కధానుభవం -1
పాల గుమ్మి పద్మరాజు గారి “ ఎదురు చూస్తున్న ముహూర్తం “, “ పడవ ప్రయాణం “ కథలు రెండు కథా సంకలనాల్లో కనిపించటంతో మళ్ళీ చదివాను.. కొన్ని సంవత్సరాల క్రితం చదివిన కథలు అయినా, మళ్ళీ కొంత విరామం తర్వాత చదివినప్పుడు మన అవగాహన పరిధి విస్తృతమైనదాన్ని బట్టి ఒక్కోసారి కొత్తగాఅర్ధమవుతాయి.
పాత తరం రచయతల కథలు సింపుల్ గా కనిపిస్తూనే ఎంత లోతైన అర్ధాన్ని ఇస్తుంటాయో అన్నదానికి ఈ రెండు కథలు ఒక ఉదాహరణ. అందుకే అవి ఇప్పటికీ అపురూపమైన కథలు. మళ్ళీ మళ్ళీ చదువుతున్నా విసుగుపుట్టవు. ఆ, తెలిసిన కథే కదా అని పక్కన పెట్టేయబుధ్ధి కాదు. ఎప్పటికప్పుడు ఒక కొత్త పాయింట్ కనిపిస్తుంది కథనం లోనో, శిల్పం లోనో. లేదూ, మనం కథలు ఎలా రాయాలో చేయి తిరిగిన రచయత ఈ కథ ల ద్వారా ఒక ఉదాహరణ చెప్పినట్లు అనిపిస్తుంది. పాలగుమ్మి గారి కథల మీద ఇప్పటికీ సిద్ధాంత వ్యాసాలు, సమీక్షలు కుప్పలు తెప్పలుగా వచ్చేవుంటాయి. కాబట్టి ఇందులో నేను కొత్తగా చెప్తున్నదేదైనా వుంటుందో, వుండదో నాకు తెలియదు కానీ. ఇదీ నాకు అర్ధమైన పద్మరాజు అని రాసుకోవటం మాత్రమే నేను చేస్తున్న పని.
పద్మరాజు గారు అనగానే అంతరంగ చిత్రణ గుర్తుకు వస్తుంది. ఆయన పాత్రచిత్రణ ఎలావుంటుందంటే ఆ పాత్రలు మన కళ్ళకు కట్టినట్లు కనిపించటమే కాదు. వాళ్ళ మనసు పొరల్లో చెలరేగే అలజడిని, అంతరంగ ప్రవృత్తులను కూడా సజీవంగా మనకు పట్టి చూపిస్తారు. ఒక కథకుడిగా అక్కడ ఆయన లోని గొప్పతనాన్ని మనం గుర్తిస్తాం. ఆయన కథల్లోని తాత్వికత వాచ్యంగా ఎవరూ చెప్పకుండానే మనకు అర్ధమవుతుంది. అందువల్లనే ఆయన కథలు మంచి కథలయ్యాయి..పద్మరాజు గారి కథ ల్లోని ప్రధాన వస్తువు, భాష, శైలి, కథను నడిపించే విధానం ఇవన్నీ కూడా ప్రతి కథకు విభిన్నంగా వుంటుంది. ఆయన వచన శైలి, దృశ్యాల్ని మన కళ్ళ ముందు సినిమా లా చూపిస్తుంది.
పడవ ప్రయాణం లో మొదటి రెండు పేరాగ్రాఫ్ లు ఒక సన్నివేశాన్ని మన ముందు నిలిపి పాఠకుల్ని అందులోకి తీసుకెళ్తుంది. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఒక సన్నివేశాన్ని నిలిపి అందులో కథ ని ప్రవేశపెట్టడం లాంటిదన్న మాట.
