ఏవో శబ్దాలు, చేష్టలూ, వాటికి ఏవో అర్థాల మూలంగా మనస్సు లో ఒక ఎడతెగని భ్రమ! అంతే!భర్త కొన్ని నిముషాలు మరుగుదొడ్డి లోకి వెళ్ళాడు.వెంటనే భార్య హావభావాల్లో మార్పు కనిపించింది. నా వైపు సిగ్గు విడిచి ఆసక్తిగా సాహసం గా పరిశీలనగా చూచింది. అటూ ఇటూ కదిలింది. వస్తువుల్ని సావరిస్తూ కూతురితో ఏదో అన్నది. నాకూ ఏదో వ్యక్తం చేసింది. భర్త తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఆమె మళ్ళీ పూర్వపు ధోరణి లో ‘ అణకువ’ ( subdued) గా స్తబ్దం గా మారింది. భర్త సాన్నిధ్యం ఆమె నిజ స్వరూపాన్ని కప్పిపెడుతూ ఉన్నట్లు నాకు తోచింది. ఇందులో ఆమె భర్తను ఏదో మోసం చేస్తున్నదని కపటం గా ప్రవర్తిస్తున్నదనీ నా ఆరోపణ కాదు.నైతిక వ్యతిక్రమణం ఏమీ లేదు. ఆమె వ్యక్తిత్వం మాత్రం భర్త ఎదురుగుండా ఉండటం వల్ల ఒకానొక ధోరణి లోనూ, లేకపోయినా క్షణాల్లో మరొక ధోరణిలో అంటే స్వేచ్ఛగానూ ఉంటుందనేది నాకు నిశ్చయంగా తెలిసింది. ఆమె లోని ఆ రెండవ ధోరణి , దాని సౌందర్యం ఆ భర్తకు ఎన్నడూ కనిపించదు. ఊహామాత్రంగా కూడా అంతు చిక్కదు. ఇదీ జీవితం లో వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల్లోని వైచిత్రి. కేవలం భార్య భర్తల మధ్యే కాదు. ఒకానొక రామారావు నాకు చాలా సౌమ్యుడిగా ఓర్పు గలవాడు గా మాత్రమే తెలుసు. మరొకరికి రామారావు అంటే ముంగి. లోపలి మనిషి. నమ్మదగినవాడు కాదు. ఈ విభేదాలు ఎందువల్ల వస్తున్నాయి?”

శత వసంతాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న తెలుగు కథ నుంచి మంచి కథల ఎంపిక చేస్తే తప్పక ఉండాల్సిన కథ ఈ “ మధుర మీనాక్షి”.


(ఈ కథను అడగగానే ఓపికగా స్కాన్ చేసి పంపించిన కథారచయత కొత్తపాళీ గారికి కృతజ్నతలు.)
 
Real Time Web Analytics