నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, December 14, 2011

ప్రేమ-పెళ్ళి ..... ఒక తన్హాయి!

ప్రేమ ఎలా పుడుతుంది? ఎందుకు పుడుతుంది?’—కొన్ని వందలేళ్ళుగా మానవులను వేధిస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం తెలుసుకోవటం కోసం నిరంతర అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. పాశ్చాత్య సమాజాలలో ప్రేమ-పెళ్లి రెండింటిని కలిపి చూడరు. కానీ సంప్రదాయానికి పెద్ద పీట వేసే మన భారతీయ సమాజంలో రెండూ ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ప్రేమ-పెళ్లి కి ముందే కలగాలా? పెళ్ళి తర్వాత ఇతరులను ప్రేమించటం తప్పా?జీవితాంతం ప్రేమ కోసం ఒక భాగస్వామి పైనే ఆధారపడి ఉండాలా? –ఇలాంటి వాటి గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పెళ్ళి తర్వాత కలిగే ప్రేమ-దానివల్ల ఏర్పడే మానసిక సంఘర్షణల నేపథ్యంగా కల్పనా రెంటాల రాసిన వెబ్ నవలతన్హాయి”. నవల లోని ఆసక్తి కరమైన ఒక భాగం ....

"సారీ, నేను ఇలా మాట్లాడుతున్నందుకు. మీరిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉంటారా? నాకెందుకో అతని బిహేవియర్ చూస్తే అతను నీకు బాగా క్లోజేమో అనిపించింది. మీ ఇద్దరి మధ్యా అంత క్లోజ్‌నెస్ ఉందా? నిన్న నువ్వెక్కడ ఉంటే అక్కడ నీ వెనకాలే తిరిగాడు. నువ్వు వంటింటిలో ఉన్నా కూడా నీ వెనకే వచ్చేశాడు.''

కౌశిక్ గురించి చెప్పేటప్పుడు, అడిగేటప్పుడు అతని స్వరస్థాయి పెరగటాన్ని, అందులో వినిపిస్తున్న కోపాన్ని పసిగట్టింది కల్హార. అలాగే కౌశిక్ తనకు క్లోజ్ అని చెప్పినా మళ్లీ మీ మధ్య ఉన్నది ఎలాంటి దగ్గరతనం అని ఆ ప్రశ్నను తిప్పి అడగటాన్ని కల్హార గమనించింది, అర్థం చేసుకుంది.

"క్లోజ్‌నెస్ అని నువ్వు ఏ అర్థంతో అడుగుతున్నావో కానీ, ఆ క్లోజ్‌నెస్‌కి ఒకే అర్థం ఉండదు చైతూ. కొందరి దృష్టిలో క్లోజ్‌నెస్ అంటే శరీరానికి దగ్గరగా రావడం. కొందరు మనసుకి దగ్గరగా వస్తారు. అతను నా మనసుకి దగ్గరగా వచ్చాడు. కానీ అది మన జీవితాన్ని, మనిద్దరి మధ్య రిలేషన్‌ని దెబ్బతీస్తుందని నేననుకోను. ఇక అతని ప్రవర్తన అంటావా? అందరూ ఒకేలా బిహేవ్ చేయరు. మృదులలా నేను బిహేవ్ చేస్తానా? నాలాగా మృదుల బిహేవ్ చేస్తుందా? ఇదీ అంతే. అతను కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాడు. నువ్వు పెద్దగా వంటింటిలోకి రాకపోవచ్చు. అతనికి కొంచెం చొరవ ఎక్కువ కావచ్చు. అది అతని వ్యక్తిత్వంగానే చూడాలి కానీ...తప్పుగా ఎందుకు అనుకోవడం? ఒక్కసారి చూస్తేనే మనుష్యులు పూర్తిగా అర్థం కారు. అయినా...మనమధ్య ఇక వాళ్ల చర్చ అనవసరం కూడా'' స్పష్టంగా చెప్పింది కల్హార.

నీ స్నేహాన్ని కట్ చేసేసుకో'' తన నిర్ణయాన్ని చెపుతూ ఆమె మొహం వంక చూశాడు చైతన్య.

