నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, June 27, 2015

నవ్య వీక్లీ లో నా కథ " ఇట్స్ నాట్ ఓకే "

నవ్య వీక్లీ లో ( జూలై 1 సంచిక లో) ప్రచురితమైన నా కథ " ఇట్స్ నాట్ ఓకే".....



ఇట్స్ నాట్ ఓకే

"
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్. బార్న్స్ అండ్ నోబుల్ దగ్గర కలవటం కుదురుతుందా?’ ఆఫీస్ నుంచి బయలుదేరబోతుంటే వైదేహి  నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజీ చూసి శృతి ఆగిపోయింది . వైదేహి ని  కలిసి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ఒక  టెక్స్ట్ మెసేజీఅది కూడా ముఖ్యమైన విషయం అని వచ్చేసరికి శృతి కి కొంచెం కంగారుగా అనిపించింది.

ఒక్క సారి వాచీ వంక, మొబైల్ వంక చూసింది. ఒకటి కాలం కోసం, రెండోది  సెల్ ఫోన్ గుప్పెట్లో వున్న భౌతిక, మానసిక ప్రపంచాల కోసం. ఆ మొబైల్ లోనే ఆమె జీవితం మొత్తం గూడు కట్టుకొనుంది.   చేయాల్సిన పనులు, ఇంటాబయటా చేయించాల్సిన పనులు, అపాయింట్మెంట్ లు, రిమైండర్లు, నోట్స్, కట్టాల్సిన బిల్లులు మొత్తం గా ఆమె  జీవితపు bucket list అంతా ఆ మొబైల్ లో నిక్షిప్తమై ఉంది, రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు.

స్మార్ట్ ఫోన్ లో  ఒక్క సారి To Do List చూసింది. ఒక గంటో, ఒక రోజో ఆలస్యమైతే టోర్నాడో లో , వరదలో వచ్చే ప్రమాదమేమీ లేదని అర్థమయ్యాక,  " see you girl," అని వైదేహి కి  రిప్లై ఇచ్చింది.

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో డాలస్, హ్యూస్టన్ లతో పోలిస్తే, ఆస్టిన్ కొంచెం చిన్న ఊరు.  ట్రాఫిక్ లేని సమయాల్లో ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఓ పావుగంట, అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. రీసెర్చ్ బులవార్డ్ రోడ్డు మీద నార్త్ లో శృతి ఆఫీస్ ఉంటే, ఒక యూ టర్న్ తీసుకొని రీసెర్చ్ బులవార్డ్ సౌత్ మీదకొస్తే బార్న్స్ అండ్ నోబుల్ బుక్ స్టోర్
వస్తుంది. హైవే ఎక్కితే పది నిముషాలే కానీ ఆ ఫ్రాంటేజీ రోడ్డు మీద వెళ్లటమే శృతి కి  ఇష్టం.

 
హైవే ఎక్కితే తొందర తొందరగా గమ్యానికి చేరుకుంటాము. కానీ శృతి కి ఆ పరుగు పరుగు ఇష్టం లేదు. రోజూ ఆఫీస్ కి వచ్చి వెళ్లే చిన్నపాటి  కారు ప్రయాణాన్ని కూడా నెమ్మదిగా ఎలాంటి అనవసర పరుగులు లేకుండా ఇష్టమైన పాటలు వింటూ అనుభూతిస్తూ వెళ్లాలనిపిస్తుంది . వైదేహి  చెప్పబోయే అంత ముఖ్యమైన , వ్యక్తిగతమైన విషయం ఏమై ఉంటుందా అని శృతి డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో పడింది .

                                        ***

వైదేహి , శృతి ల మధ్య స్నేహం విచిత్రంగా జరిగింది. సామాన్యంగా కొత్తగా ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ షాపింగ్ మాల్ లోనో, గ్రోసరీ స్టోర్ లోనో ఎదురెదురుపడితే చిన్నపాటి చిరునవ్వు నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతూ , చూడనట్లు పక్కకు తప్పుకొని వెళ్లిపోతుంటారు. అలాంటిది హఠాత్తుగా గ్రోసరీ షాప్ లో కలిసిన వీళ్ళిద్దరి  స్నేహం ఓ ఏడాది గా  గా   పెరిగి
పెద్దదవుతోంది .

