నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, July 25, 2011

అమ్మకో ఉత్తరం !

ఇందాక నీతో ఫోన్ లో మాట్లాడుతుంటే సడెన్ గా లైన్ కట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న కంప్యూటర్ నేర్చుకొని ఈమెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకొమంటే వినవు కదా అమ్మా! ఇప్పుడు చూడు, నాకెంత టైమ్ వేస్టో. కాలింగ్ కార్డులతో ఫోన్ చేస్తుంటే మనిద్దరి మాటలు మధ్య లో ఉన్న మధ్యధరా సముద్రం లోనో, అరేబియా సముద్రం లోనో కలిసిపోతుంటాయి. అన్నయ్య ను అడిగితే నీకు మధ్య సరిగా వినపడటం లేదని, ఫోన్ చేసినా ఉపయోగం లేదని చెప్పాడు. ఇక తప్పుతుందా మరి అని ఉత్తరం మొదలుపెట్టాను. అమెరికా కబుర్లేమిటి అంటూ అక్కయ్య నన్ను ప్రాణం తీస్తోంది. కాన్ఫరెన్స్ కాల్ చేసి మనం ముగ్గురం ఫోన్ లో హాయి గా కబుర్లు చెప్పుకుందామంటే దిక్కు మాలిన కాలింగ్ కార్డ్ లు ఉన్నట్లుంది ఉలుకుపలుకుల్లేకుండా అవుతాయి.
నువ్వు ఊరికే బాధపడుతుంటావు కానీ అమ్మా, నాకేమైంది? ఇక్కడ నేను హాయిగా వున్నాను. నా గురించి ఊరికే దిగులు పడకు. నేను, మా ఆయన , పిల్లలం అందరం సుఖం గా ఉన్నాం. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను సరిగ్గా వండుకొని తింటున్నానో లేదో అని ఊరికే దిగులు ఇదై పోకు. పది రోజులు ఏదో నీ మాట తీసెయ్యలేక, ' అమ్మ వారు' పోసిందని జాగ్రత్తగా పథ్యం చేశాను. ఇవాళ ఆదివారం తలంటుస్నానం చెశాను కానీ పోలేరమ్మ కు పెరుగన్నం నైవేద్యం మాత్రం పెట్టడం వీలు కాలెదు. నా తెల్లటి మొహం మీద మచ్చలు పడ్డాయేమోనని నువ్వంత కంగారు పడుతున్నావు కానీ ఇక్కడ డాక్టర్లు అతి శ్రద్ధ్గగా, పరమ జాగ్రత్త గా చూసుకుంటున్నారనుకో. ' చికెన్ పాక్స్' అని తెలియగానే ఎంత హడావిడి చేశారనుకున్నావు! ఎవరెవరికి ఎప్పుడెప్పుడు జబ్బు వచ్చి ఉంటుంది అన్న దాని మీద మన వంశ వృక్షమంతా తిరగేశారు. అసలు ముందు వాళ్ళు చేసిన పనేమిటనుకున్నావు? నన్ను ఎమర్జెన్సీ రూమ్ కు పంపటం. ఎన్ని రకాల పారీక్షలు చేయవచ్చో ఒక్కటీ వదలకుండా అన్నీ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా తల ప్రాణం తోక కు వచ్చినా పేషెంట్ల పట్ల వాళ్ళ శ్రద్ధ చూసి ముచ్చటేసిందనుకో. విషయం మాత్రం తెలిసి వచ్చింది. అనంతపురం లోనే కాదు, అమెరికా లో కూడా ' అమ్మ వార్లకు' అయ్యవార్లకు కూడా మందుల్లేవని. కానీ ఇండియా
అక్కడైతే సన్నగా బక్క పీచు లాగా వున్నానని అందరూ ఏడిపించేవాళ్ళు కానీ ఇక్కడకొచ్చాక నేను మంచి రంగు వచ్చాను. అమెరికా గాలి, నీళ్ళు నాకు బాగా సరిపడ్డాయి. కాకపోతే ఇక్కడి నీళ్ళకు నా జుట్టు కాస్త చిట్లినట్లుంటే సన్నగా పిలకలా వుందని నాకే చికాకనిపించి చక్కగా భుజాల దాకా కత్తిరించేసుకున్నాను. బుద్ధిమంతుల జడ భుజాలు దాటదని నువ్వే చెప్పావు కదా. సో, అలా బుద్ధిమంతురాలినైపోయానన్న మాట.