"అయినా నువ్వు ఇలాంటి కొత్త కొత్త స్నేహాల్లోకి వెళితే నాకెందుకో భయంగా ఉంటుంది కల్హారా.ఈ కొత్త పరిచయాల పట్ల నువ్వు నాకు దూరమైపోతున్నావేమో అనిపిస్తుంది. ఎవరు ఎలాంటి వారో తెలియకుండా ఈ కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పరచుకోవడం మనకిప్పుడు అవసరమా?'' తన అభిప్రాయాన్ని నెమ్మదిగా చెపుతూ 'నన్ను వదిలి వెళ్లొద్దు, నాకు దూరం కావద్దు'అన్నట్లు కల్హారకి దగ్గరగా జరిగి ఆమె ఒళ్లో తల పెట్టుకున్నాడు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ చేతివేళ్లను, ఆమె చేతిలోని రేఖల్ని చూస్తూ ఆమె ఏం చెప్తుందా అని ఆమె వంక చూస్తూ ఉన్నాడు చైతన్య.

"ఓకే. అలాగేలే. వాళ్లు ఎలాగూ వెళ్లిపోతున్నారు. ఇంక కలిసేది, మాట్లాడేది ఉండదు... నువ్వు ఏవేవో ఊహించుకుంటూ ఆలోచించి బాధపడకు''

ఏం కాలేదు, అంతా బాగానే ఉంది, బాగానే ఉంటుంది అన్నట్లు కల్హార మాట్లాడటంతో చైతన్యకి ఒక విధమైన, భద్రమైన ఫీలింగ్ అనిపించింది. అదే సమయంలో అతనితో నేను ఇక మాట్లాడను, అతనితో స్నేహం మానుకుంటాను అని మాత్రం కల్హార చెప్పలేదన్న విషయాన్ని కూడా అతను గమనించాడు.

ఒక్క క్షణం అంతా మామూలు పరిస్థితికి వచ్చేసినట్లు అనిపించినా కౌశిక్ ఆమె మనసుకి దగ్గరగా వచ్చి ఉంటాడన్న ఊహే అతని హృదయంలో మళ్లీ మళ్లీ శూలంలా గుచ్చుకొని బాధపెడుతోంది. మరో పురుషుడు ఆమె మనసులో ఉన్నాడన్న విషయం అర్థమయ్యేసరికి అతనిలో ఒక ఆవేశం, కోపం, కల్హార నమ్మకద్రోహం చేసిందన్న బాధ, ఇంకా అనేక భావాలు ఒకేసారి కలిగాయి. తానింక అసలేం జరగనట్లు, తనకేం తెలియనట్లు, సౌమ్యంగా, మృదువుగా మాట్లాడాల్సిన పని లేదనిపించింది చైతన్యకి. వద్దులే వదిలేద్దాంలే అని అనిపిస్తోంది కానీ లోపలి బాధని, కోపాన్ని ఎలాగోలా కల్హార ముందు వ్యక్తం చేయాలని, ఆమె నుంచి ఇంకా ఏమేం జరిగిందో తెలుసుకోవాలని అనిపించింది చైతన్యకి.

ఆమె ఒళ్లో నుంచి లేచి కూర్చొని సూటిగా ఆమె మొహంలోకి చూస్తూ తన మనసుని మెలిపెట్టి బాధపెడుతున్న ఆ విషయాన్ని మళ్లీ మరోరకంగా అడిగాడు. ఆమె నుంచి ఇంకేదైనా, ఇంకో రకమైన సమాధానం వస్తుందేమో అని మళ్లీ మళ్లీ ఆమె వద్దన్నా అతను గుచ్చి గుచ్చి అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడగటం మొదలుపెట్టాడు.

"అతను దగ్గరగా వచ్చినది కేవలం నీ మనసు వరకేనా? లేక నీ శరీరానికి కూడా దగ్గరయ్యాడా?'' అప్పటివరకూ అతన్ని బాధించి, అతని మనసుని పీల్చి పిప్పిచేసిన ఆ అనుమానాన్ని అతను బయటపడి అడిగేశాడు. "నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోకుండా, పట్టించుకోకుండా నేనేం చెప్పలేదో అది మాత్రమే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నేను ముఖ్యం అనుకున్న విషయాన్ని చెప్పాను నీకు. అతను నా మనసుకి దగ్గరగా వచ్చాడని. కానీ నువ్వు అతను నా శరీరానికి ఎంత దగ్గరగా వచ్చాడో తెలుసుకోవాలనుకుంటున్నావు. శరీరాలు దగ్గరయ్యాయా లేదా అన్నది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అయినా అతను నా మనసుకి దగ్గరగా వచ్చాడు అంటే అర్థం నువ్వు నా నుంచి దూరమైపోయావని కాదు చైతూ! దయచేసి అర్థం చేసుకో''

కల్హార వీలైనంత మృదువుగా అతనికి ఉన్న పరిస్థితిని చెప్పాలని ప్రయత్నించింది.

