కథానుభవం-7
తన్హాయి వెల్లువలో నా కథానుభవాలు, కవిత్వానుభవాలు, వచనానుభవాలు అన్నీ గత నాలుగు నెలలుగా తాత్కాలికంగా తెర మరుగై పోయాయి. కథలు చదవడం ఆపేయ్యలేదు గానీ చదువుతున్న వాటి గురించి రాయడం మాత్రం కుదరలేదు.
మొన్నా మధ్య సౌమ్య రాసిన మధుర యాత్ర స్మృతి గురించి చదువుతున్నప్పుడు ఆ పోస్ట్ లోని విషయాల మీద దృష్టి కన్నా నా మనసు మధుర ఆర్. ఎస్. సుదర్శనం గారి “ మధుర మీనాక్షి “ కథ ను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత రాస్తున్న ఈ కథానుభవం లో ఈ సారి నాకు బాగా నచ్చిన , చాలా మంది మెప్పు ని పొందిన విశిష్టమైన కథ చోటు చేసుకోవటం చాలా సంతోషం గా ఉంది..
ఆర్. ఎస్. సుదర్శనం గారి రచనల గురించి, వారి సాహిత్య దృక్పథం గురించి ఒకటి రెండు మాటలు కాదు ఒక వివరమైన వ్యాసం రాయాల్సినంత విషయం ఉంది. ఆయన కథలే కాకుండా తెలుగు సాహిత్య విమర్శ మీద ఆయన రాసిన పుస్తకం “ సాహిత్యం లో దృక్పథాలు” చదవవలసిన పుస్తకాల్లో ఒకటి. తాత్త్విక చింతన వున్న కథకుల్లో ఆర్. ఎస్. సుదర్శనం అగ్రగణ్యుడు అన్న మాటకు ఉదాహరణ గా ఆయన రాసిన ఆణి ముత్యం “ మధుర మీనాక్షి” కథను చెప్పుకోవచ్చు. ఈ కథ ద్వారా ఆయన రచనా కౌశలాన్ని ఎలాంటి వారైనా అర్థం చేసుకోవచ్చు.
ఈ కథ గురించి కేవలం ఒక సారి చదివి రాస్తున్న కథానుభవం కాదు ఇది. చాలా సార్లు చదివాను. మళ్ళీ మళ్ళీ ఆలోచించాను. ప్రతి సారి ఈ కథ ఒక్కోరకమైన అనుభూతి ని, ఒక్కో రకమైన ఆలోచన ఇచ్చింది. అందుకే ఇది నాకు నచ్చిన కథ అయింది. ఒక రచయతగా ఆర్.ఎస్. సుదర్శనం గారి మీదున్న గౌరవం మరింత ఎక్కువైంది. నా అభిరుచి మేరకు( అందరికీ ఈ కథ నాకు నచ్చినంత నచ్చక పోవచ్చు. లేదా నేను చూసిన అంశాలు, ఇతరులకు కనిపించిన అంశాలు వేర్వేరు గా ఉండవచ్చు. కాబట్టి ఇది కేవలం నా వ్యక్తిగత అభిరుచితో మాత్రమే విశ్లేషిస్తున్నానని అర్థం చేసుకోగలరు) అనేక రకాలుగా ఇదొక ప్రత్యేకమైన కథ. మనసు పెట్టి కథ చదివి ఆలోచిస్తే అనేక సున్నితమైన అంశాలు, అస్పష్ట కోణాలు అర్థమవుతాయి. అద్వైత సందేశం చుట్టూ ఇంత మంచి కథ అల్లగలిగిన ఆలోచన, నైపుణ్యం కేవలం ఆర్. ఎస్. సుదర్శనం గారి సొత్తు మాత్రమే అనిపించింది ఈ కథ చదివాక.
ఈ మధుర మీనాక్షి కథ ఇదీ అంటూ చెపితే అందులోని గొప్పతనం అర్థమై పోయే కథ కాదు ఇది. నిదానంగా చదవాలి. సంపూర్ణ తాత్త్వికత తో నిండి వున్న ఈ కథ అలవోకగా చదివితే బహుశా ఆ గొప్పతనం, ఆ సౌందర్యం మన జ్నానేంద్రియాలకు పట్టకపోవచ్చు. కథ పూర్తయ్యేక ఆ ( ఏముందిలే ఈ కథ లో అనిపించదు. ఈ కథ లో ఇంకా ఏమేం చెపుతున్నారు అని ఆలోచించబుద్ధి వేస్తుంది. మనస్తత్త్వ చిత్రణ, తాత్త్వికత , ఆ రెంటికి మించి ఓ మార్మిక సౌందర్యం కనిపిస్తుంది ఈ కథ లో.
ఎవరైనా మొదట ఈ కథ చదివాలనుకుంటే ఇక్కడితే ఆపేసి నాకోక మైల్ చేయండి. నేను కథ పంపిస్తాను. అది చదివాక అప్పుడు మీకు కలిగిన అనుభవాల్ని, నా మాటల్ని పోల్చుకోవచ్చు. లేదూ, అసలు కథ లో ఏముందో తెలుసుకొని ఆ తర్వాత కథ చదవాలో, వద్దో నిర్ణయించుకోవాలనుకుంటే ముందుకు సాగండి.