వైదేహి  వాళ్ళు బోస్టన్ నుంచి అప్పుడే  కొత్తగా ఆస్టిన్ కి రీలొకేట్ అయ్యారు. కందిపప్పు, కూరగాయలు కొనటానికి వైదేహి  , ఇండియన్ గ్రోసరీ షాప్ కి వస్తే అక్కడ జామపళ్లు, సీతాఫలం పళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే బోలెడు ఉత్సాహ పడిపోయింది. ఆ ఉత్సాహంతోనే అక్కడే నిలబడి అతి జాగ్రత్త గా జామపళ్ళను,సీతాఫలం పళ్లను ఎంపిక చేసుకుంటున్న శృతి తో  మాటలు కలిపింది.
కొత్తగా  వచ్చిన వైదేహి కి  ఊర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పింది  శృతి. అలా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం నెలకొకసారైనా  బయట కలిసి ఓ కప్పు కాఫీ తాగే వరకు వచ్చింది. అయితే ఎప్పుడు కలిసినా  పిల్లల చదువులు, కమ్యూనిటీ గాసిప్ లులోకాభిరామం విషయాలు తప్ప ఎవరి వ్యక్తిగత విషయాలు మరీ లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు.

వైదేహి  ముఖ్యమైన విషయం, వ్యక్తిగతం అనేసరికి విషయం ఏదో పెద్దదని   శృతి
కి అర్థమయింది . శృతి అలా ఆలోచనల్లో ఉండగానే బార్న్స్ అండ్ నోబుల్ వచ్చేసింది. కారు పార్క్ చేసి బుక్ స్టోర్ కి వెనుక వైపు ఉన్న పార్క్ లోకి నడిచింది శృతి.

2.

అది పెద్ద పార్క్ కాదు కానీ ముచ్చటగా ఒక పక్క చిన్న సరస్సు , మరో వైపు పిల్లలు ఆడుకోవటానికి చిన్న చిన్న జారుడు బండలు ఉన్నాయి.ఒక పక్క పిల్లల్ని ఆడించే వాళ్ళు ఆడిస్తున్నారు. మరో పక్క పార్క్ లో సాయంత్రం చల్లటి వేళ ప్రకృతి ని ఆస్వాదిస్తూ నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇంకో వైపు   సిమెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ దగ్గర నెమ్మదిగా కాఫీ  సిప్ చేస్తూ ఏదో దీర్ఘాలోచనలో వైదేహి  కూర్చొని ఉంది. వైదేహి ని  పలకరిస్తూ ఏమిటి విషయం అన్నట్లు  చూసింది శృతి . వైదేహి   మొహం విచారంగా లేదు, సంతోషంగా లేదు. ప్రశాంతంగా లేదు, అశాంతిగానూ లేదు. కేవలం గంభీరంగా ఉంది. అలా వైదేహి ని  ఎప్పుడూ చూడకపోవటం తో శృతి కొంచెం ఆశ్చర్య పడింది .

"Is ever thing alright ?"
కొంచెం ఆందోళన గా  అడిగింది.

యెస్...” తల వూపుతూ శృతి కోసం తీసుకున్న కాఫీ కప్పు ను ఆమె చేతికి
అందించింది వైదేహి. గంభీరంగా ఉన్న వైదేహి వంకే చూస్తోంది శృతిఏం మాట్లాడబోతోందా అన్నట్లు.

"
డైవోర్స్ కి ఫైల్ చేశాను." నేరుగా అసలు విషయం లోకి వచ్చేసింది   వైదేహి .

"
వ్వాట్? అసలేమైంది?ఒకటే సారి ఈ  డైవోర్స్ నిర్ణయం ఏమిటి?" శృతి మాటల్లో కనిపిస్తున్న ఆందోళన ను చూసి ఇప్పుడంతా  బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు అన్నట్లు ఆమె చేతి మీద చెయ్యి వేసింది వైదేహి .
 
అప్పుడే తగిలిన పచ్చి గాయం లాగా , ఎప్పటికీ మర్చిపోలేని ఓ పీడ కల గా మళ్ళీ కొత్త గా కళ్ళకు కట్టినట్లు   కనిపిస్తోంది వైదేహి కి.

                                         ***

౩. ఒక శుక్రవారం ఉదయం.

