నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, January 29, 2010

నామిని మాటల్లో నిజమెంత? విలువెంత?

నామిని “ పచ్చ నాకు సాక్షిగా “ కు పాతికేళ్ళు వచ్చాయి. ఈ సందర్భం గా ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూ, ఈ సందర్భం గా తిరుపతి సభలో చేసిన ప్రసంగ పాఠం చదివాక నాకు కలిగిన అభిప్రాయాలు ఇవి.
నిస్సందేహం గా నామిని మంచి రచయిత. అతను రాసిన పుస్తకాల్లో విలువైన విషయాలు, ఇంతకు ముందు ఎవరూ మాట్లాడని విషయాలు వున్నాయి. అంతవరకు నాకెలాంటి అభ్యంతరం, అనుమానం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే కొన్ని విషయాల పట్లే నా అభ్యంతరం మొత్తం కూడా. కాబట్టి ఇది నామిని కి వ్యతిరేకం అని కాకుండా అతని అభిప్రాయాలకు మాత్రమే వ్యతిరేకం అన్న విషయంలో నేను స్పష్టం గా వున్నాను.

మొన్నోకసారి ఇదే బ్లాగ్ లో వేరే సందర్భం లో ( ద్రౌపదీ వివాదం సందర్భం గా) మాట్లాడినప్పుడు) వాల్మీకి, వ్యాసుడు, పోతన ల గురించి....నేనొక అభిప్రాయం వెలిబుచ్చాను. వాళ్ళు గొప్ప కవులు..( కవిత్వం రాసిన వారు అని కాదు. గొప్పకావ్యాలు రాసిన వారు అని). వాళ్ళు మరో రకంగా కూడా గొప్పవారు. వినయ గుణ సంపన్నులు.వాళ్ళకు అహంకారంలేదు. వాళ్ళు నిరహంకారులు. వినయాన్ని భూషణం గా ధరించినవారు. విద్య వినయాన్ని ఇవ్వాలి. అదే దానికిసహజాభరణం. విద్య వున్నచోట అహంకారం వుంటే భాసించదు. నామిని లాంటి పెద్దవాళ్ళను విభేదించటం అభిప్రాయాలరీత్యా నే కానీ వారి రచనల పట్ల, వారి వ్యక్తిత్వాల పట్ల అగౌరవంతో కాదు.

భర్తృహరి సుభాషితాల్లో అనుకుంటాను ఒక మంచి మాట చెప్పాడు.
“డబ్బు వున్న వాళ్ళు ఆ వూర్లోనే గౌరవించబడతారు...విద్య వున్నవాడు ఎక్కడికెళ్లినా గౌరవం అతని వెన్నంటే వుంటుంది.”

ఆ రకంగా నామిని కున్న పాండిత్యానికి, రచనా నైపుణ్యానికి రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఆయన బతికి వున్నంత కాలం, ఆ తర్వాత కూడా ఆయనకు సాహిత్యపరమైన గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లదు. మరి నామిని కి కావాల్సింది ఏమిటి? కీర్తి ప్రతిష్టలు వున్నాయి. లేనిదల్లా డబ్బే. సరస్వతీ కటాక్షం వున్నవారికి లక్ష్మి కటాక్షం వుండదు అన్నది జనబాహుళ్యం లోని మాట.. పుస్తకం అమ్ముకోలేకపోయానని బాధపడుతున్న నామిని ఎక్కడా? పుస్తకం అమ్ముకోవాల్సి వస్తుందేమోనని బాధపడ్డ పోతన ఎక్కడా? గొప్ప గొప్ప రచయితలు కూడా ఉదర పోషణార్ధం ఉద్యోగాలు చేసుకుంటే నామిని మాత్రం పుస్తకాల మీదే బతకాలనుకున్నాడు. అది అతని తప్పు కాదు. అయితే అందుకు లోకాన్ని, తోటి రచయితలనీ దుమ్ముపట్టాల్సిన పని లేదు అనుకుంటున్నాను.

నామిని ఎంత గొప్పగా రాసినా అంత అహంకారంతో ( రాయలసీమ భాషలో తిమురు కాబోలు) మాట్లాడాల్సిన అవసరం లేదు. తను రాసింది గొప్ప అని ఫీల్ కావడం , తను మంచి రచయిత అన్న ఆత్మాభిమానం ఒక స్థాయి వరకు అవసరం. అది వుండటంలో తప్పు లేదు. మిగతా వారు ఎవరూ ఏమీ రాయలేదని, వాళ్ళకు నిజాయితీ లేదన్నది మాత్రం నిస్సందేహంగా అతని అహంకారమే అనుకుంటాను. నామిని చెప్పాడని ఇవాళ ఎవరూ కేశవరెడ్డి నో, సింగమనేని నో, కేతు విశ్వనాధరెడ్డి నో, వోల్గా నో పక్కన పెట్టేయరు. నామినికి వాళ్ళ రచనలు నచ్చనంత మాత్రానా, నిజాయితీ కనిపించకపోయినంత మాత్రాన , వాళ్ళ రచనల్ని ఎవరూ ఆదరించకపోరు. వాళ్ళ రచనల్ని ఆడోల్లు చదవలేరు అని నామిని ప్రకటించేశాడు. నామిని! మీ అభిప్రాయాలు మీరు నిష్కర్ష గా ప్రకటించుకోండి. “ ఆడోళ్ళతరఫున మీరేమీ వకాల్తా పుచ్చుకోనక్కరలేదు. మీ సానుభూతి, మీ తోడ్పాటు అవసరం లేకుండానే రచయితల రచనల్లో నిజాయితీ లేకపోతే వాళ్ళు తిరస్కరించగలరు.. వాళ్ళకేమి కావాలో వాళ్ళకు బాగానే తెలుసు అనుకుంటాను.

తనది మాత్రమే ప్రజా సాహిత్యం అని, మిగతా రచయితలు రాసేదంతా దొంగ సాహిత్యమని, కొందరు రచయితలు రైతుల్ని, రైతు భార్యల్ని హింసించారని నామిని నిరాధారమైన ఆరోపణలు ఎలా చేయగలిగాడో నాకు అర్ధం కాలేదు. చేరాల కోసం, వోల్గా కోసం, వాసిరెడ్డి నవీన్ కోసం రచయితలు మీరు అనుమానించినతగా దిగజారిపోలేదు. వాళ్ళకు అభిమానులే కానీ వారసులు లేరు. మాటకొస్తే మీఅడుగుజాడల్లోనడిచేందుకు పుట్టుకొచ్చిన రచయితలేవరో మీకు , మాకూ ఇద్దరకూ తెలుసు.