నన్ను చూసి అయిదారేళ్ళయిందని బెంగెట్టుకున్నానన్నావు. నిజమేననుకో. నాకు రావాలనే ఉంది కానీ ఇండియా ఎప్పుడొద్దామన్న ఏదో ఒక ఇబ్బంది. వర్షాకాలం లో వస్తే మన వీధుల నుందా బురద, మట్టి, రోడ్డు పక్కన ఎట్సెట్రా... తల్చుకుంటేనే రోత. చలికాలం లో వద్దామంటే మనింట్లో హీటింగ్ లేదు. ఇంక ఎండాకాలం సెలవులకు వద్దామంటే అబ్బో.. ఎండ... ఉక్కపోత...పైగా ఇక్కడ పిల్లలు సమ్మర్ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతారు. ఇక ఎప్పుడు రమ్మంటావో నువ్వే చెప్పు.
ఇందాక
నువ్వడిగినదేమిటి? సంతోషంగా వున్నానా అనేనా? నీకా అనుమానం ఎందుకు వచ్చింది? అమెరికా లో ఉండటమేమిటి ఏమిటి? ఒట్టి సంతోషమా? బ్రహ్మానందంగా ఉంటుంది. స్వేచ్ఛకు ఈ దేశం పెట్టింది పేరు. కొద్ది రోజులు పోతే, అప్పుడే పుట్టిన పిల్లకు పేరు కూడా ఆ పసి గుడ్డునే అడిగి పెడతారేమో! ప్రతి మనిషి మాటకు విలువుంటుంది. ఎవరి 'ఛాయిస్' కి ఎవరూ అడ్డురారు. ఇక సౌకర్యాల విషయానికొస్తే ఈ దేశం లో వున్నన్ని సౌకర్యాలు అంతరిక్షం లో కూడా ఉండవేమోనమ్మా. నీకో నిజం చెప్పనా? శరత్ నల్లగా తుమ్మ మొద్దు లా వున్నా, ఎందుకు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నది? అతను అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడనే కదా! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళకు సూది బెజ్జం లో దారం ఎక్కించే పని కూడా ఉండదు. ఒంట్లో కొవ్వు కరగాలంటే జిమ్ కెళ్ళి వాకింగ్ నో, జాగింగ్ నో చేయాల్సిందే కానీ ఒళ్ళు అలిసే పనులే ఉండవు. ప్రతి దానికి మెషిన్లు ఉంటాయి. పర్సు లో డబ్బుల బరువు కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మెషీన్ లో పెట్టి కార్డ్ పెట్టి డబ్బులు తీసుకోవడమే.
మెషిన్లకు టైమ్ సెట్ చేసి పెడితే అన్నీ అవే చేసుకుపోతాయి. కాళ్ళున్నా , లేకపోయినా బాధ లేదు. కార్లుంటే చాలు. ఎక్కడికైనా ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. విశాలమైన రోడ్లు. పచ్చటి చెట్లు. రకరకాల పూల మొక్కలు. ముఖ్యం గా తెల్లగా, పరిశుభ్రంగా మెరిసిపోయే బాత్ రూమ్ లు. కావల్సినంత అప్పు చేసే స్వేచ్ఛ. ఇంతకన్నా ఎవరికైనా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు కావాల్సిందేముంటుంది చెప్పు. అడుగడుక్కి షాపింగ్ మాల్స్. ఒక్కో మాల్ లో లెక్కలేనన్ని షాప్ లు. తిరగటానికి ఓపిక ఉండాలే కానీ ఒక్కో దాని లో ఎన్ని వెరైటీలో! ఎప్పుడూ ఏదో ఒక క్లియరెన్స్ సేల్ ఉంటూనే ఉంటుంది. అసలు లోపలకు వెళితే బయటకు రాబుద్ధి కాదనుకో. జగదేక వీరుని కథ లో రామారావు ఒక్కో లోకానికి వెళ్ళి వస్తుంటాడు చూడు. అలాగన్న మాట. మనకు కూడా ఒక్కో మాల్ లోకి వెళ్ళి వస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంటుంది.
ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇక్కడ కూడా ఆడవాళ్ళకు బోలెడు కష్టాలుంటాయని వాదించే వాళ్లనేమనాలి? నువ్వే చెప్పు. ఇక్క డ పని మనిషి రాలేదని హడావిడి పడనక్కర లేదు. ఇడ్లీ పిండి సరిగ్గా పూలవలేడ్ని దిగులు పడక్కరలేదు. పంటలు బాగా పండ లేదనో, వర్షాలు సరిగా కురవలేదనో, పుష్కరాల కోసం చుట్టాలు ఎక్కువ వచ్చారనో, ఆడపడుచుకు డబ్బులు పంపించాలనో దిగులు మేఘాల్లేవు. అడగకుండా ఎదురింటి పిల్లలు కూడా మన ఇంటికి రారు. పంచదారో, పది రూపాయలో అప్పు అడిగే పక్కింటి వాళ్ళు లేరు. వద్దన్నా పిలిచి మరీ డబ్బులు అప్పిచ్చే దేశం లో ఆడవాళ్ళు సుఖం గా లేకపోవడమేమిటమ్మా! అంతా నీ చాదస్తం కాకపోతేనూ!
