నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, January 13, 2010

ఏవీ తల్లీ నిన్న మొన్నటి పండగలు?

ప్రియమైన అమ్మకు,

అక్కడి సంగతులతో నీ ఉత్తరం.

అందులో నీ బాధ కూడా వుందనుకో. నిజమే. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. మనుష్యులు మారినట్లే పండుగలూ మారిపోతున్నాయి. నిన్నటి అనుబంధాలు ఇవాళ వున్నాయంటావా? నిన్నటి కళ ఇప్పుడేది? పండగలు, పబ్బాలు, నోములు, వ్రతాల్లో కళా, కలకలం తగ్గిందన్న నీ బాధ సహజమైనదే. వున్న వూళ్ళోనే ఇంత మార్పు వుంటే, ఇంక ప్రవాసంలో ఏం చెప్పమంటావు? పుట్టిన నేలకు దూరంగా ఉన్నాం కాబట్టి ప్రతి నోమూ ఇక్కడ మిస్ కాకుండా చేసుకోవాలనుకుంటాం. అలాగే చేసుకుంటూ ఉంటాం కానీ అందుకో చాలా ముఖ్యమైనదేదో కోల్పోయినట్లు అనిపిస్తుంటుంది. ఏదో తెలియని కృతిమత్వం కనిపిస్తుంటుంది. అసలు సంక్రాంతి పండుగ మీ కాలంలో ఎలా జరిగేదో నువ్వూ, నాన్నా కథలు కథలుగా చెపుతుంటే మేం ఎంత ఆసక్తి గా వినేవాళ్లం. మరీ మీ కాలంలో లాగా కాకపోయినా
మా చిన్నప్పుడూ కూడా పండగలు బాగానే జరిగేవి.

ఇంటి ముందు పెద్ద పెద్ద గోబ్బెమ్మలతో కొలువైన రంగల్లులు , “ ఆనాటి అక్కల్లారా..చంద్రగిరి భామల్లారా..గొబ్బియల్లోగొబ్బియల్లో..” అంటూ పాటలు...హరిదాసులు, గంగిరెద్దులు, పులివేషాలు. మానింతో భోగి అంటే ఎంత హడావిడి ఉండేది. సాయంత్రం బొమ్మల కొలువులతో, పేఱంటాలతో క్షణం తీరిక ఉండేది కాదు. భోగి పళ్ళు పోసినప్పుడు వాటి మధ్యలో వేసే చిల్లర, చెరుకు ముక్కలు ఏరుకోవడం ఎంత సరదా! చిల్లర డబ్బులతో పప్పు బిళ్ళలు, పీచు మిఠాయిలు కొనుక్కోని తినడంలో ఎంత ఆనందం! సంక్రాంతి అంటే నాకు ఇప్పటికీ మన ఊరుగుర్తొస్తుంది. హరిదాసులు, గంగిరెద్దులూ, పులివేషాలూ మనం చూస్తుండగానే మాయమైపోయాయిగా! తెల్లవారుఝామునేహరిలో రంగ హారీఅన్న హరిదాసు గొంతు వినిపించగానే అతని నెత్తి మీద గిన్నెలో బియ్యం పోయడానికి నేను, శ్రీవిద్యా పోటీలు పాడేవాళ్ళం కాదా? గుళ్ళో పెట్టే చక్రపోంగాలీ, పెరుగన్నం తీసుకోవడానికి తెల్లారగట్లే లేచి పరుగెత్తుకుంటూ గుడికి వెళ్ళేటప్పుడు ధనుర్మాసపు చలీ గిలీ శరీరానికీ, మనసుకీ పట్టేవా?