చదువులా….చావులా ? రాసింది నిజంగా పిల్లలమీద, విద్యావ్యవస్థ మీద గౌరవం, ప్రేమతోనా? లేక నామిని నే వొప్పుకున్నట్లు ప్రజా సాహిత్యం అమ్ముడుపోదని, రూటు మార్చి పిల్లల చదువుల మీదా రాశాడనుకోవాలా ? అదే నిజమైతే అతని నిజాయితీ మాత్రం ఏపాటిది?

నామిని సాహిత్యం ఒక్కటేనా ఇవాళ క్లిష్ట పరిష్టితుల్లో వున్నది? నామిని ఒక్కడేనా ఇవాళ పేద రచయిత? శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి లాంటి మహా రచయిత చివరి స్థితి ఎంత దుర్భరంగా గడిచిందో అప్పుడే అందరూ మర్చిపోయారా? అప్పుడు, ఇప్పుడూ కూడా వెయ్యి పుస్తకాలు వేస్తే, అమ్ముకోలేక సొంతంగా పంచిపెట్టుకునే దుర్భర స్థితి లోనే వున్నారు తెలుగు రచయితలు . నామిని అందుకు మినహాయింపు మాత్రం కాదు. తిండికి గడవలేని స్థితి లో నామిని వున్నాడని నేను అనుకోను. హోటల్ లో సర్వర్ గా పనిచేస్తూ, తినటానికి తిండి కూడా లేని అతి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి కూడా కథలు రాసిన శారద ని కూడా మనం చూశాం. తిరుమల రామచంద్ర, సహవాసి, అనతపురం లోని అనువాదకుడు కేశవరావు గారు లాంటి ఇంకా అనేకానేక మంది పేద రచయితలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతున్నారు .. నామిని ది గంజి నీళ్ళు కూడా తాగలేని పేదరికం అనుకోను. వెయ్యి కాపీలు కూడా అమ్ముకోలేకపోతున్న స్థితి లో ఎన్నో తరాలుగా రచయితలు వుంటే లక్ష కాపీలు వేసి అవి అమ్ముడుపోలేదని ఎవర్ని నిందిస్తున్నారు నామిని మీరు?

మా పక్క వూరు హ్యూస్టన్ లో ఒక రాజు గారున్నారు. పేరు కి రాజు. ఆయనకు ఎంత పాటి ఆస్తి వుందో నాకు తెలియదు కానీ. ప్రతి ఏడాది పుస్తకాలు అచ్చు వేసి, సాహిత్య పోటీలు పెడుతుంటారు. పత్రికల వాళ్ళే రచనలకు డబ్బులు ఇవ్వకపోతే ఈయనేమో కథలకు, కవిత్వాలకు కూడా నూటపదహార్లు (డాలర్లు ) సమర్పించుకుంటుంటారు. ఆయనకు డబ్బు చేదా? ఎవరైనా ఆయనను సాహిత్య సేవ చేయమని బతిమిలాడారా? ఆయన లాంటి వారి బాధను ఇప్పటివరకు ఎవరైనా పట్టించుకున్నారో లేదో తెలియదు. అమెరికా వాళ్ళ దగ్గర అప్పనంగా డబ్బు వుంటుందని కొందరి భ్రమలు. వారికి మనమేమీ చెప్పలేం. ఒకప్పటి భారతి నుండి, మొన్నటి ఆహ్వానం, ఈనాటి తెలుగునాడి వరకూ సాహిత్య పత్రికలు మూత పడటం తెలుగు సాహిత్య చరిత్ర లో మర్చిపోలేని నిజాలు .

సాహిత్యం కోసం సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు, నట్టేట మునిగిన వారు ఎందరో వున్నారు. వారి కన్నా నామిని పరిస్థితి ఏ రకంగా తేడా ? నామిని కూడా ఆ స్థితి లోకి వెళ్ళాలన్నది కాదు నా అభిమతం. ఇవాళ నామిని బాధ కొందరికి ఎందుకు “ అద్భుతం” గా అనిపిస్తోందో నాకు అర్ధం కావటం లేదు. నాకైతే నామిని వి అకారణ నిందలు అనిపించాయి.

పిల్లల పుస్తకాలు ఎవరు చదవాలి? ఎవరు కొనాలి అనే దాంట్లో నామిని మాట్లాడిన మాటలు మాత్రం చేదు నిజం. నామిని వెనకాల రంగనాయకమ్మ, బాపు, రమణ లాంటి మహామహులున్నారు. అలాంటి వాళ్ళేవ్వరూ లేకపోవడం వల్ల అంటరాని వసంతానికో, కక్క కో, ది లాస్ట్ బ్రాహ్మిన్ కో డబ్బు సంగతి దేవుడెరుగు ,రావాల్సిన గుర్తింపు కూడా రాలేదు. దానికి మనం ఎవరిని నిందించాలి? పుస్తకాలు అమ్ముకోవటం కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ చేసిన వారికా? అవార్డుల పేరుతో కీర్తిని నడి బజారులో వేలం వేస్తున్నవారినా? పుస్తకాల అమ్మకాల్లో 40 శాతం ముక్కుపిండి రచయితల డబ్బు ని వసూలు చేసుకుంటున్న పుస్తక విక్రేత సంస్థలదా? అందువల్ల పుస్తకాల ధరను రెట్టింపు చేయాల్సిన పరిస్థితి లో వున్న రచయితలదా? ఎవరిది తప్పు?

కల్పనారెంటాల

(నామిని ఇంటర్వ్యూ ని ఇక్కడ, ప్రసంగపాఠాన్ని ఇక్కడ చదవండి.)

25 వ్యాఖ్యలు:

Chowdary said...

(వ్యాఖ్య కాదు)

ఇంటర్వ్యూకి, ప్రసంగానికి లింకు ఒకటే ఇచ్చారు.
ప్రసంగం లింకు పిడిఎఫ్ ఫైలుకి ఇస్తే పర్మనెంటుగా ఉంటుంది.
అన్వర్ బ్లాగుసైటు-లో అనుకుంటా ఉమా చేసిన ఇంటర్వ్యూ, ప్రసంగం రెండూ ఉన్నాయి.

శ్రీ..... said...

interview link kuuda same ichaaru..okasari check chesi mallee ivvandi..thank youu

oremuna said...

Only message I got is
there is lack of good publisher in Telugu book industry. Why should an author worry about selling his book? rather he should write more of such books.
my e paisa.

సుజాత వేల్పూరి said...

మీ వ్యాసంలో కొన్ని నిజాలున్నాయి. వాటిని ఒప్పుకుంటూనే నామిని ని వ్యక్తిగతంగా తెలిసిన ఒక అభిమానిగా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను.ఇది నామినిని సమర్థించే ప్రయత్నం కాదు.

