నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, January 29, 2010

నామిని మాటల్లో నిజమెంత? విలువెంత?

నామిని “ పచ్చ నాకు సాక్షిగా “ కు పాతికేళ్ళు వచ్చాయి. ఈ సందర్భం గా ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూ, ఈ సందర్భం గా తిరుపతి సభలో చేసిన ప్రసంగ పాఠం చదివాక నాకు కలిగిన అభిప్రాయాలు ఇవి.
నిస్సందేహం గా నామిని మంచి రచయిత. అతను రాసిన పుస్తకాల్లో విలువైన విషయాలు, ఇంతకు ముందు ఎవరూ మాట్లాడని విషయాలు వున్నాయి. అంతవరకు నాకెలాంటి అభ్యంతరం, అనుమానం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే కొన్ని విషయాల పట్లే నా అభ్యంతరం మొత్తం కూడా. కాబట్టి ఇది నామిని కి వ్యతిరేకం అని కాకుండా అతని అభిప్రాయాలకు మాత్రమే వ్యతిరేకం అన్న విషయంలో నేను స్పష్టం గా వున్నాను.

మొన్నోకసారి ఇదే బ్లాగ్ లో వేరే సందర్భం లో ( ద్రౌపదీ వివాదం సందర్భం గా) మాట్లాడినప్పుడు) వాల్మీకి, వ్యాసుడు, పోతన ల గురించి....నేనొక అభిప్రాయం వెలిబుచ్చాను. వాళ్ళు గొప్ప కవులు..( కవిత్వం రాసిన వారు అని కాదు. గొప్పకావ్యాలు రాసిన వారు అని). వాళ్ళు మరో రకంగా కూడా గొప్పవారు. వినయ గుణ సంపన్నులు.వాళ్ళకు అహంకారంలేదు. వాళ్ళు నిరహంకారులు. వినయాన్ని భూషణం గా ధరించినవారు. విద్య వినయాన్ని ఇవ్వాలి. అదే దానికిసహజాభరణం. విద్య వున్నచోట అహంకారం వుంటే భాసించదు. నామిని లాంటి పెద్దవాళ్ళను విభేదించటం అభిప్రాయాలరీత్యా నే కానీ వారి రచనల పట్ల, వారి వ్యక్తిత్వాల పట్ల అగౌరవంతో కాదు.

భర్తృహరి సుభాషితాల్లో అనుకుంటాను ఒక మంచి మాట చెప్పాడు.
“డబ్బు వున్న వాళ్ళు ఆ వూర్లోనే గౌరవించబడతారు...విద్య వున్నవాడు ఎక్కడికెళ్లినా గౌరవం అతని వెన్నంటే వుంటుంది.”

ఆ రకంగా నామిని కున్న పాండిత్యానికి, రచనా నైపుణ్యానికి రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఆయన బతికి వున్నంత కాలం, ఆ తర్వాత కూడా ఆయనకు సాహిత్యపరమైన గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లదు. మరి నామిని కి కావాల్సింది ఏమిటి? కీర్తి ప్రతిష్టలు వున్నాయి. లేనిదల్లా డబ్బే. సరస్వతీ కటాక్షం వున్నవారికి లక్ష్మి కటాక్షం వుండదు అన్నది జనబాహుళ్యం లోని మాట.. పుస్తకం అమ్ముకోలేకపోయానని బాధపడుతున్న నామిని ఎక్కడా? పుస్తకం అమ్ముకోవాల్సి వస్తుందేమోనని బాధపడ్డ పోతన ఎక్కడా? గొప్ప గొప్ప రచయితలు కూడా ఉదర పోషణార్ధం ఉద్యోగాలు చేసుకుంటే నామిని మాత్రం పుస్తకాల మీదే బతకాలనుకున్నాడు. అది అతని తప్పు కాదు. అయితే అందుకు లోకాన్ని, తోటి రచయితలనీ దుమ్ముపట్టాల్సిన పని లేదు అనుకుంటున్నాను.

నామిని ఎంత గొప్పగా రాసినా అంత అహంకారంతో ( రాయలసీమ భాషలో తిమురు కాబోలు) మాట్లాడాల్సిన అవసరం లేదు. తను రాసింది గొప్ప అని ఫీల్ కావడం , తను మంచి రచయిత అన్న ఆత్మాభిమానం ఒక స్థాయి వరకు అవసరం. అది వుండటంలో తప్పు లేదు. మిగతా వారు ఎవరూ ఏమీ రాయలేదని, వాళ్ళకు నిజాయితీ లేదన్నది మాత్రం నిస్సందేహంగా అతని అహంకారమే అనుకుంటాను. నామిని చెప్పాడని ఇవాళ ఎవరూ కేశవరెడ్డి నో, సింగమనేని నో, కేతు విశ్వనాధరెడ్డి నో, వోల్గా నో పక్కన పెట్టేయరు. నామినికి వాళ్ళ రచనలు నచ్చనంత మాత్రానా, నిజాయితీ కనిపించకపోయినంత మాత్రాన , వాళ్ళ రచనల్ని ఎవరూ ఆదరించకపోరు. వాళ్ళ రచనల్ని ఆడోల్లు చదవలేరు అని నామిని ప్రకటించేశాడు. నామిని! మీ అభిప్రాయాలు మీరు నిష్కర్ష గా ప్రకటించుకోండి. “ ఆడోళ్ళతరఫున మీరేమీ వకాల్తా పుచ్చుకోనక్కరలేదు. మీ సానుభూతి, మీ తోడ్పాటు అవసరం లేకుండానే రచయితల రచనల్లో నిజాయితీ లేకపోతే వాళ్ళు తిరస్కరించగలరు.. వాళ్ళకేమి కావాలో వాళ్ళకు బాగానే తెలుసు అనుకుంటాను.

తనది మాత్రమే ప్రజా సాహిత్యం అని, మిగతా రచయితలు రాసేదంతా దొంగ సాహిత్యమని, కొందరు రచయితలు రైతుల్ని, రైతు భార్యల్ని హింసించారని నామిని నిరాధారమైన ఆరోపణలు ఎలా చేయగలిగాడో నాకు అర్ధం కాలేదు. చేరాల కోసం, వోల్గా కోసం, వాసిరెడ్డి నవీన్ కోసం రచయితలు మీరు అనుమానించినతగా దిగజారిపోలేదు. వాళ్ళకు అభిమానులే కానీ వారసులు లేరు. మాటకొస్తే మీఅడుగుజాడల్లోనడిచేందుకు పుట్టుకొచ్చిన రచయితలేవరో మీకు , మాకూ ఇద్దరకూ తెలుసు.

చదువులా….చావులా ? రాసింది నిజంగా పిల్లలమీద, విద్యావ్యవస్థ మీద గౌరవం, ప్రేమతోనా? లేక నామిని నే వొప్పుకున్నట్లు ప్రజా సాహిత్యం అమ్ముడుపోదని, రూటు మార్చి పిల్లల చదువుల మీదా రాశాడనుకోవాలా ? అదే నిజమైతే అతని నిజాయితీ మాత్రం ఏపాటిది?

నామిని సాహిత్యం ఒక్కటేనా ఇవాళ క్లిష్ట పరిష్టితుల్లో వున్నది? నామిని ఒక్కడేనా ఇవాళ పేద రచయిత? శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి లాంటి మహా రచయిత చివరి స్థితి ఎంత దుర్భరంగా గడిచిందో అప్పుడే అందరూ మర్చిపోయారా? అప్పుడు, ఇప్పుడూ కూడా వెయ్యి పుస్తకాలు వేస్తే, అమ్ముకోలేక సొంతంగా పంచిపెట్టుకునే దుర్భర స్థితి లోనే వున్నారు తెలుగు రచయితలు . నామిని అందుకు మినహాయింపు మాత్రం కాదు. తిండికి గడవలేని స్థితి లో నామిని వున్నాడని నేను అనుకోను. హోటల్ లో సర్వర్ గా పనిచేస్తూ, తినటానికి తిండి కూడా లేని అతి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి కూడా కథలు రాసిన శారద ని కూడా మనం చూశాం. తిరుమల రామచంద్ర, సహవాసి, అనతపురం లోని అనువాదకుడు కేశవరావు గారు లాంటి ఇంకా అనేకానేక మంది పేద రచయితలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతున్నారు .. నామిని ది గంజి నీళ్ళు కూడా తాగలేని పేదరికం అనుకోను. వెయ్యి కాపీలు కూడా అమ్ముకోలేకపోతున్న స్థితి లో ఎన్నో తరాలుగా రచయితలు వుంటే లక్ష కాపీలు వేసి అవి అమ్ముడుపోలేదని ఎవర్ని నిందిస్తున్నారు నామిని మీరు?

మా పక్క వూరు హ్యూస్టన్ లో ఒక రాజు గారున్నారు. పేరు కి రాజు. ఆయనకు ఎంత పాటి ఆస్తి వుందో నాకు తెలియదు కానీ. ప్రతి ఏడాది పుస్తకాలు అచ్చు వేసి, సాహిత్య పోటీలు పెడుతుంటారు. పత్రికల వాళ్ళే రచనలకు డబ్బులు ఇవ్వకపోతే ఈయనేమో కథలకు, కవిత్వాలకు కూడా నూటపదహార్లు (డాలర్లు ) సమర్పించుకుంటుంటారు. ఆయనకు డబ్బు చేదా? ఎవరైనా ఆయనను సాహిత్య సేవ చేయమని బతిమిలాడారా? ఆయన లాంటి వారి బాధను ఇప్పటివరకు ఎవరైనా పట్టించుకున్నారో లేదో తెలియదు. అమెరికా వాళ్ళ దగ్గర అప్పనంగా డబ్బు వుంటుందని కొందరి భ్రమలు. వారికి మనమేమీ చెప్పలేం. ఒకప్పటి భారతి నుండి, మొన్నటి ఆహ్వానం, ఈనాటి తెలుగునాడి వరకూ సాహిత్య పత్రికలు మూత పడటం తెలుగు సాహిత్య చరిత్ర లో మర్చిపోలేని నిజాలు .

సాహిత్యం కోసం సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు, నట్టేట మునిగిన వారు ఎందరో వున్నారు. వారి కన్నా నామిని పరిస్థితి ఏ రకంగా తేడా ? నామిని కూడా ఆ స్థితి లోకి వెళ్ళాలన్నది కాదు నా అభిమతం. ఇవాళ నామిని బాధ కొందరికి ఎందుకు “ అద్భుతం” గా అనిపిస్తోందో నాకు అర్ధం కావటం లేదు. నాకైతే నామిని వి అకారణ నిందలు అనిపించాయి.

