నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label బైరాగి. Show all posts
Showing posts with label బైరాగి. Show all posts

Monday, February 08, 2010

బైరాగి కథ “ జేబు దొంగ “




కథానుభవం-4

‘ నూతిలో గొంతుకలు ‘ కవిగా ఆలూరి బైరాగి గురించి, చదివినది అర్ధం చేసుకొని తిరిగి మాట్లాడగలిగే స్థితి వచ్చినప్పటినుంచి వింటున్నాను. ఆధునిక్రాంధ్ర కవులల్లో ఉత్తమ కవిగా పేరుపడ్డ బైరాగి గురించి మా ఇంట్లో జరిగిన సాహిత్య చర్చల్లో నాకు అర్ధమైనంత వరకు అతనొక నిరాశావాద కవి అని. అజంతా అంటే మృతువు కవి అన్నట్లే బైరాగి అనగానే ఏకాంతం, నిరాశ స్పురిస్తాయి. ఆ రెండూ ఆయనకిష్టమైనవనీ, ఆయన కవిత్వమంతా వాటి చుట్టూనే తిరుగుతుంటుందని ఒక వాదన. అది అలా నా మనస్సులో ముద్ర పడిపోయింది. కానీ బాగా పెద్దయ్యాక కవిత్వం తీరుతెన్నులు పర్వాలేదు అర్ధమవుతాయి అనుకున్నప్పుడు బైరాగి కవిత్వం చదివితే “ నాక్కొంచెం నమ్మకమివ్వు “ అని అడిగిన ఆ కవి కేవలం నిరాశావాది కవి కాదని తెలిసివచ్చింది. శ్రీశ్రీ శబ్ద సౌందర్యం , కృష్ణశాస్త్రి కున్న సౌకుమార్యం రెండింటికి మధ్యనున్న కవి బైరాగి అనిపించేది. బైరాగి కున్నదల్లా భావసౌందర్యం. ఆ భావానికి తగ్గట్లు కవిత్వ భాషనుపయోగించే మంచి కవి అతను. చిక్కనైన కవిత్వం రాసిన బైరాగి తన కథల్లో కూడా ఆ కవిత్వాన్ని చిలకరించాడు. అతని కథల పుస్తకం “ దివ్య మందిరం “ , నవల “ పాప పోయింది” చదువుతున్నంతసేపు , అతని వచన కవిత్వం అంతా వాక్య వాక్యాలుగా విడిపోయి మళ్ళీ కొన్ని కథలుగా జీవం పోసుకున్నాయనిపించింది.

బైరాగి కథాసంపుటి “ దివ్య భవనం” మొదటి ముద్రణ 1955 లో వెలువడింది. ఆ తర్వాతదొరికిన మరో నాలుగు కథలు కలిపి ద్వితీయ ముద్రణా ఏప్రిల్ 2006 లో వెలువడింది. మొత్తం ఈ సంపుటిలో 11 కథలున్నాయి. బహుశా బైరాగి రాసిన మొత్తం కథలు ఇవే కాబోలు. ముందు నాకు నచ్చిన కథల గురించి కాకుండా నాకు పెద్దగా నచ్చని కథల గురించి చెప్తాను. నాకు బోరు కొట్టించిన కథ పుస్తకం లోని ఆఖరు కథ “ తండ్రులు-కొడుకులు”. ఒక కొడుకు గురించి తండ్రి చేసే త్యాగం. ఇతివృత్తం అంత బలమైనది కాకపోవటం ఒకటైతే, కథనం కూడా విసుగు తెప్పించింది. పుస్తకం చివర్లో వుంది కాబట్టి వద్దనుకున్న వారు చదవకుండా వదిలేయవచ్చు. బైరాగి కథల్లోని గొప్పతనం ఏమిటంటే అర్ధమైనా , కాకపోయినా అన్నీ కథలు చదివింపచేస్తాయి. అర్ధం అయి ఆలోచింపచేయటం కాదు.కొన్ని మనల్ని అర్ధం కానివ్వకుండా కూడా ఆలోచింపచేస్తాయి. ఒక గంట జీవితం, దివ్య భవనం లాంటి కథలు చదవటం పూర్తయ్యాక ఏదో తెలియని ఒక బహుచిక్కనైన భావం మన హృదయమంతా ఆక్రమిస్తుంది. అది బాధో, నిరాశో, దుఃఖమో, ఆర్ద్రమో తెలియని భావం తో మనస్సు నిండిపోతుంది. ఒక తీవ్ర కవితావేశంతో , భావ తీవ్రతతో కవి బైరాగి ఆ కథలు రాశాడు కాబోలు. నేను ఆ కథలు చదువుతున్నంత సేపు నా మానసిక స్థితి అతని భావతీవ్రతను అందుకోలేక పోయిందనిపించింది.

