నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, December 28, 2009

వైరుధ్యాల పంజరంలో అజంతా!

-----అఫ్సర్
శిబిరంలోనూ, సమూహంలోనూ మనిషి నిజానికి దూరమవుతాడు. శిబిరం పాక్షికత్వానికీ, సమూహం నిష్పాక్షికమే అయినా నిష్ప్రయోజనమైన కట్టుగొయ్యకూ ప్రతీకల్లాంటివి. అవి రెండూ సత్యానికి సమాధి కట్టేవే, సత్యాన్వేషణ కోసం మనిషి ఒకో సందర్భంలో వొంటరివాడవక తప్పదు. లక్ష్యం మరిచిన రాజకీయ శిబిరాల మధ్య, అవసరాల బానిసత్వంలో రక్తాన్ని చంపుకున్న సమూహాల మధ్యా మనిషికి సామూహిక వ్యక్తిత్వం వుండదు. వుండేదల్లా అస్తిత్వ వేదన.


ఇలాంటి సంక్లిష్ట దశ లోంచి పుట్టుకు వచ్చినవే అధివాస్తవికత లాంటి వాదాలన్నీ –మనిషి సహజత్వాలను వెతికి పట్టుకోవడం కోసం ఉపయోగపడిన సర్రియలిజం సహజంగానే రాజకీయ వాదుల్ని భయపెట్టింది; రాజకీయ పక్షి మూకల్లో కలవరం సృష్టించింది. తనను చుట్టుముట్టిన కలుషిత సామాజిక వాస్తవాల మధ్య నుంచి తనని ఒక అడుగు పైకెత్తి కనుమరుగవుతున్న నిజాలలోకి తొంగి చూసే అవకాశమిచ్చిన అరుదైన వాదం అధివాస్తవికత. రాజకీయ వొత్తిళ్ళకు అధివాస్తవికత వాదం నలిగి పోయినా దాని పరిమాళాలు ఇప్పటికీ మిగిలివున్నాయి. నిజం కోసం వెతుక్కునే తరం ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే వుంటుంది.


శిబిరాల్లో, సమూహాల్లో వూపిరాడక పారిపోయిన సత్యాన్ని ఈ తరం వెతుక్కుంటుంది. అప్పటి అన్నీ సాధారణ ప్రమాణాల శిఖరాగ్రం పైనా ఆ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది కొత్తతరం. అలాంటి సంక్షోభ తరానికి ఉత్తమ ప్రతినిధి అజంతా. వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన అక్షరం అతని సంతకం.


కవిగా అజంతా నలభైయేళ్ళ చరిత్ర ని చూశాడు. నలభైయేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైరుధ్యాలలో నలిగిపోయిన మనిషి అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. హతుడూ, హంతకుడూ తానే అవుతున్న ఆధునిక మానవుడి క్షణ క్షణ బీభత్సాన్ని ఆయన కవీత్వాకరించాడు. ‘ అగ్ని స్పర్శ ‘ లో అజంతా చాలా స్పష్టం గా కనిపిస్తాడు. అజంతా కవి తత్త్వాన్నంతా ప్రతిబింబించే ముఖచిత్రం అది.


‘ బాధ నా ముఖ చిత్రం
బాధాగ్ని లో పునీతుడైన మనిషి పాదధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్ఛాగీతాన్ని రచిస్తాను ‘


కరిగిపోతున్న కాలం ముందు నిల్చోని అరచేతి కాన్వాస్ పై అశ్రు బింబాన్ని రచిస్తున్న అధివాస్తవిక స్వాప్నికుడు సాల్వదార్ డాలీ ‘ అగ్ని స్పర్శ ‘ చదూతున్నంతసేపూ మన చుట్టూ గాలి లా అల్లుకుపోతాడు. భయం, విభ్రమం ఆవులిస్తున్న అగాధంలో చిటికెలు వేస్తున్న మృత్యువు ఎండుటాకులా అల్లాడిపోతున్న మనిషి, శవం రాల్చి వెళ్లిన పూలతో తనని తాను అలంకరించుకుంటున్న రోడ్డు- ఇలాంటి ఒక దృశ్యం పాఠకుడి ఆలోచనలో చిక్కుకుపోతుంది. భాదాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న మనిషి ఎప్పుడూ క్షతగాత్రుడే.


