నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, January 15, 2010

సంచలనాత్మక ‘ ద్రౌపది ‘ –కొన్ని ఆలోచనలు !

ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా విషయం లోకి వెళితే, ఇప్పుడు జరుగుతున్న వివాదం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ “ ద్రౌపది “ పేరిట రాసిన పుస్తకం లోని అంశాలకా? లేక దానికి సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చినందుకా? అయిదారేళ్ళ క్రితం ఈ పుస్తకం సీరియల్ గా వచ్చినప్పుడు ఇలాగే వాద, వివాదాలు చెలరేగాయి. ఆ సీరియల్ 2006 లో పుస్తకం గా బయటకు వచ్చింది కూడా. ఇప్పుడు జరిగింది దానికి సాహిత్య అకాడమీ అవార్డ్ రావటం మాత్రమే. సాహిత్య లోకంలో ఇలాంటి వివాదాలు అతి సహజం. వీటికి ఎలాంటి చారిత్రక విలువ వుండబోదు.

నిజంగా అవార్డ్ లు గొప్ప పుస్తకాలకే వస్తున్నాయా? అలా అవార్డ్ వచ్చిన పుస్తకాలు భారతీయతకు (?) అదనపు గౌరవాన్ని తెచ్చిపెట్టగలవని, అటు అకాడమీ వాళ్ళు, ఇటు రచయితలు, అలాగే మామూలు పాఠకులు నమ్ముతున్నారా? ఇదే అంశం మీద అంటే ‘ ద్రౌపది ‘ గురించి ఒరియా రచయిత్రి ప్రతిభా రాయ్ (రే) ‘ యజ్ణసేని ‘ పేరిట పుస్తకం రాసింది. దానికి కూడా అవార్డ్ వచ్చింది. దాని మీద కూడా గొడవ జరిగింది. కానీ అవార్డ్ మాత్రం ఇచ్చారు. వివాదాలు చేసే తీరిక, సమయం, వీలైతే డబ్బు కూడా వున్నవారు అది కూడా చదివి దాని మీద కూడా గొడవ చేయవచ్చు. లేదా ‘ మానవ హక్కుల ‘ కోసం లక్ష్మీప్రసాద్ తో పాటు ఆమె మీద కూడా కేసు పెట్టుకోవచ్చు. సాహిత్య అకాడమీ కూడా ఒక ప్రభుత్వ సంస్థ. అన్నీ చోట్లా లాగానే అక్కడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం వుంటాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగు కు సంబంధించి ఇదీ మరీ ఎక్కువ. భారతీయ భాషా సాహిత్య సమావేశాలు జరిగితే తెలుగు నుంచి కథ లకో, కవిత్వానికో ఒక రచయిత పేరు ప్రతిపాదించవలసివస్తే ఏకాభిప్రాయం కాదు కదా. కనీసం సగం మంది అయిన వొప్పుకునే ఒక్క రచయత మన దగ్గర లేరు. ఒక రచయిత ని ఎంపిక చేస్తే అతను / లేదా ఆమె మీద ముందుగానే సాహిత్య అకాడమీ వాళ్ళ దగ్గర మన తోటి రచయితల నుండి పిటీషన్లు వెళ్తాయి. ఆరోపణలు ఫాక్స్ రూపం లో చేరుకుంటాయి. ఇందుకే తెలుగు వాళ్ళతో ప్రతి సారి చికాకులే అని అగ్రహారం కృష్ణమూర్తి ఒక మీటింగ్ అప్పుడు వ్యక్తిగతంగా ప్రస్తావించారు. అదే అభిప్రాయం సచ్చిదానందన్ ది కూడా. సాహిత్య అకాడమీకి సభ్యులైన ప్రముఖ రచయితలందరిదీ కూడా. ఈ గొడవలతో ఒక్కొక్కరికి తలలు బొప్పి కట్టి వూరుకున్నారు.