కథ ఉత్తమ పురుష లో సాగుతుంది. కథకుడి పేరు తెలియదు. ఊరూ తెలియదు. అలాగే అతని వయస్సు కూడా ఇంత అని కచ్చితం గా తెలియదు. కాకపోతే నలభై దాటిన మధ్య వయస్కుడు అని అర్థమవుతుంది.కథకుడు రెండేళ్ళ క్రితం భార్య ను పోగొట్టుకున్న ఓ వ్యాపారి. కథకుడి కి మధుర వూరు అన్నా, ఆ వూర్లోని మధుర మీనాక్షి అన్న పేరన్నా ఏదో ఒక తెలియని ఇష్టం. ఉన్నట్లుండి ఒక రోజు తన వొంటరితనం నుండి ఎక్కడికైనా దూరం గా పారిపోవాలనిపించి రైలెక్కి మధుర చేరుకుంటాడు.అక్కడ అమ్మవారిని, చేతి లో చిలుక పట్టుకొని వయ్యారం గా నిలబడిన ఆ అద్భుత సౌందర్య రాశిని , శృంగార మూర్తి ని చూసి మైమరచిపోతాడు. ఆలయం నుంచి బయటకు వస్తుంటే మరో అద్భుత సౌందర్యరాశి కనిపిస్తుంది.గుడి లో దేవత పేరు మీనాక్షి. కథకుడి మనసు దోచుకున్న దేవేరి పేరు కూడా మీనాక్షి నే. ఒకరు విగ్రహం . ఒకరు మనిషి. ఒకరు మాట్లాడరు. ఒకరు మాట్లాడతారు. మానవ రూపం లో వున్న మీనాక్షి ఓ కాలేజీ లో ఫిలాసఫీ లెక్చరర్. అద్వైతి. అంతా మాయ, ఇద్దరు లేరు, వున్నది ఒక్కరే అంటుంది.
ఒక రెండు రోజులు గడిచాక వున్నట్లుండి ఓ సంధ్య వేళ ఎలాంటి మాటలు, ఎలాంటి సంకోచాలు, ఎలాంటి భయాలు, ఎలాంటి ధార్మిక విచికిత్స లేకుండా ఆ ఇద్దరూ ఒకటవుతారు. “ తర్వాత ఏం జరిగిందో మాటల్లో చెప్పలేను.చెప్పటానికి మాటలు లేవు. చాలవు కాబట్టి. అక్కడ ఎంత సేపున్నానో గుర్తు లేదు. ఒక మహదానందం తో తాదాత్మ్యం తప్ప మరొక స్పృహ లేదు.” ఇదీ మీనాక్షి గది నుంచి హోటల్ రూమ్ కి ఎలా వచ్చి పడ్డాడో కూడా తెలియని కథకుడి మానసికానుభవం.
ఈ కథ కి ఇది కాదు ముగింపు. అసలు కథ లో మలుపు ఆ తర్వాత జరుగుతుంది.
కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.
మొత్తం 20 పేజీలున్న ఈ పెద్ద కథ లో చివరి అయిదు పేజీల్లోనే అసలు కథ అంతా వుందనిపించింది నాకు. అప్పటి దాకా జరిగిన కథ అంతా ఒక ఎత్తు గానూ, చివరి అయిదు పేజీ ల్లో రచయత ఈ కథ ద్వారా పైకి చెప్తున్న విషయాలు కాకుండా ఇంకేవో గూఢార్థం తో చెప్పాలనిపిస్తున్నట్లు తోచింది నాకు. ఆ చివరి పేజీల్లో మనకు కథ ఏం అర్థమైంది అన్న దానిని బట్టి మళ్ళీ మొదటి కి వెళ్ళి కథ మొత్తం మొదటి నుంచి చదవాలనిపిస్తుంది. అప్పుడు కథ స్వరూపం మొత్తం మరో రకంగా వేరే కోణం నుంచి అర్థమవుతుంది.
నేను ఆ చివరి ముగింపు, నాకేలా అర్థమైందో చెప్పకపోతే మీరంతా కూడా ఈ కథ చదువుతారని ఆశ. అందుకే అది ప్రస్తుతానికి చెప్పకుండా వదిలేస్తున్నాను.
ముగింపు తో సంబంధం లేకుండా నాకు ఈ కథ లో నచ్చిన మరి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
గుడి లోకి వెళ్ళి మొదటి సారి అమ్మవారిని చూసినప్పుడు కథకుడి కి కలిగిన అనుభూతి...
“ అమ్మవారు లీలగా తప్ప స్పష్టం గా దృష్టి కి ఆనలేదు. ఆలయం యొక్క గంభీర వాతావరణం నన్ను ఆకట్టుకున్నది. కాలం ఘనీభవించినట్లు, కాల సముద్రం లోతుల్లోకి మునిగినట్లూ, చరిత్ర లో ఏదో వెనక్కి వెళ్ళినట్లు ఒక విశేషమైన భావం మనస్సు ని ఆవరించింది”.
సుదర్శనం గారి మనస్తత్త్వ చిత్రణకు దర్పణం రైల్లో తోటి ప్రయాణీకుల ప్రవర్తన గురించి కథకుడి ఆలోచనల ద్వారా రచయత మనకు చెప్తారు. ఆ సన్నివేశం ఎలా సాగుతుందో చదవండి.
