నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, January 18, 2010

ద్రౌపది పై పత్రికల్లో భిన్న వ్యాసాలు!



ఇవాళ ఆంధ్రజ్యోతి , సాక్షి సాహిత్య పేజీల్లో వివాదాస్పదమైన ‘ ద్రౌపది’ నవల మీద వచ్చిన భిన్న వ్యాసాలని యూనికోడ్ లో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఫాంట్ సమస్య అని చెప్తుండటం వల్ల ఇలా యూనికోడ్ లో పెడుతున్నాను. కొందరు రచయతల అభిప్రాయాలు ఇవి. అలాగే ఆ వ్యాసాలతో నాకుఎలాంటి సంబంధం లేదు. అందరూ ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు కదా అని పెడుతున్నాను.

అలాగే నాకు అందిన ఇంకో సమాచారం కూడా ఇక్కడ ఇస్తున్నాను. అది నిజం గా కరెక్టో కాదో తెలియదు కానీ చాలా ఆశ్చర్యపోయాను వినంగానే. అందుకనే అది కూడా మీకు చేరవేస్తున్నాను. యార్లగడ్డ రాసిన ద్రౌపదీ మొదటి సారి సాహిత్య అకాడమీ వారి చేత తిరస్కరించబడిందని, మళ్ళీ రెండో సారి వారికోసం , వారికి నచ్చేవిధంగా (అంటే ఎలా వుంటే వారి బహుమతి కి అర్హమవుతుందో అలా) మార్చి రాసీ ఇచ్చారని అభిజ్న వర్గాల భోగట్టా. నిజానిజాలు నాకైతే తెలియదు. అలా సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు. కాకపోతే 2006 నుంచి ఇప్పటిదాకా ద్రౌపదీ మూడు ఎడిషన్లు ప్రచురిచతమైంది. మొదటి వెర్షన్ కి, మూడో వెర్షన్ కి తేడా వుందా? వుంటే అది ఎలాంటి తేడా అనేది మనం చదవకుండా చెప్పలేం. కాకపోతే సాహిత్య లోకంలో పుకారాలు , వివాదాలు ఇలాంటివి మామూలే.వీటికి ఒక్కోసారి ఏ ఆధారం వుండకపోవచ్చు. కాకపోతే ఎవరిదగ్గరైనా మొదటి వెర్షన్, మూడో వెర్షన్ వుంటే మార్పులు వున్నయోమో చూడవచ్చు.


విలువల వలువలు విప్పిన వేళ...

రామాయణ, మహాభారత పురాణ కథలను, పాత్రలను తీసుకొని స్వతంత్ర కావ్యాలుగానో నవలలుగానో మలచిన రచనలు భారతీయ భాషల్లో చాలావచ్చాయి. ఆధునిక రాజకీయ, సామాజిక, చారిత్రక భావజాలాన్ని మూల కథ ద్వారా ధ్వనింప చేసిన రచనలూ వీటిలో ఉన్నాయి. ఉదాహరణకు ఇరావతీ కార్వే రాసిన 'యుగాంత' స్త్రీ దృక్ప«థం నుంచి గాంధారి, కుంతి, ద్రౌపది పాత్రలతో మాట్లాడించింది. పురాణ పాత్రలకు ఆపాదించే అతి మానుష లక్షణాలను తొలగించి భౌతిక స్థల కాలాలకు చెందిన వాస్తవికతలో వాటిని నిలబెట్టి చారిత్రక దృష్టి నుంచి మహాభారత కథను పునర్నిర్మిస్తూ ఎస్.ఎల్.భైరప్ప 'పర్వ' రచించారు.

నన్నయ పన్నెండు పేజీలలో చెప్పిన యయాతి కథను 460 పేజీలకు విస్తరింపచేస్తూ తాత్విక ప్రధానంగా విష్ణు సఖారామ్ ఖాండేకర్ 'యయాతి' నవల రాశారు. భీముడు నాయకుడుగా, బ్రాహ్మణవాద వ్యతిరేక భావజాలాన్ని ధ్వనింప చేస్తూ యం.టి.వాసుదేవన్ నాయర్ 'సెకండ్ టర్న్' (ఇంగ్లీష్ అనువాదం పేరు) రాశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ మూలాన్ని అతిక్రమించినవే. అలాగని తాడూ బొంగరం లేని కల్పిత రచనలు కావు. ఆధునిక దృకథంతో మూలకథను వ్యాఖ్యానించిన రచనలు.

తెలుగులో మాత్రం ఈ తరహా రచనలు చెప్పుకోదగినవి ఇంత వరకు రాలేదు. అదొక వెలితి అనుకొంటే, ఇప్పుడు వివాదాస్పదంగా మారిన యార్లగడ్డ లకీప్రసాద్ 'ద్రౌపది' ఈ ధోరణి రచనలకు ఒక థర్డ్రేట్ అనుకరణగా మన ముందుకు వచ్చింది. దీనికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించి ఉండకపోతే ఈ రచనను ఇంతగా పట్టించుకొని ఈ మాట అనవలసిన అవసరం ఉండేది కాదు. భావప్రకటనా స్వేచ్ఛకు అద్దంపట్టే శతకోటి రచనల్లో ఇదీ ఒకటని అనుకొనేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ఒక విశిష్ట గౌరవంగా, గుర్తింపుగా భావించి దానికోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఒక థర్డ్రేట్ రచనకు పురస్కారం ఎలా ఇచ్చారన్న ప్రశ్న అనివార్యమవుతోంది. నిజానికి ఈ రచన ఒక నెపం మాత్రమే. ఇక్కడ వాస్తవంగా వివాదాస్పదం అవుతున్నది సాహిత్య అకాడెమీ పురస్కారానికి ఉన్న విలువ, అర్హమైన రచనల ఎంపికలో అది అనుసరించే ప్రమాణాలు. ఇందులో అసలు ముద్దాయి 'ద్రౌపది' రచయిత కాదు-సాహిత్య అకాడెమీ, దాని తరపున జూరీగా వ్యవహిరించిన వాళ్ళు. సాహిత్య అకాడెమీ ప్రతినిధులుగా రాష్ట్రంలో వివిధ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు, నిర్వహిస్తున్న వాళ్ళు కూడా తెలుగు సాహిత్య ప్రపంచానికీ, పాఠకులకూ సంజాయిషీ ఇచ్చుకోవలసిందే.