చెత్త పారేసుకోవటం దగ్గర నుంచి బస్సులు తిరగటం దాకా ఇక్కడంతా ప్రతిదీ ఓ పద్ధతి గా జరుగుతుంది. బస్సు ఏ స్టాప్ లో ఏ నిమిషానికి ఆగుతుందో స్కేడ్యూల్ లో ఉంటుంది. వాన అయినా, చలి అయినా అందులో మార్పేమి ఉండదు. మన దేశం లో నైతే స్టాప్ ఎక్కడో ఉంటుంది. బస్సు ఎక్కడో ఆగుతుంది. ఎప్పుడు ఏ బస్సు ఎందుకు వస్తుందో, అసలెందుకు బస్సు రాలేదో జ్యోతిష్కులు కూడా చెప్పలేరు కదా. పై పెచ్చు బంద్ లనీ, రాస్తారోకోలనీ ఎప్పుడూ ఏవో ఆటంకాలు. అంటే అన్నానంటావు కానీ మన వాళ్లోట్టి వెధవాయిలోయి అన్న గిరీశం మాట ఎంత నిజమనుకున్నావు!
నాకైతే ఇక్కడ ప్రాణం తెరిపిన పడ్డట్లుందనుకో. అక్కడైతే పొద్దుట పాల ప్యాకెట్లు అయిపోతాయేమోనన్న టెన్షన్ తో తెల్లారేది. కానీ ఇక్కడ అలాంటి గొడవ లేదు. కాఫీ మేకర్ లో టైమ్ సెట్ చేసి రాత్రే కాఫీ పౌడర్ వేసి పెడితే పొద్దుట కరెక్టు గా మనం లేచే సమయానికి వేడి వేడిగా పొగలు కక్కుతూ డికాక్షన్ రెడీ గా ఉంటుంది. పాల ప్యాక్తెట్లు అయిపోతాయని పొద్దుటే నాలుగుగంటలకు నువ్వు లేచి వెళ్ళేదానివి కదా. అవన్నీ గుర్తొస్తే ఇప్పటి దాకా నువ్వేన్ని కష్టాలు పడ్డావో, ఇంకా ఎన్ని కష్టాలు పడతావో తలుచుకుంటే గుండెబరువెక్కుతుందనుకో.
ఇప్పటికైనా నా మాట విను. నీ మనసు మార్చుకో. నీ వీసా పేపర్లు పంపిస్తాను. ఇక్కడకు వచ్చేయి. నీ జీవితం లో కాస్త సుఖపడటం అంటూ ఏదైనా ఉంటే, అది అమెరికా లో మాత్రమేనని మరిచిపోకు. ఇక్కడేదో చాలా చలి గా ఉంటుందని నువ్వు భయపడతావు కానీ పై నుండి కింద దాకా దట్టమైన కోట్లేసుకొని ఇంట్లో హీటింగ్ పెట్టుకొని హాయి గా ఓ పెగ్ వైన్ తాగితే చలా, గిలా ...ఇక్కడ టైమ్ ని, వాతావరణాన్ని అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుకు , వెనక్కి తిప్పుకోవచ్చు. మొన్ననే మేం టైం ని ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం కూడాను. అదేం చోద్యమే అనకు. కారణం నేను చెప్పినా నీకర్థం కాదు.
ఇక్కడన్నీ రాజభోగాలేనమ్మా, మైనస్ డిగ్రీల చలి లో కూడా పంపు తిప్పితే వేడి నీళ్ళు. ఆకలేస్తే అయిదు నిముషాలుకూడా ఆగక్కరలేకుండా ఎప్పుడూ రెడీ గా ఉండే సెరియల్స్, శాండ్ విచెస్, ఇన్ స్టంట్ రైస్. చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ తినమంటే గొడవ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఆ పట్టింపు లేదు. అమెరికా లో ముందు మనం అలవాటు చేసుకోవాల్సింది సెరియల్స్, శాండ్ విచెస్ తినటమే. టైం లేకపోతే కూరలు తరిగే పని కూడా లేదనుకో. అన్నీ ఫ్రోజెన్ వే దొరుకుతాయి. అలా సీల్ తీసి ఇలా బాణలి లో పడేయటమే. పడీ పడీ తెల్లగా మెరిసేలా గిన్నెలు తోమక్కర లేదు. ఒక్క సారి పై పైన కడిగి డిష్ వాషర్ లో పడేస్తే చాలు. గిన్నెలను శుభ్రం గా కడిగి తడి గా లేకుండా డ్రై కూడా చేసే పెడతాయి. వారానికో సారి బట్టలు, దుప్పట్లు, కర్టెన్లు అన్నీ చక్కగా వేటికవి విడి విడిగా జాగ్రత్త చేసుకొని వాషింగ్ మెషిన్లో పడేస్తే చాలు. బాత్ టబ్ లు, కమోడ్ లు వారానికో సారి గంట సేపు బ్రష్ చేస్తే వారమంతా తెల్లగా మెరుస్తుంటాయి. వారం లో అయిదు రోజులు ఆఫీస్ పని. వీకెండ్ మొత్తం ఇలా ఇంటి పని. చూశావా? నేనెంత పని మంతురాలినై పోయానో! అక్కడైతే ప్రతి పనికీ పని మనుష్యుల్నీ బతిమి లాడాలి. వాళ్ళు నాగాలు పెడితే ఎంత టెన్షన్ పడే వాళ్ళం! ఇక్కడ అలాంటి డిపెండెన్సీ ఏమీ లేదు. మన పనులు మనం చేసుకోవడం శరీరానికి ఎంత ఆరోగ్యం అనుకున్నావు. ఈ సారి మేమంతా ఇండియా వచ్చినప్పుడు పని పిల్ల చెప్పకుండా ఎగ్గొట్టిందని నువ్వేమి కంగారూ పడిపోకు. అమెరికా అమ్మాయి అంటే అసలు సిసలైన పని మంతురాలు అంటుంది నా ఫ్రెండ్ అరుణ. ఈ సారి నువ్వే చూస్తావు గా నేను బాత్ రూమ్ లు ఎంత బాగా క్లీన్ చేస్తానో, ఇల్లు ఎంత బాగా నీట్ గా పెడతానో!