“ సాధారణం గా మనం మనుష్యుల్ని ఒక అర్థం తో చూస్తూ ఉంటాము. వీడు ఫలానా, వీడి తో ఈ పని, ఈమె ఫలానా వారి తాలూకు, ఈమె గుణం యిలాంటిది అన్న దృష్టి వ్యక్తుల్ని గూర్చిన పరిచయం మూలాన, నిత్యమూ కొన్ని ప్రయోజనాల్ని అన్వేషిస్తూ వ్యవహార దృష్టి తో చూస్తుండటం తప్ప, ఆయా వ్యక్తుల్లో వున్న వింతలూ, చమత్కారాలు మనం గమనించం. అదీగాక మనిషి మామూలు మనిషి అన్న భావంతో గాక ఒక యంత్రం, ఒక బొమ్మ, ఒక వింత మృగం అనే దృష్టి తో చూస్తే మరి కొన్ని చమత్కారాలు కనిపిస్తాయి. రైల్లో నా ఎదురుగా ఒక కుటుంబం, అంటే భార్యా భర్తలు, వాళ్ళ ఆరేళ్ళ కూతురు కూర్చున్నారు. చూడగానే వాళ్ళ పరస్పర సంబంధం వగైరాలు అర్థమయినవి. కానీ నా మనస్సు ప్రస్తుతం అనుభవిస్తున్న వింత స్థితి లో వాళ్ళకు ఒకరితో సంబంధం లేదనుకుంటూ వాళ్ళను గమనించాను. ఆ అవగాహన అద్భుతం గా ఉంది. ఎవరికి వాళ్ళు ఒంటరివాళ్ళే. నాలాగ పైన ఏవో శబ్దాలు, చేష్టలూ, వాటికి ఏవో అర్థాల మూలంగా మనస్సు లో ఒక ఎడతెగని భ్రమ! అంతే!భర్త కొన్ని నిముషాలు మరుగుదొడ్డి లోకి వెళ్ళాడు.వెంటనే భార్య హావభావాల్లో మార్పు కనిపించింది. నా వైపు సిగ్గు విడిచి ఆసక్తిగా సాహసం గా పరిశీలనగా చూచింది. అటూ ఇటూ కదిలింది. వస్తువుల్ని సావరిస్తూ కూతురితో ఏదో అన్నది. నాకూ ఏదో వ్యక్తం చేసింది. భర్త తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఆమె మళ్ళీ పూర్వపు ధోరణి లో ‘ అణకువ’ ( subdued) గా స్తబ్దం గా మారింది. భర్త సాన్నిధ్యం ఆమె నిజ స్వరూపాన్ని కప్పిపెడుతూ ఉన్నట్లు నాకు తోచింది. ఇందులో ఆమె భర్తను ఏదో మోసం చేస్తున్నదని కపటం గా ప్రవర్తిస్తున్నదనీ నా ఆరోపణ కాదు.నైతిక వ్యతిక్రమణం ఏమీ లేదు. ఆమె వ్యక్తిత్వం మాత్రం భర్త ఎదురుగుండా ఉండటం వల్ల ఒకానొక ధోరణి లోనూ, లేకపోయినా క్షణాల్లో మరొక ధోరణిలో అంటే స్వేచ్ఛగానూ ఉంటుందనేది నాకు నిశ్చయంగా తెలిసింది. ఆమె లోని ఆ రెండవ ధోరణి , దాని సౌందర్యం ఆ భర్తకు ఎన్నడూ కనిపించదు. ఊహామాత్రంగా కూడా అంతు చిక్కదు. ఇదీ జీవితం లో వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల్లోని వైచిత్రి. కేవలం భార్య భర్తల మధ్యే కాదు. ఒకానొక రామారావు నాకు చాలా సౌమ్యుడిగా ఓర్పు గలవాడు గా మాత్రమే తెలుసు. మరొకరికి రామారావు అంటే ముంగి. లోపలి మనిషి. నమ్మదగినవాడు కాదు. ఈ విభేదాలు ఎందువల్ల వస్తున్నాయి?”
శత వసంతాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న తెలుగు కథ నుంచి మంచి కథల ఎంపిక చేస్తే తప్పక ఉండాల్సిన కథ ఈ “ మధుర మీనాక్షి”.
(ఈ కథను అడగగానే ఓపికగా స్కాన్ చేసి పంపించిన కథారచయత కొత్తపాళీ గారికి కృతజ్నతలు.)
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
8 hours ago
23 వ్యాఖ్యలు:
మీ రివ్యు బాగుంది. కథ చదవాలని ఉంది.
ప్లీజ్..
కథ ఎక్కడుందో చెప్పండీ. మాకు కూడా ఆ అద్వైతానుభవం అందుతుందేమో ప్రయత్నిస్తాం..
కల్పనా, నిన్ననే కదా అడిగేవు కథగురించి. అప్పుడే రాయడం కూడా అయిపోయిందా.హా. నేను చాలా చాలా కాలంకిందట చదివేను కానీ మంచి కథ అని మాత్రమే గుర్తుంది. నీ పరిచయం బాగుంది. 20 పేజీలే! తరనాతెప్పుడో చదవాలి.