కథ చదువుతుంటే బావుండి, అర్ధం అవుతున్నట్లు మనల్ని భ్రమింపచేసి, అర్ధం చేసుకునేందుకు మనల్ని ఆలోచింపచేసి, చివరకు అసలు కథ ఏమిటో తెలియకుండా ముగింపుకు వచ్చేసే కథే “ దివ్య భవనం”. కవులు కథ రాస్తే ఇలాగే వుంటాయి అని చాలా మంది ఎప్పుడూ చేసే కామెంట్ కి అనుకూలం గా వుంది ఈ కథ. ఈ పుస్తకానికి ఆ కథ పేరే పెట్టడం, అదే పుస్తకంలో మొదటి కథ కావటం వల్ల మనకు అర్ధం కాకపోయినా బహుశా సంపాదకులకు ఈ కథ యొక్క గొప్పతనం ఏదో అర్ధమై వుండి వుండాలనిపిస్తుంది. బైరాగి ఇంకా బతికే వుంటే ఈ ఒక్క కథ గురించే ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఆ కథలో కొన్ని వర్ణనలు ఇలా వుంటాయి.

“ అది ఒక మేడ. మామూలు ఇటుక, సున్నం తో కట్టిన ఇల్లు కాదు. ఇనుము, రాగి మొదలైన లోహాలతో పోతపోసి వుంటారు. అదెప్పుడూ నిశ్శబ్దంలో చీకటి గా నిలబడి వుంటుంది. దాంట్లో దీపాలు వెలగవు కానీ ఆ మేడ నే దేవతల దీపంలా అలౌకిక కాంతితో మెరుస్తూ వుంటుంది. అది గాలితో, శూన్యంతో కట్టబడి వుండి. అందువల్ల దానికి హృదయం లేదు. కానీ అది గాజులాగా పారదర్శకంగా వుంటుంది. మరో విశేషం ఆ మేడకు దర్వాజాలు లేవు. మేడ మెట్లన్నీ నెత్తుటి మరకలతో నిండిపోయినాయి. అసంఖ్యాక మానవుల నిరాశ శిరస్పాలనంతో వారి ఎర్రని జీవ రుధిరం ట్రాగి ఆ మెట్లు చేవ దేలి నునుపెక్కాయి. ఆ మెడలో ఎవరైనా ఎలా ప్రవేశించగలుగుతారో ఎవ్వరికీ తెలీదు. అది ఒక బ్రహ్మ రహస్యం.” ఈ కధ కూడా మనకు ఒక బ్రహ్మ రహస్యం గానో, ఒక బ్రహ్మ పదార్ధం గానో అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఈ కథలో కథకుడికి అప్పుడప్పుడు ఆ మెడలో షేక్స్పియర్, దాస్తోవిస్కీ, కాళీదాసు, బుధ్ధుడు, గాంధీ, క్రీస్తు, అశోకుడు, న్యూటన్, గెలీలియో వంటి వాళ్ళు కనిపించారట. ఎవరైనా ఈ కథ ఎందుకు అర్ధం కాదో, ఎలా అర్ధం కాదో తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవండి.

ఇక కథ, కథనం అర్ధమై నేను ఎంజాయ్ చేయగలిగిన కథలు జేబుదొంగ, బీజాక్షరి, స్వప్నసీమ, దరబాను, కన్నతల్లి, కిమానీ, నాగమణి. బాగా నచ్చింది జేబుదొంగ. ఈ సారి కథానుభవం లో జేబు దొంగ గురించి....