వారం రోజులు ఆఫీస్ తో కొంచెం బిజీ గా అనిపించినా వీకెండ్ మాత్రం చాలా హేపీ గా , జాలీ గా రక రకాల పార్టీలతో గడిచిపోతుంటుంది. ఒక్కో వారం ఒకొక్కళ్ళ ఇంట్లో పార్టీ. అచ్చంగా మనం వారాలు చెప్పుకున్నట్లు. సగం పార్టీలు పాట్ లక్ లే. అంటే ఏమీ లేదు. ఒకొక్కళ్లం ఒక్కో వెరైటీ చేసి తీసుకెళతాం. లేదంటే అన్నీ వంటలు ఒకరే చేయాలంటే ఎంత కష్టం! ఇలా అందరూ ఎవరూ ఎక్కువ కష్టపడకుండా, ఎవరి మనసు ఎక్కువ నొప్పించకుండా నడుచుకుంటుంటారు. ఇక్కడ ఏడుపులు, నవ్వులు, పుట్టినరోజులు , చావు పలకరింపు లు ప్రతీదీ టైం సెట్ చేసి పెట్టుకున్నట్లు జరిగిపోతుంటాయి. బర్త్ డే లు, వెడ్డింగ్ యానివర్సరీలు, బేబీ షవర్లు అన్నింటికీ వీకెండే మంచి ముహూర్తం. మనకేం జరిగినా తీరిగ్గా కూర్చొని వీకెండ్ లో ఏడ్చుకోవచ్చు. అక్కడైతే ప్రతీ నెలా ఏదో ఒక పండుగ. కొత్త బట్టలు, పిండి వంటలు, పట్టు చీరలు, పేరంటాలు. మనకి ఇష్టం లేకపోయినా చుట్టు పక్కల వాళ్ళ కోసమైనా ఏవో ఒకటి చేయాల్సి వచ్చేది. అబ్బో, ఎంత హైరానో కదా. మన దీపావళి, సంక్రాంతి కంటే హేలోవిన్, థాంక్స్ గివింగ్ , క్రిస్ మస్ లైతే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే వాటికి అధిక మాసాలు, తిథుల గొడవ లేదు.
ఇవన్నీ చదివిన తర్వాత నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. నేనెంత పరమానందంగా జీవితం గడుపుతున్నానో! ఇప్పటికైనా నా గురించి దిగులు పడటం మానేసి నీకు తెలిసిన ఆడపిల్లలకు అమెరికా జీవితం గురించి, అమెరికా మొగుళ్ళతో వచ్చే లాభాల గురించి చెప్పు. మన భాష , మన దేశం, మనసు, గినసు అంటూ పెట్టుకుంటే అన్నీ కష్టాలే కానీ సుఖాలేమున్నాయి చెప్పు? కాబట్టి అలాంటి ట్రాష్ ని అక్కడే కృష్ణ లో కలిపేసి ఇక్కడున్న మెషిన్లతో పాటు మనం కూడా ఒక మెషీన్ గా మారిపోతే మనకూ లాభం, మన దేశానికి కూడా లాభం.
ఎన్నాళ్లయిందో కలం పట్టుకొని తెలుగు లో ఉత్తరం రాసి. అక్షరాలు కుదురుగా, ముత్యాల్లా లేవని తిట్టబోకు. అసలు తెలుగు ఈ మాత్రమైనా మర్చిపోకుండా నేను రాసినందుకు సంతోషించు. నీకీలా ఉత్తరం రాస్తుంటే గుండెపట్టేస్తోంది. రియాల్లీ ఐయాం మిస్సింగ్ యూ మామ్.