కోడిగుడ్డుకి ఈక: first person = ఉత్తమ పురుష (ప్రథమ పురుష కాదు). మీరు కూడా ఇట్లాంటి తప్పులు రాస్తే ఎలా???
@భాను, థాంక్స్.
@శ్రీలలిత --మరి నాకు kalpana.rentala@gmail.com కి మైల్ చేయండి.
@మాలతి గారు...ఇది నిన్న చదివిన కథ కాదండీ. ఇదివరకేప్పుడో చదివి నచ్చేసిన కథ. మీ దగ్గర వుంటే స్కాన్ చేసి పంపిస్తారేమో అని అడిగాను.
@కొత్తపాళి..ఛ..అలా ఎలా రాశాను? ఇప్పుడే కరెక్ట్ చేశాను. పూర్తి పరువు పోకుండానే..థాంక్ యు.
@కల్పన .. జరుగుతూ ఉంటుంది లేండి.
@ అందరికీ - ఢిల్లీలో సాహిత్య ఎకాడమీ అని ఓ సంస్థ ఉంది. అది సాధారణంగా నిద్రపోతూ హిందీభాషలో మాత్రమే కలవరిస్తూ ఉంటుంది. గోదావరి పుష్కరాలకి నిద్రలేచి తెలుగులో ఒకట్రెండు మాటలు చెప్పి మళ్ళీ నిద్రకొరుగుతుంది.
అట్లా బయటపడిన ఒక తెలుగురత్నం "తెలుగు కథ" అనే సంకలనం. సంకల్నకర్త డి. రామలింగం గారు. సాహిత్య ఎకాడామీవారి షాపుల్లోనూ, ప్రముఖ షాపుల్లోనూ దొరుకుతుండవచ్చు. సుదర్శనంగారి మధురమీనాక్షి కథతో సహా తెలుగు కథల్లో 30 ఆణిముత్యాలు ఈ సంకలనంలో ఉన్నాయి. తప్పక కొనుక్కోండి.
@కొత్తపాళి--ఆ పుస్తకం మీద ఆవేశం తో 97-98 ల్లో ఆంధ్రప్రభ వీక్లీ లో ఒక సమీక్ష రాశాను. ఎక్కడున్నాయో అవన్నీ...ఇండియాలో మా స్నేహితుడి ఇంట్లో మా పుస్తకాలన్నీ నిద్ర పోతూ వుంటాయి. అందుకే ఏవైనా కథలు కావాలంటే మిమ్మల్నో, మాలతి గారినో బతిమి లాడుకోవటం...
నిజమే మీరన్నట్లు ఇది ఒక్క సారి చదివితే అర్థమయ్యే కథ కాదు. నేనిప్పటికీ రెండు మూడు సార్లు చదివాను. చదివినప్పుడల్లా కొత్త ఆలోచనలు ...కొంత అర్థమయ్యి కొంత అర్థం కాక... అద్వైత సందేశం చుట్టూ ...నిజమే అద్వైతం మొదట అర్థం చేసుకొంటే ఈ కథ ఇంకా బాగా అర్థమవుతున్దనుకుంటా. రచయితా చెప్పే సందేశం అంతర్లీనంగా ఉన్న గుడార్థం మళ్ళీ మళ్ళే చదివుతుంటే అర్హ్తమవ్వుతూ...అర్థం కాకుండా. మా బోటి వాళ్లకు పూర్తిగా అర్థం కావాలంటే ఇంకొంత సమయం పడ్తుంది.
కల్పన గారూ క్షమించాలి, నేను మీ పోస్ట్ చదవకుండానే ఆపేశాను. ఎందుకంటే కథ చదివాకే సమీక్ష చదివితే బాగుటుందని అనిపించింది. మీకు వీలయితే నాకు ఆ కథ పంపించరూ......
మనోజ్న,
మరి మీరు నాకు మైల్ చేస్తే నేను మీకు కథ పంపిస్తాను.
నాకీ కథ "తాత్విక కథలు" అనే కథా సంకలనంలో చదివిన గుర్తు. సంకలనకర్త మధురాంతకం నరేంద్ర గారు. ఈ కథ, జలంధర గారి "వియద్గంగ", ఆర్ వసుంధర గారి "పెంజీకటికవ్వల" (పెను చీకటికి ఆవల)నాకు గుర్తుండిపోయిన కథలు. ఈ పుస్తకం విశాలాంధ్ర,కోఠి లో దొరకవచ్చు.
@శ్రీలలిత, నాకేదో ఆ అద్వైతానుభూతి వచ్చేసిందనుకునేరు. ఆయన ఏం రాశారో, నాకేం అర్థమైందో మీరందరూ కూడా చదివితే మనమంతా కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
@భానూ, మా బోటి వాళ్ళకు కాదండీ, మన బోటి వాళ్ళకు..
@ అనానిమస్ గారూ, అవునండీ మీరు చెప్పింది కరెక్టే. మీరు పేర్కొన్నవి కూడా మంచి కథలు. వీలు వెంబడి వాటి గురించి కూడా ఈ కథానుభవం లో మాట్లాడుకుందాము. ఈ కథల్ని ఇంత అలవోకగా ప్రస్తావించారంటే మీరు మంచి పాఠకుడు అయి వుండాలి. మీ పేరు కూడా చెపితే బావుండేది.
