నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label పుస్తక పరిచయం. Show all posts
Showing posts with label పుస్తక పరిచయం. Show all posts

Sunday, October 24, 2010

చైనా చరిత్రలోని చీకటి కోణపు కథనమే " ఉమన్ ఫ్రం షాంగై"!

చైనా ప్రముఖ వివాదస్పద రచయితల్లో జియానహుయ్ యాంగ్ ఒకరు. మావో కాలం లో అతి క్రూరమైన వాటిగా ప్రాచుర్యం పొందిన లేబర్ క్యాంపుల్లో జీవితం ఎలా వుండేదో అనే దాని గురించి పరిశోధానాత్మక వాస్తవాల  ఆధారంగా రాసిన కథల సమాహారం " ఉమన్ ఫ్రం షాంగై".. ఇందులో చెప్పినవి  కట్టుకథలు కావు. ఫస్ట్ హేండ్ సమాచారం ఉపయోగించి రాసినవి. ఈ సమాచారం ఇంగ్లీష్ లోకి రావటం  ఈ పుస్తకం ద్వారానే ప్రథమం.

వెనుకబడ్డ ఈశాన్య చైనా ఎడారి ప్రాంతంలో జియబియాంగ్ అనేది మావో కాలం నాటి బలవంతపు లేబర్ క్యాంపు పేరు. 1957-60 మధ్య దాదాపు మూడు వేల మంది చైనా దేశస్తులు కమ్యూనిస్ట్ పార్టీ చేత " రైటిస్ట్" లు గా ముద్ర వేయించుకొని నిషేధానికి గురైనారు. ఇలా నిషేధానికి గురైన వారందర్ని  ఈశాన్య చైనా లోని గాన్సు ఎడారి ప్రాంతం లోని జియబియాంగో అనే ప్రదేశానికి తరలించారు.

వీరిలోమేధావులు, గాన్స్ లోని  మాజీ ప్రభుత్వ అధికారులు వున్నారు.అలా అక్కడ ప్రవాస కారాగారానికి పంపివేయబడ్డ స్త్రీ, పురుషులు అనేక రకాల చిత్రహింసలకు గురైనారు. ఈ కార్యక్రమాన్ని కమ్యునిస్ట్ పార్టీ " అత్యధిక శ్రమ ద్వార తగ్గించివేత " అని పిలిచేది. వీరంతా కూడా ఛైర్మన్  మావో సోషలిస్ట్లు విధానాల పట్ల అసంతృప్తి ప్రకటించినవారో,పార్టీ అధికారుల్ని ప్రశ్నించినందుకో " రైటిస్ట్లు " గా ముద్ర వేయించుకున్నవారో. మరికొంతమంది ఎందుకు " రైటిస్ట్లు" అయ్యారంటే, వారి తండ్రులో, తాతలో భూస్వాములో, పెట్టుబడీదారి వర్గానికి చెందిన వారు కావడం వల్ల. 1961 కల్లా ఇక్కడ జరిగిన మరణాల వల్ల ఈ క్యాంప్ ని మూసివేసారు. దాదాపు మూడు వేల మంది ఖైదీల్లో 500మంది దాకా మాత్రమే బతికి బట్ట కట్టగలిగారు.

1997 లో యాంగ్, గాన్స్ కి ప్రయాణం చేసి దాదాపు అయిదు ఏళ్ళ పాటు అక్కడ క్యాంపు నుండి బైటపడ్డ వంద మందికి పైగా పాత ఖైదీలని ఇంటర్వ్యూ చేసి   ఆ మారణ హింసాకాండకు సంబంధించిన అనేకమైన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో 13 కథలున్నాయి. చైన ప్రభుత్వపు నిషేధం బారి నుండి తప్పించుకునేందుకు రచయత ఈ నిజాల నిజాయితినీ, శక్తిని పోగొట్టకుండా కాల్పనిక సాహిత్య కథలుగా మలిచారు. జర్నలిజం, సాహిత్యం రెండూ మేళవించిన సృజన ఇది.

ఈ లేబర్ క్యాంపు లో ఖైదీలు రోజంతా జైలు గార్డుల పర్యవేక్షణలో దుర్భరమైన  ఎడారి ప్రాంతంలో పంటలు పండించటం, పశువుల పెంపకం లాంటి పనులు చేసి రాత్రిళ్ళు మావో రచనలు చదివి " ఆత్మ విమర్శలు " లేదా గతంలో వారు చెసిన తప్పిదాలకు పశ్చాత్తాపాలు రాసుకోవాలి.

జియబియాంగో చుట్టుపక్కల భూములన్నీ ఓ మొక్కైనా మొలవని ఉప్పుమేతల ఎడారి ప్రాంతం.. ఇక క్యాంపు విషయానికి వస్తే, అది ప్రధానం గా 40,50 మంది నేరస్తులు పట్టే ప్రదేశం. అలాంటిదానిలోకి కొత్తగా తీసుకువచ్చిన మూడువేల మంది ఖైదీలను వుంచారు. ఈ మొత్తం ఖైదీలందరికీ ఎలాంటి ఆహార పదార్ధాల సరఫరాకు ప్రభుత్వం వొప్పుకోకుండా తిరస్కరించింది. అందువల్లే రైటిస్ట్ లు ఆ క్యాంపు కి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆహారం దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది.

