నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, October 09, 2010

మధుర మీనాక్షి- కథ ముగింపు

ఈ కథ గురించి రాసిన తొలి పలుకులు ఇక్కడ చదవవచ్చు.

కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.

మొదటి సారి ఈ కథ చదవటం పూర్తి చేసినప్పుడు నాకు కూడా వెంటనే అర్థమైనట్లు అనిపించలేదు. మీనాక్షి తో ఆ రాత్రి అతనికి కలిగిన అనుభవం ఒక భ్రాంతి నా? లేక వాస్తవమా? అది ఒక కలనా? ఆ కలయిక జరిగిందని వూహించుకున్నాడా? నిజంగా జరిగిందా?

మొదట నిజంగా జరిగిందనుకుందాము....నిజంగా జరిగితే అనుభవం తాలూకు అనుభూతి గుర్తుండి అసలేం జరిగిందో ఎలా గుర్తుండకుండా వుంటుంది? ఎంత గొప్ప అనుభూతికి లోనైనా అతను మీనాక్షి ఇంటి నుంచి హోటల్ కి ఎలా నడిచోచ్చాడో కూడా ఎలా గుర్తుండకుండా వుంటుంది? అతను ఆమె తో పొందాను అనుకుంటున్న అనుభవం అసలు భౌతికమైనదా? లేక కేవలం మానసికమైనదా? అది లైంగికపరమైన కలయికనా? ఇలా అనేకానేక సందేహాలు వస్తాయి.

రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో అది అక్షరాల్లో , పదాల్లో, వాక్యాల్లో , ఒక అనుభవం గా , ఒక గాఢమైన అనుభూతి గా మన ముందు వుంది. అక్కడితో రచయిత పాత్ర అయిపోయింది. మిగిలింది పాఠకుడి పాత్రే. అక్కడ చెప్పిన దాన్ని, చెప్పకుండా వదిలేసిన దాన్ని బట్టి సొంత వూహాలతో కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.

మొదటి సారి చదివినప్పుడు ( ఎన్ని సంవత్సరాల క్రితమో గుర్తు లేదు) నాకు కథ పూర్తి కాగానే సంపూర్ణం గా అర్థం కాకపోయినా రచయిత చాలా బాగా రాశారు అనిపించింది. ఆ బాగా రాయటం కొంచెం సంక్లిష్టం గా చెప్పటం వల్లనా, లేక అర్థమై కాకుండా వదిలేయటం వల్ల వచ్చిన ఒక సొగసు వల్లనా? లేక మన మామూలు పరిధులకు అర్థమైనా కాకపోయినా రచయిత ఒక తాత్త్విక పరిధిలో ఈ కథను చెప్పారన్న మామూలు అవగాహన కలగటం వల్లనా ? ఏమో తెలియదు. ఇదీ అని చెప్పలేని కారణం. ఇలా చాలా రకాలా కారణాల వల్ల ఈ కథ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఇలా నాకు నచ్చిన , లేదా నేను మెచ్చిన కథల్ని పరిచయం చేయటం కోసమే కథానుభవం శీర్షిక ప్రారంభించాను.

మళ్ళీ ఈ కథ ఇప్పుడు సంపాదించినప్పుడు , మొదటి సారి చదివినప్పుడు ఏం అర్థమైంది అన్నది అసలు మనసు లో లేకుండా ఇప్పుడే మొదటి సారి ఈ కథ చదువుతున్నట్లు మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక మళ్ళీ అదే అనుభవం. ఏం చెప్తున్నారు? అని. వెనక్కూ, ముందుకూ మళ్ళీ మళ్ళీ చదివాక ఒక చిన్న విషయం ఏదో అర్థమైనట్లు అనిపించింది. ఈ ముగింపు ని ఎలాగైనా చెప్పుకోవచ్చు.

నా అవగాహన తప్పో, వొప్పో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఇది కేవలం నాకు కలిగిన అనుభూతి. మీకు కూడా ఇలాగే అనిపించవచ్చు. వేరేలాగా అనిపించవచ్చు. ఎలా అనిపించినా కరెక్టే అని నేననుకుంటున్నాను.

