నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, January 20, 2010

సంచయనమ్గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!!

వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో
ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో
ఒక్క సాక్ష్యమూ దొరకదు
ఒక్క మాటా వినిపించదు
ఒక్క కాలిజాడా మిగలదు!

అంతటా మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్ద చారికలు

వాళ్ల పుస్తకాల్లోకి తొంగి చూద్దామనుకుంటాను
ఒక్క పుటనయినా చింపి మీకు చదివి వినిపిద్దామనుకుంటాను
కన్నీళ్లతో అలుక్కుపోయిన అక్షరాల్ని
మీకు కన్పించేలా తిరగరాద్దామనుకుంటాను
మనశ్శరీరాల్ని మండించే కార్చిచ్చుని
స్మృతుల్లో నిలపాలనుకుంటాను
అయినా
అంతటా ఓ మౌనం

ఎక్కడో ఓ చోట
ఏదో ఒక కొండ
చివర్న భూమ్యాకాశాల్ని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు
కొండల్ని తవ్వి
అడవుల్ని చీల్చిన
కాలిబాటల్ని ఛిద్రం చేసిన తెల్లమృగాలు
అందమయిన వారి ముఖబింబాల మీద
చెక్కిన గాయాలు
ఇప్పుడు… అడవులన్నీ శిథిలస్మృతులు

అవును కానీ…
ఎక్కడైనా రక్తపుటేరులు మాట్లాడతాయా?
ఎక్కడైనా జ్ఞాపకాలు గొంతెత్తి నిలదీస్తాయా?
ఎక్కడైనా విరిగిపడ్డ చెట్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!

ఓ అర్థరాత్రి గీసిన లక్ష్మణ రేఖ
వాళ్ల స్థలకాలాల్ని విభజించింది
విషాదరేఖకి అటూ ఇటూ కూడా
మతాల ముసుగు వేసుకున్న మానవమృగాలే!
నిప్పులగుండాల్లోంచి పైకి రాలేని సీతలే!!
చారెడు మట్టిని
గుప్పెడు వేర్లని
వాళ్ల శవాలపై చల్లి
చేతులు దులిపేసుకున్నాం కదా!

అంతా మన పిచ్చి గానీ
ప్రవహించే నదులు సాక్ష్యాలు చెపుతాయా?
శవాల్ని మోసిన బావులు మాట్లాడతాయా?
మట్టివాసనలు మనుష్యుల మూలాల్ని పట్టిస్తాయా?

అంతటా ఓ మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్దచారికలు

కొండల్ని దాటి కోనల్ని దాటి
మైదానాల మీదకు పరుగులు తీశామా
మాయాబజార్ల వాకిళ్లు తెరిచి
కొత్తయుగాల్ని స్వాగతించామా?
వెయ్యికాళ్ల పురుగులతో
సాలెపురుగుల వెబ్‌లతో చెలిమి చేశామా?

ఉన్మాద ప్రేమ ముసుగేసుకున్న
మాయదారి మృగమొకటి
ఇప్పుడిక్కడ మంత్రనగరుల్లో సంచరిస్తోంది
అమ్మాయిలూ! పారాహుషార్!

అంతా మన భ్రమ కానీ
ఎక్కడైనా గొడ్డళ్లు, యాసిడ్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా కాల్‌సెంటర్ల టాక్సీలు మాట్లాడతాయా?

మాట్లాడేందుకు గొంతుల్లేక
రాసేందుకు చేతుల్లేక
చూపించేందుకు మొహాల్లేక
నిశ్శబ్దంగా, నిర్వేదంగా
అక్కడొక చెక్కేసిన బోధివృక్షం నిల్చొని వుంది

ఎన్నాళ్లీ జ్ఞాపకాల కుండల్ని మోసుకుతిరగను?
ఎన్నాళ్లీ కన్నీళ్ల తర్పణాల్ని వదలను?
కాలుతున్న శవాలతో ఎన్నాళ్లు సహజీవనం చేయను?
ఈ హింసకు వాక్యాల్లేవు
ఈ హింసకు సాక్ష్యాల్లేవు
ఎప్పుడు చెప్పినా ఒక్కటే కథ
ఒక్కటే కథనం
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!

8 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి said...

ఏమండీ కల్పన గారూ, పారిపోతుండా నని వచ్చి ఇక్కడ ఈ రకంగా విరుచుకు పడ్డారు? అవును

ఈ హింసకు సాక్ష్యాల్లేవు
నీ జాతికి నిష్కృతిలేదు
ఆ కల్పన మూగబోదు
ఈ కవితకు అవధిలేదు.

Kalpana Rentala said...

భా.రా.రే. ...మీ కవిత్వాలతో పోటీ పడలేక నా పాత కవితలు ఏరి మళ్ళీ తీసి పోస్ట్ చేసుకుంటున్నాను. అదేమిటో, నా పాత బ్లాగ్ లో ఏవీ ఎవరు చదవకుండా ఆర్కైవేస్ లో నిద్రపోతున్నాయి. అందుకని ఇలా దుమ్ము దులుపుకుంటున్నాను.

భావన said...

"అంతటా ఓ మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్దచారికలు"

కల్పనా కంటి కొస నుంచి కారుతున్న కన్నీటి ఆనవాలు గా నీ కవితొక అధ్బుతం. ఎంత నిజం కదు ప్రతి అక్షరం. అది బాధా తప్త హృదయాల గాలి రాగం.

'Padmarpita' said...

ఎంత అద్భుతంగా రాసారండి....చదువుతున్నకొద్దీ బాధగా అనిపిస్తుంది అయినా చదవాలనిపిస్తుంది.

మరువం ఉష said...

నిలువెల్లా కల్మషం పోతబోసిన అమానుషజాతి అది,
కుటిల మనస్తత్వం, సంకుచిత వ్యక్తిత్వం కలబోత ఆ నీచకులం.
పేరులెన్ని వున్నా పలుకైనా పలకలేని ప్రతి స్త్రీ ఓ అనామిక
ఆ జాతి ఉక్కు కౌగిల్లో, ఆ ముష్కరుల పదఘట్టనలో నలిగిన పారిజాతం మగువ
సమపాళ్ళు, సహ జీవనం కాంచలేని కాలం మౌనంగా సాగిపోతున్న యుగాలివి
[మౌనంగా విగతజీవి అయిపోయిన చెల్లి గుర్తొచ్చి.. ఇంకా ఇనకని కన్నీరు వెలికి వచ్చి]

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

భావనా, ఉషా, పద్మార్పిత,
తరతరాల మన చరిత్ర రక్తపు ముద్దలతో కప్పడిపోయింది. ఉషా అన్నట్లు ప్రతి ఒక్కరి జ్నాపకాల్లో ఒక అక్కో, చెల్లో వుంటుంది హింస కు ప్రతీకగా.

ANANTH said...

మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్

 
Real Time Web Analytics