“ పొద్దు కుంకిన తరువాత లోకమంతా దిగులు గా వుంది. పడవ మెల్లగా నీటి మీద జారుతోంది. నీరు పడవ పక్కని కలకలమంటూ రాసుకుంటోంది. చూపు మేరలో జీవ సంచలనం లేని ప్రపంచకం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని చెవులకు వినపడక దేహాన్నంతనీ తాకుతుంది. మనస్సులో లోపల అది నిండుగా కంపిస్తున్నట్లు వుంటుంది. అప్పుడు ఏదో బ్రతుకు చివరి ఆఖరయి పోతున్న నిస్పృహ, ప్రశాంతమయిన నిరాశ మనస్సులో నిండుకుంటాయి. దూరంగా చెట్లు అస్పష్టంగా , మాయగా పడవతో కూడా నిశ్చలంగా ముందుకి సాగుతాయి. దగ్గరగా వున్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దెయ్యాల్లాగా జీబురుమంటో వెనక్కు నడుస్తాయి. పడవ కదలదు. కాలవ గట్టు కదులుతుంది. నా చూపులు చొచ్చుకొని చొచ్చుకొని నీటి లోకి చూస్తాయి. అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకొని చూస్తాయి. నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివశంగా ఉయ్యాల లూగుతాయి. కన్ను తెరిచి నిద్రపోతాయి.
గాలి లేదు. పడవ లాగే తాడు, మునిగర్రా చప్పుడయినప్పుడల్లా బిగువుగా, వొదులుగా అవుతోంది. పడవ వెనకభాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది. అప్పుడప్పుడు రప్పుమంటోంది. అప్పుడప్పుడు తగ్గిపోతుంది. లోపలికి వూరిన నీరు చేద తో తోడి ఒక కుర్రవాడు కాలవలోకి పారబోస్తున్నాడు. పడవ లోపల ఏవేవో బస్తాలున్నాయి. ధాన్యం, బెల్లం, ఉప్పు, చింతపండు వగైరా, పడవ టాపు మీద నేను వెల్లగిల పడుకున్నాను. పడవ లోపల నించి చుట్ట పోగలు, ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్నీ దిక్కులకు వ్యాపిస్తున్నాయి. గుమాస్తా కూర్చున్న గదిలో గుడ్డిదీపం కొద్దిగా కునుకుతోంది. పడవ సాగుతోంది. ”
పడవ నీటి మీద ఎలా వెళ్తోందో ఇంత వర్ణన వుండటం వల్ల పాఠకుడి కళ్ళ ముందు నిజంగా ఒక పడవ కదలాడుతుంది. మనం అంతఃచక్షువులతో పడవ ప్రయాణాన్ని అనుభూతి చెందుతాం. చుట్టూ వున్న పరిసరాల్ని గమనించలేనివాడు రచయత కాలేడు అనుకుంటాను నేను. పద్మరాజు ఎన్నో సార్లు పడవెక్కి ప్రయాణం చేసి వుంటాడు. లేదా పడవ ప్రయాణ సన్నివేశాన్ని వాస్తవిక జీవితం లో చూసి వుంటాడు. పడవ ప్రయాణాన్ని వూహించి రాయటం కాదు. అసలేప్పుడూ పడవెక్కని వారు, చూడని వారు ఇలా రాయలేరు. ఇక్కడ మనకు ఒక కథలో వాస్తవిక చిత్రణ కనపడుతుంది.
