నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, December 25, 2009

మృత్యువు కవి అజంతా!


తెలుగులో చిక్కనైన కవిత్వం –చెరిగిపోని సంతకం అజంతాది. అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి . అజంతా ఆయన కలం పేరు. స్వప్న లిపి ఆయన కవిత్వ పుస్తకం. అజంతా ఒకరకం గా మృతువు కవి. ఆయన నిరంతరం మృతువు ని ప్రేమిస్తున్నాడనిపిస్తుంది ఆయన కవిత్వం చదువుతుంటే. ఆయనొక నిరాశావాద కవి అని కొందరి అపోహ. అపోహ అని ఎందుకన్నానంటే ఆయన కవిత్వం అర్ధం కాకపోతే అనుకునే మాట అది. ఆయన కవిత్వాన్ని కేవలం పదాలుగా, వాక్యాలుగా, కొన్ని పద చిత్రాలుగా చూస్తే అజంతా రాసే కవిత్వాన్ని చదివి ఈయనకు జీవితం అంటే ద్వేషం, నిరాశ. అందుకే ఎప్పుడూ మృతువుని కలవరించి పలవరిస్తాడు అనుకుంటారు. కానీ, ఆయన తన జీవితాన్ని, తన చుట్టూ వున్న వారి జీవితాల్నీ ప్రేమించాడు కాబట్టే అనివార్యమైన మృత్యువు ని కూడా ప్రేమించాడు అంతే ఇష్టం తో.

‘ అగ్ని స్పర్శ ‘ అనే కవితలో అజంతా ఏమంటారంటే...
‘బాధ నా ముఖచిత్రం
భాదాగ్ని లో పునీతుడైన మనిషి పాడధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్చాగీతాన్ని రచిస్తాను ‘

చాలా మంది కవుల్లాగా ఆయన ఎక్కువ రాసి, ఎక్కువ మాట్లాడి, ఎక్కువ పొగిడించుకోలేదు. తక్కువ రాశాడు. మరీ తక్కువ మాట్లాడాడు. ఇక పొగిడించుకున్నదీ, పొంగిపోయింది ఏమైనా వుందా అంటే అది స్వల్పాతిస్వల్పం. కనీసం కవిత్వ పుస్తకం కూడా ఆయన చివరి దశలో వచ్చింది. స్వప్న లిపి పుస్తకం వచ్చే వరకు ఆయన మౌనంగా, ఋషి లా వుండిపోయాడు తప్ప ఒక పేరున్న కవిలా బతకలేదు.

ఇలాంటి మంచి కవి గురించి నాకు పసితనం నుంచి పరిచయం వుందటం కేవలం నా అదృష్టమే. మా నాన్న గారు,కవి, రచయత, జర్నలిస్ట్ రెంటాల గోపాలకృష్ణ, కవి అజంతా ఇద్దరూ సమకాలీకులు. ఇద్దరూ కవులు, ఇద్దరూ ఆంధ్రప్రభ పత్రికాఫీసులో ఒకేసారి పనిచేశారు. అజంతా ఇల్లు మా ఇంటికి ఓ రెండు మూడు సందుల అవతల. వాళ్ళ అమ్మాయి అపర్ణా, మా చెల్లి శ్రీవిద్య కలిసి చదువుకున్నారు. అలా నిరంతరం మేము వాళ్ళ ఇంటికి వెళుతూవుండేవాళ్ళమూ. కానీ ఆయనతో సంభాషణ లు చాలా తక్కువ, ఏవో కొన్ని కొన్ని పొడి మాటలు తప్ప. ఇక కవిత్వ చర్చల్లాంటివి అసలు శూన్యం. నేను కవిత్వం రాయటం మొదలుపెట్టేటప్పటికి ఆయనతో భౌతికం గా దూరమైపోయాను.
మళ్ళీ హైదరాబాద్ లోకి మా నివాసం మారినప్పుడు, అక్కడ అఫ్సర్, వాళ్ళ మిత్రబృందంతో జరిగే కవిత్వ చర్చల్లో మళ్ళీ అజంతా మా మధ్యకు వచ్చేవారు. ఆయన మరణ వార్త వినటానికి కొన్ని నెలల ముందే మాకు హైదారాబాద్ నుంచి అనంతపూర్ కి బదిలీ అయింది.