ఇక్కడ మేం మొన్న మా పిల్లలకు భోగిపళ్ళు పోసాం. ఇక్కడ రేగిపళ్ళు దొరకావు కాబట్టి మాకు దొరికే చెర్రీ పళ్లతోనే కానిచ్చాం. చెర్రీపళ్ళతో పాటు క్వార్టర్ కాయిన్లు కూడా వేశాను. మాకు తెలిసిన నాలుగైదుగురు ఇండియన్ ఫామిలీస్ వాళ్ళని, వాళ్ళ పిల్లలను పిచ్చాను. వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చి కూర్చున్నారు తప్ప ఆ కాయిన్లు ఏవీ తీసుకోలేదు. పైగా వాటిని తీసుకోవచ్చని నేను చెపితే అదోలా నా వంక చూశారు. నిజానికి అక్కడైతే మన వీధిలో చిన్నపిల్లలంతా రేగిపళ్ళు, చాక్లెట్లు, చిల్లర డబ్బుల్ని పోటీపడుతూ ఎలా తీసుకునేవాళ్ళు? అంతే కాదు వాటితో మేమంతా మన వీధి చివర రాజన్ కిళ్ళీ కొట్లో చిరుతిండ్లు ఎలా కొనుక్కుతినేవాళ్ళమో నాకింకా గుర్తే.
ఏవీ ఇవన్నీ ఇప్పుడు? హరిదాసులు, గంగిరెద్దులూ, పులివేషాలు మనం చూస్తుండగానే మాయమైపోయాయిగా! ఈ కాలం పిల్లలకు అసలు గంగిరెద్దు మేళం తెలుసా? గోబ్బమ్మల్ని ఈ కాలం అమ్మాయిలు ఎంత వరకూ ఆనండించగలుగుతున్నారు? మనం ఎంత వర్ణించి చెపితే మాత్రం కళ్ళతో చూసిన అనుభవం వేరు. పుస్తకాల్లో చదువుకోవడం , సినిమాల్లో చూడటం వేరు కదా.

అసలు సంక్రాంతి కున్న మరో పేరు పెద్ద పండగ. అది అసలు సిసలు రైతుల పండగ. ఏదీ...ఎన్నేళ్ళయింది ఆంధ్రదేశంలో రైతులు అచ్చమైన సంక్రాంతి జరుపుకొని. చేతికొచ్చిన కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నాలు, ఉద్ది వాదాలు, అరిసెలు చేసుకునేవారు ఒకప్పుడు. పంచభక్ష్య పరమాన్నాలతో కాదు ఇప్పుడు పట్టెడన్నమైనా తినేస్థితిలో రైతులున్నారా? పది మందీ కలిసి సంతోషంగా చేసుకునేది పండగ. ఇరుగుపొరుగువారందరి మధ్య ఈ సమిష్టి భావన కనిపించడంలేదని నువ్వు బాధపడుతున్నావు. అక్కడే అలా వుంటే ప్రవాసం లో మాటేమిటి?

ఇక్కడున్న తెలుగు వాళ్ళంతా చేతనైన రీతిలో సంక్రాంతి, వినాయక చవితి, దీపావళీ, దసరా అన్నీ జరుపుకుంటూనే వుంటారు. కానీ ఎలా అని మాత్రం అడగకు. మనింట్లో మనం తలుపులేసుకొని భోగిపళ్ళు పోసుకుంటే, వినాయకుడ్ని పెట్టుకొని వ్రతం చేసుకుంటే అది పండగ అవుతుందా? అమ్మయ్య, భోగిపళ్ళు పోసుకున్నాము, సంక్రాంతి కి అరిసెలు చేసుకున్నాం అని సంబరపడటం కాదు కదా పండగ పరమార్ధం. ‘ మన సంక్రాంతి ‘ అంటూ మా వూర్లో సంక్రాంతి వెళ్లిన పక్షం రోజులకు ఓ సాయంత్రం ఫంక్షన్ పెట్టారు. సరేలే అని సరదా పడి వెళితే ఏముంది? పది సినిమా పాటలు...అయిదు భరత నాట్యాలు...రెండు జానపద గీతాలు. కాకపోతే మన తెలుగువాళ్ళందరం కలిశామనన్న సంతృప్తి ఉందనుకో. ఇదేనా పండగలు జరుపుకునే పధ్ధతి? అంటే ఏమో....ఎంత చెట్టు కి అంత గాలి లాగా....ఎంత ఊరు కి అంత ....అనుకోవాలేమో!

ఇప్పుడివన్నీ కేవలం మన తీపి జ్ఞాపకాలు. మన లోపలి ఊహాలు మాత్రమే. నేనిక్కడ ఇంత దూరంలో అలాంటివాటిని ఊహించలేకపోవడం విశేషం కాదేమో గానీ, అక్కడే ఉన్న నువ్వు ఇలాంటి దృశ్యాల్ని చూసి ఎంత కాలమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అన్నీ అంతే! మనలో మార్పు కి ఇవి బయటకు కనిపించే కొండగుర్తులు. మార్పు మంచికా, చెడు కా? అని ఆలోచించే వ్యవధి కూడా లేకుండా- రెప్పపాటులోఅంటామే, కచ్చితంగా అలాగే జరిగిపోతుంది. అదంతా గతించినా గతం అనిపిస్తుంది.

