నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, December 11, 2009

'పోస్ట్ మోడర్న్ ' అద్దంలో చిన్నబోయిన రాజేశ్వరి! (మొదటి భాగం )



చలం రాజేశ్వరికిప్పుడు 75యేళ్ళ పైమాటే. 1927 లో తొలిసారిగా 'లేచిపోయిన ' రాజేశ్వరి అప్పటినుంచి ఎన్నో చర్చలకు కారణమైంది. ఇంకెన్నో ప్రశ్నల్ని రెచ్చగొట్టింది. జాతియోద్యమం నుంచి ఇప్పటి ప్రపంచీకరణ వరకూ, సంస్కరణోద్యమాల నుండి ఇప్పటి పోస్ట్ మోడర్న్ ధోరణి వరకూ ఎక్కడా యే సందర్భంలోనూ రాజేశ్వరి లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. అమె వునికి ప్రతి చర్చలోను ఏదో ఒక సందర్భంలో తప్పనిసరి కావడం అమె లేవనెత్తిన ప్రశ్నల పర్యవసానమే. అయితే, ఆ ప్రశ్నలకు జవాబులు వెతకడానికి ఇప్పటికి మన దగ్గర ఎలాంటి సాధనాలు లేకపోవడం, అందివచ్చిన సాధనాలన్ని వాటి వాటి పరిమితుల్లో రాజేశ్వరిని బంధించే ప్రయత్నం చెయడం వల్ల మొత్తంగా జీవితాన్ని, సాహిత్యాన్ని దర్శించే మన పధ్ధతిలోనే లోపం వుందని అనుకోవాల్సి వస్తోంది. ఆ లోపం ఇటీవలి పోస్ట్ మోడర్న్ పరిశీలన 'మైదానం లోతుల్లోకి....'లో కూడా కనిపించడం అసహజమేమి కాదు.

రాజేశ్వరి ఇవాళ్టికీ ఇంకా నీతి, అవినీతి, పాతివ్రత్యపు ఇనుప కచ్చడాల మధ్య సరికొత్త పోస్ట్ మోడర్న్ పనిముట్లతో విమర్శలకు గురవుతూనే వుండటం విషాదం. చలం సాహిత్యాన్ని, చలం స్త్రీపాత్రలను మొదటనీతి-అవినీతి, వివాహ వ్యవస్థ, మతం, సంఘం కట్టుబాట్ల లాంటి పునాదుల మీద చర్చించారు. తరువాత చలంసాహిత్య దృక్పథాన్ని, చలం స్త్రీపాత్రల నేపథ్యాన్ని, వారిని ఎలా అర్ధం చేసుకోవాలనే విషయాలను స్త్రీవాద దృక్కోణంతోస్త్రీవాదులు చర్చించారు. ఇప్పుడు చలం మైదానాన్ని పోస్ట్ మోడర్న్ దృక్పథం నుండి అడ్లూరు రఘురామరాజు పరిశీలనచేసారు.


ఒక వాచకాన్ని(text) ఎలా చదవవచ్చు, అక్షరం, అక్షరం శ్రద్ధగా చదవటం వల్ల వాచకాన్ని పాఠకులు మరింత బాగా ఎలాఅర్ధం చేసుకోగలుగుతారు అన్న విషయం మీద సునిశితమైన చర్చ చేశారు రచయత తన పుస్తకం 'మైదానంలోతుల్లోకి...పోస్ట్ మోడర్న్ పరిశీలన 'లో. మైదానం లోని పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాల్లోని లోతుపాతుల్ని, పాత్రల రచయత గా చలం ఆలోచనల భావధారను విశదంగా చర్చకు పెట్టారు. ఒక వాచకాన్ని ఎలా చూడాలి, రచయతను దాటి రచనను ఎలా అర్ధం చేసుకోవచ్చు లాంటి అంశాలను కూలంకషంగా పోస్ట్ మోడర్న్ దృక్పథంతోచర్చించారు. తన కృషి వెనుక దేశీయ సాహిత్య పధ్ధతుల కంటే పోస్ట్ మోడర్న్ విమర్శనా పధ్ధతి పైనే అయన ఎక్కువఆధారపడినట్టు స్పష్టంగానే కనిపిస్తుంది. మైదానాన్ని సునిశితంగా పరిశీలించేందుకు చలం ఇతర రచనల్ని మర్చిపోయేప్రయత్నం చేసారు రఘురామరాజు (ముందుమాట).