మనకున్న ఒకే ఒక్క గొప్ప రచయత విశ్వనాధ సత్యనారాయణ గారు అంటేనే మనలో చాలా మందికి గౌరవం లేదు, ఆయన సంప్రదాయవాది అని విమర్శిస్తారు. సంప్రదాయవాది అనేది వ్యక్తిగతం. కానీ ఆయన ప్రతిభా, వ్యుత్పత్తుల మాటేమిటి? పాటి పాండిత్యం వున్న రచయిత మళ్ళీ తెలుగు దేశం లో పుట్టలేదంటే అతిశయోక్తి కాదు. అందరూ వొప్పుకోవాల్సిన సత్యం. అలాగని ఆధునిక రచయితలను తక్కువ చేయటం కాదు. శివరాం కారంత్ లాగానో, మాస్తి వెంకటేశం అయ్యంగారి లాంటి వారో, జయంతి మహాపాత్రో నో, కమలాదాస్ నో, అమృతా ప్రీతం నో మన దగ్గర లేరా? ఎవరైనా బాగా రాస్తే , దాన్ని రాజకీయాలకతీతంగా ఆదరించే సత్సాంప్రదాయం మన దగ్గర లేదు.మనం మన రచయితలని గౌరవించి ఆదరించకపోతే మనల్ని ఇతర భాషల వాళ్ళు అసలు గుర్తించరు. కన్నడం లోనో, మలయాళం లోనో గ్రూపులు లేవని కాదు. కానీ వాళ్ళు నచ్చని రచనల్ని విమర్శించినా, రచయితను గౌరవిస్తారు. మన దగ్గర రెండూ చేయరు.

ఇక ప్రస్తుత వివాదాస్పద ‘ ద్రౌపది ‘ అంశానికి వస్తే, పురాణాలకు ఆధునిక వ్యాఖనం చేయడం ( retelling the old texts ) ఇదే మొదలూ కాదు, ఇదే తుదీ కాదు. ఎప్పుడో నార్ల వెంకటేశ్వరరావ్ గారు ‘ సీత జోస్యం ‘ రాశారు. ఇటీవల కాలం లో డి.ఆర్. ఇంద్ర ఆంధ్రజ్యోతి లో (నామిని హయాం లో అనుకుంటాను ) రాసిన కథ “ రావణ జోస్యం” . సీత, శూర్పణఖలు స్నేహ పూర్వకం గా కలుసుకొని మాట్లాడుకున్నట్లు గా ‘ సమాగమం ‘ పేరిట ఓల్గా ఒక కధ రాశారు. రంగనాయకమ్మ గారు అసలు రామాయాణాన్నే విష వృక్షం అనేశారు. ఇప్పుడు యార్లగడ్డ చేసింది కూడా అంతే. భారతం గురించి ప్రచారం లో వున్న అనేకానేక కథల్లో తనకు నచ్చిన వాటిని ఈ పుస్తకం లో వాడుకున్నారు. మూల భారతంలో ద్రౌపదీ పంచభర్తృక ఎందుకయిందో ఉపకథలు/ఉపాఖ్యానాలున్నాయి. ఆ కథలు ఎందుకు? ద్రౌపదీ అయిదుగురు భర్తలతో వున్నా పంచమహాపతివ్రతల్లో ఒకరు ఎలా అయిందనే దానికి ఒక ఆర్గ్యుమెంట్ అన్న మాట. ద్రౌపది ని పతివ్రత గా వొప్పుకోవటానికి భారతం లో ఆ ఉపకథ లేదా ఉపాఖ్యానం అవసరమయింది. ద్రౌపదీ ని మరో రకంగా చూపించటానికి యార్లగడ్డ కు ఇంకేవో కథలు అవసరమయ్యాయి. ఉపకధలు/ఉపాఖ్యానాలు ఎప్పుడూ అవసరమవుతాయంటే మనం నమ్మనిదాన్ని నమ్మించటానికి. ద్రౌపదీ తప్పేమీ లేదు అని భారతం లో ఉపకథ నమ్మించాలని చూస్తే, అదే పాయింట్ ని (ద్రౌపదీ తప్పు లేదు అని) చెప్పటానికి యార్లగడ్డ ఇంకో కథ చెప్పారు. ఇందులో సత్యాసత్యాల ప్రసక్తి లేదు. భారతం చరిత్ర నా? సాహిత్యమా? అన్నదే ఇంకా సందేహం చాలామందికి. ద్రౌపదీ ఒక్క అర్జునుడితో తప్ప మరెవ్వరితోనూ సుఖించలేదని ఒక భారతం చెపితే, పంచపాండవులతోనే కాదు కర్ణుడిని కూడా ఆశపడింది అంటారు యార్లగడ్డ. ఇవన్నీ మన వ్యాఖ్యానాలు. అసలు ద్రౌపదీ ఏమనుకుందో ఆ వ్యాసులవారికైనా తెలిసి వుంటుందా అని నా సందేహం.