ఆ రాత్రి కథకుడు పొందిన భౌతికానుభవం మానవ మీనాక్షితోనే అయినప్పటికీ మానసికంగా ఆ సమయం లో అతని మనస్సు ఆలయం లోని మీనాక్షి పై లగ్నమై వుంది. అందువల్లనే అతనికి అదొక అనిర్వచనీయమైన అనుభవంగా , తనను తాను మర్చిపోయేంత గాఢమైన అనుభవంగా మిగిలింది. ఆ అనుభవం లో అతను మిగలలేదు. అనుభవం ఒక్కటే మిగిలింది. అందుకే అతనికి ఆ సమయం లో మీనాక్షి ఏం మాట్లాడిందో , అసలు ఏమైనా మాట్లాడిందో లేదో కూడా తెలియలేదు. తను హోటల్ రూమ్ లోకి వచ్చి ఒక నిద్ర లోకి వెళ్లక హోటల్ సర్వర్ వచ్చి రాత్రి ఎనిమిది గంటలప్పుడు లేపితే మెలకువ వచ్చింది. సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకూ అంటే వున్నది దాదాపు ఒక రెండు, మూడు గంటలు.

ఈ రెండు మూడు గంటల్లో ఏం జరిగిందో కొన్ని వివరాలు ఇచ్చారు రచయిత. నిజానికి ఇలా వాక్యం వాక్యం తీసి వివరణ ఇచ్చుకుంటూ పోతే ఆ కథ లోని సౌందర్యం మొత్తం విరిగిన అద్దం ముక్కల్లాగా కనిపించటం తథ్యం. ఈ తాత్త్వికమైన ముగింపు ని ఎవరికి వారు అర్థం చేసుకోవటం సులువు కానీ ఇలా చెప్పటం అంటే అందులోని ఆనందాన్ని ఇలా భాగభాగాలుగా చేయక తప్పటం లేదు.అందుకు క్షమించాలి.
అతను కలిసింది దేవాలయం లోని మీనాక్షి తో అని నేను స్పష్టం గా అనుకోవటానికి...నాకు లభించిన వివరాలు...

మీనాక్షి చనిపోయింది అని జ్నానాంబ చెప్పగానే అతనికి బాధ, దుఃఖం కలగకుండా ...మాయ గా ఆశ్చర్యం గా అనిపించింది. ఎందుకలా?
ఫోటో లోని మీనాక్షి కి, అతను తన అంతఃచక్షువులతో చూసిన ఆమె అద్భుత సౌందర్యానికి అసలు ఏ మాత్రం పోలికలే కనిపించలేదు.

మీనాక్షి తో కథకుడు తన అనుభూతి ని ఆమె మరణం తర్వాత తర్కించుకొని చూసినప్పుడు అతనికి గుర్తున్నదల్లా పుష్కరిణి దగ్గర ఆమె చెప్పిన అద్వైతం మాటలే. ఆమె ఇంటి దగ్గర కథకుడు తనని గురించి తాను చెప్పకున్నాడు తప్ప మీనాక్షి వివరాలేమీ చెప్పిన గుర్తు లేదు.

కథకుడు ఆమె మరణాన్ని కథలో ఎక్కడా మృత్యువు గా, మరణం గా ఒక్కసారి కూడా పేర్కొనకపోవడం...ఆమె దగ్ధమై, అంతర్ధానమై పోయింది అంటాడు . అలాగే జ్నానాంబ చెప్తున్న మీనాక్షి కి , తన స్వానుభవం లో తన అనుభూతి లో సత్యమై నిలిచిన మీనాక్షి కి ఎక్కడా పోలిక లేదని కథకుడు స్పష్టం గా గుర్తించగలగటం.

జ్నానాంబ ఇంట్లో అద్దెకుంటున్న ఫిలాసఫీ లెక్చరర్ , స్వయంగా అద్వైతీ, కథకుడి కి అద్వైతానుభూతి ని విశదం గా వివరించి చెప్పిన మీనాక్షి సాక్షాత్తూ ఆ అమ్మవారి భౌతిక స్వరూపమే. కనీసం కథకుడి అనుభవం వరకూ. తామిద్దరి కలయిక లో ధార్మిక విచికిత్స పొడచూపనే లేదు అని కథకుడి ద్వారా స్పష్టం గా చెప్పించిన దాన్ని బట్టి కథకుడు మధుర మీనాక్షి లో ఒక శృంగార స్త్రీమూర్తి ని చూశాడు. అమ్మవారిని అలా చూడటం అనేది సర్వ సాధారణం కాదు కానీ అసాధారణం కూడా కాదు. మీరా కృష్ణుడిని భర్తగా ఆరాధించటంలో, శ్రీరంగనాథుడ్ని గోదా దేవి ప్రేమించడం లో లేని అభ్యంతరం మీనాక్షి దేవి ని ఒక సంపూర్ణ స్త్రీ గా ఒక పురుషుడు చూడగలగటం లో ఉండనక్కరలేదు. అది ఒక రకమైన తంత్రసాధనేమో కూడా.

