నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label అమెరికా. Show all posts
Showing posts with label అమెరికా. Show all posts

Saturday, July 21, 2012

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా !

సాక్షి ఆదివారం సంచిక లో (జూలై 22) ప్రవాసం శీర్షిక కోసం నేను రాసిన వ్యాసం ఇది.






అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అమెరికన్ సమాజంలో ఇండియన్‌లాగా జీవించటంలో ఉండే అనుభవాల గురించి మాట్లాడాల్సి వస్తే... ముందుగా రెండు దేశాల మధ్య వైరుధ్యం కన్నా రెండు దేశాల జీవన విధానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పుల గురించి చెప్పాలనిపిస్తుంది. ఈ వ్యాసం మొత్తంలో నేను అన్నది వైయక్తికమైన నేను కాకుండా సామాజికమైన నేనుగా వాడుతున్నాను.

పదేళ్లుగా అమెరికాలో నివసించటం మొదలుపెట్టిన దగ్గర నుంచీ నేను, నాలాంటివాళ్లు ఎందరో ఎదుర్కొనే అతి సాధారణ ప్రశ్న/మొదటి ప్రశ్న-‘నువ్వు నీ మాతృదేశాన్ని మిస్ అవుతున్నావా?’ మిస్ అవటమన్న సంకర పద ప్రయోగంలోనే మనం చాలావరకు మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మిస్ అవటమంటే... దూరంగా ఉన్న అనుభూతి, ఏదో కోల్పోయిన అనుభూతి. నేను నిజంగా మాతృదేశాన్ని, మాతృభాషను పోగొట్టుకున్నానా? లేదు. కేవలం భౌతికమైన దూరంలో బతుకుతున్నాను.
 
 అప్పుడు-ఇప్పుడు

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికపరంగా, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఉదారవాద సంస్కరణల ఫలితంగా అమెరికా-ఇండియాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఓడ ఎక్కితే కానీ మొదటి తరం తెలుగువారు అమెరికా రాలేకపోయారు. ఇప్పుడు 15 నుంచి 18 గంటల ప్రయాణంతోనే అటూ ఇటూ రాకపోకలు సాగుతున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆంధ్ర దేశం నుంచి వచ్చిన ఓ స్నేహితు రాలికి తల్లి మరణవార్త పది రోజుల తర్వాత ఉత్తరం ద్వారా తెలిసింది.

ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇండియా-అమెరికాల మధ్య స్కైప్‌లు, వానేజీ ఫోన్లు, రోకూ బాక్సులు, ఇంటర్నెట్ టీవీలు, ఈమెయిల్స్, చాట్‌లు, సోషల్ నెట్‌వర్కులు, టీవీ చానెళ్ల ప్రత్యక్ష ప్రసారాలు ఎన్నో వచ్చేశాయి. ప్రతి కొత్త తెలుగు సినిమా అటు ఇండియా, ఇటు అమెరికాలో ఒకేసారి విడుదల అవుతోంది. టీవీ కార్యక్రమాల సంగతి చెప్పనే అక్కరలేదు. రెండు దేశాల మధ్య కాలమానం తేడాలున్నప్పటికీ, ఇండియాలో ఏ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమమైనా, అదే సమయంలో అమెరికాలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించే సదుపాయాలు వచ్చేశాయి.

ఆహార వ్యవహారాలు, పండుగల పబ్బాల విషయానికి వస్తే... మామూలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో పండే అల్ఫాన్సా, కేసర్ మామిడిపళ్లతో సరిపెట్టుకునే ఇండియన్ అమెరికన్లు ఇవాళ బంగినపల్లి మామిడిపళ్లను కూడా ఆరగించగలుగుతున్నారు. అమెరికాలోని ప్రతి నైబర్‌హుడ్‌లోనూ ఓ రెండు, మూడు యోగా సెంటర్లు ఉంటాయి.

హిందూ దేవాలయం లేని అమెరికా పట్టణాలు అతి తక్కువ. రెండోతరం, మూడోతరం పిల్లలు, యువతీ యువకులు తెలుగు భాషను, మన బడులు-తెలుగుబడుల్లో నేర్చుకుంటున్నారు. తెలుగువారిని పెళ్లి చేసుకున్న అమెరికన్లు కూడా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు వంటకాలను రుచి చూస్తూ, ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకుంటున్నారు.

సాహిత్యపరంగా వచ్చిన మార్పులను చూస్తే, ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్యం అనేది ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అమెరికాను చుట్టపు చూపుగా చూడటానికి వచ్చి వెళ్లిపోయే వాళ్ల అమెరికా అనుభవాల నుంచి మాత్రమే ఒకప్పుడు తెలుగువారు అమెరికా గురించి తెలుసుకునేవారు. గత పదేళ్లలో అమెరికాలో నివసిస్తున్న పాత, కొత్త రచయితల కలాల నుంచి అమెరికాలో తెలుగువారి జీవితాల గురించిన సాహిత్య చిత్రణ ఎక్కువయింది.

ఈ మార్పులన్నింటి ద్వారా ఏం అర్థమవుతోంది? అమెరికాలోని తెలుగువారు తమ భాషను కాని, తమ సంస్కృతిని కాని, ఆచార వ్యవహారాలను కాని, తమ భారతీయతను కాని వేటినీ వదులుకోవటం లేదు. తమ మూలాల్ని వదులుకోవటానికి వారెవ్వరూ సిద్ధంగా లేరు. తమ భారతీయతను దేనికీ ఫణంగా పెట్టడం లేదు.