'ద్రౌపది'కి పురస్కారం ఇవ్వడంపై కొందరు వ్యక్తం చేస్తున్న ఆక్షేపణలలోనూ బలం లేదు. అందులో 'బూతు' ఉందనడం భిన్నాభిప్రాయాలకు అవకాశమిచ్చి రచయితకు డిఫెన్స్ కల్పించే ఆరోపణ. భైరప్ప 'పర్వ'లో అంతకంటె ఎక్కువ 'బూతు' ఉందని ఆయన అనగలరు. అలాగే కృష్ణుడికీ, ద్రౌపదికీ అశ్లీల సంబంధం అంటగట్టారనడం పుస్తకం చదవకుండా చేసే అభియోగం. అలాంటిదేమీ అందులో లేదు. 'ద్రౌపది' రచయిత చేసిన తప్పు అన్నింటినీ మించినది. అది, గ్రంథ చౌర్యం... అక్షరాలా ప్లాగారిజం.
మూల కథలో ద్రౌపదితో ముడిపడిన ప్రతి ఘట్టంలోనూ రచయిత కవిత్రయ భారతంలోంచి వాక్యాలకు వాక్యాలను, వర్ణనలను ఎత్తిరాశారు. మచ్చుకు ఒకటి -
ద్యూతక్రీడకు ఆహ్వానితులై పాండవులు, ద్రౌపదితోపాటు హస్తినాపురానికి వెళ్ళినప్పుడు, ఆమెను చూసి గాంధారి కోడళ్ళు...
'ప్రపంచంలోని అందాన్నంతా ఒక్కచోట చేర్చి బ్రహ్మ ఈ తరుణీమణిని సృజించి ఉండవచ్చునని భావించారు. పాంచాలి వదన కమల వికాసం, ఆమె రూపు రేఖావిలాసాదులకు వారు విభ్రమం చెందారు.' ('ద్రౌపది').

నన్నయ భారతంలో సభాపర్వం ద్వితీయాశ్వాసంలో 160వ పద్యం ఇలా ఉంది -
అల లావణ్యపుంజంబు, నబ్జభవుడు/మెలతగా దీనియందు నిర్మించె నొక్కొ
కాని నాడిట్టి కాంతి యే కాంతలందు/నేల లేదని సామర్ష హృదయులైరి

'ద్రౌపది' రచనలో చాలా భాగం కవిత్రయ భారతం నుంచి ఎత్తిరాసినదే. ఆ సంగతిని ఎక్కడా ప్రస్తావించని రచయిత, మహాభారతానికీ, ద్రౌపది పాత్రకూ సంబంధించి వివిధ భాషల్లో వచ్చిన నూరుకుపైగా గ్రంథాలను సేకరించి, కూలంకషంగా చదివి పరిశోధనాపరంగా విషయ సేకరణ చేశానని చెప్పుకొన్నారు. పెద్దలు ఎవరెవరితోనో చర్చించాననీ, ఆధారగ్రం«థాలను ప్రదర్శనకు పెట్టాననీ రాసుకొన్నారు. కానీ ఈ రచనలో ఎటువంటి పరిశోధనా లేదు. ద్రౌపది గురించి ఎటువంటి 'కొత్త' కోణమూ లేదు. ముఖ్యంగా ఉండవలసిన వస్త్వైక్యత లేదు. పైగా చవకబారు చిత్రణలున్నాయి. ఉదాహరణకు, వస్త్రాపహరణ ఘట్టంలో ద్రౌపది 'సౌందర్యా'న్ని చూడలేకపోతున్నందుకు ధృతరాష్ట్రుడు చాలా విచారిస్తాడని ఈ రచయిత రాస్తారు.

వీటన్నింటినీ మించినది గ్రం«థ చౌర్యం... అసలు సిసలు ప్లాగారిజం. ర్యాండమ్ డిక్షనరీ ప్రకారం, ఏ రచయిత అయినా మరో రచయిత భాషనూ, భావాలనూ వాడుకొని లేదా అనుకరించి సొంత రచనగా ప్రకటిస్తే అది గ్రంథ చౌర్యం అవుతుంది. విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు గ్రంథ చౌర్యానికి పాల్పడితే దానిని 'అకడెమిక్ ఫ్రాడ్'గా పరిగణించి అభిశంసించాలి. వారిని విద్యా సంస్థల నుంచి, పదవుల నుంచి తొలగించవలసి ఉంటుంది.

అమెరికా లాంటి దేశాల్లో స్కూలు పిల్లలు కూడా నీచంగా భావించి సిగ్గుపడే గ్రంథ చౌర్యానికి సాహిత్య అకాడెమీ వంటి ఒక సంస్థ పురస్కారమిచ్చి సత్కరించడం బహుశా మన దేశంలోనే సంభవం కావచ్చు. 'ద్రౌపది'కి పురస్కారం ఇవ్వడం సాహిత్య అకాడెమీ, దాని జూరీ సభ్యులు తెలుగు సాహిత్యం పట్ల పాల్పడిన ఒక 'అకాడెమీ' ఫ్రాడ్. ఇది ఒక పెద్ద సాహిత్య 'స్కామ్'. 'ఫోర్ ట్వంటీ'తో సమానమైన నేరం. కురుసభలో అవమానానికి గురైన ద్రౌపదిలా తెలుగు సాహిత్యకారులందరూ భారతీయ సాహిత్య సభలో సిగ్గుతో తలవాల్చుకోవలసిన పరిస్థితి.

- కల్లూరి భాస్కరం

ఏ రచనకైనా అవార్డు వచ్చిందంటే రచనలో ఏదో కొత్తదనం, సాహిత్య విలువలూ ఉంటాయని పాఠకులు ఆశించటం సహజం. అందులోనూ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులను రచయితలూ, పాఠకులూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ఐతే డా॥యార్లగడ్డ లక్షీప్రసాద్ రాసిన 'ద్రౌపది' నవలకు అకాడెమీ అవార్డు రావటం సాహితీవేత్తలను విస్మయపరిచింది. ఈ నవల ఆద్యంతమూ బుద్ధిజనిత జాడ్యోన్మాదం. 'ద్రౌపది'ని రచయిత చిత్రించిన తీరు అవమానకరంగా, మూలానికి విరుద్ధంగా ఉన్నది.
ఈ నవలలోని నాయిక 'ద్రౌపది' కల్పిత పాత్ర కాదు.