కథని అందంగా మొదలుపెట్టే ఈ నైపుణ్యం దాదాపుగా ఆయన కథలన్నింటిలో కనిపిస్తుంది. కథ ని చెప్పే కథకుడి ద్వారా అక్కడున్న సన్నివేశంలోకి పాఠకుల్ని రచయత గా నేర్పుగా తీసుకెళ్తాడు. అక్కడ నుంచి మన కళ్ళు ఆ కథకుడి కళ్ళు అవుతాయి. అతను చూసేవన్నీ మనం చూస్తాం. అతను అనుభవించినవన్నీ మనమే అనుభవిస్తున్నట్లు అనుభూతి చెందుతాం. రంగి ని అతని కళ్ళతో మనం చూస్తాం. ఆమె పాటని మన చెవులతో వింటున్నట్లు వూహిస్తాం. రంగి పాటతో, పద్దాలు పట్ల ఎలాంటి అడ్డుగోడలు లేని ఆమె ప్రేమతో లోకమంతా ఒక చిన్న పడవ లాగా తేలిపోతుంది. పడవ ప్రయాణం ఒక జీవన ప్రయాణానికి సంకేతంగా మారిపోతుంది. కథలో కథకుడి పాత్ర మనకు పాత్రల్ని పరిచయం చేస్తూ,చుట్టూ వున్న పరిస్థితుల్ని చూపిస్తుంది. సన్నివేశాల్ని వివరిస్తుంది. రంగి గురించి ఒక మామూలు పాఠకుడి కి ఏమేమి సందేహాలు , ప్రశ్నలు తలెత్తుతుంటాయో అవన్నీ కథకుడి ద్వారా రచయత అడిగించారు. అందువల్లే కథ చివరికీ వచ్చేటప్పటికి మనకు రంగి సుపరిచితంగా అనిపిస్తుంది. పద్దాలు నీ మొగుడా అని అడిగితే “ మా వోడు” అంటుంది. ఆ వొక్క మాటతో, కేవలం ఆ ఒక్క మాటతో రంగికి పద్దాలు మీదున్న ప్రేమ అర్ధమవుతుంది. మొగుడు అయితే కొన్ని పరిమితులు వుంటాయి. మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు ఆస్తులు. గట్టిగా పట్టుకోవటం, వదిలించుకోవటం వుంటాయి. “ ఆడు నా వోడు” అన్న మాటలో లోతైన అంతరార్ధం కనిపిస్తుంది. మొగుడు కంటే ఎక్కువ అన్న ధ్వని వినిపిస్తుంది. నా ప్రాణం, నేనే వాడు, వాడే నేను అన్న నిర్మలమైన ప్రేమ కనిపిస్తుంది. చివర్లో కథకుడి ద్వారా ఇలా చెప్పిస్తారు “ పద్దాలు కోసం ఆమె ఎల్లాంటి పనన్నా చేయడానికి సిధ్ధంగా వుంది. అది ఒక ఆదర్శమూ కాదు, భక్తి కాదు. ప్రేమా కాదు. ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో, ఈసులతో, అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం. అయినా ఆ హృదయం అన్నింటికీ ఫలితంగా ఒకేచోట లగ్నమయి వుంది. తన మగవాడి కోసం ఆమె నిరంతరం తపిస్తుంది. కానీ అతడు నిర్దుష్టంగా , నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. అతని సుగుణాలతో ,అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరించింది. “
పద్దాలు చంపేయబోయినా, సవితి ని ఇంట్లో తెచ్చిపెట్టినా రంగి సహించింది. తాను జైలు కెళ్తానని తెలిసినా, పద్దాలు దొంగతనం చేసి పారిపోవటానికి సహకరించింది. ఆమె జీవిత సర్వస్వం అతడు. ఆమెకు అదొక నిశ్చింత. ఇంత చేసిన రంగి కథ తర్వాతేమైందో కథకుడి కి తెలియదు, మనకి కూడా తెలియదు. కానీ ఆ పడవ ప్రయాణం లాంటి జీవిత గమనంలో మనకు కూడా ఎప్పుడో అప్పుడు ఒక రంగి ఎదురుపడుతుంది.. అప్పుడు పడవ ప్రయాణం గుర్తుకు వస్తుంది.
