నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label సామాజికం. Show all posts
Showing posts with label సామాజికం. Show all posts

Saturday, July 21, 2012

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా !

సాక్షి ఆదివారం సంచిక లో (జూలై 22) ప్రవాసం శీర్షిక కోసం నేను రాసిన వ్యాసం ఇది.






అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అమెరికన్ సమాజంలో ఇండియన్‌లాగా జీవించటంలో ఉండే అనుభవాల గురించి మాట్లాడాల్సి వస్తే... ముందుగా రెండు దేశాల మధ్య వైరుధ్యం కన్నా రెండు దేశాల జీవన విధానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పుల గురించి చెప్పాలనిపిస్తుంది. ఈ వ్యాసం మొత్తంలో నేను అన్నది వైయక్తికమైన నేను కాకుండా సామాజికమైన నేనుగా వాడుతున్నాను.

పదేళ్లుగా అమెరికాలో నివసించటం మొదలుపెట్టిన దగ్గర నుంచీ నేను, నాలాంటివాళ్లు ఎందరో ఎదుర్కొనే అతి సాధారణ ప్రశ్న/మొదటి ప్రశ్న-‘నువ్వు నీ మాతృదేశాన్ని మిస్ అవుతున్నావా?’ మిస్ అవటమన్న సంకర పద ప్రయోగంలోనే మనం చాలావరకు మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మిస్ అవటమంటే... దూరంగా ఉన్న అనుభూతి, ఏదో కోల్పోయిన అనుభూతి. నేను నిజంగా మాతృదేశాన్ని, మాతృభాషను పోగొట్టుకున్నానా? లేదు. కేవలం భౌతికమైన దూరంలో బతుకుతున్నాను.
 
 అప్పుడు-ఇప్పుడు

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికపరంగా, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఉదారవాద సంస్కరణల ఫలితంగా అమెరికా-ఇండియాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఓడ ఎక్కితే కానీ మొదటి తరం తెలుగువారు అమెరికా రాలేకపోయారు. ఇప్పుడు 15 నుంచి 18 గంటల ప్రయాణంతోనే అటూ ఇటూ రాకపోకలు సాగుతున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆంధ్ర దేశం నుంచి వచ్చిన ఓ స్నేహితు రాలికి తల్లి మరణవార్త పది రోజుల తర్వాత ఉత్తరం ద్వారా తెలిసింది.

ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇండియా-అమెరికాల మధ్య స్కైప్‌లు, వానేజీ ఫోన్లు, రోకూ బాక్సులు, ఇంటర్నెట్ టీవీలు, ఈమెయిల్స్, చాట్‌లు, సోషల్ నెట్‌వర్కులు, టీవీ చానెళ్ల ప్రత్యక్ష ప్రసారాలు ఎన్నో వచ్చేశాయి. ప్రతి కొత్త తెలుగు సినిమా అటు ఇండియా, ఇటు అమెరికాలో ఒకేసారి విడుదల అవుతోంది. టీవీ కార్యక్రమాల సంగతి చెప్పనే అక్కరలేదు. రెండు దేశాల మధ్య కాలమానం తేడాలున్నప్పటికీ, ఇండియాలో ఏ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమమైనా, అదే సమయంలో అమెరికాలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించే సదుపాయాలు వచ్చేశాయి.

ఆహార వ్యవహారాలు, పండుగల పబ్బాల విషయానికి వస్తే... మామూలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో పండే అల్ఫాన్సా, కేసర్ మామిడిపళ్లతో సరిపెట్టుకునే ఇండియన్ అమెరికన్లు ఇవాళ బంగినపల్లి మామిడిపళ్లను కూడా ఆరగించగలుగుతున్నారు. అమెరికాలోని ప్రతి నైబర్‌హుడ్‌లోనూ ఓ రెండు, మూడు యోగా సెంటర్లు ఉంటాయి.