ఆమె చుట్టూ తిరిగిన పాత్రలూ, కథాంశాలూ కల్పితాలు కావు. అలాగని అవి కచ్చితంగా చారిత్రకాలూ కావు; కాని భారతజాతి సంస్కృతికి మూలాలనదగినవీ జాతిధర్మానికి మార్గదర్శకంగా నిలిచినవీ అయిన పాత్రలవి. మహాభారతం భిన్న సమాజాల, సంస్కృతుల సమాహారం. వాటిలోని అంశాలన్నీ భిన్న ధర్మాధర్మాలను ప్రస్తావించేవే. ఆ కథలో ధర్మానికి ప్రతీకలనదగిన పాండవులను పట్టి ఉంచిన అంతస్సూత్రం ద్రౌపది.

యార్లగడ్డ వారు తమ నవలకు ఈ ద్రౌపదినే నాయికగా తీసుకున్నారు. మూల రచనకు విరుద్ధంగా ఆ పాత్రకు కామవికారాలను అంటగట్టారు. ఒక ఇతిహాసంలోని ప్రముఖ పాత్రను తన రచనకు నాయికగా తీసుకున్నప్పుడు ఆ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఈ విషయంలో రచయిత అజ్ఞానం బయటపడుతోంది. రచయిత కాముక దృష్టి నవలను కమ్ముకొని, అంగాంగ వర్ణన మితిమీరింది. ద్రౌపది నవవడికలో-సతీధర్మ నిర్వహణలోనూ, అధర్మ ప్రతిఘటనలోనూ కూడా రచయితకు కామ విన్యాసాలే కనిపించాయి. 'తెలివి యొకింత లేనియెడ..' తెలియని వాడిగా ఉండకుండా దుస్సాహసం చేశారు.

ఐదుగురు భర్తలతో ద్రౌపది ఎన్నెన్ని అవస్థలు పడిందో అని స్త్రీలు అబ్బురపడుతూ ఉంటే, ఆమె పడకగదిలో ఎన్ని అనుభవాలు మూట కట్టుకుందోనని యార్లగడ్డవారు కుతూహలపడి, శతసహస్రవిధాలుగా ఊహించుకున్నారు. ఆ ఉబలాటానికే ఇప్పుడు అవార్డు లభించడం పాఠకులకు మింగుడు పడటం లేదు.
భారతంలో ద్రౌపది జీవితంతో రాజీపడిన స్త్రీ. దమయంతి లాగా స్వయంవరంలో తనకు నచ్చిన వారిని వరించే స్వతంత్రం ఆమెకు లేకపోయింది. ఆ తర్వాత ఐదుగురు భర్తలతో కాపురం చేయవలసి వచ్చింది. ఆమె మనసూ, శరీరమూ ఎంత గాయపడినా రాజకీయ ప్రయోజనాలతో కూడిన సమాజ ధర్మానికీ, సతీధర్మానికీ తలవంచింది. కులధర్మపత్నిగా భర్తలను ఏకసూత్రంపై ఉంచేందుకు ద్రౌపది పడిన తాపత్రయం భారతంలో అడుగడుగునా కనిపిస్తుంది.

పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సత్యభామ, కృష్ణుడు వారిని చూడటానికి వెళ్ళారట. అప్పుడు సత్యభామ ద్రౌపదితో 'నీ భర్తలను ఏ విధంగా వశం చేసుకున్నావు? వ్రత చర్యలా, తపస్సా, స్నానమంత్ర ఔషధాదులా, విద్యల ప్రభావమా, మూలికల ప్రభావమా, జప హోమాదులా?' అని ప్రశ్నించిందట. అందుకు ద్రౌపది కొంచెం చికాకు పడినా 'భర్తలను వశపరచుకోటానికి వ్రతాలు, జపహోమాదులు, మందుమాకులు వంటివి దుష్టస్వభావంగల స్త్రీలు ప్రయోగిస్తారు. అలాంటి వారి పట్ల భర్తలు ప్రీతిచూపరు సరికదా, ఇంటిలో పాము ఉన్నట్టు భయపడతారు. ఉత్తమస్త్రీల ఆచరణ వేరుగా ఉంటుంది' అని జవాబిచ్చింది.

'అహంకారం విహాయాహం కామక్రోధౌచ సర్వదా/సదారాన్ పాండవాన్నిత్యం ప్రయతోపచారామ్యహం' (అహంకారమూ, కోరికా, కోపమూ లేకుండా సంయమనంతో పాండవులనూ వారి భార్యలనూ (సవతులను) నేను ఉపచరిస్తుంటాను), 'ప్రణయం ప్రతి సంహృత్య నిధాయాత్మా నమాత్మాని/శుశ్రూషు న్నిరభిమానా పతీనాం చిత్తరక్షిణీ' (మనసులోని ప్రణయావేశాలను అదుపులో ఉంచుకుంటూ నిరభిమానంతో వారికి శుశ్రూషలు చేస్తాను) - మహాభారతం - వనపర్వం.

ద్రౌపది చెప్పిన ఈ విషయాలను గమనిస్తే ఆమె మనసులో ఎంత అలజడినీ, కల్లోలాన్నీ భరిస్తూ వారితో కాపురం చేసిందో స్పష్టపడుతుంది. ఇవేమీ యార్లగడ్డ వారికి కన్పించినట్టులేదు. ఆమెనొక కాముకిగా ఆయన చిత్రించారు. కోరికనేది లేకుండా భర్తలను సేవించాననీ, మనసులోని ప్రణయావేశాలను బహిర్గతం కానివ్వననీ ద్రౌపది చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఆమె అణువణువునా కోరికతో రగిలిపోయినట్టు ఈ రచయిత చిత్రించటమేమిటి? మూల రచనలో చెప్పిన మాటలను కాదని కూట సాక్ష్యాలతో ఆమె మూర్తిమత్వాన్ని కించపరిచేందుకు అవాకులూ చవాకులూ రాయటానికి ఏమి అధికారం ఉన్నది? ఇంటి వ్యవహారాలూ, పాండవుల కోశాగారం విషయాలూ ద్రౌపది స్వయంగా చూసుకొనేదనీ ఎవరూ నిద్ర లేవకముందే లేచి, అందరూ నిద్రించాకనే నిద్రించేదని భారతం చెబుతుంది. ఇలాంటి ద్రౌపది గురించి-భర్తలు యుద్ధరంగంలో ఉన్నప్పుడుకూడా సుఖ శయ్యపై శయనించి, అందమైన కలలు కంటూ ఉండేదని యార్లగడ్డవారంటున్నారు. ఈ అసత్యపు రాతలు ఎవరిని రంజింప చేయటానికి?