రామాయణ, భారతాలు ఈ భూమి మీద ఇతిహాసాలుగా గుర్తింపు పొందుతున్నంత కాలం సీత, సావిత్రి, ద్రౌపదీ ల పాత్ర స్వరూప, స్వభావాలు ఏవీ మారవు ( మనం మార్చాలనుకున్నా) .యార్లగడ్డ రచన ఒక టైం పీరియడ్ లో చదివి వదిలేస్తారు. ఎన్ని కొత్త వ్యాఖ్యానాలు వచ్చినా కూడా ,మూల కథ మాత్రం ఎప్పటికీ అలాగే వుంటుంది. కాలానుగుణ్యంగా కొత్త వ్యాఖ్యానాలు రావటం సహజం. సీత రావణాసురుడ్ని అభిమానించిది, రాముడు కంటే అతడే గొప్పవాడనుకుందని ఒక కొత్త వ్యాఖ్యానాన్ని చెప్పటం అవసరమా? అంటే కాకపోవచ్చు. కానీ అదొక సాహిత్య సృష్టి. రచయిత సృజనకు తార్కాణం. సాహిత్యపరంగా అంత వరకే దానికి విలువ.

మనం వ్యాసులం, వాల్మీకులం , పోతనలం కాదు. మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయే మామూలు రచయితలం. అది గుర్తుపెట్టుకుంటే బాధ వుండదు. గొడవ పడక్కరలేదు.

కల్పనారెంటాల

16 వ్యాఖ్యలు:

కౌటిల్య said...

కల్పన గారూ..మీతో నేను ఏకీభవిస్తున్నాను...ఈ పిచ్చి రచయితలు ఎన్ని వెఱ్రి రాతలు రాసినా,అది నిముషంలో లేచిపోయే దుమారం లాంటిది...దానికి మనం అంత విచారించాల్సిన అవసరం లేదు...ఎన్ని మ్లేచ్ఛసాహిత్యాలొచ్చినా మన ఆదికావ్యాల్ని కనీసం స్పృశించలేవు....విశ్వనాథవారు, రామాయణం మీద విమర్శలు వచ్చినపుడు నవ్వి ఊరుకునేవారట!

సుజాత said...

"అసలు ద్రౌపదీ ఏమనుకుందో ఆ వ్యాసులవారికైనా తెలిసి వుంటుందా అని నా సందేహం......"

నా సందేహం కూడా!

Sujata said...

చాలా బావున్నాయి ఆలోచనలు. మీరన్నట్టు రచనలకు, రచయితలకు, వివాదాలు ప్రమాణికాలు కావు.

మా విశాఖపట్నం ఆచార్యులవారు రాసిన పొత్తము - అందునా ఇంతకు మునుపు ఒక బ్లాగరి (As usual, పేరు 'గుర్తు లేదు'!) పరిచయం చేసినదీ కావడం వల్ల తప్పకుండా చదవాలనుకున్నాను. ఇపుడు 'అవార్డు విన్నింగ్' నవల అయినందున చదవాలిసిందే అనిపిస్తుంది.

Praveen Communications said...

>>>>>
సీత రావణాసురుడ్ని అభిమానించిది, రాముడు కంటే అతడే గొప్పవాడనుకుందని ఒక కొత్త వ్యాఖ్యానాన్ని చెప్పటం అవసరమా?
>>>>>
సీత రావణాసురుడిని ప్రేమించినట్టు వ్రాసినది చలం గారు. కథలని కాలానుగుణంగా మార్చడంలో తప్పు లేదు.

the folklorist said...

కల్పనగారూ,

ద్రౌపది నవల మీద తెలుగు నేలలో మంచి వేడి వేడి చర్చ జరుగూతూ ఉంది. అది సీరియల్గా వచ్చినప్పటికంటే దానికి ఇప్పుడు పురస్కారం వచ్చిన తర్వాత ఇప్పుడు చర్చ మరింత వేడిగా జరుగూతూ ఉంది. నేనూ గమనిస్తున్నాను.