లోకాలనేలే ఒక అమ్మ గా కాకుండా మధుర మీనాక్షి ని కథకుడు ఒక అద్భుత సౌందర్య రాశి గా ఆమె లోని అపూర్వమైన సౌందర్యాన్ని ఛూశాడు, ఆమె పట్ల ఒక లైంగికేచ్చ ను కలిగి వున్నాడు అన్నది ప్రధానంగా రచయిత ఈ కథ లో ప్రతిపాదించదలుచుకున్న విషయం . అది ఎంత మాత్రం తప్పు కాదు అని చెప్పటం తో పాటు, దానికొక అద్వైత తాత్త్వికత ను కూడా జోడించి అందించారు.
కథలోని ప్రతి వాక్యం ఎంతో ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా వుంది.

మీనాక్షి అతనికి చేసిన బోధ ఒకటే. ఇద్దరు మీనాక్షులు లేరు.ఉన్నది ఒకటే. అందుకే కథకుడు మానవ మీనాక్షి తో లైంగికంగా కలిస్తే అతను అమ్మవారితో ఐక్యం చెందినట్లు అనుభూతి చెందాడు. అంత మధురమైన అనిర్వచనీయమైన సుఖాన్ని పొందాక అతను ఒక రాత్రి ఒక పగలు అలా మత్తుగా నిద్రపోతున్నప్పుడు కథకుడికి ఒక కల వస్తుంది. అతను చనిపోయినట్లు వచ్చిన కల అది. ఆ అనుభవం ద్వారా అతను తాను ,తన శరీరం వేరు అన్న భావం నుండి ఆ రెండూ ఆ అనుభవం తో, ఆ అనుభూతి తో, ఆ అనుభూతి ప్రసాదించిన మీనాక్షి అనే స్వస్వరూపం తో ఏకమైపోయాడు అని రచయిత ప్రతీకాత్మకం గా చెప్పాడు.

కథలోనే ఒక చోట చెప్పినట్లు ఆశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దాని ద్వారానే పొందటం సాధ్యమవుతుంది. ఆశాశ్వతమైన మీనాక్షి ద్వారానే కథకుడు శాశ్వతమైన దేవత ని పొందగలిగాడు.ఆ తాదాత్మ్యాన్ని చెప్పటమే మొత్తం మధుర మీనాక్షి కథ.

వున్నవి రెండు కాదు, ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ఒక కథలో ఇంత చక్కగా, ఇంత అందంగా చెప్పగలగటం మామూలు రచయితల వల్ల జరిగే పని కాదు. ఫిలాసఫీ ని జీవితమంతా అధ్యయనం చేసి పాశ్చాత్య, భారతీయ తత్త్వ శాస్త్రాలకు ఒక అనుసంధానం చేయాలని జీవితమంతా తపించి అందుకోసమే కృషి చేసి తన రచనలన్నింటి ద్వారా తాను నమ్మిన, తాను అవగతం చేసుకున్న ఫిలాసఫీ ని అందించే ప్రయత్నం చేసిన ఆర్. ఎస్. సుదర్శనం లాంటి రచయిత మాత్రమే రాయగలిగిన కథ మధుర మీనాక్షి. మళ్ళీ అలాంటి కథ తెలుగు లో మరొకటి వస్తుందన్న నమ్మకం లేదు కానీ వస్తే మంచిదే.


13 వ్యాఖ్యలు:

భాను said...

excellent review

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు. ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్య భారతి పాటల్లో తరచు ఆయన ప్రేయసిగా కనిపించే "కణ్ణమ్మ" కూడా ఆయన కృష్ణభక్తికి ప్రతిరూపమే అని కొందరు విశ్లేషకులు భావిస్తారు.