తన భర్తలు మృదు స్వభావులు, సత్యశీలురు అని తెలిసికూడా వారికి చాలా జాగ్రత్తగా పరిచర్యలు చేస్తాననీ, కోపంతో ఉన్న పాములతో వ్యవహరించే రీతిగా వారితో వ్యవహరిస్తాననీ ద్రౌపది సత్యభామతో చెప్పింది. పామున్న ఇంటిలో ఉండటమే భయావహం. ఆ పాములతో ఉండవలసి రావటం - వాటిని వశపరుచుకోవలసి రావటం, ఒళ్ళు జలదరించే విషయం. ఇంత భయభక్తులతో భర్తలను సేవించే ద్రౌపది గురించి, ఆమె తన శరీర సౌష్టవంతో ఎత్తయిన వక్షస్థలంతో, కేళీ విన్యాసాలతో వారిని వశపరచుకొన్నట్టు రచయిత రాయటం క్షమార్హం కాదు. ద్రౌపదిని శ్రీకృష్ణుని ప్రియసగా ఈ రచయిత వర్ణించిన తీరు బాధాకరం.

స్త్రీ-పురుషుల ఆత్మీయతను వక్రీకరించే సంకుచిత మనస్తత్వం నుండి ఇటువంటి రచయితలు బయటపడకపోవటం తిరోగమనమే. లలితమైన, స్నిగ్థమైన భావాలను ఈ నవల దూషితం చేసింది. దీనిని ఉపేక్షిస్తే భారతం చదవని యువత ఈ చిత్రణనే ప్రమాణంగా భావించే ప్రమాదం ఉంది.
ఈ నవలా రచనలోని బూతులు సాధారణ పాఠకుల మనస్సులను గందరగోళ పరుస్తున్నాయి. పైగా దీనికి సాహిత్య అకాడమీ అవార్డు సాధించుకోవటం ద్వారా రచయిత మరింత దౌష్ట్యానికి పాల్పడ్డారు. ఈ నవలను అవార్డుకు ఎంపిక చేసినవారి చిత్తవృత్తినీ, వివేక భ్రష్టతనూ ఏమనాలో తెలియటం లేదు.
- డా॥ బి.విజయ భారతి

అనర్హమైన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమా!


యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (విశాఖపట్నం, మాజీ రాజ్యసభ సభ్యులు) రచించిన ద్రౌపది అనే పుస్తకానికి ఈ సంవత్సరం కేంద్రసాహిత్య అకాడమీ సాంవత్సరిక ఉత్తమ పురస్కారం (తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమోత్తమ రచన) ప్రకటించింది. ఈ విషయం మీరు విని ఉంటారు. పత్రికలలో చూసి ఉంటారు. ఈ పురస్కార నిర్ణాయక న్యాయమూర్తులుగా శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీమతి వి.ఎస్.రమాదేవి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలు వ్యవహరించారు. ఈ పుస్తకం ఇటు తరువాత హిందీ, ఇంగ్లీషేకాక, సమస్త భారతీయ భాషల్లోకి తెలుగు సాహిత్యం నుండి ప్రముఖ పరమప్రశంసనీయమైన ఉత్తమ రచనగా అనువాదం పొందుతుంది.

కాని నిజానికి ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య ఆత్మీయ అభిమానులు, ప్రేమతత్పరులు, అభిజ్ఞులు, రచయితలు, తెలుగు సాహిత్య ఆరాధకులు అయిన ప్రముఖులు ఎందరో నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు. న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రస్తావనలు, ప్రసక్తులు ద్రౌపది పుస్తకంలో ఉన్నాయి. కాబట్టే వీటిని గూర్చి మిమ్మల్ని అడుగుతున్నాము.

1. ద్రౌపది పుస్తకంలో 29వ ప్రకరణం శ్రీకృష్ణు ని ఇష్టస పేరుతో ఉంది. ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసగా ఈ మహాప్రజ్ఞాశాలి, సాహిత్య మేధావి అయిన రచయిత అభివర్ణించాడు. పరిచయ వాక్యాలలో కూడా శ్రీకృష్ణుని ఇష్టసగా వర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా? మీరు విన్న, చదివిన, పెద్దలవల్ల తెలుసుకున్న పురాణ కథలలో కానీ, వ్యాఖ్యానాలలో కానీ ద్రౌపది శ్రీకృష్ణుడి ఇష్టసగా ఎపుడైనా, ఎక్కడైనా ప్రసక్తమైందా?

2. ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా? ద్రౌపది పుస్తకంలో రచయిత ఇలాంటివి చాలా వర్ణించాడు.

3. ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుంచి నట్లు, పరవశత్వం చెందినట్లు మీరు ఏ పుస్తకంలోనైనా చదివారా? ఎవరి వల్లనైనా విన్నారా? మతానికి, ధర్మానికి, సంస్కృతికి, సాహిత్య వారసత్వానికి, జాతీయతకు, నీతికి ఇలాంటి వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?

4. శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రవక్త. భారతీయ మత, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాణస్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మను పలు సందర్భాలలో రచయిత అతి నీచంగా ప్రస్తావించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇలా వక్రదృష్టితో చిత్రీకరించుట వలన కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత న్యాయనిర్ణేతలదే. సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి 'ద్రౌపది' గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించవలసినదిగా కోరుచున్నాము.

దాశరథి రంగాచార్య
మునిపల్లె రాజు
వీరాజీ
సి.హెచ్.లకీనాథాచార్యులు
కె.యాదగిరాచార్యులు
డి.కృష్ణారెడ్డి
టి.శివరామకృష్ణ
పి.గోపాలకృష్ణ
ఎ.అనంతకృష్ణారావు
బి.రామరాజు
ఆచార్య కొలకలూరి ఇనాక్
కోవెల సంపత్కుమారాచార్య
రవ్వా శ్రీహరి
నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి
డాక్టర్ త్రిపురనేని హనుమాన్చౌదరి
బి.సుబ్రహ్మణ్యశర్మ
ఎం.కులశేఖరరావు
డాక్టర్ పి.నాగేశ్వరరావు