ముందు మీరసలు పోతన ని ఏ ఇతర రచయితలతోనూ,కవితోనూ కలిపే ప్రయత్నం చేయకూడదు.అందునా అది ఈ కాలంలో అసలే పనికి రాదు. నాలుగు కవితలు నాలుగు పత్రికల్లో రాగానే ఒక సంకలనం, ఒక ఆవిష్కరణ సభ,పది పొగడ్తలు..పుస్తకాల కొట్టు! (ఎవరికీ తెలియని, ఏ మాత్రం పసలేని ఇలాంటి పుస్తకాలు పుస్తకాల షాపుల్లో కోకొల్లలుగా ఉంటాయని మీకు చెప్పక్కర్లేదు)

నామిని భాష, నామిని కథల్లోని సబ్జెక్ట్ ఒక జంఝా మారుతంలాగా పాఠకుల్లోకి దూసుకొచ్చింది.దరిద్రాన్ని అంత నగ్నంగా ప్రేమాభిమానాల పానకంలో ముంచి రాయలసీమ యాసలో అందించడం అందరికీ కొత్త.

డబ్బు లేక ఆయన ఎక్కువ కాపీలు వేసుకోలేకపోయి ఉండొచ్చు కానీ ఆయన పుస్తకాలు (కొత్తగా రాసినవేమీ లేకపోగా పాతవే మళ్ళీ మళ్ళీ వేసినా)జనామోదం బాగానే పొందాయి. స్కూలు పిల్లల గురించి ఆయన రాసింది రూటు మార్చి కానేకాదు.వాళ్ళ బాధల్ని స్వయంగా చూశాడు కాబట్టే రాశాడని నేను నమ్ముతున్నాను.రాశాడు కాబట్టే ఆ పుస్తకాలు నలుగురిలోకీ చేరాలని ఆశపడ్డాడు.

కేవలం ఆయన పుస్తకాల మీద ఇష్టంతోనే జనం ఇవన్నీ కొన్నారు, చదివారు గానీ ఆయన వెనక రంగనాయకమ్మో,బాపూ రమణలో ఉండటం వల్ల కాదు.ఒకవేళ వారితో ఆయనకు ఎంత దగ్గరి పరిచయం ఉన్నా, నామిని వాటిని ఉపయోగించుకునే రకం కాదు. అది ఆయన్నెరిగిన వారందరికీ తెలుసు.బాపు రాసిన ఉత్తరాన్ని ఆయన తన పుస్తకం కవర్ పేజీ వెనక ప్రచురించుకోవడం కేవలం ఇష్టంతోనే!

నామిని బాధ నాకు సహజంగా అనిపించింది కానీ అద్భుతంగా కాదు. అంతే కాదు నామిని బాధలో నాకు నామినే కాక అటువంటి రచయితలెంతోమంది గొంతులు వినపడ్డాయి. వేసిన మంచి పుస్తకాలను అమ్ముకోలేని ప్రతి రచయిత ఆవేదనా ఈ ప్రసంగం లో కనిపించింది.


నిజంగా, పుస్తకాలమీదే బతకాలని నామిని అనుకుంటే ఎన్నెన్నో రాసేవాడే! తనకున్న పరిచయాలని ఎన్ కాష్ చెసుకుంటూ హైద్రాబాదులోనే ఉండేవాడు.కటిక దరిద్రం అనుభవించేవాడేకాదు. కనీసం ఒక ఆల్టో కొనుక్కోగలిగేవాడే కానీ క్రిక్కిరిసిన సెవన్ సీటర్ ఆటోలలో తిరిగేవాడు కాదు. ఆయనకు పరిచయాల్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నా వాటిని ఆత్మాభిమానం డామినేట్ చేయడం వల్లే తిరుపతి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ప్రముఖ దినపత్రికలు ఒక్క వీక్లీ కాలం రాయమని ఆయన్ని అడుగుతూనే ఉన్నారు.ఎందుకు రాయవనే మాటకు సమాధానం ఆయన చెప్పడు.

ఆయన మాటల వెనక స్పష్టంగా వ్యక్తం కాని విషయం ఏదో ఉందని అనిపిస్తోంది.అదేమిటో ఆయనే వివరంగా చెప్తే బావుంటుంది.

మీ వ్యాసంలోని మొదటి ఎర్రక్షరాల పేరాతో ఒక్కక్షరం పొల్లుపోకుండా ఏకీభవిస్తున్నాను.

చివరి పేరాలో పుస్తకాల బిజినెస్ గురించి మీరడిగిన ప్రశ్నలకు ఎవరైనా సమాధానాలు చెపుతారా అని చూస్తున్నాను.

Kalpana Rentala said...

చౌదరి, ఒరేమున, శ్రీ లింక్ లు సరిచేశాను.
సుజాత, నాకు కూడా నామిని అంటే ఇష్టమే....నేను నామిని ని పోతన తో పోల్చను. పోతన తో పోల్చదగ్గ వాళ్ళు ఇంతవరకు ఎవరూ కనిపించలేదు. రచనా పోతన లాంటి వారికి, మనలాంటి మామూలు వాళ్ళకు వుండే తేడా కోసమే వాడాను.
నామిని కేవలం బాపు, రమణ ల వల్లనో, రంగనాయకమ్మ వల్లనో పైకి వచ్చాడని కాదు నా ఆరోపణ. అతని వెనుక వాళ్ళందరూ నిలబడ్డారు. కొంత మంది మంచి రచయితలకు ఆ అదృష్టం కూడా దక్కలేదు. ఆ రకం గా నామిని అదృష్టవంతుడు అని. అలాగే పాఠకులు అతని రచనల్ని అభిమానించారు. కొని చదివారు. మీరు, నేను కూడా పుస్తకం కొనే చదివాము. ఒకవేళ మనకు వ్యక్తిగతం గా నామిని తెలిసి ఒక కాపీ ఇచ్చినా నామిని పుస్తకాలు, తిరుమల రామచంద్ర గారి హంపీ నుంచి హరప్ప దాకా లాంటి పుస్తకాలు అందరికి మనం కొని గిఫ్ట్ లు గా ఇస్తూ వుంటాము. మీ పుస్తక ప్రేమ నాకు తెలుసు కాబట్టి మీరు కూడా ఆ పని చేసి వుంటారని నమ్ముతాను.
నామిని వ్యధ నాకు తెలుసు. కానీ అది ఓవర్ రియాక్షన్ అనిపించింది. సన్మాన సభ లో పది లక్షలు తీసుకొని కూడా ( అతను తీసుకోకూడదని కాదు) తోటి రచయితలు దొంగలు, అసలు వాళ్ళేవారు ఏమీ రాయలేదు అని అనటం కేవలం అహంకారమే అనిపించింది. మనకిష్టమైన రచయిత కాబట్టే ఈ నాలుగు మాటలు కూడా నేను రాసింది. నామిని స్వయంకృతాపరాధాలు చాలానే వున్నాయి. అవి మనకు అనవసరం కూడా. అవన్నీ పక్కనపెట్టి మాట్లాడితే చిరాకు వచ్చింది. నేను కూడా ఓవర్ గా రియాక్ట్ అయ్యనేమో తెలియదు కానీ, నాకైతే బాధ కలిగే రాశాను. మా నాన్న వంద పుస్తకాలు రాస్తే ఒక్కో పుస్తకానికి పబ్లిషర్ 500, వెయ్యి రూపాయలు ఇస్తే గొప్ప.ఇవాళ నేను ఒక వ్యాసం రాస్తే ఆ డబ్బు రావచ్చు. పుస్తకాల పబ్లిషింగ్, రచయితల దురవస్థలు అన్నీ ప్రత్యక్షంగా చూసిన వేదనే ఇది. నామిని ని దుయ్యబట్టడం మాత్రం కాదు. పిల్లల చదువులా.. చావులా మీద ఆయన చెప్పిన మాటనే నేను ప్రశ్నించాను కానీ అతని నిజాయితీ పట్ల నమ్మకం లేక మాత్రం కాదు.

