నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, November 04, 2010

ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి!


'If any one of you is without sin, let him be the first to throw a stone at her.’

వ్యభిచరించిందన్న నేరం పై ఒక స్త్రీని రాళ్ళతో కొట్టే సందర్భం లో బైబిల్ లో క్రీస్తు అన్న మాటలు ఇవి.

మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి,
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి
మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి
ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి..


“ నేరం నాది కాదు ఆకలిది” సినిమా కోసం సి. నారాయణ రెడ్డి రాసిన పాట లోని ఈ వాక్యాలు చిన్నప్పుడు విన్నది ఇప్పటి దాకా మర్చిపోలేకపోయాను.

క్రీస్తు కాలం నుంచి ఇప్పటిదాకా మనుష్యుల మీద కంటే మతాల మీదనే ఎక్కువ ప్రేమ వున్నప్రస్తుత సమాజం లో ఇలాంటి అమానుషమైన, క్రూరమైన, నీచమైన , హేయమైన ఇలాంటి చర్యలు ఇంకా జరుగుతూనే వున్నాయి.

ఇరానీ మహిళ,ఇద్దరు పిల్లల తల్లి , సఖినే మొహమ్మదీ ని ఊరి తీసి చంపబోతున్నారన్న వార్త నాకు ఆలస్యంగా అందింది. ఆమె ను ఉరితీయరాదని కోరుతూ తయారైన పిటీషన్ మీద బ్లాగు ముఖం గా చేసిన నా అభ్యర్ధనను మన్నించి సంతకాలు చేసిన వారందరికీ కృతజ్నతలు. ఇవాళ్టి కి సఖినే ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉంది. 500,000 సంతకాలు ఒక్క రోజులో ఇరాన్ ప్రభుత్వానికి అందడం తో ఈ మరణ శిక్ష తాత్కాలికం గా ఆగింది. సఖినే కేసులో ఇంకా న్యాయపరమైన చిక్కులు అలాగే వున్నాయని ఇవాళ ( నవంబర్ 4) లండన్ లోని ఇరాన్ దేశపు ఎంబసీ ప్రకటించింది.

కానీ ఆ శిక్ష ఎప్పుడైనా అమలుజరపవచ్చు. కాబట్టి వీలైనంత మంది , ఇంకా సంతకాలు పెట్టని వాళ్ళు పిటీషన్ మీద సంతకాలు పెట్టడం వల్ల ఆమె ను ఈ మరణ శిక్ష నుంచి తప్పించే అవకాశం వుంది . కాబట్టి వీలైనంత త్వరగా స్పందించండి.

ఇప్పటికే సఖినే గురించి, ఆమె మీద మోపిన “ నేరాల “ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. లండన్ లోని గార్డియన్ పత్రిక కోసం దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లోని ముఖ్యమైన అంశాల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.

“ ఇదొట్టి అబద్ధపు కేసు. టెహ్రాన్ ప్రభుత్వం రహస్యంగా తనని చంపివేసేందుకు మీడియా ను అయోమయంలో పెడుతోంది” అని ఆమె ఆరోపించారు. సఖినే తన భర్త ని హత్య చేసేందుకు పన్నిన కుట్రలో భాగస్వామం వహించిన నేరం,రెండుసార్లు వ్యభిచారం చేసిన నేరం కూడా రుజువైందని ఇరాన్ న్యాయ వ్యవస్థ కి చెందిన అధికారి ఐక్యరాజ్య సమితి కమిటీ కి వెల్లడించారు. అయితే హత్యానేరంలో దోషిగా తనను నిర్ధారించలేదని, అంతేకాకుండా అసలు తన భర్త ను చంపిన వ్యక్తి ని నిర్థారించి జైల్లో పెట్టారు గానీ అతనికి మరణశిక్ష విధించలేదని సఖినే ఈ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. హత్య చేసిన వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టారంటే సఖినే కొడుకు అతనికి క్షమాభిక్షపెట్టాడు. అయితే సఖినే కు Tabriz లో స్థానిక ప్రాసిక్యూటర్ వ్యభిచారం చేసిందన్న నేరంపై మరణ శిక్ష విధించాడు.

