నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label నామిని. Show all posts
Showing posts with label నామిని. Show all posts

Monday, February 15, 2010

నామినీ, కొంచెం బడాయి తగ్గించుకో! (రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన)

(ఫిబ్రవరి 15 ఆంధ్ర జ్యోతి వివిధ లో వచ్చిన వ్యాసం ఇది. నామిని వ్యాఖ్యలపై ఎలాంటి నిరసనను ప్రచురించకుండా వున్న ఆంధ్రజ్యోతి ఎట్టకేలకు రంగనాయకమ్మ గారి వ్యాసం ప్రచురించింది. రంగనాయకమ్మ సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా రాసిన వ్యాసం ఇది.)

ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయినా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు.

నువ్వు 'పచ్చనాకు సాక్షి' కబుర్లు చెప్పిన కాలంలో, నిన్ను గోర్కీగా ఎంచుకుని ముచ్చటపడ్డాం. కానీ, అసలు గోర్కీలో ఎక్కడా మిడిసిపాటు కనపడలేదు. ఇవ్వాళ నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఏ మనిషి అయినా, 'నేను అందరికన్నా చాలా గొప్ప వాణ్ణి' అన్నాడంటే, అనుకున్నాడంటే, ఆ మనిషి, మొదట అల్పుడు! తర్వాత మూర్ఖుడు! నువ్వు చాలా గొప్పవాడివే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.

ఇంత చిన్న విషయం తెలయని ఏ మనిషి అయినా, గొప్ప వాడయ్యేది, అల్పత్వంలోనే! నువ్వు నీ సన్మానాల గురించి సంజాయిషీలు మొదలు పెట్టావెందుకు? ఈ ప్రపంచం నిండా సన్మానాలూ, బహుమానాలూ, బిరుదులూ, అవార్డులూ, తమ శ్రమతో ఏ మాత్రమూ సంబంధం లేని ధన రాసుల్ని నొల్లుకోడాలూ, అన్నీ గొప్ప సంస్కృతిగా చలామణీ అయిపోతూనే వున్నాయి. వాటి కోసం కళాకారులందరూ ఎగబడుతూనే ఉన్నారు. అందరూ చేసే పనే నువ్వూ చేశావు. చేస్తావు.

దానికి నిన్నెవరు తప్పు పట్టారు? తప్పు పడతారు? నీ సన్మానం గురించి నిన్నెవరో నిందిస్తారన్నట్టు రక రకాల దబాయింపు వాదనలు సాగించావెందుకు? 'నాకు ఉద్యోగం లేదు. బీదతనం వచ్చింది. అందుకే సన్మానాలు చేయించుకుంటున్నా' అని, నీ సన్మానాలకి ఒక కారణం చెప్పుకున్నావు. మళ్ళీ దానికే విరుద్ధంగా, 'నాకు సన్మానాలు చెయ్యవలసింది నా బీదతనం చూసి జాలితో కాదు; నా విద్వత్తుని చూసి చెయ్యాలి' అన్నావు.

నీకు సన్మానం చేసిన వాళ్ళు నీ విద్వత్తుకే చేశారు. నీ బీదతనానికి కాదు. బీదలు లోకం నిండా కుప్పతెప్పలుగా వున్నారు. ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయి నా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దానధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు. బీదతనాల్ని చూసి జాలిపడే వాళ్ళ దగ్గర సన్మానాలు చేసేటంతంత ధనరాసులు వుండవు. నీకు జరిగే సన్మానం, నీ బీదతనాన్ని చూసి కాదు; పుస్తకాలు రాశావు అనే కారణానికే.

'నాది బీదతనం కాబట్టి , సన్మానాలు చేయించుకుంటా' అని ఒక వేపూ, 'నా బీదతనానికి కాదు, నా విద్వత్తుకే సన్మానం జరగాలి' అని ఇంకో వేపూ- రెండూ నువ్వే అంటున్నావు. సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు. ఎందుకింత కష్టం నీకు? 'అందరూ చేసేదే నేనూ చేస్తాను' అంటే సరిపోదూ? నీకు సన్మానాలు చేసే వాళ్ళూ, చేయించే వాళ్ళూ, నీ కుల సంఘాల వాళ్ళూ, అంతమంది నీ చుట్టూ వున్నప్పుడు, నీ సన్మానాలకు ఆ కారణాలు చాలవూ? నిన్నెవరైనా, ఏమైనా అంటే, 'నాకు సన్మానాలు చేసే నా వాళ్ళు వున్నారు, మీకూ మీ వాళ్ళు వుంటే మీరూ చేయించుకోండి!' అంటే చాలదూ? అసలు ఆ మాటలు మాత్రం ఎందుకు? సన్మానం ఎందుకని ఎవరు అడిగారు నిన్ను? 'పిల్లలకి, పెద్దలకి అందరికీ పనికివచ్చే పుస్తకాలు రాశాను.

