నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, January 03, 2010

ఒక ‘ జెంటిల్మెన్ ‘ కన్ఫెషన్ !





స్త్రీ ,పురుష అనుబంధ, బాంధవ్యాల గురించి ఇటీవల వచ్చిన ఒక మంచి పుస్తకం మధుపం -ఒక మగవాడి ఫీలింగ్స్. నేను అచ్చంగా పదహారణాల తెలుగింటి మగవాడిని అని రచయత పూడూరి రాజిరెడ్డి వినయంగా చెపుతూనే అతిశయంగా రాసుకొన్ని కొన్ని అనుభూతుల సమాహారం ఈ పుస్తకం. సాక్షి దిన పత్రికలో జెంటిల్మెన్ శీర్షికన ఒక కాలమ్ గా సరదాగా రాసుకున్న సీరియస్ విషయాలు ఇవి. . స్త్రీ,పురుష సంబంధాలు జటిలంగానో, క్లిష్టంగానో పైకి కనిపిస్తున్నా, వాటి వెనుక ఇంత సున్నితత్వం, భావుకత్వం, ఇంత రసవంతమైన ఫీలింగ్స్ వుంటాయని, మళ్ళీ మనకు గుర్తు చేస్తూ, వాటి గురించి మనసు విప్పి మాట్లాడిన ఈ పుస్తకం మనల్ని అబ్బురపరుస్తుంది. మధుపం తేనెతుట్ట చిక్కనైన కవిత్వ శైలితో అక్షరాలా అమృతధారల్ని చిలికించింది.

ఈ పుస్తకంలో వున్నవి కేవలం ఓ మగవాడి ఫీలింగ్స్ మాత్రమే కాదు. ఇందులో స్త్రీ గురించి, స్త్రీని అర్ధం చేసుకునే క్రమం గురించి బొలెడన్నీ స్వగతాలు, కొత్త ఆలోచనలున్నాయి. “ రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం రామదాసు శ్రీరాముడ్ని తిట్టినట్లు వుంటుంది” ( ముందు మాట – మాధవ్ శింగరాజు ) అన్నది అక్షర సత్యం. అందుకనే పురుషుడి ప్రపంచంలో తానేమిటో తెల్సుకోవాలనుకునే ప్రతి ఆడపిల్లా ఇది చదవటం తప్పనిసరి అని నాకనిపించింది. ఇందులో పెళ్ళిలో, ప్రేమ లో కూరుకుపోయిన ప్రతి ఆడపిల్లా వుందని నా నమ్మకం. స్త్రీ మానసిక ప్రపంచాన్ని పురుషుడు అర్ధం చేసుకోవాలన్నది స్త్రీవాదుల ప్రధాన వాదనైతే ఇది ఖచ్చితంగా ఆ పనే చేసింది. మగవాళ్ళ ప్రపంచంలో ఆడవాళ్ళ గురించి వున్న ఆలోచనల్ని చెపుతుంది ఈ పుస్తకం. స్త్రీల ప్రపంచంలోకి తొంగిచూసి, వాళ్ళ ఆలోచనల్ని, మెళకువల్నీ దొంగిలించేసి ఇలా తన కాలమ్స్ లో జెంటిల్మెన్ గా రాజిరెడ్డి రాసేసుకున్నాడనిపిస్తుంది.. జెంటిల్మెన్ లా మాట్లాడమంటే , రాయడమంటే యాంటీ ఫెమినిస్ట్ కాదు, పురుషహంకారం అంతకన్నా కాదు. సున్నితమైనా ఈ తేడా తెలుసుకొని, అణువణవునా, అక్షరాక్షరం స్త్రీల పట్ల అభిమానాన్ని, ఆరాధననీ, అంతులేని ప్రేమను వొలకబోశాడు. అలాంటి జెంటిల్మెన్లు వొట్టి నాటీ బాయెస్సే తప్ప ఎప్పటికీ ఎంసీపీ లు కారు. కాలేరు కూడా. ప్రణయ కలహాల్లోని , పెళ్ళి పుస్తకం లోని మాధుర్యాన్ని, మధురిమ ను వొడిసిపట్టుకున్న పుస్తకమిది. స్త్రీలు స్త్రీవాదులవటానికి, పురుషులు స్త్రీవాదులవటానికి వున్న తేడా ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. స్త్రీ పురుష సంబంధాలు, వారి వారి వ్యక్తిత్వాలు, సెక్స్యువాలిటీల మీద పర్సనాలిటీ గురువులు,సైకాలజిస్ట్ లు లెక్చర్లు, స్టడీ గైడ్లు తో , పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు అచ్చేసి, అచ్చోసి వదులుతుంటే రాజిరెడ్డి వాటిల్లోని వైరుధ్యాల జోలికి పోకుండా జస్ట్ ఫిలాసఫీ ని బేస్ చేసుకొని జేకే , ఫ్రాయిడ్, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడాడటంతో ఈ కాలమ్స్ కి ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.