1960 ఆకురాలు కాలంలో ఆహార పధార్దాల కొరత మరీ తీవ్రం కావడంతో రైటిస్ట్ ల్లో అధికభాగం ఆకలికి తట్టుకోలేక మరణించడం మొదలుపెట్టారు. పచ్చిక బయళ్ళలో ఆహారం కోసం వెతుక్కొని ఆకులు,అలమలు, చిన్న చిన్న పురుగుల్ని, ఎలుకల్ని, చివరకు తోటి ఖైదీలు మరణిస్తే వారి మాంసాన్ని, అంతే కాకుండా పశువుల, మానవ మలాన్ని కూడా తమ ప్రాణాలు నిలుపుకోవటానికి వారు తినాల్సి వచ్చింది. అంతేకాకుండా చెట్టుబెరడు  నుంచి తీసిన ఒక రకమైన జిగురు లాంటిదాన్ని సూప్ గా తాగితే తాత్కాలికంగా ఆకలి వుండకపోయినా లోపల ఇంటెస్టిన్స్ కి అది అతుక్కుపోయి చనిపోతామని తెలిసినా ఇక గత్యంతరం లేక అదే తాగి చనిపోయిన వారెందరో. మృతదేహాలకు కనీస ఖనన సంస్కారాలు కూడా లేక అవి అలా మట్టిదిబ్బల మీద పడివుండేవి.

ఎట్టకేలకు జియబియాంగ్  దురంతం బీజింగ్ లోని  సీనియర్ పార్టీ అధికారుల  దృష్టికి రావడంతో ప్రభుత్వం హడావిడిగా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి పంపేసింది. అలా బతికి  బైటపడిన వారు కేవలం 500 మంది మాత్రమే. ఈ విషాదం గురించి ఎప్పుడూ ప్రభుత్వం అధికార ప్రకటన చేయలేదు. మెడికల్ రికార్డ్స్ తిరగరాయించి ఖైదీలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినట్లు తప్పుడు నివేదికలు తయారుచేయించింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అలా క్యాంపు లో జరిగిన విషాద సంఘటనల వివరాలు ఒక మిస్టరీ గానే మిగిలిపోయాయి.

ఇక ఈ పుస్తకానికి శీర్షిక గా పెట్టిన కథ గురించి...ఆమె జైలుశిక్ష పడ్డ ఓ రైటిస్ట్ భార్య . ఆమె పేరు  గు. ఆమె భర్త పేరు డోంగ్. తన భర్త ఆ ప్రవాస జైలు జీవితం నుండి ఎప్పటికైనా షాంగై తిరిగివస్తాడని ఆమె నమ్మకం. ఒకసారి ఆమె తన భర్త ని చూడటానికి జియబియాంగ్ వస్తుంది. ఆమె రావటానికి ముందే ఆమె భర్త చనిపోతాడు. జైల్లో భర్త స్నేహితుడు, తోటీ ఖైదీ ఆమెకు డోంగ్ మరణవార్త చెప్తాడు. ఆమె ఎలాగైనా భర్త మృతదేహాన్ని చివరిసారిగా చూడాలనుకుంటుంది. కానీ అసలు నిజం తెలిసిన తోటి  ఖైదీ ఆమెకు  రకరకాల అభ్యంతరాలు చెప్తాడు. అయినా ఆమె తన పట్టు విడవకుండా నిరాహారదీక్ష సైతం చేస్తుంది. ఇక తప్పక తోటి ఖైదీ ఆమెను డొంగ్ మృతదేహం పడివున్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. అప్పటికే డొంగ్ మృతదేహం లోని ముఖ్యమైన భాగాల్ని కొందరు ఖైదీలు తినేసారన్న కఠిన నిజమే అతను గు తన భర్త మృతదేహం చూడకుండా అడ్డుపడటానికి కారణం. మట్టిదిబ్బల మీద సగం శరీర భాగాలు కూడా లేకుండా పడి వున్న భర్త మృతదేహాన్ని చూసి చలించిపోతుంది గు. అయినాసరే, అక్కడే తన భర్తకు ఎలాగైనా దహనసంస్కారాలు చేసి ఆ ఎముకల్ని, చితాభస్మాన్ని షాంగై తీసుకెళ్ళలన్నది ఆమె ప్రయత్నం. ఆమె దగ్గర ఎముకలు మోసుకెళ్ళేందుకు కూడా ఏమి మిగలని పరిస్థితుల్లో సహచర ఖైదీ ఆమెకు తను ఎంతో కాలం గా ప్రాణప్రదం గా కొరియన్ వార్ కి గుర్తుగా దాచిపెట్టుకున్న అమెరికన్ బ్లాంకెట్ ని ఇస్తాడు. అందులో ఆమె అతి పదిలం గా తన భర్త ఎముకల్ని దాచుకొని తిరిగి షాంగై వెళ్ళిపోతుంది. గు పట్టుదల అతని మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆమెను అతను మర్చిపోలేకపోతాడు. క్షమాభిక్షతో బయటపడ్డ కొన్నేళ్ళ తర్వాత షాంగై వెళ్ళినప్పుడు ఆమె ఆచూకి కోసం ప్రయత్నించి కూడా చివరకు ఆమెను కల్సుకోకుండానే వెనక్కు మళ్ళుతాడు.అలా ఆ షాంగై  మహిళ ఆ ఖైదీల్లోనే కాకుండా ఈ పుస్తకం చదివే పాఠకుల మనస్సులో కూడా చెరగని ముద్ర వేస్తుంది.

