నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, December 06, 2009

నగ్ననది

నదిలోకి అయిదు గులకరాళ్ళు వేశాను
ఒకటికి రెండై జ్ఞాపకాలు కొట్టుకువచ్చాయి

నదిలోకి నాలుగు దుఃఖాల్ని పంపాను
వొడ్డుకు నాలుగు యుగాల స్త్రీలు పుట్టుకు వచ్చారు

నది లోకి మూడు కాగితపు పడవల్ని వదిలాను
తీరంలో కొన్ని ఆశలు మొలకెత్తాయి

నదిలోకి రెండు చేపల్ని వదిలాను
ఆశ్చర్యం ఒక వల బైటకు వచ్చింది

నదిలోకి ఒక కుబసాన్ని వదిలేసాను
గట్టు మీద ఒక ఇంద్రధనుస్సు విరిసింది

నేనే నదిగా ప్రవహించాను
నగ్నత్వాన్ని తర్పణం చేస్తూ...

17 వ్యాఖ్యలు:

భాస్కర రామిరెడ్డి said...

కల్పనగారూ ఈ సంఖ్యలకు (5,4,3,2,1) ఏదైనా ప్రాధాన్యత వుందా లేక Random numbers గా తీసుకుని రచన చేసారా?

రాధిక said...

అద్భుతం గా వుందండి.
నదిలోకి అయిదు గులకరాళ్ళు వేశాను
ఒకటికి రెండై జ్ఞాపకాలు కొట్టుకువచ్చాయి"ఈ కవిత తెగ నచ్చేయడానికి ఈ ప్రారంభమే కారణం.
"నదిలోకి ఒక కుబసాన్ని వదిలేసాను
గట్టు మీద ఒక ఇంద్రధనుస్సు విరిసింది"ఇది మీరే అర్ధంలో రాసారో గానీ నాకో అద్భుతం గోచరించింది.
"నదిలోకి నాలుగు దుఃఖాల్ని పంపాను
వొడ్డుకు నాలుగు యుగాల స్త్రీలు పుట్టుకు వచ్చారు"ఇది మీ మార్కు.మీ కధల్లో చెప్పేదంతా ఇక్కడ ఇరికించేసారు.గ్రేట్.
"నదిలోకి రెండు చేపల్ని వదిలాను
ఆశ్చర్యం ఒక వల బైటకు వచ్చింది"ఈ ఒక్కటీ అర్ధం కాలేదు.దేని గురించి చెప్పారు?చూద్దాము ఎవరైనా చెప్తారేమో.

Prakash chowdary said...

mee bhaavaalu inkontha saralanga vyaktham cheyandi. 100 % mandiki cheraali bagunnayi

Padmarpita said...

అద్భుతంగా వుందండి!

మాలతి said...

:) నాకీ కవిత జ్ఞాపకం వుంది. నీచేత నాలుగుసార్లు అర్థం చెప్పించుకోడం ... యెప్పుడు పెడతావా అని చూస్తున్నాను. అద్భుతం.

Bolloju Baba said...

wonderful poem

Kalpana Rentala said...

భాస్కర రామిరెడ్డి గారు,
ఇదే మొదటి సారి అనుకుంటాను మిమ్మల్ని నా బ్లాగ్ లో చూడటం. ఆ అంకెలు కావాలని ఎంపిక చేసుకున్నవి. అయిదు సంఖ్య పంచేద్రియాలకు, పంచప్రాణాలకు సంకేతం. చివరకు నా అస్తిత్వాన్ని మొత్తం నదికి అర్పణం చేసి నేనే నదిగా మారిపోయాను. ఒక రకమైన భావావేశమే కాకుండా ఒక రకమైన తాత్విక భావనతో రాసిన కవిత. ప్రశ్న అడిగారు కాని కవిత గురించి చెప్పలేదేమిటి సార్?
@రాధిక. మిమ్మల్ని చూసి కూడా చాలా కాలమైంది. మీరు కామెంట్ పెట్టారంటే నాకు గర్వమే. మీకు కవితార్ధం తెలియకపోవడమేమిటి? ఆలోచించండి.
@పద్మార్పిత. మిగతా బ్లాగ్ ల్లో మిమ్మల్ని అందరిని చూస్తూ వుంటాను.కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
@ప్రకాష్ గారు, సామాన్యం గా నేను అర్ధం కాకుండా వుండేంత క్లిష్టం గా ఏమి రాయను. రాయలేను. అది నా పధ్ధతి కాదు. కానీ ఒక్కోసారి ఆ భావానికి తగినట్లు ప్రతీకలు వాటికి అవే వస్తాయి. ఇంతకన్నా సరళంగా రాస్తే నిజం గానే ఎక్కువమందికి అర్ధం అవుతుందేమొ కాని ఒక కవితకు అనేక అర్ధాలు స్పురించటం ఇంకా బావుంటుంది కదా, ఆలోచించండి.
@ మాలతి గారు, మీకు ఇంకా గుర్తు వుందే ఆ విషయం. ఇంత మందికి ఈ కవిత నచ్చినందుకు నాకు నిజంగానే సంతోషం గా వుంది.
@ బాబా గారు,
మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారో అని. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

