నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, January 05, 2010

కథానుభవం
మనమంతా కథలు చదువుతాం. కానీ ఎలా చదువుతాం, ఎలా చదవాలి? అనే దానిపై మనందరికీ భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. ఒక కథ ని చదివి, ఆగి, ఆస్వాదించి, అనుభూతి చెంది , ఆ అనుభూతిని కొంత కాలం మనసులో దాచిపెట్టుకొని అప్పుడు ఇంకో కథ చదవగలిగితే బాగుంటుంది. అది సాధ్యపడుతుందా అంటే ఒకప్పుడు సాధ్యపడేది. నేను కథలు చదవటం మొదలుపెట్టినప్పుడు (కాస్త చిన్నప్పుడే ) వారపత్రికలో ఒకటి , రెండు కథలు, మాసపత్రికలో ఒక రెండు ,మూడు కథలు వుండేవి. వార పత్రికలో ఆ ఒకటి, రెండు కథలు చదివితే ఇక మళ్ళీ వారం వరకు ఏమీ వుండవు చదవటానికి. ఆ చదివిన కథ బాగుందో, లేదో ఆ తర్వాత రెండు వారాలకు వచ్చిన ఉత్తరాలు చదివి చర్చించుకునేవాళ్ళం. ఇక వార పత్రికలో సీరియల్స్ చెప్పక్కరలేదు. ఏదో ఒక సస్పెన్స్ తో ఆపేసేవాళ్ళు. ఆ సస్పెన్స్ భరించలేక రైటర్ ఎక్కడుంటాడో వెళ్ళి అడిగేయ్యాలనిపించేది. అదో ఉత్సాహం. నిజంగా అందులో అంత చదివించే గుణం వుందా, లేదా అనేకన్నా మనకు అప్పట్లో చదివే గుణం వుండి వుంటుంది అనుకోవటమే. వారపత్రికలు, మాసపత్రికలు అయిపోతే అప్పుడు కథాసంకలనాలు, నవలలు తీసుకొని చదివేవాళ్ళం.

ఇప్పుడు రోజు ఎక్కడో అక్కడ ఒక కొత్త కథ ప్రచురితమవుతోంది. ఆదివారం వస్తే దినపత్రికల్లో కథలు, ఇవి కాక వారపత్రికలు, మాసపత్రికలు, ఆన్ లైన్ మాగజైన్లు, బ్లాగ్ లు, కథలు, కథాచర్చలు, సమీక్షలు. వెయ్యి చేతులతో కథలు మనల్ని చుట్టు ముట్టెస్తున్నాయి. అందులో కొన్ని చదువుతున్నాం, కొన్ని చదివే తీరిక లేక వదిలేస్తున్నాం. కొన్నింటి గురించి రాసుకుంటున్నాం. మరి కొన్నింటిని చర్చిస్తున్నాం. కానీ నిజంగా వీటన్నింటి మధ్య కథల తాలూకు అనుభూతిని ఆస్వాదిస్తున్నామా? అంటే సందేహమే. అలాంటి అనుభూతినివ్వగల కథలు వస్తున్నాయా అంటే అదీ ప్రశ్నార్ధకమే.

ఒక్కోసారి కథ మీద కథ చదివేసి కధానుభూతిని కోల్పోతున్నామా అని దిగులేస్తుంటుంది. కాలంతో పాటు పరుగెత్తుతూ కథలు చదవటం కాకుండా అనుభూతిని మిగుల్చుకుంటూ రోజూ ఒక కథ తీసుకొని చదవాలనిఒక ఆలోచన. అది కొత్త కథ నా, పాత కథా అనేది అప్రస్తుతం. ఇదివరకు చదివేసిన కథ అయినా సరే మళ్ళీ ఒక అనుభవం కోసం చదివితే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. కథ చదివిన అనుభూతిని మళ్ళీ మనసు పొరల్లో దాచుకోవాలని అనిపిస్తోంది. ఈ పధ్ధతి వల్ల నాకు రెండు ప్రయోజనాలు కనిపించాయి. ఒకటేమిటంటే కథ మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతాం. అంటే ఇత్రివృత్తం తో పాటు, శైలి, భాష మొదలైన వాటి గురించి పట్టించుకోవటం. ఇలా నిదానం గా చదవటం వల్ల ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా వస్తున్న కథల్లో కొన్నింటిని మిస్ అవవచ్చు. అయినా పర్వాలేదు. వంద కథలు చదివి ఏదీ మనసు కి పట్టకపోవటం కన్నా తక్కువ కథలతో ఎక్కువ అనుభూతిని పొందవచ్చనిపించింది. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం కదా.