నా పుస్తకాలు చదివితే మంచి మంచి రసాలు ఊరతాయి. అంత మంచి పుస్తకాలు మీరందరూ ఎందుకు కొనరు? నా పుస్తకాలు కొంటే, ఆ డబ్బుతో నేను బతుకుతాను కదా? నా పుస్తకాలు మీరు ఎందుకు కొనరు?' అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఇదేం తగువు? ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. ఇతర రచయితల పుస్తకాల్లో మంచి రసాల పుస్తకాలన్నీ నువ్వు కొంటున్నావా? కొనకపోయినా ఎలాగో సంపాదించి చదువుతున్నావా?

నీ పుస్తకాలు కొందరైనా కొన్నారు. చదివారు. చదివిన వాళ్లందరికీ మంచి రసాలే ఊరినట్టయితే వాళ్ళు నీ పుస్తకాల్ని చాలా ప్రచారం చెయ్యాలి. వాళ్లు అలా చెయ్యటం లేదంటే, వాటి వల్ల మంచి రసాలు ఊరలేదేమో అనే ప్రశ్న నీకు రావాలి. రాలేదా?

నువ్వు నీకు తెలిన మాండలీకంలో, నీకు తెలిసిన బీద రైతు జీవితాల్ని చిత్రించావు. కొన్నిచోట్ల ముచ్చటగొలిపేలా రాశావు; కొన్నిచోట్ల చీదర పుట్టేలా రాశావు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరలకైనా రక్షణ దొరుకుతుంది. ఎవరు ఎలాంటి పుస్తకం రాసినా, దాన్ని చదివే వాళ్ళూ; కొనే వాళ్ళూ; కొనేసి చదవని వాళ్ళూ, కొనకుండా చదివే వాళ్ళూ; రకరకాలుగా వుంటారు. నువ్వూ అలాగే వుంటావు. మంచి పుస్తకాలన్నీ నువ్వు మాత్రం కొనగలవా?

'నా పుస్తకాలు మీరు కొనరు కాబట్టి నేను బీదవాణ్ణి అయ్యాను' అన్నావంటే, నీకు లోకజ్ఞానమే లేనట్టు కనపడుతోంది. పుస్తకాల మీద బతికే రచయిత లెవరూ ఈ దేశంలో లేరు. పాఠకులు, రచయితలందరి పుస్తకాలూ కొనేసి, రచయితలు పెట్టిన డబ్బు అంతా లాభాలతో సహా తిరిగి వచ్చే లాగచెయ్యాలంటే, మొదట పాఠకులందరూ బికారులై కూర్చుంటారు.

రచన అనేది ఒక 'కళే' గానీ, ఒక 'వృత్తి' కాదు. ఏ రచయిత అయినా, తన జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవలిసిందే. నీకు పత్రికలవాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ వృత్తినే మార్చుకోవాలని, మహా రచయితవి నీకు తెలీదా? ఆటోనో, టాక్సీనో నడుపుకోలేవూ? వాచ్‌మన్ పనిచేసుకోలేవూ? ప్రైవేట్లు చెప్పుకోలేవూ? ఒకటిరెండు స్కూళ్ళలో, టీచరు పని చేసుకోలేవూ?

గోర్కీ బండ వృత్తులు అనేకం చేశాడు. గోర్కీ అంతటి నువ్వూ అలాగే చేసుకోవాలి. లోకంలో పత్రికల వాళ్ళే ఉన్నారా ఉద్యోగాలివ్వడానికి? 'చేస్తే పత్రికలో పనే చేస్తా. ఇంకే పనీ చెయ్యను' అలా అంటావా? అలాగైతే, బీదగా బతకడానికే సిద్ధపడాలి. మాటి మాటికి బీద అరుపులు అరిచే నీకు, తాగుడు ఖర్చు ఎందుకు? బీదలు కూడా తాగుళ్ళకి అలవాటుపడతారు. కానీ వాళ్లు 'బీదలం, బీదలం' అనుకోరు. వాళ్ళ కోసం ఎవరో ఏదో చెయ్యాలనీ ఆశించరు. వాళ్లు, ఒక పని పోతే ఇంకో పని చేసుకుంటారు.