కావ్యాత్మక నవల 'ద్రౌపది'
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవల 'ద్రౌపది' వారి మౌలిక ఆలోచనా శక్తికి నిదర్శనం. పురాణాలలో ఈ కథని వేదవ్యాసుని మహాకావ్యం 'మహాభారతం' నుం డి స్వీకరించబడినప్పటికీ పాత్రను నాయికకు అనుగుణంగా మలిచే ఈ మహత్కార్యం లక్ష్మీప్రసాద్ తనదైన శైలిలో చేసారు. పౌరాణిక, ఐతిహాసిక నవలలో రచయితకి తన అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచే సదుపాయం తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే కథ ముందుగానే తయ్యారయ్యి ఉంటుంది. కాకపోతే ఆ సందర్భాలకు కొత్త అర్థాల్ని మాత్రం ఇవ్వగలుగుతాడు. అతడు తన పాత్రల్లో తాదాత్మ్యత చెంది తన అనుభవాల సంవేదనలో యదార్థాన్ని వెదుకుతాడు, ఇంకా ఆ పదార్థాన్ని తన కళాత్మకమైన భాష ద్వారా పాఠకులకు తెలియజెప్తాడు. ఐతిహాసికతను ప్రస్తుత సమాజానికి వీలైనంత దగ్గరగా తీసుకురావడం మీద, ఈ కథ నిన్ననే జరిగినట్లు, ఆ పాత్రలతో తనకు బాగా పరిచయం ఉన్నట్లు భావనను కలిగించడం మీదనే రచయిత విజయం ఆధారపడి ఉంటుంది.
ఈ విలక్షణత కళాత్మక ప్రభావాన్ని పాఠకులపై చూపించడంలో లక్ష్మీప్రసాద్ కృతకృత్యులయ్యారనడంలో సందేహం లేదు. వారి ద్రౌపది పౌరాణిక నాయిక అయినప్పటికీ అనుభూతి దృష్ట్యా ఏదో కృత్రిమ గరిమత్వాన్ని సంతరించుకున్నట్లు అనిపించదు. సీత, సావిత్రి, దమయంతులతో సమానమయినది కాకపోయినా ఆమెలో ఒక సహజమైన స్త్రీ సంవేదన ఉంది. స్త్రీ అస్తిత్వం అన్ని కోణాలను ఆమెలో చిత్రించడానికి రచయిత ప్రయత్నించారు. నేటి స్త్రీవాద ఆందోళనలు ఏ అస్తిత్వాన్నైతే వెదుకుతున్నారో, నేటి స్త్రీవాద రచయితలు ఏ అస్తిత్వాన్నైతే పశ్చిమ దేశ స్త్రీవాద సిద్ధాంతాల్లో వెదుకుతున్నారో అవన్నీ లక్ష్మీప్రసాద్ 'ద్రౌపది'లో మనకు సహజంగానే కనిపిస్తాయి.
స్త్రీ మనోభావాలను తన రచనా కౌశలంతో కలబోసి నవలను మలచిన తీరు నేటి చాలామంది స్త్రీవాద రచయితలకు కూడా సాధ్యపడదనడం అతిశయోక్తి కాదు. తన కథానాయికను ఏదో ఒక దృక్కోణంలో నుంచి మాత్రమే చూపించకుండా పలు కోణాలలో చూపించడమే ఈ రచయిత రచనాపటిమకు తార్కాణం. సృష్టి ప్రారంభం నుండి వైజ్ఞానిక యుగమైన ఈ ఇరవయ్యొకటవ శతాబ్దం వరకు కూడా స్త్రీ మనసు, కార్యప్రణాళిక మారలేదు. పరిపూర్ణంగా చూస్తే ఆమె ఒక స్త్రీగా మాత్రమే నిలిచింది. ఆమెపైన ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆమె వ్యక్తిత్వం చిన్నాభిన్నమవుతూనే వచ్చింది. కానీ విచారించదగ్గ విషయమేమిటంటే రచయితలు స్త్రీని ఒక పరిపూర్ణ స్థితిలో చిత్రించే ప్రయత్నం చెయ్యలేదు.
తన రచనాధర్మితను నిర్వర్తిస్తూ ద్రౌపదిని ఇటువంటి పరిపూర్ణ స్థితిలో చిత్రించడమే వారికి, వారి రచనకు కూడా ఒక కొత్త అర్థాన్నిస్తుంది. లక్ష్మీప్రసాద్ సంవేదనాత్మక సామర్థ్యం నిజంగా కొనియాడదగినది. ద్రౌపది అస్మితా చైతన్యపు మూలబిందువు మీదే ఆయన దృష్టి కేంద్రీకరించబడి ఉంది. ఈ మూల బిందువును విస్తరించే దృష్టితోనే మొదటి నుండి చివరి వరకు ద్రౌపది పాత్రను చిత్రించారు. ద్రౌపది అస్మితకు సంబంధించిన నిజాలు ఒక స్త్రీకి సంబంధించిన నిజాలు. అవి ఆమె శారీరక, మానసిక నిర్మాణంతో ముడిబడి ఉంటాయి.
ఈ యదార్ధాన్ని లక్ష్మీప్రసాద్ తన రచనాధర్మితగా భావించి ద్రౌపది పాత్రను మాత్రమే సృష్టించక, ఆ చరిత్రను సజీవంగా, చైతన్యవంతంగా మలచడానికి ఒక విస్తృతమైన రచనా ఫలకాన్ని కూడా నిర్మించారు. ఈ విస్తృత పరిచే ప్రక్రియలో ఒక గడిచిన యుగం చాలా కాలం తర్వాత మళ్లీ సజీవంగా పాఠకుల ముందుకు వచ్చింది. ద్రౌపది మాత్రమే కాదు, దాని సాఫల్యానికి నిర్మించిన ఆ యావత్తూ రచనా వాతావరణం విలక్షణమైనది. ఈ కథ విభిన్న గ్రంథాల్లో విభిన్న శైలుల్లో చెప్పబడింది. కానీ లక్ష్మీప్రసాద్ ద్రౌపది ఆ చెదురుమదురైన అస్తిత్వాన్ని తెలియజెప్తుంది. ఈ దృష్టితో 'ద్రౌపది' పూర్తిగా ఆయన మౌలిక రచన. స్త్రీ విమర్శ గురించి చర్చించే రచయిత్రులకు స్త్రీ అస్తిత్వం నేటికి కూడా కష్టసాధ్యమైన విషయమే.