జీవించినంత కాలం మృత్యువుని ప్రేమించి, ఎదురుచూపులతో, కలవరించి, పలవరించిన అజంతా డిసెంబర్ 25, 1999 కన్నుమూశారు.
ఆ తర్వాత మళ్ళీ అజంతాతో నా పునః జ్ణాపకం 2002 లో. అజంతా మరణం తర్వాత మిత్రులు, కుటుంబసభ్యులు కలిసి అజంతా అవార్డ్ నెలకొల్పారు. ప్రతి ఏటా వచ్చిన ఉత్తమ కవిత్వ సంకలనానికి ఆ అవార్డ్ అందచేస్తారు. 2001 లో నా కవిత్వ సంకలనం “ నేను కనిపించే పదం “ విడుదల కాగా 2002 లో నా కవిత్వ పుస్తకానికి, మరో స్త్రీవాదకవయత్రి కె. గీత పుస్తకం “ ద్రవ భాష “ కి కలిపి సంయుక్తం గా అజంతా అవార్డ్ అందచేశారు. అవార్డ్ సభ డిసెంబర్ 25, 2002 హైదరాబాద్ లో జరిగింది. ఆ అవార్డ్ సభలో, అవార్డ్ అందుకునేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక ఆడ పిల్ల కు పుట్టింటి నుంచి పసుపు,కుంకుమలు ఇచ్చినప్పుడు ఎలా వుంటుందో ఆ అవార్డ్ అందుకునేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగింది నాకు. దానికి కారణం పసి తనం నుండి అజంతా గారి గురించి తెలిసి వుండటమే. నా కవిత్వ పుస్తకం వచ్చేటప్పటికి మా నాన్నాగారు జీవించిలేరు. అజంతా లేరు. కానీ నా మొదటి పుస్తకానికి మా నాన్నగారి స్నేహితుడిగానే కాకుండా తెలుగు కవిత్వంలో అజంతాది ఒక ప్రత్యేక స్థానం. నాకేమిటో, ఆ సభలో మా నాన్నగారు, అజంతా వున్నట్లే అనిపించింది.

డిసెంబర్ 25, అజంతా గారి వర్ధంతి. హైదరాబాద్ లో అవార్డ్ సభ ఏమైనా జరిగిందో,లేదో నాకు తెలియదు. అవార్డ్ లు మన ప్రతిభాకు తప్పనిసరి గీటురాళ్ళు అని నేను నమ్మను కానీ ఈ అవార్డ్ రావటం మాత్రం వ్యక్తిగతం గా నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. దానికి కారణం కేవలం ఒక కవిగా అజంతా మీద నాకున్న ప్రేమ, గౌరవం మాత్రమే. అలాగే ఆ అవార్డ్ కింద అందచేసిన చిన్నపాటి మొత్తాన్ని కూడా పనిపిల్లల పిల్లలకు చదువు ఉచితం గా చెప్పేందుకు కృషి చేస్తున్న ఒక సేవాసంస్థకు అందచేయగలగటం నాకు అంతకన్నా ఎక్కువ మానసిక ఆనందాన్ని అందచేసింది. వర్ధంతులు, జయంతులు మొక్కుబడిగా కాకుండా కనీసం వారిని స్మరించుకొని వారు చేసిన మంచిపనులో, సమాజానికి ఉపయోగపడ్డ తీరునో స్మరించుకున్నా చాలు. అదే వారికి నివాళి.
కల్పనారెంటాల

22 వ్యాఖ్యలు:

Subrahmanyam Mula said...

గత శతాబ్దపు గొప్ప కవుల్లో అజంతా ఒకరు. రాసింది ముప్పై కవితలే అయినా ప్రతి కవితనూ బేలూరు శిల్పంలా చెక్కగల ప్రతిభ ఆయన సొంతం. ఆయన స్వప్నలిపికి రాసుకున్న ముందుమాట ప్రతి కవి తప్పక చదవాలి.