వాళ్ళ డబ్బు తోటే వాళ్ళు తాగుతారు. వాళ్ళు గొప్ప రచయితలు కారు కాబట్టి, బీదరికలో కూడా వాళ్ళు తాగుడు తప్పు చేస్తారు. కానీ, నువ్వు గొప్ప రచయితవి! నీ పుస్తకాలు మంచి రసాలు ఊరిస్తాయి! పుస్తకాల వల్ల డబ్బు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, తాగుడు కోసం ఖర్చు పెట్టే వాడికి, లేదా ఇతరులు పోయిస్తే తాగే వాడికి, జీవితం మీద ఎంత బాధ్యత ఉన్నట్టు? మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?

నీ సన్మానాలకోసం డబ్బు అందించినవాళ్లకి, నీ పుస్తకాల మీద లక్ష్యం లేదని నువ్వే అంటున్నావు. నీ పుస్తకాలు నీలో ఆత్మాభిమాన రసాన్ని ఊరించలేదా? 'నేను బీదగా వున్నాను కాబట్టి, డబ్బుకోసం సన్మానాలు చేయించుకుంటా' అంటున్నావంటే, నీ వాదంలో, బీద గా వున్నందుకూ సన్మానమే; విద్వత్తు ఉన్నందుకూ సన్మానమే! చాలా తెలివైన దారి!

'ఒక్క ఎకరం వున్న తండ్రి గల వాణ్ణి కాబట్టే బీదరైతుల జీవితాల్ని బాగాచెప్పగలిగాను; ఐదెకరాల ఇంట్లో పుడితే అలాచెప్పలేకపోదును' అన్నావు. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు నువ్వు 10 లక్షల వాడివయ్యావు. ఇంకా అవుతావు కూడా. ఇక ఇప్పటి నించీ నువ్వు చెప్పగలిగే మంచి రసాల రచనలేవీ వుండవని అర్ధమేకదా? నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్న మాటే కదా?

నామినీ, ఎందుకిలా నీ భుజాలు నువ్వు తడుముకుంటున్నావు? సంజాయిషీలతో మొదలుపెట్టి, దబాయింపుల్లోకి దిగిపోయావు. 'నేను ఇంత గొప్ప, అంత గొప్ప' అని మిడిసిపాటు ప్రదర్శించావు. బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు.

కొంచెం వివేకం తెచ్చుకో! నీ సన్మానాల గురించి ఎవరైనా నిన్ను తప్పు పడితే, 'అందరూ చేసే పనే నేను చేశాను' నా కన్నా ముందు సన్మానాలు జరిగిన వాళ్ళందర్నీ తప్పు పట్టి, ఆ తర్వాత నన్ను తప్పు పట్టండి' అని చెప్పు, సరిపోతుంది. నువ్వు గతంలో ఎప్పుడైనా సన్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడివుంటే, 'అప్పుడు బుద్ధి లేక అలా మాట్లాడాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను' అని చెప్పు! అది ఇంకా సరిపోతుంది.

కులసంఘాల వాళ్ళ నించీ డబ్బు అందుకుని, 'వికారంగా కులసంఘా ల డబ్బు' అంటూ బడాయి మాటలు విసిరి, కులసంఘాల వాళ్ళకి ఒళ్ళు మండించకు! ఎందుకీ తుంటరి మాటలు? నీ విద్వత్తుకో, నీ బీదరికానికో, దేనికో దానికి నిన్ను స్థితిమంతుణ్ణి చేస్తోంటే, వాళ్ళకి వినయం చూపించు.

వాళ్ళకి అణగి మణిగి వుండు. చక్కగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో, వంది మాగధులతో ఎబికె ప్రసాద్ వంటి మహా మేధావుల ఆశీస్సులతో, బడా పారిశ్రామిక వేత్తల జ్యోతి ప్రజ్వలనాలతో, వందన సమర్పణలతో, రంగరంగ వైభవంగా సన్మానం చేయించుకో! ముచ్చటగా నెలకో సన్మానంతో నెలకో లక్ష అందుకో! ఎంతకాలం దాకా ఇస్తారో అంతకాలం దాకా అందుకో! వాళ్ళు ఇచ్చింది వాళ్ళ కష్టార్జితం కాదులే. వాళ్ళు దోచుకునే దాంట్లో నువ్వూ ఒక వాటా సంపాదించుకో.