హిందూ దేవాలయం లేని అమెరికా పట్టణాలు అతి తక్కువ. రెండోతరం, మూడోతరం పిల్లలు, యువతీ యువకులు తెలుగు భాషను, మన బడులు-తెలుగుబడుల్లో నేర్చుకుంటున్నారు. తెలుగువారిని పెళ్లి చేసుకున్న అమెరికన్లు కూడా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు వంటకాలను రుచి చూస్తూ, ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకుంటున్నారు.

సాహిత్యపరంగా వచ్చిన మార్పులను చూస్తే, ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్యం అనేది ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అమెరికాను చుట్టపు చూపుగా చూడటానికి వచ్చి వెళ్లిపోయే వాళ్ల అమెరికా అనుభవాల నుంచి మాత్రమే ఒకప్పుడు తెలుగువారు అమెరికా గురించి తెలుసుకునేవారు. గత పదేళ్లలో అమెరికాలో నివసిస్తున్న పాత, కొత్త రచయితల కలాల నుంచి అమెరికాలో తెలుగువారి జీవితాల గురించిన సాహిత్య చిత్రణ ఎక్కువయింది.

ఈ మార్పులన్నింటి ద్వారా ఏం అర్థమవుతోంది? అమెరికాలోని తెలుగువారు తమ భాషను కాని, తమ సంస్కృతిని కాని, ఆచార వ్యవహారాలను కాని, తమ భారతీయతను కాని వేటినీ వదులుకోవటం లేదు. తమ మూలాల్ని వదులుకోవటానికి వారెవ్వరూ సిద్ధంగా లేరు. తమ భారతీయతను దేనికీ ఫణంగా పెట్టడం లేదు.

అమెరికాలో ఇండియన్‌లాగా నివసించటంలో చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఇండియాలో ఇండియన్‌లాగా నివసించటం మీదనే నాకు అనేక సందేహాలున్నాయి.
రెండు దశాబ్దాల కిందట భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ తలుపుల్ని బార్లా తెరిచినప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతోను, ఆసక్తితోను అందరూ గమనించటం మొదలుపెట్టారు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పెను మార్పులు సంభవించాయో ఎవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. షాపింగ్‌మాల్స్, గ్లాస్ పానెల్డ్ ఆఫీస్ బిల్డింగులు, ఎస్కలేటర్లు పుట్టుకొచ్చాయి. పల్లెటూళ్ల స్వరూపం మారిపోయింది. పట్టణాలు ఆధునికత వికృత స్వరూపానికి నకళ్లుగా మారాయి. ఇండియా అంటే ఎప్పటి ఇండియా అని అడగాలనిపిస్తుంది.

అమెరికాలో తెలుగు నేర్చుకున్న రెండోతరం, మూడోతరం తెలుగు యువతీయువకులు సెలవుల్లోనో, పరిశోధన కోసమో ఇండియా వెళ్లి వెనక్కి వచ్చాక, ‘అక్కడి వాళ్ల కన్నా మేమే మంచి తెలుగు మాట్లాడుతున్నాం’, ‘అక్కడ మేం తెలుగులో మాట్లాడుతుంటే అందరూ మాతో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు’ అని చెప్తున్నారు. తెలుగు సినిమాలు చూడటానికి ఇంగ్లిష్, హిందీ వస్తే చాలు తెలుగు రానక్కరలేదు అన్నది ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లల మనోభావం. మన తెలుగు సినిమాల్లో తెలుగు నేతి బీరకాయల్లో నెయ్యి చందాన ఉంటోందన్నది అక్షర సత్యం.

తెలుగు తిట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనటం లేదు కానీ, అవి పుష్కలంగా ఇంకా అమెరికాలో తెలుగువారి నోళ్లల్లో ‘నీయమ్మ, నీయబ్బ’లుగా నానుతూనే ఉన్నాయి. కానీ ఇండియాలో అమెరికన్ తిట్లు, లేదా ఊతపదాలు ‘ఎఫ్-వర్డ్’, ‘ఎస్-వర్డ్’ ఎలాంటి సంకోచాలు లేకుండా వాడటం కనిపిస్తోంది.