ఫోన్ లో పెట్టుకున్న అలారం బీప్ కన్నా చాలా చాలా ముందే మెలకువ వచ్చేసింది వైదేహి కి.  కనురెప్పలు తెరుచుకున్నాయి కానీ ఒంట్లోని నరాల్లో  ఏ మాత్రం కదలిక  లేనట్లు,కండరాలన్నీ ఎక్కడికక్కడ మంచు లో కూరుకుపోయినట్లు మొద్దు బారి పోయి ఉన్నాయి. శరీర కణాల్లో ఏ మాత్రం జీవం లేనట్లు నిశ్చింత గా నిద్ర పోతున్నాయి. ఒక్క క్షణం వైదేహి కి  తానూ బతికున్నదో, చనిపోయిందో కూడా అర్థం కాలేదు. దేహం లోంచి విడివడి పోయి తన ఆత్మ ఒక సాక్షీభూతం గా దూరం గా నిలబడి శరీరాన్ని చూస్తున్న ఫీలింగ్ వైదేహి లో. చేతి ని, కాళ్ళను కదపాలని ప్రయత్నించింది. అసలు అవి ఉన్నాయని కూడా తెలియనట్లు అనిపించింది. మానసికంగా , శారీరకంగా విశ్వ ప్రయత్నం చేసాక ఎక్కడో
చిన్నపాటి కదలిక. మెలకువ  వచ్చాక ఓ పావు గంట పట్టింది మంచం మీద నుంచి
కాళ్ళు కింద పెట్టడానికి.  అటు పక్కకు తిరిగి పడుకున్న రాఘవ గొంతు లోంచి
వస్తున్న గురక ను బట్టి  అతను గాఢ నిద్ర లో ఉన్నట్లు తెలుసు ఆమె కు.  తన
శరీరం , తన మనసు ఏం మాట్లాడుతున్నాయో అతన్ని లేపి చెప్పాలని ఉంది. కానీ
దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకాబట్టి ఆ ప్రయత్నం మానుకొని లేచి
నెమ్మదిగా వెళ్ళి అక్కడున్న కిచెన్ బార్  స్టూల్ మీద తన శరీరాన్ని కూలదోసింది.

పొద్దుపొద్దుటే ఈ “ ఫైబ్రో  మయాల్జియా “ పెట్టే బాధలు ఇవాళ కొత్త కాదు వైదేహి కి . ఒళ్లంతా కండరాల నొప్పులు. శరీరమంతా ఒక బాధాసప్తసతి లాగా ఉంటుంది.  ఈ రోగానికి ప్రత్యేకంగా ఏం మందులు ఉండవు అంటూనే డాక్టర్లు ఏవో మందులు ఇస్తూ ఉంటారు. పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఇది తగ్గే రోగం కాదు అని ఆమె కు కూడా తెలుసు. కానీ  ఉదయం లేవకుండా, అమూల్య ను స్కూల్ కు పంపకుండా ఉండటం ఎలా సాధ్యం? చాలా ఉద్యోగాలతో పాటు అమెరికా లోని హాయైన జీవితానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాలి కదా అనుకొని నిట్టూర్చింది.

వయస్సు ముప్పై లలోనే ఉన్నా  ఉదయం పూట  ఏదో ముసలితనం వచ్చినట్లు ప్రవర్తించే శరీరం వంక చూసుకుంది వైదేహి .  అలాగే లేచి అటూ ఇటూ కండరాల పెను నిద్దర ను వదిలించే ఎక్సర్ సైజులను చేయటం మొదలు పెట్టింది. ఉన్నట్లుండి కలుక్కున ఎక్కడో పట్టేసింది. నడుం పై భాగం ఒక ముక్క గా , కింద భాగం మరో ముక్క గా  దేహం రెండు గా విడిపోయినట్లు  విపరీతమైన నొప్పి.
అతి కష్టం మీద  నేల మీద కు ఒరిగి పోయింది. ఆ నొప్పి లోంచి అమ్మా అన్న కేక గట్టిగా బయటకు వచ్చింది.  కానీ అమెరికా లో అమ్మ లకు అమ్మలు  ఎవరూ పక్కన ఉండరు కదా. అయిదు నిముషాలు ఆ నొప్పి ని భరించింది. నొప్పి క్షణం క్షణం ఎక్కువవుతోంది ఇక భరించలేక “ రాఘవా,రాఘవా” అంటూ గట్టిగా కేకేసింది .