ఇలా ఆ లేబర్ క్యాంపులో రైటిస్ట్ లు ప్రతి రోజు ఎదుర్కొనే సంఘర్షణలే ఈ కథలు.

సిటీ వేర్ హౌస్ నుండి విత్తనాలు గా పాతిపెట్టెందుకు బంగాళదుంపల్ని తీసుకొచ్చే క్రమంలో కొందరు ఖైదీల గ్రూప్ వాటిల్లో కొన్ని బంగాళదుంపల్ని దాచి వుడికించి తిన్నందువల్ల ఎదురైన తీవ్ర పరిణామాలు చెప్తుంది " ది పోటాటో ఫీస్ట్". ఓ మహిళా ఖైదు క్యాంపులో పుట్టిన తన బిడ్డను పెంచడంలో ఎలాంటి కష్టాలు పడిందో, తోటి మహిళా ఖైదీలు తమకే తినటానికి లేకపోయినా ఆ తల్లి తన బిడ్డకు పాలిచ్చేందుకు తమ ఆహరంలోంచి కొంత భాగాన్ని ఆమెకు ఇవ్వడం, ఆ బిడ్డ, తామందరి బిడ్డగా భావించే వైనం చెప్పిన " జియా నాంగ్" మనల్ని కూడా కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. ఓ ఖైదీ ఎలాగైనా సరే ఆ క్యాంపు సంకెళ్ళ గోడలల్ని బద్దలు కొట్టి బైట పడాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన విధానాన్ని అందిస్తుంది " ఎస్కేప్ ". ఇలా ఈ కథలన్నీ ఖైదీలు పడ్డ కష్టాల్ని మన ముందుంచి చైనా ప్రభుత్వపు అమానుషత్వానికి, అమానవీయ చర్యలకు  దర్పణం పడతాయి. చైనా చరిత్రలో దాగి వున్న ఓ చీకటి కోణాన్ని  బహిర్గతం చేసే కథనాలివి.

అసలు ఈ పుస్తకం లోని కథనాలు ఎలా వెలుగు చూసాయంటే...

ఈ పుస్తక రచయత జియాన్ హుయ్ గాన్స్ ప్రాంతానికి చెందినవాడు. యాంగ్ మొదటగా ఈ జియబియాంగ్ గురించి 1965 లో విన్నాడు. అప్పుడు యాంగ్ 19 ఏళ్ల హైస్కూల్ గ్రాడ్యుయేట్ . అతనిలో పూర్తిగా విప్లవ భావాలు నిండివుండేవి. చైనా లో వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతాన్ని అభివృధ్ధి చేసేందుకు పట్టణ జీవితాన్ని వదిలి వేలాదిమంది యువత చేపట్టిన కార్యచరణలో యాంగ్ కూడా భాగస్వామి. అక్కడ మిలట్రి తరహా కలెక్టివ్ ఫారం లో యాంగ్ కి ఖైదు జీవితాన్ని పూర్తి చేసుకొని ఆ ఫారం లో పని చేసేందుకు నియమితులైన కొందరు రైటిస్ట్ లతో పరిచయమైంది. ఒకరోజు యధాలాప సంభాషణలో ఎవరో జియబియాంగ్ విషాద మరణాల గురించి అనధికారికంగా ప్రస్తావించారు. యాంగ్ దానిగురించి మరిన్ని వివరాలు అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పటానికి నిరాకరించి ఆ విషయాన్ని అక్కడితో ఆపేసాడు.
 
ఆ సంభాషణ చిన్నదే అయినప్పటికీ యాంగ్ లో ఒక ఆసక్తి రేకెత్తించింది. కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి అమానుషాల్ని తన సొంత ప్రజల పట్ల చేయడం అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని గురించి మరింత ఎక్కువ తెల్సుకోవాలనుకున్నడు. జియబియాంగ్ గురించి తెల్సుకునే ప్రయత్నమంటే  ఒకరకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కిందే లెక్క. అలా యాంగ్ ఆ కలెక్టివ్ ఫారం లో 1981 వరకు 16 ఏళ్ళ పాటు వున్నాడు. ఆ కాలంలో చైనాలో అనేక చెప్పుకోదగ్గ మార్పులు సంభవించాయి. మావో 1976 లో చనిపోయిన తర్వాత ఆయన అనుచరుడు డెంగ్ జియోపింగ్  మావో రాడికల్ కమ్యూనిస్ట్ విధానాలకు స్వస్తి చెప్పి చైనా ను రాజకీయ, ఆర్ధిక సంస్కరణల మార్గం లో నిలబెట్టాడు. 70 ల తర్వాత రైటిస్ట్ వ్యతిరేక ప్రచారం లో జరిగిన తప్పుల్ని గుర్తించి రైటిస్ట్ ల మీద విధించిన తీర్పుల్ని ప్రభుత్వం తిరగ రాసింది. ఆ క్రమం లో చాలా మంది ఖైదీల్ని విడుదల చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఆ విషాదానికి సంబంధించిన  బాధ్యతను స్వీకరించే ఆలోచన ఏది చేయలేదు.

