నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, November 19, 2009

మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!
అజర్ నఫిసీ – ఇరాన్ కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.

అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.


ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.


నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…


ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.

కల్పనారెంటాల

6 వ్యాఖ్యలు:

te.thulika said...

మంచి వ్యాసంతో కొత్తస్థలంలో మొదలు పెట్టడం బాగుంది. శుభాకాంక్షలు.

శరత్ 'కాలమ్' said...

మీ కొత్త ఇంటికి ఆహ్వానించినందుకు సంతోషం. వచ్చాము. ఎక్కువగా మీ పోస్టులు చూస్తామని ఆశిస్తాను.

Kalpana Rentala said...

@ మాలతి గారు మీ బోణీ బావుంది.
@శరత్ , తప్పకుండా. మీ అందరి అభిమానం వుంటే ఎక్కువ పోస్ట్ లు రాస్తాను.

భావన said...

ముందు గా నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. తరువాత మీకు కూడా హ్యాపీ థ్యాన్క్స్ గివింగ్. అంటే అన్నానని బాధ పడతారు కాని కల్పన మీ వైపు అసలు అమెరికా లో అందాలు పండుగ హడావుడు లు చూడాలంటే మా నార్త్ ఈస్ట్ వైపే. మీ వైపు కంటే మా వైపు బాగుంటుంది.. వె వె వె(వెక్కిరిస్తున్నా ) :-)

Praveen Communications said...

నా అభిప్రాయం ప్రకారం సొంత డొమెయిన్ ఉంటేనే అది నిజమైన ఇల్లులాగ ఉంటుంది.

S said...

Nice!
నాకు ఈ రచయిత్రి గురించి తెలీదు. మీరు రాసిన వ్యాసం చదివాక - Marjane Satrapi గ్రాఫిక్ నవల Persepolis గుర్తొచ్చింది ... మీరు అది చదివారా?

 
Real Time Web Analytics