"నాకు సూటిగా సమాధానం చెప్పు కల్హార. " ""Did you sleep with him or not.'' "No, I did not, is that clear?''

అతను పదే పదే అదే ప్రశ్న వేస్తుంటే కల్హారకి వినటానికి, మాట్లాడటానికి కూడా చికాకుగా అనిపించింది.

ఆమె లేదు అని చెప్పగానే చైతన్యకి ఇదీ అని చెప్పలేని రిలీఫ్. ఆమె ఆ సమాధానం చెప్తున్నప్పుడు అతను ఆమె మొహం వంక చూశాడు. ఆమె నిజమే చెప్తున్నది అనిపించింది అతనికి.

శరీరాలు కలవటం కంటే కూడా మనసులు కలవటం మరింత ముఖ్యమైనదని చైతన్యకి ఎందుకు అర్థం కావటం లేదో తెలియక చైతన్య మొహంలో మారే భావాల వంక చూస్తూ ఉండిపోయింది కల్హార.

"నువ్వు నా దగ్గర సంతోషంగా లేవా? నేనంటే నీకు ప్రేమ లేదా? కేవలం పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాతో కలిసి ఉండాలను కుంటున్నావా?'' చైతన్య అడుగుతున్న ప్రశ్నల బట్టే అతని మనఃస్థితి కల్హారకి అర్థమయింది.

" అలా ఎందుకనుకుంటున్నావు? నేనిక్కడ నా ఇష్టపూర్వకంగానే ఉన్నాను. నా జీవితంలోకి ఇంకొక పురుషుడో, నీ జీవితంలోకి మరో స్త్రీనో ప్రవేశిస్తే అది నాలోనో, నీలోనో ఒక లోపం వల్ల అసంతృప్తి వల్ల కానే కాదు. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే వాదన లేనే లేదు.

మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి మూడో వ్యక్తి మీద ఒక ఆకర్షణో, లేదా ఇంకేవో మానసిక, భౌతిక ఉద్వేగాలు, అనుభూతులు కలగకుండా ఏదో రెడ్‌లైట్ పడ్డట్లు ఆగిపోవు. అయితే అందరూ ఆ ఫీలింగ్స్‌ని ఆధారంగా చేసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తారా? లేదా? అనేది ఒక్కో వ్యక్తిని బట్టి మారవచ్చు. కొంతమంది తమ ఫీలింగ్స్‌ని తెలుసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. కొందరు ఆ ఫీలింగ్స్ ఉప్పెనలో వెల్లువలా కొట్టుకుపోయి వాటికనుగుణంగా ప్రవర్తించవచ్చు. అది ఒక్కటే తేడా. అంతేకానీ అసలు ఆ ఫీలింగ్సే కలగవు, కలగబోవు అని చెప్పటం ఎవరిని వారిని, ఎదుటివారిని కూడా మోసం చేయటమే అవుతుంది. అలాంటి ఫీలింగ్స్ ఇవాళ నాకు కలగవచ్చు. లేదా రేపు నీకు కలగవచ్చు. అది అర్థం చేసుకొని కలిసి నడవటమే మనం ఎంచుకున్న ఈ పెళ్లి అనే మార్గంలో చేయవలసింది.

ఆ అనుభూతుల నుండి, ఆ ఆకర్షణల నుంచి దూరంగా జరగాలనుకున్నప్పుడు చాలామంది తమ జీవన సహచరులతో దాని గురించి చర్చించలేకపోవచ్చు. ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటారో అన్న భయం, అపార్థం చేసుకుంటే వచ్చే పరిణామాలు, ఎదుటి వ్యక్తి మనసు గాయపడుతుందన్న సానుభూతి ఇన్నీ ఉంటాయి ఆ దాచుకోవడం వెనక. అలాంటి ఫీలింగ్స్‌ని, ఆకర్షణల్ని కూడా ఒకరికొకరు షేర్ చేసుకొని మాట్లాడుకోవాలని ఈ తరం జంటలు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే pandora boxని ఓపెన్ చేయటమే అని ఇప్పటికీ ఎక్కువ శాతం జంటలు భయపడుతూ ఉండొచ్చు చైతూ!