అమెరికాలో ఇండియన్‌లాగా నివసించటంలో చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఇండియాలో ఇండియన్‌లాగా నివసించటం మీదనే నాకు అనేక సందేహాలున్నాయి.
రెండు దశాబ్దాల కిందట భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ తలుపుల్ని బార్లా తెరిచినప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతోను, ఆసక్తితోను అందరూ గమనించటం మొదలుపెట్టారు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పెను మార్పులు సంభవించాయో ఎవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. షాపింగ్‌మాల్స్, గ్లాస్ పానెల్డ్ ఆఫీస్ బిల్డింగులు, ఎస్కలేటర్లు పుట్టుకొచ్చాయి. పల్లెటూళ్ల స్వరూపం మారిపోయింది. పట్టణాలు ఆధునికత వికృత స్వరూపానికి నకళ్లుగా మారాయి. ఇండియా అంటే ఎప్పటి ఇండియా అని అడగాలనిపిస్తుంది.

అమెరికాలో తెలుగు నేర్చుకున్న రెండోతరం, మూడోతరం తెలుగు యువతీయువకులు సెలవుల్లోనో, పరిశోధన కోసమో ఇండియా వెళ్లి వెనక్కి వచ్చాక, ‘అక్కడి వాళ్ల కన్నా మేమే మంచి తెలుగు మాట్లాడుతున్నాం’, ‘అక్కడ మేం తెలుగులో మాట్లాడుతుంటే అందరూ మాతో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు’ అని చెప్తున్నారు. తెలుగు సినిమాలు చూడటానికి ఇంగ్లిష్, హిందీ వస్తే చాలు తెలుగు రానక్కరలేదు అన్నది ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లల మనోభావం. మన తెలుగు సినిమాల్లో తెలుగు నేతి బీరకాయల్లో నెయ్యి చందాన ఉంటోందన్నది అక్షర సత్యం.

తెలుగు తిట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనటం లేదు కానీ, అవి పుష్కలంగా ఇంకా అమెరికాలో తెలుగువారి నోళ్లల్లో ‘నీయమ్మ, నీయబ్బ’లుగా నానుతూనే ఉన్నాయి. కానీ ఇండియాలో అమెరికన్ తిట్లు, లేదా ఊతపదాలు ‘ఎఫ్-వర్డ్’, ‘ఎస్-వర్డ్’ ఎలాంటి సంకోచాలు లేకుండా వాడటం కనిపిస్తోంది.

అమెరికాలో తెలుగు పిల్లలు చక్కగా లంగా ఓణీలు వేసుకుని సంగీతం, కూచిపూడి లాంటి లలితకళలను శ్రద్ధగా అభ్యసిస్తుంటే తెలుగుదేశంలో పిల్లల వస్త్రధారణ, టీవీ కార్యక్రమాల్లో వారి ప్రదర్శనలు చూస్తుంటే అటుదిటు, ఇటుదటు మారిపోయినట్లు అనిపిస్తోంది. వస్త్రధారణల్లో వచ్చిన మార్పులు, ఇంగ్లిష్ భాష మాట్లాడటం ఒక నేరంగా నేను ఎత్తి చూపటం లేదు.

ఒక మార్పుకి సంకేతంగా మాత్రమే చెప్తున్నాను. ఇండియాలో తెలుగు పిల్లలకు మాట్లాడే తెలుగు వస్తే గొప్ప. అమెరికాలో తెలుగు పిల్లలు తెలుగులో చదవటమే కాదు, తెలుగులో రాయగలిగే స్థాయికి వెళ్తున్నారు. రాబోయే తరం నుంచి ఓ అమెరికన్ ఇండియన్ తెలుగులో ఓ పుస్తకం రాసే రోజు కూడా ముందు ముందు ఉందన్న ఆశ కలుగుతోంది.

అమెరికనైజ్ అయిపోతున్న ఇండియా నన్ను ఆందోళన పరుస్తున్నది. మొన్నటి మెక్‌డొనాల్డ్స్, నిన్నటి వాల్‌మార్ట్‌లు, ఇవాళ్టి స్టార్ బక్స్, అమెజాన్ మార్కెట్ల రంగప్రవేశంతో నాకు ఇండియా ఇండియాలాగా కనిపించటం లేదు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా భారతీయతను కోల్పోవటం అంటూ జరిగితే అది అమెరికాలో జరగటం లేదు. భారతదేశంలోనే మనం మన భారతీయతను కోల్పోతున్నామేమో అనిపిస్తోంది.

ప్రపంచమొక కుగ్రామం అన్న మాట ఈ పదేళ్ల ప్రవాస జీవితం తర్వాత బాగా అనుభవంలోకి వస్తోంది. అమెరికా రావటానికి ముందు ఈ దేశం గురించి నా ఆలోచనలు, నా అవగాహన వేరు. కానీ ఇక్కడికొచ్చాక నాకు కలిగిన అనుభవాలు వేరు. ఆ అనుభవాలు నాకు అమెరికా గురించిన అవగాహనను పెంచడంతో పాటు నా మాతృదేశాన్ని చూడాల్సిన దృష్టిని కూడా ఇచ్చాయి.

ఈ రెండు దేశాలు నాకు రెండు కళ్లలాగా, సొంత ఇళ్లలాగానే కనిపిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, భాషల పరంగా ఈ రెండు దేశాలు భూగోళానికి చెరోవైపు ఉన్నాయి. కానీ నా మనసులో రెండింటికీ ఒకటే స్థానం ఉంది. ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తిల్లు కాదు. రెండూ పుట్టిళ్ల లాగానే కనిపిస్తున్నాయి. కేవలం ఒక కంటితో మాత్రమే చూసే పాక్షిక దృష్టి నాకొద్దు.

ఈ రెండు దేశాల జీవితానుభవంతో సమగ్రమైన దృష్టికోణం అలవడింది. ఆ సమ్యక్ దృష్టితోనే ఈ ప్రవాస సమాజంలో కూడా నా ఉనికిని నేను కాపాడుకోగలుగుతున్నాను. నా మూలాల్ని నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నాను.నేను అమెరికాలో నివసిస్తున్న భారతీయురాలిని అని సగర్వంగా చెప్పుకోగలను.

-కల్పనా రెంటాల

Tuesday, April 26, 2011

అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ !




సంచలనం
సృష్టించినఏషియన్స్ ఇన్ ది లైబ్రరీవీడియో


అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ పోస్టులు, ట్వీట్ లు , యూ ట్యూబ్ వీడియోలు.
ఇప్పుడున్నది ఫేస్ బుక్ తరం. 4 జి ఫోన్ల తరం, ట్వీట్ లు చేయకపోతే బతకలేని తరం, యూట్యూబ్ లో ఏదైనా వీడియో పోస్ట్ చేయకపోతే వాళ్ళు కూల్ గైస్ కాదనుకునే తరం, దీనికి దేశాలు, ఖండాలు ఏమీ తేడా లేదు. ఎక్కడైనా ఎవరికైనా పక్కవారిని ఏడిపించటం, వాళ్ళ మీద వీలైతే నాలుగు పుకార్లు ప్రచారం చేయటం, లేదా వాళ్ళ మీద ద్వేషం కురిపించటం ఇవన్నీ మన లోపల మనకే తెలియకుండా ఉండే లక్షణాలు.
ప్రపంచమంతటా ఇప్పుడు ఆన్ లైన్ బుల్లియింగ్ సీజన్ నడుస్తోంది. ఇందుకోసం నవతరం కున్న తాజా సాధానాలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్.
ఒకప్పుడు స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకునేటప్పుడు మన స్నేహితుల్లోనో, తోటి విద్యార్థుల్లోనో ఎవరి మీదైనా కోపం వస్తే, ఎవరి గురించైనా ఒక పుకారు లేవదీయాలనుకుంటే, మనల్ని రాగింగ్ చేసి ఏడిపించేవాళ్లను ఎదురుగా నిలబడి ఏమీ చేయలేక దొంగ చాటుగా నైనా ఏదో ఒకటి చేసి తీరాలని ఉక్రోషంతో, ఆవేశంతో నే ఏదైనా రాయలనుకుంటే, బాత్ రూమ్ గోడలు పనికివచ్చేవి. ఫలానా వారు అంటూ వాళ్ళ గురించి ఏదో ఒకటి చివర టకారం చేర్చేసి ప్రచారం చేసెసేవాళ్ళు.
ఒక తరం లో బాత్ రూమ్ గోడల నీలి రాతలు ఎవరైనా తుడిపెసే అవకాశం కొంతైనా ఉంది. రాతలు, మాటలు ఒక స్కూల్ కొ, ఒక వూరికో, ఒక ప్రాంతానికో, ఒక వార్తా పత్రికకొ , ఒక టీవీ చానల్ కొ పరిమితమయ్యేవి. ఆన్ లైన్ సాధనాలతో అది కుదరదు. ఒక సారి నెట్ లో ఏదైనా పోస్ట్ చేస్తే, ఏదైనా రాస్తే, అది ఇక శాశ్వతం, ఎవరైనా దాన్ని స్క్రీన్ షాట్ కింద సేవ్ చేసుకొని ప్రచారం చేయవచ్చు. దాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసి మళ్ళీ అప్ లోడ్ చేయవచ్చు. ఆంతర్జాల మాయాజాల ప్రపంచంలో సాలీడులా ఇరుక్కుపోయిన యువతరం తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన అంశాలు ఇంకాఅనేకం ఉన్నాయి.
బుల్లియింగ్ స్వరూప స్వభావాలు ఇప్పుడు ఏమీ మారలేదు కానీ వాటిని అమలు చేసే విధానం, బుల్లియింగ్ ని ఎదుర్కొనే విధానం రెండూ మారాయి.
ఎక్కడో మన ఫేస్ బుక్ వాల్ మీద మనం రాసే కామెంట్లు, రాతలు, కూల్ గా ఉంటుందనో, మన అభిప్రాయాలూ, మన మాటలు, మన చేతలు మనిష్టం , అది నా ప్రాధమిక హక్కు అనుకొని వెబ్ కామ్ ముందు కూర్చొని ఏవేవో మాట్లాడి వీడియో తీస్తే అది మీ జీవితానికే ముప్పు తీసుకురావచ్చు. తాను యూట్యూబ్ లో పెట్టిన మూడు నిమిషాల వీడియో, అందులో వెలిబుచ్చిన అభిప్రాయాలూ అమెరికాలోని ఒక విద్యార్థి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. “ వీడియో తీసినప్పుడు నాలో ఏదో దెయ్యం ప్రవేశించి ఉంటుంది, కాలాన్ని వెనక్కు తిప్పగలిగే శక్తి లేదా అవకాశం ఉంటే నేను చేసిన పని ని తుడిపేస్తాను అంటుంది అలెక్జాండ్రా వాలెస్. ఇంతకూ వాలెస్ చేసిన తప్పెమిటంటే తనతో పాటు కాలేజీ లో చదువుకుంటున్న ఏసియన్ విద్యార్థుల గురించి తన అభిప్రాయాలను, అభ్యంతరాలను వెబ్ కామ్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం. “ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీపేరిట వాలెస్ పెట్టిన ఆసియా వ్యతిరేక వీడియో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచమంతటా సంచలనం రేపింది.
లాస్ యాంజలెస్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ( UCLA) లో పోలిటికల్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న అలెక్జాండ్ర వాలెస్ తన కాలేజీ లైబ్రరీ లో తోటి ఏసియన్ విద్యార్థుల మాట తీరుని, ఉచ్ఛారణ ని , వారి జీవిత విధాన్నాన్ని వెక్కిరిస్తూ ఒక మూడు నిముషాల వీడియా ని యూట్యూబ్ లో పెట్టింది. వాలెస్ వీడియో లో మాట్లాడింది మూడు నిముషాలే కానీ అందులో ఆమె చేసిన వ్యాఖ్యానాలు చాలానే వున్నాయి. యూసీఎల్ లాంటి యూనివర్సిటీ లో చదువుకోవటానికివచ్చే వాళ్ళు అమెరికన్ మేనర్స్ నేర్చుకోవాలన్నది ప్రధాన మైన వ్యాఖ్య. అది కాకుండా ఏషియన్స్ తమ పిల్లలు సొంత కాళ్ళ మీద నిలబదనీయకుండా వారాంతాల్లో వారి అపార్ట్మెంట్లకు వచ్చి బట్టలు ఉతకటం, వారాని కి సరిపోయే ఆహారాన్ని వండి పెట్టడం లాంటివి చేస్తారన్న రేసిస్ట్ వెక్కిరింపులు ఏషియన్ కమ్యునిటీ మనోభావాలను ఎంతగానో దెబ్బతీసాయి. వీడియో నెట్ లో విపరీతంగా ప్రచారమైంది. ఎంత గా ప్రచారమయిందంటే న్యూయార్క్ టైమ్స్ పేజీల్లోకి కూడా ఎక్కేంతగా.
జరిగినదేమిటంటే ఇటీవల జపాన్ లో సునామీ, భూకంపం సంభవించినప్పుడు జపాన్ లో తమ బంధువులు, స్నేహితుల వివరాలు తెలుసుకోవాలనుకునే అనేకమంది ఏషియన్ విద్యార్థులు కాలేజీ లైబ్రరీలో నుంచే సెల్ ఫోన్ లో మాట్లాడారు. పరీక్షలు జరుగుతున్నందున లైబ్రరీ లో చదువుకుంటున్న వాలెస్ కి అది ఇబ్బందికరంగా అనిపించింది.వెంటనే ఏషియన్ ప్రవర్తన గురించి తన అభిప్రాయాలను వీడియో ద్వారా తెలిపింది. వీడియో పెట్టగానే వచ్చిన నెగెటివ్ ప్రతిస్పందన చూడగానే వెంటనే ఆమె వీడియో ని తీసెసింది. కానీ అప్పటికే వీడియోని అనేకమంది డౌన్లోడ్ చేసుకొని ఉందటం వల్ల తిరిగి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
వీడియో ని ఇక్కడ చూడండి.
ఇక వాలెస్ ఆసియా ప్రజల (జపనీస్) గురించి చేసిన అభ్యంతరకరమైన కామెంట్ల కి , సైబర్ బుల్లియింగ్ వీడియో కి స్పందనగా అనేక మంది వీడియో లు చేసి యూ ట్యూబ్ లో పెట్టారు. అయితే అన్నింటి కన్నా వర్థమాన గాయకుడు జిమ్మీ వాంగ్ ఎంతో సరదాగా, నమ్రతగా వాలెస్ చేసిన రేసిస్ట్ కామెంట్లకు సమాధానంగా నాలుగు నిముషాల ఒక పాట ద్వారా తన నిరసన ని తెలియచేసాడు. దాని పేరుచింగ్ చాంగ్ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీ సాంగ్” . వీడియో కి బహుళ ప్రచారం లభించింది . దాదాపు ఎనిమిది లక్షల మంది ఇప్పటి వరకూ వీడియో ని చూశారు. పాటను ట్యూన్స్ లో అమ్మకానికి కూడా పెట్టారు. జిమ్మీ వాంగ్ వీడియో ని ఇక్కడ చూడొచ్చ్చు.