పిల్లల పుస్తకాలు ఎవరు చదవాలి? ఎవరు కొనాలి అనే దాంట్లో నామిని మాట్లాడిన మాటలు మాత్రం చేదు నిజం. నామిని వెనకాల రంగనాయకమ్మ, బాపు, రమణ లాంటి మహామహులున్నారు. అలాంటి వాళ్ళేవ్వరూ లేకపోవడం వల్ల అంటరాని వసంతానికో, కక్క కో, ది లాస్ట్ బ్రాహ్మిన్ కో డబ్బు సంగతి దేవుడెరుగు ,రావాల్సిన గుర్తింపు కూడా రాలేదు. దానికి మనం ఎవరిని నిందించాలి? పుస్తకాలు అమ్ముకోవటం కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ చేసిన వారికా? అవార్డుల పేరుతో కీర్తిని నడి బజారులో వేలం వేస్తున్నవారినా? పుస్తకాల అమ్మకాల్లో 40 శాతం ముక్కుపిండి రచయితల డబ్బు ని వసూలు చేసుకుంటున్న పుస్తక విక్రేత సంస్థలదా? అందువల్ల పుస్తకాల ధరను రెట్టింపు చేయాల్సిన పరిస్థితి లో వున్న రచయితలదా? ఎవరిది తప్పు?

కల్పనారెంటాల

(నామిని ఇంటర్వ్యూ ని ఇక్కడ, ప్రసంగపాఠాన్ని ఇక్కడ చదవండి.)

Friday, January 22, 2010

నువ్వు తిరిగి రాకూడదా శరత్!


శరత్. ఈ పేరు వినగానే, అతని సాహిత్యం గుర్తుకు రాగానే మనసంతా ఓ రకమైన ఉద్వేగానికి లోనవుతుంది.అతను పరాయీ రాష్ట్రం వాడు అన్న భావన ఊహా మాత్రంగానైనా రాదు. బెంగాలీ రస గుల్లాల కంటే శరత్ సాహిత్యమంటేనే భారతీయులకు ఎక్కువ ఇష్టం అని హాయిగా, గట్టిగా పైకి చెప్పాలనిపిస్తుంది. రచయిత అంటే గౌరవంతోనో, అభిమానంతోనో నమస్కరించటం వేరు. ప్రేమతో అతన్ని హృదయంలో దాచుకోవడం వేరు. నాకొక్కరికే కాదు, వేన వేల మందికి అలా హృదయానికి దగ్గరైన రచయిత శరత్. భాషా భేదం లేకుండా భారతీయులందరికీ అభిమానమైన రచయితల్లో అగ్రగణ్యులు రవీంద్రనాథ్ టాగూర్, శరత్చంద్ర చటర్జి. తెలుగు వారు విపరీతంగా ఆరాధించిన రెండు పేర్లలో ఒకటి శరత్. రెండోది వంశీ ( లత మోహన వంశీ ప్రభావం) . ఒకటి, రెండు దశాబ్దాలు అదేదో ఒక ఉద్యమంలా పిల్లల పేర్ల దగ్గర నుంచి, రోడ్డు మీద షాపుల పేర్ల దాకా ఎటు చూసినా శరత్ అనో, వంశీ అనో కనిపించేవి.

శరత్ అంటే దేవదాస్ గుర్తుకు వస్తాడు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేనివారికైనా. నాకైతే అతని రచనలన్నీ ఒకదానికొకటీ పోటీ పడి నచ్చేస్తాయి.మరీ ముఖ్యం గా శ్రీకాంత్, శేషప్రశ్న. శ్రీకాంత్ లో రాజ్యలక్ష్మి, శేషప్రశ్న లో కమల గురించి ఎన్ని సార్లు చదివినా, మాట్లాడినా విసుగు పుట్టదు. శ్రీకాంత్ చదువుతున్నంతసేపు అది మనఆరాధ్య రచయిత శరత్ బాబేనని, శరత్ ఆత్మకధనే మనం శ్రీకాంత్ గా చదువుతున్నామని అనిపిస్తుంటుంది.” శ్రీకాంత్ నవల రాసేటప్పుడు తానేప్పుడు అలిసిపోలేదని, పైగా, ఎప్పుడైనా నిస్సత్తువుగా అనిపిస్తే, ఈ నవలలో ఒకటి రెండు భాగాలు రాసేవాడినని “శరత్ ఎక్కడో ఒక సారి చెప్పారట. సామాన్యంగా రచయిత కి నచ్చిన తన కధో, కవితో, నవలో , పాఠకులకు అంతగా నచ్చకపోవచ్చు. లేదా దానికి పూర్తి భిన్నంగా కూడా జరగవచ్చు. పాఠకులకు బాగా నచ్చినది రచయిత కి అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు.కానీ శ్రీకాంత్ అటు రచయిత కి, ఇటు పాఠకులకు కూడా బాగా నచ్చిన పుస్తకం. ఈ నవల ఫ్రెంచ్ లోకి అనువాదమై నడిబజారులో అనేక కాపీలు అమ్ముడుపోయిందట. శ్రీకాంత్ నవల ఉత్తమ పురుష లో సాగుతుంది. నాలుగు భాగాల నవల చదవటం పూర్తి అయినా మనకు ఇంకా శ్రీకాంత్ గురించి తెలిసినట్లు అనిపించదు. ఇంకా ఏదో మనం శ్రీకాంత్ గురించి తెలుసుకోవాల్సి వుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే నవల అసంపూర్తి గా వున్నట్లు గా కాదు. మనకు శ్రీకాంత్ మీద కలిగే ప్రేమ కొద్దీ అతని గురించి ఇంకా వినాలని, చదవాలని, తెలుసుకోవాలని అనిపించటం.

శరత్ స్త్రీ పాత్రలు, చలం స్త్రీ పాత్రలు పూర్తిగా ఒకరికొకరు భిన్నమైన వారు. శరత్ రచనల్లోని స్త్రీలు వితంతువులు, అభాగినులు,శ్రీ శ్రీ మాటల్లో బాధా సర్పద్రష్టలు. అలాగని శరత్ స్త్రీ పాత్రలు బలహీనమైన వారు కాదు. నెమ్మదిగా, మృదువుగా మాట్లాడుతూనే తమ బలమైన వ్యక్తిత్వాలను నిలుపుకునే స్త్రీలను సృజించిన శరత్ ని స్త్రీ, పురుషులు సమానంగా ప్రేమించారు. శరత్ నవలలు చదివాక అతని స్త్రీ పాత్రలతో పాటు అతని నవలల్లోని కథానాయకులంటే కూడా అంతే ప్రేమ పుట్టుకువస్తుంది. శరత్ సాహిత్యాన్ని చదివిన స్త్రీలకు అతనొక రహస్య స్నేహితుడు. ప్రేమికుడు.అది కేవలం అతని అక్షరాల మీద ప్రేమ కాదు. అతని మనస్సు అంతా వొంపి అతను సృజించిన సాహిత్యాన్ని ప్రేమించటం . అతను, అతని సాహిత్యం రెండూ వేర్వేరు కావు. అది మొత్తం కలిపి ఒకటే ప్రపంచం అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ నవలలు, స్త్రీ, పురుష పాత్రలు అన్నీ కలగలిసిపోయి శరత్చంద్రుడు గా దర్శనమిచ్చేవాడు. ఒకటే మనిషి స్త్రీగా, పురుషుడిగా, రకరకాల పుస్తకాలుగా అవతారమెత్తాడు కాబోలు అనుకునేదాన్ని. ఆ రకంగా శరత్ నా యవ్వనవనంలో ఒక రహస్య స్నేహితుడయ్యాడు. ఎప్పుడో అప్పుడు బెంగాల్ వెళ్తానని, అక్కడ తెల్లని కుర్తా, పైజమా వేసుకొని వొత్తైన జుట్టుతో ఒక అందమైన బెంగాలీ బాబు కనిపించి నన్ను ప్రేమిస్తాడని రకరకాల ఊసులాడుకునేదాన్ని. ఇప్పటికీ అచ్చమైన బెంగాలీ బాబు అంటే ఒకే ఒక్క శరత్ మాత్రమే అనిపిస్తుంటుంది నాకు.

సరే, శరత్ పుస్తకాలతో రహస్య ప్రణయం గురించి కాసేపు పక్కనపెట్టి శరత్ జీవితం లోకి వెళితే...

శరత్ కి తెలిసినంతగా పేదరికం గురించి మరే రచయిత కు తెలీదు. (తెలుగు రచయితల విషయానికి వస్తే కథకుడు శారద గా పేరుపడ్డ నటరాజన్ కి). ఆ పేదరికం కేవలం భౌతికమైనదే కాదు, దానికున్న అనేకానేక మానసిక కోణాల నుంచి కూడా అతనికి పేదరికం గురించి సమగ్రంగా తెలుసు. సెప్టెంబర్ 15, 1933 తన 57 వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సమావేశం లో మాట్లాడుతూ శరత్ “ నేను తీర్చుకోవాల్సిన ఈ సాహిత్య రుణం కేవలం నా పూర్వీకుల కోసమే కాదు. అణగారిన, సాధారణ ప్రజలకు నేనెప్పటికీ రుణపడి వుంటాను. వాళ్ళు ఈ సమాజానికి అన్నీ ఇచ్చారు. అయినా ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. బలహీనమైన , అట్టడుగు వర్గాల ప్రజల కన్నీళ్ళు ఎవరికీ పట్టవు. వారి గురించి ఎవరూ ఒక్క క్షణం కూడా ఆలోచించరు. నన్ను వారి తరఫున మాట్లాడించేలా చేసింది వారే. వారి పక్షాన నిలబడి వాదించేలా వారు నన్ను ఉత్తేజితుల్ని చేశారు. ఈ ప్రజలకు జరిగే నిరంతర అన్యాయాల్ని నేను కళ్ళారా చూసాను. ఈ ప్రపంచంలో ఎప్పుడో అప్పుడు తన సౌందర్య శోభతో, సంపదతో , తన తియ్యని గాలులు, వికసించిన పుష్పాలతో, కోయిల పాట తో వసంతం వస్తుంది. కానీ ఆ సుందర విషయాలన్నీ నా పరిధిలో లేనివి. నాకు అందని విషయాలు.ఈ పేదరికమే నా రచనలకు ప్రాణం” అన్నారు.