ఓ పదిసార్లు గట్టిగా అరిచాక కానీ రాఘవ కు మెలకువ  రాలేదు. కళ్ళు  నులుముకుంటూ కిచెన్ లోకి వచ్చాడు. నిద్రాభంగం అయిందన్న చికాకు ఆ మోహంలో స్పష్టం గా కనిపిస్తోంది.

ఎవరు చచ్చారని అంత కేకలేస్తున్నావు?” అంటూ వైదేహి కోసం  అటూ ఇటూ చూసాడు. నిద్ర మత్తు లోంచి కళ్ళు  ఇంకా బయటకు రానంటున్నాయి కాబోలు అంతా మసక మసక గా కనిపించింది. కళ్ళు విదిల్చుకొని సరిగా చూసాడు . అప్పుడు కనిపించింది నేల మీద ఓ మూట లా రెండు కాళ్ళు వెనక్కు మెలికపడి కూర్చొన్న వైదేహి  .

వైదేహి కి  శరీరం లోని నొప్పి ని దాటి మరింత నొప్పి పెట్టింది రాఘవ అన్న మాటలు .

ఏమిటీ ఎక్సర్ సైజు లు చేసావాఫిజియో థెరపీ కి డబ్బులు వదిలించటం తప్ప  అవి నీకు రావు. నువ్వు చేయలేవు. “ విసుక్కుంటూ వైదేహి ని  పైకి లేపాడు.

వైదేహి కి  అక్కడే కూలబడిపోయి పైకి లేవకుండా భీష్ముడి లాగా “ స్వచ్చంద  మరణం” పొందాలనిపించింది.

రాళ్ళను గుగ్గిళ్ళు గా మార్చగలిగే పతివ్రతలో కోవ లో లేదు  కాబట్టి వైదేహి  చావలేక బతికి పోయింది.

వైదేహి ని  పైకి లేపి , లేచి నిలబడుతుండగానే టక్కున ఆ స్పర్శ ను అర క్షణం కూడా భరించ లేనట్లు వదిలేశాడు రాఘవ. ఆమె కళ్ళల్లోంచి ఓ సన్నటి నీటి పొర, ఎందుకీ జన్మ  అనుకుంటూ.

ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే వదిలేయటం తో కాళ్ళు ఇంకా బాలెన్స్ లోకి రాక కాస్త అటూ ఇటూ ఊగిపోయింది.  గబుక్కున కిచెన్ మధ్య లో ఉన్న బార్ అంచును పట్టుకొని స్టూల్ మీద కూలబడింది.

మనసు లోని నొప్పి ముందు శరీరం లోని నొప్పి చాలా చిన్న గా అనిపించింది. అయినా ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు  ఆమె .

కిచెన్ బార్ మీద చార్జింగ్ కి పెట్టిన ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఫకింగ్ ఇడియట్. దీన్ని కట్టుకున్నాక నిద్ర సుఖంలేదు. “ గొణుక్కున్నాడు రాఘవ. చీమలు కూడా తిరగని నిశ్శబ్దపు ఇంట్లో అతని మాటలు స్పీకర్ పెట్టినట్లు గట్టిగా వినిపించాయి.

అతన్ని నిద్ర లేపిన ఘోరమైన అపరాధం తనదే అన్నట్లు “ నువ్వు రాత్రి లేట్ గా పడుకున్నావని తెలుసు కానీ పైకి లేవకపోతే అమూల్య ను నిద్ర లేపి స్కూల్ కి తయారు చేయలేను కదా అని పిలిచాను.”

వైదేహి  మాటలకుచేత్తో ఇక చాల్లే అన్నట్లు చూపిస్తూ “ ఒక్క రోజైనా మొగుడి ని సుఖ పెట్టావా? ఆ సుఖం గురించి కాదు నేను మాట్లాడుతోంది . డబ్బు తెచ్చి నీ ముఖాన పోస్తున్నాను. అమెరికా లో ఇంత పెద్ద ఇల్లుంది. ఉద్యోగం చేయక్కర లేదు. నన్ను నా ఉద్యోగం చేసుకోనిస్తే చాలు. ఉన్న ఒక్క పిల్ల ను స్కూలు కు దించేస్తే రోజంతా ఖాళీ. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తెచ్చుకోవటం. ఇది పెద్ద పనా? ఇంజనీరింగ్ చేసావు. నీ ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్ వేర్ లో ఉన్నారు. నిన్ను ఆ పని కూడా చేయమనటం లేదే. హాయి గా ఇంటి పట్టున ఉండి వంట చేసుకొని మా ఇద్దరినీ చూసుకోవటానికి ఏం పోయేకాలం? ఎప్పుడూ ఏదో ఒక  రోగం?” గురి తప్పని మాటల బాణాలు విసరటం మొదలుపెట్టాడు  రాఘవుడు.