స్వయంగా స్త్రీ అయ్యుండి కూడా వారు గుర్తించలేని స్త్రీ అస్తిత్వాన్ని లక్ష్మీప్రసాద్ పరిచయంతోసహా 'ద్రౌపది' నవల ద్వారా ఎంతో సహజంగా వెలిబుచ్చారు. లక్ష్మీప్రసాద్ ద్రౌపది అనంత జిజీవిష కేంద్రంలో నిలబడి ఉంది. జీవన ప్రవాహం ఆమె చేతనా-శక్తిలో మిళితమయ్యుంది. ఎన్నో జన్మల అసంతృప్తి ఆమె సహచరి. ఆమె కామాగ్ని, కామవిదగ్ధ, ఇంకా అనంత కోరికల నిలయం. భావం-విభావం-అభావం ఆమె వ్యక్తిత్వంలో కలబోసి ఉన్నాయి. కానీ అన్ని రూపాలలోనూ ఆమె సౌందర్యవతి - శరీర, అశరీర (ఆత్మ) సౌందర్యం. దాన్ని చూడాలని, అనుభవించాలనీ ప్రతీవాళ్లు ఆకాంక్షిస్తారు. సృష్టి-సృజన విన్యాసము, ప్రళయ జ్వాల అగ్ని రూపము రెండూ ఈ సౌందర్యమే.
ఇది రక్త-మాంస నిర్మితము, అపార్థివమయి పరమ తృప్తినిచ్చేది కూడాను. కానీ ఇదంతా ఇతరులకోసమే. ద్రౌపది పరమ అసంతృప్తే ఆమె చైతన్య-సత్యము. ఈ అసంతృప్తి కామార్తి జ్వాలల్లో తనను తాను దహించివేసుకుంటూ, తన సాంగత్యంలోకి వచ్చినవారిని కూడా దహించివేస్తుంది. ఆత్మసఖుడైన శ్రీకృష్ణుడు మాత్రమే ఆమెకు కొద్దిపాటి అసంతృప్తిని రుచి చూపించగలిగాడు. అది కూడా ఎందుకంటే ఆమె స్వయంగా 'కృష్ణా', ఇంకా ఆమె తన అస్తిత్వ చైతన్యం పరమ భావంతో కృష్ణుణ్ణి స్పర్శిస్తుంది కనుక. యజ్ఞజ్వాలల నుండి వెలువడిన 'యజ్ఞసేన' వ్యక్తిత్వమంతా జీవితాంతం ఈ జ్వాలలతోనే చుట్టుముట్టబడి ఉంది. కానీ 'ద్రౌపది' రచయిత లక్ష్మీప్రసాద్ ఈ యజ్ఞశిఖల జ్వాలల నుండి ఒక యుగాంతకార అయినటువంటి ఫలితాన్ని పొందారు.
ఈ మహత్కార్యంలో ఆయన 'అభినవ వ్యాసుని' పాత్రను పోషించారు. కథాపరంగా చూస్తే ద్రౌపదిలోని కథ కావ్యాలు-మహాకావ్యాలు, లోకకథల్లో చర్చించబడిందే. కానీ ద్రౌపది అన్వేషణ కేవలం ఘటనల అన్వేషణ కాదు. ద్రౌపది సృష్టి చైతన్య రహస్యనీయత గొప్ప రహస్య సత్యం. ఎప్పటినుండో ద్రౌపదుల మనోభావాలను అణగద్రొక్కేసిన లేక నిర్లక్ష్యంచేసిన సామాజిక కట్టుబాట్లను లక్ష్మీప్రసాద్ ఒక యదార్థ రూపం లో ఈ నవల ద్వారా మనముందుంచారు. బహుశా ద్రౌపది ప్రతిహిం స, ప్రతివాదం ఈ నిజంపైన ఆధారపడి ఉండవచ్చు. ఆమె పురుషభావాల యెడల సమర్పణ అనే యదార్థానికి బందీ, కానీ ఆ సమర్పణ ఒక వర్గం వైపు వారలకు మాత్రమే పరిమితమైపోయింది.
ఆమె మనస్ఫూర్తి గా ఎవరినైతే కోరుకుంటుందో వాళ్లు ఆమెను ప్రేమించరు. ఆమె యుధిష్ఠరుడికి మహారాణి అవుతుంది, భీముడికి ఆరాధ్యా, అర్జునుడికి విజితా, నలుడికి కవితా, సహదేవుడికి మాతృశక్తి. ఆమె రకరకాల రూపాలకు రకరకాలుగా స్వీకృతి లభిస్తుంది. ఆమె ఎవ్వరినీ తిరస్కరించదు. కానీ ఆమె అసలైన కోరిక సమగ్రదానం. దానిని వీరిలో ఎవ్వరూ స్వీకరించరు. ఒక్క కృష్ణుడు మాత్రమే ఆమెను ఆ సంపూర్ణత్వంతో స్వీకరిస్తాడు. కానీ, అప్పటికి ఆమెలోని కోరిక అణగారిపోతుంది. మహర్షి వ్యాసుడు 'మహాభారతం' పేరుతో ఆ యుగం మహా కావ్యాన్ని రచించాడు.
కానీ లక్ష్మీప్రసాద్ అవే ఆధారాలతో, ఆ ఘటనలనే ఆధారంగా చేసుకుని జీవిత మహాకావ్యాన్ని వెదికారు. ద్రౌపది కథను చెబుతూ ఆయన స్వయంగా ఆ ఘటనల నుండి బయటపడి కథలో ఒక ప్రవాహాన్ని సృష్టించారు. ఈ ప్రవాహం గద్యాత్మకం కాకుం డా స్వచ్ఛమైన కావ్యాత్మకమైనది. పాఠకులకోసం ఏ అనుభూతుల దృశ్యాల్ని సిద్ధం చేసారో అది గద్యంలో అసాధ్యం. అందువల్లనే ఆయన తన నవలా రచనకు భాషా-శైలిలను కావ్యత్మకంగా తీర్చిదిద్దారు. దీనివల్ల పాఠకులు ఆనందపడడమే కాకుండా ముగ్ధులవుతారు కూడా.
'ద్రౌపది' వంటి వేరే నవలను ఆయన రాశారో లేదో తెలియదుగానీ, 'ద్రౌపది' రచనతో ఆయన గతం నుండి వర్తమానాన్ని పేర్కొంటూ భవిష్యత్తుకు మార్గం చూపించే రచయితల కోవలో నిలబడ్డారు. 'ద్రౌపది'ని చదివిన ఏ పాఠకుడికైనా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆ బుద్ధభగవానుని పాత్రనే పోషిస్తున్నారన్న భావం కలగడం ఎంతో సహజం.
- రాంజీసింగ్ ఉదయన్ (10 నెలల క్రితం హిందీ 'ద్రౌపది' నవలపై రాసిన ఈ సమీక్షను తెలుగు చేసినవారు డా.శివకోటి నరసింహం)

