నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, October 24, 2010

చైనా చరిత్రలోని చీకటి కోణపు కథనమే " ఉమన్ ఫ్రం షాంగై"!

చైనా ప్రముఖ వివాదస్పద రచయితల్లో జియానహుయ్ యాంగ్ ఒకరు. మావో కాలం లో అతి క్రూరమైన వాటిగా ప్రాచుర్యం పొందిన లేబర్ క్యాంపుల్లో జీవితం ఎలా వుండేదో అనే దాని గురించి పరిశోధానాత్మక వాస్తవాల  ఆధారంగా రాసిన కథల సమాహారం " ఉమన్ ఫ్రం షాంగై".. ఇందులో చెప్పినవి  కట్టుకథలు కావు. ఫస్ట్ హేండ్ సమాచారం ఉపయోగించి రాసినవి. ఈ సమాచారం ఇంగ్లీష్ లోకి రావటం  ఈ పుస్తకం ద్వారానే ప్రథమం.

వెనుకబడ్డ ఈశాన్య చైనా ఎడారి ప్రాంతంలో జియబియాంగ్ అనేది మావో కాలం నాటి బలవంతపు లేబర్ క్యాంపు పేరు. 1957-60 మధ్య దాదాపు మూడు వేల మంది చైనా దేశస్తులు కమ్యూనిస్ట్ పార్టీ చేత " రైటిస్ట్" లు గా ముద్ర వేయించుకొని నిషేధానికి గురైనారు. ఇలా నిషేధానికి గురైన వారందర్ని  ఈశాన్య చైనా లోని గాన్సు ఎడారి ప్రాంతం లోని జియబియాంగో అనే ప్రదేశానికి తరలించారు.

వీరిలోమేధావులు, గాన్స్ లోని  మాజీ ప్రభుత్వ అధికారులు వున్నారు.అలా అక్కడ ప్రవాస కారాగారానికి పంపివేయబడ్డ స్త్రీ, పురుషులు అనేక రకాల చిత్రహింసలకు గురైనారు. ఈ కార్యక్రమాన్ని కమ్యునిస్ట్ పార్టీ " అత్యధిక శ్రమ ద్వార తగ్గించివేత " అని పిలిచేది. వీరంతా కూడా ఛైర్మన్  మావో సోషలిస్ట్లు విధానాల పట్ల అసంతృప్తి ప్రకటించినవారో,పార్టీ అధికారుల్ని ప్రశ్నించినందుకో " రైటిస్ట్లు " గా ముద్ర వేయించుకున్నవారో. మరికొంతమంది ఎందుకు " రైటిస్ట్లు" అయ్యారంటే, వారి తండ్రులో, తాతలో భూస్వాములో, పెట్టుబడీదారి వర్గానికి చెందిన వారు కావడం వల్ల. 1961 కల్లా ఇక్కడ జరిగిన మరణాల వల్ల ఈ క్యాంప్ ని మూసివేసారు. దాదాపు మూడు వేల మంది ఖైదీల్లో 500మంది దాకా మాత్రమే బతికి బట్ట కట్టగలిగారు.

1997 లో యాంగ్, గాన్స్ కి ప్రయాణం చేసి దాదాపు అయిదు ఏళ్ళ పాటు అక్కడ క్యాంపు నుండి బైటపడ్డ వంద మందికి పైగా పాత ఖైదీలని ఇంటర్వ్యూ చేసి   ఆ మారణ హింసాకాండకు సంబంధించిన అనేకమైన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో 13 కథలున్నాయి. చైన ప్రభుత్వపు నిషేధం బారి నుండి తప్పించుకునేందుకు రచయత ఈ నిజాల నిజాయితినీ, శక్తిని పోగొట్టకుండా కాల్పనిక సాహిత్య కథలుగా మలిచారు. జర్నలిజం, సాహిత్యం రెండూ మేళవించిన సృజన ఇది.