నువ్వు ఇప్పుడు ఒక్క ఎకరం బీద రైతు కుమారుడివి కావు; బడా బడా పారిశ్రామికవేత్తల అత్యున్నత దేవస్థానం ప్రముఖుల ముద్దబిడ్డవి! ఇన్నా ళ్ళూ బీదరైతుల కథలు రాసిన నీ కలం నించి, ఇక ఇప్పటి నించి, సన్మానా లూ, ధనరాసులూ, ఎంత రుచికరమైనవో, నీ వంటి గొప్ప రచయితలకు అవి అందడం ఎంత న్యాయమో, ఎంత అభ్యుదయమో వర్ణిస్తూ నీ వాదనలతో రాబోయే నీ కొత్త రసాల రచన కోసం ఎదురు చూస్తాం నామినీ! సరేనా?

- రంగనాయకమ్మ



Friday, January 29, 2010

నామిని మాటల్లో నిజమెంత? విలువెంత?

నామిని “ పచ్చ నాకు సాక్షిగా “ కు పాతికేళ్ళు వచ్చాయి. ఈ సందర్భం గా ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూ, ఈ సందర్భం గా తిరుపతి సభలో చేసిన ప్రసంగ పాఠం చదివాక నాకు కలిగిన అభిప్రాయాలు ఇవి.
నిస్సందేహం గా నామిని మంచి రచయిత. అతను రాసిన పుస్తకాల్లో విలువైన విషయాలు, ఇంతకు ముందు ఎవరూ మాట్లాడని విషయాలు వున్నాయి. అంతవరకు నాకెలాంటి అభ్యంతరం, అనుమానం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే కొన్ని విషయాల పట్లే నా అభ్యంతరం మొత్తం కూడా. కాబట్టి ఇది నామిని కి వ్యతిరేకం అని కాకుండా అతని అభిప్రాయాలకు మాత్రమే వ్యతిరేకం అన్న విషయంలో నేను స్పష్టం గా వున్నాను.

మొన్నోకసారి ఇదే బ్లాగ్ లో వేరే సందర్భం లో ( ద్రౌపదీ వివాదం సందర్భం గా) మాట్లాడినప్పుడు) వాల్మీకి, వ్యాసుడు, పోతన ల గురించి....నేనొక అభిప్రాయం వెలిబుచ్చాను. వాళ్ళు గొప్ప కవులు..( కవిత్వం రాసిన వారు అని కాదు. గొప్పకావ్యాలు రాసిన వారు అని). వాళ్ళు మరో రకంగా కూడా గొప్పవారు. వినయ గుణ సంపన్నులు.వాళ్ళకు అహంకారంలేదు. వాళ్ళు నిరహంకారులు. వినయాన్ని భూషణం గా ధరించినవారు. విద్య వినయాన్ని ఇవ్వాలి. అదే దానికిసహజాభరణం. విద్య వున్నచోట అహంకారం వుంటే భాసించదు. నామిని లాంటి పెద్దవాళ్ళను విభేదించటం అభిప్రాయాలరీత్యా నే కానీ వారి రచనల పట్ల, వారి వ్యక్తిత్వాల పట్ల అగౌరవంతో కాదు.

భర్తృహరి సుభాషితాల్లో అనుకుంటాను ఒక మంచి మాట చెప్పాడు.
“డబ్బు వున్న వాళ్ళు ఆ వూర్లోనే గౌరవించబడతారు...విద్య వున్నవాడు ఎక్కడికెళ్లినా గౌరవం అతని వెన్నంటే వుంటుంది.”

ఆ రకంగా నామిని కున్న పాండిత్యానికి, రచనా నైపుణ్యానికి రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఆయన బతికి వున్నంత కాలం, ఆ తర్వాత కూడా ఆయనకు సాహిత్యపరమైన గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లదు. మరి నామిని కి కావాల్సింది ఏమిటి? కీర్తి ప్రతిష్టలు వున్నాయి. లేనిదల్లా డబ్బే. సరస్వతీ కటాక్షం వున్నవారికి లక్ష్మి కటాక్షం వుండదు అన్నది జనబాహుళ్యం లోని మాట.. పుస్తకం అమ్ముకోలేకపోయానని బాధపడుతున్న నామిని ఎక్కడా? పుస్తకం అమ్ముకోవాల్సి వస్తుందేమోనని బాధపడ్డ పోతన ఎక్కడా? గొప్ప గొప్ప రచయితలు కూడా ఉదర పోషణార్ధం ఉద్యోగాలు చేసుకుంటే నామిని మాత్రం పుస్తకాల మీదే బతకాలనుకున్నాడు. అది అతని తప్పు కాదు. అయితే అందుకు లోకాన్ని, తోటి రచయితలనీ దుమ్ముపట్టాల్సిన పని లేదు అనుకుంటున్నాను.