నేను నీతో కలిసి ఉండాలనుకుంటోంది కేవలం నిన్ను పెళ్లి చేసుకున్నందుకే కాదు. నీతో కలిసి బతకటం మొదలుపెట్టాక ఒక సహచరుడిగా నీ మీద నాకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఈ క్షణంలో ఉన్నట్లు అనిపించకపోవచ్చు. కానీ అది రేపు కూడా ఉంటుందని అనుకుంటున్నాను.

నా మీద ప్రేమ వుందన్నావు. కానీ ఆ ప్రేమ ఉన్నప్పుడు మరోవ్యక్తి మనసుకి దగ్గరగా ఎలా వస్తాడు? ఎలా రాగలుగుతాడు? ప్రేమ ఒకరి మీదనే ఉంటుందికానీ...ఎంతమంది కనిపిస్తే అంతమందిని ఏకకాలంలో ప్రేమించటం సాధ్యమవుతుందా? ఏకకాలంలో ఎవరు ఎంతమందిని ప్రేమించగలరు అన్నది వాళ్ల వాళ్ల దృష్టిలో ప్రేమ అనే దాని మీద ఉన్న అవగాహనను బట్టి ఉంటుందేమో! ప్రేమ అనేది ఎప్పుడూ ఒక స్థిరమైన పదార్థమో, భావమో కాదు. ప్రేమ కేవలం ఒక వ్యక్తి మీదనే పుట్టి అక్కడే మిగిలిపోదు. ప్రేమ ఈ కారణాల వల్లనే పుడుతుంది అని కూడా ఎవరూ చెప్పలేరు. ప్రేమ రకరకాలుగా, రకరకాల స్థాయిల్లో భిన్న భావాలుగా వుంటుంది.

మనకు మన జీవితానికి కావాల్సిన ప్రేమ ఒక్కసారి, ఒకేసారి, ఒకే వ్యక్తి దగ్గర దొరుకుతుందని నేననుకోను. ఒక్కనేను, ఒక్క నువ్వు అంటూ ఉండము. ఒక్క నేనులో అనేక నేనులు కలిసి ఉంటాము. నీతో నేను, మేఘనతో నేను, నా స్నేహితులతో నేను... ఇవన్నీ కలిపి ఒక సంపూర్ణ నేను. నువ్వు నాకు , నేను నీకు పూర్తిగా, సంపూర్తిగా, సంపూర్ణంగా కావాలని ఆశపడటం, కోరుకోవటం కేవలం ఒక భావన. అది సాధ్యపడుతుందా, అలాంటిది అసలు ఒకటి ఉంటుందా? అనేది నాకైతే అనుమానమే! ఆగింది కల్హార.

నువ్వు చెప్పేది వింటూ ఉంటే అసలు ఇన్నాళ్లు మనం ప్రేమగా ఉన్నామా? లేక అలా ఉన్నామని భ్రమపడ్డామా? మన పెళ్లి చుట్టూ ఉన్నది కేవలం ఒక బాధ్యతో, ఒక సామాజిక అంగీకారమో మాత్రమేనా? అది తప్ప... మన మధ్య ఇంకేమీ లేదా? నువ్వు ఇన్ని చెప్పాక నాకు మన రిలేషన్‌షిప్ మీదనే సందోహం వస్తోంది.'' అతని మొహంలో విసుగు, చిరాకు, కోపం, ఏవో తెలుసుకోకూడనివి తెలుసుకున్న ఫీలింగ్... అసలు ఇవేమీ తెలియకపోతే బావుండేదన్న ఒక భావం.