“ ఎదురు చూస్తున్న ముహూర్తం “ కథలో శాంత పాత్ర రంగి కి పూరిగా భిన్నమైంది. రంగి జీవితాన్ని వున్నదున్నట్లు స్వీకరించింది. పెద్దగా ఆశలు లేవు. నిట్టూర్పులు లేవు. శాంత కి అలా కాదు. తనకున్న దానిమీద ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో ఒక అలౌకికానుభవం కోసం ఎదురుచూస్తూ జీవితాన్ని గడుపుతూ వుంటుంది. తన ఆశల్ని , తన భావాల్ని అందరి ముందు వెల్లడి చేయకుండా లోపల పదిలంగా దాచుకుంటూ వుంటుంది. లోపల ఒకలా, బయట ఒకలా వుంటుంది.
కథమొదలు కావటమే “ శాంత ఎప్పుడూ దేని కోసమో ఎదురు చూస్తూ వుంటుంది “ అని మొదలవుతుంది. ఇక ఆ తర్వాత రచయత ఏమి చెప్తున్నా కూడా, శాంత ఎదురుచూసేది దేనికోసమో అని పాఠకుడు కూడా ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ వుంటాడు. అలా కథ ప్రారంభం నుంచి పాఠకుడిలో ఒక ఉత్సుకత ని రేకెత్తించడంలో రచయత సఫలీకృతుడవుతాడు. తన జీవితాన్ని తారుమారు చేసే సంఘటన కోసం శాంత ఎదురుచూస్తుండగానే ఆమె కాలేజీ చదువు అయిపోయింది. అందరి ఆడపిల్లల్లాగానే పెళ్ళి కూడా అయిపోయింది.అయినా ఆమె ఎదురుచూస్తూనే వుంది.ఎప్పుడో ఏదో జరగబోయే ఒక సంఘటన కోసం. అదెలాంటిదో ఆమెకు కూడా తెలియదు. ఆమె వూహించలేదు. కానీ ఆమెకుఒక గట్టి నమ్మకం. అది ఒక అలౌకిక అనుభవం అవుతుందని. ఆమె భర్త మామూలు మనిషి. మరిది వెంకటం మాత్రం సరదా అయిన మనిషి. కథలు రాస్తాడు. అతడి ప్రవర్తన చూసి వొట్టి వెకిలివాడని అభిప్రాయపడినా అతను రాసిన కథలు చదువుతుంది. అందులో ప్రతి స్త్రీ పాత్ర తనలాగే అనిపిస్తుంది. తన మనసులో వున్న విషయాల్ని అతడు కనిపెట్టేసి రాసినట్లు ఉలిక్కిపడుతుంది. ఛీ ఛీ అమ్మాయిలు ఎక్కడైనా ప్రణయలేఖలు రాస్తారా అని చిరాకుపడుతుంది. వెంకటం కథల్లోని స్త్రీ పాత్రాల్లో తన ఛాయలు కొన్ని వున్నాయని గుర్తించగలిగింది. తన మనసులో ఏమేమి అనుకుంటుందో వెంకటానికి ఎలా తెలుస్తుంది అని ఆశ్చర్యపడుతుంది. కథల్లో వెంకటం రాసిన విషయాలు అతనికి అనుభవమయిన విషయాలు అవునో కాదో తెలుసుకోవాలనుకుంటుంది. అతనికి చాలా మంది స్త్రీలతో సంబంధాలు లేకపోతే ఇన్ని విషయాలు ఎలా రాయగలుగుతాడని తీర్మానించుకుంది. ఒక కథలో స్త్రీ పాత్ర ఉత్తమ ప్రేమను కోరుకున్నా తీరా అది దక్కే సమయానికి ఆమెకు ధైర్యం సరిపోదు. దాని నుంచి తొలగిపోతుంది. అది అచ్చం