S said...

నేను ఇప్పుడే నామిని కతలు చదువుతూ గూగుల్ చేసా ఆయన పేరుని. మీ బ్లాగొచ్చింది. హుమ్ - లక్షకాపీలేశారా...మరేమో విశాలాంధ్రలో నవోదయలో దొరకట్లేదు అని విన్నాను. ఈ ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతిలో చూశా పోయిన వారం. పూర్తిగా చదవలేదు.
మంచి చర్చకు దారితీసేలా ఉంది. ఎటొచ్చీ - ఫ్యాన్స్ ఈగో దెబ్బతిని గొడవపడకుండా ఉంటే ;)
మర్చిపోయానండోయ్ : నిన్న అర్థరాత్రి దాటాక కూడా నేను పడుకోలేదు. ఎందుకంటే, నామిని కతలు ఎంజాయ్ చేస్తూ నిద్ర పొవాలనిపించలేదు. కనుక, నేను కూడా ఫ్యాన్నే. కొత్త పంఖా!

భాస్కర రామిరెడ్డి said...

పోనిద్దురూ, ప్రతి మనిషికి డబ్బు అవసరం. అది వ్యక్తపరచడంలో రకరకాల రూపాలు. మనకి కథలు నచ్చ్హితే చదువుతాము లేకుంటే లేదు. అలాగే సహజమైన వృత్తిపరమైన విరోధులు కూడా. తనూ మనిషే కదా.

సుజాత వేల్పూరి said...

సౌమ్య,

ఫాన్స్ ఎలా ఉండాలని నేను అనుకుంటానంటే .రచయితను రచనల పరంగా అభిమానించాల్సిందే! రచయిత అభిప్రాయం తప్పనిపిస్తే వ్యతిరేకించాల్సిందే! నా అభిమానం అలాంటిదే! అందుకే కల్పన గారి మొదటి ఎర్రక్షరాల పేరాతో ఏకీభవించింది.

దుప్పల రవికుమార్ said...

కల్పనగారూ,

నామిని తిరుపతి సన్మాన సభలో చేసిన ప్రసంగ పాఠాన్ని యథాతథంగా ప్రచురించి ఆంధ్రజ్యోతి తెలుగు సాహిత్యలోకానికి ఒక గొప్ప మేలు చేసింది. 'ద్రౌపది' నవలకు అవార్డు వచ్చిన సందర్భంలో నామిని పొలికేక నిజంగా సాహిత్య జీవుల దుర్భర వేదనను తెలియజేస్తోంది. 'ఒక కళాకారుడి స్టేట్ మెంట్" పేరుతో ఒక బ్లాగ్ పోస్ట్ రాద్దామని మొదలెట్టి ఏదేదో నా బ్లాగులో తొలిసారిగా రాజకీయ వ్యాఖ్యలు చేసి పోస్ట్ అయ్యాక కూడలిద్వారా ఇలా మీ బ్లాగుకు వచ్చి... మీ అభిప్రాయాలు చదివాను. మీ అభిప్రాయాలను గౌరవిస్తూన్నా. కాని నామిని వెనక బాపురమణరంగనాయకమ్మలు నిల్చోలేదు. పరస్పరం అభిమానించుకున్నారంతే. ఆయన వెనక నిల్చుంది పతంజలి, ఎబికె ప్రసాద్, జగదీష్ ప్రసాద్ తదితరులు. సరే, ఇలాగే నన్ను నా రచనలే పోషించాలని భీష్మించుకు కూర్చున్న మరో రచయిత ఆర్ కె నారాయణ్. ఆయనను హిందూ పత్రిక చెప్పలేనంత స్థాయిలో ఆదుకుంది. ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ పేరుతో ఎంతో చవగ్గా ఆయన బతికున్నన్నాళ్లూ పుస్తకాలు ఆయన పాఠకులకు అందేవి. ఇక్కడ గొడవేమంటే నారాయణ్ రచనల నాణ్యత... నామినితో పోల్చగలమా చెప్పండి. కేవలం ఆయనకు దన్ను దొరికింది, మరే ఉద్యోగం చేయనన్నా ఆయనకు చెల్లింది. మరి నామినిలాంటి రచయితలను ఆదుకునే తెలుగు పత్రికేది? యార్లగడ్డతో ఎప్పుడైనా అరగంట మాట్లాడితే నెహ్రూ గురించి డామ్ మొరేస్ చెప్పిన 'నీ డెప్త్' జ్ఞానం బయటపడిపోతుంది. అలాంటి రచయితలకు పురస్కారాలు... ఇలాంటి ఆత్మాభిమానంగల రచయితలకు పేదరికం అందుతుంటే మన తెలుగు సాహిత్యపాఠకులు చూస్తున్నాం. నిస్సహాయంగా... ఆయన డబ్బు సాయమడగట్లేదు... చాలా సిగ్గుపడి తీసుకుంటున్నారు. ఆయన కోరిందల్లా నా పుస్తకాలు కొనండనే. చాలా చాలా చాలా రీజనబుల్ కోరికగా మీకు కనిపించట్లేదా? ఇదంతా తెలుగు పాఠకులూ, రచయితలూ సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం కాదా? ఇలాంటి లెక్కకుమించి బీదరికంలో మగ్గుతున్న నామిని, 'శారద'లు మనదేశపు రైతుల్లాగే ఆకలిచావులు చావాల్సిందేనా? ఆలోచిస్తుంటేనే ఏడుపొస్తోందే... మీలాంటి మేధావులు బిట్వీన్ ది లైన్స్ చదవకుండా ఆయన లెటర్స్ ను పట్టుకువేలాడుతుంటే నాకు తీవ్ర అసహనంగా వుంది.