20 వ్యాఖ్యలు:

తెలుగు వెబ్ మీడియా said...

వ్యాస మహాభారతమే కాకుండా ఇతర భారతాలు కూడా ఉన్నాయనీ, లక్ష్మీ ప్రసాద్ గారు ఇతర భారతాల నుంచి కూడా కథలని వ్రాశారనీ అంటున్నారు. వ్యాస మహాభారతే కాకుండా ఇతర భారతాలు కూడా ఉన్నాయన్నది నిజమైతే బైబిల్ లో apocryphal texts (దాచి పెట్టబడిన రచనలు) ఉన్నట్టే హిందూ మత గ్రంథాలలో కూడా apocryphal texts ఉన్నాయని ఒప్పుకోవాలి.

Vasu said...

ఇంత కంటే గోప్పవేమి లేవా ఏంటి ఈ ఏడాది. పదవీ, పలుకుబడి, డబ్బు ఉంటె ఏదన్నా చేయచ్చు,ఏ అవార్డు నైనా నేగ్గచ్చు మన దేశం లో అని చెప్పడానికి దీని కంటే గొప్ప ఉదాహరణ లేదు.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

ప్రవీణ్, మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఇంతకు మీరు ద్రౌపదీ చదువుతున్నారా?
వాసు, అవునండీ, మనకు బయటకు తెలియనివి చాలానే జరుగుతుంటాయి. అలా అని అవార్డులు వచ్చినవన్నీ ఏదో రకంగా పైరవీలతో వచ్చినవని అనుకొనక్కరలేదు. అవార్డ్ పుస్తకాలు చదివితే మనకే తెలిసిపోతుంది. అది అమాంబాపటతా...లేక నిజం గా అవార్డ్ రాదగ్గ పుస్తకామా అని...

Kathi Mahesh Kumar said...

అర్హతలేదు అంటున్నవారి వాదన నవల మీద కాకుండా నవలలోని (లోలేని) నైతికత మీద ఉంది. యార్లగడ్డ త్రిసభ్యకటీని లోబర్చుకుని అవార్డు సంపాదించాడు అనేవారి దగ్గర ఆరోపణ ఉందేగానీ ఆధారం లేదు. ఈ రెండిటి బేసిస్ మీదా నిర్ణయాలు నిజంగా consider చెయ్యాలా?

తెలుగులో ఇంతకంటే అవార్డుకర్హమైన పుస్తకాలున్నాయని అంటున్నారు. మచ్చుకకి కొన్ని పేర్లు చెబితే వాటిని చదివి తరంచడానికి మాలాంటివాళ్ళు చాలా మందే ఉన్నాం.

Kalpana Rentala said...

మహేశ్,
హిందీ ద్రౌపదీ మీద సమీక్షా వ్యాసం తెలుగు అనువాదం తప్ప తెలుగులో నవలను మెచ్చుకుంటూ కానీ, అందులో ఏమైనా వున్న మంచి పాయింట్ల గురించి గానీ ఒక్క వ్యాసం కూడా రాలేదు. అది ఆశ్చర్యకరం. మనమెందుకులే ఈ గొడవలో తలదూర్చటం అని రచయితలు వూరుకుండిపోయారేమో అనుకోవాలి. కానీ కల్లూరి భాస్కరం గారి వాదన మాటేమిటి? మూలం నుంచి వర్ణనాలు యథాతధంగా దించేశారన్నదాని గురించి...
ఇప్పటిదాకా వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న రచయితలు, పుస్తకాల వివరాలు కావాలంటే ఇక్కడ చూడవచ్చు.
http://www.sahitya-akademi.gov.in/old_version/awa10321.htm#telugu

Kathi Mahesh Kumar said...

కల్లూరి భాస్కరం గారి వదనలో ఒక చిన్న లొసుగుంది గమనించండి. వారు ఉదహరించిన గద్యం యార్లగడ్డదైతే, పద్యం నన్నయది. దాన్ని యధాతథంగా కాపీకొట్టడం అనే అభియోగం మోపారు. అదెలా???

పద్యం యొక్క భాష్యం లేదా తెలిసొచ్చిన అర్థం చెబితే దాన్ని ప్రేజరిజం అంటారా?

"ఎవరైనా వాడిన భాషను,భావాన్నీ వాడుకొని లేదా అనుకరించి సొంత రచనగా ప్రకటిస్తే అది గ్రంథ చౌర్యం అవుతుంది" అని నిర్ణయిస్తే ఈ భూప్రపంచంలో ఎవరూ ఏదీ రాయలేరు.Give me one original word and a thought that can be called your's?

తెలుగు వెబ్ మీడియా said...

కల్పన గారు. నవల చదువుతున్నాను. నేను చేసేది వ్యాపారం. ఖాళీ టైమ్ దొరికినప్పుడు చదువుతున్నాను. సల్మాన్ రష్దీ వ్రాసిన శటానిక్ వర్సెస్ పై వచ్చిన విమర్శలు లాంటివే ఈ విమర్శలు.

Kalpana Rentala said...

మహేశ్,
గ్రంధ చొర్యామ్ అన్న ఆరోపణలో వున్న ఒక చిన్న లోసుగుని చూడమన్నాను. యార్లగడ్డ మూలం నుంచి తీసుకుంటే చౌర్యం అంటున్నారు. సొంతంగా రాస్తే తప్పు అంటున్నారు. రెండూ తప్పులే అనడంలో వున్నదాన్ని నేను గుర్తించమన్నాను. అర్ధమైంది అనుకుంటాను.

తెలుగు వెబ్ మీడియా said...

కొంత మంది ఈ నవల అశ్లీలం అని ఎలా విమర్శిస్తున్నారో విమర్శించేవాళ్ళకైనా తెలుసా? ఒకవేళ ఎవడైనా ఈ నవల సెక్స్ నవల అనుకుని చదవడానికి ప్రయత్నిస్తే అతనికి బోర్ కొట్టడం జరుగుతుంది. నవల చదవకుండా విమర్శిస్తే విమర్శలు ఇలాగే ఉంటాయి.

మాలా కుమార్ said...

వీటిల్లో రాసినవి ఎంతవరకు నిజమో , కరెక్టో కాదో కూడా నాకు తెలీదు , కాని , హిందువులు పవిత్రమైన గ్రంధాలుగా బావించే పురాణాలలోని పాత్రల మీద ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రాసేయటము బాధగా వుంటుంది . రాముడిని కామెడీగా చూపించినా , ద్రౌపతిని వేశ్యగా వివరించినా సహించేంత సహనం హిందువులకేవుంది . అదే బైబిల్ లోని పాత్ర ఏసుక్రీస్తు ను ఎవరైనా అవతార్ గా తీసే ప్రయత్నమైనా చేయగలరా ? ఖురాన్ ను విమర్షించగలరా ? లేదే . ఏం ? ఎందుకని ?
కాలమాన పరిస్తితులను బట్టి అప్పటికి తగిన విధముగా అందరికీ ఆదర్షప్రాయముగా వుండేటట్లు , ఆయా పాత్రలను మలచటము జరిగింది . అందులో ఈనాటికీ పాటించవలసిన మంచి ఎంతో వుంది . కాని , కాకరకాయను కీకరకాయ గా చేస్తున్నారు హుం .