దీనికంతటికీ ఉన్న ఒక కారణాన్ని గమనిస్తే దీనిపైన ఉన్న మత్సరాలకి అర్థం తెలుస్తుంది. పాతివ్రత్యం అనే క్వాలిటీని ఒక సామాజిక విలువని ఒకదాన్ని ఈ జాతి పోనీ మగజాతి పోషించుకుంటా వస్తూ ఉంది. దీనికి భిన్నంగా సృజన జరిగింది అని అనుకున్నప్పుడు గాని లేదా ఆ విలువలు ఏవో దీనివల్ల పతనం అవుతున్నాయి అని అనుకున్నప్పుడు కాని ఇలాంటి చర్చలు జరుగుతాయి. ఇక్కడ అసూయ కూడా ఒక కారణం అయింది.

ఈ సాంప్రదాయికపు పాతివ్రత్యం అనే సామాజిక విలువని ఒక సారి కాదన్నప్పుడు దానికి అనుకూలంగా ఎన్ని రామాయణాలైనా రాయవచ్చు. ఎన్ని భారతాలైనా రాయవచ్చు. దీన్ని యార్లగడ్డ భారతం అని చెప్పి ఊరుకుంటే సరిపోతుంది.

మీరు మీ రైట్ అప్ లో రాసిన పుస్తకాలలో చాలా వాటిని చదివాను.

ఒక్క ఆలోచనపై నా వ్యాఖ్యానాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను.

,మూల కథ మాత్రం ఎప్పటికీ అలాగే వుంటుంది. కాలానుగుణ్యంగా కొత్త వ్యాఖ్యానాలు రావటం సహజం,.

అని అన్నారు. మూల కథ అనేది ఒకటి ఉందనే వాదాల్ని ఫోక్ లోర్ కు సంబంధించిన పురాణ విమర్శ అంగీకరించదు. మిగతా రామాయణ భారతాలు ఎవరివి వారివి ఎలా అవుతాయో. వాల్మీకి రామాయణం, వ్యాసభారతం కూడా ఒక వెర్షన్ మాత్రమే అవుతాయి. అవి కూడా మౌఖిక మార్గం నుండి లిఖిత మార్గానికి వచ్చినవే. అంతే కాదు ఆ పేర్లతోనే ఎన్నో మార్పులకు లోనైనవి. ఆ వెర్షన్లను ఆధారంగా చేసుకొని వాటితో వేరే వెర్షన్లు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయో చర్చించే విధానంగా కన్నా భిన్నంగా నేటి మిత్ కు సంబంధించిన పరిశోధనలు సాగుతున్నాయి.

అందువల్ల దేన్నీ మూలకథ అని అనవలసిన పని లేదు. ఎవరు నిలబడ్డ, కాపు కాస్తున్న సామాజిక విలువ ప్రకారం వారు సృజన చేస్తున్నారు. ఇక వ్యాఖ్యానాలు కూడా ఈ కాపు కాయడం పైనే ఆధారపబడి ఉంటాయి.

పులికొండ సుబ్బాచారి.

కత్తి మహేష్ కుమార్ said...

పులికొండ సుబ్బారావు గారితో ఏకీభవిస్తూ నావి కొన్ని మాటలు...

రామాయణ మహాభారతాలకు మూలకథలు అంటూ ఏవీ లేవు. మౌఖికంగా అవి కాలానికి అనుగుణంగా మారుతూవచ్చి, గుప్తులకాలంలో ఆకాలపు సమాజానికి అన్వయించుకుంటూ ప్రక్షిప్తాలతోసహా అక్షరబద్ధం చెయ్యబడ్డాయి. ఆతరువాత మరెన్నో జోడింపులు జరిగాయి. ఇప్పుడు వస్తున్న వ్యాఖ్యానాలుకూడా జోడింపులకి కొనసాగింపులు మాత్రమే.

మౌఖిక కథలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు అనుంటే అది అప్పటి సమాజానికి అనుగుణం కాదుగనక, ఒక ఉపకథ(తపస్సు-పతి5)జోడించి సమర్ధించుకొనుంటారు. అందుకే ఇన్ని ఉపకథలు తయారయ్యాయి. మరిన్ని అధ్యాయాలు జోడించబడ్డాయి. రామాయణ మహాభారతాల్లోని (ఈ కాలానికి అన్వయించుకోలేని) ప్రతి అసంబద్ధ ఘటనకూ కనీసం నాలుగైదు explanation కథలుంటాయి గమనించండి.