అమెరికాలో తెలుగు పిల్లలు చక్కగా లంగా ఓణీలు వేసుకుని సంగీతం, కూచిపూడి లాంటి లలితకళలను శ్రద్ధగా అభ్యసిస్తుంటే తెలుగుదేశంలో పిల్లల వస్త్రధారణ, టీవీ కార్యక్రమాల్లో వారి ప్రదర్శనలు చూస్తుంటే అటుదిటు, ఇటుదటు మారిపోయినట్లు అనిపిస్తోంది. వస్త్రధారణల్లో వచ్చిన మార్పులు, ఇంగ్లిష్ భాష మాట్లాడటం ఒక నేరంగా నేను ఎత్తి చూపటం లేదు.

ఒక మార్పుకి సంకేతంగా మాత్రమే చెప్తున్నాను. ఇండియాలో తెలుగు పిల్లలకు మాట్లాడే తెలుగు వస్తే గొప్ప. అమెరికాలో తెలుగు పిల్లలు తెలుగులో చదవటమే కాదు, తెలుగులో రాయగలిగే స్థాయికి వెళ్తున్నారు. రాబోయే తరం నుంచి ఓ అమెరికన్ ఇండియన్ తెలుగులో ఓ పుస్తకం రాసే రోజు కూడా ముందు ముందు ఉందన్న ఆశ కలుగుతోంది.

అమెరికనైజ్ అయిపోతున్న ఇండియా నన్ను ఆందోళన పరుస్తున్నది. మొన్నటి మెక్‌డొనాల్డ్స్, నిన్నటి వాల్‌మార్ట్‌లు, ఇవాళ్టి స్టార్ బక్స్, అమెజాన్ మార్కెట్ల రంగప్రవేశంతో నాకు ఇండియా ఇండియాలాగా కనిపించటం లేదు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా భారతీయతను కోల్పోవటం అంటూ జరిగితే అది అమెరికాలో జరగటం లేదు. భారతదేశంలోనే మనం మన భారతీయతను కోల్పోతున్నామేమో అనిపిస్తోంది.

ప్రపంచమొక కుగ్రామం అన్న మాట ఈ పదేళ్ల ప్రవాస జీవితం తర్వాత బాగా అనుభవంలోకి వస్తోంది. అమెరికా రావటానికి ముందు ఈ దేశం గురించి నా ఆలోచనలు, నా అవగాహన వేరు. కానీ ఇక్కడికొచ్చాక నాకు కలిగిన అనుభవాలు వేరు. ఆ అనుభవాలు నాకు అమెరికా గురించిన అవగాహనను పెంచడంతో పాటు నా మాతృదేశాన్ని చూడాల్సిన దృష్టిని కూడా ఇచ్చాయి.

ఈ రెండు దేశాలు నాకు రెండు కళ్లలాగా, సొంత ఇళ్లలాగానే కనిపిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, భాషల పరంగా ఈ రెండు దేశాలు భూగోళానికి చెరోవైపు ఉన్నాయి. కానీ నా మనసులో రెండింటికీ ఒకటే స్థానం ఉంది. ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తిల్లు కాదు. రెండూ పుట్టిళ్ల లాగానే కనిపిస్తున్నాయి. కేవలం ఒక కంటితో మాత్రమే చూసే పాక్షిక దృష్టి నాకొద్దు.

ఈ రెండు దేశాల జీవితానుభవంతో సమగ్రమైన దృష్టికోణం అలవడింది. ఆ సమ్యక్ దృష్టితోనే ఈ ప్రవాస సమాజంలో కూడా నా ఉనికిని నేను కాపాడుకోగలుగుతున్నాను. నా మూలాల్ని నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నాను.నేను అమెరికాలో నివసిస్తున్న భారతీయురాలిని అని సగర్వంగా చెప్పుకోగలను.

-కల్పనా రెంటాల

Monday, July 16, 2012

గౌహతీ దుశ్చర్య సాక్షిగా ......మేరా భారత్ మహాన్!