కొత్త పాళీ said...

ఈ కథని నేను మొదట కాలేజిలో ఉండగా చదివాను. అప్పటికి అద్వైతం అంటే ఏవిటో కూడా తెలీదు. అంచేత కథలోని లోతైన తాత్త్విక చింతన మనసుకి ఎక్కే అవకాశం అసలే లేదు. కానీ కథ బాగా గుర్తుండి పోయింది. కథలో ఆయన మీనాక్షిదేవిని వర్ణించిన తీరు నిజమాకాదా అని నిర్ధారణ చేసుకోవాలనే కుతూహలంతోనే మీనాక్షి ఆలయాన్ని దర్శించాను అన్నా అతిశయోక్తి కాదు. ఆయన వర్ణనలో ఆవగింజంతైనా అబద్ధం లేదు. మీనాక్షీదేవి మూర్తి జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దివ్యసౌందర్యంతో వెలిగిపోతూ ఉంటుంది.

మనలోమాట, తెలుగుకథని సీరియస్‌గా చదివే పాఠకుల్లో అయినా అద్వైతాన్ని అంతగా తెలిసినవాళ్ళు ఎంతమంది ఉంటారు అంటారు? అంచేత, అద్వైతాన్ని తెలియకపోయినా, స్పందించగల పాఠకుల్లో ఒక అనిర్వచనీయమైన గొప్ప భావనని కలిగించే గుణం ఏదో ఈ కథలో ఉన్నది.

అదలా ఉండగా మీ విశ్లేషణ బహు గొప్పగా రాశారు.

Kalpana Rentala said...

కొత్తపాళీ,

నేను ఇంకా మధుర మీనాక్షి ని చూడలేదండీ.

నాకిప్పటికీ అద్వైతం amte తెలియదండీ :-)

శ్రీలలిత said...

కల్పనగారూ,
మథుర మీనాక్షి కథ పై మీ విశ్లేషణ అద్భుతంగా వుంది. మీ విశ్లేషణకు నా జోహార్లు.
కథ చదువున్నంతసేపూ ఆ కథతో పాటు నేనూ సాగిపోయాను. రైల్లో మథురకి వెళ్ళి, అక్కడ మీనాక్షీదేవి సౌందర్యాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగించింది. ఇది నిస్సందేహంగా ఆ కథయొక్క గొప్పతనమే.
అంత మార్మికంగా కథ చెప్పగలిగినవారు కనుకనే ఆర్.ఎస్.సుదర్శనంగారు అంత గొప్ప రచయిత అయ్యారు.