@ శ్రీలలిత, మనోజ్న మీరిద్దరూ కథ చదివి అటే పారిపోకుండా మీకేమ్ అర్థమైందో అది ఇక్కడ చెప్తారని ఎదురుచూస్తాను.
ఓహ్ నా టపా, మీరు ఈ వ్యాసం రాయడానికి ప్రేరేపించిందంటే ఉత్సాహంగా ఉంది.
నేను కథ మధ్యలో ఆపేసానండీ, కథ పంపరా ప్లీజ్...చదివాక తప్పకుండా మీ టపాకి కామెంటు పెడతా.
నేను ఆర్. ఎస్. సుదర్శనం గారి నవలో, కథో ఎప్పుడో చదివినట్టు గుర్తు, ఆ పేరు బాగా సుపరిచితమల్లే ఉంది, కానీ ఏం చదివానో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. :(
కథ చదివాక నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకోవాలని ....
అతనికి మధుర అన్నా, మధురలో ఉన్న అమ్మవారు మీనాక్షి పేరు అన్న అతనికి ఏంటో ఇష్టం. అతనిలో ఉన్న ఒంటరితనం ఒక అయోమయ పరిస్తితి, ఇప్పుడున్న ప్రపంచాన్ని వదిలి దూరంగా పోవాలనుకుని మధుర చేరతాడు. అతను అమ్మ వారిలో ఒక సౌందర్య మూర్తి ని ఒక శృంగార మూర్తి ని చూస్తాడు. ఆ అలౌకిక అనుబూతిలో బయట కన్పించి పరిచయమయిన ఒక స్త్రీలో అమ్మవారిని ఆ సౌందర్య మూర్తి కి ప్రతీక గ ఆమెనే మీనాక్షిగా భ్రమ చెంది, ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఇదంతా సత్యం కాదు. చివరలో చెప్పినట్లు " అతనికి గుర్తున్నదల్ల పుష్కరిణి వద్ద అద్వైతాన్ని గూర్చి ఆమె చెప్పిన మాటలే. తర్వాత మిగిలింది అపుర్వమయిన ఆనందానుభూతి, తాదాత్మ్యము, తప్ప మరొక వివరంకాని, వేశేషం కాని గుర్తు లేదు. అటు తర్వాత ఆమె దగ్దమాయి అంతర్తాన్మయిపోవడము, , జ్ఞ్యానాంబ చెప్పిన వివరాలు, ఫోటో వగైరాల ద్వారా ఏర్పడుతున్న మీనాక్షికి, నా అనుభుతిలి సత్యమై నిల్చిన మీనాక్షికి ఎక్కడ పోలిక లేదు." అని అనుకుంటాడు.
ఇక్కడ విగ్రహం , యువతి ఒక్కటే. అతనిలో అంతర్లీనంగా అమ్మవారిపట్ల ఉన్న అనుబుతి అతనికి ఒక భ్రమ , మిథ్య గా అతనికి కన్పిస్తుంది. అతను ఒక అయోమయ పరిస్తితులలో మధుర కు వస్ట్టాడు. అతను ఏమి ఆశించి వచ్చాడు అన్నది అద్వైతానుభుతి ద్వారా ఆ మీనాక్షి చెప్పినట్లు అతను మనసులో అంతా ఒక భ్రమ . ఆమె అంటుంది విగ్రహం, మనిషి ఒక్కటే అని.
అతను ఎందుకు మధుర వచ్చాడు అన్నది అతనికి అర్థమవుతుంది. ఎలా అంటే ఆమెతో మాట్లాడుతూ ఉంటె అతను అంటాడు ఆమె సౌందర్యాన్ని అరాదిన్చాకుండా ఉండలేనంటాడు. సౌందర్యమంటే ఇష్టం అని ఇంకా లోతుగా వెళ్ళితే " నేను : ఆ ఇష్టమే నేను" అంటాడు. అంటే అతను నేను అంటే ఏంటి అని వెతుక్కుంటూ వస్తాడు. అది ఎప్పుడయితే అర్థమవుతుందో, అతను చెందినా అనుబూతి ఒక మహదానందం మాటాల్లో చెప్పలేని ఒక తాదాత్మ్యత పొందుతాడు. ఆమెతో గడపడం అంతా భ్రమ, జ్ఞ్యనాంబని నన్ను మీరు చుల్లెద అంటే లేదు అంటుంది. అతని గురించి అతను తెలుసుకొన్న తర్వాత అతను ఒక సమాధి స్థితి లోకి వెళ్తాడు. ఆ స్థితి లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఏదో నిండుదనం, ఎన్నడు ఎరగని సంతృప్తి, నిశ్చలత్వం అనుభూతి చెందుతాడు. . ఒక పరిపుర్నమయిన స్తితి పొందుతాడు.