కల్పన గారు, మీరు అదృష్టవంతులు.

sunita said...

మీ బ్లాగులో ఫాంట్ సైజు కొంచం పెంచండి. చదవడానికి హాయిగా ఉంటుంది.

మాలతి said...

చదువుతుంటే కనులు చెమ్మగిల్లేయి. ఆయన "ఋషిలా ఉండిపోయారు" అన్నవాక్యం వెయ్యివాక్యాలపెట్టు.
అజంతా పేరు వినడమే కానీ కవితలు నేను చదవలేదు. ఇప్పుడు చదవాలనిపిస్తోంది. మృత్యువు కవి అంటే నిరాశావాది కాదన్నమాట మంచి వ్యాఖ్యానం.

cartheek said...

డిసెంబర్ 25 అదృస్టవంతులు ప్రపంచమార్గనిర్దేశకర్త జీసస్ లాంటి మహా మనిషి పుట్టిన రొజునె చనిపొయారు.
ఆయన ఆత్మ శాంతించాలని ఆశిస్స్తున్నాను

Kalpana Rentala said...

@ సుబ్రహ్మణ్యం గారు, నిజమే. మహాకవులతో పరిచయం కలిగి వుండటం నా అదృష్టం. ఒక మంచి కవి తండ్రి, మరో మంచి కవితో సహజీవనం మరీ ఎక్కువ అదృష్టం అనుకుంటాను.
@సునీత గారు, తప్పకుండా పెంచాలనే వుంది. కానీ ఎలాగో తెలియటం లేదు. అసలు ఈ బ్లాగుల నిర్వహణ, కామెంట్లు పెట్టడం మీద ఒక పోస్ట్ నే రాయాల్సినన్ని విషయాలు వున్నాయి. టపా చదగలగుతున్నారు కదా. అది కూడా ఫాంట్ సైజ్ పెంచాలా? మీలాంటి వాళ్ళు చెపితేనే నాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి చెప్పండి.
@అవును మాలతి గారు, నిజంగా ఆయన కవి ఋషి నే.
@కార్తీక్, అజంతా కు ఆత్మశాంతి కలిగివుంటుందనే నమ్మకం.

Purnima said...

Amazing!

అజంతా గారి స్వప్నలిపి ఇప్పుడు మార్కెట్లో లేదు. వచ్చే అవకాశాలు తక్కువలా అనిపిస్తున్నాయి. ఈ పుస్తకం రీ-ప్రింట్ చేసే అవకాశాల గురించి మీకేమైనా తెల్సా? ఈ తరం వాళ్ళు ఆ పుస్తకాలు చదవాలంటే ఎలా? ఏం చెయ్యమంటారు? (కాస్త ముందుగా కళ్ళు తెరవాల్సిందీ.. అనకండి :) )

రీ-పబ్లిష్ వరకూ కాకపోయినా, కనీసం ఓ రెండు మూడు కాపీలు దొరికే అవకాశాలుంటే చెప్పండి.. ప్లీజ్..

Purnima said...

Amazing!

అజంతా గారి స్వప్నలిపి ఇప్పుడు మార్కెట్లో లేదు. వచ్చే అవకాశాలు తక్కువలా అనిపిస్తున్నాయి. ఈ పుస్తకం రీ-ప్రింట్ చేసే అవకాశాల గురించి మీకేమైనా తెల్సా? ఈ తరం వాళ్ళు ఆ పుస్తకాలు చదవాలంటే ఎలా? ఏం చెయ్యమంటారు? (కాస్త ముందుగా కళ్ళు తెరవాల్సిందీ.. అనకండి :) )

రీ-పబ్లిష్ వరకూ కాకపోయినా, కనీసం ఓ రెండు మూడు కాపీలు దొరికే అవకాశాలుంటే చెప్పండి.. ప్లీజ్..

Unknown said...