“భారత దేశం నా మాతృదేశం. భారతీయులందరూ నా సహోదరులు. “ 

చిన్నప్పుడు స్కూల్లో చదివిన ప్రతిజ్న ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే వుంది. 

అనుక్షణం నా దేశం గొప్పతనం , నా “ సహోదరులకు”  స్త్రీజాతి పట్ల వున్న ఆదరాభిమానాలు , స్త్రీ ని దేవత గా కొలిచే నా దేశ సంస్కృతి గురించి  ప్రతి రోజూ ఎవరో ఒకరు నాకు  ఉద్బోధ చేస్తూనే  ఉన్నారు.  

గత వారం గౌహతి లో జరిగిన సంఘటన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అది తెలిసాక ఎంత మంది తల్లితండ్రులు తమ ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని మరింత కట్టడి చేస్తున్నారో నాకు తెలియదు. 

గౌహతి లో ఓ పదిహేదేళ్ళ అమ్మాయి తన స్నేహితులలతో కలిసి రెస్టారెంట్  కమ్ పబ్ లోకి వెళ్ళి గడిపి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి తో పాటు ఆమె స్నేహితులు కూడా వున్నారు. ఓ అమ్మాయి అర్థరాత్రి అబ్బాయిలతో కలిసి పబ్ నుంచి బయటకు రావడాన్ని అక్కడున్న ఓ ఓ గుంపు చూసి  తట్టుకోలేకపోయింది. దేశ ఔన్నత్యం దిగజారుతోందని  ఆ మూక కు ఆవేశమొచ్చింది. ఆ అమ్మాయి పొట్టి స్కర్ట్ వేసుకుందని, అర్థ రాత్రి తాగి తందనాలాడుతోంది కాబట్టి ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నారు. అందరూ కలిసి ఆమె చుట్టూ ఓ గుంపు లా , ఓ వలయం లా ఏర్పడి ఆమె ను కొట్టి ఆ తర్వాత ఆమె వొంటి మీద వున్న ఆ కొద్ది పాటి దుస్తులను కూడా తీసేసి ఆనందించారు. ఆమె ను ఎక్కడెక్కడో తాకి ఆనందించారు. ఆమె ను నడి రోడ్డు మీద లాక్కెళ్లారు. ఈ పనులన్నీ చేసింది ఓ 20 మంది తో కూడిన గుంపు. కానీ దీన్ని చూసిన ఆనందించినవారు వంద సంఖ్య లో వున్నారు. ఎక్కడ అరక్షణం కళ్ళు తిప్పితే ఎంత మంచి సీన్ మిస్ అవుతామో అన్నట్లు కళ్లార్పకుండా చూశారు. రద్దీ గా ఉండే రోడ్డు మీద ఈ దుర్ఘటన చూస్తూ కూడా ఎవరూ ఆగి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.  సహాయం చేయమని ఆ అమ్మాయి రోడ్డు మీద పరుగెత్తినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ సమయం లో అటు వైపు వస్తున్న మరో జర్నలిస్ట్ కారు ఆపి పోలీసులకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ని అల్లరి మూకల నుంచి కాపాడే ప్రయత్నం చేశాడు. 

అల్లరి మూకల  గుంపు లో ఒక  జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ “ ని అతనితో సహా అనేక మంది   కెమెరాలతో చిత్రీకరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేశారు. ఒక జర్నలిస్ట్ ఆ అమ్మాయి మీద దాడి ని ప్రోత్సహిస్తే మరో జర్నలిస్ట్  వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేసి ఆ అమ్మాయి ని కాపాడారు. 