స్వామి వివేకానంద "ఆత్మకథ లో స్వామి ఈ విధంగా చెబుతాడు" దక్షినేశ్వర అలయోధ్యానంలో ఒక రోజు శ్రీరామక్రిష్ణులు నా హృదయాన్ని స్పృశించారు. మొట్టమొదట ఇల్లు, గదులు, తలుపులు, కిటికీలు, వసారాలు, చెట్లు సూరీడు, చంద్రుడు- అన్నీ ఎగిరిపోతున్నట్లు, తునాతునకలాయి అణువులు , పరమానువులుగా మారి ఆకాశంలో లీనమయినతుగా కనిపించింది. మళ్ళీ క్రమంగా ఆకాశం కుడా అదృశ్యమయి పోయింది. ఆ తర్వాత నేను అనే చైతన్యం కూడా మటుమాయమైపోయింది. తదనంతరం ఏమి జరిగింది నాకు జ్ఞ్యాపకం లేదు.మొదట నేను బయపడ్డాను. ఆ స్తితి నించి తిరిగి వచ్చిన తర్వాత నేను ఇళ్ళను, తలుపులను, కితికీలని, వసారాలను, ఇతర వస్తువులను చూడగలిగాను.పరిపుర్నమయిన ఆరోగ్యంతో, స్మృతిలో ఉండే వ్యక్తి కి కలిగే ఆ అనుభూతి , ఆ అనుభవం వేద వచనాలతో కచ్చితంగా సామరస్యం కలిగి ఉంది. సాక్షాత్కారం, పొందిన ప్రాచీన ఋషులు ఆచార్యుల, వచనాలతో ఏకీభవిస్తున్నది. ..ఈ ఏకత్వ స్తితి ని ఆత్మా సాక్షాత్కారమని, ఒక్క సారి ఇది అనుభుతమయిన తరువాత భయం, జనన మరణా పాశాలు శాశ్వతంగా విచ్చేదమవుతాయని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఒక్క సారి ఈ బ్రహ్మానందాన్ని చవి చుసిన వాడు ఈ లోకం లోని సుఖ దుక్ఖాలకు అతీతుడవుతాడు" . ఇక్కడ కూడా అతనికి ఇలాగే ఆత్మ సాక్షాత్కారమవుతుంది.
అతను ఎప్పుడయితే అమ్మ వారిని ఒక సౌన్దర్యమయిన , ఒక శృంగార మూర్తి గా అనుభూతి చెండుతాడో, ఆ భావం వలన ఒక అనుభవం ఏర్పడింది. ఆ అనుభవం సత్యమా అంటే కాదు. అది ఒక బ్రాంతి వల్ల ఏర్పడింది. మనస్సులోని భావాలను బట్టి రకరకాల అనుభూతులు ఏర్పడతాయి ఇక్కడ అదే జరిగింది. బ్రాంతి వల్ల యధార్తమయినది కనిపించక , లేనివి ఉహించుకొని వాటితో సంబంధం ఏర్పరుచుకొని తాదాత్మ్యత పొందడం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అతను ఒక అయోమయ పర్తిసితులలో ఎందుకు మధుర కు వస్తున్నదో కూడా అర్థం కాని పరిస్తుతులలో ఉన్న అతనికి అమ్మవారు ఒక బ్రాంతి గా అతను అతనేంటో తెలుసుకోవతందుకు వచ్చినట్లుగా అతనికి అర్థమయ్యి , అతను ఒక సమాధి స్తితిలోకి వెళ్లి ఒక పరిపుర్నుదయినా మనిషిగా మారడం,చివర్లో అదే అంటాడు. అనుభూతిలో ఏకత్వాన్ని చూడమనే ఆమె సందేశం, సందేశమే కాదు, నేను, నేను ఆశించిన సౌన్దర్యమయిన తను, దాని అనుభూతి, మూడు ఏకం చేసింది." అంటూ చివరగా " మధురకు ఇందుక పిలిపించావు: అన్నాను , మనసులో ఆ దేవి మూర్తి తో, ప్రత్యక్షమయి స్వయంగా అద్వైత బోధ చేసి, అద్వైతానుభుతి ప్రసాదిన్చావ్ , నన్ను నీ దాసుణ్ణి చేసుకొన్నావు, ఎంత అవ్యాజమయిన ప్రేమ నీది". అని ఇది కావచ్చు కాక పోవచ్చు. అసలు మీ ఆలోచన ఏంటో ,,,,,,,,
అనుకోకుండా, అనిర్వచనీయమైన ఆకర్షణ గురించిన ఇంకో కథ (అనువాదం) చదవడం జరిగింది, సరిగ్గా ఈ కథ చదవక ముందు. ఆ ప్రభావం కూడా నా అభిప్రాయం మీద ఉండి ఉండ వచ్చు, లేకపోవచ్చు కూడా.
ఈ కథ చదివించేలా ఉందనడంలో సందేహం లేదు.