కల్పన,
అజంతా వంటి ప్రముఖ కవితో మీ అనుబంధాన్ని,పరిచయాన్ని చాలా చక్కగా ఆర్ద్రంగా వ్రాసారు.ప్రముఖుల తో ఉన్న పరిచయాలు,జ్ఞాపకాలు తాలూకు ఎనెక్టొడ్స్ చదవటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

పూర్ణిమా,ఈ పుస్తకం నేను అజోవిభో వారి వెబ్సైట్ నుండి రెండేళ్ళ క్రితం తెప్పించుకున్నాను.వారి దగ్గర ఉందేమో ప్రయత్నించండి.

వైదేహి శశిధర్

Kalpana Rentala said...

పూర్ణిమ,
వైదేహి చెప్పినట్లు ఎక్కడైనా వెతుకుదాము. లేకపోతే మా లైబ్రరీ లో వున్న కాపీ స్కాన్ చేసి మీకు అందచేస్తాను. పుస్తకం రీప్రింట్ గురించి…ఒకసారి ప్రింట్ చేస్తేనే కవిత్వం పుస్తకాలు అమ్ముడు పోవటం కష్టం, పుస్తకాలు ప్రచురించుకోలేక కాగితాల మీదే కవిత్వం రాసుకొని కళ్ళూమూసిన సుకవులెందరో...మరుగునపడిపోయారు. కాలం లో కలిసిపోయారు.
అవును కానీ ఈ తరం వాళ్ళు ఈ పుస్తకం చదవాలంటే ఏం చేయమంటారా? అంటే నేను ఎన్ని తరాల ముందు వున్నాను...ఆయ్...అమ్మా...
వైదేహి, వ్యాసం మీకు నచ్చినందుకు , ఆ మాట ఇక్కడ చెప్పినందుకు ధన్యవాదాలు.

Bolloju Baba said...

good post



hee hee hee naaku oka kaapee andachestaaraa pleeej :-)

bollojubaba

sunita said...

నేను ఉపయోగంచేది గూగుల్ బ్లాగరు. మీరు వాడుతున్నది వర్డ్ ప్రెస్. కామెంట్ రిలటెద్ ఆప్షన్స్ చూడండి వర్డ్ ప్రెస్లో.పోస్ట్ ఫాంట్ బాగానే ఉంది. కామెంట్ ఫాంట్ చాలా చిన్న గా వస్తుంది.

మేము కామెంటు పబ్లిష్ చేసేటప్పుడు ఫాంట్ బాగానే ఉంది.కానీ పబ్లిష్ చేసాక చిన్న ఫాంట్లోకి మారిపోతుంది.

జ్యోతి said...

సునీతగారు,

ఇది కూడా బ్లాగరే. కాని ఈ ఫాంట్ సమస్య టెంప్లేట్ ది. ఇది పరిష్కరించేవరకు మనకు ఈ తిప్పలు తప్పవు. కల్పన ఏధైనా చేయమ్మా..

కొత్త పాళీ said...

బావుంది

భాస్కర రామిరెడ్డి said...

కల్పనగారూ, ఒక వున్నత కవి గురించి పాఠకులకు పరిచయం చేసినతీరు బాగుంది.మీరన్నట్టు అవార్డు కంటే ఆయన పట్ల మీకున్న ఆత్మీయత ఈ టపా వ్రాయించింది. మీ జ్ఙాపకాల దొంతరను కదిలించింది. ఇక ఈ కవితా సంపుటి మీద కానీ్, అంజంతా గారి పైన గానీ వ్యాఖ్యానించడానికి వీటి గురించి నాకు తెలియదు. కానీ మీ పరిచయం చదివిన తరువాత ఒక్కసారైనా చదివి తీరాల్సిన కవితా సంపుటి అనిపిస్తుంది. వీలైతే స్కాన్డ్ కాపీ మీ బ్లాగులో వుంచగలరేమో చూడండి [ కాపీ రైట్స్ లాంటివి అనుకూలిస్తేనే ]

కొండముది సాయికిరణ్ కుమార్ said...