తానేనని అనుకుంటుంది శాంత. అయితే ఆ కథలో కథానాయిక చివరికి చచ్చిపోవటంతో ఆమెకు భయం వేస్తుంది. ఒక రాత్రి భర్త లేనప్పుడు వెంకటం వస్తాడు. అతని కథల మీద ఇద్దరికీ చర్చ జరుగుతుంది. అలాంటివి అసలు జరగవు అంటుంది శాంత మనం తరచూ వినే పాఠకుల స్వరంతో. నేను ఎరగని విషయాన్ని రాయలేదు అంటాడు వెంకటం, అచ్చమైన రచయత లా. కథల్లోని స్త్రీ పాత్రల స్వరూప స్వభావాలు సమాజంలోని ప్రతి స్త్రీలో కనిపిస్తాయి అని చెప్తూనే “ నీకేమి కావాలో నీకు తెలియదు. ఏదో బ్రహ్మాండమయినది ఎప్పుడో జరుగుతుందని నీ బోటి వాళ్ళు అనుక్షణం ఎదురుచూస్తుంటారు. కానీ ఏమీ జరగదు. రోజులు అల్లాగా రైలురోడ్డు లాగా హెచ్చు తగ్గులు లేకుండా గడిచిపోతాయి. హెచ్చు తగ్గులను చూస్తే ఒక మూల మీకు భయం,ఒక మూల కుతూహలం. అంచేత మీరు సుఖంగా బ్రతకరు, మీ చుట్టుపక్కల వున్నవాళ్ళని మీరు సుఖంగా బ్రతకనివ్వరు” అనేస్తాడు వెంకటం శాంత ని. శాంత ఎదురుచూస్తున్న ముహూర్తం వచ్చేసింది. తనేమిటో, తన మనసులో జరుగుతున్న సంఘర్షణ ఏమిటో శాంత తెలుసుకోగలిగింది. ఇక బహుశా ఆమె అప్పటినుంచి ఇక దేనికోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. వెంకటం పాత్ర ద్వారా రచయత కొందరు స్త్రీల మనస్తత్వాలను అద్దం లా మన ముందు వుంచుతారు. శాంతకి తన అందం మీద లోపల ఒకానొక గర్వం. మరిది కూడా తన ఆకర్షణ నుండి తప్పించుకోలేడు అనుకుంటుంది. ఆమె అంతరంగాన్ని ఒక రచయత గా వెంకటం పట్టుకుంటాడు. అప్పటికి కానీ తానేమిటో, తన మనస్సేమిటో శాంత కి అర్ధం కాలేదు.
అదే రంగి విషయానికి వస్తే రంగికి తన మీద కంటే తన ప్రేమ మీద నమ్మకం ఎక్కువ. తను ప్రేమించినవాడి మీద ఎక్కువ నమ్మకం. సమాజం ఏదో అనుకుంటుందని ఆమె లోపల ఒకలా, బయట ఒకలా ప్రవర్తించలేదు. పద్దాలు కి వేరే స్త్రీలతో సంబంధాలు వున్నాయని తెలిసినా , అతని మీద ప్రేమను చంపుకోలేదు. సవతి మీద అసూయ పడుతూనే పద్దాలు మీద ప్రేమ ని నిలుపుకుంది. ఈ రకంగా పద్మరాజు కథల్లోని స్త్రీ పాత్రలు ఒకరికొకరు విభిన్నంగా వుంటారు. స్త్రీలందరూ ఒకే మూసలోంచి తీసినట్లు వున్నారు అన్న సంగతి బాగా అర్ధమైన రచయత పద్మరాజు. అందుకీ ఆయన కథల్లోని పాత్రలు నిత్య నూతనం గా వుంటాయి. ఆ పాత్రలు మనలో ఒకరు. మనలో ఎవరో ఒకరం ఆ పాత్రల్లో వుంటాము. అదీ మనల్ని ఆయన కథలకు దగ్గరగా తీసుకెళ్ళేది.