ఈ మొత్తం సంఘటన ను ప్రత్యక్ష్యంగా చూసి, వీడియో తీసి, తన వంతు భాగస్వామ్యం వహించిన  జర్నలిస్ట్ తన చానెల్ లో Drunk girl in the city” అనే శీర్షికతో న్యూస్ ప్రసారం చేశాడు. అది చూసి మిగతా పత్రికలు, ఛానెల్స్ కూడా ఆ తరహా వార్తలే వినిపించాయి. . ఒకటిన్నర రోజు తర్వాత  అసలు విషయం బయటకు వచ్చాక, యూ ట్యూబ్ లో వీడియో లు కూడా అందరూ చూసి ఆనందించాక అప్పుడు అందరూ రంగం లోకి దిగారు. అసలేం జరిగిందో బయటకు వచ్చింది. నిందితుల కోసం వెతుకులాట మొదలయింది. ధర్నాలు, రాస్తారోకోలు జరిగుతున్నాయి. మొదట ఈ వార్త ను ప్రసారం చేసిన న్యూస్ చానెల్ కొంత మాట మార్చింది. నేటి యువతరం ముఖ్యంగా అమ్మాయిలు ఎంత చెడిపోతున్నారో, అసభ్యకరమైన దుస్తులు వేసుకొని అర్థ రాత్రి వరకు పబ్ ల వెంట ఎలా తిరుగుతున్నారో  , అలా తిరిగితే ఏం జరుగుతుందో హెచ్చరికలు మొదలు పెట్టింది. ఒక న్యూస్ చానల్ ఎడిటర్ కామెంట్ ఏమిటంటే “Major chunk of girls visiting pubs/bars are prostitutes”.
ఈ వీడియో ని చూస్తే ఏం జరిగిందో ఎవరికైనా అర్థమవుతుంది.
ఆ అమ్మాయిని రక్షించిన జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి.
http://news.biharprabha.com/2012/07/meet-the-man-who-saved-guwahati-girl-from-molestation/

ఆడపిల్లల స్కర్ట్ లు ఎంత పొడవు  ఉండాలో కాదు నిర్ణయించాల్సింది. కొందరు మగవాళ్ళు మృగాల్లా కాకుండా మామూలు మనుషుల్లా ప్రవర్తించేలా ఎవరైనా వారికి శిక్షణ ఇవ్వండి.
అది జరిగితే , నిస్సందేహంగా నా దేశం గొప్పదే!




Thursday, November 04, 2010

ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి!


'If any one of you is without sin, let him be the first to throw a stone at her.’

వ్యభిచరించిందన్న నేరం పై ఒక స్త్రీని రాళ్ళతో కొట్టే సందర్భం లో బైబిల్ లో క్రీస్తు అన్న మాటలు ఇవి.

మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి,
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి
మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి
ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి..


“ నేరం నాది కాదు ఆకలిది” సినిమా కోసం సి. నారాయణ రెడ్డి రాసిన పాట లోని ఈ వాక్యాలు చిన్నప్పుడు విన్నది ఇప్పటి దాకా మర్చిపోలేకపోయాను.

క్రీస్తు కాలం నుంచి ఇప్పటిదాకా మనుష్యుల మీద కంటే మతాల మీదనే ఎక్కువ ప్రేమ వున్నప్రస్తుత సమాజం లో ఇలాంటి అమానుషమైన, క్రూరమైన, నీచమైన , హేయమైన ఇలాంటి చర్యలు ఇంకా జరుగుతూనే వున్నాయి.

ఇరానీ మహిళ,ఇద్దరు పిల్లల తల్లి , సఖినే మొహమ్మదీ ని ఊరి తీసి చంపబోతున్నారన్న వార్త నాకు ఆలస్యంగా అందింది. ఆమె ను ఉరితీయరాదని కోరుతూ తయారైన పిటీషన్ మీద బ్లాగు ముఖం గా చేసిన నా అభ్యర్ధనను మన్నించి సంతకాలు చేసిన వారందరికీ కృతజ్నతలు. ఇవాళ్టి కి సఖినే ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉంది. 500,000 సంతకాలు ఒక్క రోజులో ఇరాన్ ప్రభుత్వానికి అందడం తో ఈ మరణ శిక్ష తాత్కాలికం గా ఆగింది. సఖినే కేసులో ఇంకా న్యాయపరమైన చిక్కులు అలాగే వున్నాయని ఇవాళ ( నవంబర్ 4) లండన్ లోని ఇరాన్ దేశపు ఎంబసీ ప్రకటించింది.