మరింక వ్యక్తిగతంగా చెప్పవలసివస్తే అదేమిటో మథురమీనాక్షీ అమ్మవారిని అలా శృంగారమూర్తిలా చూపించటం నాకు బాగా అనిపించలేదు. బహుశా నేను పెరిగిన వాతావరణం అందుకు కారణం కావచ్చు. కంచి కామాక్షీ, మథుర మీనాక్షీ, కాశీ విశాలాక్షీ, బెజవాడ కనకదుర్గ లాంటి వారి పేర్లు తలచుకోగానే మనలను ఆదరించి, అక్కున చేర్చుకునే అమ్మే గుర్తొస్తుంది. కృష్ణుని పట్ల మీరాబాయి భక్తయినా, శ్రీరంగనాధునిపట్ల గోదాదేవి ప్రేమయినా భగవంతునికి భక్తుడు తనను తాను అర్పించుకునే ఒకానొక ప్రక్రియలా కనిపిస్తుంది తప్పితే వేరే విధంగా ఆలోచన పోదు. కాని మీనాక్షీదేవిని శృంగారమూర్తిగా భావించడం నా మనసు అంగీకరించలేదు.
మరి అద్వైతం సిధ్ధించాలంటే అంతకన్న మరో మార్గం లేదంటే ఎవరూ ఏమీ చెప్పలేరు కాని, అలా కాకుండా వేరే విధంగా ఉత్తమపురుషలో చెప్పబడిన ఈ కథని సమర్ధించడానికి నాకు ఏమైనా దారి దొరుకుతుందా అని ఈ కథని ఒకటికి రెండుసార్లు చదివాను. నాకు తోచినదిది. దీనిని మనస్తత్వశాస్త్రప్రకారం విశ్లేషించుకుంటే ఎలా వుంటుందీ.. అనుకుంటే..ఇదిగో..ఇలా వుంది.. నా ఆలోచన.
కథలో నాయకునికి దక్షిణాదికి, ముఖ్యంగా మథురకు వెళ్ళాలనిపించింది. ఎందుకు? ఎందుకో ఆయనకే తెలీదు. కారణం ఆయన లోపల ఆయనకే తెలియకుండా జరుగుతున్న మానసిక మథనం.
ఇక్కడ ఈ పాత్ర గురించి కొంచెం చెప్పుకోవాలి. భార్య పోయి రెండు సంవత్సరాలయింది. నలుగురు పిల్లలూ ఆయనకి దూరంగా బోర్డింగ్ స్కూళ్ళలో వుండి నిక్షేపంగా చదువుకుంటున్నారు. గౌరవంగా గడిచిపోతున్న జీవితం. యాంత్రికత ఏర్పడిపోయి ఒక్కొక్కసారి తనలోకి తనే ముడుచుకునిపోయే తత్వం. చుట్టూవున్న మనుషులనుంచి దూరంగా ఎక్కడికైనా పోవాలనే తపన. ఎక్కడికని ఆలోచన వస్తే ఎవరికైనా చెప్పడానికయినా గౌరవంగా వుండేది పుణ్యక్షేత్రాల సందర్శన. ఆ పుణ్యక్షేత్రాలాన్నింటిలోనూ మథురయే ఎందుకు ఎంచుకున్నాడంటే, అప్పటికే స్నేహితుని పరిచయ వాక్యాల వలన మథుర పట్టణం, మీనాక్షీ ఆలయం ఆయన మెదడు లోపలి పొరల్లో వుండిపోయినవి తట్టిలేపినట్టు లేచాయి.
ఎవరికైనా సరే దేనినైనా వర్ణించి చెపుతున్నప్పుడు దానిని చూడాలనే కోరిక మనసులో పుడుతుంది. అది తెలీకుండానే ఆయన మనసులో వుండిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అన్న ఆలోచన వచ్చేసరికి అది ....p-1