Kathi Mahesh Kumar said...

ఎందుకో ఈ వ్యాసంలో మీది misplaced sense of righteousness అనిపిస్తోంది.

నిజమైన సమస్య మన పబ్లిషింగ్-ప్రమోషన్-పఠన(పాఠకుడి)లో ఉందనే ఒక రచయిత ఆవేదనను మీరు ఒక వ్యక్తి చేసిన అభియోగంగా ఎంచి వ్యాసం రాసినట్టుగా ఉంది.

Kalpana Rentala said...

సౌమ్య, నేను కూడా నామిని అభిమానినే. నేను కూడా హర్ట్ అయ్యాను కాబట్టే ఈ మాటలు రాశాను.
సుజాత, అది ఎవరైనా సరే, వ్యక్తి ఆరాధన మంచిది కాదు అనే నేను కూడా నమ్ముతున్నాను.అందుకే నా అభిప్రాయాల్ని కూడా ఇక్కడ ఇలా రాసింది.
భా.రా.రే...నిజమే. డబ్బు అందరికీ అవసరమే. నేను ఆయన డబ్బు తీసుకోవటం గురించి మాట్లాడలేదు. ఆయన వేరే రచయితల గురించి మాట్లాడిన విషయాల గురించి మాట్లాడాను.
రవి కుమార్ , ద్రౌపదీ అవార్డ్ కి, నామిని పొలికేక కి రెండింటి కి సంబంధం వుందని అనుకుంటున్నారా? ఎలా? నామిని కి అవార్డ్ వచ్చినా తీసుకోడు.అది ఖచ్చితం. తెలుగు సాహిత్య లోకం పెద్ద రొచ్చు గుంట నిస్సందేహంగా. దానికి ఎవరూ అతీతులు కారు. చివరకు నామిని కూడా అనేది నా అభిప్రాయం. నామిని వెనుక వాళ్ళు నిల్చునారన్నది నా అభియోగం కాదు. ఒక పరిశీలన. అలాంటి పెద్దవారు నామిని ని ఆదరించారు, మామూలు పాఠకులతో సహా.
నామిని ని ఆదుకునే తెలుగు పత్రిక ఏదీ? తెలుగు పత్రికల పరిస్థితి గురించి తెలిసే మాట్లాడుతున్నారా మీరు కూడా? అసలు మొదట తెలుగు పత్రికలు ఏ రచయితనైనా బతికిస్తాయని , బతికించాలని ఎవరు చెప్పారు? నిజం గా పత్రికలు “ ఫోర్త్ ఎస్టేట్ “ గా వున్నాయా మన దేశం లో ఇంకా? ఆవేప్పుడో “ వ్యాపార పుత్రికలు” అయిపోయాయి. కాదా? అయినా కూడా రచనల్ని, రచయితల్ని ఆదరించే సంస్కృతి మొదటి నుంచి కూడా పత్రికలకు లేదు. పబ్లిషర్స్ కూడా రచయితల్ని వాడుకున్నారు. ఇవన్నీ కొత్తగా నేను చెప్తున్న విషయాలు కావు. అందరికీ తెలిసిన విషయాలే. ఆయన పుస్తకాలు కొంటునే వున్నారాండీ...ఆయన వేసిన పుస్తకాలు అన్నీ వాళ్ళ ఇంట్లోనే వుండిపోయాయా? చూసి చేప్దురు గానీ.. అన్నీ పుస్తకాలు అమ్ముడుపోయాకే ఇప్పుడు మళ్ళీ సమగ్ర సాహిత్యం వేస్తున్నారు నామిని. అవి కొంటారనే నమ్మకంతోనే కదా? తెలుగు పాఠకులు, రచయితలు చాలా వాటికి సిగ్గుపడాలి . కేవలం నామిని మాట్లాడిన ఒక్క విషయాల మీదనే కాదు. ఆ పెద్ద చర్చ ఒకటి, రెండు వ్యాక్యాలతో మాట్లాడేది కాదు. వీలైతే విడిగా రాస్తాను. అలాగే, మరో విషయం నామిని ఆకలి చావుల స్థితి లో లేరండీ. కావాలంటే ఎవరైనా తిరుపతి వెళ్ళి చూసొచ్చి మాట్లాడందీ. నాకేమీ అభ్యంతరం లేదు. అయినా ఆ స్థితి లోకి వెళ్ళాలని, వుండాలని కాదు నా అభిమతం. నేను “ బిట్వీన్ ది లైన్స్ “ చదివాను అన్న మీ మాటను మాత్రం నేను అణు మాత్రం అంగీకరించను.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

మహేష్, ఇతర రచయితల గురించి నామిని అలా మాట్లాడటం తప్పు కాదు, నేను ఆయనది అహంకారం అనడం తప్పా? ఏమో , అయి వుండవచ్చు.

mohanramprasad said...

kalapana gaaru!
naamini kalam balamaindi. naamini manishiga balaheenudu. kondarini,konnintini ignore cheyadam better.

Crazyfinger said...

I just read your post and also the two Andhrajyoti articles on Namini. I did not know who Namini was until now. But, reading the interview and his speech is actually quite illuminating of where Namini is coming from. My comment is not to say, "yes you are right," or "no you are wrong" but just a few thoughts that came to my mind.

Throughout my reading experience, both in Telugu and in English, it seems to me that some writers/authors have strong feelings about their own position from which they write.

These writers write because they feel an intensely emotional, a helpless desire to communicate to others their own personal experiences and their own personal feelings.

When they first begin their writing, they would be unaware that they are doing anything "artistic." If someone says they are an "artist" they would deny that they are doing anything artistic. For these writers, for example if they are writing about farmers, the only thing that matters in the language is whether the reader is able to experience - almost physically, emotionally and intensity-wise - the same experience as that of a farmer. They want the whole world of the farmer to be the whole world of the reader.

"Art" or "artistic" language to them is an interference, a "middle-man" and no one likes middlemen. For these writers, it is a disappointment, almost a betrayal of the cause, to speak "artistically." Any feeling, any emotion, or any motif in the poem, or a story or a novel, that does not directly belong to the world of the farmer, is false writing. Namini appears to me to have this opinion.

We cannot dismiss this dislike of "artistic" writing lightly as something just coming out of frustration or jealousy or whatever (no one here on this blog is saying that). I think this disagreement goes to the very heart of what it means to be an artist. Without comparing Namini or others, I will say this: even the mighty Tolstoy himself dismissed Shakespeare as replusive and every bit "untrue." Because Tolstoy felt Shakespeare's works do not inspire genuine human feelings, but just a fancy arrangement of words.

