నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, November 28, 2009

ఏక్ పల్


పట్టు జలతారు కలల కళ్ళు
వాంఛా బుద్భుధ దేహం
పలుకు కులుకుల పెదవి
ఉన్మాద ఉన్మత్త విషాద గరళ ప్రణయం
మనసెప్పుడూ వొంటరి ద్వీపం!
ప్రేమ మూడు ముక్కలాట!
* * *
చీకటి తెలియని కళ్ళు
దుఃఖం తెలియని వొళ్ళు
కన్నీళ్ళు లేని ప్రేమ
అసలెక్కడైనా వుంటాయా?
* * *
నీలాకాశపు మెహ్ ఫిల్ పై
మరో జుగల్బందీ
నా పగళ్ళన్నీ బాధల నెగళ్ళై
నీ రాత్రుళ్ళన్నీ నాకు అసూర్యంపశ్యలై
నీ కోసం
అరక్షణమే అనుక్షణమై
రజనీగంధాలు, రాధా మాధవాలు
సంతూర నాదాలై...మాండలీన్ మాటలై....
ఏమి చెప్పను?
ఎదురుచూపులెప్పుడూ ఎండమావులేగా!
* * *
ఒక్క క్సణమే కదా
మనసు పెంచుకున్నా...పంచుకున్నా....
ప్రేమతో జీవించినా...
మోసంతో మరణించినా...
ఆ క్షణమే నిరీక్షణమై...
నిర్నిద్రనై....నీ కోసం....(2002 లో ఆంధ్రజ్యోతి సండే లో ప్రచురితం)మలక్పేట్ రౌడీ పేరడీ కవిత

మలక్పేట్ రౌడీ నా ఏక్ పల్ కవితకు రాసిన పేరడే కూడా నా పొస్ట్ లొ భాగం గా ఇస్తున్నాను. చదివి ఆనందించండి. కామెంట్ లో కంటే పొస్ట్ లొ భాగం గా అందిస్తే చదివి ఆనందిస్తారని. ఇంకా ఎవరికైనా నా కవితకు కానీ, రౌడీ పేరడీ కి కానీ పేరపేరడీలు రాసే ఆలోచన వుంటే మోస్ట్ వెల్ కం.


గార పట్టిన పళ్ళు
తగ్గని మధుమేహం
సిగరెట్టూ మచ్చ పెదవి
ముంచుకొస్తున్న ప్రళయం
ఆరిపోతున్న జీవిత దీపం
అయినా తప్పది ఈ దేవులాట

పక్కవాడిని చూసి కుళ్ళు
అస్తమానమూ కుట్టే కళ్ళు
మూసీనది దోమ
మన మాట వింటాయా?

మబ్బులు తాకే మంజిల్ లో
ఒక విమానం బందీ
దాని సెగలన్నీ భవనంలో పగుళ్ళై
కొన్నివేలజీవితాలలో అమావస్యలై
కాలక్షేపం కోసం
బ్లాగుల్లో కధానికలై
విషాద గాధలు
న్యూస్ చానెళ్ళలో వార్తలై
ఏమి చెప్పెను?
మరో యుధ్ధం మొదలవుతుందనే కదా?

ఒక్క నిముషమే కదా
జీవితం అంతమైనా
మరణం కబళించినా
బ్రతుకుకి చావుకి మధ్య దూరమైనా
ఆ క్షణం రాకూడదనేగా
నా ఈ తపన!

15 వ్యాఖ్యలు:

Malakpet Rowdy said...

Good one. Thought of posting a longer comment, but then changed my mind and now posting a parody .. lemme run away before you could reach out to me and hit me :))


గార పట్టిన పళ్ళు
తగ్గని మధుమేహం
సిగరెట్టూ మచ్చ పెదవి
ముంచుకొస్తున్న ప్రళయం
ఆరిపోతున్న జీవిత దీపం
అయినా తప్పది ఈ దేవులాట

పక్కవాడిని చూసి కుళ్ళు
అస్తమానమూ కుట్టే కళ్ళు
మూసీనది దోమ
మన మాట వింటాయా?