వాలెస్ చేసిన సైబర్ బుల్లియింగ్ కి సమాధానం చెప్పటంతో కథ ఆగిపోలేదు. ఆమెకు , ఆమె కుటుంబానికి చంపేస్తామన్న బెదిరింపులు వచ్చాయి. కాలేజీ నుంచి ఆమె ను తొలగించకపోయినా, కాలేజీ కి వెళ్ళి పరీక్షలు రాసే వీలు లేక వాలెస్ ప్రస్తుతానికి కాలేజీ మానేసింది. వూరు కూడా వదిలి వెళ్ళే పరిస్థితులు వున్నాయి. కానీ ఎక్కడికెళ్లినాఅదుగో, ఆమె రేసిస్ట్ వాలెస్అనే ముద్ర పడిపోయింది. ఆమె జీవితం ఇదివరకటి లాగా ఇక ఎప్పటికీ వుండబోదు.
ఇవాల్టి ప్రపంచంలో పేరు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎంత తొందరగా అంటే మనం వూహించలేనంత. అయితే అది మంచి పేరు కావచ్చు. చెడ్డపెరు కావచ్చు. వాలెస్ కథ ఒక హెచ్చరిక. ఆన్ లైన్ లో పబ్లిక్ లైఫ్ వున్న వారందరికీ వాలెస్ కథ ఒక కనువిప్పు కాగలదని ఆశిద్దాం.

( ఈ వ్యాసం ఏప్రిల్ 24 సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే “ లో ప్రచురితం)

Sunday, March 06, 2011

“ కొసమెరుపు” కథారచయిత ఓ.హెన్రీ మ్యూజియం


వందేళ్ల క్రితం ఒక అమెరికన్ రచయిత ఎలా జీవించి వుంటాడు? అతని రోజువారీ జీవితం , రచనా జీవితం ఎలా వుండేవి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం టెక్సాస్ ఆస్టిన్ లో వున్న ఓ హెన్రీ అలనాటి ఇంటిని చూసి తీరాల్సిందే. కరెంటు లేని రెండు బెడ్ రూముల చిన్న ఇల్లు. ముందు గదిలో అరువు తెచ్చుకున్న పియానో. వొక చిన్న సోఫా. వొక కుర్చీలో చెల్లా చెదురుగా పడి వున్న అప్పటి పత్రిక “సాటర్ డే పోస్ట్” సంచికలు. వొక మూల చిన్న పుస్తాకాల అల్మరా. ఇంకో మూల చలి కాచుకోడానికి నిప్పుల గూడు. ఇంకో మూల రచయిత రాసుకునే చిన్న టేబులూ, కుర్చీ. ఒక అతిధి వచ్చినా ఇరుకు అనిపించే ఆ చిన్న లివింగ్ రూమ్. దానికి కుడివైపు చిన్న పడక గది. రచయిత అతని భార్యా కలిసి పడుకున్న అప్పటి మంచం. వాళ్ళ పాపాయి వూగిన చిన్ని వూయెల. ఆ పాపాయి కోసం ప్రేమగా ఓ.హెన్రీ కొన్న బొమ్మలు, కొంచెం లోపలికి వెళ్తే, ముగ్గురు పట్టే డైనింగ్ టేబులు, చిన్న వంట గది. రెఫ్రిజేటర్లు, గాస్ పొయ్యి లేని కాలంలో వాడిన వస్తువులూ...ఇది లోకానికి “ కొసమెరుపు” కథల రుచి చూపించిన గొప్ప అమెరికన్ రచయిత ఓ హెన్రీ ఇల్లు!