ఇక నుంచి ఒక కథ చదివి ఆ అనుభూతిని మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకున్నాకనే ( అది మంచి కథ అయితేనే సుమా) మరో కథ చదవాలనుకుంటున్నాను. నచ్చిన కథల్ని, నచ్చని కథల్ని వాటి తాలూకు అనుభూతిని కూడా “ కథానుభవం “ అనే శీర్షికన రాసుకోవాలని ఒక చిన్న ప్రయత్నం. ఇదేదో పెద్ద సాహిత్య చర్చ, కథావిమర్శ కాదు. ఒక కథకు నా మనసు స్పందించే తీరు మాత్రమే. సీరియస్ గా కథలు చదివేందుకు ఇది ఒక ఆలోచన. మరి మీరేమంటారు?

కల్పనారెంటాల

14 వ్యాఖ్యలు:

'Padmarpita' said...

అయితే ఇకనుండి మంచి కధలని చదివి మాకు పరిచయం చేయబోతున్నారన్నమాట!

కోడీహళ్ళి మురళీ మోహన్ said...

మీ శీర్షికకు ఈ వెబ్‌సైట్ ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి.
http://www.kathajagat.com/

Kalpana Rentala said...

పద్మార్పిత, మంచి కథలు అవునో కాదో కానీ నాకు నచ్చిన కథలు అనుకుందాం, సరేనా?
మురళీమోహన్ గారు, తప్పకుండా చూస్తాను. ఇంతకు ముందే చూసినట్లు గుర్తు.

సుజాత said...

ఎక్కడ చూసినా కథలే! కానీ "ఈ కథ నిజంగా బాగుంది"అనిపించే కథ ఎన్నిరోజులకొకసారి తారసపడుతుందో ఆలోచించాలి! ఒక చోట ఎవరైనా ఒక మంచి కథ చదివితే "ఫలానా కథ చదివారా"అని చర్చించుకునే పరిస్థితి వచ్చింది.

పాత వారపత్రికల్లో కథలు ఒక్కోసారి అవి చదివి దశాబ్దాలైనా వదిలిపెట్టవు. అలా కనీసం నెలరోజుల పాటు వెంటాడే కథ ఒక్కటీ ఈ మధ్య తారసపడదు.(కనీసం నాకు). రచయిత సలీం ఒక వారపత్రికలో(ప్రభలోనో ఆంధ్ర జ్యోతిలోనో మరి,.) ఒక కథ రాశారు.."లిఫ్ట్ " పేరుతో!

ఒక కార్పొరేట్ ఆఫీసు బిల్డింగ్ లో ఉదయం పదిగంటల వేళ లిఫ్ట్ నిండా జనం ఉన్నపుడు ఒక గంట సేపు లిఫ్ట్ ఆగిపోతే ఏం జరుగుతుంది? అనేదే కథాంశం! లిఫ్ట్ నిండా ఉన్న జనం రోజూ కనపడి పలకరించుకునే వారైనా క్రిక్కిరిసి ఉన్న లిఫ్ట్ లో పది నిమిషాలు గడిచేటప్పటికి ఒక్కొక్కరి స్వరూపాలు బయట పడతాయి.

స్థలం చాలడం లేదని, ఇంతగా ఒళ్ళుపెంచకపోతే ఏం? అనీ, స్నానం చేసారో లేదో అని, అంతా లిఫ్టే ఎక్కాలా, కొంతమంది మెట్లెక్కచ్చుగా అనీ, మీద పడొద్దనీ(ఆడపిల్లలు) ఇలా గంటలో ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటారు.

లిఫ్ట్ బాగయ్యాక ఒకరివైపు ఒకరు చూడ్డానికి సిగ్గుపడతారు.