“ జీవన కుడ్యాలపై ఆకలి ఆకర్ణాంత నేత్రాలు
కన్నీళ్ళలో ప్రేమికుల ప్రతిబింబాలు
అన్నీ ఒకే దృశ్యం వెనుక భస్మరాసులే
కంటక చతురస్రాల మధ్య నిరీక్షణ అసహ్యం నాకు ‘


ఈ వాక్యాలు చదువుతున్నప్పుడూ అజంతా రాసిన వొకే వొక్క కథ “చతురస్రం” గుర్తుకొస్తుంది. దృశ్యం మారుతుంది. కానీ సారం ఒక్కటే. ప్రతిబింబం మారుతుంది. కానీ రూపాలు అవే. రేఖలు కాన్వాస్ దాటి రంగులు బలహీనపడుతున్నప్పుడు ఆలోచన అక్షరంలోకి జారుతుంది. రంగు గీతా పలచబారి అక్షరం కొనదేలుతున్న ఆ అసహన రేఖ మీద సాల్వడార్ దాలీతో అజంతా కరచాలనం చేస్తుంటాడు. డాలీ కళ్ళల్లో అవ్యక్తం గా మిగిలిన అనుభూతి కొస కాంతులు అజంతా అక్షర ఛాయలోకి ప్రయాణిస్తాయి. ఎప్పుడో జారిపోయిన కల మీద ఆకాశం భూతద్దంలా కన్ను విప్పుతుంది. ఆ తర్వాత అక్కడ కెరట కెరటాలుగా మెలి తిరుగుతున్న వెయ్యి సముద్రాలు మేల్కోంటాయి.

సమాజం నుంచి విసిరేసిన మనిషి ఆ తీరమ్మీద రాలిపడ్తాడు. అక్కడి ఇసుక తిన్నెల మీద అతని నీడ పల్చగా సాగుతుంది. చెవుల్ని సముద్రాల చేతుల్లో మూసుకొని అక్కడ అతను మళ్ళీ మళ్ళీ వొంటరి వాడవుతాడు. ఇది వొంటరి తనం లోకి నిరంతరంగా సాగే ప్రయాణం. మనిషి సహజం గా ఏకాకి. వొంటరితనం అతని సహజాతం. పుస్తకాలు, సిధ్ధాంతాలు, జెండాలు అతన్ని కప్పి వేసే ఆచ్ఛాదనలు.


మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనిషి మళ్ళీ ఎప్పుడో ఒకసారి తన అమాయకత్వంలోకి వెళ్ళాల్సివస్తుంది. వర్తమానం వంచనగా మారినప్పుడు, గతం అగాధంగా పరిగణిస్తున్నప్పుడు భవిష్యత్తు శూన్యంగానే విస్తరిస్తుంది. శూన్యం మనిషికి ఒక అవరోధం. అతని అడుగుల్నీ వెనక్కి చుట్టిపెట్టే ఒక గాయం. శూన్యంతో పోరాటం ఎప్పుడైనా అనివార్యమే. అది మనిషిని వెక్కిరించే గోడ. ఆ గోడ ఒక్కోసారి సంప్రదాయం. ఇంకోసారి కుహానా సిధ్ధాంతవాదం. గోడని పడగొట్టడమే మనిషి కర్తవ్యం.ఆ గోడలో నియమాల ఇటుకలుంటాయి. అది అప్పుడప్పుడూ కొరడా విప్పే మేనిఫెస్టో కూడా. అక్కడ పూర్వీకుల సంతకాలుంటాయి. వాటిని బుధ్ధిగా అనుకరించు లేదా యుధ్ధానికి తలపడాలి. నిజమే. అది శూన్యంతో పోరాటమే. శూన్యంలో కత్తులు దూయడమే. అయినా సరే పోరాటం అనివార్యం. అప్పుడు


నీవు గోడతో మాట్లాడుతున్నావు
సంకెళ్ళు పడిన చేతులను స్పృశిస్తున్నావు


గోడలు మాట్లాడవు. నడకని సాసిస్తాయి. గోడలు పోట్లాడవు. కాళ్ళూ చేతులకు సంకెళ్ళు వేస్తాయి. మనిషి అధికారాల్ని స్వంతం చేసుకొని జులుం చేస్తుంది గోడ. గోడ ఎదుట మనిషి ముసుగు ధరిస్తాడు.