"కవిత్వం ఒక స్వప్నక్రియ. నేను వ్రాస్తున్న కవిత్వం ఇంకా "లిట్మస్ టెస్ట్" దాటలేదు అని చెప్పుకోగలిగిన మహాకవి "అజంతా".

మనిషిలో అంతర్భూతమై ఉన్న స్వప్న శక్తిని, స్వప్న శక్తి సార్వభౌమాధికారాన్ని వినిర్గతం చేయడం ద్వారా అతడు ఆశిస్తున్న కొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయగలగాలన్నదే నా కవిత్వ పంథా. కవిత్వం తప్ప నాకు మరో జీవితం లేదు. అందుకోసమే నేను కవిత్వం వ్రాస్తున్నాను. కలం, కాగితం పట్టుకుని మాత్రం కాదు. అక్షరాలు వాటంతట అవి ప్రత్యక్షమైతేనే ఏదైనా. .....

నా కవిత్వంలో పూర్వ నిర్దేశిత భావాలకు అతీతమైన విపరీత, విలక్షణ విశృంఖల ధ్వని వినిపిస్తుందని చెప్పడానికి నేను వెనుకాడటంలేదు. కవిత్వం ఒక రహస్య క్రీడ. చీకట్లో ఉన్నవాడే జీవన రేఖపై అఖండ దీపాన్ని స్పష్టంగా చూడగలడని నా నమ్మకం. కవి అన్నవాడు ప్రపంచాన్ని చూడాలే తప్ప, తానై ప్రపంచానికి కనపడకూడదు.......

ఇక్కడే ఒక మాట. నేను వ్రాసిన పద్యాలన్నీ చిత్తుప్రతులే. ఏ ఒక పద్యం కూడా నాకు పూర్తి సంతృప్తి కలిగించలేదు. "పర్ఫెక్షన్" నా లక్ష్యం. దీన్నే "క్రిస్టలైజేషణ్" అని కూడా అనవచ్చు. శేషజీవితంలో అది సాధ్యమౌతుందో, కాదో చెప్పలేను....

కవిత్వం ఒక ఎడతగని ప్రవాహం అనుకుంటే, ప్రవాహజలం ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక్కటే. హృదయాన్ని చీల్చుకుని వచ్చే అక్షరాలకు రసాయన దోషం అంటదు.....

ఉదయం నిద్రలేవగానే, సత్కవులందరినీ ఒకసారి తలుచుకొని జీవన ప్రవాహంలో అడుగుపెడతాను. పద్యసృష్టి మళ్ళీ ప్రారంభం. నా దినచర్య అదే. నిరంతర ధ్యానం అదే.

====
స్వప్నలిపికి ముందుమాటలోని వాక్యాలే ఇవన్నీ. ఫ్యాషనుగా కవుల మనిపించుకోవాలనుకునే వాళ్ళందరూ చదవాల్సిన వాక్యాలివి.
====
కల్పనగారికి ధన్యవాదాలు. అలానే, సుబ్బుకు కూడా - స్వప్నలిపి ముందుమాట మరోసారి చదివించినందుకు.

Kalpana Rentala said...

బాబా గారు, తప్పకుండా.. ప్రయత్నిద్దాము పుస్తకం కోసం.
సునీత, చూశారా? మీకు చిన్న ఫాంట్ లో కనపడటంలో నా కుట్ర ఏదీ లేదు. ఆ టెంప్లేట్ తప్పు అన్న మాట. మరో టెంప్లేట్ కోసం చూస్తాను.
జ్యోతి, కాస్త సహాయం చేయకూడదా? పెద్ద బ్లాగ్ గురువునంటావు?
తప్పకుండా. అజంతా గారి కుటుంబం నుంచి ఒక కాపీ తీసుకొని స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళ కాపీ వాళ్ళకు ఇచ్చే ఏర్పాటు చేద్దాము. కాకపోతే ఈ పని హైదరాబాద్ లో వున్న వాళ్ళు ఎవరైనా చేయగలగాలి. వాళ్ళ ఫామిలీ తో మాట్లాడటం నేను చేస్తాను.
సాయికిరణ్ గారు, బహుకాల దర్శనం. ఎలా వున్నారు? అజంతా గారి ముందుమాట నుంచి కొన్ని వాక్యాలు కోట్ చేసినందుకు సంతోషం గా వుంది. వీలైతే అజంతా మీద అఫ్సర్ రాసిన వ్యాసం కూడా కంపోజ్ చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను.