ఎందుకలా అని ప్రశ్నిస్తే..” సమాధానం సులభం. నేను స్త్రీని కాబట్టి. ఈ దేశం లో స్త్రీలను ఏమైనా చేయగలమని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం లో హత్య కంటే ఘోరమైన నేరం వ్యభిచారం. అయితే ఆ వ్యభిచారాల్లో రకరకాలున్నాయి. వ్యభిచారం నేరం లో పురుషుడికి కనీసం జైలు శిక్ష కూడా విధించకపోవచ్చు. అదే స్త్రీకి మాత్రం ఇక అంతటితో ఆమె జీవితం ముగిసిపోవాల్సిందే. ఎందుకంటే భర్తలకు విడాకులిచ్చే హక్కు కానీ, కనీసం మౌలిక హక్కులు కూడా మహిళలకు లేని ఈ దేశం లో ఇవి ఇలానే జరుగుతాయి” అని చెప్తుంది సఖినే.

కోర్టు లో ఈ కేసు కి తీర్పు ని ప్రకటించినప్పుడు సఖినే కి అరబిక్ అర్థం కాకపోవడం వల్ల కోర్టు లో వాడిన అరబిక్ లీగల్ టర్మ్ “ రజ్మీ” అంటే రాళ్ళతో కొట్టి చంపడం అని తెలియలేదు. “ న్యాయాధికారి తీర్పు ని వెల్లడిస్తూ కాగితాలు అందించినప్పుడు నాకు అది రాళ్లతో కొట్టి చంపే శిక్షగా తెలియదు. ఆ తీర్పు కాగితాల మీద సంతకం చేయమంటే చేసి ఇచ్చి మళ్ళీ జైలు లోకి వెళ్ళినప్పుడు తోటి ఖైదీలు నాకు అసలు విషయం చెప్పగానే నేను మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయాను. “అని చెప్పింది ఆమె.
సఖినే తరఫున వాదించటానికి ఆమెకు ఇప్పుడు లాయర్ లేదు. ఆ లాయరు ని, సఖినే కొడుకుని , ఇద్దరు జర్మనీ జర్నలిస్టు లను ఇరాన్ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టింది. ఎలాగోలా ఆమె లాయర్ Mohammad Mostafaei దేశం వదిలి పారిపోవడం తో ఆమె పరిస్థితి మరీ దారుణం గా ఉంది. “ లాయర్ ని వదిలించుకోవటం వల్ల వాళ్ళు నా మీద సులభం గా ఎలాంటి ఆరోపణలనైనా మోపవచ్చు. అతని తీవ్ర కృషి వల్లనే ఇప్పటికీ రాళ్లతో కొట్టించుకొని చనిపోకుండా నేనింకా బతికే వున్నాను” అని చెప్పింది సఖినే.
ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఆ లాయర్ సఖినే కేసు చేపట్టి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినందుకు అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ కావడం తో అతను టర్కీ పారిపోయాడు. అతని భార్య ను భయంకరమైన ఎవిన్ జైల్లో పెట్టారు.
Tabriz జైల్లో జీవితం గురించి సఖినే ఇలా చెప్పింది. “ జైలు గార్డులు నాపట్ల సరైన విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన ప్రతి రోజూ .రాళ్లతో కొట్టే చంపుతున్నట్లే వుండేవి. తన విషయం లో ఇరాన్ ప్రభుత్వం మీద అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే తన విడుదలకు ఉన్న ఒక చిన్ని ఆశ “ అని ఆమె ఎదురుచూస్తోంది. “ దయచేసి నా కొడుకు కళ్ళెదుట నన్ను రాళ్ళతో కొట్టి చంపకండి” అని ఆమె ప్రభుత్వాన్నిఆమె అప్పట్లో వేడుకుంది.

కల్పనారెంటాల

11 వ్యాఖ్యలు:

Anonymous said...

Too Sad.

SRRao said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

- శి.రా.రావు
శిరాకదంబం

శరత్ చంద్ర said...

ఇరాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల చరిత్ర చూస్తే, ఒక దేశం కొన్ని శక్తుల వల్ల కొన్ని దశాబ్ధాలు వెనక్కి ఎలా వెళ్ళ గలదో తెలుస్తుంది. అప్పుడప్పుడు అమెరికా ఇరాన్ ని వదిలేసి అనవసరంగా ఇరాక్ వెళ్ళారేమో అనిపిస్తుంది.

ఇందు said...

చదువుతుంటే చాల బాధ అనిపించింది.అలాంటి నీచమైన,కఠినమైన చట్టాలు అమలులోకి రాకుండా చూడాల్సిన భాద్యత అంతర్జాతీయసమాజం పైన ఉంది కదా! మరి వారెందుకు ఏమీ చేయలేకపోతున్నారు?? దీనికి ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోవచ్చు...కాని నావంతుగా సంతకం అయినా పెడతాను...

మీకు,మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు కల్పన గారు :)

Indian Minerva said...

@శరత్ చంద్ర: మీరన్నది చాలా వరకు నిజం. ఈనాడు తీవ్రవాదం ఇలా చెలరేగిపోవడానికి కారణాలు పరోక్షంగా ఇరాన్‌లో వున్నాయి. ఖొమైనీ దృష్టిని సౌదీ రాజకుటుంబమ్నుంచి మరల్చి కదా తాలిబన్లకు ప్రాణంపోశారు. అసలామాటకొస్తే ఖొమైనీ అధికారంలోకి రావడంలో కూడా అమెరికా పరోక్షపాత్రవుంది. కానీ ఇరాన్ దగ్గర చమురేకాదు అణుబాంబు కూడా వుంది అందుకే అమెరికా తెంపరితనంతో వ్యవహరించదు. అదే ఇరాక్ ఐతే పరిచయంవున్న యుధ్ధరంగం, వాడిదగ్గరేమీలేవని తెలుసు కాబట్టి తమ బలాబలాలు పరీక్షించుకున్నారు.

Anonymous said...

/ఒక దేశం కొన్ని శక్తుల వల్ల కొన్ని దశాబ్ధాలు వెనక్కి ఎలా వెళ్ళ గలదో తెలుస్తుంది/
ఆ శక్తులను ఆఫ్ఘనిస్థాన్లో సృష్టించింది పెంచి పోషించింది అమెరికానే అని మీకు తెలియదు కాబోలు. ప్రాచీన సంసృతి బాగ్దాద్ ని డర్టీబాంబ్, కెమికల్ బాంబులున్నాయనే సాకుతో చెరిచింది అమెరికా, బ్రిటన్లే. అమెరికా, బ్రిటన్లకి అలాంటివాటికి ఏసాక్ష్యాలు దొరకలేదు. సీనియర్ బుష్షు చేయలేనిదాన్ని జూ| బుష్షు చేసి పగ సాధించాడు అంటారు. అనవసరంగా యుద్ధాన్ని చేసి లక్షలాది అమాయకులను చిత్రహింసల పాల్జేసి చంపారని వికి లీక్స్ బయట పెట్టిన రహస్య పత్రాలు చెబుతున్నాయ్. అమెరికా దురుద్దేశ్యాలు తెలీక ఇరాన్ మీద దాడి చేసి వుండాల్సిందని మీరనడం ఏం బాగో లేదు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ హబ్ పాకిస్థాన్ అని సాక్ష్యాలు, అనుభవాలు చెబుతున్నా దాడిచేయకుండా బిలియన్ డాలర్ల సాయం ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా?

సాకి కేసు దురదృష్టకరం. వాళ్ళ ఇస్లామిక్ చట్టాలు అలా వున్నయి మరి. అలాంటి చట్టాలు ముస్లిం దేశాలైన ఇండోనేషియా, పాకీలాండ్, మలేషియాల్లో లేవెందుకో!
అఫ్జల్, కసబ్లకు మరణశిక్షే వుండకూడదని విదేశీయుల్లో( పాకీ లాండ్, బంగ్లా, సౌది) సంతకాలు చేస్తే ఇండియా ఓకే అని రద్దుచేస్తుందా? చేయాలంటారా?
వాళ్ళకు అంత ఖటినమైన చట్టాలు వుండాలని ల ఇలహ ఇల్లల్లాహ్ రసూల్ అల్లాహ్ చెప్పినపుడు, కాదంటానికి మనమెవ్వరం? అది ఒక సర్వస్త్తాక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే.