‘ అంతా ముసుగు వేసుకున్నవాళ్ళే
అక్షరాలకు ముసుగు ఆలోచనలకు ముసుగు
ముఖం వెనుక మరో ముఖం, స్వచ్ఛమైన
సూర్యోదయాలను అంతా భూస్థాపితం చేసుకున్నవాళ్ళే ‘
ఛద్మ వేషధారుల ప్రపంచం అది. ఆచ్ఛాదన అవసరమై వచ్చి శాసనంగా మారిన విషాదం అది.
‘ జీవన వ్యూహంలో మనిషి
శిలా విగ్రహంగా మారుతున్న దృశ్యం చూడలేను చూడలేను
నిత్యం అదే జీవితం అదే రోడ్డు అదే గోడ
అదే గడియారం అవే ముఖాలు దుస్సహం, దుర్భరం ‘

దృశ్యం మారదు . మనిషి పెదాల మీద అతికించుకున్న మాటల పోగులు మారవు. చీకటి స్తంభంగా దిగడిపోయిన మనిషి వీడు. కాలాన్ని మరిచిపోయి ఒక చోట కరిగిపోయిన మనిషి. కట్టుగొయ్య దగ్గర పాత గడ్డిని కరుచుకుతింటున్నాడు. అన్వేషణ లేదు, అవగాహన లేదు, అంతస్సు అంతకన్నా లేదు. మనిషి అడుగులు స్తంభించిన సంక్షోభం ఇది. ఆ మంచుని అగ్నితో స్పర్శించే వేళ్ళు కావాలి. ఆ సంక్షోభాన్ని సందేహంతోనో, సంశయం తోనో విడగొట్టే మార్గం ఏదైనా కావాలి. చుట్టూ గోడలు నిర్మించుకున్న మనిషి ని ఈ తలుపుల్లోంచి నడిపిస్తారో ఇక?
ప్రశ్నకు సమాధానం ప్రశ్న
పెద్దపులి గుండెల్లో కత్తులు విసురుతున్న మనిషిని నేను
అక్కడే శాశ్వత విశ్రాంతి లేదా విక్రాంతి


అజంతా మృత్యువు ని ప్రేమిస్తాడు. జీవితాన్ని ద్వేషించాడు. నిరాశాని ప్రేమిస్తాడు. కానీ ఆశాని ద్వేషించాడు. అక్షరాన్ని సాధనగా మిగుల్చుకున్న అజంతా బాధతో, నిరాశతో, నిస్పృహతో వక్తీకరణకు పదును తెఛ్చుకుంటాడు. బాధ లోంచి, నిరాశ లోంచి మనిషిని తనతో పాటు నడిపిస్తాడు. అతని ప్రయాణం ఒక సందేహం నుంచి ఒక సంశయం నుంచి విస్తృతమవుతున్న ఆలోచనల్లోకి---


దురదృష్టవశాత్తూ కవిత్వాన్ని విశ్లేషించడంలో మనం ఇంకా చిన్న పిల్లలమే. వేటినో నమ్ముకొని వేటినో వెతుక్కోవడం మనం ఇంకా మానుకోలేదు. నిజమే, శుధ్ధ కవిత్వం, శుష్క కవిత్వం ఎక్కడా వుండదు. కలుషితమైన సమాజంలో నిష్కల్మషమైన కవిత్వాన్ని వూహించడం నేరం. అక్షరం మీద పడే అన్నీ నీడలు సమాజ కల్పితాలే. అక్షరాన్ని శాసించే అన్నీ నియమాలు సమాజపరమైనవే.


కవిత్వం కోసం కవిత్వం ఎవరూ రాయరు. కవిత్వం ఒక వెతుకులాట. దాని పరిధి విస్తృతమైంది. మనమే విధించుకున్న నియమాలు వ్యక్తీకరణలో తాత్కాలిక అవరోధాలు గా పరిణమిస్తాయి తప్ప వాటి నీడల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. అజంతా స్వాతంత్రోదయానికి అటూ ఇటూ గా రాసిన కవితలే దానికి మంచి ఉదాహరణ. ఆధునిక కవిత్వాన్ని సంప్రదాయిక చీకటి పాషాణ హస్తాల నుంచి కాపాడుకోలేనంతవరకూ అజంతా మనకు పరాయి కవిగానే కనిపిస్తాడు.
( 1993లో అచ్చు అయిన అఫ్సర్ “ఆధునికత – అత్యాధునికత” పుస్తకం నుంచి )

15 వ్యాఖ్యలు:

మరువం ఉష said...

