Saturday, November 28, 2009
ఏక్ పల్
పట్టు జలతారు కలల కళ్ళు
వాంఛా బుద్భుధ దేహం
పలుకు కులుకుల పెదవి
ఉన్మాద ఉన్మత్త విషాద గరళ ప్రణయం
మనసెప్పుడూ వొంటరి ద్వీపం!
ప్రేమ మూడు ముక్కలాట!
* * *
చీకటి తెలియని కళ్ళు
దుఃఖం తెలియని వొళ్ళు
కన్నీళ్ళు లేని ప్రేమ
అసలెక్కడైనా వుంటాయా?
* * *
నీలాకాశపు మెహ్ ఫిల్ పై
మరో జుగల్బందీ
నా పగళ్ళన్నీ బాధల నెగళ్ళై
నీ రాత్రుళ్ళన్నీ నాకు అసూర్యంపశ్యలై
నీ కోసం
అరక్షణమే అనుక్షణమై
రజనీగంధాలు, రాధా మాధవాలు
సంతూర నాదాలై...మాండలీన్ మాటలై....
ఏమి చెప్పను?
ఎదురుచూపులెప్పుడూ ఎండమావులేగా!
* * *
ఒక్క క్సణమే కదా
మనసు పెంచుకున్నా...పంచుకున్నా....
ప్రేమతో జీవించినా...
మోసంతో మరణించినా...
ఆ క్షణమే నిరీక్షణమై...
నిర్నిద్రనై....నీ కోసం....
(2002 లో ఆంధ్రజ్యోతి సండే లో ప్రచురితం)
మలక్పేట్ రౌడీ పేరడీ కవిత
మలక్పేట్ రౌడీ నా ఏక్ పల్ కవితకు రాసిన పేరడే కూడా నా పొస్ట్ లొ భాగం గా ఇస్తున్నాను. చదివి ఆనందించండి. కామెంట్ లో కంటే పొస్ట్ లొ భాగం గా అందిస్తే చదివి ఆనందిస్తారని. ఇంకా ఎవరికైనా నా కవితకు కానీ, రౌడీ పేరడీ కి కానీ పేరపేరడీలు రాసే ఆలోచన వుంటే మోస్ట్ వెల్ కం.
గార పట్టిన పళ్ళు
తగ్గని మధుమేహం
సిగరెట్టూ మచ్చ పెదవి
ముంచుకొస్తున్న ప్రళయం
ఆరిపోతున్న జీవిత దీపం
అయినా తప్పది ఈ దేవులాట
పక్కవాడిని చూసి కుళ్ళు
అస్తమానమూ కుట్టే కళ్ళు
మూసీనది దోమ
మన మాట వింటాయా?
మబ్బులు తాకే మంజిల్ లో
ఒక విమానం బందీ
దాని సెగలన్నీ భవనంలో పగుళ్ళై
కొన్నివేలజీవితాలలో అమావస్యలై
కాలక్షేపం కోసం
బ్లాగుల్లో కధానికలై
విషాద గాధలు
న్యూస్ చానెళ్ళలో వార్తలై
ఏమి చెప్పెను?
మరో యుధ్ధం మొదలవుతుందనే కదా?
ఒక్క నిముషమే కదా
జీవితం అంతమైనా
మరణం కబళించినా
బ్రతుకుకి చావుకి మధ్య దూరమైనా
ఆ క్షణం రాకూడదనేగా
నా ఈ తపన!
Tuesday, November 24, 2009
హేపీ థాంక్స్ గివింగ్!
ఒక పక్క recession. ఎవరికి ఉద్యోగం పోతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి . అయినా సరే, అమెరికా అంతా Thanksgiving పండుగ కళ కనిపిస్తోంది. Black Friday సేల్స్ తో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
క్రిస్మస్ లాంటి పండుగల్ని అన్నీ దేశాల్లో జరుపుకుంటారు కానీ థాంక్స్ గివింగ్ మాత్రం ఒక్క అమెరికా , కెనడాల్లో మాత్రమే జరుపుకుంటారు. నాకైతే ఇది మన సంక్రాంతి పండుగ లాంటిదే అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అయినా, థాంక్స్ గివింగ్ అయినా కూడా పంట చేతికొచ్చినప్పుడు చేసుకునే పండుగలే...కాకపోతే, థాంక్స్ గివింగ్ కు సంబంధించి పిలిగ్రింస్ కథ వేరుగా వుంటుంది.
