కథానుభవం-2
మల్లెమొగ్గల కౌగిలింతలా సుతిమెత్తగా హత్తుకొని......పూల మృదు పరిమళం లా రెప్పల మీద ఉదారంగా వాలే నిద్రా....మొరటుగా ఈడ్చుకొచ్చి కళ్ళ లోగిళ్ళల్లో కట్టేసుకున్న నిద్రా ...రెండూ ఒకటేలా అవుతాయి?
రచయత సలీం రాసిన “ ఒంటరి శరీరం “ కథలో కథానాయిక మాటలు ఇవి.
పిలిచినప్పుడు కళ్ళ మీదకు నిద్రా దేవత రాని వారికి, నిజంగా నిద్ర విలువ తెలిసిన వారికి ఈ మాటలు ఎంత నిజమో తెలుస్తుంది. ఇది నిద్ర రాని అనేకానేక వొంటరీ శరీరాల వేదన. నిద్ర రాకపోతే ఆ బాధ ఎలా వుంటుందో, కనురెప్పల్ని అలా బలవంతంగా అదిమిపెట్టడం ఎంత హింసాత్మకంగా వుంటుందో ఒక్కోసారి వర్ణనలకందదు., కళ్ళ తలుపులు మూసుకున్నా, మూసుకోని తలపు తలుపుల గురించి....ఎంత చెప్పుకున్నా తక్కువే.
నిద్ర పట్టకపోవడానికి డాక్టర్లు, సైకాలజిస్ట్ లు రకరకాలా కారణాలు చెప్తారు. అశాంతి గా వుంటే నిద్రపట్టదని, చింతలు ఎక్కువైతే చింతనలు ఎక్కువవుతాయని, అప్పుడు కూడా నిద్ర పట్టదని ఆధ్యాత్మికవాదులు కూడా చెప్తుంటారు. అన్నింటికీ కారణం నీ మనస్సే అని కూడా అంటారు. అవును మరి. మనస్సుకి కళ్ళెం వేయగలిగే మహావిద్య అంత సులువుగా అందరికీ వచ్చేది కాదు. మానవ జీవిత ప్రయత్నమంతా మనసు కి, కోర్కెలకు నిగ్రహంతో, నియమంతో కళ్ళాలు వేయాలనే నిరంతర ప్రయత్నం తో నిండి వుంది.
మనల్ని మనమే మర్చిపోయేంతగా, గుర్తు పట్టలేనంతగా , నిద్ర లో మైమరిచిపోవటం అంటే ఏమిటో అందరికి తెలిసిన అనుభవం అయితే మాత్రం కాదు. అలాంటి నిద్ర కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నిద్ర మాత్రలు మంచివి కావని తెలిసినా, వాటిని ఆశ్రయిస్తేనైనా నిద్ర వస్తుందేమో అన్న ఒక్క ఆశ వాటికి మనిషిని దాసోహం చేస్తుంది. నిద్ర కూడా ఒక వ్యసనం. అవును, అదొక మత్తు, నిషా. నిద్ర పట్టనివాళ్ళకే నిద్ర పట్టడం గురించి ఏమేం చేయాలనిపిస్తుందో తెలుస్తుంది. ఎవరెవరు ఏమీ చెప్పినా ఆ కాసేపు నిద్రానుభవం కోసం ఏమైనా చేసేస్తుంటారు. ఎన్ని చేసినా లోపల్లోపల అందరికీ తెలుసు. అసలు కారణం మన దగ్గరే వుందని. నిద్ర రాకపోవడానికి ఆ మూల కారణం కనుక్కుంటే , నిద్ర ఎలా పడుతుందో కూడా తెలుస్తుంది.
నిద్ర పట్టని ఒకానొక వొంటరీ శరీరపు వేదన గురించి సలీం రాసిన ఒకానొక మంచి కథ గురించి ఈ సారి “ కథానుభవం “ లో మాట్లాడుకుందాం. నిద్ర రాని శరీరం స్త్రీదైనా, పురుషుడిదైనా బాధ ఒక్కటే. కానీ ఈ కధలో ఈ బాధ కి కారణం కథానాయిక శరీరం ఒక ఆత్మీయ స్పర్శ ని పొందలేకపోవటం. ఒక స్పర్సానుభవం కోసం తపన ని ఒక స్త్రీ వైపు నుంచి చెప్పడం, ఆ బాధకు ఆమె కనుక్కున్న ఒకానొక పరిష్కారం ఈ కథ ను మామూలు కథల కంటే ఒక మెట్టు పై స్థాయి నిలబెట్టింది. నాకు ఈ కథ నచ్చటానికి కారణం కథావస్తువు ఒక్కటే కాదు, కథను నడపటానికి రచయత ఎన్నుకున్న కథనం కూడా. నిద్ర ఎంత సున్నితమైన , అందమైన అనుభూతి నో దాన్ని సరిగ్గా పట్టుకొని అందుకు తగిన భావ భాషని వాడారు సలీం ఈ కథలో.