నేను చదివాను అనేకన్నా నా మనసు చదివింది అనటం సబబు. ప్రతి మాట నూనె మరక మాదిరి మనసు వస్త్రానికి రంగు చార వేసింది. ఇంకా మననంలోనే వున్నాను. చాలా గాఢమైన అనుభూతిని మిగిల్చింది. కవిత్వం కూడా సత్యదూర ప్రంపంచానికి చిక్కి విలవిలలాడిందని తెలుసు కానీ ఇంత ఆక్రోశాలు ఎగిసాయని తెలియదు. చాలా థాంక్స్.

ఒకటే అర్థం కాలేదు..
'అంతా ముసుగు వేసుకున్నవాళ్ళే
..' అన్న పంక్తుల క్రింద "ఛద్మ వేషధారుల ప్రపంచం అది." అన్న వాక్యలో 'ఛద్మ వేషధారుల' అంటే యేమిటి కల్పన? మీరు కానీ/అఫ్సర్ గారు కానీ వివరణ ఇస్తారని ఆశిస్తూ..

Afsar said...

ఉష గారు:

అజంతా వ్యాసం మీద మీ స్పందనకి ధన్యవాదాలు. కచ్చితంగా ఈ వ్యాసం చదివి, అజంతా గారు కూడా ఆ మాటే అన్నారు. ఇవి ఆయన మాటలు: "నా మీద ఎవరయినా రాసినా నాకు నచ్చదు, కాని, నా అయిష్టాలని కాసేపు పక్కన పెట్టి, నీ వాక్యాల వెంట పరిగెత్తాను. ఇక నువ్వేం రాశావన్నది నాకు అనవసరం అబ్బాయ్! చాలా మంది బలిష్టమయిన వాక్యాలు రాయగలరు, కాని గుండె చప్పుడు వుండదు. బలిష్టమయిన వాక్యం , గుండె చప్పుడూ రెండూ ఇక్కడ చూశాన్నేను."

వ్యక్తిగతంగా నాకు కూడా చాలా ఇష్టమయిన వ్యాసం ఇది.

ఇక మీ సందేహం 'చద్మ వేష ధారుల ' గురించి - చద్మం అంటే నకిలీ, మోస పూరితం. వేష ధారణ వొక దశలో జీవితావసరం కావచ్చు. ముసుగులు కూడా రక రకాలు వుంటాయి (ఓ.పి. శర్మ డోగ్రి నవల 'నగర మథనం ' చదివారా? ) అందులోనూ, మరీ మోసకారి వేషం "చద్మ వేష ధారణ " అజంతా వాక్యాలు ఆ చద్మ వేషాన్ని చీల్చే చురకత్తుల్లా కనిపిస్తాయి వొక్కో సారి!

మరువం ఉష said...

ఇంత వెంటనే అదీ అంత వివరంగా సమాధానమిచ్చినందుకు చాలా థాంక్స్ అఫ్సర్ గారు.

మరువం ఉష said...

ఇక మీ ప్రశ్న "ఓ.పి. శర్మ డోగ్రి నవల 'నగర మథనం ' చదివారా?" లేదండి, చదవలేదు. ఇలా లెక్కకు మించిన పుస్తకాల జాబితా సిద్దంగా వుంది, దాని నిడివి నా మిగిలిన జీవితకాలానికన్నా ఎక్కువే. కానీ ఈ ఉక్కిరిబిక్కిరి జీవితంలో తీరిక ఎప్పుడూ కరువే, సమాయాభావానిది అన్నిటా పైచెయ్యే. కానీ ఎక్కడైనా ఆన్లైన్ కాపీ వుంటే తెలియపరచగలరా. మా లోకల్ యూనివర్సిటీ లైబ్రరీలో కూడా వెదుకుతాను.

భాస్కర రామి రెడ్డి said...