థాంక్స్ గివింగ్ అంటే టర్కీ, పంప్కిన్ పై, క్రాన్ బెర్రి సాస్, బ్లాక్ ఫ్రైడే సేల్స్ మాత్రమే కాదు అందులో అంతర్లీనం గా వుండే స్పిరిట్ మాత్రం గొప్పది. ఏడాది మొత్తం లో ఇది స్నేహపూరిత వాతావరణాన్ని తెస్తుంది. ఎంతెంత దూరాల నుండో కుటుంబ సభ్యులతో కలిసి థాంక్స్ గివింగ్ జరుపుకోవటానికి వెళ్తారు. ప్రధానం గా ఇది కుటుంబంతో కలిసి జరుపుకునేదే అయినా స్నేహితుల్ని కూడా ఆహ్వానిస్తారు. అందరు కలిసి పెద్ద విందు చేసుకుంటారు. ఈ వేడుకల్లో ప్రధానమైనది థాంక్స్ తెలుపుకోవటం.
మనం కూడా మన జీవితాలకు సంబంధించి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఈ జీవితాన్ని ఇచ్చి మనల్ని పెంచి పెద్ద చేసి కనీసం ఈ మాత్రమైనా తీర్చిదిద్దిన తల్లితండ్రులకు, చదువు అంటే డిగ్రీలే కాకుండా నిజమైన విజ్ఞానాన్ని అందించిన ఎందరో గురువులకు పాదాభివందనాలు.స్నేహం అనే పూలతోట లో ఎన్నెనో సీతాకోకచిలుకలు...ఏ రంగులో వున్నా అందంగా కనిపిస్తాయి. సీతాకోకచిలుకలు లేని పూలతోట, స్నేహితుల్లేని జీవితం వుంటుందా? ఇన్నేళ్ళ జీవితంలో అలా మొదటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో స్నేహాలు, ఎందరెందరో స్నేహితులు...అందరికీ అభిమాన మకరందాలు ఇవిగో! అందుకోండి!!
ప్రేమ అనే మధురిమ లో అన్నిరకాల బంధాల్ని చవిచూపించిన సహచరుడికి...రోజూ నవ్విస్తూ కొత్త కాంతిని, కోటి ఆశల్ని మోసుకొచ్చే మా చిన్ను లోని పసితనానికి.... not just thanks, but something more....
జీవితం అంటే రకరకాల కోణాల్ని చూపించి, అర్ధమయ్యేలా అనుక్షణం పక్కన వుండే దీపస్థంబం లాంటి పుస్తకాలకి, రచయతలకు ధన్యవాదాలు చెప్పటానికి అక్షరాలు సరిపోవు.
చివరిగా ఈ బ్లాగ్ రూపం లో నేనేమి రాసినా....రాయకపోయినా రోజూ వచ్చి చూసిp వెళ్ళిపోయే పాఠకులకు కొత్త బ్లాగ్
ద్వారా మరో సారి సాదర స్వాగతం. ఎప్పటిలాగానే మీ అభిమానాన్ని, ఆదరణ ని కోరుకుంటూ....
నిజానికి ఇది మొదట చెప్పాల్సిన థాంక్స్ కానీ చివరకు ఎందుకు చెప్తున్నానంటే special గాబట్టి. అందమైన ఈ సృష్టినీ సృష్టించి ఏ రూపంలో నైనా, ఏ పేరుతోనైనా వుండగలిగే ఆ భగవంతుడికి మన థాంక్స్ అక్కర్లేదు కానీ చెప్పటం మన కనీస ధర్మం అనుకుంటాను.
హేపీ థాంక్స్ గివింగ్!
Thursday, November 19, 2009
మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!
అజర్ నఫిసీ – ఇరాన్ కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.
అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.
నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.
ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.
నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…
ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.
కల్పనారెంటాల