"నువ్వు కూడా నిజం చెప్పు చైతూ, మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించామా? మన మధ్య ప్రేమ వుందో, లేదో చెక్ చేసుకున్నామా? మన ముందు తరం వాళ్లు కూడా ప్రేమ లేనప్పుడు పెళ్లి అర్థరహితం అనుకున్నా, మనం మాత్రం ప్రేమ ఉందో లేదో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు అసలు ఈ పెళ్లి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం?.ఏం పొందుతున్నాం? మన దాంపత్యం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు... ఇవన్నీ మనం మాట్లాడుకున్నామా? ఆలోచించామా?లేదు... పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, పెద్దవాళ్లు అన్నీ చూసి ఈ సంబంధం బావుంటుంది అన్నారు, చేసేసుకున్నాం. నా దగ్గర నువ్వు , నీ దగ్గర నేను చూసింది ఏమిటి? చదువు, అందం, కులం, గోత్రం, హోదా, జాతకాలు...ఇవే కదా.

పెళ్లికి ఇన్ని చూసుకుంటాం కానీ అసలు మన మనసులు, మన అభిప్రాయాలు, జీవితం పట్ల మన దృక్పథాలు ఇవి మాట్లాడుకున్నామా? లేదు... పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక కలిసి బతకటం మొదలయ్యాకే...ఎన్నో సందర్భాలు... సన్నివేశాలు... సంఘర్షణలు వచ్చాకే...మనం ఒకరికొకరం తెలుస్తాం. అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఆ సందర్భంలో వున్నాం. ఆ దారిలో ఉన్నాం.''

" అంటే ఇప్పటి వరకు మన మధ్య ప్రేమ లేకుండానే ఇంత దూరం వచ్చామా?'' అడిగాడు చైతన్య కొంచెం అనుమానంగా.

"ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఇష్టం, అభిమానంతోనే ఈ జీవన ప్రయాణం మనం మొదలుపెట్టి ఉండొచ్చు. పెళ్లి జరిగిపోయాక...ఇక ప్రేమ అనేదాని గురించి మనం అసలు పట్టించుకోకపోయి ఉండొచ్చు. కాలం గడిచేకొద్దీ అనేకానేక కారణాల వల్ల మన మధ్య ఉన్న ఆ ప్రేమ మరుగున పడిపోయి ఉండొచ్చు లేదా మన మధ్య అలాంటిది ఒకటుండేదిఅన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకోకుండా ఒక రొటీన్ జీవితం గడిపేస్తూ ఉండొచ్చు. బాధ్యతల ఒత్తిడిలో లేదా, ఒకరిపట్ల ఒకరికి ఆసక్తి తగ్గిపోవడం వల్లనో, అనేక కారణాల వల్ల అది జరిగి ఉండొచ్చు. అదే జరిగి ఉంటే అందుకు ఇద్దరమూ బాధ్యులమే.

ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత కూడా ఒక కొత్త వ్యక్తి పరిచయమైనప్పుడు, ఆ స్నేహం నుంచి, వాళ్ల పట్ల మన ఫీలింగ్స్‌ని బట్టి మనకు మనమేమిటో అర్థం కావచ్చు. అది తప్పో, నేరమో కాదు. అదొక అనివార్యత. అది మనలో ఇంకా ప్రేమించే గుణం ఇంకిపోకుండా సజీవ జలధారగా మనకే తెలియకుండా మిగిలి ఉన్నదనటానికి ఒక నిదర్శనం మాత్రమే అనుకుంటాను నేను.

ఈ జీవితాన్ని, ఈ బంధాన్ని, ఈ సహజీవనాన్ని ఎప్పటికప్పుడు ప్రేమతో రీఛార్జ్ చేసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా మనం ఒక హడావిడి జీవితం గడిపేస్తున్నామేమో!

కొన్ని కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, కొన్ని చిన్న చిన్న ఆకర్షణలు మన జీవితంలో ప్రేమని రీఛార్జ్ చేసి వెళ్తాయి. అలాగని వాటి కాలపరిమితి తాత్కాలికం అనుకోనక్కర్లేదు. కానీ అవి ఎందువల్ల మన జీవితంలోకి ప్రవేశించాయో ఆ పని పూర్తి చేసి వెళ్లిపోతాయి.''