యాంగ్ 1988 లో వృత్తిరీత్యా రచయత గా మారి టియాంజిన్ పోర్ట్ సిటి కీ నివాసం మార్చుకొని  అనేక కథలు, నవలలు రాశాడు. అయితే అతనెప్పుడూ జియానియాంగ్ గురించి మర్చిపోలేదు. 97 లో మావో యాంటి రైటిస్ట్ క్యాంపైన్ 14 వ వార్షికోత్సవం సందర్భంగా యాంగ్ అధికారికంగా తన ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. ఈ విషయం చుట్టూ నెలకొని వున్న రాజకీయ వొత్తిడులు కొంచెం పలచబడినట్లనిపించడంతో అతను తిరిగి గోబీ ఎడారికి ప్రయాణమయ్యాడు. ఈ విషాదం నుండి బతికి బైటపడ్డవారికోసం వెతకటం ప్రారంభించాడు. అయిదేళ్ళ పాటు సాగిన ఈ అన్వేషణలో యాంగ్ వందమంది  మాజీ ఖైదీలను, వాళ్ళ బంధువుల్ని ఇంటర్వ్యూ  చేసాదు.

వారిలో కొందరు మళ్ళీ ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో వివరాలు చెప్పటానికి తిరస్కరించారు. కొందర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ దారుణాలు వినలేక మధ్యలో ఇంటర్వ్యూ ఆపి బయటకువెళ్ళి కళ్ళనీళ్ళు తుడుచుకొని వచ్చి మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టేవాడు యాంగ్.  మొదటగా " వుమన్ ఫ్రం షాంగై" కథ ప్రచురితమైనప్పుడు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించింది. అలా తను సేకరించిన కథనాలన్నింటినీ ఒక సిరీస్ గా ప్రచురించాడు. అయితే యాంగ్ చేసినది ఒక జర్నలిస్టిక్ పని. కాని అతను దాన్ని కధలు గా మార్చి రాయటానికి ఒక కారణం వుంది. యాంగ్ రాసింది " డాక్యుమెంటరి లిటరేచర్". 80ల్లో చైనా  రచయితలు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో తమ జర్నలిస్టిక్ వర్క్ కి కొంత సృజనాత్మకతను జోడించటం ప్రధాన అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పనిసరి అంటాడు  యాంగ్.

 " పత్రికా స్వాతంత్ర్యం ఒక సంప్రదాయం గా వున్న పశ్చిమ దేశాల్లో ఇది కనీసం వూహించను కూడా వూహించలేము. అక్కడ సాహిత్యమంటే సాహిత్యం. వార్తలంటే వార్తలు. ఎవరు కూడా ఈ రెంటినీ కలిపెయ్యరు.చైనా రచయితలకు ఈ తేడా  తెలియక కాదు. సమకాలీన జీవితంలో నిక్లిష్టమైన పరిస్థితుల వల్ల ఇలా ఆ రెంటిని కలగలిపి రాయడం తప్ప వాళ్ళకు మరో అవకాశం లేదు" అంటాడు యాంగ్.

యాంగ్ కథనాల్ని ప్రచురించిన ఎడిటర్లు ఒక అడుగు ముందుకేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాపగాండ కళ్ళ నుండి  తప్పించుకునేందుకు కథనాల్ని ఫిక్షన్ కేటగిరి కింద ప్రచురించారు. ఈ పుస్తకానికి వచ్చిన ప్రజాదరణ వల్ల , ఈ దారుణ కాండ నుంచి బతికి బయటపడ్డ అనేకమంది బాధితులు, అంతకు ముందు అనేక దశాబ్దాలుగా వీటి గురించి పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడని వారు, ఇప్పుడు ముందుకు వచ్చి యాంగ్ తో తమ కథలు చెప్పుకుంటున్నారు.
 
కల్పనారెంటాల
 
  ( ఈ వ్యాసం పాలపిట్ట అక్టోబర్ సంచిక లో ప్రచురితం)
 
 
 
 
 
 

Saturday, July 03, 2010

కార్పొరేట్ సంస్కృతి కి అక్షర చిత్రం “ రాతిపూలు”




తొలి నవల ‘ సుప్త భుజంగాలు ‘ తోనే తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సాహిత్య లోకం లో సంపాదించుకున్న రచయిత్రి సి. సుజాత కలం నుండి దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత వెలువడ్డ మరో నవల “ రాతిపూలు”. రంగుల కల లాంటి సినీ పరిశ్రమకు, ఆధునిక కార్పొరేట్ జీవితానికి దర్పణం ఈ నవల. కార్పొరేట్ సంస్కృతి కాళ్ళ కింద నలిగిపోయిన జీవితాల్లోని సంఘర్షణ ఈ నవలకు ఆయువుపట్టు. కాలక్షేపం కోసం కాకుండా ఈనాటి నగర జీవన సంస్కృతి అనే వూబి లో కూరుకుపోతున్న జీవితాలను గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారు తప్పక చదవాల్సిన, చదివింపచేసే గుణం వున్న నవల ‘ రాతిపూలు’.