ఇక్కడ మేం అలాంటి గతం కోసం అప్పుడప్పుడూ వెతుక్కుంటాం. పిల్లలు ఎంత సేపటికీ క్రిస్మస్, థాంక్స్ గివింగ్, హేలోవీన్ మాత్రమే గుర్తుంచుకొని, తలచుకొని సంబరపడిపోతున్నప్పుడు మన సంక్రాంతి, ఉగాది, మన దీపావళి అని గుర్తు చేయాలనిపిస్తుంది. యానిమేషన్ల మాయాజాలానికి కళ్ళు అతికించుకొని పోయిన పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవన్నీ చెప్పాలనిపిస్తుంది. కానీ వాళ్ళు వింటే కదా? మామూలు రోజుల్లో అయితే వినరు కాబట్టి పండగ రోజుల్లోనైనా పనిమాలా అవన్నీ వాళ్ళ నెత్తిన బలవంతానా రుద్దాలనిపిస్తుంది. నువ్వు చేసిన పధ్ధతిలో అన్నీ చేయాలనుకుంటాను. సంక్రాంతి పండక్కి అలాగే చేయబోయాను. చెర్రీలు నెత్తిన వేస్తే, చిన్నూ నా వైపు జాలిగా చూశాడు. వాడికి అందులో ఈ సరదా కనిపించలేదు. ఆ టైం లో వాడి టీవీ షో మిస్ అయ్యామన్న బాధ తప్ప. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూర్చుంటే, ఒక్క క్షణం మనసు కుదురు గా ఉంటే కదా? ఎందుకంటే నవగ్రహ పూజకు కనీసం వక్కలు కూడా దొరకలేదు. సాయంత్రం పూజకు రావడానికి ఈ మైనస్ డిగ్రీల చలిలో ఎవరికి కుదురుతుంది? బంధువులో, స్నేహితులో, కనీసం పూజ చేయించే బ్రాహ్మణుడు కూడా లేకుండా క్యాసెట్ పెట్టుకొని మనసు తృప్తీ కోసం ఏదో అయిందంటేఅయిందనిపించాం వ్రతాన్ని. ఇలా వుంటాయమ్మా ఇక్కడి పండగలూ, వ్రతాలు.

పల్నాడు కి, బెజవాడ కీ ఎంత దూరమో, బెజవాడకీ అమెరికా కీ అంతే దూరం. ఈ దూరాన్ని నువ్వు ఒక్కసారి మానసికంగా కొలిచి చూడు. పల్నాడులో వున్నట్లు నువ్వు బెజవాడ లో వున్నావా? మేం బెజవాడ లో వున్నట్లు ఇక్కడ వుండగలమా? ఉండలేం. మార్పుని ఎలా చెప్పాలి? అసలు మార్పు గమనించే స్థితి మనకి ఉంటుందా? కొన్ని సార్లు కొన్ని కలలో వచ్చి మాయమైపోయినట్లు ఉంటాయి. ఇంటి ముందు తులసి మొక్క ఒక కల. హరిదాసు వచ్చి వెళ్ళిపోవడం ఒక కల. అవి ఒకప్పుడు నిజాలు.

ఇప్పుడు మాత్రం చటుక్కున వచ్చి వెళ్ళిపోయే జ్ఞాపకాలు
అందుకే దూరాన్ని కొలవాల్సింది భౌగోళీకంగా కాదు. మానసికంగా!

దూరానికి ఎల్లలు దేశాల మధ్య లేవు. మనలోనే ఉన్నాయి. నిన్నటికీ ఇవాళ్టికీ ఎంత దూరం! మారకుండా వుండటం మనిషి కి వీలు కాదు. కదలని కొండలు కూడా కాలంతో పాటు మారతాయి. ఇక ఎప్పుడూ చలించే, ఆలోచించే మనిషి మారకుండా ఉందడం అసాధ్యం. కానీ అప్పుడప్పుడూ మార్పు ఎక్కడ మొదలై ఎటు పోతుందో చూసుకుంటే మనకే ఆశ్చర్యం గా ఉంటుంది. నిన్నటి బాధగా ఉంటుంది.
సరే, ఇక ఉంటానమ్మా,
నీ
చిన్ని.

8 వ్యాఖ్యలు:

independent said...