“ ఆద్యంతాలు లేని మహా సముద్రపు హోరు.

మర ఫిరంగుల జోల పాట, మత్తుగల మేలుకొలుపు చీకట్ల కోనేట్ల పసరు నీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అంటూ మొదలవుతుంది ఈ కథ. “అహో! జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” అన్న వాక్యంతోనే ఈ కథ ముగుస్తుంది. దీన్ని బట్టి ఈ కథలో ఆ ఒక్క ముక్తి క్షణం ఎంత మధురమైనదో, ఎంత ముఖ్యమైనదో అర్ధం చేసుకోవచ్చు. ఆ ముక్తి నొసగేది పైన ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉన్నాడో, లేదో తెలియని, నీకు కనిపిస్తాడో, కనిపించడో, సగుణ స్వరూపుడో, నిర్గుణ స్వరూపుడో అయిన దేవుడు కాడు. కేవల మనుష్యుడు. మరీ ఆశ్చర్యకరంగా అతనొక జేబు దొంగ. ఈ కథ చదువుతుంటే ఆశ్చర్యకరంగా, కథ చెపుతుంటే వింతగా, కథ గురించి మాట్లాడుతుంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలు కథే లేని కథ ఇది.

ఇదొక అతి సాధారణ మనిషి ప్రసాదరావు అనుభవం. ఉద్యోగం లేక బాధపడుతూ అవసరముండి డబ్బు అప్పు అడిగితే డబ్బు ఇస్తానో, ఇవ్వనో చెప్పకుండా, ఎంత ఇస్తాడో అసలే తెలియకుండా సాయంత్రం తాను మద్రాస్ వెళ్లిపోతున్నందువల్ల స్టేషన్ కి రమ్మంటాడు ఒక డబ్బున్న పూర్ణచంద్రరావు. అలా మన ప్రసాదరావు తెనాలి స్టేషన్ లో ప్లాట్ ఫారం మీద కూర్చొని ఉంటాడు. చుట్టూ వున్న జనాన్ని పరికిస్తూ, అంచనా వేస్తూ, ఆలోచిస్తూ పూర్ణచంద్రరావు చెప్పే ఏవేవో విషయాల్ని పరధ్యానంగా వింటూ వుంటాడు. రైలు కదిలేముందు పూర్ణచంద్ర రావు నుంచి మన ప్రసాదరావు కి దక్కింది కేవలం అయిదు రూపాయలు. ఆ డబ్బు తీసుకొని రోడ్డు మీద నడుస్తుంటే ఒక 14,15 ఏళ్ళ పిల్లవాడు ఆ డబ్బు కొట్టేస్తాడు. కథ గా అంతే. ఆ పిల్లవాడు డబ్బు కొట్టేసిన క్షణం జీవిత రక్తోజ్వల ముక్తి క్షణం. ఆ క్షణమే కథకు ఆయువు పట్టు.