శరత్ తన సాహిత్యానికి కావాల్సిన ముడి సరుకును చరిత్రపుటల్లోంచి తవ్వి తీసుకోలేదు. తన రోజూ వారీ పల్లె జీవితం నుండి, తనకు తెలిసిన వ్యక్తులను, అనుభవాలను, సంఘర్షణలని తన పాత్రలుగా మలుచుకున్నాడు. బెంగాలీ సాహిత్యంలో మేరునగం లాంటి టాగూర్ ప్రభావం పడకుండా దూరంగా వుండి రాయగలిగాడు. శరత్ రాయడం మొదలుపెట్టిన తొలిదినాల్లో , కలం పేరుతో టాగూర్ రాసేడని అనుమానించారు కూడా. ఎలాంటి సంస్కృత భాషాడంబరం లేకుండా శరత్ అచ్చమైన , అందమైన బెంగాలీ పదాలు వాడాడని బెంగాలీలు శరత్ ని మెచ్చుకుంటారు. ఆ రోజుల్లో అది పెద్ద విప్లవాత్మకమైన కొత్తదనం. ఆ సంప్రదాయానికి ఆద్యుడు శరత్ కాదు. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ ప్రభావంతో మాత్రమే శరత్ అలా చేయగలిగాడు.

శరత్ చంద్ర చటెర్జీ పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని దేవానంద్పూర్ గ్రామంలో సెప్టెంబర్ 15, 1876 న జన్మించారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల్లో తరచూ వచ్చే మార్పుల వల్ల శరత్ స్కూల్ జీవితం కూడా అనేక మార్పులు వచ్చాయి.

“ నా చిన్నతనం, యవ్వనం రెండూ కూడా అత్యంత పేదరికంలో గడిచాయి. ఆర్ధిక అవసరాల కోసం నేను ఎలాంటి విద్యను నేర్చుకోలేదు. మా నాన్న నుండి నేను వారసత్వం గా పొందింది రెండు విషయాలను. ఒకటి ఎప్పటికీ అలసిపోని ఆయన ఉత్సాహం, స్ఫూర్తి. రెండోది ఆయన సాహిత్య జిజ్ణాస. ఆ నిరంతర ఉత్సాహం నన్నొక దేశ దిమ్మరిగా భారతదేశం అంతా పర్యటించేలా చేస్తే, ఆయన సాహితీ జిజ్ణాస నా జీవితమంతా నన్నొక స్వాప్నికుడిగా మిగిల్చింది” అంటారు. కాలేజీలో శరత్ ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నారు. అందులో భాగం గా చార్లెస్ డికేన్స్ లాంటి మహా రచయితలను చదువుకున్నా తన నిజమైన స్ఫూర్తి తన తండ్రి అసంపూర్తి, అముద్రిత రచనలే అని చెప్పుకునేవారు శరత్. వాటిని చదువుతూ, వాటిని తానే పూర్తి చేస్తూ, తన రచనా వ్యాసంగాన్ని శరత్ మెరుగులు దిద్దుకున్నారు. శరత్ తండ్రి బాగా చదువుకున్న పండితుడు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. కధలు, నవలలు, నాటికలు, కవిత్వం అన్నీ వ్రాశారు. కానీ ఏదీ కూడా పూర్తి చేయలేదు. అన్నీ అసంపూర్తి గా వదిలేశారు. ఆ అసంపూర్తి సాహిత్యం శరత్ ని నిరంతరం వెంటాడేది. ఏ అర్ధరాత్రో లేచి కూర్చొని వాటికి ముగింపు ఇచ్చి వుంటే అవి ఎలా తయారై వుండేవో ఆలోచిస్తూ వుండేవారు. ఆ ఆలోచనల వల్లే శరత్ తనకు 17 ఏళ్ళ వయసున్నప్పుడే చిన్న చిన్న కథలు రాయటం ప్రారంభించారు. తల్లి చనిపోవటం తో శరత్ కాలేజీ చదువు ఆపేసి భాగల్పూర్ కి మకాం మార్చాల్సి వచ్చింది. శరత్ రాయడమే కాదు, పాడేవారు, నటించేవారు. ఫ్లూట్, తబలా వాయించేవారు. మంచి ఆటగాడు కూడా.యువకుడైన శరత్ సున్నిత మనస్కుడు. తండ్రితో వచ్చిన విభేదాల కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. వొంటరితనం, అసంతృప్తి, దుఃఖం ఇవన్నీ శరత్ ని బాధపెట్టినా అతని లోని సాహిత్య ప్రేమను ఏమీ చేయలేకపోయాయి. పగలు, రాత్రి అకారణంగా శ్మశానాల వెంబడి తిరుగుతూ వుండేవాడు. తండ్రి మరణం తో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశాక కలకత్తా చేరుకొని అక్కడొక హిందీ పేపర్ లో నెలకు రూ.30 ల జీతం పై అనువాదకుడిగా ఉద్యోగం ప్రారంభించారు.

మంచి ఆర్ధికపరమైన భవిష్యత్తు కోసం రంగూన్ వెళ్ళటానికి ముందు ‘ కుంతలీన ‘ సాహిత్య పోటీల కోసం తన చిన్న కథ ‘ మందిర్ ‘ ని పంపించారు. ఇలాంటి పోటీల పట్ల శరత్ కి వ్యక్తిగతం గా ఎలాంటి ఆసక్తి లేకపోయినా స్నేహితుల బలవంతం మీద సురేంద్రనాథ్ గంగూలీ అనే పేరుతో పోటీ కి తన కథ పంపారు. 150 కథల్లో మందిర్ ఉత్తమమైనది గా ఎంపికైంది. అదే శరత్ అచ్చైన మొదటి కథ. అనిల, అనుపమ పేర్లతో చాలా కాలం శరత్ తన కథల్ని ప్రచురణకు పంపేవారు. అలా వేరే పేర్లతో ఎందుకు పంపవలసి వచ్చిందో కారణం మాత్రం మనకు తెలియదు.

చిన్నతనం నుండే రాయడం మొదలుపెట్టిన శరత్ మధ్యలో 18 ఏళ్ళ పాటు ఏమీ రాయకుండా వుండిపోయారు. మళ్ళీ ఒక అనుకోని పరిణామం వల్ల రాయడం మొదలుపెట్టాల్సి వచ్చింది. శరత్ స్నేహితులు కొందరు ఒక చిన్న సాహిత్య పత్రికను ప్రారంభించారు. అది బాగా చిన్న పత్రిక కావటం వల్ల, దానికి పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేకపోవడం వల్ల దానికి ఎవరూ ఏమీ రాసేవారు కాదు. అలాంటి నిరాశకరమైన పరిస్థితుల్లో స్నేహితులను ప్రోత్సహించే ఉద్దేశంతో , వారి బలవంతపు వొత్తిడి వల్ల మళ్ళీ 1913 లో శరత్ రాయడం ప్రారంభించారు. జమున లో ప్రచురితమైన ఒక్క కథ తోనే రాత్రికి రాత్రి శరత్ లబ్ద ప్రతిష్టు డయ్యాడు. శరత్ కథలకు వచ్చే అసంఖ్యాక ఉత్తరాలు, టెలిగ్రామ్ ల తో రచనని శరత్ మళ్ళీ సీరియస్ గా తీసుకొని రాయడం పునః ప్రారంభించాడు. అదే మన పాలిట వరమైంది. శరత్ అనేకానేక నవలలు, కథలు చదివే అదృష్టం మనకు దక్కింది.

శరత్ మొదటి భార్య శాంత దేవి, ఏడాది వయసున్న బిడ్డ ఇద్దరూ ప్లేగ్ వ్యాధితో మరణించటంతో జీవితం లో ఏర్పడ్డ శూన్యాన్ని పూరించేందుకు సోషియాలజీ, సైకాలజీ, హిస్టరీ, ఫిజిక్స్, ఫిలాసఫీ , పాలిటిక్స్ అన్నీ విపరీతం గా చదివాడు. అనారోగ్యం వల్ల చదువు తగ్గించి చిత్రలేఖనం ప్రారంభించాడు. 1910 లో యవ్వనంలోనే భర్తను పోగొట్టుకున్న వితంతువు మోక్షదా ని వివాహమాడాడు శరత్.

కలకత్తా కు తిరిగి వచ్చిన తర్వాత శరత్ రచనలు అన్ని పత్రికల్లో ప్రచురితమవుతుందేవి. 1922 లో శ్రీకాంత్ మొదటి భాగాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇంగ్లీష్ లో ప్రచురించింది. కలకత్తా విశ్వవిద్యాలయం బంగారు పతకం తో సత్కరిస్తే రోమైన్ రోలాండ్ 1925 లో ప్రపంచం లో ఉత్తమ నవలాకారుల్లో ఒకరిగా గుర్తించింది. ఢాకా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది.

బెంగాలీలు ‘ ఇమ్మోర్టల్ వర్డ్ స్మిత్ ‘ గా ప్రేమ గా పిలుచుకునే శరత్ లివర్ కాన్సర్ తో జనవరి 16, 1938 కలకత్తా లో మరణించారు. శరత్ చంద్ర ది భౌతిక మరణం. ఆయన సాహిత్యానికి మరణమెక్కడిది? ఈ 70 ఏళ్ళుగా భారతీయ సాహిత్య ప్రపంచం అలాంటి రచయిత మళ్ళీ మన కోసం తిరిగి వస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. ఎప్పటికైనా మన ఎదురుచూపులు ఫలిస్తాయా? మనం అమితంగా ప్రేమించిన శరత్ మళ్ళీ మన కోసం వస్తాడా? ఏమో...అప్పటిదాకా మనకున్నవి శరత్ వదిలివెళ్ళిన పుస్తకాలు.

కల్పనా రెంటాల

Wednesday, January 20, 2010

సంచయనమ్గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!!

వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో
ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో
ఒక్క సాక్ష్యమూ దొరకదు
ఒక్క మాటా వినిపించదు
ఒక్క కాలిజాడా మిగలదు!