మంచి రచయితలైన మీరు కూడా ఈ టిపికల్ నోస్టాల్జియా స్టఫ్ రాస్తే ఎలా అండీ. మిగతా వాళ్ళతో పోలిస్తే మీ మీద మాకు కొంచెం అంచనాలు ఎక్కువుంటాయి.

Kalpana Rentala said...

ఇండిపెండెంట్ గారు, మీ వ్యాఖ్య నాకు అర్ధమైంది. నాకు ఇక్కడ ఒక లెవెల్ వుందని తెలిసి సంతోషించాను. ఇక వ్యాసం విషయానికి వస్తే, ఇది కొన్ని ఏళ్ల క్రితం ఒక కాలమ్ కోసం రాసింది. సంక్రాంతి కోసం రాసిందికదా అని మళ్ళీ కంపోజ్ చేసి పెట్టాను. మీకు నచ్చినట్లు లేదు. మీరు నిష్కర్షగా చెప్పటం బావుంది. కానీ లోకోభిన్న రుచి కదా...

భావన said...

బాగుంది కల్పన సంక్రాంతి సంబరాలను కోల్పోయిన బాధా వీచిక. నిజమే కదా దూరన్ని భౌతికం గా కంటే మానసికం గా కొలిస్తే సంక్రాంతి కి అందరం ఎప్పుడో దూరమై పోయాము. నేనైతే థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటూనే పని లో పని గా నాలుగు అరిసెలు చేసి కార్న్ గిన్నె పక్కనే పెడతాను, మరి మనకు ఇక్కడ అదే కదా పంటల పండగ. ఎక్కడుంటే అక్కడే. సంక్రాంతికి ఇండియా లో ఐనా ఎంత మంది విష్ణు సహస్రనామం చదువుకుని దండం పెట్టుకుంటున్నారు చెప్పండి.

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

సిరిసిరిమువ్వ said...

"కదలని కొండలు కూడా కాలంతో పాటు మారతాయి"..నిజం బాగా చెప్పారు. ఇప్పుడు పండగ ఇక్కడే వెలవెలబోతుంది..ఇక మీ దగ్గర చెప్పేదేముంటుంది?

ఈ నాస్టాల్జియా రుగ్మత మీకు కూడా ఉందన్నమాట!

జయ said...

మీరు కోల్పోతున్న సంతోషాలను తలచుకుంటే బాధగా ఉంది కల్పన గారు. ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో ఈ కళ తగ్గలేదనే నా అభిప్రాయం. మా ఫ్రెండ్ రాజోలులో తన పండుగ అనుభవాలు చెప్తుంది. అసలైన పండుగ అంతా చూపిస్తుంది. ఇక్కడ హైద్రాబాద్ లో కూడా ఈనాటికీ, రకరకాల పండుగల వైభవం నాకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు అక్కడ బొమ్మలకొలువు చేయవచ్చు. ముగ్గులు వేయవచ్చు. ఇలా ఎన్నో చేసుకోవచ్చు. మీ బాధను మీరే వీలైనంతవరకు తగ్గించుకొని, అక్కడే మన సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షిస్తూ మెల్లగా అందరికీ తెలియజేయండి. మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Kalpana Rentala said...

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
భావన, ఇక్కడా, అక్కడా అని లేదు. అన్నీ చోట్ల మారి పోయింది. దూరం గా వున్నామని బాధతో ఇక్కడే బాగా చేసుకుంటున్న సందర్భాలు కూడా వున్నాయి.
సిరిసిరిమువ్వ, మీరు నా బ్లాగ్ లోకి సంక్రాంతి శుభసందర్భంలో అడుగుపెట్టారు. సంతోషం.
సిరాకదంబం రావు గారు, మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తపాళీ గారి పుస్తకం విడుదల సందర్భంగా మీరు రాసిన పోస్ట్ చూసాను.
జయా, ఇక్కడ కూడా మీరు చెప్పినవన్నీ చేసుకోవచ్చు. చాలా మంది చేసుకుంటూ వుంటారు కూడా. ఎంత చేసినా నాకైతే ఏదో ఒక చెప్పలేని వెలితి కనిపిస్తుంటుంది. అది బాధో, అసంతృప్తి నో కాదు.దూరం గా వున్నామన్న ఫీలింగ్ అనుకుంటాను.

BHARAT said...

rajan killi shop anTe Satynarayanpuram lo untundi adenemo

 
Real Time Web Analytics