“భారత
దేశం నా మాతృదేశం. భారతీయులందరూ నా సహోదరులు. “
చిన్నప్పుడు
స్కూల్లో చదివిన ప్రతిజ్న ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే వుంది.
అనుక్షణం
నా దేశం గొప్పతనం , నా “ సహోదరులకు” స్త్రీజాతి పట్ల
వున్న ఆదరాభిమానాలు , స్త్రీ ని దేవత గా కొలిచే నా దేశ సంస్కృతి
గురించి ప్రతి రోజూ ఎవరో ఒకరు నాకు ఉద్బోధ చేస్తూనే ఉన్నారు.
గత వారం
గౌహతి లో జరిగిన సంఘటన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అది తెలిసాక ఎంత మంది తల్లితండ్రులు
తమ ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని మరింత కట్టడి చేస్తున్నారో నాకు తెలియదు.
గౌహతి
లో ఓ పదిహేదేళ్ళ అమ్మాయి తన స్నేహితులలతో కలిసి రెస్టారెంట్ కమ్ పబ్ లోకి వెళ్ళి గడిపి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి
తో పాటు ఆమె స్నేహితులు కూడా వున్నారు. ఓ అమ్మాయి అర్థరాత్రి అబ్బాయిలతో కలిసి పబ్
నుంచి బయటకు రావడాన్ని అక్కడున్న ఓ ఓ గుంపు చూసి తట్టుకోలేకపోయింది. దేశ ఔన్నత్యం దిగజారుతోందని ఆ మూక కు ఆవేశమొచ్చింది. ఆ అమ్మాయి పొట్టి స్కర్ట్
వేసుకుందని, అర్థ రాత్రి తాగి తందనాలాడుతోంది కాబట్టి ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నారు.
అందరూ కలిసి ఆమె చుట్టూ ఓ గుంపు లా , ఓ వలయం లా ఏర్పడి ఆమె ను
కొట్టి ఆ తర్వాత ఆమె వొంటి మీద వున్న ఆ కొద్ది పాటి దుస్తులను కూడా తీసేసి ఆనందించారు.
ఆమె ను ఎక్కడెక్కడో తాకి ఆనందించారు. ఆమె ను నడి రోడ్డు మీద లాక్కెళ్లారు.
ఈ పనులన్నీ చేసింది ఓ 20 మంది తో కూడిన గుంపు. కానీ దీన్ని చూసిన ఆనందించినవారు వంద
సంఖ్య లో వున్నారు. ఎక్కడ అరక్షణం కళ్ళు తిప్పితే ఎంత మంచి సీన్ మిస్ అవుతామో అన్నట్లు
కళ్లార్పకుండా చూశారు. రద్దీ గా ఉండే రోడ్డు మీద ఈ దుర్ఘటన చూస్తూ కూడా ఎవరూ ఆగి దాన్ని
ఆపే ప్రయత్నం చేయలేదు. సహాయం చేయమని ఆ అమ్మాయి
రోడ్డు మీద పరుగెత్తినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ సమయం లో అటు వైపు వస్తున్న
మరో జర్నలిస్ట్ కారు ఆపి పోలీసులకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ని అల్లరి మూకల నుంచి కాపాడే
ప్రయత్నం చేశాడు.
అల్లరి
మూకల గుంపు లో ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఈ మొత్తం “ ఎపిసోడ్ “ ని అతనితో సహా
అనేక మంది కెమెరాలతో చిత్రీకరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో
అప్ లోడ్ చేశారు. న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేశారు. ఒక జర్నలిస్ట్ ఆ అమ్మాయి మీద
దాడి ని ప్రోత్సహిస్తే మరో జర్నలిస్ట్ వెంటనే
పోలీసులకు ఫోన్ చేసి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేసి ఆ అమ్మాయి ని కాపాడారు.
ఈ మొత్తం
సంఘటన ను ప్రత్యక్ష్యంగా చూసి, వీడియో తీసి, తన వంతు భాగస్వామ్యం వహించిన జర్నలిస్ట్ తన చానెల్ లో “
Drunk girl in the city” అనే శీర్షికతో న్యూస్ ప్రసారం చేశాడు.
అది చూసి మిగతా పత్రికలు, ఛానెల్స్ కూడా ఆ తరహా వార్తలే వినిపించాయి.
. ఒకటిన్నర రోజు తర్వాత అసలు విషయం బయటకు వచ్చాక, యూ ట్యూబ్ లో వీడియో లు కూడా అందరూ చూసి ఆనందించాక అప్పుడు అందరూ రంగం లోకి
దిగారు. అసలేం జరిగిందో బయటకు వచ్చింది. నిందితుల కోసం వెతుకులాట మొదలయింది. ధర్నాలు, రాస్తారోకోలు జరిగుతున్నాయి. మొదట ఈ వార్త ను ప్రసారం చేసిన న్యూస్ చానెల్
కొంత మాట మార్చింది. నేటి యువతరం ముఖ్యంగా అమ్మాయిలు ఎంత చెడిపోతున్నారో, అసభ్యకరమైన దుస్తులు వేసుకొని అర్థ రాత్రి వరకు పబ్ ల వెంట ఎలా తిరుగుతున్నారో
, అలా తిరిగితే ఏం జరుగుతుందో
హెచ్చరికలు మొదలు పెట్టింది. ఒక న్యూస్ చానల్ ఎడిటర్ కామెంట్ ఏమిటంటే “Major
chunk of girls visiting pubs/bars are prostitutes”.
ఈ వీడియో
ని చూస్తే ఏం జరిగిందో ఎవరికైనా అర్థమవుతుంది.
ఆ అమ్మాయిని
రక్షించిన జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి.
http://news.biharprabha.com/2012/07/meet-the-man-who-saved-guwahati-girl-from-molestation/
ఆడపిల్లల
స్కర్ట్ లు ఎంత పొడవు ఉండాలో కాదు నిర్ణయించాల్సింది.
కొందరు మగవాళ్ళు మృగాల్లా కాకుండా మామూలు మనుషుల్లా ప్రవర్తించేలా ఎవరైనా వారికి శిక్షణ
ఇవ్వండి.
అది
జరిగితే ,
నిస్సందేహంగా నా దేశం గొప్పదే!