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

అది పైకి లేచింది. మథురకే ప్రయాణమయ్యాడు. ఎవ్వరినీ వెంట తీసుకుపోయే వుద్దేశ్యం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దృష్టిలో తన ప్రవర్తన చూసుకోవలసిన అవసరం పడవచ్చు. అందుకని ఒక్కడే బయల్దేరాడు.
ఇక్కడ రైల్లో రచయిత ఈ విషయాన్నే మరీ స్పష్టంగా చెప్పారు. ఎదుటివారిని గమనించినప్పుడు కలిగిన గమ్మత్తయిన అనుభవాలని వివరించారు. ఒక మనిషి తల్లీ, తండ్రీ, భర్తా, భార్యా పక్కన వున్నప్పుడు ప్రవర్తించే తీరుకీ, వారు పక్కన లేనప్పుడు ప్రవర్తించే తీరుకీ గల భేదాన్ని చక్కగా చూపించారు. ఇది మనస్తత్వశాస్త్రం లో చెప్పబడినదే. అంతే కాక మనుషులు పైకి ఒకలాగ, లోపల మరొకలాగ వుంటారని కూడా ఆ శాస్త్రం లో చెప్పబడింది.
స్టేషన్ లో దిగాక బండివాడు "రాయల్ లాడ్జ్"కి తీసుకెడితే ఈయనకి కృష్ణదేవరాయలు గుర్తొచారు. "రాయల్ లాడ్జ్", మినర్వా లాడ్జ్" అన్నవి సర్వ సాధారణమైన పేర్లు. అవి ఇంగ్లీషు పేర్లు అయినప్పుడు ఆయనకి మన తెలుగు కృష్ణదేవరాయలు ఎందుకు గుర్తొచ్చారు? అంటే ఆయన మనసు ఎక్కడో పాత పాత రోజుల్లోకి వెళ్ళిపోతోందన్నమాట.
మరింక కథానాయకునికి ఆవిడను చూస్తే మీనాక్షీదేవి లాగ అనిపించిందని చెప్పారు. విగ్రహమన్నది ఒక శిల్పి ఊహలోంచి బయటపడ్డ కల్పిత ప్రతిమ. అలాగ మనుషులుండడానికి అవకాశమే లేదు. మరి ఎందుకలాగ అనిపించిందీ అంటే నా అభిప్రాయం ప్రకారం..
మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయనకి అమ్మవారి దర్శనం దగ్గరగా చేసుకునే సందర్భం పడలేదు. మనం భౌతికంగా దర్శించలేనిది వూహల్లో చిత్రించుకుంటాం. ఇప్పటికి కూడా చాలామంది సాధారణంగా అనేమాట.. "ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా వుంది" అనేది. కాని నిజంగా ఎవరైనా లక్ష్మీదేవి ఎలా వుంటుందో చూసిన వాళ్ళున్నారా అంటే లేరు. మరి అలా ఎందుకన్నారంటే లక్ష్మీదేవి చాలా అందంగా, కళకళలాడుతూ, చిరునవ్వుతో, చూడగానే "ఓహో" అనిపించేలా వుంటుందని వూహల్లో చిత్రీకరించుకోవడం వలన , కాస్త కళకళలాడుతూ, నవ్వు ముఖంతో ఎవరైనా అమ్మాయి కనిపిస్తే,"లక్ష్మీదేవిలా వుంది" అనేస్తారు. సరిగ్గా అదే జరిగింది ఈ కథలో పాత్ర విషయంలో కూడా. ఎంతో సౌందర్యవంతురాలని స్నేహితుడు వర్ణించిన మీనాక్షీ అమ్మవారి రూపాన్ని ఎదురుపడ్డ యువతిలో వూహించుకుని ఆ అమ్మాయి కోసం వెదుకులాట మొదలుపెట్టాడు.
ఇక్కడ మనం మరో విషయం మర్చిపోకూడదు. ఆయన భార్య పోయి రెండు సంవత్సరాలయింది. అప్పటినుంచీ ఆయనకు ఎవరితోనూ సంబంధంలేదు. కాని భార్య బ్రతికున్నప్పుడు అటువంటి అనుభవాలున్నట్టు తెలిపారు.
మనిషికి భౌతిక శరీరం వున్నన్నాళ్ళూ ఆహార, నిద్రా, మైధునాలు అవసరాలే. వాటిని జయించడం మనస్సుని నియంత్రించుకోవడం వలననే సాధ్యం. అది కేవలం యోగీశ్వరులకే తప్పితే సంసార బంధాలలో వుండి, పిల్లల బాధ్యతలున్నవాళ్లకి ఆ అద్వైతానుభవం కలగడం కష్టం. అందుకనే ఆయన మీనాక్షితో కలిగిన అనుభవం ద్వారానే అద్వైతానుభూతి పొందినట్లు వూహించుకున్నారు. కేవలం అది ఆయన ఊహ మాత్రమే అనడానికి నిదర్శనం ఏమిటంటే తర్వాత లెక్చరర్ మీనాక్షి ఫొటోకి, ఆయన ఊహించుకున్న మీనాక్షికి పోలికలు కనపడకపోవడం. అది పూర్తిగా ఆయన మనస్సులో జరిగిన ప్రక్రియే.
అందుకే తనను ఎవ్వరూ గుర్తుపట్టని చోటు కనకే అంత స్వతంత్రంగా ఆమె వెనకాల వెళ్ళగలిగారు. అదే ఆయన వూరయితే ఎవరైనా తెలిసినవారు కనిపిస్తారనే భయం తో చాలా నియంత్రణతో వుంటారు. మనిషికి మధురానుభూతి కావాలి. కాని దానిని సమర్ధించుకోగలిగే మానసిక స్థైర్యం కూడా కావాలి. ఆ మానసిక స్థైర్యం లేనప్పుడు తనకి దొరికినదానినే తనకు కావలసినదిగా ఆ మనిషి వూహించుకుంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. తనకు చేరువైన మనిషిని తను ఆరాధించే పవిత్రమైన మీనాక్షీదేవి రూపానికి అన్వయించుకున్నారు. ఎందుకంటే తను చేస్తున్నది పాపపు పని కాదని, పవిత్రమైనదని తనను తను నమ్మించుకుందుకు దేవి రూపాన్ని ఆయన వూహించుకున్నారు.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

