నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, January 16, 2010

మూల కథ కాకపోతే మరేమిటి?

మూల కథ అనేది ఒకటి ఉందనే వాదాల్ని ఫోక్ లోర్ కు సంబంధించిన పురాణ విమర్శ అంగీకరించదు. అందువల్ల దేన్నీ మూలకథ అని అనవలసిన పని లేదు.

సుబ్బాచారి గారు, మహేష్ గారు,

మూల కథ లేదన్న మీ సూత్రాన్ని నేను అంగీకరించను. మూల కథ అంటే నా ఉద్దేశం...రామాయణం రాముడు సీత ని పెళ్ళాడాడు. అడవికి వెళ్ళాడు. రావణాసురుడ్ని చంపేశాడు. ఇది మూల కథ. ఇది వాస్తవం గా జరిగిందని నమ్ముతారు కాబట్టి అది చరిత్ర అయింది. ఇతిహాసం అయింది. దీనికి వాల్మీకీ ఒక వ్యాఖ్యానం రాశారు. అది లిఖితమ్. అంతకు ముందు నుంచి మౌఖిక రామాయణాలు వున్నాయి అంటారు. అది కూడా నిజమే. ఆదిమ జాతుల వాళ్ళు చెప్పే రామాయణం కథ ఇదే. కానీ వాళ్ళ వ్యాఖ్యానం భిన్నంగా వుంటుంది. నేను మాట్లాడుతున్న పాయింట్ అది. మౌఖిక రామాయణనానికి, వాల్మీకీ రామాయణానికి భిన్నం వ్యాఖ్యానంలో తప్ప మూల కథ లో కాదు. రాముడు సీత ని పెళ్ళాడకుండా శూర్పణఖ ని ప్రేమించాడనుకోండి. అది మూల కథ కాదు అంటాము. కాదా? ఇక మూల కథ ని కాపాడుకుంటూ రావడంలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు వున్నాయి. మూల కథ ఒక మిత్ అన్న దిశగా పరిశోధన స్వాగతించవలసిందే. అవన్నీ తేలెవరకు మనకు రామాయణం ఇతిహాసమే. లేదా వాల్మీకి రాసిన ఒక అద్భుత కావ్యం. సాహిత్య సృష్టి.

ఇక మహేష్ గారు,

మీ వాదన విషయానికి వస్తే....

మూల కథలు లేకపోవటం ఏమిటి? తప్పకుండా వున్నాయి. అవి ఎలా వున్నాయి అనేది ప్రశ్న. అంటే, మౌఖిక భారతం లో కూడా పాండవులు, కౌరవులు వున్నారు. అక్కడ కూడా ద్రౌపదీ కి అయిదుగురు భర్తలే. కానీ ఉపకథలు మాత్రం కాలానుగుణం గా మారుతూ వస్తున్నాయి. మూల కధ ఎప్పుడూ మారదు. దానికి ఉపకథలు, వ్యాఖ్యానాలు మాత్రం కాలానుగుణం గా మారతాయి. అందుకే కల్పవృక్షం వచ్చింది. విషవృక్షం కూడా వచ్చింది. రేపు ఇంకెదో వృక్షం కూడా వస్తుంది. రామాయణం కి సంబంధించి ఆర్య, అనార్య వివాదాలు కూడా కాలానుగుణం గా వచ్చినవే.

మూలకథ అని మీరు ఒప్పేసుకున్న కథల్లో ఒకే ఒక సామీప్యత ఉంటుంది. అదేమిటంటే అవి పితృస్వామిక భావజాలాన్ని కలిగుండటం. తమకు అనుకూలంగా స్త్రీ పాత్రలకు పాతివ్రత్యం అనే సీల్ లేదా లేబిల్ అంటగట్టి తమ దౌష్ట్యాల్ని లెజిటిమైజ్ చెయ్యడం.ఇప్పటికీ అవి చెల్లుబాటులో ఎందుకున్నాయంటే అవి అజరామం అనేదానికన్నా, ఆ కుట్రచాలా పకడ్బందీగా నడుస్తోందనేదే సరైన కారణం. మీరుకూడా ఆ కుట్రలో తెలీకుండానే భాగమైపోయారు చూశారా! Thats the power of patriarchy. “ అన్నారు మీరు మహేష్.