ఉద్యోగం చేయొద్దన్నది నువ్వు. ఈ ఫైబ్రో మయాలజియా ఉన్నా కూడా ,మీ పనులు ఏవీ ఆపటం లేదే. అన్నీ చేస్తూనే ఉన్నాను గా. “ ఎదురు సమాధానం చెప్పింది వైదేహి, భర్త మాటలకు ఎదురాడ కూడదని తెలిసినా కూడా.

నీకు చేతకాదని తెలుసు కాబట్టే వద్దన్నానే. ఒక్క పని అయినా పర్ఫెక్ గా చేస్తావా? నేను నెల లో సగం రోజులు ప్రయాణం లోనే ఉంటాను. నువ్వు పిల్లను స్కూల్లో దింపటం, స్విమ్మింగ్ కి, ఆర్ట్ క్లాస్ కి, సంగీతం క్లాస్ కి తీసుకెళ్లటమేగా  చేయాల్సింది.  అసలు ఆడదానికి పిల్లల్ని పెంచటం కన్నా వేరే  ముఖ్యమైన పనులేమున్నాయి. అదికూడా కష్టమేనా?”

రోజంతా ఇంటి పనులు,అమూల్య పనులతో సరిపోతూనే ఉంది కదా. మధ్యాహ్నం రెండు
మూడు గంటలు  ఖాళీ , అంతే కదా ” చెప్పటం అనవసరం అని తెలిసినా నోరు ఊరుకోక
ఉన్న విషయం చెప్పింది.

మొగుడు బయట నానా గడ్డీ తిని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి తెస్తే చీరలు,మేకప్ లు,నగలు అంటూ దాన్ని ఖర్చు పెట్టడమే కదా మీ ఆడవాళ్ళు చేసే పని. అయినా నువ్వసలు ఆడదానివేనా? నువ్వొక   రోగిష్టి మారివి.  ఉన్న ఒక్క పిల్లను సక్రమం గా పెంచటం చేత కాని ఆడదానివి. ఒక్క ఆడ పని అయినా నువ్వు ఇన్నేళ్ళ లో సక్రమం గా చేసావా? "

 
ఒక్కో మాటల తూటా నేరుగా వైదేహి మనసు లో దిగబడి పోతోంది. ఎన్ని సార్లు గుచ్చుకున్నాయో ఈ బాణాలు అయినా చెక్కుచెదరని ధీరత్వం తో కాపురం చేస్తూనే
ఉంది వైదేహి.

రాఘవ మాటలకు వైదేహి సమాధానం చెప్పక్కర లేకుండా ఫోన్ గణ గణ మని మోగింది.

రిసీవర్ తీసి కాలర్ ఐడి లో నెంబర్ చూసి  “ఇండియా నుంచి మీ పుట్టింటి వాళ్ళు. వాళ్ళు కాల్ చేసే ఆ వానేజీ ఫోన్ కి కూడా నేనే డబ్బులు కడుతోంది. కూతురు కి పనులు చేయటం కూడా నేర్పించ కుండా నాకు అంటగట్టి వదిలించుకున్నారు”  కార్డ్ లెస్ ఫోన్ ను  కిచెన్ టేబుల్ కు ఆ వైపున ఉన్న వైదేహి వైపు కు బలంగా విసిరేశాడు రాఘవ.

ఫోన్ ఆన్సర్ చేసి విసిరేసాడేమో, రాఘవ మాటలు అవతల వైపు కు వినిపించాయేమో అని సిగ్గుతో చితికిపోతూ ఫోన్  తీసుకుంది.  రాఘవ మాటల మధ్య కాల్ ఆపేయటాన్ని, రింగ్ ఆగిపోవటాన్ని గుర్తించ లేకపోయింది వైదేహి.