అంతటా మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్ద చారికలు

వాళ్ల పుస్తకాల్లోకి తొంగి చూద్దామనుకుంటాను
ఒక్క పుటనయినా చింపి మీకు చదివి వినిపిద్దామనుకుంటాను
కన్నీళ్లతో అలుక్కుపోయిన అక్షరాల్ని
మీకు కన్పించేలా తిరగరాద్దామనుకుంటాను
మనశ్శరీరాల్ని మండించే కార్చిచ్చుని
స్మృతుల్లో నిలపాలనుకుంటాను
అయినా
అంతటా ఓ మౌనం

ఎక్కడో ఓ చోట
ఏదో ఒక కొండ
చివర్న భూమ్యాకాశాల్ని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు
కొండల్ని తవ్వి
అడవుల్ని చీల్చిన
కాలిబాటల్ని ఛిద్రం చేసిన తెల్లమృగాలు
అందమయిన వారి ముఖబింబాల మీద
చెక్కిన గాయాలు
ఇప్పుడు… అడవులన్నీ శిథిలస్మృతులు

అవును కానీ…
ఎక్కడైనా రక్తపుటేరులు మాట్లాడతాయా?
ఎక్కడైనా జ్ఞాపకాలు గొంతెత్తి నిలదీస్తాయా?
ఎక్కడైనా విరిగిపడ్డ చెట్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!

ఓ అర్థరాత్రి గీసిన లక్ష్మణ రేఖ
వాళ్ల స్థలకాలాల్ని విభజించింది
విషాదరేఖకి అటూ ఇటూ కూడా
మతాల ముసుగు వేసుకున్న మానవమృగాలే!
నిప్పులగుండాల్లోంచి పైకి రాలేని సీతలే!!
చారెడు మట్టిని
గుప్పెడు వేర్లని
వాళ్ల శవాలపై చల్లి
చేతులు దులిపేసుకున్నాం కదా!

అంతా మన పిచ్చి గానీ
ప్రవహించే నదులు సాక్ష్యాలు చెపుతాయా?
శవాల్ని మోసిన బావులు మాట్లాడతాయా?
మట్టివాసనలు మనుష్యుల మూలాల్ని పట్టిస్తాయా?

అంతటా ఓ మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్దచారికలు

కొండల్ని దాటి కోనల్ని దాటి
మైదానాల మీదకు పరుగులు తీశామా
మాయాబజార్ల వాకిళ్లు తెరిచి
కొత్తయుగాల్ని స్వాగతించామా?
వెయ్యికాళ్ల పురుగులతో
సాలెపురుగుల వెబ్‌లతో చెలిమి చేశామా?

ఉన్మాద ప్రేమ ముసుగేసుకున్న
మాయదారి మృగమొకటి
ఇప్పుడిక్కడ మంత్రనగరుల్లో సంచరిస్తోంది
అమ్మాయిలూ! పారాహుషార్!

అంతా మన భ్రమ కానీ
ఎక్కడైనా గొడ్డళ్లు, యాసిడ్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా కాల్‌సెంటర్ల టాక్సీలు మాట్లాడతాయా?

మాట్లాడేందుకు గొంతుల్లేక
రాసేందుకు చేతుల్లేక
చూపించేందుకు మొహాల్లేక
నిశ్శబ్దంగా, నిర్వేదంగా
అక్కడొక చెక్కేసిన బోధివృక్షం నిల్చొని వుంది

ఎన్నాళ్లీ జ్ఞాపకాల కుండల్ని మోసుకుతిరగను?
ఎన్నాళ్లీ కన్నీళ్ల తర్పణాల్ని వదలను?
కాలుతున్న శవాలతో ఎన్నాళ్లు సహజీవనం చేయను?
ఈ హింసకు వాక్యాల్లేవు
ఈ హింసకు సాక్ష్యాల్లేవు
ఎప్పుడు చెప్పినా ఒక్కటే కథ
ఒక్కటే కథనం
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!

Monday, January 18, 2010

ద్రౌపది పై పత్రికల్లో భిన్న వ్యాసాలు!ఇవాళ ఆంధ్రజ్యోతి , సాక్షి సాహిత్య పేజీల్లో వివాదాస్పదమైన ‘ ద్రౌపది’ నవల మీద వచ్చిన భిన్న వ్యాసాలని యూనికోడ్ లో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఫాంట్ సమస్య అని చెప్తుండటం వల్ల ఇలా యూనికోడ్ లో పెడుతున్నాను. కొందరు రచయతల అభిప్రాయాలు ఇవి. అలాగే ఆ వ్యాసాలతో నాకుఎలాంటి సంబంధం లేదు. అందరూ ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు కదా అని పెడుతున్నాను.

అలాగే నాకు అందిన ఇంకో సమాచారం కూడా ఇక్కడ ఇస్తున్నాను. అది నిజం గా కరెక్టో కాదో తెలియదు కానీ చాలా ఆశ్చర్యపోయాను వినంగానే. అందుకనే అది కూడా మీకు చేరవేస్తున్నాను. యార్లగడ్డ రాసిన ద్రౌపదీ మొదటి సారి సాహిత్య అకాడమీ వారి చేత తిరస్కరించబడిందని, మళ్ళీ రెండో సారి వారికోసం , వారికి నచ్చేవిధంగా (అంటే ఎలా వుంటే వారి బహుమతి కి అర్హమవుతుందో అలా) మార్చి రాసీ ఇచ్చారని అభిజ్న వర్గాల భోగట్టా. నిజానిజాలు నాకైతే తెలియదు. అలా సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు. కాకపోతే 2006 నుంచి ఇప్పటిదాకా ద్రౌపదీ మూడు ఎడిషన్లు ప్రచురిచతమైంది. మొదటి వెర్షన్ కి, మూడో వెర్షన్ కి తేడా వుందా? వుంటే అది ఎలాంటి తేడా అనేది మనం చదవకుండా చెప్పలేం. కాకపోతే సాహిత్య లోకంలో పుకారాలు , వివాదాలు ఇలాంటివి మామూలే.వీటికి ఒక్కోసారి ఏ ఆధారం వుండకపోవచ్చు. కాకపోతే ఎవరిదగ్గరైనా మొదటి వెర్షన్, మూడో వెర్షన్ వుంటే మార్పులు వున్నయోమో చూడవచ్చు.


విలువల వలువలు విప్పిన వేళ...

రామాయణ, మహాభారత పురాణ కథలను, పాత్రలను తీసుకొని స్వతంత్ర కావ్యాలుగానో నవలలుగానో మలచిన రచనలు భారతీయ భాషల్లో చాలావచ్చాయి. ఆధునిక రాజకీయ, సామాజిక, చారిత్రక భావజాలాన్ని మూల కథ ద్వారా ధ్వనింప చేసిన రచనలూ వీటిలో ఉన్నాయి. ఉదాహరణకు ఇరావతీ కార్వే రాసిన 'యుగాంత' స్త్రీ దృక్ప«థం నుంచి గాంధారి, కుంతి, ద్రౌపది పాత్రలతో మాట్లాడించింది. పురాణ పాత్రలకు ఆపాదించే అతి మానుష లక్షణాలను తొలగించి భౌతిక స్థల కాలాలకు చెందిన వాస్తవికతలో వాటిని నిలబెట్టి చారిత్రక దృష్టి నుంచి మహాభారత కథను పునర్నిర్మిస్తూ ఎస్.ఎల్.భైరప్ప 'పర్వ' రచించారు.

నన్నయ పన్నెండు పేజీలలో చెప్పిన యయాతి కథను 460 పేజీలకు విస్తరింపచేస్తూ తాత్విక ప్రధానంగా విష్ణు సఖారామ్ ఖాండేకర్ 'యయాతి' నవల రాశారు. భీముడు నాయకుడుగా, బ్రాహ్మణవాద వ్యతిరేక భావజాలాన్ని ధ్వనింప చేస్తూ యం.టి.వాసుదేవన్ నాయర్ 'సెకండ్ టర్న్' (ఇంగ్లీష్ అనువాదం పేరు) రాశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ మూలాన్ని అతిక్రమించినవే. అలాగని తాడూ బొంగరం లేని కల్పిత రచనలు కావు. ఆధునిక దృకథంతో మూలకథను వ్యాఖ్యానించిన రచనలు.

తెలుగులో మాత్రం ఈ తరహా రచనలు చెప్పుకోదగినవి ఇంత వరకు రాలేదు. అదొక వెలితి అనుకొంటే, ఇప్పుడు వివాదాస్పదంగా మారిన యార్లగడ్డ లకీప్రసాద్ 'ద్రౌపది' ఈ ధోరణి రచనలకు ఒక థర్డ్రేట్ అనుకరణగా మన ముందుకు వచ్చింది. దీనికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించి ఉండకపోతే ఈ రచనను ఇంతగా పట్టించుకొని ఈ మాట అనవలసిన అవసరం ఉండేది కాదు. భావప్రకటనా స్వేచ్ఛకు అద్దంపట్టే శతకోటి రచనల్లో ఇదీ ఒకటని అనుకొనేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ఒక విశిష్ట గౌరవంగా, గుర్తింపుగా భావించి దానికోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఒక థర్డ్రేట్ రచనకు పురస్కారం ఎలా ఇచ్చారన్న ప్రశ్న అనివార్యమవుతోంది. నిజానికి ఈ రచన ఒక నెపం మాత్రమే. ఇక్కడ వాస్తవంగా వివాదాస్పదం అవుతున్నది సాహిత్య అకాడెమీ పురస్కారానికి ఉన్న విలువ, అర్హమైన రచనల ఎంపికలో అది అనుసరించే ప్రమాణాలు. ఇందులో అసలు ముద్దాయి 'ద్రౌపది' రచయిత కాదు-సాహిత్య అకాడెమీ, దాని తరపున జూరీగా వ్యవహిరించిన వాళ్ళు. సాహిత్య అకాడెమీ ప్రతినిధులుగా రాష్ట్రంలో వివిధ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు, నిర్వహిస్తున్న వాళ్ళు కూడా తెలుగు సాహిత్య ప్రపంచానికీ, పాఠకులకూ సంజాయిషీ ఇచ్చుకోవలసిందే.