ఇక్కడ నిజంగా జరిగిన విషయం ఒకటి చెపుతాను. సుమారు ముఫ్ఫైయేళ్ళక్రితం ఒక పల్లె పట్నం కాని వూరికి మా నాన్నగారికి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కలిసి మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఎక్కడికని వాళ్ళు వచ్చాక మా అమ్మగారు అడిగితే పరవశంగా నమస్కారం పెడుతూ, శ్రీకృష్ణుని రాసలీలలు చూడడానికి వెళ్ళాం అన్నారు. ఏమిటని అడిగితే ఇలా వివరించి చెప్పారు. ఆ పక్కవీధిలో ఒక భార్యా, భర్తా వున్నారుట, మధ్యాహ్నం పూట వాళ్ళిద్దరూ ఒకే గ్లాసులోంచి కాఫీ తాగుతారుట. అదికూడా చుట్టూ జనం వచ్చాక, వాళ్ళ ముందు గదిలో, వుయ్యాలలో కూర్చుని , అందరూ దండాలు పెడుతుంటే వాళ్ళు ఒకే గ్లాసులోంచి కాఫీ తాగుతారుట. అవి శ్రీకృష్ణుని లీలలని వాళ్ళు చెప్పారుట. ఈ ఆడవాళ్ళు వెళ్ళి చూసి వచ్చారుట. ఆ రోజుల్లో నాకేమీ అర్ధం కాలేదు. మా నాన్నగారిని అడిగితే, అది ఒక రకమైన మానసిక ప్రవృత్తి అని చెప్పారు. నాకు ఆ రోజుల్లో ఏమీ తెలీదు కనుక వాళ్ళు పిచ్చివాళ్ళనుకుని వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే భయపడి పారిపోయేదాన్ని. తరవాత దాని గురించి ఆలోచిస్తే అనిపించింది. ఆ భార్యాభర్త లిద్దరికీ ఒక గుర్తింపు కావాలి. గుళ్ళచుట్టూ తిరుగుతుండే పెద్ద వయసున్న ఆడవాళ్ళు వాళ్ళ మాటలని నిజమని అనుకునేవారు. ఆ భార్యాభర్తల అనుభవం గొప్పదా... ఈ ఆడవారి అనుభూతి గొప్పదా అంటే నాకు ఈ ఆడవారి అనుభూతే గొప్పదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా చూడలేని రాసలీలల్ని చూడగలుగుతున్నామన్న భావన ఎంత గొప్పది?
అలాగే ఇక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక అలౌకికమైన అద్వైతానుభూతిని అందుకోవడానికి ప్రయత్నం జరిగింది. దానిని భౌతికంగా పొందుతున్నప్పుడు కూడా ఆయన ఈ ప్రపంచంలో లేనట్లే అనుభూతి చెందారు. ఆ అనుభూతి ఆయనకు విపరీతమైన మానసిక స్థైర్యాన్నిచ్చింది.
ఆయన పొందిన భౌతికమైన అనుభవాన్ని అలౌకికమైన అనుభూతిగా అనుకుంటే తప్పితే ఆయన మనసుకు తృప్తి వుండదు. అందుకే ఆయన మనసంతా మీనాక్షీదేవినే నింపుకున్నారు. అలా నింపుకున్నారు కనుకనే ఆయనకు ఆ అనుభూతి కలిగింది.
ఆ అద్భుతమైన అనుభవం తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదన్నారు. అంటే భౌతికంగా ఆయన హోటల్ కి వచ్చి, భోంచేసి పడుకోవడం లాంటివి తల్చుకోవడం ఆయన మనసు ఇష్టపడలేదు. అందుకనే అవెలా జరిగాయో తెలీదన్నారు. మనసుకే ప్రాముఖ్యం ఇచ్చారు కాని నిజంగా జరిగిన విషయం ఆయన మనసు దాకా చేరనివ్వలేదు. కేవలం యాంత్రికంగా ఆయన హోటల్ కు తిరిగొచ్చినట్లు మనం అనుకోవాలి.
అంతలోనే మనసుకి మరో వైపు. తను చనిపోయినట్లు ఒక కల లాంటి భ్రాంతి. ఆఖరి కూతురు గిరిజ ఏడుపు. అంటే ఆయన మనసులో అడుగున ఎక్కడో చిన్న పిల్లలు ఏమయిపోతారన్న దిగులుందన్నమాట. లేకపోతే అక్కడ రచయిత ఆ దృశ్యాన్ని ఎందుకు కలగా చూపించినట్లు? అద్వైతానికి, ఆ కలకీ సంబంధం ఏమిటి?
ఇక్కడ మరొక్క మాట. మీనాక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరూ అద్వైతాన్ని గురించి చర్చించుకుంటారు. అందులో వైరాగ్యమంటే జీవితానుభవాలను వదులుకోవడం కాదన్నట్లు, మనిషి ఊహకే ప్రాధాన్యమన్నట్లూ మాట్లాడుకుంటారు. అలా భౌతికంగా మాట్లాడుకున్న మాటలు కథానాయకుని మనసుకి తాకి, తను చేస్తున్న పని ఊహల్లో పవిత్రంగా వుంది కనుక తప్పు పని కాదని మనసుని సమాధానపర్చుకోవడమనిపిస్తుంది.
కాని మర్నాడు ఆ అనుభూతి బాగుందనిపించి ఆమెను తనతో తన ఊరు తీసికెళ్ళాలనుకుంటాడు. భౌతికంగా సుఖం కోరుకునేవాడు కనుకనే అలా అనుకుంటాడు. కాని దానికి ఏదో పవిత్రత ఆపాదించుకుంటే ఆయన మనసుకి శాంతి. అందుకని అలా సమర్ధించుకున్నాడు.
ఈ కథలో మీనాక్షి కూడా ఒంటరిగానే వుంటోంది. ఆమెకి కూడా భౌతికపరమైన కోరికలుండడంలో తప్పు లేదు. అందుకే ఆమె వాదనలో, ప్రవర్తనలో కూడా ఈ విషయం స్పష్టం చేసింది. అద్వైతమనే మాట తెచ్చి, దానికో పవిత్రతను ఆపాదించుకుని ఇద్దరూ వారిని వారు సమర్ధించుకున్నారు.

