నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, January 24, 2012

ప్రేమ నురగల కాపూచ్చినో “తన్హాయి”

నవలలు చదివి చాన్నాళ్ళయింది. అంతర్జాల ఇంద్రజాలంలో ఇరుక్కునిపోయి దశాబ్దకాలంగా పెద్దపుస్తకాలని బుక్‌షెల్ఫ్ కే పరిమితం చేసేసిన ఈ రోజుల్లో ఈ “తన్హాయి”నవల పాత అలవాటుని తిరగతోడినట్టయింది. 70, 80 దశకాల్లో ప్రముఖ(?) రచయిత్రులుండేవారు. అప్పట్లో వారి కథల్నీ, నవలల్ని చదివేవాళ్ళం ఇంక వేరే మార్గంలేక. ” మెత్తటి, నల్లటి తారు రోడ్డుమీద విమానం లాంటిపెద్ద కార్లూ, ఓ గొప్పింటి అబ్బాయి ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించడం”.…కొన్ని మలుపుల తర్వాత అది పెళ్ళిగా పరిణమించడం.ఇలా సా.…..గేవి అప్పట్లో ఆ నవలలు.ఆ తర్వాత మరికొంతమంది ప్రవేశంతో తెలుగు నవలాప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉండేసరికి పాఠకుడికి ఊపిరిపీల్చుకున్నట్టయింది. కాని “తన్హాయి” కొత్త ఒరవడి.
ప్రేమ.
అత్యంత బలమైన సబ్జెక్ట్ సాహిత్యంలో ఏ ప్రక్రియలోనైనా. ఈ సబ్జెక్ట్ లేని నవలదాదాపు లేనట్టే ఏ సాహిత్యంలో నైనా. అయితే “తన్హాయి” ప్రేమకోసం మాత్రమే ప్రేమగా రాసిన నవల. ఇద్దరు ప్రేమికుల అంతరంగాన్ని ప్రేమ రంగుల్లో ఓ అపురూప బొమ్మగా పెయింట్ చేసి ఆ బొమ్మకి “తన్హాయి” అని మంచి పేరు పెట్టివదిలారు రచయిత్రి. ప్రతీ పదం, ప్రతీ భావన చదివి గుండెల్లో భద్రపర్చుకోవాల్సిన పుస్తకం. భద్రపర్చుకుంటారు కూడా!


ఏం ఉంది ఈ కాఫీలో?
కవయిత్రి నవలా రచయిత్రిగా అవతరించడంలో ఉన్న అడ్వాంటేజి తన్హాయిలొ స్పష్టంగా కన్పిస్తుంది. కల్పనగారికి ఇది మొదటి నవలే అయినా చదువుతున్నంతసేపు ఆమెకి సాహిత్యంతో ఉన్న సాన్నిహిత్యం చాలా పుటల్లో గోచరిస్తుంది. “పోటి పెట్టుకుంటే మిమ్మల్ని గెలవగలిగేంత, మిమ్మల్ని గెలుకోగలిగేంత…” అని, అదే పేజీలో “నేను ప్రేమకి ప్రేమికుణ్ణి” అని కౌశిక్ అన్డం లాంటి వాక్యాలలో రచయిత్రికి భాషపై ఉన్న మమకారం, పదాలతో ఆటాడుకోవటాం వంటివి సుస్పష్టం.ఎంతో సున్నితమైన భావాలని ఇలా చెప్పడం కవిత్వ సాన్నిధ్యంలో ఉన్నవాళ్ళ రచనల్లోనే కన్పడ్డం సహజం. పేజీ 181 లో “ఒంపులు తిరిగిన లోయమీద తన కళ్ళతో ఎవరో అందమైన కార్తీక దీపాలు వెలిగించినట్టయింది. ఆ దీపం వెలుగుకి ఆ లోయంతా జ్వలించింది” లాంటి గొప్ప భావుకత్వపు ప్రకటనలు పుస్తకాన్ని చూసినప్పుడల్లా వెంటాడుతూనే ఉంటాయి.
చాలా పేజీల్లో కన్పించే కొన్ని ఆంగ్ల ఎక్స్‌ప్రెషన్స్, అమెరికా నేపథ్యపు జీవనవిధాన చిత్రీకరణ ద్వారా ఈ నవల టార్గెట్ రీడర్స్‌ని రచయిత్రి ముందే ఫిక్స్ చేసినట్టుగా అన్పిస్తుంది.