ఈ లేబర్ క్యాంపు లో ఖైదీలు రోజంతా జైలు గార్డుల పర్యవేక్షణలో దుర్భరమైన  ఎడారి ప్రాంతంలో పంటలు పండించటం, పశువుల పెంపకం లాంటి పనులు చేసి రాత్రిళ్ళు మావో రచనలు చదివి " ఆత్మ విమర్శలు " లేదా గతంలో వారు చెసిన తప్పిదాలకు పశ్చాత్తాపాలు రాసుకోవాలి.

జియబియాంగో చుట్టుపక్కల భూములన్నీ ఓ మొక్కైనా మొలవని ఉప్పుమేతల ఎడారి ప్రాంతం.. ఇక క్యాంపు విషయానికి వస్తే, అది ప్రధానం గా 40,50 మంది నేరస్తులు పట్టే ప్రదేశం. అలాంటిదానిలోకి కొత్తగా తీసుకువచ్చిన మూడువేల మంది ఖైదీలను వుంచారు. ఈ మొత్తం ఖైదీలందరికీ ఎలాంటి ఆహార పదార్ధాల సరఫరాకు ప్రభుత్వం వొప్పుకోకుండా తిరస్కరించింది. అందువల్లే రైటిస్ట్ లు ఆ క్యాంపు కి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆహారం దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది.

1960 ఆకురాలు కాలంలో ఆహార పధార్దాల కొరత మరీ తీవ్రం కావడంతో రైటిస్ట్ ల్లో అధికభాగం ఆకలికి తట్టుకోలేక మరణించడం మొదలుపెట్టారు. పచ్చిక బయళ్ళలో ఆహారం కోసం వెతుక్కొని ఆకులు,అలమలు, చిన్న చిన్న పురుగుల్ని, ఎలుకల్ని, చివరకు తోటి ఖైదీలు మరణిస్తే వారి మాంసాన్ని, అంతే కాకుండా పశువుల, మానవ మలాన్ని కూడా తమ ప్రాణాలు నిలుపుకోవటానికి వారు తినాల్సి వచ్చింది. అంతేకాకుండా చెట్టుబెరడు  నుంచి తీసిన ఒక రకమైన జిగురు లాంటిదాన్ని సూప్ గా తాగితే తాత్కాలికంగా ఆకలి వుండకపోయినా లోపల ఇంటెస్టిన్స్ కి అది అతుక్కుపోయి చనిపోతామని తెలిసినా ఇక గత్యంతరం లేక అదే తాగి చనిపోయిన వారెందరో. మృతదేహాలకు కనీస ఖనన సంస్కారాలు కూడా లేక అవి అలా మట్టిదిబ్బల మీద పడివుండేవి.

ఎట్టకేలకు జియబియాంగ్  దురంతం బీజింగ్ లోని  సీనియర్ పార్టీ అధికారుల  దృష్టికి రావడంతో ప్రభుత్వం హడావిడిగా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి పంపేసింది. అలా బతికి  బైటపడిన వారు కేవలం 500 మంది మాత్రమే. ఈ విషాదం గురించి ఎప్పుడూ ప్రభుత్వం అధికార ప్రకటన చేయలేదు. మెడికల్ రికార్డ్స్ తిరగరాయించి ఖైదీలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినట్లు తప్పుడు నివేదికలు తయారుచేయించింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అలా క్యాంపు లో జరిగిన విషాద సంఘటనల వివరాలు ఒక మిస్టరీ గానే మిగిలిపోయాయి.