నామిని ఎంత గొప్పగా రాసినా అంత అహంకారంతో ( రాయలసీమ భాషలో తిమురు కాబోలు) మాట్లాడాల్సిన అవసరం లేదు. తను రాసింది గొప్ప అని ఫీల్ కావడం , తను మంచి రచయిత అన్న ఆత్మాభిమానం ఒక స్థాయి వరకు అవసరం. అది వుండటంలో తప్పు లేదు. మిగతా వారు ఎవరూ ఏమీ రాయలేదని, వాళ్ళకు నిజాయితీ లేదన్నది మాత్రం నిస్సందేహంగా అతని అహంకారమే అనుకుంటాను. నామిని చెప్పాడని ఇవాళ ఎవరూ కేశవరెడ్డి నో, సింగమనేని నో, కేతు విశ్వనాధరెడ్డి నో, వోల్గా నో పక్కన పెట్టేయరు. నామినికి వాళ్ళ రచనలు నచ్చనంత మాత్రానా, నిజాయితీ కనిపించకపోయినంత మాత్రాన , వాళ్ళ రచనల్ని ఎవరూ ఆదరించకపోరు. వాళ్ళ రచనల్ని ఆడోల్లు చదవలేరు అని నామిని ప్రకటించేశాడు. నామిని! మీ అభిప్రాయాలు మీరు నిష్కర్ష గా ప్రకటించుకోండి. “ ఆడోళ్ళతరఫున మీరేమీ వకాల్తా పుచ్చుకోనక్కరలేదు. మీ సానుభూతి, మీ తోడ్పాటు అవసరం లేకుండానే రచయితల రచనల్లో నిజాయితీ లేకపోతే వాళ్ళు తిరస్కరించగలరు.. వాళ్ళకేమి కావాలో వాళ్ళకు బాగానే తెలుసు అనుకుంటాను.

తనది మాత్రమే ప్రజా సాహిత్యం అని, మిగతా రచయితలు రాసేదంతా దొంగ సాహిత్యమని, కొందరు రచయితలు రైతుల్ని, రైతు భార్యల్ని హింసించారని నామిని నిరాధారమైన ఆరోపణలు ఎలా చేయగలిగాడో నాకు అర్ధం కాలేదు. చేరాల కోసం, వోల్గా కోసం, వాసిరెడ్డి నవీన్ కోసం రచయితలు మీరు అనుమానించినతగా దిగజారిపోలేదు. వాళ్ళకు అభిమానులే కానీ వారసులు లేరు. మాటకొస్తే మీఅడుగుజాడల్లోనడిచేందుకు పుట్టుకొచ్చిన రచయితలేవరో మీకు , మాకూ ఇద్దరకూ తెలుసు.

చదువులా….చావులా ? రాసింది నిజంగా పిల్లలమీద, విద్యావ్యవస్థ మీద గౌరవం, ప్రేమతోనా? లేక నామిని నే వొప్పుకున్నట్లు ప్రజా సాహిత్యం అమ్ముడుపోదని, రూటు మార్చి పిల్లల చదువుల మీదా రాశాడనుకోవాలా ? అదే నిజమైతే అతని నిజాయితీ మాత్రం ఏపాటిది?