మనకి చిన్నప్పుడు స్కూల్లో నాన్ డీటైలెడ్ టెక్స్ట్ బుక్ లో “ రాన్ సమ్ ఆఫ్ రెడ్ చీఫ్” కథ చదువుకున్నప్పటి నుంచి ఓ హెన్రీ తెలుసు. నా మటుకు నాకు ఆ తర్వాత “ ది లాస్ట్ లీఫ్” కథ చదివాక అతని కథలతో పాటు అతని మీద అభిమానం పెరిగింది. రాన్ సామ్ ఆఫ్ రెడ్ చీఫ్ లో తుంటరి పిల్లవాడు “ రెడ్ చీఫ్” చేసే అల్లరి ఆకట్టుకుంటే, లాస్ట్ లీఫ్ లో అనారోగ్యం , మరణం వెనుక దాగి వుండే మానసిక అంశాలు మనసు ని కదిలించి వేస్తాయి. ఓ హెన్రీ కథల్లో విశిష్టత ఒక్క మాట లో చెప్పాలంటే ఏ కథ కూడా మనం వూహించినట్లు వుండదు. చివరలో ఒక కొసమెరుపు మొత్తం కథ నే మార్చివేస్తుంది. కథ చదువుతున్నంత సేపూ పాఠకుడు వూహిస్తున్నదానికీ భిన్నమైన ముగింపు తో కథ ముగుస్తుంది. ఆ రకంగా ఆ కథలు, వాటిని సృజించిన రచయిత ఓ హెన్రీ ఇద్దరూ పాఠకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు.
దాదాపు 600 కు పైగా కథలు రాసి అమెరికన్ సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కథా రచయిత ఓ హెన్రీ టెక్సాస్ లోని ఆస్టిన్ లో 12 ఏళ్ల పాటు నివసించాడు. ఈ పన్నెండేళ్లూ అతని జీవితం అనేక మలుపులు తిరిగింది. అతను నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చి 1934 నుంచి అంటే గత 77 ఏళ్ళుగా ప్రదర్శనకు ఉంచారు. ఆస్టిన్ వచ్చినప్పటి నుంచి ఓ హెన్రీ మ్యూజియం చూద్దామనుకుంటున్నా ఎప్పుడూ ఏవో అవాంతరాలు. ఇండియా నుంచి కవి, కథకుడు, జర్నలిస్ట్ మిత్రుడు కూర్మనాథ్ ఇటీవల ఆస్టిన్ కి వచ్చినప్పుడు మా వూర్లోని వింతలు విశేషాలు చూపించే క్రమం లో భాగంగా నేను, అఫ్సర్, కూర్మనాథ్ ముగ్గురం ఆస్టిన్ డౌన్ టౌన్ లోని ఓ హెన్రీ మ్యూజియం చూడటానికి ఎలాగైతేనేం వెళ్లగలిగాము.

నిరంతరం ట్రాఫిక్ రద్దీతో , కార్ల రణగొణధ్వనుల మధ్య వీటన్నింటికి అతీతంగా రోడ్డు పక్కన ప్రశాంతంగా సాహితీప్రియులను పలకరించే ఓ చిన్న ఇల్లు. ఇంటి ముందు కొన్ని గులాబీ మొక్కలు. ఇంటి పక్కన, వెనక కూడా కొన్ని చెట్లు. తలుపు కొట్టి లోపలకు వెళ్ళగానే అక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటున్న టూర్ గైడ్ వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. ఇల్లంతా తిప్పి చూపించింది., ఆ ఇంట్లో హెన్రీ వాడిన వస్తువులు అన్నీ ఓపికగా ఒకొక్కదాని గురించి వివరించింది. ఓ. హెన్రీ జీవితచరిత్ర అంతా ఏ మాత్రం విసుగు లేకుండా అప్పుడే మాకేమొదటి సారి ఆ వివరాలు చెప్తున్నంత ఉత్సాహంగా చెప్పింది.

విలియం సిడ్నీ పోర్టర్ ( ఓ. హెన్రీ అసలు పేరు ఇదే) 1893 లో ఈ ఇంట్లో చేరే నాటికి అదొక అద్దె ఇల్లు. అప్పటికి ఆ ఇంట్లో గ్యాస్, కరెంటు లాంటి సదుపాయాలు ఏవీ లేవు. కిరోసిన్ దీపాలే వెలిగించుకునేవారు. బొగ్గుల కుంపట్లు వాడేవారు.అప్పట్లో ఓ.హెన్రీ నివసించిన ఇల్లు ఇదే కానీ ఈ అడ్రెస్ మాత్రం కాదు. ఇప్పుడు మ్యూజియం వున్న ఇంటికి కొన్ని బ్లాకుల దూరం లో వుండేది. ఆ ఇంటిని పడగొట్టబోతుంటే ఇంటి యజమాని ఆ ఇంటిని ఆస్టిన్ సిటీ కి అప్పగించారు. పురాతనమైన ఆ ఇంటిని చెక్కు చెదరనీయకుండా అలాగే కొన్ని బ్లాకుల ముందుకుజరిపి అవసరమైన పునరుద్ధరణ పనులు చేసి 1934 లో మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు వుంచారు. అమెరికన్ సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన కథా రచయితగా పేరు పొందిన ఓ.హెన్రీ దాదాపు 12 ఏళ్ల పాటు నివసించిన ఇంటిని గత 74 ఏళ్ళుగా కొన్ని వేల మంది సందర్శించి స్ఫూర్తి పొంది ఉంటారు. ఓ.హెన్రీ ఇంట్లో వాడిన వస్తువులు, ఫర్నిచర్, అలాగే ఆ కాలానికి సంబంధించిన కొన్ని పీరియడ్ పీస్ లు అతి జాగ్రత్తగా ఇక్కడ పొందుపరిచారు. 1994-95 లో మ్యూజియం ను కొంత పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ ఇల్లు సిటీ ఆఫ్ ఆస్టిన్ పార్క్స్, రిక్రియేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి.