ఈ కధ లో ప్రధాన పాత్ర ఒక స్త్రీ. బాంక్ ఉద్యోగి. పిల్లలకు పెళ్ళిలైపోయి, మనవలు, మనవరాళ్ళు వున్న ఆమెకు చూడటానికి పైకి భౌతికంగా ఎలాంటి సమస్యలు లేవు. రాత్రి పక్క మీద వాలితే మాత్రం నిద్రామోహం ఆవరించదు. ఆమెకు తెలుసు. తనకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటో...ఆ దేహానికి ఒక ఆత్మీయ స్పర్శ కావాలి. అది ఆమెకు దొరకటం లేదు. మంచానికి చెరో పక్క భార్య, భర్తలిద్దరూ చెరో వైపు కి తిరిగి పడుకుంటారు. అసలీ మంచం ఎందుకింత పెద్దగా వుంది? నలుగురు సుఖం గా పడుకోవచ్చు దీని మీద . దీన్ని సగానికి తెగ్గొట్టి ఇద్దరికీ సరిపడేలా చేస్తే బావుండు అనుకుంటుంది ఆమె . “నిన్ను కౌగిలించుకుంటూ పడుకుంటే తప్ప నిద్ర రాదు తెలుసా? అని పెళ్ళైన కొత్తలో మురిపించిన వశిష్ఠ, ఇప్పుడు భార్య “ నాకు తగిలెలా, దగ్గరా పడుకోవచ్చు కదా” అని నోరు తెరిచి అడిగితే , “ నాకలా నిద్ర రాదు, చిరాకనిపిస్తుంది” అని సమాధానమిస్తాడు. శరీరానికే కాదు, మనసు కి కూడా ఒక స్పర్శానునుభూతి కావాలి అని ఆమె తపిస్తుంటుంది. అలాంటప్పుడు తెలుస్తుంది ఆమెకు మసాజ్ గురించి. వారానికి ఒకసారి శనివారం నాడు మసాజ్ చేయించుకున్న రోజు ఆమె కు సుఖంగా నిద్ర పడుతుంది. ఆ అనుభవం కోసం ఆమె బ్యూటీ పార్లర్ కి ప్రతి శనివారం తప్పక వెళ్తుంది. అక్కడ కూడా ఆమె ప్రతివారం ఒక్కతే అమ్మాయి తో మసాజ్ చేయించుకుంటుంది. ఆ అమాయి స్పర్శ కి ఆమె శరీరం అలవాటు పడింది. ఇక ఈ శరీరం వొంటరీది కాదు అనుకుంటుంది. ఆమె అలా ప్రతి శనివారం మసాజ్ కి వెళ్ళటం కూడా ఒక వ్యసనమే అంటాడు వశీష్ఠ.