ఒక లిఫ్ట్ లో గంటసేపు ఉన్న మనుషుల మధ్య ఇన్ని విభేదాలున్నపుడు ఇన్ని రాష్ట్రాలు, ప్రజలు, భాషలు,కులాలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో విభేదాలు అసహజం కాదు..అంటూ కథను ముగిస్తాడు రచయిత.

కనీసం పదేళ్ళయింది ఈ కథ చదివి. ఇప్పటికీ మర్చిపోలేను. ఇలాంటివే ఎన్నెన్నో మంచి కథలు!

ఒక్కోసారి ఒక కథను మనం చదివినప్పటికంటే ఇంకెవరో చెప్తే కొత్తగా స్ఫురించడం కూడా అరుదు కాదు.

కానీ కొత్తకథలైతే, రోజుకొక కథ చదివితే అది చెత్త కథ అయ్యే అవకాశం ఉందిగా మరి! ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు వదిలేసే కథల్లో మంచికథలుండొచ్చేమో కూడా!

ఏమంటారు?

Kalpana Rentala said...

సుజాత,
మీరన్నది నిజమే. సలీం కథ నేను చదవలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారుగదా, అలాగే మంచి కథ అనుకున్నది అలా అలా ఎలాగోలా మనకు చేరిపోతుంది. మంచి కథ అన్నది కూడా ఎప్పుడూ సాపేక్షికమే. మనల్ని కదిలించిన కథ అనవచ్చు. అలాగే మనం చెత్త కథ అనుకున్నది ఇంకెవరో వచ్చి ఇందులో ఈ పాయింట్ వుంది అన్నారనుకోండి. అప్పుడు మనకు అవును కదా, ఈ పాయింట్ నాకెందుకు తట్టలేదు అనిపించి మన అభిప్రాయం కొంత మార్చుకుంటాం. స్థూలంగా ఏమిటంటే అందిరికీ ( ఎక్కువమందికి ) నచ్చే కథలు తక్కువ వుంటాయి. “ నాగరికధ” అందరికీ నచ్చింది , అదే “ ఎత్తరుగుల అమెరికా కధ “ తీసుకోండి. భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అది మంచి కథా అయినా కాకపోయినా ఎక్కువ మందిని కదిలించింది.
“కానీ కొత్తకథలైతే, రోజుకొక కథ చదివితే అది చెత్త కథ అయ్యే అవకాశం ఉందిగా మరి! ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు వదిలేసే కథల్లో మంచికథలుండొచ్చేమో కూడా!”
చెత్త కథలు కూడా తప్పనిసరిగా వుంటాయి. చదివి, ఆలోచించి కానీ చెప్పలేం కదా ఆ విషయం. అది నాకెందుకు నచ్చలేదో చెప్తాను. కథల ఎంపిక తప్పదు. కొద్ది కాలం పాటు కాస్త రచయత పేరు ని బట్టి చదివే సాహసం చేయాలి. నేను మంచి కథలు మిస్ అవుతానేమో కూడా. కానీ అలాంటప్పుడు మీరంతా చర్చించుకుంటారు కదా ఆ కథ గురించి. అలా నాకు తెలిసిపోతుంది నేను ఆ కథ తప్పక చదవాలని. అలా అనుకున్నది ఎత్తరుగుల అమెరికా కథ. నేను చదవలేదు. కానీ అందరు మాట్లాడుతుంటే ఓహో, చదవాలి అనుకుంటాను.

కొత్త పాళీ said...

చదివి అనుభవించడంలో అనుభూతిని కోల్పోతున్నామా? నిజంగా? ఏమో, నాకలా అనిపించడం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మంచి కథలు క్రమం తప్పకుండా ప్రచురించే దారులు తగ్గిపోయాయనీ, అందుకే ఏడాదంతా కలిపి చూసుకున్నా 10 - 15 మించి "మంచి" కథలు కనబడ్డం లేదనీ అనిపిస్తోంది. పైపెచ్చు, ఆ 10-15 కూడా మంచివా కాదా అని కూడా తీవ్రమైన అభిప్రాయ భేదాలు వినిపిస్తున్నై కథా సాహిత్య ప్రేమికుల్లో.