విలియం సిడ్నీ పోర్టర్ సెప్టెంబర్ 11 1862 లో నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బరో కి దగ్గరలో పుట్టారు. 1865 లో తల్లి మరణం తర్వాత సిడ్నీ పోర్టర్ తండ్రి గ్రీన్స్ బరో కి తన నివాసం మార్చుకున్నారు. 1882 లో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న సిడ్నీ పోర్టర్ డాక్టర్ జేమ్స్ కె. హిల్ తో కలిసి టెక్సాస్ రాష్ట్రాన్ని చూద్దామని వచ్చారు. శాన్ ఆంటోనియా లో హిల్ కి చెందిన రాంచ్ లో వున్నంత కాలం సిడ్నీ పోర్టర్ పుస్తకాలు చదువుకుంటూ గడిపేశారు. 1884 లో రిచర్డ్ హిల్ తో కలిసి పోర్టర్ ఆస్టిన్ కి వచ్చారు. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు ఆస్టిన్ లోనే ఆయన వుండిపోయారు. సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ లో వున్నప్పుడు ఒక సిగార్ స్టోర్ లోనూ , మందుల షాప్ లోనూ, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనూ పనిచేశారు. మంచి గాత్రం వున్న పోర్టర్ గిటార్, మాండలిన్ వాయించేవారు. ఆస్టిన్ లో వున్నప్పుడే పోర్టర్ కి అతోల్ ఎస్టేట్స్ తో పరిచయమయింది. అతోల్ తల్లితండ్రులు వీరి ప్రేమను వొప్పుకోకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. 1889 లో వీరికి ఒక పాప పుట్టింది. పేరు మార్గరెట్. అప్పట్లో ఆయనకు నెలకు వంద రూపాయల జీతంవచ్చేది. ఇదే సిడ్నీ పోర్టర్ జీవితం లో అతి సంతోషకరమైన సమయం. ఆ తర్వాత ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది.



ఉద్యోగం పోవడం తో సిడ్నీ పోర్టర్ ఆస్టిన్ ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ గా చేరారు. ఆయన ప్రస్తుతం వున్న ఇంట్లో కి మారేటప్పటికి ఆయన జీవితం మరింత కష్టం గా మారింది . భార్య ఆరోగ్యం క్షీణించటం, ఉద్యోగబాధ్యతలు సరిగా నిర్వరించలేకపోవటం తో ఆయన పరిస్థితి రాను రాను మరింత క్లిష్టమయింది. 1894 లో బాంక్ లో పూర్తి స్థాయి లో పనిచేస్తున్నపుడే సిడ్నీ పోర్టర్ “ The Rolling Stone” ( ది రోలింగ్ స్టోన్ ) అనే వారపత్రికను ప్రచురించేవారు. ఆ పత్రిక తొలి కాపీలు కొన్ని ప్రదర్శనలో ఇప్పటికీ అతి జాగ్రత్తగా గ్లాస్ కింద భద్రపరిచి వున్నాయి.ఈ వారపత్రికలో పేరుకు తగ్గట్లు ఎక్కువగా హాస్య రచనలు, కథలు, కవితలు . కార్టూన్లు, ఉత్తరాలు ప్రచురితమయ్యేవి. ఈ వారపత్రిక బాగానే అమ్ముడు పోయేది. హాస్య చతురత, కథ చెప్పే విధానంలో అద్భుతమైన శైలి వీటన్నింటితో సిడ్నీ పోర్టర్ కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇవేమీ ఆయన ను ఆర్థికంగా నిలదొక్కుకొనివ్వలేదు. కుటుంబ పోషణ కష్టం కావటంతో సిడ్నీ ఏడాది తర్వాత పత్రిక మూసివేశాడు.
పత్రిక మూతపడటం ఒక రకమైన నష్టం అయితే బాంక్ లో నిధుల స్వాహా బయటపడటం సిడ్నీ కి ఎదురైన మరో పెద్ద కష్టం. ఉద్యోగం పోగొట్టుకొని ఆరునెలల పాటు దుర్భరమైన నిరుద్యోగాన్ని సిడ్నీ కుటుంబం అనుభవించింది. “ The Houston Post” తమ పత్రికకు రచయిత గా తీసుకోవటంతో సిడ్నీ ఆస్టిన్ వదిలి హ్యూస్టన్ వెళ్ళాడు. ఈ పత్రికలో సిడ్నీ రాసిన కాలమ్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. అక్కడ నుంచి సిడ్నీ ఒక రచయిత గా తన కెరియర్ ను ప్రారంభించాడు. అయితేహ్యూస్టన్ లో ఈ రకమైన జీవితం కేవలం 8 నెలల పాటు మాత్రమే గడిచింది. ఆస్టిన్ బాంక్ లో నిధుల కుంభకోణం విచారణ కు రావడం తో సిడ్నీ భార్య, పిల్లలను ఆస్టిన్ కి పంపేశాడు. అయితే కుటుంబం, స్నేహితుల ముందు కోర్టు విచారణ ఎదుర్కొలేననుకున్న సిడ్నీ రైలెక్కి న్యూ ఆర్లీన్స్ కి , అక్కడ నుంచి ఓడెక్కి హోండూరస్ కి వెళ్ళాడు. హోండూరస్ లో ఆరునెలల పాటు వుండటం వల్ల సిడ్నీ కి తన రచనలకు కావలసిన బోలెడంత సమాచారం దొరికింది కానీ భార్యా పిల్లలను కలుసుకోవటం మాత్రం వాస్తవంగా సాధ్యం కాలేదు. క్షయ వ్యాధితో బాధపడుతున్న భార్య బాగోగులుచూసుకునేందుకు తప్పనిసరిగా సిడ్నీ ఆస్టిన్ వచ్చి చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. 1897 లో భార్య ను పోగొట్టుకున్న ఏడు నెలల తర్వాత సిడ్నీ కేసు విచారణ జరిగింది. ఈ సమయంలో నే సిడ్నీ మొదటి చిన్న కథ ను ఒక నేషనల్ పబ్లికేషన్ కొనుక్కుంది. తన మూడు రోజుల కోర్టు విచారణ లో సిడ్నీ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.అయితే సాక్ష్యాలు మాత్రం అతడిని అపరాధిగా నిలబెట్టాయి. నేరం నిర్ధారణ కావటం తో అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఒహాయో లోని కొలంబస్ లో ని ఫెడరల్ జైలు కి సిడ్నీ ని పంపారు. ఇక ఆ తర్వాత సిడ్నీ టెక్సాస్ కి తిరిగి రాలేదు.