ఏం ఆడ పనులు చేయటం లేదు నేనీ ఇంట్లో అయినా అసలు నేను ఆడదాన్ని అని నాతొ సంసారం చేయాలని గుర్తుండాల్సింది నీకు , నాకు కాదు. ”  ఆడ దానివి  కాదు అన్న మాటకు ఒళ్ళు తెలియని కోపంతో మాటకు మాట సమాధానం చెప్పింది వైదేహి.

ఏమిటే నీతో సంసారం చేసేది? నీకు మదమెక్కువై ఒళ్ళు కొవ్వొక్కి కొట్టుకుంటున్నావు.  సంసారం చేయాల్సింది పిల్లల్ని కనటానికే. అది జరిగాక ఇక సంసారం చేస్తే అది సంసారం కిందకు రాదు. నేను హిందువు ని. తురకోడి లాగా వందమంది పిల్లల్ని కనక్కరలేదు.” సంసారం విషయం ఎత్తేసరికి రాఘవ లో ఎక్కడ లేని కోపం వచ్చింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. మొహమంతా ఎర్రగా మారిపోయింది.

నీకు చేత కావటం లేదని చెప్పు.  నీ మగతనం పోయిందని చెప్పు. నీకు ఎరెక్షన్ సమస్య అని చెప్పు. అంతే కానీ  హిందూ ధర్మం, పురాణాల గొడవెందుకు?” వైదేహి సూటి గా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది ఆ మాట. ఆ చూపు లో,ఆ మాటలో ఒక తెలియని  కచ్చితనం కనిపిస్తోంది. అతని రహస్యాన్ని బట్టబయలు చేయాలన్న కసి కనిపిస్తోంది.

ఆ మాట ను విని తట్టుకోలేకపోయాడు రాఘవ.

బజారు ముండ, నీకు సెక్స్ కావాలటే, రా నా మగతనం చూపిస్తాను.అయినా  You
know what, you are not worth to f**** ".
విసురుగా దగ్గరకొచ్చి జుట్టు పట్టుకొని వైదేహి ని ఒక్క లాగు లాగాడు. అలా విసురు గా లాగటం తో స్టూల్ మీదున్న వైదేహి కిందపడి పోయింది.

కింద పడటం,    చేతిలో ఉన్న కార్డ్ లెస్ ఫోన్ ను  రాఘవ మొహం మీదకు విసిరేయటం రెండూ ఒక దానివెంట ఒకటి  ఒక్క త్రుటి లో జరిగిపోయింది.

ఫోన్  రాఘవ నుదుటిని కొట్టుకుంటూ వెళ్లి పక్కకు పడిపోయింది.

ఇందాక ఒక సారి పడిపోయిన చోటనే మళ్ళీ దెబ్బ తగిలింది. ఈ సారి నొప్పి మరింత తీవ్రంగా అనిపించింది. కానీ రాఘవ అన్న మాటల కంటే ఆ నొప్పి చాలా మాములుగా భరించగలిగేలా అనిపించింది వైదేహి కి.

 “
నన్ను కొడతావా? ఏం జాతే నీది? నువ్వొట్టి బజారు ముండ వి. నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావా? ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పించింది? “ మాటలు, బూతులు అన్నీ కలిసిపోయి తిడుతూ ఆ రిసీవర్ ని తీసి మళ్ళీ వైదేహి మొహం మీదకు విసిరేశాడు.

సూటి గా వచ్చి వైదేహి నోటి కి ఫోన్  బలం గా  తగలటం తో పళ్ళు పగిలినట్లు రక్తం జివ్వున బయటకు వచ్చింది.

అప్రయత్నంగానే చెయ్యి పెదాల మీద కు వెళ్ళింది. చేతికి ఎర్రటి రక్తం. పెదాల చివర నుంచి రక్తం కిందకు ధార లా కారుతోంది.

ఎన్ని సార్లో అంతకు ముందు  అతని చేత తన్నులుతిన్నది. అయినా ఆ క్షణం భిన్నమైనది.

చేతికి అందిన రిసీవర్ ని తీసుకొని గబగబా 911 డయల్ చేసింది.  రాఘవ పెడుతున్న  హింస గురించి ఒక ప్రవాహం లా  మాట్లాడేస్తోంది  వైదేహి.

ఒక పక్క ఆవేశం, ఒక పక్క బాధ, తెలుగు, ఇంగ్లీష్ లలో కలగాపులగంగా రోప్పుతూ మాట్లాడుతోంది వైదేహి.