అనుభవించదగినది ఏదైనా ఆస్వాదించదగినదే. నింపాదిగా ఆస్వాదిస్తే ఆ రుచి, ఆ అనుభూతి మరింత గాఢంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో మీ ఉవాచతో ఏకీభవిస్తున్నా. నా అనుభవం చెప్పనా? ఇటువంటి రుచి అనుభూతి నాకైతే ఎప్పుడూ నెమరువేసుకోడంలోనే కలిగింది.
ఇంకో విషయం .. పదికాలాల పాటు నిలవడం, పాఠకులకి చాలా కాలం గుర్తుండడం లాంటి లక్షణాలు చెప్పారు. నా వుద్దేశంలో ఆధునిక కథానికకి అది ముఖ్య లక్షణం కాదు. ఆ దృష్ట్యా రచన కూడా ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్ అవుతోందన్న మాట.

Kalpana Rentala said...

“మంచి కథలు క్రమం తప్పకుండా ప్రచురించే దారులు తగ్గిపోయాయనీ, అందుకే ఏడాదంతా కలిపి చూసుకున్నా 10 - 15 మించి "మంచి" కథలు కనబడ్డం లేదనీ అనిపిస్తోంది. పైపెచ్చు, ఆ 10-15 కూడా మంచివా కాదా అని కూడా తీవ్రమైన అభిప్రాయ భేదాలు వినిపిస్తున్నై కథా సాహిత్య ప్రేమికుల్లో.”
కొత్తపాళీ , మంచి కథ రాస్తే ప్రచురించేవాళ్ళు లేరా? నేనెప్పుడూ ఈ మాట వినలేదు. ఎవరు మంచి కథ రాస్తారా అని పత్రికల వాళ్ళు పాపం ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చూస్తే 10,15 మంచి కథలు కూడా వుండటం లేదని మీరు అంటున్నారు. సంకలనాల్లో వేసే కథలు మంచిగా కాదు చెత్తగా వుంటున్నాయని ఒక వర్గం పాఠకులు అంటున్నారు. అందుకే, ఎవరికి వారికి కొన్ని మంచి కథల సంకలనం వ్యక్తిగతం గా తయారవుతుంది. గత ఏడాది వచ్చిన మంచి కథలు అంటే మీరు ఏమేమి సెలెక్ట్ చేస్తారో, అవి కథ సిరీస్ లోనో, మధురాంతకం నరేంద్ర ఆధ్వర్యంలో వచ్చే కథా సంకలనాల్లో వుండకపోవచ్చు. కథల్ని ఇష్టపడటం ఒకొక్కరం ఒక్కో పధ్ధతి మీద చేస్తున్నాం. అలాగే, ఈ “ కధానుభవం “ నాకు నచ్చిన మంచి కథల లిస్ట్ అవుతుంది ఒక రకంగా చూస్తే.
“పదికాలాల పాటు నిలవడం, పాఠకులకి చాలా కాలం గుర్తుండడం లాంటి లక్షణాలు చెప్పారు. నా వుద్దేశంలో ఆధునిక కథానికకి అది ముఖ్య లక్షణం కాదు. ఆ దృష్ట్యా రచన కూడా ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్ అవుతోందన్న మాట.”
ఈ పాయింటు మీద నాకు సందేహాలు చాలా వున్నాయి. ఇవాళ మనం శ్రీపాద, మల్లాది గొప్ప రచయతలు అని ప్రసిధ్ధి గాంచారు కాబట్టి వాళ్ళ కథలు గొప్ప కథలు అంటున్నామా? లేక శ్రీపాదకు రెండో, మూడో తరాల తర్వాత వాళ్ళకు కూడా నిజంగా శ్రీపాద కథల్లోని గొప్పతనం అర్ధమై అంటున్నామా? ఒక వేళ గొప్పతనం అర్ధమైతే ఆ గొప్పతనం ఏమిటి? కథలో ఎక్కడ వుంది ఆ గొప్పతనం? వస్తువులోనా? శిల్పం లోనా? లేదా భాష లోనా? అలాగే ఒక రచయత పేరు ని బట్టి కూడా మనం కథ బావుందనో, బాలేదనో చెప్తామా? ఇవన్నీ సరిగ్గా అర్ధం కావడానికే కథలు ఇలా కాదేమో చదవాల్సింది అన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ పద్ధతి కరెక్టో కాదో నాకు కూడా ఇంకా తెలియదు. ఒక ప్రయత్నం . చూడాలి.అలాగే ఆధునిక కథ ని చూసే విధానం. దీని మీద మాత్రం ఇంకా కృషి చేయాలి. అది చేయాలంటే ఆధునిక కథలోని ప్రయోగాత్మక కథల్ని చదివి, వాటి అర్ధానార్ధాల్ని ( అర్ధం, అనార్ధం ...ఇలా అనవచ్చా? ) చర్చించాలి? ఎవరు ఆ గంట మోగించేది?