జైల్లో వున్నప్పుడు సిడ్నీ తన రచనా వ్యాసంగం మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగారు. అక్కడ వున్నపుడే ఆయన ఓ.హెన్రీ అనే కలం పేరు పెట్టుకొని కథలు రాశారు.మూడున్నర ఏళ్లకే జైలు నుంచి బయటకు వచ్చేనాటికి ఓ.హెన్రీ కలం పేరు కింద దాదాపు 14 కథలు ప్రచురితమై మంచి రచయిత గా పేరు సంపాదించుకున్నాడు.

1902 లో ఒహాయో జైలు నుంచి బయటకు వచ్చాక , పిట్స్ బర్గ్ లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న కూతురు మార్గరెట్ తో కొద్ది కాలం గడిపాడు. అప్పటికి మార్గరెట్ వయసు 13 ఏళ్ళు. ఆ అమ్మాయికి తండ్రి జైలు కి వెళ్లిన సంగతి తెలియదు. వ్యాపార పని మీద తన తండ్రి వేరే దేశాలు తిరుగుతున్నట్లు ఆమె ను నమ్మించారు. ( సిడ్నీ చనిపోయాక మాత్రమే ఆమెకు తండ్రి మీద వున్న కేసు, ఆయన జైల్లో వున్న వివరాలు తెలిసాయి. ). కూతురిని తిరిగి కలుసుకోవటం పట్ల సిడ్నీ ఎంతో సంతోషంగా వున్నప్పటికీ రచనా వ్యాసాంగం మీద జీవనం గడపటానికి గాను పబ్లిషర్స్ కి దగ్గరలో వుండేందుకు గాను న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. నిరంతరం మేల్కొని వుండే ఆ నగరం సిడ్నీ కి ఎన్నో రకాలుగా స్ఫూర్తి నిచ్చింది. చివరకు అదే ఆయన స్థిర నివాసమయింది. విజయపు అంచులను ఆయన చవి చూచినది అక్కడే. జైల్లో వున్నప్పుడు రాసి ప్రచురితమైన కథలకు మంచి పేరు రావడంతో , అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన “ The New York World Sunday Magazine” తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్రతి వారం వారికి ఒక కథను అందించారు. ఆయన జీవితం లోని చివరి ఎనిమిది సంవత్సరాల్లో సిడ్నీ పోర్టర్ మొత్తం 381 కథలు రాశారు.ఆయన కథల్లోని సామాన్య పాత్రలు, హాస్యం, చదివింపచేసే శైలి, కథ ను నడిపించే విధానం, పదాల ఎంపిక, వూహించలేని మలుపులు, పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా ఆయనను అమెరికా కు చెందిన ఉత్తమ కథకుడిగా తీర్చిదిద్దాయి.

ఓ.హెన్రీ కి దక్కిన కీర్తి సిడ్నీ పోర్టర్ గా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. జూదం, తాగుడు లాంటి వ్యసనాల వల్ల పబ్లిషర్స్ నుంచి ముందే పెద్ద మొత్తం లో పొందిన అడ్వాన్స్ లకు సరిపడా ఎప్పటికప్పుడు రచనలు సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు బాంక్ టెల్లర్ గా పనిచేసిన సిడ్నీ తన జీవితం లో ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవహారాలను కానీ, తన ఆరోగ్యాన్ని కానీ సరిగ్గా చూసుకోలేకపోయాడు.
డయాబిటీస్, లివర్ సంబంధిత వ్యాధి, గుండెజబ్బులతో 48 ఏళ్లకే ఓ.హెన్రీ గా ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిడ్నీ పోర్టర్ జూన్ 5, 1910 వ తేదీన కన్ను మూశాడు. ఓ.హెన్రీ గా ఆయన కన్ను మూసి వందేళ్లు గడిచినప్పటికీ ప్రపంచ సాహిత్యం ఆయనను మర్చిపోలేదు.