ఇక ఈ పుస్తకానికి శీర్షిక గా పెట్టిన కథ గురించి...ఆమె జైలుశిక్ష పడ్డ ఓ రైటిస్ట్ భార్య . ఆమె పేరు  గు. ఆమె భర్త పేరు డోంగ్. తన భర్త ఆ ప్రవాస జైలు జీవితం నుండి ఎప్పటికైనా షాంగై తిరిగివస్తాడని ఆమె నమ్మకం. ఒకసారి ఆమె తన భర్త ని చూడటానికి జియబియాంగ్ వస్తుంది. ఆమె రావటానికి ముందే ఆమె భర్త చనిపోతాడు. జైల్లో భర్త స్నేహితుడు, తోటీ ఖైదీ ఆమెకు డోంగ్ మరణవార్త చెప్తాడు. ఆమె ఎలాగైనా భర్త మృతదేహాన్ని చివరిసారిగా చూడాలనుకుంటుంది. కానీ అసలు నిజం తెలిసిన తోటి  ఖైదీ ఆమెకు  రకరకాల అభ్యంతరాలు చెప్తాడు. అయినా ఆమె తన పట్టు విడవకుండా నిరాహారదీక్ష సైతం చేస్తుంది. ఇక తప్పక తోటి ఖైదీ ఆమెను డొంగ్ మృతదేహం పడివున్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. అప్పటికే డొంగ్ మృతదేహం లోని ముఖ్యమైన భాగాల్ని కొందరు ఖైదీలు తినేసారన్న కఠిన నిజమే అతను గు తన భర్త మృతదేహం చూడకుండా అడ్డుపడటానికి కారణం. మట్టిదిబ్బల మీద సగం శరీర భాగాలు కూడా లేకుండా పడి వున్న భర్త మృతదేహాన్ని చూసి చలించిపోతుంది గు. అయినాసరే, అక్కడే తన భర్తకు ఎలాగైనా దహనసంస్కారాలు చేసి ఆ ఎముకల్ని, చితాభస్మాన్ని షాంగై తీసుకెళ్ళలన్నది ఆమె ప్రయత్నం. ఆమె దగ్గర ఎముకలు మోసుకెళ్ళేందుకు కూడా ఏమి మిగలని పరిస్థితుల్లో సహచర ఖైదీ ఆమెకు తను ఎంతో కాలం గా ప్రాణప్రదం గా కొరియన్ వార్ కి గుర్తుగా దాచిపెట్టుకున్న అమెరికన్ బ్లాంకెట్ ని ఇస్తాడు. అందులో ఆమె అతి పదిలం గా తన భర్త ఎముకల్ని దాచుకొని తిరిగి షాంగై వెళ్ళిపోతుంది. గు పట్టుదల అతని మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆమెను అతను మర్చిపోలేకపోతాడు. క్షమాభిక్షతో బయటపడ్డ కొన్నేళ్ళ తర్వాత షాంగై వెళ్ళినప్పుడు ఆమె ఆచూకి కోసం ప్రయత్నించి కూడా చివరకు ఆమెను కల్సుకోకుండానే వెనక్కు మళ్ళుతాడు.అలా ఆ షాంగై  మహిళ ఆ ఖైదీల్లోనే కాకుండా ఈ పుస్తకం చదివే పాఠకుల మనస్సులో కూడా చెరగని ముద్ర వేస్తుంది.

ఇలా ఆ లేబర్ క్యాంపులో రైటిస్ట్ లు ప్రతి రోజు ఎదుర్కొనే సంఘర్షణలే ఈ కథలు.

సిటీ వేర్ హౌస్ నుండి విత్తనాలు గా పాతిపెట్టెందుకు బంగాళదుంపల్ని తీసుకొచ్చే క్రమంలో కొందరు ఖైదీల గ్రూప్ వాటిల్లో కొన్ని బంగాళదుంపల్ని దాచి వుడికించి తిన్నందువల్ల ఎదురైన తీవ్ర పరిణామాలు చెప్తుంది " ది పోటాటో ఫీస్ట్". ఓ మహిళా ఖైదు క్యాంపులో పుట్టిన తన బిడ్డను పెంచడంలో ఎలాంటి కష్టాలు పడిందో, తోటి మహిళా ఖైదీలు తమకే తినటానికి లేకపోయినా ఆ తల్లి తన బిడ్డకు పాలిచ్చేందుకు తమ ఆహరంలోంచి కొంత భాగాన్ని ఆమెకు ఇవ్వడం, ఆ బిడ్డ, తామందరి బిడ్డగా భావించే వైనం చెప్పిన " జియా నాంగ్" మనల్ని కూడా కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. ఓ ఖైదీ ఎలాగైనా సరే ఆ క్యాంపు సంకెళ్ళ గోడలల్ని బద్దలు కొట్టి బైట పడాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన విధానాన్ని అందిస్తుంది " ఎస్కేప్ ". ఇలా ఈ కథలన్నీ ఖైదీలు పడ్డ కష్టాల్ని మన ముందుంచి చైనా ప్రభుత్వపు అమానుషత్వానికి, అమానవీయ చర్యలకు  దర్పణం పడతాయి. చైనా చరిత్రలో దాగి వున్న ఓ చీకటి కోణాన్ని  బహిర్గతం చేసే కథనాలివి.