కానీ ఆ శిక్ష ఎప్పుడైనా అమలుజరపవచ్చు. కాబట్టి వీలైనంత మంది , ఇంకా సంతకాలు పెట్టని వాళ్ళు పిటీషన్ మీద సంతకాలు పెట్టడం వల్ల ఆమె ను ఈ మరణ శిక్ష నుంచి తప్పించే అవకాశం వుంది . కాబట్టి వీలైనంత త్వరగా స్పందించండి.

ఇప్పటికే సఖినే గురించి, ఆమె మీద మోపిన “ నేరాల “ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. లండన్ లోని గార్డియన్ పత్రిక కోసం దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లోని ముఖ్యమైన అంశాల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.

“ ఇదొట్టి అబద్ధపు కేసు. టెహ్రాన్ ప్రభుత్వం రహస్యంగా తనని చంపివేసేందుకు మీడియా ను అయోమయంలో పెడుతోంది” అని ఆమె ఆరోపించారు. సఖినే తన భర్త ని హత్య చేసేందుకు పన్నిన కుట్రలో భాగస్వామం వహించిన నేరం,రెండుసార్లు వ్యభిచారం చేసిన నేరం కూడా రుజువైందని ఇరాన్ న్యాయ వ్యవస్థ కి చెందిన అధికారి ఐక్యరాజ్య సమితి కమిటీ కి వెల్లడించారు. అయితే హత్యానేరంలో దోషిగా తనను నిర్ధారించలేదని, అంతేకాకుండా అసలు తన భర్త ను చంపిన వ్యక్తి ని నిర్థారించి జైల్లో పెట్టారు గానీ అతనికి మరణశిక్ష విధించలేదని సఖినే ఈ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. హత్య చేసిన వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టారంటే సఖినే కొడుకు అతనికి క్షమాభిక్షపెట్టాడు. అయితే సఖినే కు Tabriz లో స్థానిక ప్రాసిక్యూటర్ వ్యభిచారం చేసిందన్న నేరంపై మరణ శిక్ష విధించాడు.

ఎందుకలా అని ప్రశ్నిస్తే..” సమాధానం సులభం. నేను స్త్రీని కాబట్టి. ఈ దేశం లో స్త్రీలను ఏమైనా చేయగలమని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం లో హత్య కంటే ఘోరమైన నేరం వ్యభిచారం. అయితే ఆ వ్యభిచారాల్లో రకరకాలున్నాయి. వ్యభిచారం నేరం లో పురుషుడికి కనీసం జైలు శిక్ష కూడా విధించకపోవచ్చు. అదే స్త్రీకి మాత్రం ఇక అంతటితో ఆమె జీవితం ముగిసిపోవాల్సిందే. ఎందుకంటే భర్తలకు విడాకులిచ్చే హక్కు కానీ, కనీసం మౌలిక హక్కులు కూడా మహిళలకు లేని ఈ దేశం లో ఇవి ఇలానే జరుగుతాయి” అని చెప్తుంది సఖినే.