అసలే డబ్బు లేనప్పుడు దక్కిన అయిదు రూపాయలు మరో దొంగ కొట్టుకుపోతుంటే కోపం, ద్వేషం రాకుండా అతని మీద ప్రేమ , జాలి, కరుణ ఎందుకు కలుగుతాయి? కేవల ఆ ఒక్క క్షణం ఎందుకు ముక్తిని, ఒక జీవితానుభవాన్ని అందించిందో తెలియాలంటే కథ చదవాలి. ప్రసాదరావు మనఃస్థితి , అతని మనో ప్రపంచం అర్ధం కావాలి. అప్పుడు కానీ ఆ జీవిత రక్తోజ్వల ముక్తి క్షణంమనకు కూడా అనుభవంలోకి రాదు. పూర్ణచంద్రరావు గారు డబ్బు ఇవ్వకముందే ప్రసాదరావు కి ఒక ఆత్మానుభవం కలిగింది. తనను తాను భౌతికంగా వేరు చూసి చూసుకున్నాడు. ఉన్న డబ్బు అవసరం, అది లేకపోతే వచ్చే కష్టాలు అవన్నీ కేవలం ప్రసాదరావు అనే దేహానికి సంబంధించినవి గా అతను తన నుండి తనను వేరు చూసి చూసుకున్నాడు. అలా రెండు ప్రపంచాల్లోంచి తనని తాను తెలుసుకున్నాడు.” అందులో ఒక ప్రపంచం రెండో దాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది.ఈ రెండు ప్రపంచాలకూ మధ్య వంతెన లాగా అతని డబ్బు అవసరం. బాహ్య ప్రపంచంతో అతనికి సంపర్కాన్ని కలిగిస్తూ గూడా, ఆ సంపర్కాన్ని తనతో నింపివేసి కల్మష పరుస్తున్నది.” చేతిలో లేని డబ్బు కోసం ఏ మార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత అతనికి జ్నానోదయం కలిగింది. అతనొకానొక ప్రశాంతతతో వున్నాడు. అందువల్లే ఇదివరకేన్నడూ గమనించని విషయాలు అతను గమనించగలిగాడు. “ పూర్ణచంద్రరావు గారు సాయంత్రమల్లా చెప్పిన మాటలూ , అతని ఆలోచనలూ, ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అతిథిలా ఒక్క క్షణం వాకిలి దగ్గర ఆగి, ఒక ఇష్టం లేని వెనక చూపుతో మనస్సులో ప్రతిధ్వనులతో సహా చెరిగిపోయాయి”. జనసందోహంతో కిక్కిరిసిన ఆ ప్లాట్ ఫారం ని వదిలి ఆ రాత్రి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు “ అకస్మాత్తుగా అతను రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స్పర్శను అనుభవించాడు. సముద్రపు నిలువ నీరుకంటే గూడా ఎక్కువ నీలంగా వుండి ఆకాశం. నక్షత్రాలు నల్లని మొఖమల్ మీద బంగారపు పూలలా మెరుస్తున్నాయి. నగరమంతా మెలకువకూ, నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈ పాటికి ఎక్కువ మంది నిద్రపోయి ఉండరు. కానీ అంతా నిద్ర పోదామని ఆశిస్తూ ఉండి ఉంటారు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి పంకిస్తూ ఉండి వుంటారు. ఈ నీడల నాటక రంగం మీద కలల కాంతిలో జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఒక హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతి నిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడేవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళడు. ఇదే రోజు వారీగా చేసే యాత్రాల గమ్యస్థానం” అనుకొంటాడు ప్రసాదరావు. అప్పుడు జరుగుతుంది ఆ సంఘటన. ఒక 15 ఏళ్ల పిల్లవాడు జేబులోంచి ఆ మిగిలిన అయిదురూపాయలు లాక్కున్నాడు. ఇక ప్రసాదరావు కి ఈ లోకంలో ఏ ఒక్క బంధం లేదు. ఆ పిల్లవాడి రెండు కళ్ళు రెండు బ్యాటరీ లైట్ల కాంతిలా, జాలిని, భయాన్ని, ఆశ్చర్యాన్నీ, చెప్పతరం గాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ అతని నిర్దాక్షిణ్యాన్ని, క్రూరత్వాన్ని దూషిస్తున్నట్లు, నిందిస్తున్నట్లు , చూస్తూ, అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. “ ఆ ఒక్క క్షణం అతనికి విశ్వరూపసందర్శనానుభవం కలిగింది. తన అల్పత్వం అర్ధమైంది. ఆ కుర్రవాడితో అతను సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఈ విశాల భూతలం మీద కళ్ళు తెరిచిన మొట్టమొదటి రోజు నుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. ఈ భూమి మీద తను బతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు”.

అహో జీవితపు రక్తోజ్వాల ముక్తి క్షణం స్వానుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక్క ప్రసాదరావు దా? బైరాగి దా? కథ చదివిన వారందరికినా?