Anyway, leaving all that aside, I am wondering about the last questions you raised. I believe a part of the answer lies in the duty of the book reviewer. The commercial aspect of business is just commercial. That is not going to go away. Readers will read only if we make it interesting enough for them to open the first page of the book. Writer is not really interested in either the commercial aspect of it, nor the mechanics of how to make the reader pick up the book and open the first page. Writer's world is a different world, a world that resides inside the pages of the book. But a genuine difference can be made by a book reviewer. The book reviewer can strike up a match, light the torch, and show a sign on the road to genuine literary experience. To me, that is lacking and that is the reason why writers are suffering.

Regards,
Crazyfinger

రవి said...

మీ వ్యాసం కాస్త misplaced judgment అనిపిస్తూంది.

పోతనను మీరు ఎందుకు ఉటంకించారో తెలీకుండా ఉంది. పోతన గారే తన కావ్యాన్ని "బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యక" అని చెప్పుకున్నారు. ఆయన తన రచనను రాజులకమ్మనన్నాడు, కానీ కేవలం తనకోసం మాత్రమే వ్రాసుకున్నాడనలేదు.

"అహంకారం" అని చెప్పడం సమంజసంగా లేదు. అలా చెబితే శ్రీనాథుడి దగ్గర నుంచీ, ఇప్పటి విశ్వనాథ వారి వరకూ అనేకుల రచనలనూ, కావ్యాలనూ పక్కనపెట్టవలసి ఉంటుంది.

>>మిగతా వారు ఎవరూ ఏమీ రాయలేదని, వాళ్ళకు >>నిజాయితీ లేదన్నది మాత్రం నిస్సందేహంగా అతని >>అహంకారమే అనుకుంటాను.

రైతు జీవితాన్ని "గురించి" చెప్పడానికీ, రైతు జీవితాన్ని చెప్పడానికి తేడా ఉంది. రచన ప్రజా జీవితానికెంత దగ్గరగా ఉండి, అందులో మమేకమయిందన్న అర్థంలో నామిని గారు చెప్పారు తప్ప, ఆయన ఇతర రచయితలను కువిమర్శ చేశారని భావించటం సరికాదు.శ్రీపాద వారి గురించి చెప్పారు. నామిని గారికి శ్రీపాద వారిమీద చాలా గౌరవం ఉంది. ఆ విషయం "అమ్మ చెప్పిన కతలు" అన్న చిరుపొత్తంలో మీరు గమనించవచ్చు.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

దుప్పల రవికుమార్ గారితో ఏకీభవిస్తున్నాను.

చందమామ said...

కల్పన గారూ,
తేనెతుట్టెను బాగానే కెలికినట్లున్నారు కదూ. యూనివర్శిటీలో ఉంటున్నప్పుడు ఉదయం పత్రికలో పచ్చనాకుసాక్షిగా తో మమ్మల్నందరినీ ఏడ్పించిన నామినిని నేనిప్పటికీ ఆరాధిస్తాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లె రైతుల జీవితాన్ని ఇంత ప్రతిభావంతంగా, ఇంత వాస్తవానికి దగ్గరగా రాసిన రచయిత ఉన్నారంటే నేను నమ్మలేను.

మా పల్లె భాషలో సహజాతిసహజంగా వచ్చే నా బట్టా పదానికి అంతర్జాతీయ పరిచయాన్ని కలిగించిన వాడు నామిని. ఎలా మర్చిపోతాం తనను. కానీ రైతుల జీవితం గురించి పరమవాస్తవికంగా తానే చెప్పినాననే అహంతో ఇతర రచయితల రచనలను తోసిరాజనడంలో తను ఉపయోగించే భాషను, ఔద్దత్యాన్ని సమర్థించడం సాధ్యం కాదు. ఈకోణంలో మీకే నా ఓటు.

ఇంతకూ నామిని బాధ ఇంకా ఎక్కువ పుస్తకాలు అమ్ముకోలేదనా, ఎక్కువ డబ్బులు రాలేదనా.. నాకయితే అర్తం కాలేదు.

నామిని మరీ అంత పేదరికంలో బతకడం లేదు లెండి. ఇదే తిరుపతిలో రైల్వే కోడూరు సమీపంలోని పల్లెలో పుట్టి కసాయికరువు, కొత్త చదువు, కువైట్ సావిత్రమ్మ వంటి కథలతో పాతికేళ్ల క్రితమే సంచలనం రేపిన మామిత్రుడు చక్రవేణు కేవలం అయిదేళ్ల రచనా వ్యాసంగ క్రమంలో రాజ్యం నుంచి, వ్యవస్తనుంచి, వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక, నిజాయితీకి, బతికేందుకు మద్య అంతరాన్ని గుర్తించలేక, విప్లవం పట్ల నమ్మిన విశ్వాసాలను వదులుకోలేక, జీవించటం తెలీక చివరకు 91ప్రారంభంలో అదే తిరుపతిలో రైలుకింద పడి ఘోరంగా చనిపోయాడు.

ఆదుకునే వారు, పైకెత్తి నిలిపేవారు, మాటసాయం, ఉద్యోగ సాయం చేసి మనిషిని ఎక్కడికో తీసుకుపోయేవారు ఉండి ఉంటే మా వేణు కూడా నామినిలాగే, ఇతర రచయితల్లాగే చక్కగా బతికే వాడు. తనతో పోలిస్తే నామిని చిన్నప్పుడు బాల్యంలో తప్ప తదనంతర జీవితంలో అష్టకష్టాలు పడిన చరిత్ర లేదనే అనుకుంటున్నాను. పదిలక్షలు సహాయం చేసే ఆపన్నులు అందరికీ ఉంటే రచయితలు అందరూ బాగానే బతికేవారు లెండి. ఇలాంటి పైకెత్తడాలు లేకే రచయితలు నానా చావూ చస్తున్నారు. వీళ్లతో పోలిస్తే నామిని చాలా అదృష్టవంతుడే.

మా నామిని కథలను భరించవచ్చు. కథల్లో రైతు జీవితాన్ని అత్యంత నగ్నంగా ప్రదర్సించే అతడి సాహసాన్ని వాస్తవ దృక్పధాన్ని భరించవచ్చు. శిరసుకెత్తుకోవచ్చు కూడా. కానీ తన తిమురును మాత్రం కాదు.

మొత్తం రైతుల జీవితాన్ని చిత్రికపట్టే ఏకైక మొనగాడిగా ఫోజు కొట్టే ఆ మహా తిమురును భరించడం కుదరదు. ఒకే ఒక్క తిమురు ప్రకటనతో తెలుగు కథా రచన పరిణామక్రమాన్ని మొత్తంగా తృణీకరించే ఆ తిమ్మిరి ఏ కాలంలో అయినా సరే మహా ప్రమాదకారి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తిమురులో ప్రజాస్వామిక సంస్కృతి లేదు. ఈ కోణంలో కనిపించే నామినిని నేనే కాదు మనమెవ్వరమూ స్వీకరించకూడదనే నా అబిప్రాయం.