Indian Minerva said...

"అది ఒక సర్వస్త్తాక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే."
@snkr గారు: ఇది కొంచెం over statementగా అనిపించట్లేదూ. ఇక్కడ సంతకాల ద్వారా విజ్ఞప్తులు పంపబడుతున్నాయేగానీ యుధ్ధాలుజేయమని తాఖీదులైతే కాదుగా. కసబ్‌కూ సాకీకి పోలిక కూడా సరనిపించలేదు నాకు.

Anonymous said...

Minerva, బుధవారం ఉరి అంటే గురువారం సంతకాలు సేకరించడం ఓవర్ ఆక్షన్ గా అనిపించట్లేదూ? అలానే ఇదీ.:))
US/West never vehemently protested against similar laws in Saudi Arabia. Why? Is it because they are 'partners'? Just give a thought.

Indian Minerva said...

@snkr gaaruu

:))
అమెరికా - సౌది రాజ వంశాల... కొండకచో లాడెన్ కుటుంబాల మధ్యగల (అక్రమ) సంబంధాల గురించి నాకు కొంతలో కొంత తెలుసండీ. మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా?

Anonymous said...

మినర్వా, నేనో హార్డ్ వేర్ ఇంజనీర్నండి. ఓబామాను గోబ్యాక్ అని చైనావాళ్ళు ఇండియాలో తమ కుక్కలని ఉసిగొల్పినట్టు, తమకు నచ్చని వాళ్ళ మీద మానవహక్కుల కుక్కలను ఉసిగొల్పటం అమెరికా అనాదిగా చేస్తున్నదే. లాబీయింగ్ చేయటం అమెరికన్లకు ఓ సాంప్రదాయ బిజినెస్.
వీళ్ళ సంతకాలకు బెదిరి పోయి శిక్ష ఆపేశారనే మీరూ నమ్ముతున్నారా? ... నేనూ అలానే అనుకుందామని డిసైడ్ చేశాను. తృప్తి ముఖ్యం కదండి. :P :)

Kalpana Rentala said...

SNKR, Indian Minerva gaaroo,

ఈ ఉరిశిక్ష చుట్టూ వున్న రాజకీయ కారణాల గురించి కూడా మీరిద్దరూ చర్చించటం బావుంది.
సఖినే కేసు లో చివరి నిముషం లో సంతకాల ఉద్యమం అనేకానేక అనుమానాలకు తావిస్తున్నా..ఈ అంశం చుట్టూ వున్న రాజకీయ కారణాలు ప్రస్తావించకపోవటానికి ఒక్కటే కారణం. ఇది సమయం, సందర్భం కాదు అనుకోవటమే. అమెరికా కర్రపెత్తనం గురించి, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా అనవసర జోక్యం, కొన్ని దేశాల విషయాల్లో చూసీ చూడనట్లు పోయే వైఖరి వీటి గురించి ఎన్ని వ్యాసాలు రాసినా, చదివినా సరిపోదు.

అయితే సఖినే కేసు లో సంతకాల ఉద్యమానికి సంబంధించినంతవరకూ ఎవరెవరు ఏ కారణాలతో ఈ ఉరిశిక్ష ని వ్యతిరేకించినప్పటికీ, నేను మాత్రం ఆ ఉరిశిక్ష ఆగితే చాలు అనుకోవటం వల్ల ఆ సంతకాల ఉద్యమాన్ని గురించి తెలియచెప్పాలిసి వచ్చింది.

చివరి 24 గంటల్లో మనం ఎన్ని సంతకాలు చేస్తే మాత్రం ఉరి ఆగిపోతుందా అన్న నిరాశే ని మొదట కలిగినప్పటికి అంతకు మించి మార్గం కనిపించలేదు.మన సంతకం పని చేసినా చేయకపోయినా ఆమె ఉరిశిక్ష ఆపారు. అది చాలు అనిపించింది.
ఇందూ, శరత్ మీ సపోర్ట్ కి థాంక్స్.

 
Real Time Web Analytics