మరొకమాట. ఆలయంలో మీనాక్షీదేవిని చూస్తున్నప్పుడు ఆయనకు ఆమె శృంగారమూర్తిగా, ముంజేతి మీది చిలుక ఏ క్షణాన్నో ఎగిరిపోయేట్టుగా అనిపించింది. ఎందుకని? ఆయనకు శృంగారమందించిన ఆయన భార్య ప్రస్తుతం జీవించిలేదు. అందుకని ఈ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు అనే భావన ఆయనకు ఆ చిలుకని చూడగానే కలిగింది.
ఈ విధంగా ఈ కథలో జరిగిన సన్నివేశాలన్నింటినీ నేను కథానాయకుని మనస్తత్వానికి అన్వయించుకుంటే కలిగిన భావనలు. ఇవి తప్పో ఒప్పో నాకు తెలీదు. కాని మీనాక్షీదేవిని శృంగారముర్తిగా ఊహించుకుని, అనుభవంలో ఆమెతోనే తాదాత్మ్యత చెందినట్లు భావించుకోవడం వ్యక్తిగతంగా నేను ఇష్టపడలేక, ఈ విధంగా మనస్తత్వశాస్త్రాన్ని ఆశ్రయించి అన్వయించుకున్నాను.
ఈ కథనే తాత్విక చింతనకు అన్వయించకుండా వ్రాస్తే ఈ కథను మర్యాదస్తులనబడేవారు చదవరేమోనని అందుకోసం అద్వైతాన్ని ఆసరా చేసుకున్నారేమోనని అనిపించింది.
పైన చెప్పినవన్నీ పూర్తిగా నా స్వంత అభిప్రాయాలు. రచయిత ఏమనుకుని వ్రాసారో తెలీదు. ఆయన మార్మికంగా వుంచిన భాగాన్ని ఎవరికి తోచినట్టు వారు అన్వయించుకునే స్వతంత్రముంది కనుక నా అభిప్రాయం వివరించాను.
ఇంత ఆలోచన కలిగించే కథ చదివించినందుకు మీకు కృతఙ్ఞతలు..

 
Real Time Web Analytics