'ద్రౌపది'కి పురస్కారం ఇవ్వడంపై కొందరు వ్యక్తం చేస్తున్న ఆక్షేపణలలోనూ బలం లేదు. అందులో 'బూతు' ఉందనడం భిన్నాభిప్రాయాలకు అవకాశమిచ్చి రచయితకు డిఫెన్స్ కల్పించే ఆరోపణ. భైరప్ప 'పర్వ'లో అంతకంటె ఎక్కువ 'బూతు' ఉందని ఆయన అనగలరు. అలాగే కృష్ణుడికీ, ద్రౌపదికీ అశ్లీల సంబంధం అంటగట్టారనడం పుస్తకం చదవకుండా చేసే అభియోగం. అలాంటిదేమీ అందులో లేదు. 'ద్రౌపది' రచయిత చేసిన తప్పు అన్నింటినీ మించినది. అది, గ్రంథ చౌర్యం... అక్షరాలా ప్లాగారిజం.
మూల కథలో ద్రౌపదితో ముడిపడిన ప్రతి ఘట్టంలోనూ రచయిత కవిత్రయ భారతంలోంచి వాక్యాలకు వాక్యాలను, వర్ణనలను ఎత్తిరాశారు. మచ్చుకు ఒకటి -
ద్యూతక్రీడకు ఆహ్వానితులై పాండవులు, ద్రౌపదితోపాటు హస్తినాపురానికి వెళ్ళినప్పుడు, ఆమెను చూసి గాంధారి కోడళ్ళు...
'ప్రపంచంలోని అందాన్నంతా ఒక్కచోట చేర్చి బ్రహ్మ ఈ తరుణీమణిని సృజించి ఉండవచ్చునని భావించారు. పాంచాలి వదన కమల వికాసం, ఆమె రూపు రేఖావిలాసాదులకు వారు విభ్రమం చెందారు.' ('ద్రౌపది').

నన్నయ భారతంలో సభాపర్వం ద్వితీయాశ్వాసంలో 160వ పద్యం ఇలా ఉంది -
అల లావణ్యపుంజంబు, నబ్జభవుడు/మెలతగా దీనియందు నిర్మించె నొక్కొ
కాని నాడిట్టి కాంతి యే కాంతలందు/నేల లేదని సామర్ష హృదయులైరి

'ద్రౌపది' రచనలో చాలా భాగం కవిత్రయ భారతం నుంచి ఎత్తిరాసినదే. ఆ సంగతిని ఎక్కడా ప్రస్తావించని రచయిత, మహాభారతానికీ, ద్రౌపది పాత్రకూ సంబంధించి వివిధ భాషల్లో వచ్చిన నూరుకుపైగా గ్రంథాలను సేకరించి, కూలంకషంగా చదివి పరిశోధనాపరంగా విషయ సేకరణ చేశానని చెప్పుకొన్నారు. పెద్దలు ఎవరెవరితోనో చర్చించాననీ, ఆధారగ్రం«థాలను ప్రదర్శనకు పెట్టాననీ రాసుకొన్నారు. కానీ ఈ రచనలో ఎటువంటి పరిశోధనా లేదు. ద్రౌపది గురించి ఎటువంటి 'కొత్త' కోణమూ లేదు. ముఖ్యంగా ఉండవలసిన వస్త్వైక్యత లేదు. పైగా చవకబారు చిత్రణలున్నాయి. ఉదాహరణకు, వస్త్రాపహరణ ఘట్టంలో ద్రౌపది 'సౌందర్యా'న్ని చూడలేకపోతున్నందుకు ధృతరాష్ట్రుడు చాలా విచారిస్తాడని ఈ రచయిత రాస్తారు.

వీటన్నింటినీ మించినది గ్రం«థ చౌర్యం... అసలు సిసలు ప్లాగారిజం. ర్యాండమ్ డిక్షనరీ ప్రకారం, ఏ రచయిత అయినా మరో రచయిత భాషనూ, భావాలనూ వాడుకొని లేదా అనుకరించి సొంత రచనగా ప్రకటిస్తే అది గ్రంథ చౌర్యం అవుతుంది. విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు గ్రంథ చౌర్యానికి పాల్పడితే దానిని 'అకడెమిక్ ఫ్రాడ్'గా పరిగణించి అభిశంసించాలి. వారిని విద్యా సంస్థల నుంచి, పదవుల నుంచి తొలగించవలసి ఉంటుంది.

అమెరికా లాంటి దేశాల్లో స్కూలు పిల్లలు కూడా నీచంగా భావించి సిగ్గుపడే గ్రంథ చౌర్యానికి సాహిత్య అకాడెమీ వంటి ఒక సంస్థ పురస్కారమిచ్చి సత్కరించడం బహుశా మన దేశంలోనే సంభవం కావచ్చు. 'ద్రౌపది'కి పురస్కారం ఇవ్వడం సాహిత్య అకాడెమీ, దాని జూరీ సభ్యులు తెలుగు సాహిత్యం పట్ల పాల్పడిన ఒక 'అకాడెమీ' ఫ్రాడ్. ఇది ఒక పెద్ద సాహిత్య 'స్కామ్'. 'ఫోర్ ట్వంటీ'తో సమానమైన నేరం. కురుసభలో అవమానానికి గురైన ద్రౌపదిలా తెలుగు సాహిత్యకారులందరూ భారతీయ సాహిత్య సభలో సిగ్గుతో తలవాల్చుకోవలసిన పరిస్థితి.

- కల్లూరి భాస్కరం

ఏ రచనకైనా అవార్డు వచ్చిందంటే రచనలో ఏదో కొత్తదనం, సాహిత్య విలువలూ ఉంటాయని పాఠకులు ఆశించటం సహజం. అందులోనూ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులను రచయితలూ, పాఠకులూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ఐతే డా॥యార్లగడ్డ లక్షీప్రసాద్ రాసిన 'ద్రౌపది' నవలకు అకాడెమీ అవార్డు రావటం సాహితీవేత్తలను విస్మయపరిచింది. ఈ నవల ఆద్యంతమూ బుద్ధిజనిత జాడ్యోన్మాదం. 'ద్రౌపది'ని రచయిత చిత్రించిన తీరు అవమానకరంగా, మూలానికి విరుద్ధంగా ఉన్నది.
ఈ నవలలోని నాయిక 'ద్రౌపది' కల్పిత పాత్ర కాదు.

ఆమె చుట్టూ తిరిగిన పాత్రలూ, కథాంశాలూ కల్పితాలు కావు. అలాగని అవి కచ్చితంగా చారిత్రకాలూ కావు; కాని భారతజాతి సంస్కృతికి మూలాలనదగినవీ జాతిధర్మానికి మార్గదర్శకంగా నిలిచినవీ అయిన పాత్రలవి. మహాభారతం భిన్న సమాజాల, సంస్కృతుల సమాహారం. వాటిలోని అంశాలన్నీ భిన్న ధర్మాధర్మాలను ప్రస్తావించేవే. ఆ కథలో ధర్మానికి ప్రతీకలనదగిన పాండవులను పట్టి ఉంచిన అంతస్సూత్రం ద్రౌపది.

యార్లగడ్డ వారు తమ నవలకు ఈ ద్రౌపదినే నాయికగా తీసుకున్నారు. మూల రచనకు విరుద్ధంగా ఆ పాత్రకు కామవికారాలను అంటగట్టారు. ఒక ఇతిహాసంలోని ప్రముఖ పాత్రను తన రచనకు నాయికగా తీసుకున్నప్పుడు ఆ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఈ విషయంలో రచయిత అజ్ఞానం బయటపడుతోంది. రచయిత కాముక దృష్టి నవలను కమ్ముకొని, అంగాంగ వర్ణన మితిమీరింది. ద్రౌపది నవవడికలో-సతీధర్మ నిర్వహణలోనూ, అధర్మ ప్రతిఘటనలోనూ కూడా రచయితకు కామ విన్యాసాలే కనిపించాయి. 'తెలివి యొకింత లేనియెడ..' తెలియని వాడిగా ఉండకుండా దుస్సాహసం చేశారు.

ఐదుగురు భర్తలతో ద్రౌపది ఎన్నెన్ని అవస్థలు పడిందో అని స్త్రీలు అబ్బురపడుతూ ఉంటే, ఆమె పడకగదిలో ఎన్ని అనుభవాలు మూట కట్టుకుందోనని యార్లగడ్డవారు కుతూహలపడి, శతసహస్రవిధాలుగా ఊహించుకున్నారు. ఆ ఉబలాటానికే ఇప్పుడు అవార్డు లభించడం పాఠకులకు మింగుడు పడటం లేదు.
భారతంలో ద్రౌపది జీవితంతో రాజీపడిన స్త్రీ. దమయంతి లాగా స్వయంవరంలో తనకు నచ్చిన వారిని వరించే స్వతంత్రం ఆమెకు లేకపోయింది. ఆ తర్వాత ఐదుగురు భర్తలతో కాపురం చేయవలసి వచ్చింది. ఆమె మనసూ, శరీరమూ ఎంత గాయపడినా రాజకీయ ప్రయోజనాలతో కూడిన సమాజ ధర్మానికీ, సతీధర్మానికీ తలవంచింది. కులధర్మపత్నిగా భర్తలను ఏకసూత్రంపై ఉంచేందుకు ద్రౌపది పడిన తాపత్రయం భారతంలో అడుగడుగునా కనిపిస్తుంది.

పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సత్యభామ, కృష్ణుడు వారిని చూడటానికి వెళ్ళారట. అప్పుడు సత్యభామ ద్రౌపదితో 'నీ భర్తలను ఏ విధంగా వశం చేసుకున్నావు? వ్రత చర్యలా, తపస్సా, స్నానమంత్ర ఔషధాదులా, విద్యల ప్రభావమా, మూలికల ప్రభావమా, జప హోమాదులా?' అని ప్రశ్నించిందట. అందుకు ద్రౌపది కొంచెం చికాకు పడినా 'భర్తలను వశపరచుకోటానికి వ్రతాలు, జపహోమాదులు, మందుమాకులు వంటివి దుష్టస్వభావంగల స్త్రీలు ప్రయోగిస్తారు. అలాంటి వారి పట్ల భర్తలు ప్రీతిచూపరు సరికదా, ఇంటిలో పాము ఉన్నట్టు భయపడతారు. ఉత్తమస్త్రీల ఆచరణ వేరుగా ఉంటుంది' అని జవాబిచ్చింది.