తెలుగు వెబ్ మీడియా said...

ఈ నవలలో ద్రౌపదిని ఎక్కడా వేశ్యగా చూపించలేదు. ఈ నవలని అశ్లీలం అని విమర్శిస్తున్నవాళ్ళు నిజంగా ఈ నవల చదివారా? http://blogzine.sahityaavalokanam.gen.in/2010/01/blog-post_3588.html

durgeswara said...

కన్నవాళ్లనడుమ సాగిన సృష్టికలాపాన్ని కూడా కడురంజుగా చిత్రించి అమ్ముకోగల నికృష్టులకు నెలవైనది కలియుగం లో నేటిస్థితి , వీళ్లకు మామూలు భాషలలో సమాధానం చెప్పటం శుద్ధదండుగ . మనసులు కుళ్ళి కంపుకొడుతున్నాయి వీరికి అదంతా సమాజం మీదకు విసురుతున్నారు. ఇది సమాజం లో పెరిగిన ఒక దుష్టాంగం . శస్త్రచికిత్స జరగాల్సిందే. వేరు మార్గం లేదు.

Anonymous said...

దుర్గేశ్వర,
ఎవరు కన్నవాళ్ళు ఇక్కడ? ద్రౌపదా? ఎవరికి? సాహిత్యానికి సంబంధించి ద్రౌపది ఒక పాత్ర మాత్రమే! పాత్ర చిత్రణలో లో ఔచిత్యం ఉందా లేదా అనేది మాత్రమే చూడాలి! శివపార్వతులూ ఆది దంపతులే! తల్లి దండ్రులే! వారి శృంగారం దివ్యమెందుకైంది? ద్రౌపది శృంగారం ఎందుకు నీచమైంది? ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారనేగా? ఆమెకు ఒక భర్త ఉండి ఇవన్నీ రాస్తే ఓకేనా?

నికృష్టుడు, నీచుడు,వాడు వీడు అని మీరు రచయిత గురించి (ఇంకో బ్లాగులో కూడా మీరు ఇలాంటి పదాలు వాడటం చూశాను) ఆన్ లైన్లో నోరు జారితే మీకే నష్టమని గ్రహించండి. ఇప్పుడు బ్లాగుల్లో రాసినవాటి మీద చర్య తీసుకునే అవకాశముంది.

మర్యాద వహించండి. ఇంకో సారి రచయితనుద్దేశించి చెత్తగా మాట్లాడితే సహించేది లేదు.మీకిష్టం లేకపోతే చదవకండి, దూరంగా ఉండండి. జడ్జ్ మెంట్ పాస్ చేయకండి.

భావన said...

అన్ని వ్యాసాలు మొత్తంమీద సారాంశం చదివేక నాకైతే యార్లగడ్డ గారి చేతి లో దౌష్ట్యాని కి బలైన ద్రౌపది అనిపించిది. తరాలు మారిన యుగాలు మారి నా మనసులలోని క్రూరత్వం మారదు కదా సామి.

Kalpana Rentala said...

మాలాకుమార్ గారు, అదేమీ లేదు అన్నీ మత గ్రంధాలు విమర్శలకు గురవుతూనే వుంటాయి. మనకి ఎక్కువగా హిందు మత గ్రంధాల గురించే తెలుసు కాబట్టి వాటి మీద నే దాడి జరుగుతోందని భ్రమ పడతామ్. పురాణాల్లో మంచి తో పాటు ఈ కాలానికి సరిపడనివి కూడా వున్నాయన్నది వాస్తవం. మనం వొప్పుకున్నా వొప్పుకోకపోయినా. అన్నట్లు స్వాతి లో వ్యాసం నాదే.
దుర్గేశ్వర గారు, అనానిమస్ గారు చెప్పింది నిజం. మీకు నచ్చక పోతే దూరం గా వుండటం మంచిది కదా. ఆలోచించండి.
భావనా, మీరు చదవకుండా ఆ అభిప్రాయానికి రావటం మంచిది కాదేమో?

మాలా కుమార్ said...

ఐతే అప్పుడప్పుడు పత్రికలలో కనిపించే కల్పనా రెంటాల మీరే నన్నమాట . బ్లాగులో ,కష్టపడి అబివృద్ది సాధించారు అని మెచ్చుకున్నారు . మీఅంతటి పెద్దరైటర్ నన్ను మెచ్చుకున్నారంటే చాలా సంతోషం గా వుంది . థాంక్యు . ( ఇక్కడ ఈ చర్చలో నేను ఈ అప్రస్తుత ప్రసంగం చేస్తే క్షమించండి . నా ఆనందాన్ని ఎక్కడ వెలబుచ్చాలో తెలీక ఇక్కడ చెప్పాను ) .

Vasu said...

@ మహేష్ - సాహిత్య అకాడమీ ఇవ్వదగ్గ నవలగా అనిపించలేదు అని మీరే అన్నారుగా. మళ్ళీ మేము చెప్పడమ ఎందుకు అవార్డుకు అర్హమైనవి ఏమిటో.
నేను పుస్తకాలు మరీ ఎక్కువ చదవను కానీ ఇంతకంటే గొప్పవి ఏమి లేవన్నంత దుస్థితి లో తెలుగు సాహిత్య ప్రపంచం లేదని నా నమ్మకం.

@ కల్పన - "అన్నీ మత గ్రంధాలు విమర్శలకు గురవుతూనే వుంటాయి.........వాటి మీద నే దాడి జరుగుతోందని భ్రమ పడతామ్". కానీ దాడి జరిగినపుడు దాన్ని ఖండించడం వదిలేసి సపోర్ట్ చెయ్యడం మాత్రం హిందువులకే చేతనవుతుంది. అంత విశ్శాఆఆఆఆ...ల దృక్పధం మాత్రం కేవలం హిందువులకే సొంతం.

Anonymous said...

ఇంతకీ ఈ సందర్భంలో అడిగిన నాలుగు సందేహాలకీ సమాధానం రచయితనుండి కాని; న్యాయమూర్తులనుండి కాని వచ్చినట్టుగా లేదు?

 
Real Time Web Analytics