'వెళ్లిపోతాయి' అన్న వాస్తవాన్ని గుర్తించి చైతన్యకి చెప్తున్నప్పుడు ఆమె కంఠం వణికింది. ఆమె కళ్లల్లో సన్నగా నీళ్లు తిరిగాయి. అది గమనించిన చైతన్యకి కల్హార మనసులో ఇప్పటివరకూ ఏం జరిగి ఉంటుందో అర్థమయినట్లు అనిపించింది. అది అతన్ని బాధ పెట్టింది. అతని మనసుని గాయపరిచింది. కానీ అదే సమయంలో అతనికి తన కల్హార తన కోసం... కేవలం తన కోసమే...తనతోనే ఉండిపోయిందన్న విషయం అర్థంకాగానే ఆమె మీద మరింత ప్రేమగా అనిపించింది. ఆమెను దగ్గరకు తీసుకొని ఒక విధమైన కాంక్షతో, తమకంతో ముద్దు పెట్టుకున్నాడు. తన మనసులోని బాధను, సంఘర్షణను ఎంతో కొంత చైతన్యకి చెప్పగలిగానన్న సంతృప్తితో ఆమె కూడా అతన్ని తిరిగి ముద్దాడింది.

ఆ దగ్గరితనంతో ఇద్దరికీ తమ మనసుల్లో నుంచి ఏదో పెద్ద భారం తీరినట్లు అయింది. తమకు సంబంధించినదేదో తమకే మిగిలి ఉందన్న ఒక తృప్తి.

కానీ కల్హార మనస్సు లోతుల్లో... ఒక చిన్న అణుపరిమాణంలో ఇదీ అని చెప్పలేని ఒక సన్నని బాధ. చైతన్యతో మాట్లాడుతున్నంతసేపూ ఆమెకు అంతర్లీనంగా కౌశిక్ గుర్తొస్తూనే ఉన్నాడు.

తాను వదిలి వచ్చాక, తనను వదిలి వెళ్లాక కౌశిక్‌కి ఏం జరిగిందో, కొద్ది మైళ్ల దూరంలో కౌశిక్ అచేతనంగా , తన గురించే ఆలోచిస్తూ, తన ఊహతో జీవిస్తూ ఏ స్థితిలోకి వెళ్లిపోయాడో... అప్పుడు ఆ క్షణంలో ఆమెకు తెలియదు

Tuesday, December 13, 2011

ప్రవాసాంధ్రుల కోసం అమెజాన్ లో తన్హాయి, యమకూపం

సారంగ పబ్లికేషన్స్ప తాజా ప్రచురణలు ” తన్హాయి’, ’ యమకూపం’ పుస్తకాలు అమెజాన్ లో దొరుకుతున్నాయి. ఇండియా వెలుపల నివసించే వారు అమెజాన్ ద్వారా ఈ రెండు పుస్తకాలను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఒక్కో పుస్తకం ధర $9.95 . అమెజాన్ లో తన్హాయి, యమకూపం పుస్తకాల లింక్ లు ఇవి.

http://www.amazon.com/Tanhayhttp://www.blogger.com/img/blank.gifihttp://www.blogger.com/img/blank.gif-Telugu-Kalpana-Rentala/dp/0984576215/ref=sr_1_4?s=books&ie=UTF8&qid=1323821110&sr=1-4


http://www.amazon.com/Yamakoopam-Telugu-Aleksandr-Kuprin/dp/0984576223/ref=sr_1_5?s=books&ie=UTF8&qid=1323821110&sr=1-5

Monday, December 12, 2011

అరూప ప్రేమ కథ తన్హాయి( తన్హాయి పుస్తకం కోసం వంశీకృష్ణ రాసిన వ్యాసం ఇది. వార్త ఆదివారం అనుబంధం లో డిసెంబర్ 10 వ తేదీ ప్రచురితమయింది)

Tuesday, December 06, 2011

వ్యవస్థ వికృత రూపాన్ని బట్ట బయలు చేసిన క్లాసిక్ రష్యన్ నవల “ యమకూపం”


వందేళ్ల నాటి జెన్నీ...నేటి నళిని....

నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ ఇటీవల తన ఆత్మకథ రాశారు. పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి అనువదిస్తున్న రోజుల్లో, కొన్ని వాక్యాల దగ్గర హఠాత్తుగా ఆగిపోతుండేదాన్ని. నళిని చెప్పిన అవే అనుభవాలు, అవే పరిశీలనలు గతంలో ఎక్కడో చదివానని అనిపించేది. కుప్రిన్ 'యమా పిట్'కు రెంటాల గోపాలకృష్ణ అనువాదం 'యమకూపం' చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ చదువుతుంటే, పోలికలు ఎక్కడివో స్పష్టపడింది. నళిని జీవితంలోని ప్రతి అనుభవానికీ ప్రతీక లనదగిన ఎందరో స్త్రీలు నవలలో ఎదురవుతారు. వందేళ్ల క్రితమే వాళ్లు పలికిన మాటలన్నీ నళిని గొంతులో ప్రతిధ్వనించాయి. మరీ ముఖ్యంగా, కుప్రిన్ సృష్టించిన జెన్నీ మరీ మరీ గుర్తొస్తుంది నళినిని చదువుతుంటే!”