మూల కథ అని నేను వొప్పేసుకోవటం ప్రత్యేకం గా ఏమీ లేదు. అందరూ వొప్పుకోవాల్సినదే. అయితే మూల కథకు నేను ఏ వ్యాఖ్యానాన్ని ఇష్టపడతాను అన్నది నా అభిరుచికి సంబంధించిన అంశం. అదే నేను కవితలో ప్రశ్నించింది. పాతివ్రత్యాన్ని, పురుషాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ కూడా రామాయణం, భారతం ఇతిహాసాలు లేదా అద్భుత కావ్యాలు అన్నదాంట్లో నాకెలాంటి సందేహం లేదు. అయితే నాకు సంబంధించి సీతా, ద్రౌపదీ ల పట్ల కొన్ని నిశ్చిత అభిప్రాయాలు కూడా వుంటాయి. అదే సమయంలో అది కల్పవృక్షం ఎందుకైందో విశ్వనాధ వారు చెప్పినప్పుడు ఒక సాహిత్య విలువలతో ( అంటే రచనా పరమ్ గా) దాన్ని ఆనందిస్తాను. ఫెమినిస్ట్ స్టడీస్ ని గౌరవిస్తాను. సంప్రదాయం లేకుండా ఆధునికత లేదు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆధునికత ని స్వాగతించటం నా పధ్ధతి. కల్పవృక్షం ఎంత ఆకట్టుకుంటుందో రొమిల్లా థాపర్ వాదన కూడా అంత శ్రధ్ధగా చదవాలి. ఇందులో నేను ప్రితృస్వామ్య భావజాలన్నీ అంగీకరించటం లేదు. అంగీకరిస్తే నేను ఆ కవిత రాయలేను. నేను తెలియకుండా అందులో భాగం ఏమీ అయిపోలేదు. ప్రితృస్వామిక భావాజాలన్నీ, ఆ లెజిటమైజేషన్ ని వ్యతిరేకిస్తాము కాబట్టే మనం సీతలో ఆత్మ విశ్వాసాన్ని, ద్రౌపదీ లో ఒక బలమైన వ్యక్తిత్వాన్ని చూడగలుగుతాము. ఇక రామాయణ, భారతాలు అజరామరం అవటం వెనుక కేవలం కుట్రలు మాత్రమే లేవు. అది మన వారసత్వం. అందులో లోపాలు ఈ కలియుగానికి సంబంధించినవి. ఆ యుగ ధర్మం ప్రకారం చూస్తే అది అప్పటికి సహజం. ఇప్పుడు ఈ కలియుగ ధర్మానికి అవి ఆచరణీయమా?, అనుసరణీయమా? అనే దాని దగ్గరే మన భిన్నాభిప్రాయాలు. కాబట్టి, మీరో, నేనో రామాయణాన్ని, భారతాన్ని నిరాకరించటం వల్ల వాటికి వచ్చిన నష్టమేమీ లేదు. వాటిని నిరాకరించటం కన్నా కొత్త వ్యాఖ్యానాలు చెప్పటమే ఎవరైనా చేయగలిగింది. అదే ఇప్పుడు యార్లగడ్డ వారు చేసినా, ఫోక్ లోర్ వాళ్ళు చేసినా.

ప్రస్తుత కాలం నుంచీ చూస్తే రావణుడు రాముడికన్నా ద్రైర్యశాలి,నిబద్ధుడిగా అనిపించకమానడు. దుర్యోధనుడు తను నమ్మినదానికోసం ప్రాణాలైనా అర్పించిన మానధనుడంటే అస్సలు తప్పుకాదు.We can always have strong case for them.