పొద్దుట్నించి ఈ టపా లేదా అజంతా పరిచయం చదవడం ఇది నాలుగోసారి.చదివినప్పుడల్లా ఏదో వ్రాయాలని ఉత్సాహం.వ్రాద్దామని కూర్చొని

"శిబిరాల్లో, సమూహాల్లో వూపిరాడక పారిపోయిన సత్యాన్ని ఈ తరం వెతుక్కుంటుంది" ఈ వాక్యం వద్ద ఆగి వెళ్ళిపోయాను.

రెండో సారి

"బాధాగ్ని లో పునీతుడైన మనిషి పాదధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్ఛాగీతాన్ని రచిస్తాను"

ఇది చదివి ఎలా వ్యాఖ్యానించాలో అర్థం కాక , ఇలాంటి పాదాలలో జీవితపోరాటాన్ని చూసి ఇక వ్యాఖ్యను వ్రాయడం మానేసి, నాకున్న సందేహనివృత్తికోసం ఈ వ్యాఖ్య.

అజంతా గారు మహా కవి అని అర్థమౌతుంది. కానీ , వీరికి చిత్రలేఖనంతో కూడా పరిచయమేమైనా వుందా?

Afsar said...

భాస్కర్ గారు:

అవును, ఆధునిక కవిత్వంలో శ్రీ శ్రీ, తిలక్ తరవాత కోటబిలిటి వున్న కవిత్వం రాసిన వాడు అజంతా నే అనిపిస్తుంది వొక్కోసారి. చాలా వాక్యాలు ఒక సారి చదివాక మనల్ని వెంటాడ్తాయి. అజంతా చిత్రకారుడు కాదు, పదచిత్రకారుడు. అధివాస్తవిక కవులు చాలా మంది చిత్రలేఖనం నించి స్పూర్తి పొందారు. వాళ్ళ వాక్యాలు చిత్రాల్ని గీస్తాయి. అజంతా ఆ కోవలోనివాడే.

Afsar said...

ఉషగారు:
"నగర మథనం" నవల ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఆ నవల అంతా వొకే వ్యక్తి అనేక రకాల ముసుగులు ధరించి జీవితంలోని వివిధ సన్నివేశాల్ని ఎట్లా గట్టెక్కుతాడో చెప్పుకొస్తాడు రచయిత. బుక్ కోసం ఈ లింక్ చూడండి.

http://74.125.93.132/search?q=cache:3vp9NCdubA0J:www.sahitya-akademi.gov.in/old_version/bklst24.htm+sarma+o.p+dogri+writer&cd=1&hl=en&ct=clnk&gl=us

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అఫ్సర్ గారు చాలా అద్భుతంగా ఉందండి వ్యాసం. కల్పనగారు ధన్యవాదాలు దాదాపు పుష్కరం క్రితపు వ్యాసం మాలాంటి వారిచేత చదివించినందుకు. ఓ కవిత గురించి వ్రాయటం కన్నా, ఓ మహాకవిలోకి తొంగిచూసి వ్రాయటం, ఆయన్ను కూడా మెప్పించటం కష్టతరం.

అజంతా గారి కవితల్లో విశృంఖలత ఉంటుందని అనవచ్చో అనకూడదో తెలీదు. కానీ, నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, నిర్వికారం, అస్తవ్యస్తంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఆయన కవితలు. చాలా రోజుల దాకా వెంటాడే అనుభూతిని మిగులుస్తుంది ఆయన కవిత్వం.

దీనికి కాంట్రాస్టింగ్ గా ఇస్మాయిల్ గారి కవితలు కూడా అంత సరళంగా ఉన్నా, నిగూఢమైన అనుభూతిని అలానే మిగిల్చేస్తుంది.

వీరిలాంటి కవిత్వం చదివినప్పుడు అనిపిస్తుంది కవిత్వానికి పరాకాష్ఠ అంటే ఇదేనేమో అని. దాదాపు ఇటువంటి సందర్భంలోనే, నాకు చాలా అనుమానాలు వస్తాయి. కవిత్వానికి అతీతమైన స్థితి అంటూ ఉంటుందా? ఉంటే ఏమిటది? ఈ ప్రశ్న నాలో రేకెత్తినప్పుడల్లా, నలుగురు మెచ్చిన నా కవిత్వం గడ్డిపోచలా కనిపిస్తుంది. కవిత్వానికి అతీతమైన స్థితి గురించి కొన్నాళ్ళ క్రితం అన్నాజీ (ఇక్బాల్ చంద్ గారు), అన్న గారు (రఘోత్తమరావు గారు), సుబ్బులతో అభిప్రాయాలు కూడా పంచుకోవటం జరిగింది. కానీ ఏమీ తేలని స్థితే ఇంకా.