నాగరాజు రవీందర్ said...

మీ పాటల సేకరణ బాగుంది ; నగ్న నది కవిత కూడా.

భాస్కర రామిరెడ్డి said...

మీ వివరణ చదివిన తరువాత మట్టి బుఱ్ఱ మీద లైటు వెలిగిందండి.కానీ ఇంతమందికి మీరు చెప్పాలనుకున్నది అర్థం అయ్యింది కనుక మీ ప్రయత్నం సఫలం. నాకు మాత్రం మీ వివరణ చదివిన తరువాత కానీ మీ భావావేశపు నదీ నురగల తరగల పైన భానూదయకిరణాల అందాన్ని ఆస్వాదించ గలిగాను. వివరణకు ధన్యవాదాలు.

అవునండి, మీ బ్లాగును చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాను. అసలే చలికాలం కాబట్టి ముసుగు తీసి బయటకొచ్చి చదవాలంటే కష్టంగా వుంది. :)

Kalpana Rentala said...

@థాంక్స్ రవీందర్ గారు. మీలంటి కొత్త పాఠకులు నా బ్లాగ్ లోకి రావటం బహు బావుంది.

@భాస్కర రామిరెడ్డి..భలే వారే..అంత అర్ధం కాకపోవటానికి అక్కడ ఏమి లేదుకాని మీరే చెప్పారు కదా చలికి ముణగదీసుకొని వుంటే ఆలోచించడానికి కొంచెం బద్దకించి వుంటారు.

Anwartheartist said...

నాకు ఆ కవిత్వం సాహిత్యం అనేవి సరిగా తెలీవు కాని, ఐనా బొమ్మలు లాంటివి వేసేస్తూ వుంటాని, కానిమీరు వ్రాసింది చదువుతుంటే బొమ్మ వేయ బుద్ది ఐంది, thanks for this magical lines అమ్మా.

జాన్‌హైడ్ కనుమూరి said...

కుబుసాల్ని వదలగలిగినప్పుడే కదా ఇంద్రధనస్సుల్ని చూడగలిగేది


మంచి కవిత్వాన్ని చదివాను
అభినందనలు

Kalpana Rentala said...

@ అన్వర్,జాన్ హైడ్ కనుమూరి గారూ, మిమ్మల్ని ఇలా నా బ్లాగ్ లో చూడటం బావుంది. అన్వర్, నా కవితకు బొమ్మ వేస్తే నా కివ్వరా ప్లీజ్ ? ఒక అనుభూతి ని నేను అక్షరాల్లో వ్యక్తీకరిస్తే మీరు రంగుల్లో అద్దుతారు. ఆ అందం కూడా చూడాలని వుంది.

Telugu Movie Buff said...

కల్పన గారు అద్బుతంగా వుంది.
ఇంతకు ముందు మీ కవిత ఒకటే చూసాను. కానీ అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు 5 సంఖ్యకు మీ వివరణ చూసాక అర్ధం అయింది. అద్బుతం.

Telugu Movie Buff said...

క్షమించండి. నాది మట్టి బుర్ర.
వెంటనే అర్ధం తట్టక పోవడంతో అర్ధం కాలేదు అనేసాను.

Kalpana Rentala said...

థాంక్స్ ఫణి.కవిత నచ్చినందుకు,కష్టపడి అర్ధం చేసుకున్నందుకు...

Kathi Mahesh Kumar said...

చాలా చాలా చాలా బాగుంది.

 
Real Time Web Analytics