“ఒక్క క్షణం రాత్రి పూట వచ్చిన వాణ్ణి. నీ వాకిట ముందు ముగ్గులు పెట్టి పోయిన వాణ్ని. నీవు నిదురపోతున్నప్పుడు చల్లగా, మెల్లగా, తల్లిలా వచ్చి నిశ్శబ్దంగా నీ నొసలు ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిన వాణ్ణి చూచావు. ఒక్క క్షణం అతడు నీ నీరసతధ్యాల చింకిబట్టలు విప్పి దూరం గా పారేసి, స్వీయ తేజస్సుతో నిజ స్వరూపంతో నిలబెట్టాడు. బహుశా నీవతన్ని మళ్ళా చూడలేవేమో? అయితేనేం? అతడు ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాడు. నీ దైనిక జీవితపు భయంకర నిద్రలో అతని ముద్దుల స్పర్శ సహస్ర రూప రసగంధ పులకిత స్వప్నా సుమాలుగా వికశించి, మానవుణ్ణి మానవుణ్ణిగా చేయకలిగిన కళాసాహిత్యాలు, వేదాంత విజ్నానాలు సృష్టిస్తుంది. బ్రతుకుల ఊబిలోంచి నిన్ను పైకెత్తుతుంది. దేవతుల్యుణ్ణిగా చేస్తుంది”. అంతే.అదీ బైరాగి కున్న నమ్మకం. ఈ కథ చదివాక మనకు కూడా ఒక్క క్షణం ఈ బతుకు, అనేకానేక భౌతిక, మానసిక అవసరాలు అన్నీ నిమిత్తమాత్రంగా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్షణం అందరి బతుకుల్లోకి అంత సులభంగా చొచ్చుకురాదు. ఒక ప్రసాదరావు కో, ఒక బైరాగి కో తప్ప. బైరాగి తాత్త్విక చింతనకు ఈ కథ ఒక తార్కాణం. ఇది బైరాగి మాత్రమే రాయగలిగిన కథ అనిపిస్తుంది.

కల్పనారెంటాల

Thursday, February 04, 2010

బైరాగి “ పాప పోయింది”



బైరాగి నవల “ పాప పోయింది “ పుస్తకం గురించి ఇలాంటి సందర్భం లో రాస్తానని వూహించలేదు. విజయవాడ లో చిన్నారి వైష్ణవి అతి కిరాతకంగా హత్య కు గురికావటం, ఆ దుఃఖంతో తండ్రి మరణించిన వార్తా కథనాలు చదివాక మనస్సు స్థబ్దుగా వుండిపోయింది. ఒక్కోసారి మనస్సు చలించటానికి కూడా శక్తి సరిపోక బాధతో రాయిలా గడ్డ కట్టుకుపోతుంది. మనలో చాలామంది పరిస్థితి ఇప్పుడు ఇదే. ఈ దురాగతం పట్ల జ్యోతి, సుజాత, భరద్వాజ, ఇంకా అనేక మంది బ్లాగర్లు తమ ఆవేదనను అక్షరరూపంలో ప్రకటించారు. “ పాప పోయింది “ దుఃఖ తత్త్వం నుండి తేరుకుంటుంటే ఈ వార్త మళ్ళీ ఆ గాయాన్ని రేపింది. ఒక పాప పట్ల ఓ తండ్రి కుండే అపరిమితమైన ప్రేమను బైరాగి మాటల్లో మళ్ళీ ఒక్కసారి అందరూ చదివితే బాగుండుననిపించింది. అందుకే ఈ సంక్షిప్త పరిచయం.

“ She who was born and is now dead
And she who is not born and yet is dead
Has left my heart in sorrow, wandering from door to door!”
“ Cordelia!cordelia! stay a while!”
“ Look, look she breaths, she lives! “


( షేక్స్పియర్ కింగ్ ఆఫ్ లియర్ నుంచి...)