ఈ కధ లో మసాజ్ చేయించుకోవటం అనే విషయం ఒక పెద్ద అంశంలో ఒక చిన్న భాగం . రచయత సున్నితం గా టచ్ చేసి వదిలిన పాయింట్ మరొకటి ఇందులో అంతర్లీనం గా కనిపిస్తుంది. . మసాజ్ ఎవరి చేతనైనా చేయించుకోవచ్చు. కానీ ఆమె ప్రతి వారం ఒక అమ్మాయితోనే చెయించుకుంటుంది. అవసరమైతే ఆ అమ్మాయి కోసం ఎదురుచూస్తుంది. ఆమె శరీరం ఏదో ఒక స్పర్శ కోరుకోవటం లేదు. ఒక ఆత్మీయ స్పర్శ కావాలనుకుంటోంది. అది ఒకప్పుడు ఆమె కి తల్లి దగ్గర లభించింది. తర్వాత భర్త దగ్గర లభించింది. అటు తర్వాత మసాజ్ చేసే నీరజ దగ్గర పొందింది. నీరజ ఏదో మొక్కుబడిగా మసాజ్ చేయలేదు. ఒక ఆత్మీయత తో ఆమె శరీరాన్ని తాకింది. సున్నితంగా స్పృశించింది. అలా, నీరజ, ఆమె ప్రతి వారం ఒకరి కోసం మరొకరు ఎదురుచూస్తారు. వారిద్దరి మధ్య ఒక అవ్యక్త అనుబంధం కేవలం ఒక స్పర్శ వల్ల సాధ్యమైంది. కధ కి ఇది కీలకమైన పాయింట్. బాహాటం గా రచయత కధ లో దీన్ని చర్చించలేదు కానీ ప్రస్తావించి వదిలేశాడు. కధ చదవటం పూర్తి చేశాక పాఠకుడు ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఒక సున్నిత అనుబంధం గురించి ఏమై వుంటుందా అని కొంచెం ఆలోచిస్తాడు. ఇత్రివృత్తం పాతదే కదా అని పైకి అనిపిస్తూనే కొత్తగా చెప్పటం, ఆ చెప్పటం లో కూడా కొన్ని అంశాల్ని అంతర్లీనంగా పాఠకుడి అవగాహనకు, ఆలోచనకు వదిలిపెట్టడం వల్ల ఈ కధ నాకు గుర్తుండిపోయింది. మసాజ్ పార్లర్ల మీద, అక్కడ జరిగే భాగోతాల మీద రకరకాల వార్తా కధానాలు తరచూ వినిపిస్తున్న నేపధ్యంలో రచయత ఒక సున్నిత మైన అంశాన్ని ఆలోచనకు పెట్టడం ఒక మంచి ప్రయత్నం గా అనిపించింది.
ఈ కధ మీకు చదవాలనిపిస్తే ఇక్కడ చదవండి.
(కవి, రచయత సలీం ఇప్పటి దాకా 150 కథల దాకా రాశారు. రెండు కవితా సంపుటాలు, ఆరు కధాసంకలనాలు , రెండు నవలలు వెలువరించారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. )
కల్పనారెంటాల
12 వ్యాఖ్యలు:
ఈ కథేదో చదివినట్టే ఉంది. మీ విశ్లేషణ చదివాక గుర్తుకు వచ్చింది. కథకన్నా మీ విశ్లేషణే బాగుంది.
మురళీమోహన్ గారు,
నా విశ్లేషణ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
మంచి కథల కోసం మీరు చేసే ఒక మంచి ప్రయత్నం మీ బ్లాగ్. బెస్ట్ ఆఫ్ లక్.
కథా బాగుంది, మీ పరిచయం అంతకంటే బాగుంది!
ఒక సూచన. కాథానుభం ఒకటి రెండు అని కాకుండా, కథపేరు రచయిత పేరూ టపా టైటిల్లో పెడితే ఉపయోగంగా ఉంటుంది అనుకుంటాను. ఇలాంటివి ఓ పది పదిహేను తయారైపోయాక (అంటే కనీసం అన్నైనా రాస్తారని నమ్మకం) ఏదన్నా ఒక టపాని వెతికి పట్టుకోడానికి సులభంగా ఉంటుంది.
ఉచిత సలహా ఐపోయింది కాబట్టి అసలు విషయంలోకొద్దాం. ముందుగా మీరిచ్చిన లంకె పట్టుకుని అసలు కథ చదివాను. బానే రాశారనిపించీంది. కొంచెం ఆలోచిస్తే పకడుగా కూడా రాశారనిపించింది. అటుపైన మీ కామెంటరీ చదివాను. మీరు గమనించినట్టుగా కథని చాలా ఆర్ద్రంగా చెప్పారు రచయిత, ఆవిడ ఆలోచనల్ని చాలా స్పష్టంగానూ ఆర్తితోనూ చిత్రించారు. భాషకూడా వస్తువుకి తగినట్టుగా సున్నితంగా ఉంది. (మనలో మాట, భావ భాషంటే ఏంటండీ? :-))
ఈ ప్రక్రియ అంతా అయ్యాక, ఒక కప్పు టీ పెట్టుకుని చప్పరిస్తూ ఇంకొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్నలు తోచాయి నాకు -
పెళ్లైన కొత్తలో అంత తమకంగా ఉన్న మొగుడికి మరి ఇప్పుడు అసలు భార్యని ముట్టుకోవాలని కూడా ఎందుకనిపించడం లేదో?
ఆవిడ స్పర్శ కోసం తపిస్తుండగా ఉపశమనిమిచ్చేది ఒక మగ మస్యూర్ అయితే?
ఆవిడ తపిస్తున్నది స్పర్శ ఒక్క దానికోసమే కాకపోతే?