నామిని సాహిత్యం ఒక్కటేనా ఇవాళ క్లిష్ట పరిష్టితుల్లో వున్నది? నామిని ఒక్కడేనా ఇవాళ పేద రచయిత? శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి లాంటి మహా రచయిత చివరి స్థితి ఎంత దుర్భరంగా గడిచిందో అప్పుడే అందరూ మర్చిపోయారా? అప్పుడు, ఇప్పుడూ కూడా వెయ్యి పుస్తకాలు వేస్తే, అమ్ముకోలేక సొంతంగా పంచిపెట్టుకునే దుర్భర స్థితి లోనే వున్నారు తెలుగు రచయితలు . నామిని అందుకు మినహాయింపు మాత్రం కాదు. తిండికి గడవలేని స్థితి లో నామిని వున్నాడని నేను అనుకోను. హోటల్ లో సర్వర్ గా పనిచేస్తూ, తినటానికి తిండి కూడా లేని అతి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి కూడా కథలు రాసిన శారద ని కూడా మనం చూశాం. తిరుమల రామచంద్ర, సహవాసి, అనతపురం లోని అనువాదకుడు కేశవరావు గారు లాంటి ఇంకా అనేకానేక మంది పేద రచయితలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతున్నారు .. నామిని ది గంజి నీళ్ళు కూడా తాగలేని పేదరికం అనుకోను. వెయ్యి కాపీలు కూడా అమ్ముకోలేకపోతున్న స్థితి లో ఎన్నో తరాలుగా రచయితలు వుంటే లక్ష కాపీలు వేసి అవి అమ్ముడుపోలేదని ఎవర్ని నిందిస్తున్నారు నామిని మీరు?

మా పక్క వూరు హ్యూస్టన్ లో ఒక రాజు గారున్నారు. పేరు కి రాజు. ఆయనకు ఎంత పాటి ఆస్తి వుందో నాకు తెలియదు కానీ. ప్రతి ఏడాది పుస్తకాలు అచ్చు వేసి, సాహిత్య పోటీలు పెడుతుంటారు. పత్రికల వాళ్ళే రచనలకు డబ్బులు ఇవ్వకపోతే ఈయనేమో కథలకు, కవిత్వాలకు కూడా నూటపదహార్లు (డాలర్లు ) సమర్పించుకుంటుంటారు. ఆయనకు డబ్బు చేదా? ఎవరైనా ఆయనను సాహిత్య సేవ చేయమని బతిమిలాడారా? ఆయన లాంటి వారి బాధను ఇప్పటివరకు ఎవరైనా పట్టించుకున్నారో లేదో తెలియదు. అమెరికా వాళ్ళ దగ్గర అప్పనంగా డబ్బు వుంటుందని కొందరి భ్రమలు. వారికి మనమేమీ చెప్పలేం. ఒకప్పటి భారతి నుండి, మొన్నటి ఆహ్వానం, ఈనాటి తెలుగునాడి వరకూ సాహిత్య పత్రికలు మూత పడటం తెలుగు సాహిత్య చరిత్ర లో మర్చిపోలేని నిజాలు .

సాహిత్యం కోసం సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు, నట్టేట మునిగిన వారు ఎందరో వున్నారు. వారి కన్నా నామిని పరిస్థితి ఏ రకంగా తేడా ? నామిని కూడా ఆ స్థితి లోకి వెళ్ళాలన్నది కాదు నా అభిమతం. ఇవాళ నామిని బాధ కొందరికి ఎందుకు “ అద్భుతం” గా అనిపిస్తోందో నాకు అర్ధం కావటం లేదు. నాకైతే నామిని వి అకారణ నిందలు అనిపించాయి.

పిల్లల పుస్తకాలు ఎవరు చదవాలి? ఎవరు కొనాలి అనే దాంట్లో నామిని మాట్లాడిన మాటలు మాత్రం చేదు నిజం. నామిని వెనకాల రంగనాయకమ్మ, బాపు, రమణ లాంటి మహామహులున్నారు. అలాంటి వాళ్ళేవ్వరూ లేకపోవడం వల్ల అంటరాని వసంతానికో, కక్క కో, ది లాస్ట్ బ్రాహ్మిన్ కో డబ్బు సంగతి దేవుడెరుగు ,రావాల్సిన గుర్తింపు కూడా రాలేదు. దానికి మనం ఎవరిని నిందించాలి? పుస్తకాలు అమ్ముకోవటం కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ చేసిన వారికా? అవార్డుల పేరుతో కీర్తిని నడి బజారులో వేలం వేస్తున్నవారినా? పుస్తకాల అమ్మకాల్లో 40 శాతం ముక్కుపిండి రచయితల డబ్బు ని వసూలు చేసుకుంటున్న పుస్తక విక్రేత సంస్థలదా? అందువల్ల పుస్తకాల ధరను రెట్టింపు చేయాల్సిన పరిస్థితి లో వున్న రచయితలదా? ఎవరిది తప్పు?

కల్పనారెంటాల

(నామిని ఇంటర్వ్యూ ని ఇక్కడ, ప్రసంగపాఠాన్ని ఇక్కడ చదవండి.)
 
Real Time Web Analytics