మరువం ఉష said...

కల్పన, ఒక్కసారి జీవితంలో శ్రీశ్రీ గారిని కలిసినండుకే ఇప్పటికీ తెగ మురిసిపొతాను. చిన్నతనం నుండి ఆయన పరిచయం, ఆయన పేరునున్న అవార్డ్ ని పొందటం ఇంకెంత తృప్తినిస్తుందో కదా. ఇవన్నీ పంచుకున్నందుకు సంతోషం. మరిన్ని ఇలా వెలుగులోకి తెస్తారని ఆశిస్తూ.. పిల్లలకి చదువులకి ఆసరానిస్తూ సద్వినియోగపడుతున్న అవార్డ్ మనీ, ఆయన పుస్తకాన్ని మీరు అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తాననటం ఇంకాస్త ఆనందం. నిజానికి నేను కవుల గురించి, కవిత్వాన్ని గురించి ప్రయత్నించి చదివింది చాలా తక్కువ. అయినా కనపడితే మాత్రం వదలకుండా చదువుతాను. కనుక నన్నూ లెక్కలోకి వేసుకోండి.

Kalpana Rentala said...

భా.రా.రే. తప్పకుండా మీ సూచన అమలుచేయటానికి ప్రయత్నిస్తాను. మీరు మంచి కవిత్వం రాస్తున్నారు. అందులో సందేహం లేదు. కానీ కొంతమంది మంచి కవుల రచనలు కూడా వీలైతే తప్పక చదవండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం.
ఉషా, ఓ, మీరు శ్రీశ్రీ ని చూశారా? మరి ఎప్పుడైనా మీ బ్లాగ్ లో రాయవచ్చు కదా ఆ అపూర్వమైన అనుభవం. నేను ఎదురుచూస్తూ వుంటాను. మిమ్మల్ని ఇప్పటికే లెక్కలోకి వేసుకున్నాను. మనమంతా కవులం అవునో కాదో కానీ కవిత్వ అభిమానులమ్ నిస్సందేహం గా. ఏమంటారు?
అశేష ప్రజలకు అజంతా మీద వున్న అభిమానం మేరకు అఫ్సర్ గారు అజంతా మీద ఎప్పుడో రాసిన ఒక వ్యాసం పెట్టాను ఇప్పుడే. చదివి మీ అందరి అభిప్రాయాలు చెప్పండి. నేనేమో స్వప్నలిపి కోసం ప్రయత్నిస్తాను.

S said...

Nice intro!
Thanks for introducing!
వినడమే కానీ, ఎప్పుడూ ఆయన కవిత్వం చదవలేదు.... ఈమాటలో పురూరవ లాంటివి ఈబుక్ గా పెట్టారు కదా... అలా దీన్ని కూడా పెట్టించగలరా.... అందరికీ అందుబాటులో ఉంటుందిగా...

Kalpana Rentala said...

సౌమ్య,
ఈమాట వాళ్ళ అభిరుచి మనకు తెలియదు కదా.మేమైతే పుస్తకం స్కాన్ చేయటానికి ప్రయత్నిస్తున్నాము.

S said...

చదవడం మొదలుపెట్టాను స్వప్నలిపిని... మళ్ళీ మళ్ళీ ఆ చదివినవే చదువుతున్నాను. ఈయన్ని గురించి నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.... ముందు మాట నాకు చాలా నచ్చింది...

ivatury sivakumar aradhya said...