రాజిరెడ్డి వచన శైలి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన పాలపిట్ట చెప్పినట్లు వచనంలోనూ వెంటాడే వాక్యం రాజిరెడ్డిది. ఆప్తవాక్యం లో యాసీన్ చెప్పినట్లు రాత వరకు ఆడు మగాడు అన్నది కరెక్ట్ ఎక్స్ ప్రెషన్. నాకు రాజిరెడ్డి వచనం చూసినప్పుడల్లా, చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగినట్లు, విరజాజుల తోటలో విహరించినట్లు, మనల్ని ఆసాంతం మోహపరిచే అతని వాక్యాల నిండా దాచినా దాగని ఓ చిలిపితనం కనిపిస్తుంటుంది. మనల్ని దెప్పిపొడుస్తున్నట్లు కనిపిస్తూనే అందులోని ఆరాధనాభావం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ కాలమ్స్ నిండా ఒక్క ద్వేషం తప్ప మిగతా రస భావాలన్నీ తొణికిసలాడుతూ మనల్ని కవ్విస్తాయి. పురుషుడు చికాకు పడ్డా, కోప్పడ్డా మీ మీద ప్రేమే తప్ప , మీరు లేకపోతే మాకు వునికే లేదన్న ఒక కన్ఫెషన్ కనిపిస్తుంది. అచ్చంగా మాట్లాడుతున్నట్లే రాయడం రాజిరెడ్డి స్టైల్. సినిమాల్లో కెళితే త్రివ్రిక్రం శ్రీనివాస్ లాగా మంచి ' పంచ్ ' వున్న డైలాగులు రాయగలడన్న నమ్మకాన్ని ఇస్తాడు.. How To Lose A Guy In Ten Days హాలీవుడ్ కామెడి సినిమా లాగా How To Understand An Ordinary Indian Guy With One Book అంటే ఈ పుస్తకమే చెప్పాలి.. పదహారణాలా తెలుగు మగాడ్ని అర్ధం చేసుకునే మాన్యూయల్ ఇది. ' నువ్వు మారావు, సో నేను మారాను అంటూ నిజాలు చెప్తూ ఏడిపిస్తాడు. ఆడాళ్ళ కన్నీళ్ళ గురించిచెప్పి మనల్నినవ్విస్తాడు. ఇలా ఇందులో రాజిరెడ్డి రాసిన విషయాలు చూస్తే...అబ్బా! ఇంత దుర్మార్గం గా ఆలోచిస్తారా మీ మగవాళ్ళు అని ఆడవాళ్ళకు ముద్దుముద్దుగా విసుక్కోవాలనిపిస్తుంది.