హైదరాబాద్ రణగొణద్వనుల మధ్య పరుగులు పెట్టె ట్రాఫిక్ లో పగలు, రాత్రి మన చుట్టూరా కనిపించే వ్యక్తుల అసలు సిసలు తెరవెనుక జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ నవల. పట్టణం లో అందంగా కనిపించే అబద్ధపు జీవితాలు ప్రాణం లేని, వాసన రాని రాతిపూల లాంటివి.చూడటానికి అందంగా వుండి, సున్నితంగా కనిపిస్తూ ఎప్పటికీ వాడిపోకుండా నిత్య నూతనంగా ఉంటాయి ఈ రాతిపూలు. కానీ జీవం,పరిమళం లేని వొట్టి రాతిపూలు అవి.


నగర జీవితమంటే ఇవాళ అందరికీ కనిపిస్తున్నది వస్తు వ్యామోహమే. కానీ దాని వెనుక విఫలమైన ప్రణయాల్ని, కూలిపోయిన కాపురాల్ని చూపిస్తుంది రచయిత్రి ఈ నవల లో. భవంతుల కోసం భార్యల్ని తాకట్టు పెట్టే రసజ్నలు, వస్త్రాపహరణాలు చేసి దోచుకునే సురేంద్ర లు, తప్పని తెలిసి ఆ తప్పును చేయకుండా నిగ్రహించుకోలేకపోయిన అహల్య లాంటి శమంతల కథ ఇది.

ఈ నవలలోని ప్రధాన స్త్రీ పాత్రలన్నీ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చి కెరియర్ నిచ్చెన మెట్లు ఎక్కి పైకి ఎదగాలనుకొని ఆశపడి, ఆ క్రమం లో తమ వ్యక్తిత్వాల్ని, తమ నమ్మకాల్ని, తమ ఆశల్ని, జీవితం పట్ల తమ ప్రేమని పణంగా పెట్టి వొడిపోయిన వాళ్ళే. డబ్బు చుట్టూ అల్లుకున్న సక్సెస్ వూబిలో పడి కూరుకుపోయినవాళ్ళే. నైతికానైతికాల త్రాసు లో తూచి ఈ నవలలోని పాత్రల్ని విశ్లేషించలేము. నగర జీవిత చిత్రణ లో రచయిత్రి కున్న జర్నలిస్ట్ వృత్తి అనుభవం, సామాజిక సమస్యల పట్ల అవగాహన మనకు ఈ నవలలో కనిపిస్తుంది. శమంత, కిన్నెర, జమున లాంటి స్త్రీల మీద జాలో, సానుభూతో, లెదంటే అసహ్యమో కాకుండా ఓ మనిషి లో వుండే మామూలు బలహీనతలతో వాళ్ళను అర్ధం చేసుకోవాలనిపిస్తుంది ఈ నవల చదివాక.

ఒక సారి చదవటం మొదలుపెట్టాక ఆపకుండా చదివించే శైలితో సాగుతుంది. ఈ నవల చదవటం పూర్తి చేశాక, ఒక అద్దం లో నగరాన్ని, మన జీవితాల్నీ కలిపి ఎదురుగా అక్షర కాన్వాస్ మీద చూస్తున్నట్లు అనిపిస్తుంది .


కార్పొరేట్ జీవన శైలిలో ఒక్కోసారి కుటుంబం, మానవ సంబంధాలు, కట్టుబాటు అన్నీ ఎట్లా దూదిపింజెల్లా ఎగిరిపొతాయో. కోరుకున్న జీవితం కోసం శరీరం తో, మనసు తో వ్యాపారం చేయడం ఒక్కోసారి ఎలా అనివార్యమవుతుందో విశ్లేషిస్తుంది రచయిత్రి ఈ నవల లో. ఒక మనిషి ఉనికిమొత్తం డబ్బే అయినప్పుడు లెక్కలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి. అనుబంధాలన్నీ మారిపోతాయి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలతో హాయిగా వుండాలనుకుంటాం. ఆ దారిలో నడుస్తాం. గమ్యం చేరాక నిజంగానే ఆనందం గా వుంటామనుకుంటాము. కానీ అది నిజం కాకపోవచ్చు. ఆ దారి లో మనం ఎన్నింటినో, ఎందరినో కోల్పోతాం . మనం కోరుకున్న, ఆశపడ్డ డబ్బులు మనకు అందాక మన దగ్గర చూసుకుంటే శాంతి వుండదు. ప్రశాంతత మిగలదు. డబ్బు తెచ్చే సౌఖ్యాలు, ఎలాంటి సంతోషాన్ని మిగల్చవు. నడిచొచ్చిన దారి, మనం పోగొట్టుకున్నవి అప్పుడు స్పష్టం గా కనిపిస్తాయి. కానీ జీవితాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోలేము.కేవలం పశ్చాత్తాపపడటమో,బాధపడటమో తప్ప.