అసలు, కవిత్వానికి అతీతమైన స్థితి గురించి ఇక్కడ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, అజంతా గారి కవితల్లోనూ (సో కాల్డ్ విశృంఖలత రిఫరెన్సుతో) ఒకానొక తాత్వికత కనిపిస్తుంది. ఏమిటనేది తెలిసీ తెలియనట్లుంటుంది.


అడగాలనుకున్న ప్రశ్నలు సరిగ్గా అడగలేదనే అనుమానం నాకు. అఫ్సర్ గారు ఈ విషయంపై మీరు కొద్దిగా లైటు వేయాలి.

అన్నట్లు అఫ్సర్ గారు ఈ మధ్య మీ ఆశీస్సులు (నా పాత కవితలపైన) అందటంలేదు :)

Afsar said...

సాయి గారు:

కవిత్వానికి అతీతమయిన స్థితి....చాలా మంచి భావన. బహుశా, ఆలోచనకి అందని భావన కూడా. ఇక్కడ నేను ఇచ్చే సమాధానం ఆ భావన రేకెత్తించే అనేక ప్రశ్నలకు వొకానొక సమాధానం మాత్రమే కావచ్చు, కవిత్వంలో "స్థిర ముగింపు" యేదీ వుండదని నమ్ముతాను కాబట్టి.

తాత్విక స్థాయికి కవిత్వాన్ని తీసుకువెళ్ళడం అనే మాట తరచూ వింటూ వుంటాం. ఖలీల్ జీబ్రాన్ కవిత్వం చదువుతున్నప్పుడు, సూఫీ కవుల పదాలు చదువుతున్నప్పుడు మనం వొక అపరిచిత అనుభూతికి లోనవుతాం. తెలుగులో నాకు వొక్క అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు మాత్రమే అలాంటి అనుభూతే కలుగుతుంది. కవిత్వ అతీత స్థితిలో శ్రీ శ్రీ, ఇస్మాయిల్, అజంతా లాంటి ఆధునికులు అన్నమయ్య స్థాయికి ఎప్పటికీ చేరుకోలేరనే నాకు అనిపిస్తుంది. మన బతుకుల్లో అంత స్వచ్చత లేదు. స్వచ్చత లేని చోట స్వేచ్చ కూడా లేదు. శ్రీ శ్రీ, తిలక్, అజంతా కొంత మేరకు మాత్రమే ఆ స్వేచ్చా స్థితికి చేరుకున్నారేమో! ఇస్మాయిల్ గారికి ఆ స్పృహ వుంది కాని, ఆయన రాజకీయ కవిత్వం కింద అది కప్పడి పోయింది. కన్నడ వచనాలు నాకు కవిత్వానికి ఒక పరాకాష్ట అనిపిస్తాయి. ఆగ్రహాన్ని, నిరసనని కూడా తాత్విక స్తాయిలో చెప్పారు వాళ్ళు. మన కవిత్వాలు ఆ "వచనం " ముందు గడ్డిపోచలు అయినా పరవాలేదు. ఆ గడ్డిపోచల్లో కొన్ని చిన్ని ఆకాశాలు లేకపోలేదు !.

Vinay Chakravarthi.Gogineni said...

songs...excellent.............

కొండముది సాయికిరణ్ కుమార్ said...

కవిత్వ అతీత స్థితిలో శ్రీ శ్రీ, ఇస్మాయిల్, అజంతా లాంటి ఆధునికులు అన్నమయ్య స్థాయికి ఎప్పటికీ చేరుకోలేరనే నాకు అనిపిస్తుంది. మన బతుకుల్లో అంత స్వచ్చత లేదు. స్వచ్చత లేని చోట స్వేచ్చ కూడా లేదు. శ్రీ శ్రీ, తిలక్, అజంతా కొంత మేరకు మాత్రమే ఆ స్వేచ్చా స్థితికి చేరుకున్నారేమో!
====
అఫ్సర్ గారు - చాలా చాలా ధన్యవాదాలండి. మీ ఒక్కో కామెంటు కూడా, ఓ వ్యాసంలాగా ఎన్నో విషయాలు అందిస్తాయి. మీరు చెప్పింది అక్షరసత్యం. మీరు మంచి కవి కాబట్టి, ఒక పాఠకుడుగా కాకుండా, ఓ కవిగా కవిత్వాతీత స్థితి గురించి చెబుతారా.

budugu said...