ఇలా నీకుత్తరం రాస్తుంటే అచ్చంగా అప్పగింతలప్పుడు వచ్చాయి చూడు అట్లా నిజం కన్నీళ్లే వచ్చేస్తున్నాయి. టిష్యూ పేపర్ కావాలి. ఇప్పటి వరకూ వాటి మీదే నీకు లెటర్ రాశాను. ఉంటానమ్మా! ఎలాగైనా ఈ మెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకో. నాకు ఈ ఉత్తరం రాసే ఆబ్లిగేషన్ తప్పుతుంది.
అదుగో మైక్రోవేవ్ లో అన్నం పెట్టాను. అయిపోయినట్లు చిన్న గంట మోగిన శబ్దం. నాలుగు పొయ్యిల మీద నాలుగు వంటలున్నాయి. మళ్ళీ పదిహేను రోజుల వరకూ వంట కుదరదు. అన్నీ ఇవాళే చేసుకోవాలి. డ్రయ్యర్ లో బట్టలు తీసి మరో లోడ్ బట్టలు వేయాలి. వచ్చే వారానికి సరిపోయే ఊపిరి కూడా ఈ వీకెండ్ లోనే పీల్చుకోవాలి...ఉం...టా....

( ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం లోనూ, తెలుగునాడి లోనూ (2004 లోనో, 2005 లోనో ) ప్రచురితం
)

Thursday, July 21, 2011

ఎన్నడూ విచారణకు అంగీకరించకూ!


కథానుభవం-8

' మృణ్మయనాదం' లో అహల్య హెచ్చరిక

అపురూప సౌందర్య రాశి అహల్య ను నైతికానైతికతల త్రాసు లో తూచి చలనం లేని శిల ను చేశారు. రాముడి పాద స్పర్శ తో శాప విమోచనం జరిగిందని చెప్పి అసలు విషయం మీద జరగాల్సిన చర్చకు అవకాశం ఇవ్వకుండా అహల్య కథ ను ముగించేశారు. పంచ మహా పతివ్రతల్లో ఒకరుగా ఆమె ను చేర్చి ఆ తర్వాత ఘనకీర్తులందించారు.అహల్య మారు వేషం లో వున్న ఇంద్రుడిని గుర్తించిందా? లేదా? మారు వేషం లో వచ్చింది ఇంద్రుడని తెలిసి తెలిసీ అహల్య ఆ తప్పు చేసిందా ? లేక ఇంద్రుడి చేతిలో ఆమె మోసగించబడ్డదా? యుగాల నుంచి అహల్య తప్పొప్పుల గురించి ఈ చర్చ జరుగుతూనే వుంది.
" విచారణ జరపడం అంటే అపనమ్మకమే కదా. దాని కంటే ఏదో ఒక నమ్మకం నయం కదా!" అన్న ప్రధానమైన ప్రశ్న ను అహల్య పాత్ర ద్వారా లేవనెత్తుతుంది ఓల్గా తన ' మృణ్మయ నాదం ' కథలో. .మన మీద ఒకరు అధికారం తో, పశు బలం తో చేసే విచారణ వెనుక వున్న కుట్ర గురించి అహల్య మాట్లాడుతుంది. నా తప్పొప్పులను మీరు నిర్ణయించటం కాదు, అసలు వాటిని విచారించే అధికారం మీకెవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది . అంతేకాదు." ఎవరి సత్యం వారిది.సత్యాసత్యాలు నిర్ణయించగలిగే శక్తి ఈ ప్రపంచం లో ఎవరికైనా వుందా?" అని కూడా నిలదీస్తుంది.
అహల్య నుంచి , సీత నుంచి, రేణుక నుంచి ఇప్పటి దాకా కుటుంబాల్లో, చట్టాల్లో, కోర్టుల్లో, నడి రోడ్డు మీద స్త్రీలుతమ మనసు ల్లో ఏమనుకుంటున్నారో, శరీరాలు ఏం కోరుకుంటున్నాయో, ఏం చేస్తున్నాయో ఎన్ని సార్లు చర్చలు, విచారణలు జరిగి ఉంటాయో కదా! ఈ రోజు కి కూడా ఎక్కడో ఓ చోట, ఎవరో ఒక స్త్రీ మీద ఏదో ఒక రకమైన విచారణ జరుగుతూనే వుంది. ఆమె తప్పొప్పులను ఎవరో ఒకరు వెయ్యి కళ్ళతో నిర్ధారిస్తూనే వున్నారు. ఓల్గా ఈ కథ ద్వారా మాట్లాడుతోంది దాని గురించే. మన మనఃశరీరాల విచారణలో ముందు స్త్రీలకు తమ మీద తమకు అధికారం ఉంటుంది. అది మరెవ్వరి హక్కు కాదు. సొంతం కాదు అని అహల్య పాత్ర ద్వారా ఓల్గా మరో సారి స్పష్టం చేస్తోంది.