అయితే మైదానం లోని పాత్రలు ముఖ్యంగా రాజేశ్వరి పాత్రను అర్ధం చేసుకోవాలంటే చలం ఇతర స్త్రీ పాత్రలను కూడా అర్ధం చేసుకోవడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే మనకు రాజేశ్వరి పాత్ర తత్వం సంపూర్ణంగా అర్ధమై చలం రాజేశ్వరిని ఎందుకు అలా మలిచాడొ స్పష్టంగా అవగతమయ్యే అవకాశం వుంటుంది. ఇప్పటివరకు సమాజంలో స్త్రీ అంటే వున్నఅభిప్రాయాన్ని, స్త్రీత్వం, పాతివ్రత్యం అంటే వున్న నిర్వచనాల్ని, స్త్రీల విషయంలో కుటుంబం లోపలా, బైటా చెలామణిఅవుతున్న నీతిసూత్రాల్ని వీటన్నింటిని బద్దలుగోడుతూ చలం తన స్త్రీ పాత్రల్ని మలిచాడు.చలం స్త్రీపాత్రలు, వాళ్ళఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన వెనుక వున్న కారణాలు, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు అర్ధం కావటానికి మనకు వందేళ్ళ కంటేఎక్కువ కాలమే పడుతుందేమో. చలం తన స్త్రీ పాత్రల్ని సమాజం నుండి సానుభూతి కోరే పాత్రలుగా చిత్రించలేదు. చలంస్త్రీ పాత్రలు ప్రేమ లేని పెళ్ళిని ధిక్కరించి, పెళ్ళి అక్కరలేని ప్రేమను కోరుకున్నాయి. దిశగా స్త్రీల సంఘర్షణఅర్ధవంతమైందని, సహజమైందని చెప్పదల్చుకున్నడు చలం. సంఘర్షణ, అన్వేషణ అర్ధమైనప్పుడు స్త్రీలు పెళ్ళిని, కుటుంబ వ్యవస్థను ఎందుకు ధిక్కరిస్తున్నారొ, స్త్రీ విముక్తి లైంగికత్వంతోనే ఎందుకు మొదలవుతుందోఅర్ధమవుతుంది.( ఇంకా వుంది...)


( ఈ పుస్తక సమీక్ష ఈమాట లో అయిదారేళ్ళ క్రితం ప్రచురితమైంది)

3 వ్యాఖ్యలు:

భావన said...

"మైదానాన్ని సునిశితంగా పరిశీలించేందుకు చలం ఇతర రచనల్ని మర్చిపోయేప్రయత్నం చేసారు రఘురామరాజు"

ఈ ఒక్క మాట చాలు ఆయన ఈ సమీక్ష ఎలా రాసేరో.. ఇంక అవసరమా చదవటం. :-)

తెలుగు వెబ్ మీడియా said...

చలం గారిని అర్థం చేసుకోవడానికి మైదానం నవల సరిపోదు. ఈ విషయం తెలియకే కొంత మంది చలం సాహిత్యం అర్థం కాదు అంటుంటారు. నేను మైదానం చదవడానికి ముందు "స్త్రీ" పుస్తకం చదివాను. చలం గారి ఇతర రచనలు కూడా చదివాను. ఆ మధ్య కత్తి మహేష్ గారు చలం సాహిత్యం అర్థం కాదు అంటూ మైదానం నవలని ఉదాహరణగా చూపించాడు. నేను మైదానం నవల కొని చదివాను. వైరుధ్యాలని ఏమాత్రం అర్థం చేసుకోలేని మెటాఫిజికల్ దృష్టితో చదివితే ఈ పుస్తకం నిజంగా అర్థం కాదు.

కమనీయం said...

చలం రచనలు చాలా ,చిన్నతనం లోనే చదివాను. మళ్ళీ మరొక సారి కూడా చదివాను.అర్థం చేసుకొడం కష్టం కాదు.ఆయన స్త్రీలకి ప్రేమ,సెక్సు విషయంలో స్వేచ్చ ఉండాలనేది ప్రధానంగా వాదించాడు.అప్పటి పరిస్థితుల్లో అవసరమేమో గాని ,ఇప్పుడు స్త్రీలకి అన్ని హక్కులు,(ఆర్థిక,వైవాహిక.విడాకులు మొ.) ఉన్నప్పుడు లేచిపోడాలు ,వివాహేతర సంబంధాలు సరికాదు.చట్టరీత్యా తమ హక్కుల్ని వినియోగించుకోడం ఒక్కటే సరి ఐన పద్ధతి.

 
Real Time Web Analytics