కత్తి మహేష్ కుమార్ said...

హ్మ్మ్ చాలా క్లిష్టమైన ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సమాధానం వెతికే దిశగా ఒక అడుగు వెయ్యబోతున్నారు. బాగుంది. కానివ్వండి. మీ బ్లాగు one stop for best stories అయితే అంతకన్నా ఏంకావాలి.

సుజాత said...

సలీం గారి కథ పేరు గుర్తొచ్చింది. అది లిఫ్ట్ కాదు!
"ఇరుకు"!

te.thulika said...

చర్చ చాలా బాగుంది. మంచికథలు అన్నవిషయం వైయక్తికం కనక ఈటపాలద్వారా ఒకకోణం తెలుస్తుంది. ఒక కథ చదివినప్పుడు ఒక భావుకురాలయిన పాఠకురాలిలో ఎలాటి స్పందన, అనుభూతి కలుగుతుందో తెలుసుకోడానికి ఇదొక వేదిక అనుకుంటున్నాను.
కల్పనా, ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు (నాకు రానందుకు విచారిస్తూ) అభినందనలు.
శుభం.

Kalpana Rentala said...

మహేష్, , నేను ఎంపిక చేసినవి మంచి కథలు అవునో కాదో మీరు కూడా చెప్పాలి.
సుజాత, మీరు చెప్పిన కథ మీకు ఆన్ లైన్ లో కనిపిస్తే లింక్ ఇవ్వరా? నేను కూడా చదువుదామని.
మాలతి గారు, “ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు (నాకు రానందుకు విచారిస్తూ) అభినందనలు” మీరు కూడా మీ బ్లాగ్ లో మీరు మంచి కతలనుకున్నవాటి గురించి రాయండి. మీతో మేమేవరైనా పోటీ పడగలమా?

సుజాత said...

కల్పన,
ఆ ప్రయత్నంలోనే ఉన్నానండీ! ఆన్ లైన్లో లేదు గానీ కథ మాత్రం దొరికింది. స్కాన్ చేసి పెడతాను నా బ్లాగులో!(రచయిత అనుమతితోనే)

సురేష్ - మ్యూజింగ్స said...

ఒక కెమేరానో, టివీనో కొనాలంటే కొన్ని లక్షల ఆప్షన్లు. అలాంటప్పుడు నేను సిగ్గు లేకుండా ఎన్నుకునే మార్గము, నాకు తెలిసిన ఎక్స్ పర్టులను కాపీ కొట్టటము. మీ కథల లిస్టును కూడా కాపీ కొట్టడానికి సిద్ధముగా ఉన్నాను.

Kalpana Rentala said...

మ్యూజింగ్స్ సురేష్,
ఈ కథల లిస్ట్ మీద కాపీ రైట్ ఏమీ లేదు. హేపీ గా కాపీ కొట్టి రాయండి. ఎంత ఎక్కువ మంది కధల గురించి రాస్తే నాకు అంత సంతోషం. కానివ్వండి. ఒక లింక్ ఇక్కడ ఇస్తే నేను కూడా వచ్చి చూస్తాను.నా బ్లాగ్ కి వచ్చి చదివినందుకే నాకు సంతోషం. కామెంట్ పెడితే మరీ సంతోషం.

 
Real Time Web Analytics