అఫ్కోర్సు ఇవన్నీ ఈ కథకి రచయిత ఊహించిన పరిధిలో లేవనుకోండి. కానీ ఆలోచనలకి అడ్డేముంది?
శరీరానికి సుఖం, మనసుకు ఆలోచనా లేకపోతే మనిషి మనిషిగా (మనిషికి స్త్రీలింగం ఏమిటి?) ఉండగలడా!
స్త్రీకైనా పురుషుడికైనా ఈ అనుభూతులూ,భావనలూ,కోరికలూ సమానమే.సహజమే.కానీ అవి స్త్రీ బాహాటంగా కోరుకుంటే,చెప్పుకుంటే ఈ సమాజానికి ఇబ్బంది.
స్త్రీవాద రచయితలు స్త్రీశరీరాన్ని గురించి రాసిన ఎన్నో కథల్లో ఇదొకటి. మంచికథ. కానీ గొప్పకథలనీ ఏ మళయాళంలోనూ, తమిళ్ లోనో బెంగాలీలోనో ఎందుకుంటాయో!!!!
థెరీసా, నచ్చినందుకు థాంక్స్.
కొత్తపాళీ, మీ సూచన బావుంది.. పది, పదిహేను కథల గురించి రాస్తానన్న మీ నమ్మకాన్ని వమ్ము చేయకుందా వుండటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
ఇక మీ సందేహాలకు... ( ఇప్పుడు చెప్పేవన్నీ నా వూహలే.)
భావానికి తగ్గ భాష అనీ భావభాష వాడాను. వూరికినే..
“పెళ్లైన కొత్తలో అంత తమకంగా ఉన్న మొగుడికి మరి ఇప్పుడు అసలు భార్యని ముట్టుకోవాలని కూడా ఎందుకనిపించడం లేదో?”
బహుశా వాళ్ళ ఇద్దరి మధ్య ఒక మానసిక దూరం పెరిగి వుండవచ్చు.
“ఆవిడ స్పర్శ కోసం తపిస్తుండగా ఉపశమనిమిచ్చేది ఒక మగ మస్యూర్ అయితే?”
అప్పుడైతే కథ పూర్తిగా భిన్నం గా వుంటుంది. స్పష్టం గా కూడా వుంటుంది. ఆమెకు కావాల్సింది ఒక పురుష స్పర్శ అని. ఇప్పుడైతే ఆమె కు కావాల్సింది స్త్రీనా, పురుషుడిదా అని కాదు. ఒక మామూలు శారీరక స్పర్శ కూడా కాదు. ఒక ఆత్మీయ స్పర్శ. నిరజా కేవలం మసాజ్ చేయలేదు. వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణాలతో, ఒక సాన్నిహిత్యం పెరీగింది. ఒకరి కోసం ఒకరు ఎదురుచూసేంత సామీప్యం పెరిగింది.
“ఆవిడ తపిస్తున్నది స్పర్శ ఒక్క దానికోసమే కాకపోతే?”
ఇది అంతర్లీనంగా రచయత ప్రస్తావించి వదిలేశాడు. దీని మీద రచయత కి కూడా ఒక సంపూర్ణ అభిప్రాయం లేదనుకుంటాను. అందుకనే, ఎటూ తేల్చి చెప్పకుండా పాఠకుల అభిప్రాయాలకు, అవగాహనకు వదిలేశారు.
మహేష్,
మనిషి కి స్త్రీ లింగం తెలియదు కానీ, మానవుడు కి మానవి అని మాత్రం తెలుసు. ఆ మాత్రం మీకు కూడా తెలుసని తెలుసు.
“ గొప్పకథలనీ ఏ మళయాళంలోనూ, తమిళ్ లోనో బెంగాలీలోనో ఎందుకుంటాయో!!!!”
కదా. ఎందుకంటే మీకు తెలుగు కప్పల గురించి జోక్ తెలిసే వుంటుంది. ఒక కప్ప పైకి వెళ్తుంతే మిగతావన్నీ కిందకు లాగేస్తుంటాయి. మన వాళ్ళ కధల్ని మనం మెచ్చుకోమ్. పక్కభాషలో రాస్తే ఆహా,, వో,హొ, హొ,…మీకు వోపిక వుంటే, వినాలనుకుంటే తెలుగు కథలు ఎందుకు గొప్పవి కాలేవో ఎప్పుడైనా చెప్తాను ...ఒక ఆడియో ఫైల్. లో....
@కల్పన: తెలుగు కథలు గొప్పవెందుకు కాలేదో ఆ సీక్రెటేదో చెప్పండి! చెప్పండి!! వింటాను.