అదే కదా నేను చెప్పేది. సీతా ఫెమినిస్ట్ అంటాము. రావణాసురుడు రాముడు కంటే నిజాయితీ పరుడు అని కూడా అంటాం. అది మన వ్యాఖ్యానం మాత్రమే అని గుర్తు చేస్తున్నా.

మూలకథ అపోహలనుంచీ కొంచెం బయటికొచ్చేసి రామాయణ మహాభారతాల్ని ఎందరో గొప్ప రచయితలు రాసిన పుస్తకాలుగా చూడండి. Now they might look very open to interpretation”

నేను వాటిని ఇతిహాసాలుగా కంటే కావ్యాలుగా నే పరిగణిస్తున్నాను. అందుకే నేను వాటి వ్యాఖ్యానాల పట్ల ఓపెన్ గానే వున్నాను. వుంటాను. ఆ ఓపెన్ నెస్ అనేది మూల కథ ని మనం అంగీకరిస్తేనే. మూల కథ ని వోప్పుకోకుండా వాటిని గొప్ప పుస్తకాలుగా ఎలా చూస్తాం?

17 వ్యాఖ్యలు:

భావన said...

వావ్.. స్త్రీ... ఆమె పాతివ్రత్యాన్ని గురించిన ప్రశ్న వస్తే మంట ఎంత తొందర గా ఎంత భగ్గుమంటుందో... మనం దేవతలం అంటారు మనం దెయ్యాలమంటారు.. ఒక్కళ్ళు కూడా మనను మనుష్యులంటం లేదే? :-(

కత్తి మహేష్ కుమార్ said...

కల్పనగారూ,
ఒకవైపు కుట్ర అని అంగీకరిస్తూనే అది మన వారసత్వసాంప్రదాయం అంటున్నారు. ఇలాంటి వారసత్వపు సాంప్రదాయాల అధారంగా నిర్మించాలనుకుంటున్న ఆధునికత ఎలా నిలుస్తుంది? అది ఎంత అర్థరహితంగా ఉంటుంది?

ఒకవేళ ఉంటే, మూలకథ ఒక factual narration and an account of an event. కానీ మూలకథగా మనం ఇప్పుడు భావిస్తున్న కథ ‘విలువల ప్రబోధం’. కాబట్టి ఆ విలువల్ని కాలానుగుణంగా ప్రశ్నించడాన్ని నేను సమర్ధిస్తాను.ఆ ప్రబోధించిన విలువల ఆధారంగానే "అదే సత్యం-అదే నిత్యం" అనే ధోరణిని ఛాందసం అని నిరసిస్తాను.

వాల్మీకి రాసిందిగా (ఇప్పుడు) చెప్పబడుతున్నదంతా రామాయణ మూలకథ అని ఎవరు నిర్ధారించగలరు? వ్యాస మహాభారతంగా చెప్పబడుతున్నదంతా మూలకథ అని ఎవరు నిరూపించగలరు? ఇలా నిరూపించలేరు గనకనే, "నమ్మకం" కావాలంటున్నారు. మరి మిగతా alternative నమ్మకాల మాటేమిటి?

"రాముడనే వాడొకడుండేవాడు" అని కథ మొదలెడితే ఎవదికీ సమస్యలేదు. "రాముడు సకలగుణాభిరాముడు" అనగానే, ఆ గుణగణాలేమిటో చెప్పు? అని ప్రశ్నించాలనిపిస్తుంది.సమస్య అక్కడ్నుంచే మొదలౌతుంది.

"ద్రౌపదికి ఐదుగురు భర్తలు" అంటే అస్సలు సమస్యలేదు. ఎందుకంటే అది factual information కాబట్టి. అలాకాకుండా "ఐదుగురు భర్తలున్న ద్రౌపతి ఇలా పతివ్రత అయ్యింది" అని చెప్పారనుకోండి. అసలు పాతివ్రత్యమంటే ఏమిటి? అది అవసరమా? అదొక విలువా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి.