'అహంకారం విహాయాహం కామక్రోధౌచ సర్వదా/సదారాన్ పాండవాన్నిత్యం ప్రయతోపచారామ్యహం' (అహంకారమూ, కోరికా, కోపమూ లేకుండా సంయమనంతో పాండవులనూ వారి భార్యలనూ (సవతులను) నేను ఉపచరిస్తుంటాను), 'ప్రణయం ప్రతి సంహృత్య నిధాయాత్మా నమాత్మాని/శుశ్రూషు న్నిరభిమానా పతీనాం చిత్తరక్షిణీ' (మనసులోని ప్రణయావేశాలను అదుపులో ఉంచుకుంటూ నిరభిమానంతో వారికి శుశ్రూషలు చేస్తాను) - మహాభారతం - వనపర్వం.

ద్రౌపది చెప్పిన ఈ విషయాలను గమనిస్తే ఆమె మనసులో ఎంత అలజడినీ, కల్లోలాన్నీ భరిస్తూ వారితో కాపురం చేసిందో స్పష్టపడుతుంది. ఇవేమీ యార్లగడ్డ వారికి కన్పించినట్టులేదు. ఆమెనొక కాముకిగా ఆయన చిత్రించారు. కోరికనేది లేకుండా భర్తలను సేవించాననీ, మనసులోని ప్రణయావేశాలను బహిర్గతం కానివ్వననీ ద్రౌపది చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఆమె అణువణువునా కోరికతో రగిలిపోయినట్టు ఈ రచయిత చిత్రించటమేమిటి? మూల రచనలో చెప్పిన మాటలను కాదని కూట సాక్ష్యాలతో ఆమె మూర్తిమత్వాన్ని కించపరిచేందుకు అవాకులూ చవాకులూ రాయటానికి ఏమి అధికారం ఉన్నది? ఇంటి వ్యవహారాలూ, పాండవుల కోశాగారం విషయాలూ ద్రౌపది స్వయంగా చూసుకొనేదనీ ఎవరూ నిద్ర లేవకముందే లేచి, అందరూ నిద్రించాకనే నిద్రించేదని భారతం చెబుతుంది. ఇలాంటి ద్రౌపది గురించి-భర్తలు యుద్ధరంగంలో ఉన్నప్పుడుకూడా సుఖ శయ్యపై శయనించి, అందమైన కలలు కంటూ ఉండేదని యార్లగడ్డవారంటున్నారు. ఈ అసత్యపు రాతలు ఎవరిని రంజింప చేయటానికి?

తన భర్తలు మృదు స్వభావులు, సత్యశీలురు అని తెలిసికూడా వారికి చాలా జాగ్రత్తగా పరిచర్యలు చేస్తాననీ, కోపంతో ఉన్న పాములతో వ్యవహరించే రీతిగా వారితో వ్యవహరిస్తాననీ ద్రౌపది సత్యభామతో చెప్పింది. పామున్న ఇంటిలో ఉండటమే భయావహం. ఆ పాములతో ఉండవలసి రావటం - వాటిని వశపరుచుకోవలసి రావటం, ఒళ్ళు జలదరించే విషయం. ఇంత భయభక్తులతో భర్తలను సేవించే ద్రౌపది గురించి, ఆమె తన శరీర సౌష్టవంతో ఎత్తయిన వక్షస్థలంతో, కేళీ విన్యాసాలతో వారిని వశపరచుకొన్నట్టు రచయిత రాయటం క్షమార్హం కాదు. ద్రౌపదిని శ్రీకృష్ణుని ప్రియసగా ఈ రచయిత వర్ణించిన తీరు బాధాకరం.

స్త్రీ-పురుషుల ఆత్మీయతను వక్రీకరించే సంకుచిత మనస్తత్వం నుండి ఇటువంటి రచయితలు బయటపడకపోవటం తిరోగమనమే. లలితమైన, స్నిగ్థమైన భావాలను ఈ నవల దూషితం చేసింది. దీనిని ఉపేక్షిస్తే భారతం చదవని యువత ఈ చిత్రణనే ప్రమాణంగా భావించే ప్రమాదం ఉంది.
ఈ నవలా రచనలోని బూతులు సాధారణ పాఠకుల మనస్సులను గందరగోళ పరుస్తున్నాయి. పైగా దీనికి సాహిత్య అకాడమీ అవార్డు సాధించుకోవటం ద్వారా రచయిత మరింత దౌష్ట్యానికి పాల్పడ్డారు. ఈ నవలను అవార్డుకు ఎంపిక చేసినవారి చిత్తవృత్తినీ, వివేక భ్రష్టతనూ ఏమనాలో తెలియటం లేదు.
- డా॥ బి.విజయ భారతి

అనర్హమైన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమా!


యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (విశాఖపట్నం, మాజీ రాజ్యసభ సభ్యులు) రచించిన ద్రౌపది అనే పుస్తకానికి ఈ సంవత్సరం కేంద్రసాహిత్య అకాడమీ సాంవత్సరిక ఉత్తమ పురస్కారం (తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమోత్తమ రచన) ప్రకటించింది. ఈ విషయం మీరు విని ఉంటారు. పత్రికలలో చూసి ఉంటారు. ఈ పురస్కార నిర్ణాయక న్యాయమూర్తులుగా శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీమతి వి.ఎస్.రమాదేవి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలు వ్యవహరించారు. ఈ పుస్తకం ఇటు తరువాత హిందీ, ఇంగ్లీషేకాక, సమస్త భారతీయ భాషల్లోకి తెలుగు సాహిత్యం నుండి ప్రముఖ పరమప్రశంసనీయమైన ఉత్తమ రచనగా అనువాదం పొందుతుంది.

కాని నిజానికి ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య ఆత్మీయ అభిమానులు, ప్రేమతత్పరులు, అభిజ్ఞులు, రచయితలు, తెలుగు సాహిత్య ఆరాధకులు అయిన ప్రముఖులు ఎందరో నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు. న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రస్తావనలు, ప్రసక్తులు ద్రౌపది పుస్తకంలో ఉన్నాయి. కాబట్టే వీటిని గూర్చి మిమ్మల్ని అడుగుతున్నాము.

1. ద్రౌపది పుస్తకంలో 29వ ప్రకరణం శ్రీకృష్ణు ని ఇష్టస పేరుతో ఉంది. ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసగా ఈ మహాప్రజ్ఞాశాలి, సాహిత్య మేధావి అయిన రచయిత అభివర్ణించాడు. పరిచయ వాక్యాలలో కూడా శ్రీకృష్ణుని ఇష్టసగా వర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా? మీరు విన్న, చదివిన, పెద్దలవల్ల తెలుసుకున్న పురాణ కథలలో కానీ, వ్యాఖ్యానాలలో కానీ ద్రౌపది శ్రీకృష్ణుడి ఇష్టసగా ఎపుడైనా, ఎక్కడైనా ప్రసక్తమైందా?

2. ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా? ద్రౌపది పుస్తకంలో రచయిత ఇలాంటివి చాలా వర్ణించాడు.

3. ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుంచి నట్లు, పరవశత్వం చెందినట్లు మీరు ఏ పుస్తకంలోనైనా చదివారా? ఎవరి వల్లనైనా విన్నారా? మతానికి, ధర్మానికి, సంస్కృతికి, సాహిత్య వారసత్వానికి, జాతీయతకు, నీతికి ఇలాంటి వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?

4. శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రవక్త. భారతీయ మత, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాణస్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మను పలు సందర్భాలలో రచయిత అతి నీచంగా ప్రస్తావించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇలా వక్రదృష్టితో చిత్రీకరించుట వలన కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత న్యాయనిర్ణేతలదే. సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి 'ద్రౌపది' గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించవలసినదిగా కోరుచున్నాము.

దాశరథి రంగాచార్య
మునిపల్లె రాజు
వీరాజీ
సి.హెచ్.లకీనాథాచార్యులు
కె.యాదగిరాచార్యులు
డి.కృష్ణారెడ్డి
టి.శివరామకృష్ణ
పి.గోపాలకృష్ణ
ఎ.అనంతకృష్ణారావు
బి.రామరాజు
ఆచార్య కొలకలూరి ఇనాక్
కోవెల సంపత్కుమారాచార్య
రవ్వా శ్రీహరి
నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి
డాక్టర్ త్రిపురనేని హనుమాన్చౌదరి
బి.సుబ్రహ్మణ్యశర్మ
ఎం.కులశేఖరరావు
డాక్టర్ పి.నాగేశ్వరరావు