ఈ నవలలో కథానాయిక శమంత అందుకే తను చేసిన వాటిని తప్పొప్పులతో పోల్చుకోదు. వాటిని కేవలం పనులుగా చూస్తుంది.ఎందుకంటే ఆమె తన శరీరంతో, మనసుతో చేసిన దాన్ని ఒక వ్యాపారంగానే భావించింది. జీవితాన్ని వ్యాపారం గా మలుచుకోవటం లో ఒక రాతిపువ్వు లాగా మారిన శమంత మళ్ళీ కావాలనుకుంటే మనిషి గా మారగలదా? ఆ ప్రయత్నం అటు రసజ్న, ఇటు శమంత ఇద్దరూ మొదలుపెట్టాలి. అది కష్టమైనా అసాధ్యం కాదు. అలా జీవితం పట్ల తిరిగి ఆ ప్రేమ ను, ఆ నమ్మకాన్ని ఈ నవల ద్వారా రచయిత్రి సి. సుజాత అందిస్తుంది.


రాతి పూలు (నవల)
నవ్య వీక్లీ లో ధారావాహిక ప్రచురణ
ప్రతులకు:అన్నీ పుస్తకాల షాప్ లు
రచయిత్రి ఫోన్ నెం: 9553586086
ఈమైల్ : sujata.c@hmtv.in


(ఈ చిన్న పరిచయం వ్యాసం నుంచి కొంత భాగం జూలై 4 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైంది)

కల్పనారెంటాల

Thursday, February 25, 2010

"ఊరి చివర" ఉప్పెనలా కవిత్వం

అఫ్సర్ గారి కవిత్వ పుస్తకం “ ఊరి చివర “ పై అంతర్యానం బ్లాగర్ కొండముది సాయి కిరణ్ కుమార్ రాసిన విశ్లేషణాత్మక పరిచయం ఇక్కడ, కవిత్వం లో సామాజిక కోణం గురించి కొండముది గారి అభిప్రాయాలు ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలపండి.
ఊరి చివర పుస్తకం కోసం ఎన్. వేణు గోపాల్ రాసిన ముందు మాట జ్ఞాపకాన్ని కవిత్వం గా మార్చే రసవిద్య ఇక్కడ చదవండి.

Sunday, January 03, 2010

ఒక ‘ జెంటిల్మెన్ ‘ కన్ఫెషన్ !





స్త్రీ ,పురుష అనుబంధ, బాంధవ్యాల గురించి ఇటీవల వచ్చిన ఒక మంచి పుస్తకం మధుపం -ఒక మగవాడి ఫీలింగ్స్. నేను అచ్చంగా పదహారణాల తెలుగింటి మగవాడిని అని రచయత పూడూరి రాజిరెడ్డి వినయంగా చెపుతూనే అతిశయంగా రాసుకొన్ని కొన్ని అనుభూతుల సమాహారం ఈ పుస్తకం. సాక్షి దిన పత్రికలో జెంటిల్మెన్ శీర్షికన ఒక కాలమ్ గా సరదాగా రాసుకున్న సీరియస్ విషయాలు ఇవి. . స్త్రీ,పురుష సంబంధాలు జటిలంగానో, క్లిష్టంగానో పైకి కనిపిస్తున్నా, వాటి వెనుక ఇంత సున్నితత్వం, భావుకత్వం, ఇంత రసవంతమైన ఫీలింగ్స్ వుంటాయని, మళ్ళీ మనకు గుర్తు చేస్తూ, వాటి గురించి మనసు విప్పి మాట్లాడిన ఈ పుస్తకం మనల్ని అబ్బురపరుస్తుంది. మధుపం తేనెతుట్ట చిక్కనైన కవిత్వ శైలితో అక్షరాలా అమృతధారల్ని చిలికించింది.