ఆఫీసులు ఇంతకు ముందులా ఎందుకు లేవో చెపుతూ సినిమా తార కంటే మన సహోద్యోగి పెట్టే చిత్రహింస ఎక్కువంటాడు . ఏ గీతా దాటని విచిత్ర బంధాల గురించి విశ్లేషిస్తాడు. స్త్రీల దగ్గర మన్ననగా వుండే మర్యాదా పురుషోత్తములు స్నేహితుల సమక్షంలో ఎలాంటి సెన్సార్షిప్ లు లేకుండా ఎలా అన్ ఫిల్టర్డ్ మాటలు మాట్లాడుకుంటారో వెల్లడి చేస్తాడు.నిజానికి షివల్రి ఇంట్లోంచే మొదలవుతుందని చెపుతూ పక్కింటి బామ్మను, బస్ లో చంటి పిల్లాడి తల్లికి సహాయపడటం కూడా ఆ కోవలోకే వస్తుందంటాడు. పొద్దున లేవగానే నల్లా నీళ్ళ కోసం లుంగీ ఎత్తికట్టి, మళ్ళీ నీళ్ళు ఎప్పుడొస్తాయా అని ఆలోచిస్తూ లుంగీ దించి పడుకునేదాకా అవలీలగా సంసార సాగరాన్ని ఈదుతూ సంసారంలో వున్న మజా సన్నాసులకు ఏం తెలుసని అనుకుంటూ తృప్తీగా నిద్రపోయే మధ్యతరగతి సంసారికి వందనం చేస్తాడు.“ నువ్వు నాక్కావాలి. కానీ నేను నువ్వు కావాలనుకోను “ అని దర్పంగా ప్రకటించుకుంటాడు. మగటిమినే తన జూలు గా వూహించుకుంటూ తానొక కిరీటం లేని మగ సింహంగా కలలు కంటాడు. “ నీకేం రా మా రాజువి “ . బస్. ఆ మాటొక్కటే చాలు ఈ జీవితానికి అని సంతోషపడిపోతుంటాడు. బర్త్ డే మాత్రమే సంసారికి గుర్తుంటే, డేట్ ఎప్పుడో కూడా తెలుసుండే బాచిలర్...ఓ మంచి మొగుడని, కొత్తగా చూడటమే బ్రహ్మచర్యమని ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇస్తాడు. అయ్యో, మీకేమి తెలీదు మీకు చెప్పడం బదులు నేను చేసుకున్నది నయం అని ఆమె చేత అననిస్తూ భార్యని మాయం ఎలా చేయాలో చిట్కాలు చెప్తాడు. ఏడ్చే మగాడ్ని కూడా నమ్మచ్చు అంటూ మన ఉద్వేగాలన్నింటినీ వరదాలా బయటికి పంపుకోవడానికి ఏడుపు భాష ని నేర్చుకుందాం అని సలహాలిస్తాడు. నేను మారాను, కారణం....నువ్వు మారావు అని చెపుతూనే నువ్వు నా రెండో అమ్మవి కదూ! అమ్మను పిల్లవాడు నచ్చకపోవడం అంటూ వుంటుందా?’ అని పెళ్ళానికో ప్రేమలేఖలో అమాయకంగా అడుగుతుంటే అతనిది ప్రేమ కాదు ద్వేషం అని ఎలా ఆరోపిస్తాం? అదొట్టి అన్యాయం కదూ!అనుక్షణం ఆనందాన్ని ,లాగులాగా జారిపోతున్న జీవితాన్ని పైకి లాక్కునే వాడే అసలైన జెంటిల్మెన్ అంటాడు.

ప్రాణవాయువుతో మాత్రమే కాకుండా, నిజంగా జీవించడం కోసం స్త్రీ,పురుషులిద్దరూ ఒకానొక జీవితానుబంధంలో ఏం పొందాలో, ఏవీ వదులుకోవాలో, ఏవి నిలబెట్టుకోవాలో జెంటిల్మెన్ కోణం నుంచి చెప్పుకోస్తాడు. అందుకే, నాకు మధుపం నచ్చింది. రాజిరెడ్డి చూపించిన ‘ జెంటిల్మెన్ ‘ ల జీవితంలో వున్న స్త్రీలం మనమే. మన కోసం ఓ జెంటిల్మెన్ రాసిన పుస్తకం ఇది. చదివి మనల్ని సరదాగా ఎలా వెక్కిరించాడో చూసి ఉడుక్కుందాం. మాటలతో, రాతలతో, మనల్ని వాళ్ళు ఎలా ఐస్ చేస్తున్నారో బాహాటంగా వెల్లడి చేసిన వాళ్ళ కన్ఫెషన్ లని అంగీకరిద్దాం. మన గురించి మన జీవన సహచరుడు నిజాయితీగా మనసు లోతుల్లో ఏమనుకుంటున్నాడో చదివి అర్ధం చేసుకోవటానికి ఈ మాన్యుయల్ ఎప్పుడైనా పనికొస్తుంది. ఈ మధ్య కాలం లో వచ్చిన పుస్తకాల్లో ఇది must read book .