భారతదేశం లో లాగా కాకుండా అమెరికా లో రచనల్ని , రచయితలను గౌరవించి, గుర్తుంచుకొని సదా స్మరించే సత్సంప్రదాయం వుంది. ఆయన నివసించిన ఇంటిని మ్యూజియం గా వుంచటంద్వారా ఆయన రచనలనే కాకుండా ఆయన జీవితాన్ని కూడా భావితరాలకు తెలియచెప్తోంది ఈ ఓ.హెన్రీ మ్యూజియం. ప్రసిద్ధ ఓ.హెన్రీ క్లాసిక్ స్టోరీ “ Gifts of the Magi” రాయటానికి స్పూర్తినిచ్చిన ఆయన రైటింగ్ డెస్క్, వికర్ రాకింగ్ ఛైర్ ను ఈ మ్యూజియం లో చూసినప్పటి అనుభూతి వర్ణనాతీతం. ఆయన వాడిన డిక్షనరీ, ఆయన తన కూతురు కోసం కొన్న బొమ్మలు, సిడ్నీ భార్య వాయించిన పియానో, ఆయన జీవించిన కాలానికి సంబంధించిన వస్తువులు అవన్నీ అక్కడకు వచ్చే సందర్శకులను మౌనంగా పలకరిస్తూ వుంటాయి. వాటిని ఎవరూ తాక రాదు, ఫోటోలు కూడా తీసుకోకూడదు. ఆస్టిన్ సిటీ మేనేజిమెంట్ డొనేషన్ లు సేకరించి ఆ మ్యూజియం చూడటానికి వచ్చేవారికి టూర్ గైడ్ గా వ్యవహరించేందుకు పార్ట్ టైం సిబ్బంది ని కూడా నియమించింది.
ఓ.హెన్రీ మ్యూజియం చూసినంత సేపూ ఒకటే ఆలోచన. మన దేశం లో, మన రాష్ట్రం లో ఒక గొప్ప రచయిత కు ఇంతటి గౌరవం ఎప్పుడైనా లభించి వుంటుందా? అని. అలా అనుకోగానే ఆదరణకు నోచుకోని మహా కవుల, రచయితలు నివసించిన శిధిల భవనాలు కళ్ళముందు కదలాడాయి.


కల్పనారెంటాల

(మార్చి 7, ఆంధ్రజ్యోతి వివిధ లో ఈ వ్యాసం ప్రచురితం)

Thursday, February 18, 2010

ఆస్టిన్ లో ఏడంతుస్తుల భవనాన్ని ఢీ కొన్న విమానం

ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయానికి ( ఫిబ్రవరి 18, గురువారం మధ్యాహ్నానికి .) మా వూరు ఆస్టిన్ ( టెక్సాస్ ) వైపు ప్రపంచం అంతా చూస్తోంది. మా ఇంటి కి రెండున్నర మైళ్ళ దూరం లో జరిగిన విమాన ప్రమాదం తో ఒక్కసారి ఆస్టిన్ నగరం ఉలిక్కిపడింది. 2001 తర్వాత ఏ విమాన ప్రమాదమైనా అందరి అనుమానం ఒక్కటే. తీవ్రవాదమే అందరి మదిలో మెదులుతుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అది తీవ్రవాద చర్య కాదు కానీ ఇదొక “ గృహ తీవ్రవాద “ సమస్య. అదొక్కటే కాకుండా నిందితుడికి ప్రభుత్వ రెవెన్యూ విభాగం IRS పని తీరు పట్ల వున్న తీవ్ర కోపం కూడా విమాన, భవన ప్రమాదానికి దారితీసింది.

రోజూ లాగానే ఆస్టిన్ హైవే హడావిడిగా కార్లతో కళకళలాడుతూ వున్నప్పుడు ఉదయం దాదాపు 10 గంటలప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన జోసెఫ్ స్టాక్ స్థానిక పైలట్. గత రాత్రి ఇంట్లో భార్య తో స్టాక్ గొడవపడ్డాదని తెలుస్తోంది. స్టాక్ భార్య, సవతి కూతురు ఇద్దరూ రాత్రి ఇంటి నుంచి హోటల్ కి వెళ్ళిపోయి పొద్దుటే వచ్చారని తెలుస్తోంది.స్టాక్ ఇంట్లో సమస్యలోక్కటేఈ ప్రమాదానికి కారణం కాదు. అతనికి ఎంతో కాలంగా ప్రభుత్వ పని తీరు పట్ల, ముఖ్యం గా ఐ ఆర్ ఎస్ పని తీరు పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.

భార్య తో గొడవపడ్డ స్టాక్ 9-15 నిముషాలకు తన సొంత ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించేలా చేసి నార్త్ ఆస్టిన్ కి 20 మైళ్ళ దూరం లో వున్న జార్జి టౌన్ విమానాశ్రయం నుంచి ఒక చిన్న డబల్ సీటర్ చెరోకీ పైపర్ విమానం తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరగా వున్న ఏడంతస్తుల బిల్డింగ్ ని ఢీ కొట్టాడు. ఈ భవనం లోనే ఐ ఆర్ ఎస్, ఇంకా కొన్ని ప్రభుత్వ ఆఫీసులున్నాయి.
53 ఏళ్ళ స్టాక్ సొంత సాఫ్ట్ వేఱ్ కంపెనీ వుంది. తన సొంత వెబ్ సైట్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాసాలతో పాటు అతని ఆత్మహత్య నోట్ కూడా వుంది. ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రకటించటానికి ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తా సంస్థల కథనాలు. “ హింస ఒక్కటే సమాధానం “ అని స్టాక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని కూడా తెలుస్తోంది.
ఈ అగ్ని ప్రమాదం లో గాయపడ్డ వారి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ లో వచ్చిన పెను మార్పులు కొందరి ప్రజల్లో ఎంత అసమ్ప్తృప్తి ని రగిలిస్తున్నాయో ఈ సంఘటన ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి దుందుడుకు చర్య చేసేలా ప్రేరేపించింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తో పాటు,కుటుంబ సమస్యలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైనా, ఒక వ్యక్తి కున్న తీవ్ర కోపం ఎంత విద్వాంసానికి, ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందో కదా.

(ఈ స్పందన కేవలం ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసి రాసినదే.)

కల్పనా రెంటాల

 
Real Time Web Analytics