పేజీ ఇరవై అయిదు ఈ నవలకి ప్రాణం. కల్హార కౌశిక్‌ల మధ్య ప్రేమాంకురార్పణ జరిగింది ఇక్కడే. ఈ సన్నివేశాన్ని రొమాంటిక్‌‌గా చిత్రీకరించడంలో మళ్ళి రచయిత్రికి తనకవిత్వపు నేపథ్యం పనికొచ్చిందనడంలో సందేహంలేదు. నిజానికి ఈ నవల ఓ ప్రేమ భాండాగారం. మనసు బాగులెనప్పుడు బుక్‌‌షెల్ఫ్ నుండి “తన్హాయి” ని తీసుకుని ఏ పేజీతిప్పి చూసినా కోకొల్లలుగా ప్రేమ కోట్స్ మనల్ని అలరిస్తాయి అందంగా కల్హార లా. ఏ పేజీనుంచైనా మళ్ళి మొదలుపెట్టి ప్రేమసుగంధపు పరిమళాన్ని అస్వాదించొచ్చు.
నాలుగుపాత్రల నాలుగుస్తంభాలాటలో కల్హార పాత్ర ప్రధానమైనదే అయినా ప్రతీ పాత్రకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వడమైనది. నాలుగుపాత్రల్లో చైతన్య మానసికంగా బలహీనుడిలా కన్పడితే మోనికా డిఫరెంట్‌గా strong minded గా కన్పడుతుంది. నిజానికి కల్హార పాత్రకి మోనికా ఓ సౌండింగ్ బోర్డ్ గా, కల్హారని ఎలివేట్ చెయ్యటంకోసమే మోనికా క్రియేట్ కాబడిందన్నది స్పష్టం.
కౌశిక్ తన జీవితంలోకి వొచ్చేవరకూ తన తన్హాయిని గుర్తించలేకపోవటం ఒక్కసారిగా మనసు నిండా ప్రేమచేరే సరికి తను ఓ పెళ్ళయిన భారత స్త్రీనన్న విషయం కల్హార అలజడికి కారణాలు. ప్రేమ ఆరాటం, కుటుంబ బాధ్యతల ఆలోచనల మధ్య నలిగిపోతూ భారత స్త్రీ ఏ సమాజంలో ఉన్నా ఎంత విద్యాధికురాలైనా తన లిమిటేషన్స్‌ని దాటి రాలేని క్యారక్టర్ గా కల్హార పాత్ర రూపుదిద్దుకోవటం నవల ప్రధాన ఇతివృత్తం.
కౌశిక్ పాత్రతో ప్రతి పాఠకుడు ఐడెంటిఫై చేసుకునే విధంగా చాలా చతురతో మలిచారు ఆ పాత్రని. ఇక మృదుల మన ఇళ్ళలో కన్పడే తెలివిగా ఆలోచించే అమ్మాయి. ఆమె చైతన్యకి భిన్నంగా ఆలోచించడం ఈ శతాబ్దపు భారత స్త్రీ ఆలోచనా విధానానికి అద్దం…ఆమె నవల్లో తక్కువ కన్పడ్డా మనపై ఆమె ముద్రకేం తక్కువలేదు. ప్రతీ వ్యక్తికి ఈ సమాజంలో తమ చుట్టూ ఉండె చట్రాన్ని అధిగమించే అవకాశం లేదని అక్షరీకరించిన విధానం ఈ నవల చివరివరకూ చదివించేలా చేస్తుంది.…..తమ చదువు, ఉద్యోగం, జీవనవిధానం ఏ స్థాయిలో ఉన్నా సగటు భారతీయుడు ఎక్కడ ఉన్నా ఇలానే ఉండగలడు. ఉండాలి కూడా అన్న సందేశం చాలా పవర్‌‌ఫుల్ గానే అందిచడంలో రచయిత్రి విజయం సాధించినట్లె…
ప్రతీ నవల ద్వారా మనం ఏదో పొందటానికి రచయితలు మనకి ఏదో ఇచ్చే మెజీషియన్సో, ఋషులో కాదు. అయితే ఒక్క మాట. నవల పూర్తిగా చదివేశాక పుస్తకం మూసేముందు మరోసారి 114 వ పేజీలో ఉన్న చిన్న కవిత “రాత్రి రాలిపోయిన పూలకోసం” చదవండి. మీరు దేనికొసం వెతుకుతున్నారో అవన్నీ దొరుకుతాయి.
సగటు పాఠకుడు ఊహించే మలుపులేమీ లేకపోయినా ముగింపు విషయంలో పాఠకుడూహించిన ట్విస్ట్ లేకపోవడమే ఈ నవలకి పెద్ద ట్విస్ట్. ఇద్దరు పెళ్ళయిన స్త్రీ పురుషుల మధ్య ప్రెమ అంకురించినా ఇంతకంటే జరిగేదేమీ ఉండదని చెప్పడమే రచయిత్రి ఉద్దేశ్యం. అలా ఓపెన్ ఎండెడ్ ముగింపు ముచ్చటైన స్వస్తి.