Kalpana Rentala said...

@చందమామ,
చక్రవేణు పేరు మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్నతలు. మృత్యువు లో కూడా కోరి కష్టం తెచ్చుకున్న మహోన్నతుడు.అతని తో మీ పరిచయం, జ్నపకాలు మీరు రాసారా? రాసి వుంటే లింక్ ఇవ్వగలరా?

చందమామ said...

కల్పన గారూ, నా మిత్రుడు, ఎస్వీ యూనిర్శిటీలో ఉద్యమాల కాలంలో మా రాజకీయ బోదకుడు చక్రవేణు. వ్యక్తిగత జీవితం సజావుగా గడిపేందుకోసం ఇతరులను మాట సాయం అడగడానికి కూడా మొహమాటపడిపోతూ ఆ విప్లవకర నిజాయితీతోనే చివరకు ప్రాణార్పణ చేసిన వాడు చక్రవే్ణు.

స్వయంగా ఉద్యమంలో, అజ్ఞాత జీవితంలోకి వెళ్లి కూడా ఏ కారణంవల్లో అక్కడ ఇమడలేక బయటకు వచ్చి, ఆ విలువలతోనే బతకాలనే ప్రయత్నంలో ఓడిపోయి జీవితంలోంచి వెళ్లిపోయిన వాడు తను. తన ఆత్మహత్యను సమర్థించడం లేదు. అది ఆత్మహత్యా లేక జీవన ఘర్షణలో పరాకులో మునిగిపోయి పట్టాలమీద నడుస్తూ రైలు కింద పడ్డాడా అనేది కూడా స్పష్టం కాని మరణం తనది.

కానీ విలువలను అంటిపెట్టుకునే క్రమంలో జీవితంలో ఓడిపోయన తరానికి చెందిన వాడు. తను పోయాకే తన అయిదు కథలను కలిపి కొత్త చదువు పేరుతో పుస్తకం తెచ్చారు. నేను పోగొట్టుకున్న ఎన్నో పుస్తకాలలో ఇదీ ఒకటి.

రైల్వై కోడూరు సమీపంలోని లక్ష్మీగారి పల్లె తనది. పెద్దకొడుకులు ఉద్యమాల బారిన పడితే ఆదుకునే వారు లేక అల్లాడిపోయిన కుటుంబం వారిది. సంపాదనా మార్గం చూసుకోకుండా పుస్తకాలు, ఉద్యమాలు, రచనలు, విలువల మార్గంలో నడిచి ఓడిపోయిన మా వేణు తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉద్యమ బాట వీడకుంటే సామాజిక మార్పుకోసమైనా ఉపయోగపడేవాడు.

వ్యక్తిగత జీవితానికీ, ఉద్యమజీవితానికి కూడా కాకుండా పోయిన తరం ప్రతినిధి. పత్రికలతో పరిచయాలా లేవు. సంపాదకులతో పరిచయాలా లేవు. బతకడానికి మన సమాజంలో అనివార్యంగా కావలసిన పరిచయాలు అసలే లేవు. ఎలా బతుకుతాడు. ఎలా పేరు తెచ్చుకుంటాడు.

అందుకే తనను తల్చుకున్నప్పుడల్లా వడ్డించిన విస్తరి లాంటి జీవితాలు మీవి అనే శ్రీశ్రీ గీతం గుర్తుకు వస్తుంటుంది.

మీరు చెప్పారు కాబట్టి ఈసారి తిరుపతికి పోయినప్పుడు తన పుస్తకం ఎవరిదగ్గరయినా ఉంటుందేమో వెతికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. అయినా తన పరిచయం ఇప్పుడు సమాజానికి అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే అతడో విస్మృత యాత్రికుడు.

రాజు
చందమామ
krajasekhara@gmail.com

Kalpana Rentala said...

రాజు గారు,
చక్రవేణు రాసిన మంచి కథల్లో నాకు నచ్చినది కువైట్ సావిత్రమ్మ. చక్రవేణు కథల పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు. మీకు ఆ కథ దొరికితే మనం ఇక్కడ పరిచయం చేయవచ్చు. నేను అడిగింది వేణు తో మీకున్న స్నేహాన్ని, జ్నపకాల్ని చెపితే అతని గురించి మేము మరిన్ని వివరాలు తెలుసుకోగలుగుతాము అని. ఆ పని మీరు తప్పక చేయాలి.

ravikiran timmireddy said...

అది నిప్పని తెలుసు, కాలుతుందని కూడా తెలుసు


చిన్నప్పుడు అమ్మ చెప్పిన జాగ్రత్తల్లో అదొక ముఖ్యవైన జాగ్రత్త, నాయనా అది నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. చిన్నప్పుడు అమ్మొద్దంది కాబట్టి ముట్టుకోలా, తర్వాత తర్వాత, ఏ భోగిమంటలేసేటప్పుడో, దీపావళికి ఏ టపాసాలు కాల్చేటప్పుడో, కరంట్ పొయ్యినప్పుడు వెలుగుతున్న కేండిల్ నించి ఒక చుక్క జారి చేతి మీద పడినప్పుడో, ఈ అమెరికాకొచ్చిన తర్వాత వచ్చీ రాని వంటలో పొయ్యిమీద గిన్నె గబుక్కున తాకినప్పుడో, చిన్నప్పుడు అమ్మ చెప్పిన జాగ్రత్త మళ్ళా గుర్తుకొస్తుంది. అది నిప్పురా నాయనా తాకితే కాలుస్తుంది అని. వయసుతోపాటు పెరిగిన బుర్రతో కాలటంలో కలిగే బాధని బుద్ది సిములేట్ చేస్తుంది. మన్వే కథో వ్రాస్తే ఆ బుద్ది ఆ కాలటవనే అనుభవాన్ని వ్రాయడానికి కావాల్సిన ఊహని ప్రసాదిస్తుంది.