బైరాగి కథల సంపుటి “ దివ్య భవనం” చదివిన తాలూకు మత్తు లో వుంటూనే అతని నవల “ పాప పోయింది “ చదవటం మొదలుపెట్టాను. బైరాగి ఈ నవల బావుంటుంది అని వినటమే కానీ వివరాలు తెలియవు. మొన్నీమధ్య పుస్తకం.నెట్ లో బైరాగి కథల్ని మెహర్ సమీక్షించినప్పుడు శ్రీనివాస్ అనే రీడర్ పెట్టిన కామెంట్ ద్వారా ఈ పుస్తకం గుర్తుకు వచ్చింది. బైరాగికి ఓ పాప వుండేదని, ఆ పాప చనిపోయాక బైరాగి ఈ నవల రాశాడని అతను చెప్పటం తో ఒక విధమైన ఆసక్తి కలిగింది. బైరాగి కవిత్వం, కథల తీరూ తెలిసిన తర్వాత, ఈ పుస్తకం రచయిత స్వానుభవం నుండి వెలువడిన రచన అనటంతో ఇక క్షణం ఆలస్యం చేయకుండా చదవటం మొదలెట్టాను. పుస్తకం టైటిల్ ద్వారా పుస్తకం లో ఏం జరుగుతుందో ముందో తెలిసిపోవటం వల్ల చాలా మందికి చదవాలన్న ఆసక్తి వుండదు. కానీ, ఈ పుస్తకం అందుకు పూర్తి మినహాయింపు. ఆపకుండా ఏకబిగిన చదివించే గుణం వున్న ఈ పుస్తకాన్ని కావాలనే ఆగి, ఆగి, ఆపి, ఆపి చదివాను. ఏకధాటిగా చదవాలని ఒక పక్కా, చదవలేక మరో పక్కా పడిన బాధ వర్ణనాతీతం. ఆ నవల ఎంతలా చదివించిందంటే నేను పూర్తిగా అందులో లీనమైపోయాను. నవల నేను బస్ లో ప్రయాణం చేస్తూ చదివేదాన్ని. ఒక సన్నివేశం లో కళ్ళనీళ్ళు ఆగలేదు. నా బస్ ప్రయాణం అరగంట చదివి ఆపేసే దాన్ని. సగంలో ఆపబుద్ధి అయ్యేది కాదు. కానీ బలవంతంగా ఆపాను. ఎందుకంటే బైరాగి బాధ అనుభవంలోకి వచ్చేసేది. ఒక పాప మీద ఒక తండ్రికి అంత ప్రేమ వున్నట్లు చదువుతుంటే నేనే ఆ పాపనైతే ఎంత బాగుండుననిపించేది. అంతలా ఏ తండ్రి అయినా తన పాప ను ప్రేమించగలడా అని ఒక చిన్న అనుమానం పొడసూపేది. అంత ప్రేమను పొందగలిగినందుకు ఆ పాప మీద, అంత ప్రేమ ను ఇవ్వగలగిన ఆ తండ్రి పై కూడా ఈర్ష్య కూడా పడ్డాను.

ఈ పుస్తకం గురించి రాయటానికి, విశ్లేషించటానికి ఏమీ లేదు. నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా, నిస్సత్తువుగా, నిర్ణిద్రంగా, నిర్నిమిత్తంగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే.

ఈ పుస్తకం ప్రధమ ముద్రణ 1985 లో జరిగింది. అప్పటికి బైరాగి చనిపోయారు. బైరాగి బతికుండగా ఈ నవల ఏ పత్రికలోనైనా ప్రచురితమైందో, లేదో నాకు తెలియదు. పుస్తకం ముఖ చిత్రం కూడా భిన్నంగా వుంది. బైరాగి ఫోటో నే కవర్ పేజీ. పేజీ పైన బైరాగి పేరు. పేజీ చివర ఒక కొసాన పాప పోయింది అనే అక్షరాలు.
ఆవుల సాంబశివరావు గారు ఈ పుస్తకానికి రాసిన చిన్న ముందుమాట యథాతధంగా …..

“ పునరుజ్జీవనం “


“ ఇక్కడ ఏదీ మరుపులో మరుగు పడదు! ఏదీ చనిపోదు. రక్తా,శ్రుపిచ్చిలమైన మార్గాన మానవుడు తనను తాను మించి అధిగమించి పోతూ వుంటాడు.

నేనే పునరుజీవనాన్ని! నేనే జీవనాన్ని! నన్ను నమ్మినాతడు, చనిపోయినప్పటికీ మళ్ళా జీవిస్తాడు. జీవించి వుండగా నన్ను నమ్మినాతడు ఎన్నటికీ చనిపోడు”.