కోర్టు లో ఈ కేసు కి తీర్పు ని ప్రకటించినప్పుడు సఖినే కి అరబిక్ అర్థం కాకపోవడం వల్ల కోర్టు లో వాడిన అరబిక్ లీగల్ టర్మ్ “ రజ్మీ” అంటే రాళ్ళతో కొట్టి చంపడం అని తెలియలేదు. “ న్యాయాధికారి తీర్పు ని వెల్లడిస్తూ కాగితాలు అందించినప్పుడు నాకు అది రాళ్లతో కొట్టి చంపే శిక్షగా తెలియదు. ఆ తీర్పు కాగితాల మీద సంతకం చేయమంటే చేసి ఇచ్చి మళ్ళీ జైలు లోకి వెళ్ళినప్పుడు తోటి ఖైదీలు నాకు అసలు విషయం చెప్పగానే నేను మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయాను. “అని చెప్పింది ఆమె.
సఖినే తరఫున వాదించటానికి ఆమెకు ఇప్పుడు లాయర్ లేదు. ఆ లాయరు ని, సఖినే కొడుకుని , ఇద్దరు జర్మనీ జర్నలిస్టు లను ఇరాన్ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టింది. ఎలాగోలా ఆమె లాయర్ Mohammad Mostafaei దేశం వదిలి పారిపోవడం తో ఆమె పరిస్థితి మరీ దారుణం గా ఉంది. “ లాయర్ ని వదిలించుకోవటం వల్ల వాళ్ళు నా మీద సులభం గా ఎలాంటి ఆరోపణలనైనా మోపవచ్చు. అతని తీవ్ర కృషి వల్లనే ఇప్పటికీ రాళ్లతో కొట్టించుకొని చనిపోకుండా నేనింకా బతికే వున్నాను” అని చెప్పింది సఖినే.
ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఆ లాయర్ సఖినే కేసు చేపట్టి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినందుకు అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ కావడం తో అతను టర్కీ పారిపోయాడు. అతని భార్య ను భయంకరమైన ఎవిన్ జైల్లో పెట్టారు.
Tabriz జైల్లో జీవితం గురించి సఖినే ఇలా చెప్పింది. “ జైలు గార్డులు నాపట్ల సరైన విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన ప్రతి రోజూ .రాళ్లతో కొట్టే చంపుతున్నట్లే వుండేవి. తన విషయం లో ఇరాన్ ప్రభుత్వం మీద అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే తన విడుదలకు ఉన్న ఒక చిన్ని ఆశ “ అని ఆమె ఎదురుచూస్తోంది. “ దయచేసి నా కొడుకు కళ్ళెదుట నన్ను రాళ్ళతో కొట్టి చంపకండి” అని ఆమె ప్రభుత్వాన్నిఆమె అప్పట్లో వేడుకుంది.

కల్పనారెంటాల

Wednesday, November 03, 2010

క్రూరమైన ఈ ఉరి ని ఆపండి! పిటీషన్ మీద వెంటనే సంతకం చేయండి!

ఇరాన్ లో రేపు Sakineh Ashtiani అనే నలభై మూడేళ్ళ మహిళను ఊరి తీయబోతున్నారు. దయచేసి ఒక జీవితాన్ని కాపాడటానికి మనకున్న సమయం 24 గంటలే. మీరు వెంటనే ఈ కింద లింక్ ని క్లిక్ చేసి పిటీషన్ మీద సంతకం చేయండి. వీలైన వాళ్ళు మీ ఫేస్ బుక్, లేదా బజ్ ల్లో కూడా దీన్ని పోస్ట్ చేయవచ్చు.

http://www.avaaz.org/en/24h_to_save_sakineh/?vl

ఆ మహిళ చేసిన నేరం ఒక వైవాహికేతర సంబంధం కలిగి ఉండటం. ఈ అంశానికి సంబంధించిన అన్నీ అంశాలతో విడిగా ఒక పోస్ట్ రాస్తాను . సంక్షిప్తంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి కొన్ని లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను.
Sources:

The Islamic regime of Iran plans to execute Sakineh Mohammadi Ashtiani immediately
http://stopstonningnow.com/wpress/4194

Sakineh hanging imminent
http://www.theaustralian.com.au/news/world/fears-that-alleged-adulterers-execution-by-hanging-is-imminent/story-e6frg6so-1225946610965

Iranian woman could be stoned Wednesday
http://www.google.com/hostednews/afp/article/ALeqM5hipKgm5UqJOxciOi1f07BwbfRgFg?docId=CNG.6ef6de7af5f33847d19e690e61087c73.811

Sakineh Mohammadi Ashtiani: A life in the Balance (Amnesty International)
http://www.amnesty.org/en/library/asset/MDE13/089/2010/en/589bd56b-49ac-4028-8dc6-abd903ac9bac/mde130892010en.pdf