ముగింపులో అద్వైతానికి అన్వయిస్తూ ఆలోచన ఉన్నా, కథంతా ఆ విషయం పై సంభాషణ నడుస్తూ ఉన్నా, నాకు అసలు అనుభూతిలో అంత అంతరార్థం చూపించ గలిగినట్లు అనిపించలేదు. అక్కడ వాడిన పదాలు చాలా direct గా భౌతికమైన ఉద్దేశాన్నే చూపిస్తున్నాయి. (నిజానికి అలా చెప్పడమే నన్ను "హమ్మయ్య" అనుకునేలా చేసింది. నేను అంతకంటే ఎక్కువ వేదాంత పరమైన ఆలోచనలు ఆ సందర్భంలో తీసుకోలేను అనుకున్నాను. అసంబద్ధంగా అనిపించేవేమో అని అనిపించింది.) ఊహకు / భ్రమకు రెండిటికీ అటూ ఇటూగా అనిపించింది. అలౌకికంగా అనిపించలేదు. ముఖ్యంగా ఆమె పాత్ర ముగింపు, ఉహూఁ, నన్ను ఈ లోకానికే కట్టేసింది.
ఇంకొకటి, నాకు విష్ణు మూర్తితో, శ్రీకృష్ణుడితో భక్తి, ప్రేమ కలిపినట్లు అమ్మవారితో అంత appropriate అనిపించదు. చాలా సార్లు ప్రశ్నించుకున్నాను ఎందుకు ఇలా అని. నాకు రుచించదు అంతే. సాహిత్యంలో ఎక్కడా అలా చూపించరు కూడా అనుకున్నాను ఈ కథ చదివే వరకూ. చూపిస్తే నాకు నచ్చుతుందా అని కూడా అనుకున్నాను. నాకు నచ్చదు అనే తెలుసుకున్నాను.
ఇది ఎవరి అభిప్రాయం మీదా నా వ్యాఖ్య కాదు. నా "కథానుభవం" మాత్రమే.
భాను,
మీరూ, నేను దాదాపుగా ఒకేలా అర్థం చేసుకున్నట్లు ఇప్పుడు మీ కామెంట్ చదివితే అర్థమైంది. కాకపోతే మీరు ఆ అనుభవం, అనుభూతి ఒక భ్రాంతి అంటున్నారు. అంటే అది జరగలేదు అన్నట్లు. కానీ నేను ఆ అనుభవం కేవలం కలగా ఆకన్నది కాదు అతనికి వాస్తవంగా జరిగింది అంటున్నాను. అదీ మన ఇద్దరం చెప్తున్నా దాంట్లో తేడా.
లలిత,
మీ అభిప్రాయానికి వస్తే..మీకు భౌతికపరమైన ఉద్దేశలు వున్నట్లు అనిపించడం వల్ల ఇక అలౌకికమైన అనుభూతులు ఏవీ వున్నట్లు అనిపించకపోవచ్చ్కు. ఆమె పాత్ర ముగింపు మిమ్మల్ని ఈ లోకానికే కట్టేసింది అన్నారు. ఆమె మరణం లౌకికమైనదే. అతని అనుభూతి లోనే ఒక మిస్టిసిజం వుందని అనిపించింది.
ఇక అమ్మవారి పట్ల లైంగికపరమైన వాంఛలు కలిగివుండటం మీకు నచ్చదు అన్నారు కాబట్టి మీకు బేసిక్ గానే ఈ కథ అంత గొప్పగా వుండి వుండకపోవచ్చు. దట్స్ ఒకే. మీరు చెప్పినట్లు అది మీ కథానుభవం. అందుకే నేను చెప్పేది ఎప్పుడూ ఒకే ఒక్క కతానుభవం అనేది వుండదు. భిన్నంగా వుంటుంది. అలా వున్నప్పుడే బావుంటుంది కూడా.
చూద్దాము. కథ అయితే నా దగ్గర నుంచి చాలా మందే తీసుకున్నారు కానీ మరి ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్తారో లేదో తెలియదు.
ఎలాగూ మొదలుపెట్టాము కాబట్టి తాత్త్విక కథలు ఎవరికైనా ఇంటరెస్ట్ వుందంటే అలాంటి కథలు కొన్ని ఈ వరస లో మాట్లాడుకోవచ్చు. తాత్త్విక కథల సంకలనం నుంచి....
అతను అమ్మ వారిలో ఒక సౌందర్య మూర్తి ని ఒక శృంగార మూర్తి ని చూస్తాడు
____________________________________
Another MF Hussain?
భరద్వాజా!
అవును అంటే ఏం గొడవ చేస్తారో, కాదు అంటే ఇంకెంత గొడవ చేస్తారో అని తెలివిగా సమాధానం చెప్పకుండా మీకే వదిలేస్తున్నాను.
కల్పనా,
మీ తన్హాయీ, మధుర మీనాక్షి కథ, అంతకు ముందు మాలతి గారి "వెలుగు" కథ, ఈ మధ్య భానుమతి గారి "లోభి హృదయం" కథా, నా ఆలోచనకు పని పెడుతున్నాయి. మంచిది.
తన్హాయీ విషయంలో ముగింపు వరకూ వేచి ఉండడానికి ప్రయత్నిస్తాను.
ఇక మిగిలిన కథలలో మీకు కలిగిన కథానుభవం నాకు కలగలేదు.
మీకు సాహిత్యంతో, అందునా తెలుగు సాహిత్యంతో ఉన్న పరిచయం తో పోలిస్తే నాకున్నది చాలా తక్కువ.
కనుక సహజంగా నా ఆలోచనను నేను ప్రశ్నించుకుంటాను.