వంటింటిలో అప్పడాల కర్రతో పాటు ఈ పుస్తకాన్ని కూడా దాచిపెట్టుకుందాం. ఎప్పుడైనా (సెలవురోజుల్లో కూడా సహచరుడు ఆఫీసుకెళ్తానన్నప్పుడు ...) దీనితో అవసరం పడవచ్చు. గిరీశం చెప్పినట్లు మగవాళ్ళు వొట్టి వెధావాయలు ...వాళ్ళ గుట్టు,మట్లు కూడా వాళ్ళే చెప్పేసుకొని మన పని మరింత సులువు చేసేశారు. ఇప్పుడు కూడా మనదే పై చేయి!.

కల్పనారెంటాల

(జనవరి 04,2010 సాక్షి సాహిత్యం పేజీ లో ప్రచురితమైంది.)



8 వ్యాఖ్యలు:

Bhardwaj Velamakanni said...

Interesting - Should read it sometime.

కొత్త పాళీ said...

ఇందులో "మనం" అంటే స్త్రీలు అని చదువుకోవాలా అధ్యక్షా? :)

మరువం ఉష said...

"స్త్రీ,పురుష సంబంధాలు జటిలంగానో, క్లిష్టంగానో పైకి కనిపిస్తున్నా, వాటి వెనుక ఇంత సున్నితత్వం, భావుకత్వం, ఇంత రసవంతమైన ఫీలింగ్స్ వుంటాయని, మళ్ళీ మనకు గుర్తు చేస్తూ, వాటి గురించి మనసు విప్పి మాట్లాడిన ఈ పుస్తకం.." నా వోటు ఇక్కడే వేసేసా కల్పన. ఇక సంపాదించి చదవటమే తారువాయి.

Kathi Mahesh Kumar said...

బాగుంది. పుస్తకం చదివి కామెంటుతా!

kanthisena said...

సాక్షిలో ఈ పుస్తకం పరిచయాన్ని చదివినప్పుటికంటే ఇప్పుడు మీ పరిచయం చూశాక తప్పక చదవాలనిపిస్తోంది. తీసుకుంటాను. ఇప్పుడే తిరుపతి విశాలాంధ్రవారిని సంప్రదిస్తే లేదని చెప్పారు. వేరేచోట ప్రయత్నించాలి. పురుషుల అంతరంగపు లోతులను పసిగట్టడంపై మీ వ్యాఖ్యానానికి అభినందనలు

Anonymous said...

www.vinuvinipinchu.blogspot.com

lo బాగులో ఈ పుస్తకం పైన సమీక్ష కూడా చదవండి.

-viswaksena

Hima bindu said...

సాక్షిలో చూసాను ఆసక్తికరంగా వుంది తప్పకుండా కొనాలి ..మంచి పరిచయం

Kalpana Rentala said...

@భరద్వాజ, కొత్తపాళీ, మహేశ్,ఉషా, చిన్ని, చందమామ,విశ్వక్సేనా నా పరిచయం నచ్చి,కామెంట్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు.
చందమామ గారు, మీరు హైదరాబాద్ లో వుంటే విశాలాంద్ర లో దొరకకపోతే డైరెక్ట్ గా పాలపిట్ట వారి నుంచి కొనుక్కోవచ్చు. మీరు ఎలా కొనుక్కోవాలి అనే దాని కోసం పాలపిట్ట ప్రచురణాల గుడిపాటి గారి ఫోన్ నెంబర్ ఇది. 9848787284.
విశ్వక్సేనా గారు, నేను పరిచయం రాస్తున్నానని వేరే వాళ్ళు రాసినవి ఇంతవరకు చదవలేదు. ఇప్పుడు తప్పక చదువుతాను. మీ పేరు మీద నాకు చిన్నప్పటి జ్నాపకం గుర్తుకు వచ్చింది. మా ఇంట్లో పిల్లలకు మొదట పలకటానికి ఆ పేరు చెప్తారు. ఆ పేరు శుధ్ధంగా పలికితే తెలుగు లో ఏ పదమైనా సరిగ్గానే పలుకుతామని మా నాన్నగారి నమ్మకం(ప్రగాఢ). మీరు ఆ పేరు ఎన్నుకోవటానికి కారణం వీలైతే చెప్పండి. తెలుసుకుంటాను.

 
Real Time Web Analytics