Thursday, February 18, 2010

ఆస్టిన్ లో ఏడంతుస్తుల భవనాన్ని ఢీ కొన్న విమానం

ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయానికి ( ఫిబ్రవరి 18, గురువారం మధ్యాహ్నానికి .) మా వూరు ఆస్టిన్ ( టెక్సాస్ ) వైపు ప్రపంచం అంతా చూస్తోంది. మా ఇంటి కి రెండున్నర మైళ్ళ దూరం లో జరిగిన విమాన ప్రమాదం తో ఒక్కసారి ఆస్టిన్ నగరం ఉలిక్కిపడింది. 2001 తర్వాత ఏ విమాన ప్రమాదమైనా అందరి అనుమానం ఒక్కటే. తీవ్రవాదమే అందరి మదిలో మెదులుతుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అది తీవ్రవాద చర్య కాదు కానీ ఇదొక “ గృహ తీవ్రవాద “ సమస్య. అదొక్కటే కాకుండా నిందితుడికి ప్రభుత్వ రెవెన్యూ విభాగం IRS పని తీరు పట్ల వున్న తీవ్ర కోపం కూడా విమాన, భవన ప్రమాదానికి దారితీసింది.

రోజూ లాగానే ఆస్టిన్ హైవే హడావిడిగా కార్లతో కళకళలాడుతూ వున్నప్పుడు ఉదయం దాదాపు 10 గంటలప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన జోసెఫ్ స్టాక్ స్థానిక పైలట్. గత రాత్రి ఇంట్లో భార్య తో స్టాక్ గొడవపడ్డాదని తెలుస్తోంది. స్టాక్ భార్య, సవతి కూతురు ఇద్దరూ రాత్రి ఇంటి నుంచి హోటల్ కి వెళ్ళిపోయి పొద్దుటే వచ్చారని తెలుస్తోంది.స్టాక్ ఇంట్లో సమస్యలోక్కటేఈ ప్రమాదానికి కారణం కాదు. అతనికి ఎంతో కాలంగా ప్రభుత్వ పని తీరు పట్ల, ముఖ్యం గా ఐ ఆర్ ఎస్ పని తీరు పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.

భార్య తో గొడవపడ్డ స్టాక్ 9-15 నిముషాలకు తన సొంత ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించేలా చేసి నార్త్ ఆస్టిన్ కి 20 మైళ్ళ దూరం లో వున్న జార్జి టౌన్ విమానాశ్రయం నుంచి ఒక చిన్న డబల్ సీటర్ చెరోకీ పైపర్ విమానం తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరగా వున్న ఏడంతస్తుల బిల్డింగ్ ని ఢీ కొట్టాడు. ఈ భవనం లోనే ఐ ఆర్ ఎస్, ఇంకా కొన్ని ప్రభుత్వ ఆఫీసులున్నాయి.
53 ఏళ్ళ స్టాక్ సొంత సాఫ్ట్ వేఱ్ కంపెనీ వుంది. తన సొంత వెబ్ సైట్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాసాలతో పాటు అతని ఆత్మహత్య నోట్ కూడా వుంది. ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రకటించటానికి ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తా సంస్థల కథనాలు. “ హింస ఒక్కటే సమాధానం “ అని స్టాక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని కూడా తెలుస్తోంది.
ఈ అగ్ని ప్రమాదం లో గాయపడ్డ వారి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ లో వచ్చిన పెను మార్పులు కొందరి ప్రజల్లో ఎంత అసమ్ప్తృప్తి ని రగిలిస్తున్నాయో ఈ సంఘటన ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి దుందుడుకు చర్య చేసేలా ప్రేరేపించింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తో పాటు,కుటుంబ సమస్యలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైనా, ఒక వ్యక్తి కున్న తీవ్ర కోపం ఎంత విద్వాంసానికి, ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందో కదా.

(ఈ స్పందన కేవలం ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసి రాసినదే.)

కల్పనా రెంటాల

 
Real Time Web Analytics