ఈ స్ట్రాంగ్ కాఫీకేం తక్కువ?
ఏ రచయితా/రచయిత్రీ బాగా రాయటం, రాయకపోవటం వంటివి ఉండవు. ఓ రచనలో మనకి నచ్చినవి, నచ్చని విషయాలో మనకు నచ్చని భాషో ఉండడమే మనకి ఆ రచనపై విమర్శ చేసె అవకాశం ఉంటుందని నిర్వివాదాంశం. “తన్హాయి” లోకూడా రచయిత్రి ఫలానా చోట బాగా రాయలేదనొ నవల ఆద్యంతమూ అత్యద్భుతంగా ఉందనో చెప్పలేం కాని ఇలా కాకుండ ఉంటే రచన ఇంకా బావుండేదనే అభిప్రాయంలో చెప్పాల్సిన విషయాలు:
నవల ఓ రేడియో కథానిక లా ఏకపక్షపు నెరేషన్ లా కాకుండా రచయిత చెప్పదల్చుకున్న విషయాల్లో ఎక్కువభాగం పాత్రల సంభాషణలో చెప్పడమే పాఠకులు కోరుకునేదని నాఅభిప్రాయం. కాని “తన్హాయి”లో చాలా తరచుగా రచయిత్రి పాత్రలకి, పాఠకులకి మధ్యలోకి రావటం తనచెప్పదల్చుకున్న విషయాన్ని అదేపనిగా చెప్పడం కొంత నిరాశ కలిగించిన అంశం. పేజీ 29లో ఎక్కడా సంభాషణ కన్పడదు. అలాగే కొన్ని భాగాలు (ఉదాహరణకు ముప్పై) పూర్తిగా ఓ లెక్చర్‌‌లా అన్పిస్తాయి.నిజానికి ఆ విషయాలన్ని మరేదైనా పాత్రద్వార చెప్పించి ఉంటే.….అలాగే కొన్ని భాగాల్లో పూర్తిగా ఎక్కడ డైలాగుల్లేకూండా రచయిత్రే అంతా చెప్పెయండం, మోతాదుమించిన పాత్రల అంతరంగ విశ్లేషణ వెరసి అప్పుడప్పుడు “ఈ విషయాలన్నీ ఇంతకుముందే చెప్పారు, చదివాం కదా.……ఇంతకీ ముగింపేంటనే” పాఠకుడు ఆలోచిస్తే అందులో అతని తప్పేంలేదన్పిస్తాది.
అలాగే పాఠకుడికి రిలీఫ్ నిచ్చే హాస్యరసాన్ని పూర్తిగా విస్మరించారనే విషయం కూడా తప్పు కాదేమొ.…నవల పూర్తిగా సీరియస్ రాగంలో నడిచింది. అసలే పాఠకుడికి తెల్సిన అంశం కావటంతో ఇక నవలని నడిపించే బాధ్యతలో భాగంగా అక్కడక్కడ కొన్ని సరదా సన్నివేశాల అవసరం చాలానె ఉండింది.
కవర్ డిజైనింగ్ లో మరికొంత శ్రధ్దతీసుకోవాల్సిందేమో!