మబ్బులు తాకే మంజిల్ లో
ఒక విమానం బందీ
దాని సెగలన్నీ భవనంలో పగుళ్ళై
కొన్నివేలజీవితాలలో అమావస్యలై
కాలక్షేపం కోసం
బ్లాగుల్లో కధానికలై
విషాద గాధలు
న్యూస్ చానెళ్ళలో వార్తలై
ఏమి చెప్పెను?
మరో యుధ్ధం మొదలవుతుందనే కదా?

ఒక్క నిముషమే కదా
జీవితం అంతమైనా
మరణం కబళించినా
బ్రతుకుకి చావుకి మధ్య దూరమైనా
ఆ క్షణం రాకూడదనేగా
నా ఈ తపన!

Kalpana Rentala said...

రౌడీ, మీ పేరడీ బావుంది. నిజంగానే మీ దగ్గర మంచి టాలెంట్ వుంది. తెలుగు సాహిత్యం లో పేరడీలు , హాస్యం, వ్యంగం లాంటి ప్రక్రియాల్లో రాసేవాళ్ళు comparative గా తక్కువ. మీరు ఆ వైపు కృషి చేస్తే రాణిస్తారు. ప్రయత్నించండి.

బొల్లోజు బాబా said...

మాతృకను స్పురింపచేసేదే పారడీ అని శ్రీశ్రీ అన్నట్టు గుర్తు.

రెండూ పక్కపక్కన చదువుతూంటే భలే ఉంది.

మలక్ గారూ,

తెలుగులో జలసూత్రం, శ్రీరమణ ల తరువాత పెద్దగా పారడీలు వ్రాసే వారు లేరు.

జలసూత్రం వారు తెలుగు సాహితీ జగత్తులో అజరామరమయ్యింది పారడీల ద్వారానే ఆయన ఇతర ప్రక్రియల్లు చేపట్టినా.....

ఆ లాక్యునే అల్లానే ఉండి పోయింది మరి చూసుకోండి.....

bollOju baba

ఊకదంపుడు said...

బాబా గారూ జొన్నవిత్తుల రాంలింగేశ్వరావు గారిని మరిచారా?
మాతృక గురించి మీ మాట వినాలని ఉంది
రౌడీ గారూ, మీ పారడీ ప్రతిభ అద్భుతమండీ, అందునా ఆశువుగా అంటే మాటలు కాదు
గతంలో కొత్తపాళీ గారు అన్నట్టు మాతృకకు తూగే మాత్రలే వేస్తే..

బొల్లోజు బాబా said...

ఊక దంపుడు గారికి

చాన్నాళ్లకు దర్శనం

అవును జొన్నవిత్తుల వారు కూడా పారడీలు వ్రాసారు. కానీ నేను వారివి చదివినవి తక్కువ.

కవిత బాగుంది.
కవితలో చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలు చాలానే....

మొదటి చరణంలో కలలలోకాన విహరించే ఓ మనసు, ప్రేమనే మూడుముక్కలాటలో చిక్కుకోవటం, రెండవ చరణంలో పై ప్రేమలో పొందిన వైఫల్యానికి సమాధానపడటం, మూడవచరణంలో ఎదురుచూపులను రాత్రి గంధాలతోనూ, రాధామాధవాలతోనూ పోల్చుకొంటూ, అన్నీ ఏండమావులేనా అని నిర్వేదించటం, చివర చరణంలో ఒక అనంత నిరీక్షణలోకి ప్రేమతో జారిపోవటం.

నాకు పై విధం గా అనిపించింది. మరొకరికి మరో విధంగా అనిపించినా లేక ఇంతకన్న భిన్నమైన అర్ధాలతో మరొకరు భాష్యం చెప్పినా నేను ఆస్చర్యపోను. ఎందుకంటే....

చిక్కటి కవిత్వాలను అర్ధం చేసుకోవటం వైయుక్తికం అని నమ్ముతాను. అందునా ఇలాంటి విస్త్రుతార్ధాలను ఇచ్చేవి అయితే మరీను.

ఉన్మాద ఉన్మత్త విషాద గరళ ప్రణయం

మనసెప్పుడూ వొంటరి ద్వీపం!
ప్రేమ మూడు ముక్కలాట!

ఎదురుచూపులెప్పుడూ ఎండమావులేగా!

ఆ క్షణమే నిరీక్షణమై...
నిర్నిద్రనై....నీ కోసం....