ఈ పుస్తకంలో వున్నవి కేవలం ఓ మగవాడి ఫీలింగ్స్ మాత్రమే కాదు. ఇందులో స్త్రీ గురించి, స్త్రీని అర్ధం చేసుకునే క్రమం గురించి బొలెడన్నీ స్వగతాలు, కొత్త ఆలోచనలున్నాయి. “ రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం రామదాసు శ్రీరాముడ్ని తిట్టినట్లు వుంటుంది” ( ముందు మాట – మాధవ్ శింగరాజు ) అన్నది అక్షర సత్యం. అందుకనే పురుషుడి ప్రపంచంలో తానేమిటో తెల్సుకోవాలనుకునే ప్రతి ఆడపిల్లా ఇది చదవటం తప్పనిసరి అని నాకనిపించింది. ఇందులో పెళ్ళిలో, ప్రేమ లో కూరుకుపోయిన ప్రతి ఆడపిల్లా వుందని నా నమ్మకం. స్త్రీ మానసిక ప్రపంచాన్ని పురుషుడు అర్ధం చేసుకోవాలన్నది స్త్రీవాదుల ప్రధాన వాదనైతే ఇది ఖచ్చితంగా ఆ పనే చేసింది. మగవాళ్ళ ప్రపంచంలో ఆడవాళ్ళ గురించి వున్న ఆలోచనల్ని చెపుతుంది ఈ పుస్తకం. స్త్రీల ప్రపంచంలోకి తొంగిచూసి, వాళ్ళ ఆలోచనల్ని, మెళకువల్నీ దొంగిలించేసి ఇలా తన కాలమ్స్ లో జెంటిల్మెన్ గా రాజిరెడ్డి రాసేసుకున్నాడనిపిస్తుంది.. జెంటిల్మెన్ లా మాట్లాడమంటే , రాయడమంటే యాంటీ ఫెమినిస్ట్ కాదు, పురుషహంకారం అంతకన్నా కాదు. సున్నితమైనా ఈ తేడా తెలుసుకొని, అణువణవునా, అక్షరాక్షరం స్త్రీల పట్ల అభిమానాన్ని, ఆరాధననీ, అంతులేని ప్రేమను వొలకబోశాడు. అలాంటి జెంటిల్మెన్లు వొట్టి నాటీ బాయెస్సే తప్ప ఎప్పటికీ ఎంసీపీ లు కారు. కాలేరు కూడా. ప్రణయ కలహాల్లోని , పెళ్ళి పుస్తకం లోని మాధుర్యాన్ని, మధురిమ ను వొడిసిపట్టుకున్న పుస్తకమిది. స్త్రీలు స్త్రీవాదులవటానికి, పురుషులు స్త్రీవాదులవటానికి వున్న తేడా ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. స్త్రీ పురుష సంబంధాలు, వారి వారి వ్యక్తిత్వాలు, సెక్స్యువాలిటీల మీద పర్సనాలిటీ గురువులు,సైకాలజిస్ట్ లు లెక్చర్లు, స్టడీ గైడ్లు తో , పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు అచ్చేసి, అచ్చోసి వదులుతుంటే రాజిరెడ్డి వాటిల్లోని వైరుధ్యాల జోలికి పోకుండా జస్ట్ ఫిలాసఫీ ని బేస్ చేసుకొని జేకే , ఫ్రాయిడ్, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడాడటంతో ఈ కాలమ్స్ కి ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.

రాజిరెడ్డి వచన శైలి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన పాలపిట్ట చెప్పినట్లు వచనంలోనూ వెంటాడే వాక్యం రాజిరెడ్డిది. ఆప్తవాక్యం లో యాసీన్ చెప్పినట్లు రాత వరకు ఆడు మగాడు అన్నది కరెక్ట్ ఎక్స్ ప్రెషన్. నాకు రాజిరెడ్డి వచనం చూసినప్పుడల్లా, చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగినట్లు, విరజాజుల తోటలో విహరించినట్లు, మనల్ని ఆసాంతం మోహపరిచే అతని వాక్యాల నిండా దాచినా దాగని ఓ చిలిపితనం కనిపిస్తుంటుంది. మనల్ని దెప్పిపొడుస్తున్నట్లు కనిపిస్తూనే అందులోని ఆరాధనాభావం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ కాలమ్స్ నిండా ఒక్క ద్వేషం తప్ప మిగతా రస భావాలన్నీ తొణికిసలాడుతూ మనల్ని కవ్విస్తాయి. పురుషుడు చికాకు పడ్డా, కోప్పడ్డా మీ మీద ప్రేమే తప్ప , మీరు లేకపోతే మాకు వునికే లేదన్న ఒక కన్ఫెషన్ కనిపిస్తుంది. అచ్చంగా మాట్లాడుతున్నట్లే రాయడం రాజిరెడ్డి స్టైల్. సినిమాల్లో కెళితే త్రివ్రిక్రం శ్రీనివాస్ లాగా మంచి ' పంచ్ ' వున్న డైలాగులు రాయగలడన్న నమ్మకాన్ని ఇస్తాడు.. How To Lose A Guy In Ten Days హాలీవుడ్ కామెడి సినిమా లాగా How To Understand An Ordinary Indian Guy With One Book అంటే ఈ పుస్తకమే చెప్పాలి.. పదహారణాలా తెలుగు మగాడ్ని అర్ధం చేసుకునే మాన్యూయల్ ఇది. ' నువ్వు మారావు, సో నేను మారాను అంటూ నిజాలు చెప్తూ ఏడిపిస్తాడు. ఆడాళ్ళ కన్నీళ్ళ గురించిచెప్పి మనల్నినవ్విస్తాడు. ఇలా ఇందులో రాజిరెడ్డి రాసిన విషయాలు చూస్తే...అబ్బా! ఇంత దుర్మార్గం గా ఆలోచిస్తారా మీ మగవాళ్ళు అని ఆడవాళ్ళకు ముద్దుముద్దుగా విసుక్కోవాలనిపిస్తుంది.