అంతే కాదు, నిజానికి ఏ కళ ఐనా ఎవరికైనా ఎలా ఐనా అనిపించవచ్చు అన్నది నిజం ఐనా,
"సరిగ్గా అర్థం చేసుకోవడం", లేదా "తప్పుగా అర్థం చేసుకోవడం" అనేది కూడా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, కొన్ని రుచులు వెంటనే తెలియవు. కానీ తెలిసాక ఆ అనుభవమే వేరు.
శాస్త్రీయ సంగీతం ఒక ఉదాహరణ.
నా కథానుభవంలో నా దృష్టి భౌతికమైన వస్తువు మీదనే ఉంది అంటే నా ప్రస్తుతం నేను cynical గా ఆలోచించే స్థితిలో ఉన్నానేమో? కాకపోవచ్చు కూడా.
మళ్ళీ కొన్నాళ్ళకు ఈ కథ చదివి పరీక్షించుకుంటాను.
వీలైతే నాకు గుర్తుకు వచ్చిన ఇంకొక పుస్తకం గురించి వివరాలు పోగు చేసుకుని మీకు e-mail రాస్తాను.
నా ప్రస్తుత మనఃస్థితిలో ఇలాంటి అద్వైత భావన ఎక్కువ అర్థం అవుతోంది:
< ప్రసంగం చివర్లో విజ్ఞానానికి, తత్వ చింతనకి ముడి పెడుతూ (జగదీశ్ చంద్ర బోస్) ఇలా అన్నాడు:
“జీవరహిత, మరియు జీవసహిత పదార్థంలో ప్రేరణకి ప్రతిస్పందనల చరిత్రల యొక్క అనురచనలని ఈ సాయంకాలం మీ ముందు ప్రదర్శించాను. ఆ రెండు రచనలు ఎంత సన్నిహితంగా ఉన్నాయో చూశారా? రెండింటికీ తేడా చెప్పడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భౌతిక పదార్థం ఇక్కడ అంతం అవుతుందని, జీవపదార్థం ఇక్కడ ఆరంభం అవుతుందని గిరి గీసి చెప్పడం ఎలా సాధ్యం? అలాంటి కఠోర విభజన రేఖలు అసలు లేవు.
ఈ స్వతస్సిద్ధమైన అనురచనలకి మౌన సాక్షిగా ఉంటూ, విశ్వంలో సర్వత్ర – నీరెండలో మిలమిలలాడే ధూళి కణం లోను, భూమి మీద కిటకిటలాడే జీవసముద్రం లోను, రోదసిలో రగిలే ప్రచండ భాను హిరణ్యతేజం లోను – అన్నిటా ఆవరించి ఉన్న ఆ అద్భుతమైన ఏకత్వాన్ని పొడచూసినప్పుడు, ముప్పై శతాబ్దాల క్రితం పవిత్ర గంగా నదీ తీరంలో, ’విశ్వంలో అనంతంగా, అనవరతంగా వ్యాపించిన వైవిధ్యంలోని ఏకత్వాన్ని పొడగన్న వారికే సనాతన సత్యం సొంతం అవుతుంది – మరొకరికి కాదు, మరొకరికి కాదు,’ అని ఘోషించిన నా పూర్వీకుల మాటల్లో సారం కాస్తంత అర్థమవుతోంది.” >
(Source http://scienceintelugu.blogspot.com/2010/01/blog-post_06.html )
నాకు నచ్చిన కథలు, నాకేదో బోలెడంత అనుభూతి కలిగిందని చెప్పిన కథలు మీకు మామూలుగా అనిపించినంత మాత్రాన మీలో ఏదో లోపం వుందనో, మీకు ఏదో తెలియదనో కాదు. మధుర మీనాక్షి కథ లో రచయిత్ర కి లేదా కథకుడికి కలిగిన అద్వైత అనుభవం నాకు కలగలేదు. కలిగే అవకాశం కూడా ఏ కోశానా లేదు.అది కచ్చితం. అయితే ఒక కథ గా అది నా మనసుని హత్తుకుంది. నేను చెప్తున్న కథానుభవాలు అవే. అంతమాత్రాన నాకేదో బాగా పొడిచేసెంత తెలుసని కాదు. మనకు అన్నీ తెలిసే వరకూ అమావాస్య ఆగదు కాబట్టి నా జ్నాన అజ్నానాలనన్నింటిని ఈ బ్లాగ్ లో ప్రదర్శిస్తుంటాను. నేను బాగా చదివాను, మీరు బాగా చదవలేదన్నది శుద్ధ అబద్ధం. నేను చదివిన వాటి గురించి , లేదా నాకు తెలుసు అనుకునే వాటి విషయాల గురించి ( అవి తప్పే అయినా సరే) నేను రాస్తుంటాను. మీరు రాయరు. అదీ ప్రధాన తేడా.
ఒక కథ చదవగానే దాని గురించి రాయడం తో మా పని ఆగిపోతుంది. కానీ మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం: -)
తన్హాయి చివరి దాకా ఆగేందుకు మీరు ప్రయత్నించినా ఏమీ అందులో విషయం ( తెలుసుకోదగ్గది) లేకపోతే, నా మీదకు యుద్ధానికి రాకందే :-)
జగదీశ్ చంద్ర బోస్ మాటలు కోట్ చేసి చూపించినందుకు థాంక్స్.
Post a Comment