చలం, రావిశాస్త్రి,బుచ్చిబాబు,కొకు,గోపీచంద్,శీలావీర్రాజు వరకూ గొప్పకథలు ఉన్నాయి. కానీ "భారతీయకథ"ను define చేసిన కథలన్నీ హిందీ, బెంగాలీ,మళయాళం,తమిళ్,కన్నడ లో ఉండటమే నాకు కనిపించింది. అది నా అపోహో లేక నిజమో తెలీదు.
మహేశ్,
మీరు చెప్పిన కథకుల కథలు కూడా ఎందుకు గొప్పవి అయ్యాయో తెలుసా? వేరు దారి లేక. .మీరు చెప్పిన భారతీయత అనే పెద్ద కాన్వాస్ తెలుగు కథకులు తీసుకున్నారా అన్నది సందేహమా? ఇతివృత్తం, ప్రయోగం రెండింతి విషయంలో కూడా తెలుగు కధకులు నిస్సందేహం గా ముందున్నారు. (అన్నీ కాకపోయినా , కొన్నింటిలో..) అయితే మిగతా భాషాల సాహిత్యానికి ప్రచారం ఎక్కువ లభిస్తోంది. సాహిత్య అకాడమీలు , వాటి పెద్ద తలకాయలు వాళ్ళ వాళ్ళే వుండటం వల్ల. తెలుగు వాళ్ళకు, మన భాషలో ఎంత బాగా రాసినా, ప్రతి దానికి వంకలు పెట్టి విమర్శించే బ్యాచ్ ఒకటి ఎప్పుడూ వుంటుంది. మన వాళ్ళు సాహిత్య అకాడమీలో ఒకరు వుంటే వాళ్ళు ఎవరి కథలనైనా ఎంపిక చేస్తే జరిగే వాదవివాదాలు లెక్కలేనన్నే. సాహిత్య అకాడమీలకు తెలుగు రచయతల నుంచి వచ్చే వివాదాలు చూసి చిరాకు పడుతుంటారు. మన శో కాల్డ్ రచయతల ప్రవర్తన బాహాటం గా బయటకు వచ్చాయి చాలా సార్లు. బహుశా మీరు సాహిత్య వివాదాలు తెలుసుకొని వుండకపోవటం వల్ల ఇలా అమాయకంగా ప్రశ్నించారు. చాలా రహస్యాలు తెలుసు కానీ పేర్లు బయట పెడితే వచ్చే ప్రమాదం మీకు కూడా తెలుసు కాబట్టి ...ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను.
KR .. Liked your answers to my queries. I think writer/director Deepa Mehta took this story to one possible conclusion (among many possibilities) in the movie "fire".
కల్పన కధ చదవలేక పోయాను ఫాంట్ సమస్య తో, మీ విశ్లేషణ ఆ పైన కామెంట్ లు చదివితే అర్ధం అయ్యిందనే అనుకుంటున్నా కధ. ఆ కధలోని అమె వంటి వారు ఈ సమాజం లో ఎందరో వుంటారేమో.. నాణేనికి ఇంకో పక్క వయసు లో వుండగా కొట్టుకు చచ్చిన జంటలు వయసు పెరిగే కొద్ది ఒక క్షణం వదిలి వుండని వారిని చూసేను నేను, మరి అది అలవాటో ప్రేమో తెలియదు. (దీని గురించి నేను ఎక్కడో చదివేను ఒకే ఇంట్ళో మన కళ్ళ ముందు ఒక కుక్క వుంటే సాకక పోయినా దానిని రోజు చూడటం వలన ప్రేమిస్తాము అలానే సమాజం లొ 70% మొగుడూ పెళ్ళాల మధ్య ప్రేమ అని) ఏది ఏమైనా మంచి కధ అంతా రచయతే చెప్పకుండా సున్నితంగా మన మీద కు వదిలేరు అనిపించింది మీ విశ్లేషణ చూస్తే.
“ఒకే ఇంట్ళో మన కళ్ళ ముందు ఒక కుక్క వుంటే సాకక పోయినా దానిని రోజు చూడటం వలన ప్రేమిస్తాము అలానే సమాజం లొ 70% మొగుడూ పెళ్ళాల మధ్య ప్రేమ అని”
భావనా ఇది చాలా వరకు నిజం. స్త్రీపురుష సంబంధాల గురించి రాసిన విధంగా రాయనట్లుగా ఎన్ని కతలైనా రాయవచ్చు .అంత వుంటుంది అందులో అనిపిస్తుంది నాకు.
Post a Comment