మూలకథ అని మీరు ఒప్పేసుకున్న కథల్లో ఒకే ఒక సామీప్యత ఉంటుంది. అదేమిటంటే అవి పితృస్వామిక భావజాలాన్ని కలిగుండటం. తమకు అనుకూలంగా స్త్రీ పాత్రలకు పాతివ్రత్యం అనే సీల్ లేదా లేబిల్ అంటగట్టి తమ దౌష్ట్యాల్ని లెజిటిమైజ్ చెయ్యడం.ఇప్పటికీ అవి చెల్లుబాటులో ఎందుకున్నాయంటే అవి అజరామం అనేదానికన్నా, ఆ కుట్రచాలా పకడ్బందీగా నడుస్తోందనేదే సరైన కారణం. మీరుకూడా ఆ కుట్రలో తెలీకుండానే భాగమైపోయారు చూశారా! Thats the power of patriarchy.

ప్రస్తుత కాలం నుంచీ చూస్తే రావణుడు రాముడికన్నా ద్రైర్యశాలి,నిబద్ధుడిగా అనిపించకమానడు. దుర్యోధనుడు తను నమ్మినదానికోసం ప్రాణాలైనా అర్పించిన మానధనుడంటే అస్సలు తప్పుకాదు.We can always have strong case for them.కాబట్టి మూలకథ అపోహలనుంచీ కొంచెం బయటికొచ్చేసి రామాయణ మహాభారతాల్ని ఎందరో గొప్ప రచయితలు రాసిన పుస్తకాలుగా చూడండి. Now they might look very open to interpretation.

Kalpana Rentala said...

కౌటిల్య గారు, మీరు నాతో ఏకీభవించడం బావుంది. కానీ ఒక చిన్న వివరణ. నేను యార్లగడ్డ ని ఒక పిచ్చి రచయిత అనుకోవటం లేదు. ఆయన తనదైన వ్యాఖ్యాన్నాన్ని చేశారు. అది కాలానికి నిలబడుతుందా లేదా అన్నది మనం తేల్చలేని విషయం. ఎందుకు అనేది నేను తర్వాత చెప్పబోతున్నాను.
సుజాత, ద్రౌపదీ ఏమనుకుని వుండి వుంటుందో ఒక స్త్రీ గా నా ఆలోచనల్ని ఎవ్వతవీవు కవితా లో ప్రస్తావించాను. ఇలా పురాణ పాత్రల పై ఎవరి సొంత అభిప్రాయాలు , వ్యాఖ్యానాలు వాళ్ళకు వుంటాయి .పుస్తకం అయితే మనం చదవాలి.
ప్రవీణ్, అవును అది రాసింది చలమే. అది తప్పు అని నేను కూడా అనలేదు.
సుబ్బచారి గారు, మిమ్మల్ని బ్లాగ్ లో చూడటం సంతోషం గా వుంది. మీకు, మహేష్ కి వేరే సమాధానం ఇస్తున్నాను. చూడండి.

durgeswara said...

శభాష్

పిచ్చితగ్గింది రోకలి తలకు చుట్టండి. వాడెవడో వాల్లతల్లీదండ్రీ గురించైనా జుగుప్సగా వ్రాసి అవార్డులకోసం అర్రులుచాచగల నికృష్టుడు, వానికి మరలా మద్దతు. భేష్. ఇక ఇంతకంటె ఉన్నతంగా ఆలోచించగల మహామేధావులు ఉద్భవిస్తుంటారేమో రానురాను. కాకుంటే ఇదే ఇతర మతస్తుల విషయం లో జరుగుంటే ఈసరికి వ్రాసినవాడికి ,జైకొట్టినవాళ్లకు కూడా జరిగిపోయేది కపాలమోక్షం .
ఇక్కడ నాభావనలు నచ్చవనుకుంటె వెంటనే తీసెయ్యండి ఇబ్బందిలేదు.

నాకర్ధం కానివిషయం ఇంతమందిమేధావులు డావెన్సీకోడ్ అనే సినిమా విడుదలకు కిరస్తానీ సోదరులు అభ్యంతరం చెప్పినప్పుడు ఏమాత్రం నోరు మెదపలేక పోయారు. [నాఉద్దేశ్యం మాత్రం కిరస్తానీ సోదరులఅభ్యంతరం సబబే] ఇప్పుడు హైందవ సాంస్క్రుతీ సంపదలను అవమానించి ధ్వంసపరచటానికి కిరాయి మేధావులు చేస్తున్న దాడులకు మద్దతునిస్తున్నారు. ఇదంతా మేధస్సేనన్ని మాలాంటి అమాయకులకు కూడా జ్ఞానబోధ చేస్తున్నారు.