తొలి సారి అహల్య ని కలిసినప్పుడు " మీరు చేయని తప్పుకు దోషి గా నిలబడ్డారు " అని సీత ఆమె పట్ల జాలిపడుతుంది.
" ఈ లోకం లో అనేక మంది ఆడవాళ్ళు అలా నిలబడాల్సిందే గదా సీతా!" అంటుంది అహల్య.
" మీకు తెలియదు గదా అతను మీ భర్త కాదని" అన్న సీత సందేహానికి
" మారు వేషం లో వచ్చింది నా భర్త కాదని నేను గుర్తించానా, లేదా? లోకం లో అనేక మందిని వేధించే ప్రశ్న ఇది. నా భర్త కు మాత్రం ఆ తేడా లేదు. నాకు తెలిసినా, తెలియకపోయినా ఆయనాకొకటే. ఆయన వస్తువు తాత్కాలికంగా నైనా పరహస్తమయింది. మైలపడింది. మైల, శౌచం, పవిత్రం, అపవిత్రం, శీలం, పతనం -- ఈ పదాలను బ్రాహ్మణ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తే లేదు. విచక్షణే లేదు" అన్న అహల్య సమాధానం ఎంత సూటిగా, ఎంత నిర్భయంగా, ఎంత స్పష్టం గా ఉందో చూడండి.
అహల్య అంత స్పష్టం గా చెప్పినా సీత కు ఇంకా పూర్తిగా అనుమాన నివృత్తి కాలేదు. రాముడి మాటలు నిజమేనేమో, అహల్య సౌశీల్యవతి కాదేమో అనుకుంది. అప్పుడు అహల్య మరింత స్పష్టంగా యుగాల తరబడి తన మనసు లో దాచుకున్నవాటిని ప్రకటించించింది.
" నాలా మాట్లాడే స్త్రీలను భరించటం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలి పడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకెవరిచ్చారంటే మాత్రం ఎవరూ సహించరు".
" ఆ అధికారం గౌతమ మహర్షి కి కూడా లేదా?" భార్యల శీలం మీద భర్తలకు అధికారం వుంటుందని అందరూ చెప్పే మాటలను నమ్ముతూ అమాయకంగా ప్రశ్నిస్తుంది సీత.
" లోకం ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది. నేనివ్వలేదు. నేనివ్వనంత వరకూ ఎవరూ నా మీద అధికారాన్ని పొందలేరు" అంటుంది అహల్య.
చేసిన తప్పుకు అహల్య శిలలా పడి ఉందని అందరూ అనుకునే దానికి అహల్య చెప్పిన సమాధానం ఇది " ఇన్నేళ్లూ నేను ఈ విశ్వం లో నా అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ప్రపంచం ఏ నీతుల మీదా, ధర్మాల మీద నడుస్తోందో, వాటికి మూలమేమితో తెలుసుకున్నాను. నేనెంతో జ్నానమ్ సంపాదించాను. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే వుండదని, నిరంతరం మారుతూ ఉంటుందని తెలుసుకోవటమే నేను సంపాదించిన జ్నానం. "
సీత, అహల్య ల కలయిక, వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా కూడా అరణ్యవాస సమయం లో జరిగింది. చివరగా వెళ్లబోయే ముందు అహల్య, సీత కి ఒక హెచ్చరిక లాంటి సలహా కూడా ఇస్తుంది. " ఎన్నడూ విచారణకు అంగీకరించకూ సీతా. అధికారానికి లొంగకు" .
రావణ సంహారం తర్వాత సీత ను అగ్నిపరీక్షకు సిద్ధం కమ్మని లక్ష్మణుడు రాముడి ఆజ్న ను తీసుకువచ్చినప్పుడు సీత కు మొట్టమొదట అహల్య గుర్తొచ్చింది. ఆమె చెప్పిన ప్రతి మాట స్ఫురణకు వచ్చింది. అయినా సరే సీత రాముడి కోసం అగ్నిపరీక్ష కు సిద్ధపడింది. లోకం ముందు రాముడు నిస్సహాయుడు, బలహీనుడు అని సీత కు అర్థమయింది. లోకమంటే అది చెప్పే నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు అని సీత కు తెలుసు. లోకం నుంచి తన రాముడి ని రక్షించడానికి, అతని కన్నీరు తుడిచి అతనికి బలం ఇవ్వటానికి తాను తప్ప ఆ సమయం లో మరెవ్వరూ సహాయం చేయలేరని సీత కు తెలుసు. తాను అగ్ని పరీక్ష కు సిద్ధపడి రాముడి ని లోకం ముందు ధర్మం తప్పనివాడిగా నిలబెట్టింది సీత.