ఏమైనా, రీడింగ్ హ్యాబిట్స్ తరిగిపోతున్న ఈ రోజుల్లో “తన్హాయి” లాంటి మంచి పుస్తకం మళ్ళీ తెలుగు నవలా లోకానికి మంచి సంఖ్యలో పాఠకుల్ని తెచ్చిపెడ్తుందని నా నమ్మకం. మళ్ళీ కల్పనా రెంటాల నుండి మరో పుస్తకం కోసం ఎదురుచూసేలా “తన్హాయి” ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.

వాసుదీవ్

శ్రీనివాస వాసుదేవ్ తన బ్లాగ్ లో రాసిన సమీక్ష ఇది . బ్లాగు లింక్ ఇది .http://vinaayakaveena.blogspot.com/2012/01/blog-post.html


ఫేస్ బుక్ లో తన్హాయి గ్రూప్

తన్హాయి నవల బయటకు వచ్చి దాదాపు నెలన్నర రోజులు కావస్తోంది. పాఠకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పుస్తకం కోసం అభిమానం తో ఎదురుచూసిన పాఠకులకు ఈ సందర్భంగా మరో సారి కృతజ్నతలు.

ఫేస్ బుక్ లో తన్హాయి గ్రూప్

తన్హాయి పుస్తకం మీద తమ అభిప్రాయాలూ , ఆలోచనలు, అనుభూతులు పరస్పరం పంచుకునేందుకు ఫేస్ బుక్ లో ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటయింది. ఎంతో మంది పాఠకులు తన్హాయి మీద తమ అభిప్రాయాలను అక్కడ పంచుకుంటున్నారు. ఆసక్తి గలవారు ఆ గ్రూప్ లో చేరవచ్చుhttp://www.facebook.com/groups/285937414775795/

సమీక్షా వ్యాసాలు

. ఒక పుస్తకం మీద పత్రికల్లో రివ్యూ లు రావటం సహజం. కానీ పాఠకుల నుంచి నేరుగా తమ అభిప్రాయాలూ తెలుసుకోవటం ఒక మంచి అనుభవం. ఒకొక్కరూ ఒక్కో కోణం నుంచి నవల ను పరిశీలిస్తున్నారు. విశ్లేషిస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఇది ప్రేమరాహిత్య నవల అని ఒకరంటే, ఇది ప్రేమ నురగల కాపూచీనో అని ఒకరన్నారు. ఈ తన్హాయి ఒక నవల మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితం అని మరొకరు....విషాద ప్రేమ కాంక్షా పూరిత కథ అని కొందరు .... ఇవి కాక వ్యక్తిగతం గా మెయిల్స్, ఫోన్ ల ద్వారా తమ అభిప్రాయాలూ తెలియచేస్తున్న పాఠకులకు మరో సారి ధన్యవాదాలు. .. ఒక మంచి పుస్తకం విడుదలయితే చదవటానికి పాఠకుlu ఇంకా మిగిలే వున్నారని మరో సారి నిరూపణ అయింది.

 
Real Time Web Analytics