అటు పక్క నుంచి ఆపరేటర్ వైదేహి మాటల్ని ఆపుతూ “ మేమ్ . జస్ట్ టేక్ డీప్ బ్రెత్ . నెమ్మది గా చెప్పండి. మీ ఇంటి అడ్రెస్ ఏమిటి? ఆర్ యు సేఫ్ ? “ అడుగుతున్నాడు .

ఒక్క క్షణం వైదేహి ఏం చేస్తోందో, ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాలేదు రాఘవ కు.

వైదేహి కాల్ చేసినదెవరికో అర్థం అయ్యాక రాఘవ గగబా వచ్చి వైదేహి చేతిలోని రిసీవర్ ని తీసుకొని కాల్ ని ఆపేసాడు.

“ You bitch.
ఇంటి విషయాల్ని బయట పెట్టడానికి సిగ్గు లేదు. నడువు, ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటకు నడు “ అంటూ జుట్టు పట్టుకొని లేపి తలుపు వైపు తోసాడు.

ఇది నా ఇల్లు. నేనెందుకు వెళ్ళాలి?” అంటూ ఓ విధమైన పిచ్చి ఆవేశం తో రెండు చేతులతో రాఘవ రొమ్ము మీద పిడి గుద్దులు  గుద్దింది వైదేహి. చేత్తో అతని మొహం మీద రక్కింది. రాఘవ కళ్ళకు రాక్షసి మీద కు వస్తున్నట్లు కనిపించి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసాడు. కానీ వైదేహి బలం ముందు బలహీనుడై పోయాడు. తప్పించుకునే ప్రయత్నమో, కోపమో కానీ అతను ఆమె ను కొట్టే ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నాడు.

అలా ఇద్దరు ఒకరినొకరు మాటలతో చేతలతో హింసించుకొంటూ ఉండగా బోయ్ బోయ్ మంటూ శబ్దం చేసుకుంటూ కాప్స్ ఇంటి ముందుకు వచ్చేసారు.

వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు. ఏం జరగలేదని చెప్పి పంపేయి. లేదంటే నిన్ను ఇక్కడే నరికి చంపేస్తాను” తలుపు తీయడానికి వెళ్తున్న వైదేహి ని ఆపెస్తున్నాడు రాఘవ.

అప్పటి వరకు లేని బలం ఎలా వచ్చిందో వైదేహి కి అతన్ని తోసేసి వెళ్లి తలుపుతీసింది.

భద్రమైన వారి ఇంట్లో కి భద్రతనిచ్చే రక్షకభటులు వచ్చారు.

చెదిరిన జుట్టు, పళ్ళ నుంచి రక్తం, మొహమంతా రక్కేసిన గాట్ల తో వైదేహి అపర కాళిక లాగా పోలీసుల ముందు నిలబడింది.

ఆర్ యు ఓకే మేమ్ “ అంటూ ఒక పోలీసు అడిగిన ప్రశ్న కు తల ఊపింది ఆమె.

వాళ్ళను చూడగానే ఒక విధమైన ధైర్యం తో పాటు ఒక ఎంబరాస్మెంట్ ఫీలింగ్ కూడా కలిగింది. లోపల దాచిపెట్టుకున్న ఏడుపు ఒక్క సారిగా బయటకు వచ్చింది.

ఇట్స్ ఓకే “ అంటూ లేడీ పోలీసు ఒకామె నెమ్మదిగా వైదేహి ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్లి సోఫా లో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా? “ అంటే తల ఊపింది.

రాఘవ కు నోటి మాట రాకుండా స్థాణువై నిలబడి ఉన్నాడు. పోలీసుల వంక చూడలేకపోతున్నాడు. అవమానంగా అనిపించింది. పరువు బజారు పాలు చేసింది ఈ
బజారు ముండ అనుకున్నాడు.

సర్, ఆర్ యూ ఆల్ రైట్ ? మీకేమైనా దెబ్బలు తగిలాయా?” రాఘవ మొహం వైపు
చూస్తున్నాడు. మొహం మీద గాట్లు, రిసీవర్ మొహానికి తగిలిన దెబ్బ అన్నీ అద్దం లో కనిపించినట్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి ఆ పోలీసు కళ్ళకు .