అన్నప్రయోగాలు నాకైతె చాలా నచ్చాయి.

భవదీయుడు
బొల్లోజు బాబా

Kalpana Rentala said...

ఊకదంపుండు గారికి,

నా బ్లాగ్ లో మీ తొలి కామెంట్ ఇదే. ధన్యవాదాలు. అలాగే జొన్నవిత్తుల గారిని గుర్తు చేసినందుకు కూడా. మరి మనందరి కోరిక ప్రకారం రౌడీ గారు మరిన్ని పేరడీలు రాస్తారని ( అన్నీ నా కవితలు కాదండీ బాబోయి...) ఎదురుచూద్దాము.

బాబా గారు,

మీ విశ్లేషణ నా కవితకు అందాన్ని తెచ్చింది. కవిత్వమెప్పుడూ వైయక్తికమే. అయినా మనం రాసిన ఒక కవిత నో, ఒక కధనో ఎవరో సరిగ్గా పట్టుకుంటే కలిగే ఆనందం అవర్ణనీయం. మనం మనకోసమే రాసుకున్నప్పటికీ ఒక మనస్సు అచ్చంగా మనలాగే అనుభూతి పొందిదంటే ఆ తృప్తి కంటే ఒక రచయత కి కావాల్సిందేముంటుంది? మీ అభిమానానికి నమస్సులు.

ఊకదంపుడు said...

బాబా గారు,
నెనరులు.

కల్పన గారు, వ్యాఖ్యను అంగీకరించినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగు లో మునుపు వ్యాఖ్యానించపోవటానికి ప్రత్యేక మైన కారణం ఏమి లేదు,ప్రస్తుతం కవిత్వాన్ని చదివేస్థితి లొనే ఉన్నాను అనుభవించెస్థితి ఇంకా అందుకోలేదు.
-భవదీయుడు
ఊకదంపుడు

S said...

"పేరపేరడీలు"
-పదం బాగుందండీ! :)

Kalpana Rentala said...

@ ఎస్ గారు, థాంక్స్

భావన said...

కల్పన చాలా బాగుందండి.. నీకోసం నే చూసిన క్షణం అది కలలకు వూపిరులద్దిన ముచ్చట అని ఎంత సున్నితమైన వ్యక్తీకరణ.
రౌడీ గారి పేరడీ కూడా బాగుంది. :-)

Kalpana Rentala said...

@భావనా మీకు నచ్చటం నాకు మరీ నచ్చేసింది.

cartheek said...

కల్పన గారు ఇది నా తొలి కామేంట్ మీ బ్లాగ్ లో..
మీ బ్లాగు చాలా బావుంది.. అబ్బ ఆ టెంప్లేట్ ఒక పది నిముషాలు అంత సవివరంగా చూశా, నాకు బాగా నచ్చింది,చాలాబగుండీ టెంప్లేట్.
ఇక ఈ కవిత సూపర్ దాని పేరడీ కూడా సూపర్....

Kalpana Rentala said...

@ యస్ ఉరఫ్ సౌమ్య నా? అయ్యో నాకు అంత తెలివితేటలు ఎక్కడున్నాయండీ బాబూ! ఎవరో అనుకున్నాను. యనీ హౌ థాంక్ యు సోసో మచ్ . అయినా నాకు తెలియకపోవటం వల్లనే గదా మీరు వచ్చి ఇంకో కామెంట్ పెట్టారు. అజ్ఞానమే ఆనందం అంటే ఇదేనేమో?

@కార్తీక్ . అబ్బా!చాల ముచ్చటైనా మాట చెప్పారు. నేనేమో ఎవరూ నా కొత్త టెంప్లేట్ గురించి మాట్లాడలేదేమిటబ్బా అని దిగాలు గా వుంటే మీరొచ్చి అంతగా మెచ్చుకుంటే ఎంత సంతోషం గా వుందో...ఏమిటో ఈ బ్లాగ్ ల్లొ ఈ చిన్న చిన్న ఆనందాలు...కవిత నచ్చినందుకు, నా బ్లాగ్ ప్రపంచంలోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు...

Anonymous said...

Amiable brief and this enter helped me alot in my college assignement. Thank you for your information.

భాను said...

chalaa bagundi matallo cheppalenanta

 
Real Time Web Analytics