కానీ ఏ కారణం చేతనో నిజంగానే ఒళ్ళు ఏ నలభై, యాభై శాతవో కాలిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని, దాంట్లో ఉండే బాధని, మనసుని మెలితిప్పేసే బాధని, ప్రాణాలు కడగట్టుకుపొయ్యే బాధని వాళ్ళు వ్రాస్తే, మన సిములేటేడ్ అనుభవం నించి మనం వ్రాసిన రాతకి, ప్రత్యక్ష అనుభవం నుంచి వాళ్ళు వ్రాసిన వ్రాతకి నక్కకి, నాకలోకానికి వున్నంత తేడా వుంటుంది. నమ్మకం లేకపోతే మంట మీద చెయ్యి పెట్టటం ఊహించుకోండి, దమ్ముంటే నిజంగా చెయ్యి పెట్టి చూడండి. నామిని గారికి, మిగిలిన సవా లక్ష మధ్య తరగతి రచయితలకున్న భేదం మీకు తెలుస్తుంది. ఆయనన్నట్టు ఆ ఒకటిన్నరెకరం అబ్బకి ఆయన పుట్టుండకపోతే ఖచ్చితంగా ఆయన రచనలు కాలటవనే ఊహలాగే వుండేవి. ఆయన ఆ ఒకటినారెకరం మిట్టూరు రైతు (డెల్టా రైతు కాదు) కడుపున పుట్తేడు కాబట్టే ఆ బ్రతుకులో సుఖాన్ని, ధుఖ్ఖాన్ని, కన్నీళ్ళని, కడుపుమంటని, సంతోషాన్ని, సౌందర్యాన్ని, అనుభవించి, పలవరించగలిగేడు. పతంజలి గాని, రావీ శాస్త్రి గానీ, కాళీపట్నంగానీ, కేతు విశ్వనాధ రెడ్డి గానీ, కేశవరెడ్డి గాని, సింగమనేని నారాయణ గాని కాలితే బాధని ఊహించగలిగేరే గాని, నామినిలా కాలిపోలా. మిరక్కయల కారంతో అంత సంగటిముద్ద తిని, అమ్మ పక్కలో పడుకోని, మో, మో కడుపులో ఎండగాస్తున్నట్టుందమా అండం వీళ్ళలో ఎవరికైనా తెలుస్తుందా? మనలో ఎవరికైనా తెలుస్తుందా? అడుగంటిన సంగటి గోక్కోని, దాంట్లో నీళ్ళు కలుపుకోని త్రాగుతుంటే మొగుడు కోపంతో కేకరించి ఊసిన గల్ల దాంట్లో పడితే అదిపక్కకు తీసేసి ఆ గంజినీళ్ళు తాగటం మీకూ నాకూ, ఆ ఫలాని రచయితలకి తెలుసా. ఆడ మనిషి, ఎతమతం మొగుడితో ఏగతా, పొగలు పొద్దస్తం పన్జేసి, సాయంత్రం వేడి, వేడి నీళ్ళు చెంబు, చెంబుతో కండ, కండ, కీలు, కీలు నొప్పులెక్కిన ఒంటిమీన దిమ్మరించుకుంటా, చెంబు, చెంబుకి, స్వర్గం అనుభవించటం మీకూ నాకూ, ఆ ఫలాని రచయితలకి తెలుసా. కనీసం జ్వరవొస్తే ఇడ్లీలు తినొచ్చని ఆశపడే దూదోడు (పేరు తప్పయితే క్షమించాలి, ఎప్పుడో ఒక దశాబ్ధం క్రితం చదివిన గుర్తులివి) మీకు తెలుసా? కడుపునిండా అన్నం కోసం, పిడికేడు చియ్యల కూరకోసం కర్మంత్రాలకి వెళ్ళే బతుకు మీకూ, నాకూ, ఆ ఫలాని రచయితలకి తెలుసా? ఒకటిన్నరెకరం పండిచ్చుకున్న మహా మనీషి నామిని సుబ్రమణ్యం నాయుడు. ఒకటిన్నరెకరం పండించుకున్న పువ్వు కాబట్టే, ఈ రోజు వాడిపోతుండొచ్చు, ఐతే ఒకటి గుర్తు పెట్టుకోండి, జిగేలుమనే విధ్యుత్కాంతులకు దూరంగా మిగిలిపోయిన మేజారిటీ భారతం నామిని గారి ఇంకుమరకల్లోనే ఇమిడుందని గుర్తుపెట్టుకోండి.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Kalpana Rentala said...

రవికిరణ్,
చాలా బలంగా చెప్పారు మీ వాదనని.
నామిని బాధ నిజమైనంత మాత్రాన, అదొక్కటే వాస్తవిక, నిజాయితీ తో కూడిన రచనా, మిగతావన్నీ ఎందుకు పనికిరానివి అనటం సమంజసమా? ఆ లెక్కన మొత్తం సాహిత్య సృష్టిలో అన్నింటిని తిరస్కరించాల్సి వుంటుంది. నామిని రచనల్లోని గొప్పతనం గురించి కాదు ఈ టపా. అతని అభిప్రాయాల గురించి. అతని అహంకారం లోని సమంజసం గురించి. నేనైతే వొప్పుకోలేకపోతున్నాను.

Anonymous said...

కల్పన గారు,

నాకు హైదరాబాదు పుల్లా రెడ్డి స్వీట్స్ లో కలాకంద ఇష్టం. అమెరికాలో రాజ్భోగ్ లో కూడా ఎప్పుడన్నా ఒక పౌండు కొనుక్కుంటా, కానీ తినేదానికన్నా మిగిలి పారేసేదే ఎక్కువ. ఇదేవిట్రా వీడు ఈ పనికిమాలిన పోలిక తెస్తాడు అనుకోబాకండి. అదే బేధం అసలైన అనుభవానికి, ఊహకి మధ్య కూడా.

నాకు 1983లో నా స్నేహితుడొకడు పచ్చనాకు సాక్షిగా పుస్తకం మదరాసులో బహుకరించాడు. అది నేను చదివిన తర్వాత మా అమ్మకి తీసుకపొయ్యి ఇచ్చా. మా అమ్మ రైతు కూతురు కాకపోయినా, రైతు పెళ్ళావే. ఆవెకి కనీసం ఊహకి కూదా అందలా, నవ్వుకుంది, కన్నీళ్ళు పెట్టుకుంది, ఒరే కిరణా ఇయ్యన్నీ నిజంగా నిజవా అని అనుమాన పడింది. మా ఇంట్లో ఒక పెద్ద గ్రంధాలయం ఉండేది, ఏ వందో, రెండోదలో పుస్తకాలు కాదు, వేల పుస్తకాలుండేవి. అవన్నీ ఆవె చదువుండకపోవచ్చు కానీ చాలానే చదివింది (శరత్ సాహిత్యాన్ని మా అమ్మే నాకు పరిచయం చేసింది). ఆవె చదివిన సాహిత్యంలో కేతు విస్వనాధ రెడ్లూ, సింగమనేని గార్లూ లేరు గానీ, రవీంద్రుడి నించి, రావీ శాస్త్రి గారి దాకా వున్నారు. వాళ్ళేవరి రచనలు ఇవ్వని షాక్ నామిని గారి ఆ చిన్న పుస్తకం, పచ్చ నాకు సాక్షిగా, ఎవరో మదనపల్లి మహిళా సమాజం ప్రచురించిన ఆ బుజ్జి కథల పుస్తకం ఇచ్చింది. నిజానికి ఊహకి వుండే బేధం అదేనండీ కల్పన గారు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

 
Real Time Web Analytics