మితృలారా
ఒక్కవిషయం గమనించండి .భగవంతుడు ఇచ్చిన మెదడు సక్రమమైన ఆలోచనలకు ఉత్పత్తిస్థానం కానివ్వండి . దాన్ని అపవిత్రం చేసుకుని అక్కడ ఉద్భవించే చండాలాన్ని సమాజం మీదకు వదిలే చర్యలను అనుమతించకండి . మనం ఎంత మేధావిత్వంగ ఆలోచించినా అన్నం నోటితోనే తినాలి .అదిరీతి , మానవనీతి .వికృతమైన ఆలోచనలు చెస్తే ఏమంటారో తెలియని పసివాల్లెవరూ లేరని తెలుసు ఇక్కడ.

మరువం ఉష said...

ఒకప్పటి సృష్టి ఇది. వాస్తవమా, కవి సృజనో తెలియదు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేయొచ్చు. ఆ వ్యాఖ్యానం లో ఒక ఆలోచన, అభిప్రాయం వ్యక్తమయినంతవరకు తప్పు లేదు. ఆపై అవి రచయితలపై ఎక్కుపెట్టబడే విమర్శలుగా దారి తీయటమే వచ్చిన చిక్కు. జిజ్ఞాస, తృష్ణ లేనిదే ఆ మూల కథలు, అనాది సాంప్రదాయాలు నిలిచేవి కాదు. నేను కనుక సందేహాలకీ, నివృత్తులకీ వ్యతిరేకిని కాదు. ఇది ప్రామాణికం అని ఋజువుచేయగలవారెవరు? అపరిమిత పరిజ్ఞానం గల వారెవరు? ఆయా వ్యక్తుల పరిణితిననుసరించి అంగీగరిమ్చబడిన విలువలివి అంతే.

కత్తి మహేష్ కుమార్ said...

@దుర్గేశ్వర్రావు: డావిన్సీ కోడ్ విషయంలో క్రైస్తవుల యాగీ అర్థరహితమని, మూర్ఖత్వమనీ ఎందరో చెప్పారు. మీడియా ముఖంగా చెప్పారు. అవి మీకు కనిపించనంతమాత్రానా ఇదేదో మతపరమైన కుట్ర అనే అపోహలో ఉండనవసరం లేదు.

డేనిష్ కార్టూన్ విషయంలో ముస్లింల ఫాసిజాన్నికూడా నిరసించారు. భావస్వతంత్రాన్ని కాంక్షించే సెక్యులర్ ఆలోచనా పరులకు మతాలు కాదు మనిషి ముఖ్యం.

శ్రీనివాస్ said...

ఏమిటో అందరూ ద్వాపర యుగానికి వెళ్లి దగ్గరుండి అందరినీ చూసినట్టే చెబుతారు. కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన విషయం మీద తాచుపాములగా విమర్శలకి ఎందుకు దిగుతారో తెలీదు.

Praveen Communications said...

మనం వ్యాసులం, వాల్మీకులం , పోతనలం కాదు. నిజమే. కథలు కాలానుగుణంగా మారాల్సిన అవసరం లేదా? చలం గారు సీత కథ మార్చి వ్రాయడం తప్పు కాదని అన్నారు. చలం గారు కూడా వాల్మీకి కాదు కదా.

te.thulika said...

కొంచెం ఆలస్యంగా చూశాను. నీ వ్యక్తీకరించిన అభిప్రాయాలు చక్కగా చెప్పేవు. వ్యాఖ్యానాలనించి కూడా చాలా నేర్చుకున్నాను. అభినందనలు.

Kalpana Rentala said...

దుర్గేశ్వర గారు,
మెదడు సక్రమం గా పనిచేస్తోందని అనాటానికి రుజువు ఆలోచించటం, ప్రశ్నించటం. ఆ రెండూ పనులు ఇక్కడ అందరమూ (మీతో సహా) చేస్తున్నాము. సరైన దిశగా అంటారా? ఏది సక్రమమో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం.
ఉషా, అంగేకరించబడిన విలువలతో వచ్చిన చిక్కే ఇదంతా.
శ్రీనివాస్, ద్వాపర యుగం లోకి వెళ్ళి నిజం గా చూసి రాగలిగితే బావుండు. అందరికి పని సులువయ్యేది.
ప్రవీణ్, కొంచెం అర్ధం అయేలా అడగండి.
మాలతి గారు, చదివినందుకు ధన్యవాదాలు.