ఇవీ ఈ రచన ముగింపు మాటలు. ఇది ఇందులో ఆలూరి బైరాగి ప్రవచించిన తత్త్వం .

బైరాగి కి పునరుజ్జీవనం మీద ప్రగాఢమైన నమ్మకం ఉన్నట్లున్నది. అయితే ఆ పునరుజ్జీవనం మరో జన్మ కాదు. చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి పుట్టడం కాదు. కొన్ని అనుభవాలతో క్రుంగి, కృశించిపోయిన మానవుడు, తనకు తానుగా నూతన తేజస్సును సంతరించుకొని, స్థైర్యాన్ని తిరిగి సంపాదించుకొంటాడు. “రక్తా,శ్రుపిచ్చిలమైన మార్గాన మానవుడు తనకు తాను మించి, అధిగమించి పోతూ వుంటాడు” అంటాడు బైరాగి. “ పునరుజ్జీవనం “ తో అనిపిస్తాడు. “ నేను జీవనాన్ని. నన్ను నమ్మినాతడు చనిపోయినప్పటికీ మళ్ళీ జీవిస్తాడు” అని. అయితే మానవునికి అందులో, అనగా పునరుజ్జీవనం లో నమ్మకం ఉండాలి. అనగా తనను తాను పునర్నిర్మించుకోగలననే విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసమే ఉంటే ఎన్నటికీ చనిపోడు.

ఈ చనిపోవడం, పునరుజ్జీవనం పొందడం భౌతికంగా కాదు. దానికి జన్మలతో సంబంధం లేదు. ఈ జన్మలోనే మానసికంగా చనిపోయే వారు చాలా మంది ఉంటారు. మనిషికి నూతన జీవితాన్ని కల్పించుకోగలననే నమ్మకమే ఉంటే, చితికిపోయిన తన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించుకోగలడు. జీవించినన్నాళ్ళు, జీవచ్ఛవంగా కాక, మనిషిగా బతకగలడు. బ్రతుకును సార్ధకం చేసుకోగలడు.

ఈ భావానికి రూపకల్పన చేస్తూ బైరాగి ఈ రచన ఎప్పుడు చేశాడో నాకు తెలియదు. అందుకు పరిశోధన జరిపే సామాగ్రి నా వద్ద లేదు. ఆ మాట వరసకు వస్తే, అంతటి పరిశోధన జరపడానికి ఎంత మంది తెలుగు రచయితలను గురించి ఆ సామాగ్రి వుంది?

ఈ ఆలోచనల్ని బైరాగి తర్వాత మార్చుకున్నాడా? నేను చదివినంతలో , చివరి వరకూ దాన్ని మార్చుకున్నట్లు లేదు. మనిషి లో నమ్మకం పోగొట్టుకోకుండానే బైరాగి చనిపోయాడు.
బైరాగి ని కవిగా చాలా మంది ఎరుగుదురు. తెలుగులో వచన రచయితగా చాలా మంది ఎరగరు. నేనూ ఎరగను. ఆయన వచన రచన నేను చదవడం కూడా ఇదే మొదలు.

ఇందులో కథ చాలా చిన్నది. రామారావు కు కన్నకూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితం గా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా నిస్పృహలు అలముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు . ప్రేమించగల హృదయం. పోయిన తన పాప లాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు జేర్చుకుంటాడు. ఎండి, మోడై పోయిన తన బ్రతుకు కు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు.

ఈ సంఘటనల చుట్టూ తన తాత్త్విక చింతనను అల్లడంలో బైరాగి కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ వుంటుందో చూడదలుచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్త్విక రచన.

ఇటువంటి రచనను ప్రచురించడం సాహసమే. అయితే మిత్రుడు శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు కు సాహసం సహజ లక్షణం. తెలుగు విద్యార్ధి ప్రచురణలు ఆ లక్షణానికి మచ్చు తునకలు. ఆ మచ్చు తునకలలో ఈ గ్రంధం ఒక మెరుపు.
మనిషి ని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్నులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.

ఆవుల సాంబశివరావు
హైదరాబాద్,24-12-1984.




( ఈ టపా వైష్ణవికి అంకితం)




 
Real Time Web Analytics