కొందరి స్త్రీల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాకుండా...
వందేళ్ళ నాటి ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి ఎలాంటి సమాధానాలు లేకుండా...
యమకూపం పుస్తకం కోసం సమకాలీన సందర్భాన్ని వివరిస్తూ కాత్యాయని రాసిన ముందు మాట ని ఇక్కడ చదవండి.

అలెక్జాందర్ కుప్రిన్ రాసిన రష్యన్ క్లాసిక్ నవల “ యమా ది పిట్” కి తెలుగు అనువాదం “ యమకూపం” ను సారంగ బుక్స్ వారు ఆన్ కోర్ సిరీస్ లో తొలి పుస్తకంగా నూతన సంవత్సర కానుకగా సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. ప్రముఖ పుస్తకాల షాపులన్నింటి లో ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకానికి మధురాంతకం నరేంద్ర, కాత్యాయని రాసిన ముందుమాటలు విశ్వ సాహిత్యం లో ఈ పుస్తకానికి వున్న విలువైన స్థానాన్ని, సమకాలీన సందర్భాన్ని కూడా తెలియచేస్తాయి. అర్థ శతాబ్దం గా ఈ పుస్తకం తెలుగు సాహిత్యం లో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకుంది. ఈ తాజా ముద్రణ ను కూడా సారంగ ఇతర ప్రచురణల్లాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

పుస్తక రూపంగా “ తన్హాయి”

ప్రేమ ఎప్పుడూ ఓ కొత్త పదం, ఓ కొత్త భావన.కానీ ఆమె—అతను ఎప్పుడూ ఓ కొత్త సంఘర్షణ. ఈ కాలం లో అది ఇంకో సంఘర్షణ, ఇంకో భావన. మారుతున్న కాలపు కథ, మారుతున్న సంఘర్షణ కు అక్షర రూపం “ తన్హాయి”.

దాదాపుగా ఏడాది క్రితం ఈ బ్లాగు లో మీ అందరి ఆదరాభిమానాల మధ్య పూర్తయిన సీరియల్ “ తన్హా యి “ ఇప్పుడు పుస్తక రూపం లో మార్కెట్ లో విడుదలయింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ల్లోని ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటి లో కూడా తన్హాయి లభ్యమవుతోంది.
బ్లాగు లో వచ్చిన సీరియల్ కి అదనంగా రెండు, మూడు భాగాలు , ప్రముఖ రచయితలు పి.సత్యవతి, వంశీ కృష్ణ ల వెనుక మాటలు ( ఆఫ్టర్ వర్డ్స్ ) ఇంకా కొద్ది మంది బ్లాగర్ ల కామెంట్లతో ఆకర్షణీయమైన ముఖ చిత్రం తో తన్హాయి మీ ముందుకు వచ్చింది.సీరియల్ గా ఈ బ్లాగు లో వచ్చినప్పుడు ఆదరించినట్లే పుస్తకాన్ని కొని చదివి మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను.
ప్రస్తుతం జరుగుతున్న వైజాగ్ బుక్ ఫెస్టివల్ లోనూ, డిసెంబర్ 15 నుంచి జరగనున్న హైదారాబాద్ బుక్ ఫెస్టివల్ లోనూ, జనవరి 1 నుంచి జరగనున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కూడా పాలపిట్ట , అలకనంద ( అశోక్ బుక్ సెంటర్), నవోదయ, విశాలాంధ్ర బుక్ స్టాల్స్ లో తన్హాయి దొరుకుతుంది. విదేశాల్లోని వారు నేరుగా సారంగ బుక్స్ నుంచి కానీ (info@saarangabooks.com ) అమెజాన్, ఏవికెఎఫ్ ల నుంచి కానీ కొనుక్కోవచ్చు.
 
Real Time Web Analytics