ఆఫీసులు ఇంతకు ముందులా ఎందుకు లేవో చెపుతూ సినిమా తార కంటే మన సహోద్యోగి పెట్టే చిత్రహింస ఎక్కువంటాడు . ఏ గీతా దాటని విచిత్ర బంధాల గురించి విశ్లేషిస్తాడు. స్త్రీల దగ్గర మన్ననగా వుండే మర్యాదా పురుషోత్తములు స్నేహితుల సమక్షంలో ఎలాంటి సెన్సార్షిప్ లు లేకుండా ఎలా అన్ ఫిల్టర్డ్ మాటలు మాట్లాడుకుంటారో వెల్లడి చేస్తాడు.నిజానికి షివల్రి ఇంట్లోంచే మొదలవుతుందని చెపుతూ పక్కింటి బామ్మను, బస్ లో చంటి పిల్లాడి తల్లికి సహాయపడటం కూడా ఆ కోవలోకే వస్తుందంటాడు. పొద్దున లేవగానే నల్లా నీళ్ళ కోసం లుంగీ ఎత్తికట్టి, మళ్ళీ నీళ్ళు ఎప్పుడొస్తాయా అని ఆలోచిస్తూ లుంగీ దించి పడుకునేదాకా అవలీలగా సంసార సాగరాన్ని ఈదుతూ సంసారంలో వున్న మజా సన్నాసులకు ఏం తెలుసని అనుకుంటూ తృప్తీగా నిద్రపోయే మధ్యతరగతి సంసారికి వందనం చేస్తాడు.“ నువ్వు నాక్కావాలి. కానీ నేను నువ్వు కావాలనుకోను “ అని దర్పంగా ప్రకటించుకుంటాడు. మగటిమినే తన జూలు గా వూహించుకుంటూ తానొక కిరీటం లేని మగ సింహంగా కలలు కంటాడు. “ నీకేం రా మా రాజువి “ . బస్. ఆ మాటొక్కటే చాలు ఈ జీవితానికి అని సంతోషపడిపోతుంటాడు. బర్త్ డే మాత్రమే సంసారికి గుర్తుంటే, డేట్ ఎప్పుడో కూడా తెలుసుండే బాచిలర్...ఓ మంచి మొగుడని, కొత్తగా చూడటమే బ్రహ్మచర్యమని ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇస్తాడు. అయ్యో, మీకేమి తెలీదు మీకు చెప్పడం బదులు నేను చేసుకున్నది నయం అని ఆమె చేత అననిస్తూ భార్యని మాయం ఎలా చేయాలో చిట్కాలు చెప్తాడు. ఏడ్చే మగాడ్ని కూడా నమ్మచ్చు అంటూ మన ఉద్వేగాలన్నింటినీ వరదాలా బయటికి పంపుకోవడానికి ఏడుపు భాష ని నేర్చుకుందాం అని సలహాలిస్తాడు. నేను మారాను, కారణం....నువ్వు మారావు అని చెపుతూనే నువ్వు నా రెండో అమ్మవి కదూ! అమ్మను పిల్లవాడు నచ్చకపోవడం అంటూ వుంటుందా?’ అని పెళ్ళానికో ప్రేమలేఖలో అమాయకంగా అడుగుతుంటే అతనిది ప్రేమ కాదు ద్వేషం అని ఎలా ఆరోపిస్తాం? అదొట్టి అన్యాయం కదూ!అనుక్షణం ఆనందాన్ని ,లాగులాగా జారిపోతున్న జీవితాన్ని పైకి లాక్కునే వాడే అసలైన జెంటిల్మెన్ అంటాడు.

ప్రాణవాయువుతో మాత్రమే కాకుండా, నిజంగా జీవించడం కోసం స్త్రీ,పురుషులిద్దరూ ఒకానొక జీవితానుబంధంలో ఏం పొందాలో, ఏవీ వదులుకోవాలో, ఏవి నిలబెట్టుకోవాలో జెంటిల్మెన్ కోణం నుంచి చెప్పుకోస్తాడు. అందుకే, నాకు మధుపం నచ్చింది. రాజిరెడ్డి చూపించిన ‘ జెంటిల్మెన్ ‘ ల జీవితంలో వున్న స్త్రీలం మనమే. మన కోసం ఓ జెంటిల్మెన్ రాసిన పుస్తకం ఇది. చదివి మనల్ని సరదాగా ఎలా వెక్కిరించాడో చూసి ఉడుక్కుందాం. మాటలతో, రాతలతో, మనల్ని వాళ్ళు ఎలా ఐస్ చేస్తున్నారో బాహాటంగా వెల్లడి చేసిన వాళ్ళ కన్ఫెషన్ లని అంగీకరిద్దాం. మన గురించి మన జీవన సహచరుడు నిజాయితీగా మనసు లోతుల్లో ఏమనుకుంటున్నాడో చదివి అర్ధం చేసుకోవటానికి ఈ మాన్యుయల్ ఎప్పుడైనా పనికొస్తుంది. ఈ మధ్య కాలం లో వచ్చిన పుస్తకాల్లో ఇది must read book .

వంటింటిలో అప్పడాల కర్రతో పాటు ఈ పుస్తకాన్ని కూడా దాచిపెట్టుకుందాం. ఎప్పుడైనా (సెలవురోజుల్లో కూడా సహచరుడు ఆఫీసుకెళ్తానన్నప్పుడు ...) దీనితో అవసరం పడవచ్చు. గిరీశం చెప్పినట్లు మగవాళ్ళు వొట్టి వెధావాయలు ...వాళ్ళ గుట్టు,మట్లు కూడా వాళ్ళే చెప్పేసుకొని మన పని మరింత సులువు చేసేశారు. ఇప్పుడు కూడా మనదే పై చేయి!.

కల్పనారెంటాల

(జనవరి 04,2010 సాక్షి సాహిత్యం పేజీ లో ప్రచురితమైంది.)



 
Real Time Web Analytics