అగ్నిపరీక్ష తర్వాత అయోధ్య కి తిరిగివచ్చాక సీత కు అహల్య ని చూసి ఆమె తో మాట్లాడాలని బలంగా అనిపించింది. అందుకోసం ఒక సారి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి రావాలనుకుంది. ఆమె అరణ్యానికి ఒక సారి వెళ్ళి రావాలని ఒకందుకు కోరుకుంటే , రాముడు ఆమె ను శాశ్వతంగా మళ్ళీ అరణ్యవాసానికి పంపించివేశాడు. నిండు గర్భిణీగా వున్న సీత ను ఏమైనా కావలసినది ఉంటే సందేహించక చెప్పమని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు అహల్య ని చూడాలనుకుంటున్నానని చెప్తుంది సీత.
రావణ సంహారం తర్వాత నుంచి గడ్డకట్టుకుపోయిన సీత మనసు అహల్య ని చూడగానే , ఆమె స్నేహ స్పర్శ లో అది కరిగి నీరైపోయింది. సత్యాసత్యాల గురించి ఆనాడు అహల్య చెప్పిన మాటల అర్థం ఈ జరిగిన వాటన్నింటి వల్ల తనకు తెలిసినట్లు సీత వొప్పుకుంది. అంతే కాదు, తాను విచారణకు సిద్ధమయింది కేవలం రాముని కోసమే కానీ, తన కోసం కాదని చెప్తూనే అయినప్పటికీ అది ఎప్పటికీ అలా వెంటాడుతూనే వుంటుందా? అని సీత అడిగినప్పుడు " రాముని కోసం కాక నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకునేవరకూ ఇది నిన్ను వెంటాడుతూనే వుంటుంది సీతా. నువ్వున్నావు. బాధ అనుభవిస్తునావు. ఎవరి కోసమో అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. ఎవరి కోసమో కర్తవ్యాన్ని పాలించావని అనుకుంటున్నావు. నీ ధైర్యం, నీ మనో నిబ్బరం అన్నీ పూర్తిగా ఇతరులకిచ్చావు. నీ కోసం ఏం మిగుల్చుకున్నావు?" అని అడుగుతుంది అహల్య.
నేనంటే ఎవరిని ? అని సీత అడిగినప్పుడు " నువ్వు శ్రీరాముని భార్యవు మాత్రమే కాదు. అంతకు మించినది, అసలైనదీ నీలో వుంది. అదేమిటో తెలుసుకోవాలని స్త్రీలకెవరూ చెప్పరు. పురుషుల అహం ఆస్తులలో, ప్రతాపాలలో, విద్యలో, కులగోత్రాలలో ఉంటే స్త్రీల అహం పాతివ్రత్యం లో, మాతృత్వం లో ఉంటుంది.ఆ అహంకారాన్ని దాటాలని స్త్రీలకెవరూ చెప్పరు. విశాల ప్రపంచం లో తాము భాగమని వారు గుర్తించరు. ఒక వ్యక్తి కి, ఒక ఇంటికి, ఒక వంశ గౌరవానికి పరిమితమవుతారు. ఆహాన్ని పెంచుకోవడం, ఆ అహం లోనే కాలీ బూడిదై పోవడం స్త్రీల గమ్యమవుతుంది. సీతా, నువ్వేవరో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నం ఆపకు. చివరకు తెలుసుకుంటావు. నీకా శక్తి ఉంది. శ్రీరామచంద్రుడిని కాపాడగలిగిన దానివి నిన్ను నువ్వు కాపాడు కోలేవా--ఇదంతా ఎందుకు జరిగిందని విచారించకు.ఇది నీ మంచి కోసమే. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం లో భాగం గానే జరిగింది.ఆనందం గా ఉండు. ఈ ప్రకృతి ని, సకల జీవ రాశి పరిణామ క్రమాన్ని పరిశీలించు. అందులో నిరంతరం జరిగే మార్పు ని గమనించు. అరణ్యం లో ఆశ్రమాలే కాదు, అనేక జాతుల ప్రజలున్నారు. వాళ్ళ జీవితాలు గమనించు. ఈ మొత్తం ప్రపంచం లో నువ్వున్నావు. ఒక్క రామునికే కాదు. నీకు మాతృత్వం అనుభవమవబోతోంది. దానిని కూడా ఆనందించు. ఏ కోరికలు, ఆశలు పెంచుకోకుండా లేడి పిల్లలను పెంచినల్టు నీ పిల్లలను పెంచు ."
నీ జీవితం, నీ కర్తవ్యం మొత్తం భర్త, పిల్లలు,ఆ కుటుంబం కోసం మాత్రమే కాదు. నీకు నువ్వు మిగలాలి. నీ కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అహల్య అనుభవ పూర్వకంగా చెప్పిన ఈ మాటలు ఆ సీత కే కాదు, ఆధునిక సీత లకు కూడా నిస్సందేహంగా ఉపయోగపడే జ్నాన సంపద.