గొప్ప రచయితలలోకెల్లా చాలా అరుదైన, అసామాన్యమైన మరియు సులభ రీతిన తెలుగు నోళ్ళలో చిరకాలం పాటు తన రచనలను నిలుపుకున్న కవితా శక్తి.... ప్రప్రముఖ తెలుగు వచన / అనువాద / కవిగా పేరు ప్రసిద్ధులు పొందిన రెంటాల గోపాలకృష్ణ గారి కుమార్తెగా....ప్రఖ్యాత రచయిత, విమర్శకురాలు, తెలుగు ప్రేమికులైన వారందరికీ చిరపరిచితులైన కల్పనా రెంటాల గారికి ముందుగా నమస్సుమనస్సులు. ఈ రోజున నా వరకు ఎంత సుదినం అంటే... మీ బ్లాగ్ స్పాట్ చూడటం తటస్థించింది . నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారి పుస్తకాలు చిన్నప్పుడెప్పుడో చదివాను. నేను ప్రస్తుతం కాపీ రైటర్ గా పని చేసుకుంటూ అడపా దడపా కవితలు వ్రాయటం చేస్తుంటాను . ఈ రోజున చాలా అదృష్టం మ్యాడం గారూ! ఎందుకంటె ఎప్పుడో అజంతా గారు పరమపదించినపుడు నేను వేదన పడుతూ 'నివాళి కవిత' వ్రాసిన సంఘటన జ్ఞప్తికి వచ్చింది ఇవ్వేళ! రెంటాల జయదేవ్ గారి ఫేస్ బుక్ పరిచయం కూడా ఇవ్వేళ చేసుకున్నాను. నేను కవితలు వ్రాయటం మొదలుపెట్టి దాదాపు పాతికేళ్ళు కావస్తున్నది! అన్నీ అముద్రితాలే! కొద్దో గొప్పో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా 2000-'01 ప్రాంతంలో యువవాణి కార్యక్రమాలలో ప్రసారమైనాయి. ( కానీ ఏనాడు నేను అంతలా బాధ పడలేదు ప్రాచుర్యంలోకి రావటం లేదు అని. ఎందుకంటె అజంత గారి పూర్తి పేరు 'పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి' అని ఎంతమందికి తెలుసును! నేను ఆయనకు అభిమానిని. ఒకప్పుడు స్వప్న లిపి పుస్తకం దొరకటం కోసం ఎంత ఆత్రుత పడ్డాను! ఆయన జీవితం నా లాంటి వాళ్ళకి నిజంగా ఆదర్శం! చాల చక్కగా అజంతా గారి గురించి మీరు బ్లాగ్ లో వ్రాయటం చూసి కళ్ళు చెమర్చాయి) ఈ రోజున జయదేవ్ గారి ఫేస్ బుక్ ద్వారా రెంటాల గోపాలకృష్ణ గారి పైన అచ్చు ఐన పత్రికా వ్యాసం ఆసాంతం చదివాను. చాల చాల ప్రభావితం చేసింది ఆ వ్యాసం. మాది పమిడిముక్కల అగ్రహారం. ఇవటూరి మా ఇంటి పేరు. మా తాత గారి( శివశ్రీ పట్టిసలింగ శాస్త్రి గారు ) మాటల్లో అప్పుడప్పుడు మీ నాన్నగారి పేరు వినటం జరిగి ఉండవచ్చు బహుశః ఎలాగైతేనేం! ఈరోజు కొద్దో గొప్పో గోపాలకృష్ణ గారి బయోగ్రఫీ తెలిసిపోగానే అదేంటో చెప్పలేని ఆనందం కల్పనా గారు. ఎందుకంటె పుస్తకాలు, పత్రికలు, విమర్శ వ్యాసాలూ, లెక్కలేనన్ని చదవటం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్నాను. చాలా ఎక్కువైపోయింది ఇప్పటికి చెప్పింది. మెనీ మెనీ థాంక్స్ కల్పనా రెంటాల గారికి ఇంగ్లీష్ లో.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు లో... అదృష్టవంతుణ్ణి నేను. ఇవ్వేళ నాకు నచ్చిన సాహితీ మూర్తి గురించి తెలుసుకుని/చదివి ఎంతో అచ్చెరువొందాను కల్పన గారు!

 
Real Time Web Analytics