ఇవి పద్మరాజు కథలను మలిచే తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఒక మెతుకు చూస్తే అన్నం వుడికిందో లేదో తెలిసినట్లు ఈ రెండు కథల ద్వారా ఆయన రాసిన కథలు, నవలలు, అందులోని పాత్ర చిత్రణ లను వూహించవచ్చు. సమాజం పట్ల, వ్యక్తులు ఆలోచనా విధానాల పట్ల, నీతి, అవినీతి మొదలైన వాటి పట్ల ఆయన సునిశిత పరిశీలనా దృష్టికి ఆయన రచనలు నిలువుటద్దాలు. ఈ రెండు కథలు ఆయన రచనానైపుణ్యానికి దర్పణాలు.
కల్పనారెంటాల
5 వ్యాఖ్యలు:
రంగి, శాంత పాత్రలను బాగా విశ్లేషించారు. మీ వ్యాసం చదివాక పాత్రల గురించి మరికొంత తెలిసింది. రంగి-పద్దాలు సజీవ పాత్రలు. వారు ప్రతిచోటా కనబడుతారు. అందుకే ఎప్పుడో రాసినా, ఇప్పటికి కూడా అత్యుత్తమ కధల్లో పడవప్రయాణం నిలిచిపోయింది. పరిసరాలను వర్ణించటంలో బుచ్చిబాబు గారి వలె ఈయన కూడా సిద్ధహస్తులు అనిపిస్తుంది ఈ కధ చదివితే. రంగి అమాయకురాలైతే, శాంత సంక్లిష్టమైన పాత్ర. పద్మరాజు గారివి మూడు కధలే ఇప్పటికి చదివాను. మీరు రాసినవి కాకుండా గాలివాన మరొకటి. మనస్తత్వ చిత్రణ గురించి రాసే బుచ్చిబాబు గారి కధలను గురించి కూడా రాస్తారని ఆశ.
సుజాత, మీరు అందచేసే కథ కోసం చూస్తాను.
వెంకటరమణ, తప్పకుండా బుచ్చిబాబు గురించి రాస్తాను. మీలాంటి పాఠకులు వచ్చి అడిగితే కదా మీరు ఏమీ చదవాలనుకుంటున్నారో కూడా తెలిసిది.
కల్పనగారూ...
క«థా చక్రవర్తి పాలగుమ్మి కథలప్తె మీ విశ్లేషణ బాగుంది. (ఆయన పూర్తి కథలతో వచ్చిన సంపుటిపై ఆ మధ్య మా ఆదివారం ఆంధ్రజ్యోతిలో సమీక్ష కెలికా). కథ ఒక భూతమైతే మనం ఆ భూతం చేతిలో ఉండి అది ఆడించినట్టల్లా ఆడతాం. అది మనల్ని ముప్పుతిప్పలు పెడ్తుందని వేరే చెప్పాలా? పద్మరాజుగారి చేతిలో ఆ కథా భూతం ఉంటుంది. ఆయన కథల మాంత్రికుడన్నమాట. ఆయన చెప్పినట్టు అది వింటుంది. ఆయన కథనగానే 'చిట్టితల్లి' గుర్తుకు వచ్చి కళ్లు చెమ్మగిల్లాయి. ఒక సారి వనిత పత్రికలో ఆణిముత్యాల్లాంటి కథల్ని పరిచయం చేస్తూ ఆ కథని ప్రచురించారు. చదివి కన్నీరు మున్నీరయ్యాను. కథలో నాటకీయత పాలెక్కువైనా కథ చదువరి పిడికెడు గుండెను పిడికిటితో పట్టి పిసికిపారేస్తుంది.
మీకు సంక్రాంతి కథాశిస్సులతో...
గొరుసు
గోరుసు,
పద్మరాజు గారు కతామంత్రికుదన్నది అక్షర సత్యం. చిట్టి తల్లి కథలో మీరన్నట్లు మెలోడ్రామా వున్నా కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది.మంచి కథ గుర్తు చేశారు. వోపికగా వచ్చి చదువుతున్నందుకు సంతోషం.
Post a Comment