ఇంతలో వారికి దూరం గా ఒక శిలా విగ్రహం లా నిలబడ్డ అమూల్య కనిపించింది. ఎప్పుడు నిద్ర లేచి వచ్చిందో, ఏం చూసిందో తెలియదు , నోట మాట, శరీరం లో కదలిక లేకుండా శిల లా నిల్చున్న  అమూల్య దగ్గరకు లేడీ పోలీసు వెళ్లి “ స్వీటీఇట్స్ ఓకే. కెన్ వుయ్ గో ఇన్ టు యువర్ రూమ్? “ అమూల్య ని  గది లోకి తీసుకెళ్లింది. ఆమె అమూల్య తో మాట్లాడుతోంది.

ఇంకో ఇద్దరు పోలీసులు వైదేహి తోనూ, రాఘవ తోనూ విడివిడి గా మాట్లాడి నోట్స్ తీసుకున్నారు.

ఒక గంటకు పైగా మాట్లాడి రాఘవ మీద ఎమోషనల్ ఎబ్ యూజ్ కింద కేసు పెట్టారు. కౌంటీ రూల్స్ ప్రకారం గృహ హింస కు జీరో టాలరెన్స్ చట్టం ఉంది కాబట్టి , వైదేహి కంప్లైంట్ ఇస్తే రాఘవ మీద కేసు పెడతామని పోలీసులు చెప్పారు కానీ అతన్ని జైలు కు పంపటం ఇష్టం లేక వద్దని చెప్పింది వైదేహి.

ఇక్కడ మీరు సేఫ్ గా ఉండగలరా ? లేక వేరే ఎక్కడైనా ప్రొటెక్షన్ హౌస్ కి వెళ్తారా? “ అన్న పోలీసుల ప్రశ్న కు “ ఇక్కడే ఉంటామని, అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తామని “ చెప్పింది వైదేహి.

ప్రొటెక్షన్ సెల్  విజిటింగ్ కార్డ్స్, సహేలి కార్డ్స్, కౌంటీ పోలీస్ స్టేషన్ నెంబర్స్ అన్నీ ఫ్రిజ్ మీద మాగ్నెటిక్  కార్డ్ తో అతికించి వెళ్ళారు.

పోలీసులు ఇద్దరికీ మరో సారి అన్నీ రూల్స్ వివరించారు.  ఇద్దరిలో ఎవరికైనా అవతలి వాళ్ళ వల్ల  ప్రాణాపాయం అనిపించినా వెంటనే కాల్ చేయమని చెప్పారు.

పోలీసుల్ని పంపుతూ  తలుపు వేయటానికి  మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన వైదేహి కి, సందు లో తమ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళంతా స్లో డౌన్ చేసి  ఆ ఇంటి ముందు ఆగిన పోలీసు కార్లను చూసుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించింది.

సిగ్గు, అవమానం, అసహ్యం , బాధ, ఏడుపు అన్నీ కలగలిసి వచ్చాయి. భారంగా అడుగులు పడుతుంటే లేచి అమూల్య గదిలోకి వెళ్ళింది వైదేహి.

                                                   ***


“   
నా 15 ఏళ్ల వైవాహిక జీవితం చివరకు ఇలా ముగిసింది  శృతీ . అమూల్య కోసమో, నా అనారోగ్యం వల్లనో లేక ఈ కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయం తోనో  ఏదో ఒక కారణంతో   ఇన్నాళ్ళూ  ఓపిక పట్టాను. ఆ 911 సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్క సారిగా నా భయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ రోజు మమ్మల్ని అమూల్య చూసిన చూపు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనున్న స్థితి లోనే రేపు అమూల్య ఉంటే ఏం చేస్తుంది? భర్త చేత తన్నులు తింటూ అయినా సరే ఆ కాపురాన్ని  నిలబెట్టుకోమని ఆత్మ గౌరవం లేకుండా బతకమని చెప్పనా? అదేనా నేను నా కూతురికి నేర్పించాల్సిన జీవితపాఠం? ”

ఆ సాయంత్రపు నీరెండ వెలుగు లో  తనను తాను ప్రశ్నించుకుంటున్న వైదేహి కొత్త గా కనిపించింది శృతి కి. లేచి వెళ్లి వైదేహి ని హగ్ చేసుకుంది .





                    ***

                                                                                కల్పనారెంటాల
 



 
Real Time Web Analytics