కావ్యాత్మక నవల 'ద్రౌపది'
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవల 'ద్రౌపది' వారి మౌలిక ఆలోచనా శక్తికి నిదర్శనం. పురాణాలలో ఈ కథని వేదవ్యాసుని మహాకావ్యం 'మహాభారతం' నుం డి స్వీకరించబడినప్పటికీ పాత్రను నాయికకు అనుగుణంగా మలిచే ఈ మహత్కార్యం లక్ష్మీప్రసాద్ తనదైన శైలిలో చేసారు. పౌరాణిక, ఐతిహాసిక నవలలో రచయితకి తన అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచే సదుపాయం తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే కథ ముందుగానే తయ్యారయ్యి ఉంటుంది. కాకపోతే ఆ సందర్భాలకు కొత్త అర్థాల్ని మాత్రం ఇవ్వగలుగుతాడు. అతడు తన పాత్రల్లో తాదాత్మ్యత చెంది తన అనుభవాల సంవేదనలో యదార్థాన్ని వెదుకుతాడు, ఇంకా ఆ పదార్థాన్ని తన కళాత్మకమైన భాష ద్వారా పాఠకులకు తెలియజెప్తాడు. ఐతిహాసికతను ప్రస్తుత సమాజానికి వీలైనంత దగ్గరగా తీసుకురావడం మీద, ఈ కథ నిన్ననే జరిగినట్లు, ఆ పాత్రలతో తనకు బాగా పరిచయం ఉన్నట్లు భావనను కలిగించడం మీదనే రచయిత విజయం ఆధారపడి ఉంటుంది.
ఈ విలక్షణత కళాత్మక ప్రభావాన్ని పాఠకులపై చూపించడంలో లక్ష్మీప్రసాద్ కృతకృత్యులయ్యారనడంలో సందేహం లేదు. వారి ద్రౌపది పౌరాణిక నాయిక అయినప్పటికీ అనుభూతి దృష్ట్యా ఏదో కృత్రిమ గరిమత్వాన్ని సంతరించుకున్నట్లు అనిపించదు. సీత, సావిత్రి, దమయంతులతో సమానమయినది కాకపోయినా ఆమెలో ఒక సహజమైన స్త్రీ సంవేదన ఉంది. స్త్రీ అస్తిత్వం అన్ని కోణాలను ఆమెలో చిత్రించడానికి రచయిత ప్రయత్నించారు. నేటి స్త్రీవాద ఆందోళనలు ఏ అస్తిత్వాన్నైతే వెదుకుతున్నారో, నేటి స్త్రీవాద రచయితలు ఏ అస్తిత్వాన్నైతే పశ్చిమ దేశ స్త్రీవాద సిద్ధాంతాల్లో వెదుకుతున్నారో అవన్నీ లక్ష్మీప్రసాద్ 'ద్రౌపది'లో మనకు సహజంగానే కనిపిస్తాయి.
స్త్రీ మనోభావాలను తన రచనా కౌశలంతో కలబోసి నవలను మలచిన తీరు నేటి చాలామంది స్త్రీవాద రచయితలకు కూడా సాధ్యపడదనడం అతిశయోక్తి కాదు. తన కథానాయికను ఏదో ఒక దృక్కోణంలో నుంచి మాత్రమే చూపించకుండా పలు కోణాలలో చూపించడమే ఈ రచయిత రచనాపటిమకు తార్కాణం. సృష్టి ప్రారంభం నుండి వైజ్ఞానిక యుగమైన ఈ ఇరవయ్యొకటవ శతాబ్దం వరకు కూడా స్త్రీ మనసు, కార్యప్రణాళిక మారలేదు. పరిపూర్ణంగా చూస్తే ఆమె ఒక స్త్రీగా మాత్రమే నిలిచింది. ఆమెపైన ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆమె వ్యక్తిత్వం చిన్నాభిన్నమవుతూనే వచ్చింది. కానీ విచారించదగ్గ విషయమేమిటంటే రచయితలు స్త్రీని ఒక పరిపూర్ణ స్థితిలో చిత్రించే ప్రయత్నం చెయ్యలేదు.
తన రచనాధర్మితను నిర్వర్తిస్తూ ద్రౌపదిని ఇటువంటి పరిపూర్ణ స్థితిలో చిత్రించడమే వారికి, వారి రచనకు కూడా ఒక కొత్త అర్థాన్నిస్తుంది. లక్ష్మీప్రసాద్ సంవేదనాత్మక సామర్థ్యం నిజంగా కొనియాడదగినది. ద్రౌపది అస్మితా చైతన్యపు మూలబిందువు మీదే ఆయన దృష్టి కేంద్రీకరించబడి ఉంది. ఈ మూల బిందువును విస్తరించే దృష్టితోనే మొదటి నుండి చివరి వరకు ద్రౌపది పాత్రను చిత్రించారు. ద్రౌపది అస్మితకు సంబంధించిన నిజాలు ఒక స్త్రీకి సంబంధించిన నిజాలు. అవి ఆమె శారీరక, మానసిక నిర్మాణంతో ముడిబడి ఉంటాయి.
ఈ యదార్ధాన్ని లక్ష్మీప్రసాద్ తన రచనాధర్మితగా భావించి ద్రౌపది పాత్రను మాత్రమే సృష్టించక, ఆ చరిత్రను సజీవంగా, చైతన్యవంతంగా మలచడానికి ఒక విస్తృతమైన రచనా ఫలకాన్ని కూడా నిర్మించారు. ఈ విస్తృత పరిచే ప్రక్రియలో ఒక గడిచిన యుగం చాలా కాలం తర్వాత మళ్లీ సజీవంగా పాఠకుల ముందుకు వచ్చింది. ద్రౌపది మాత్రమే కాదు, దాని సాఫల్యానికి నిర్మించిన ఆ యావత్తూ రచనా వాతావరణం విలక్షణమైనది. ఈ కథ విభిన్న గ్రంథాల్లో విభిన్న శైలుల్లో చెప్పబడింది. కానీ లక్ష్మీప్రసాద్ ద్రౌపది ఆ చెదురుమదురైన అస్తిత్వాన్ని తెలియజెప్తుంది. ఈ దృష్టితో 'ద్రౌపది' పూర్తిగా ఆయన మౌలిక రచన. స్త్రీ విమర్శ గురించి చర్చించే రచయిత్రులకు స్త్రీ అస్తిత్వం నేటికి కూడా కష్టసాధ్యమైన విషయమే.
స్వయంగా స్త్రీ అయ్యుండి కూడా వారు గుర్తించలేని స్త్రీ అస్తిత్వాన్ని లక్ష్మీప్రసాద్ పరిచయంతోసహా 'ద్రౌపది' నవల ద్వారా ఎంతో సహజంగా వెలిబుచ్చారు. లక్ష్మీప్రసాద్ ద్రౌపది అనంత జిజీవిష కేంద్రంలో నిలబడి ఉంది. జీవన ప్రవాహం ఆమె చేతనా-శక్తిలో మిళితమయ్యుంది. ఎన్నో జన్మల అసంతృప్తి ఆమె సహచరి. ఆమె కామాగ్ని, కామవిదగ్ధ, ఇంకా అనంత కోరికల నిలయం. భావం-విభావం-అభావం ఆమె వ్యక్తిత్వంలో కలబోసి ఉన్నాయి. కానీ అన్ని రూపాలలోనూ ఆమె సౌందర్యవతి - శరీర, అశరీర (ఆత్మ) సౌందర్యం. దాన్ని చూడాలని, అనుభవించాలనీ ప్రతీవాళ్లు ఆకాంక్షిస్తారు. సృష్టి-సృజన విన్యాసము, ప్రళయ జ్వాల అగ్ని రూపము రెండూ ఈ సౌందర్యమే.
ఇది రక్త-మాంస నిర్మితము, అపార్థివమయి పరమ తృప్తినిచ్చేది కూడాను. కానీ ఇదంతా ఇతరులకోసమే. ద్రౌపది పరమ అసంతృప్తే ఆమె చైతన్య-సత్యము. ఈ అసంతృప్తి కామార్తి జ్వాలల్లో తనను తాను దహించివేసుకుంటూ, తన సాంగత్యంలోకి వచ్చినవారిని కూడా దహించివేస్తుంది. ఆత్మసఖుడైన శ్రీకృష్ణుడు మాత్రమే ఆమెకు కొద్దిపాటి అసంతృప్తిని రుచి చూపించగలిగాడు. అది కూడా ఎందుకంటే ఆమె స్వయంగా 'కృష్ణా', ఇంకా ఆమె తన అస్తిత్వ చైతన్యం పరమ భావంతో కృష్ణుణ్ణి స్పర్శిస్తుంది కనుక. యజ్ఞజ్వాలల నుండి వెలువడిన 'యజ్ఞసేన' వ్యక్తిత్వమంతా జీవితాంతం ఈ జ్వాలలతోనే చుట్టుముట్టబడి ఉంది. కానీ 'ద్రౌపది' రచయిత లక్ష్మీప్రసాద్ ఈ యజ్ఞశిఖల జ్వాలల నుండి ఒక యుగాంతకార అయినటువంటి ఫలితాన్ని పొందారు.
ఈ మహత్కార్యంలో ఆయన 'అభినవ వ్యాసుని' పాత్రను పోషించారు. కథాపరంగా చూస్తే ద్రౌపదిలోని కథ కావ్యాలు-మహాకావ్యాలు, లోకకథల్లో చర్చించబడిందే. కానీ ద్రౌపది అన్వేషణ కేవలం ఘటనల అన్వేషణ కాదు. ద్రౌపది సృష్టి చైతన్య రహస్యనీయత గొప్ప రహస్య సత్యం. ఎప్పటినుండో ద్రౌపదుల మనోభావాలను అణగద్రొక్కేసిన లేక నిర్లక్ష్యంచేసిన సామాజిక కట్టుబాట్లను లక్ష్మీప్రసాద్ ఒక యదార్థ రూపం లో ఈ నవల ద్వారా మనముందుంచారు. బహుశా ద్రౌపది ప్రతిహిం స, ప్రతివాదం ఈ నిజంపైన ఆధారపడి ఉండవచ్చు. ఆమె పురుషభావాల యెడల సమర్పణ అనే యదార్థానికి బందీ, కానీ ఆ సమర్పణ ఒక వర్గం వైపు వారలకు మాత్రమే పరిమితమైపోయింది.
ఆమె మనస్ఫూర్తి గా ఎవరినైతే కోరుకుంటుందో వాళ్లు ఆమెను ప్రేమించరు. ఆమె యుధిష్ఠరుడికి మహారాణి అవుతుంది, భీముడికి ఆరాధ్యా, అర్జునుడికి విజితా, నలుడికి కవితా, సహదేవుడికి మాతృశక్తి. ఆమె రకరకాల రూపాలకు రకరకాలుగా స్వీకృతి లభిస్తుంది. ఆమె ఎవ్వరినీ తిరస్కరించదు. కానీ ఆమె అసలైన కోరిక సమగ్రదానం. దానిని వీరిలో ఎవ్వరూ స్వీకరించరు. ఒక్క కృష్ణుడు మాత్రమే ఆమెను ఆ సంపూర్ణత్వంతో స్వీకరిస్తాడు. కానీ, అప్పటికి ఆమెలోని కోరిక అణగారిపోతుంది. మహర్షి వ్యాసుడు 'మహాభారతం' పేరుతో ఆ యుగం మహా కావ్యాన్ని రచించాడు.
కానీ లక్ష్మీప్రసాద్ అవే ఆధారాలతో, ఆ ఘటనలనే ఆధారంగా చేసుకుని జీవిత మహాకావ్యాన్ని వెదికారు. ద్రౌపది కథను చెబుతూ ఆయన స్వయంగా ఆ ఘటనల నుండి బయటపడి కథలో ఒక ప్రవాహాన్ని సృష్టించారు. ఈ ప్రవాహం గద్యాత్మకం కాకుం డా స్వచ్ఛమైన కావ్యాత్మకమైనది. పాఠకులకోసం ఏ అనుభూతుల దృశ్యాల్ని సిద్ధం చేసారో అది గద్యంలో అసాధ్యం. అందువల్లనే ఆయన తన నవలా రచనకు భాషా-శైలిలను కావ్యత్మకంగా తీర్చిదిద్దారు. దీనివల్ల పాఠకులు ఆనందపడడమే కాకుండా ముగ్ధులవుతారు కూడా.
'ద్రౌపది' వంటి వేరే నవలను ఆయన రాశారో లేదో తెలియదుగానీ, 'ద్రౌపది' రచనతో ఆయన గతం నుండి వర్తమానాన్ని పేర్కొంటూ భవిష్యత్తుకు మార్గం చూపించే రచయితల కోవలో నిలబడ్డారు. 'ద్రౌపది'ని చదివిన ఏ పాఠకుడికైనా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆ బుద్ధభగవానుని పాత్రనే పోషిస్తున్నారన్న భావం కలగడం ఎంతో సహజం.
- రాంజీసింగ్ ఉదయన్ (10 నెలల క్రితం హిందీ 'ద్రౌపది' నవలపై రాసిన ఈ సమీక్షను తెలుగు చేసినవారు డా.శివకోటి నరసింహం)