అసలు ఈ పుస్తకం లోని కథనాలు ఎలా వెలుగు చూసాయంటే...

ఈ పుస్తక రచయత జియాన్ హుయ్ గాన్స్ ప్రాంతానికి చెందినవాడు. యాంగ్ మొదటగా ఈ జియబియాంగ్ గురించి 1965 లో విన్నాడు. అప్పుడు యాంగ్ 19 ఏళ్ల హైస్కూల్ గ్రాడ్యుయేట్ . అతనిలో పూర్తిగా విప్లవ భావాలు నిండివుండేవి. చైనా లో వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతాన్ని అభివృధ్ధి చేసేందుకు పట్టణ జీవితాన్ని వదిలి వేలాదిమంది యువత చేపట్టిన కార్యచరణలో యాంగ్ కూడా భాగస్వామి. అక్కడ మిలట్రి తరహా కలెక్టివ్ ఫారం లో యాంగ్ కి ఖైదు జీవితాన్ని పూర్తి చేసుకొని ఆ ఫారం లో పని చేసేందుకు నియమితులైన కొందరు రైటిస్ట్ లతో పరిచయమైంది. ఒకరోజు యధాలాప సంభాషణలో ఎవరో జియబియాంగ్ విషాద మరణాల గురించి అనధికారికంగా ప్రస్తావించారు. యాంగ్ దానిగురించి మరిన్ని వివరాలు అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పటానికి నిరాకరించి ఆ విషయాన్ని అక్కడితో ఆపేసాడు.
 
ఆ సంభాషణ చిన్నదే అయినప్పటికీ యాంగ్ లో ఒక ఆసక్తి రేకెత్తించింది. కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి అమానుషాల్ని తన సొంత ప్రజల పట్ల చేయడం అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని గురించి మరింత ఎక్కువ తెల్సుకోవాలనుకున్నడు. జియబియాంగ్ గురించి తెల్సుకునే ప్రయత్నమంటే  ఒకరకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కిందే లెక్క. అలా యాంగ్ ఆ కలెక్టివ్ ఫారం లో 1981 వరకు 16 ఏళ్ళ పాటు వున్నాడు. ఆ కాలంలో చైనాలో అనేక చెప్పుకోదగ్గ మార్పులు సంభవించాయి. మావో 1976 లో చనిపోయిన తర్వాత ఆయన అనుచరుడు డెంగ్ జియోపింగ్  మావో రాడికల్ కమ్యూనిస్ట్ విధానాలకు స్వస్తి చెప్పి చైనా ను రాజకీయ, ఆర్ధిక సంస్కరణల మార్గం లో నిలబెట్టాడు. 70 ల తర్వాత రైటిస్ట్ వ్యతిరేక ప్రచారం లో జరిగిన తప్పుల్ని గుర్తించి రైటిస్ట్ ల మీద విధించిన తీర్పుల్ని ప్రభుత్వం తిరగ రాసింది. ఆ క్రమం లో చాలా మంది ఖైదీల్ని విడుదల చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఆ విషాదానికి సంబంధించిన  బాధ్యతను స్వీకరించే ఆలోచన ఏది చేయలేదు.