రవి said...

మీ టపా చాలా చక్కగా ఉంది. మీ భావాలు కూడా విస్పష్టంగా ఉన్నాయి. మీతో వాదించేంత సరుకు నాలో లేదు కానీ, ఓ చిన్న ప్రశ్న ఉదయించింది. అది మీ ముందుంచుతున్నాను.

>>రాముడు కంటే అతడే గొప్పవాడనుకుందని ఒక >>కొత్త వ్యాఖ్యానాన్ని చెప్పటం అవసరమా? అంటే >>కాకపోవచ్చు. కానీ అదొక సాహిత్య సృష్టి. >>రచయిత సృజనకు తార్కాణం.

బావుంది. రంగనాయకమ్మ గారి విషవృక్షం రామాయణాన్ని విమర్శించినా దానికి (రచయిత్రి ఆశించిన), గతి తార్కిక భౌతిక వాదాన్ని వివరించటం అన్న ఒక స్పష్టమైన సాహిత్యప్రయోజనం కనబడుతూ ఉంది. రామాయణం మీద విమర్శ ఓ శాస్త్రాధ్యయనానికి ఉపయోగపడింది. ఆ రకంగా ఉపయోగపడ్డది కాబట్టి రామయణం విలువ తగ్గలేదు. (వాల్మీకి multi-dimensionality ని ఉద్దేశ్యంగా పెట్టుకుని రామాయణాన్ని రచించిన పక్షంలో).

ఇక యార్లగడ్డ వారి ద్రౌపది విషయానికి వస్తే, "పవిత్రత" అన్న ఓ established value ని ప్రశ్నించారని, అందువల్ల అందులో తప్పులేదని చెబుతున్నారు. "పవిత్రత" ను యార్లగడ్డ వారు మరో దృక్కోణంలో పరిశీలించేప్పుడు, ఆ పరిశీలన, నిస్పాక్షికంగా, అన్ని వైపుల నుంచి వాదాలను వివరిస్తూ, తార్కికంగా సాగితే బావుంటుంది.

అలా కాక, తనకు నచ్చిన ఓ కోణాన్ని మాత్రమే ఎంచుకుని, మూలప్రతిని, తన వాదనకనుగుణంగా తిప్పుకోవాలనుకోవడం పచ్చి స్వార్థం కాదంటారా?

(ద్రౌపది ఓ అయోనిజ, అలానే అగ్నిజనిత. అగ్ని నుండీ జనించిన వ్యక్తి కాబట్టీనీ, కారణజన్మురాలన్న వాదన ఉందన్న కారణంగానూ, ఆమె పవిత్రురాలని జనసామాన్యంలో ఉన్న భావనలను రచయిత కనీసం ఫుట్ నోట్స్ లో అయినా చెప్పాలి. అలా చెప్పారో లేదో నాకు తెలియదు.)

ఇక్కడ నా ప్రశ్నకూ, మీ ఆలోచనకూ common base - మూలప్రతి ఒకటి ఉందన్న నమ్మకం. (మూలప్రతి ఒక virtual entity అన్నది కూడా ఓ నమ్మకమే. ఇప్పుడు వ్యాసుణ్ణి రప్పించి ప్రశ్నించడం సాధ్యం కాదు కనుక, ఓ నమ్మకం ఆధారంగా అర్థం వెతకాలి. తప్పదు)

hkpt said...

విషయమేమైనప్పటికీ మీ అంత సుందరంగా తీర్చిన తెలుగు #Blog# ని నేనింకా చూడలేదు. అక్కరలేని #Graphics#, పేజీ నమూనాలూ, వగైరాలతో పని లేకుండా, దృష్టి పరిమితిని కుదించకుండా, నిలువు పట్టీలుగా విభాజించకుండా, అనాయాసంగా తెలుగు పేరాలు చదివే వీలు కల్పించిన వాళ్ళలో మీరే ప్రథములు. (సొంత డబ్బా) ఇట్టి ప్రయత్నాన్ని నేనింకొక చోట చేసాను.

- తా || హరికృష్ణ

 
Real Time Web Analytics