Saturday, January 16, 2010

కథా శిల్పి చాసో కథ ‘ కుంకుడాకు ‘


కథానుభవం-3

కవిగా సాహిత్య జీవితాన్ని ప్రారంభించి కథాశిల్పిగా ప్రసిధ్ధికెక్కిన రచయిత చా.సో. - చాగంటి సోమయాజులు 1915 జనవరి 17 న శ్రీకాకుళం లో జన్మించారు. ఆచార్య రోణంకి అప్పలస్వామి గారి సాహచర్యంతో ప్రభావితులై చాసో సాహిత్యం వైపు దృష్టి మళ్ళించారు. ఆంగ్ల సాహిత్యంతో పాటు మార్స్కిజాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు చాసో. అరసం –అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తర్వాత అరసం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విజయనగరంలో చాసో వారి ఇల్లు శ్రీశ్రీ, నారాయణ బాబు, ఆరుద్ర మొదలైన రచయతలందరికీ సాహిత్య చర్చా వేదిక గా వుండేది. అరసం తాలూకు చర్చలు, ఎందరో రచయితలతో సమావేశాలు ఆ ఇంట్లో జరిగేవని చెపుతుంటారు. ఆరుద్ర తన గురువు గారైన చాసో గురించి “ విశ్వ సాహిత్యంలో ఏ ప్రధమ శ్రేణి రచయిత కు తీసిపోని కథానికా శిల్పం ఆయన సొత్తు “ అని ప్రశంసించారు.

చాసో అనగానే ఎక్కువమంది కథాప్రియులకు గుర్తొచ్చే కథ వాయులీనం ‘. ఈ మధ్యకాలంలో నేను చదివిన చాసో కథలు ఏలూరెళ్ళాలి,’ ఊహా ఊర్వశి’, కర్మ సిధ్ధాంతమ్ ,’ కుంకుడాకు ‘. చాసో రాసిన కథలు దాదాపు అరవై లోపే వుంటాయట. ఆంగ్ల సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివినా ఆయనవన్నీ అచ్చ తెనుగు కథలు. ఇంగ్లీష్ రచయితల ప్రభావం శైలి లోనూ, శిల్పం లోనూ వుందేమో కానీ ఇతివృత్తం లోనూ, పాత్రల స్వరూపాల్లోనో లేశ మాత్రమైనా కనిపించదు. ఆయన కథల్లో ఆర్ధిక అంశాల చుట్టూ అల్లుకున్న మనుష్యుల చిత్రవిచిత్ర మనస్తత్వాల చిత్రీకరణ కనిపిస్తుంది. కానీ ఆయన కథల్లో ఆశ్చర్యపరిచే మరో గుణం కథల్లో ఎక్కడా రచయిత టోన్ వినిపించదు. కథ అచ్చంగా కథ లా వుంటుంది.కథని శిల్పంలా చెక్కుతాడు. ఎక్కడా అనవసర సంభాషణలు, వర్ణనలు వుండవు.

నేను చదివిన కుంకుడాకు కథ 1943 లో అరసం రచయితల తొలి సభాసంచికలో ప్రచురితమైన కథ. 1985 లో చాసో సప్తతి సందర్భంగా (ఆయనకు 70 ఏళ్ళ సందర్భంగా) కళింగ కథల సంకలనం ఆయన తన సొంత ఖర్చుతో ప్రచురించారు. గురజాడ వారి ప్రాంతానికి, అంటే కళింగ ప్రాంతానికి చెందిన కథకుల సంకలనం “ కళింగ కథానికలు” పేరిట చాసో ప్రచురించారు. ఆ సంకలనంలోని కథలు చాసో తన భావాలకు అనుగుణంగా ఏర్చి కూర్చినవి. “ ఈ కథ నేను రాస్తే ఎంత బావుణ్ణు” అనే భావం కలిగించిన కథలను ఎంపిక చేసుకున్నానని ఆయన తన ముందు మాటలో చెప్పుకున్నారు. అంటే అది కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాలతో కూడుకున్న సంకలనం అన్న మాట. అందులో ఆయన తన కథ కుంకుడాకు ను ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా అది ఆయనకు నచ్చిన కథ కాబోలు అనుకున్నాను. అంటే కాదు ఆ ముందు మాటలో ఆయన ఇంకో మంచి మాట అన్నారు “ నేను కథా రచనా నేర్చిన రీతిలో ఈ సంకలనాన్ని రూపు దిద్ది యువతరానికి అందిస్తున్నాను. యువతరం కోసమే ఈ సంకలనం” అని చెప్పారు.

ఇక కుంకుడాకు కథ గురించి...ఇందులో వర్గ దోపిడీ లాంటి పడికట్టు పదాలు ఏవీ వుండవు. కానీ కథ మాత్రం అందుకు సంబందించిందే. ఇద్దరు బాలికలు. అందులో ఒకమ్మాయి వయస్సు ఎనిమిదేళ్ళు. రెండో అమ్మాయి వయస్సు చెప్పరు.ఇద్దరూ పొలాల్లోకి వెళ్తారు. ఒకమ్మాయి మోతుబరి రైతు కూతురు. కొంచెం హోదా వున్నది. రెండో అమ్మాయి కూలివాడి కూతురు. రైతు కూతురు పారమ్మ చింకి పరికిణి కట్టుకుంటే, కూలి కూతురు గవిరి గోచి కట్టుకుంది. పారమ్మ ఊరగాయ తింటే , గవిరి ఇంట్లో పొయ్యి లేవక పస్తు వుంది. నెత్తి మీద కొండంత సంసార భారం పెట్టుకున్న గవిరి ఆకు, అలమా, కర్ర ఏరుకుంటుంటే పారమ్మ పట్టుబడతాన్న భయం లేకుండా పక్క పొలంలో పెసరకాయలు తెంపుకొని తింటుంది. ఎందుకంటే ఆ పిల్ల అప్పలనాయుడు బొట్టి. అదే పని గవిరి చేస్తే అది పెద్ద నేరమవుతుంది. అందుకని రాత్రంతా తిండి లేక కడుపు కాలుతున్నా పారమ్మ చేసిన పని గవిరి చేయలేకపోయింది. కుంకుడాకు చూడగానే గవిరి ఆకలి కూడా మర్చిపోగలిగింది. ఎందుకంటే కుంకుడాకులు దళసరివి. నాలుగాకులు ఎరితే తట్ట నిండుతుందని గవిరి ఆశ. కుంకుడాకులు గంపకెట్టుకొని ఇద్దరూ కాంభుక్తా కళ్ళాం వార పోతుండగా సింత కాయాలు కనిపించాయి. పాపం అవి తినాలని గవిరి రాళ్ళు విసురుతుంటే కాంభుక్తా వచ్చేశాడు. గవిరి తట్టని కిందపడేసి అక్కడ కనిపించిన పేడ ని కూడా అదే దొంగతనం చేస్తోందని అనుమానించి దాన్ని చెప్పు తో కొట్టి గవిరి కిందపడి ఏడుస్తుంటే తృప్తీగా వెళ్ళిపోయాడు. చెయ్యని తప్పు కి నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వినకపోతే, వూరంతా భయపడే కాంభుక్తా ని బూతులతో తిట్టడం ప్రారంభించింది గవిరి. లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికి అక్కరనేదు అనుకుంటూ కుంకుడాకు ని కూడదీసి తట్టకెత్తి ఇంటికి బయలుదేరింది. గవిరి, పారమ్మ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పక్కనున్న స్కూల్లో పిల్లలు తల్లీ నిన్ను దలంచి, సరస్వతీ నమస్తుభ్యం పాడుతున్నారు. గవిరి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కాలు వల్లే వేస్తున్నారు. అంతే కథ.

కథ చిన్నదే. విషయం మాత్రం పెద్దది. డబ్బున్నవాడు తప్పులు చేస్తే తప్పించుకోగలటం. పేదవాడు చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు అనుభవించటం అనే అంశాన్ని ఇద్దరు పిల్లల వైపు నుండి రచయిత చూపించాడు. ఇక స్కూల్ పిల్లల ప్రస్తావన మామూలుగా చూస్తే కథ కి అనవసరం గా కనిపిస్తుంది. కానీ, ముందే చెప్పినట్లు రచయత అనవసరమైనవేమీ కథ లో చూపించడు . గవిరి వయస్సు పిల్లలు బళ్ళో చదువుకుంటూ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆ చదువు సమాజంలో బతకటానికి పనికివస్తుందని మనందరి నమ్మకం. కానీ పేదవాళ్ళు జీవితం నుంచి బతుకు పాఠం నేర్చుకుంటారని చెప్పాడు రచయిత ఈ కథ ద్వారా. తప్పు చేయలేదని కాంభుక్తా కి నెమ్మదిగా చెప్పింది గవిరి. వినలేదు. అతడ్ని బూతులతో తిట్టటానికి కూడా వెనకాడలేదు. అలాగే అతని చింత కంపల్ని ఇవెవడికి కావాలి అని తిరస్కరించి తన అభిమానాన్ని చాటుకుంది. ఎవరి సొత్తు కానీ కుంకుడాకు ని ఏరుకుంది. రైతు కూతురు అయివుండి పారమ్మ పొలంలో పెసరకాయలు తిని పబ్బం గడుపుకుంది. డబ్బు తక్కువైనా, పేదవాడు గుణానికి మిన్న అని కూడా అర్ధమవుతుంది. అభ్యుదయాన్ని కాంక్షిస్తూ , మార్స్కిజాన్ని నమ్మిన రచయిత చాసో సామాజిక అవగాహనకు అద్దం పట్టే కథ ఇది.

ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్న చాసో ఏలూరెళ్ళాలి కథ గురించి మరో సారి....

( జనవరి 17 చాసో 95వ పుట్టినరోజు సందర్భంగా...)

కల్పనారెంటాల 
Real Time Web Analytics