చెప్పవలసిన దంతా సీతకు చెప్పాక " సీతా! నా విషయం లో సత్యమేమిటో చెప్పమంటావా?" అన్న అహల్య మాటలకు సీత " వద్దక్కా, ఏదైనా ఒకటే. దానికే అర్థం లేదు" అంటుంది. నిజమే , అహల్య చేసింది తప్పో, వొప్పో తెలుసుకోవాలని ఇవాళ ఏ స్త్రీ ఆతృతపడటం లేదు.
అహల్య అందించిన జ్నానాన్ని, తన స్వానుభవ సారాన్ని మేళవించుకున్నాక, లవకుశులను ఆదరించి అక్కున చేర్చుకొని తన కోసం రాముడు చాచిన చేతిని అందుకోకుండా సీత తన గమ్యాన్ని తాను నిర్ణయించుకొని తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంటుంది.
"సీత సహాయం లేని రాముడు జీవితం లో మొదటి సారి ఓటమిని రుచి చూశాడు. బయట నుంచి వచ్చే అధికారానికి లొంగని సీత, తన లోపల తన మీద తనకున్న అధికార శక్తిని మొదటి సారి సంపూర్ణంగా అనుభవించింది. "
ఇతిహాస పాత్రలను నేటి సమాజానీకనుగుణంగా ఎలా అర్థం చేసుకోవాలో చెపుతూ ఓల్గా ఒక వరుస క్రమం లో రాసిన కథల సమాహారం " విముక్త". ఈ పుస్తకం లో ఈ మృణ్మయ నాదం కథ తో పాటు, సమాగమం, సైకత కుంభం, విముక్త, బంధితుడు కథలున్నాయి. ఒక్కో కథ మీద ఒక చిన్న పరిచయం ఇలాగే మీ కోసం....

Monday, July 18, 2011

ఓ నాన్న!...ఓ సాహితీ తపస్వీ!
( మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా మా తమ్ముడు జయదేవ రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది.దాన్ని ఇక్కడ చూడగలరు. నిజానికి ఈ వ్యాసం మా తమ్ముడి ఇష్టపది బ్లాగు లో రావాల్సింది. కానీ జయదేవ ప్రయాణం లో ఉండి నెట్ కి దూరం గా వుండటం తో నేను ఇక్కడ పంచుకుంటున్నాను)

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే! ఆ గది ఓ ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాంకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , ' బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.
ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది. గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడ కు వచ్చేశారు. ' పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట ' రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75 వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.
నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--' ఎర్ర జెండాల ' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో ' ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న ' జయంతి పబ్లికేషన్స్ ' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండ లు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం ( అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశం లో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమ గా కొనసాగిన కాలం లో ఆయనకు సహచరులు, సహవ్రతులు.
నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గం లో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే ' సినిమా పేజీ ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం . ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు .( రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80 ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు). ' పంచకళ్యాణి- దొంగలరాణి', ' కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే. సాయంత్రం సినిమా సభ లో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన ' దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు. చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్ష ను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు ' బాలజ్యోతి' మాస పత్రిక లో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడి గా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్యనూ ( రెంటాల సత్యనారాయణ) మా అక్కయ్యను ( కల్పనా రెంటాల), నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.
నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ , పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు --ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ' రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, ' అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గది లో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజం లోకి తలుపులు తెరిచాయి.
గమ్మత్తేమిటంటే, నరసరావు పేట లో ' నవ్య కళా పరిషత్' వారి ' నయాగరా' ( అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన ' కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన ' సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన ' సర్పయాగం' కవితా సంపుటాలు, ' శిక్ష ', ' ఇన్స్పెక్టర్ జనరల్', ' అంతా పెద్దలే ' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు. " అమ్మా! ఉమా ! రుమా! హీరోషిమా! విలపించకూ పలపించకూ..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టి ని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవిత ను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబం లో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి ' అరసం ' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, ' నవభారతి' పత్రిక కు ' మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వానాథ ను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు ' ఆంధ్రప్రభ' దినపత్రికలో ' వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు ' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారం లోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యం లో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకే వెళ్ళిపోయారు.
నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాత్తమ్ సంపాదకత్వం లో గుంటూరు నుంచి వచ్చిన ' దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య ' నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వం లో ' ఆంధ్రప్రభ ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు. సమాజాన్ని సరైన దోవ లో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి--ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ' స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా ' ఆంధ్ర ప్రభ' ' స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.
నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం ' శివధనువు ' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18 న కీర్తి శేషులయ్యారు. ఆ పైన ' శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.
' అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకం లో మేము ' నవగ్రహాలు' అన్న మాట! ( చిన్న తనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యం లో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.
నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ-- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ --ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.
అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్గానే, ' ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. ' ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పనా కవిత లో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ
 
Real Time Web Analytics