యాంగ్ 1988 లో వృత్తిరీత్యా రచయత గా మారి టియాంజిన్ పోర్ట్ సిటి కీ నివాసం మార్చుకొని  అనేక కథలు, నవలలు రాశాడు. అయితే అతనెప్పుడూ జియానియాంగ్ గురించి మర్చిపోలేదు. 97 లో మావో యాంటి రైటిస్ట్ క్యాంపైన్ 14 వ వార్షికోత్సవం సందర్భంగా యాంగ్ అధికారికంగా తన ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. ఈ విషయం చుట్టూ నెలకొని వున్న రాజకీయ వొత్తిడులు కొంచెం పలచబడినట్లనిపించడంతో అతను తిరిగి గోబీ ఎడారికి ప్రయాణమయ్యాడు. ఈ విషాదం నుండి బతికి బైటపడ్డవారికోసం వెతకటం ప్రారంభించాడు. అయిదేళ్ళ పాటు సాగిన ఈ అన్వేషణలో యాంగ్ వందమంది  మాజీ ఖైదీలను, వాళ్ళ బంధువుల్ని ఇంటర్వ్యూ  చేసాదు.

వారిలో కొందరు మళ్ళీ ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో వివరాలు చెప్పటానికి తిరస్కరించారు. కొందర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ దారుణాలు వినలేక మధ్యలో ఇంటర్వ్యూ ఆపి బయటకువెళ్ళి కళ్ళనీళ్ళు తుడుచుకొని వచ్చి మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టేవాడు యాంగ్.  మొదటగా " వుమన్ ఫ్రం షాంగై" కథ ప్రచురితమైనప్పుడు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించింది. అలా తను సేకరించిన కథనాలన్నింటినీ ఒక సిరీస్ గా ప్రచురించాడు. అయితే యాంగ్ చేసినది ఒక జర్నలిస్టిక్ పని. కాని అతను దాన్ని కధలు గా మార్చి రాయటానికి ఒక కారణం వుంది. యాంగ్ రాసింది " డాక్యుమెంటరి లిటరేచర్". 80ల్లో చైనా  రచయితలు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో తమ జర్నలిస్టిక్ వర్క్ కి కొంత సృజనాత్మకతను జోడించటం ప్రధాన అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పనిసరి అంటాడు  యాంగ్.

 " పత్రికా స్వాతంత్ర్యం ఒక సంప్రదాయం గా వున్న పశ్చిమ దేశాల్లో ఇది కనీసం వూహించను కూడా వూహించలేము. అక్కడ సాహిత్యమంటే సాహిత్యం. వార్తలంటే వార్తలు. ఎవరు కూడా ఈ రెంటినీ కలిపెయ్యరు.చైనా రచయితలకు ఈ తేడా  తెలియక కాదు. సమకాలీన జీవితంలో నిక్లిష్టమైన పరిస్థితుల వల్ల ఇలా ఆ రెంటిని కలగలిపి రాయడం తప్ప వాళ్ళకు మరో అవకాశం లేదు" అంటాడు యాంగ్.

యాంగ్ కథనాల్ని ప్రచురించిన ఎడిటర్లు ఒక అడుగు ముందుకేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాపగాండ కళ్ళ నుండి  తప్పించుకునేందుకు కథనాల్ని ఫిక్షన్ కేటగిరి కింద ప్రచురించారు. ఈ పుస్తకానికి వచ్చిన ప్రజాదరణ వల్ల , ఈ దారుణ కాండ నుంచి బతికి బయటపడ్డ అనేకమంది బాధితులు, అంతకు ముందు అనేక దశాబ్దాలుగా వీటి గురించి పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడని వారు, ఇప్పుడు ముందుకు వచ్చి యాంగ్ తో తమ కథలు చెప్పుకుంటున్నారు.
 
కల్పనారెంటాల
 
  ( ఈ వ్యాసం పాలపిట్ట అక్టోబర్ సంచిక లో ప్రచురితం)
 
 
 
 
 
 

3 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్ said...

Got a special magic to that book! And great story telling technique too!

Kalpana Rentala said...

వంశీ గారూ, అవును. నాకు కూడా బాగా నచ్చింది ఈ పుస్తకం. అయితే ఇందులో అవాస్తవాలు వుండకపోవచ్చు కానీ బోలెడంత అపార్ధాలున్నాయని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు . నాకైతే అలా అనిపించలేదు.

భాను said...

చాలా బాగా రాశారు. ఆ పుస్తకం చదవాలైపిస్తుంది. మావో ఇలా చేయిన్చాదంటే ఆశర్యంగా అనిపించింది.

 
Real Time Web Analytics