"శ్రీ శ్రీ, తిలక్, అజంతా కొంత మేరకు మాత్రమే ఆ స్వేచ్చా స్థితికి చేరుకున్నారేమో! ఇస్మాయిల్ గారికి ఆ స్పృహ వుంది కాని, ఆయన రాజకీయ కవిత్వం కింద అది కప్పడి పోయింది. "
=
ismaayil gaari raayajeeya kavitvam emiti? care to elaborate this line?

Afsar said...

సాయిగారు:

కవిగా కవిత్వాతీత శక్తి గురించా? కవికీ, పాఠకుడికీ ఆట్టే దూరం వుందని నేను అనుకోవడం లేదు. కవిత్వం రాసేటప్పుడూ, చదివేటప్పుడూ ఇద్దరూ ఒకే స్థితిలో వుండాలన్నది ఆదర్శం. అయితే, అనుభవ తీవ్రత వొక అడ్డంకి అనుకోండి! ఈ మధ్య ఎం.వీ.రమణ కవిత్వానికి రాసిన ముందు మాటలో ఈ ఆనుభవిక వ్యత్యాసాలు చర్చించాను.


బుడుగు గారు:

సాధారణంగా వొక కవినీ, కథకుడినీ లేదా కవితనీ, కథనీ వొకే వైపు నించే చదవడం మనకి అలవాటు. ఇస్మాయిల్ గారి విషయంలో ఇది చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది.ఇస్మాయిల్ కవిత్వంలొ కాని, సాహిత్య విమర్శ లో కాని, ఆయన రాజకీయ కోణం చాలా ముఖ్యమయ్యింది. మార్క్సిస్టు మిత్రునికి, వడ్రంగి పిట్ట, అనంత పురంలో గాడిదలు లాంటి కవితలు ఆయన రాజకీయ దృస్టిని చెబ్తాయి, ఆయన కవిత్వ తాత్విక పరిమితిని కూడా చెబ్తాయి. ఇస్మాయిల్ గారి గారి కవిత్వం మీద మనకి వున్న ఆరాధనా భావానికి ఎలాంటి భంగం కలగకుండానే, అవి చర్చించాల్సిన అవసరం వుందని నా అభిప్రాయం.

రమణ said...

ఎంత మంచి వ్యాసం!!

"శిబిరంలోనూ, సమూహంలోనూ మనిషి నిజానికి దూరమవుతాడు. శిబిరం పాక్షికత్వానికీ, సమూహం నిష్పాక్షికమే అయినా నిష్ప్రయోజనమైన కట్టుగొయ్యకూ ప్రతీకల్లాంటివి. అవి రెండూ సత్యానికి సమాధి కట్టేవే, సత్యాన్వేషణ కోసం మనిషి ఒకో సందర్భంలో వొంటరివాడవక తప్పదు. లక్ష్యం మరిచిన రాజకీయ శిబిరాల మధ్య, అవసరాల బానిసత్వంలో రక్తాన్ని చంపుకున్న సమూహాల మధ్యా మనిషికి సామూహిక వ్యక్తిత్వం వుండదు. వుండేదల్లా అస్తిత్వ వేదన"

నిజం.

అస్తిత్వ వేదనని ప్రతిబింబించే నవలలు చదివాను కానీ, కవిత్వం చదవలేదు. అజంతా ను వెదుక్కోవాలి ఇక. ధన్యవాదాలు.

తెలుగుయాంకి said...

నండూరివారి గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడో విహరించి ఈ వ్యాసము దగ్గరకు వచ్చాను ఓ గంట క్రితము. అప్పటి నుంచి బయటపడలేకపోతున్నాను. ఒక గొప్ప కవిని మరో కవి ఎలా పరిచయము చెయ్యాలి అది కవితాత్మకముగ ఉండాలి అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అద్భుతము అఫ్సర్ గారు.

 
Real Time Web Analytics