Stories of morality need not be preached.They are to be inferred through individual interpretation.ఆ సౌలభ్యాన్ని నాశనం చేసి రామాయణ,మహాభారతాల్ని prescribe చేసి, పవిత్రం చేసే ధోరణిని నిరసించడం ఎన్నో తరాల resistance ద్వారా వచ్చింది. ఆ ప్రశ్నించే వారసత్వమే నాకు ముఖ్యం. ప్రశ్నించకుండా అంగీకరించి పొర్లుదండాలు పెట్టాలనే సాంప్రదాయం కాదు.

Kalpana Rentala said...

భావన, అదే కదా దురదృష్టకరం.
మహేష్, విలువల ప్రబోధాన్ని ఖండించాల్సిందే. ఆధునికతని స్వాగతించేవాళ్ళమంతా పాతివ్రత్యం, పురుషాహంకారం లాంటి ధోరణుల్ని నిరసిస్తూనే వున్నాము. నిరసిస్తూనే వుంటాము కూడా. మూలకథల్ని నిరూపించలేము గనుకనే వాటిని సాహిత్యసృష్టి గానే చూద్దాము అంటాను నేను. మొత్తం మూడు వేల రామాయణాలున్నాయి అంటారు. ఏ రామాయణంలో ఏ కథ వుందో ఎవరికి తెలియదు. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా అవి నాశనం కాకుండా చరిత్రలో నిలిచి వున్నాయి. వాటిని కాపు కాశారు విలువల కోసం అంటారు మీరు. ఆలోచించి చూడండి. రామాయణాన్ని, భారతాన్ని కాపు కాసి కాపాడినా ఇవాల్టీ సమాజంలో ఎంత మందికి రాముడు, సీత ఆదర్శం? ఎటు చూసినా దుర్యోధన, దుశ్శాసనులే కనిపిస్తున్నారే? మరి రామాయణం, భారతం నిలబడినా విలువలు నిలబడలేదు కదా.కాబట్టి వాటిల్లో వున్నవి కేవలం విలువల ప్రబోధమే అనలేము. ఇతిహాసల్ని కాపాడటంతోనే విలువలు బతికి బట్ట కట్టవు.నైతికత ఎవరో దడి కట్టి కాపాడితే నిలబడదు. అది సహజంగా మనలోంచి రావాలి. ప్రశ్నించే వారసత్వమే ఇతిహాసాలను ఇన్ని తరాలుగా కొత్తగా నిలబెడుతోంది అనుకుంటాను.ద్రౌపదీ పాత్ర కి అన్యాయం జరిగిందని బాధ పడేవారు వాస్తవ జీవితంలో రుచిక కి అన్యాయం జరిగిందనో, ప్రణీత పై దాడి జరిగిందనో బాధపడరు..

కత్తి మహేష్ కుమార్ said...

ఆ ప్రబోధిత విలువలు కేవలం కొన్ని వర్గాల స్వార్థప్రయోజనాలకు అని తెలిసికూడా ఎంత మంది వాటిని ఫాలో అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మీ అవగాహనలో కొంత తికమక ఉంది గమనించండి.

ఈ విలువల ప్రవచనాలు వాళ్ళు పాటించడానికి కాదు. అందరూ పాటించేలా చేసి, తమ లాభానికి సమాజన్ని తయారుచెయ్యడానికి. దాన్నే hegemony అంటారు.

అందుకే ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయం అని లిప్ సర్విస్ చేసేవాళ్ళు ఏలా బ్రతుకుతున్నారో తెలుసుకుంటే అందులోని అసలు రహస్యం తెలిసిపోతుంది.

Praveen Communications said...

ద్రౌపది నవల విమర్శకులు ఆ నవల చదవలేదని యార్లగడ్డ గారు అంటున్నారు. http://thatstelugu.oneindia.in/news/2010/01/17/yarlagadda-counters-criticism-on-draupadi-170110.html

సూర్యుడు said...

"పాతివ్రత్యాన్ని, పురుషాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ కూడా రామాయణం, భారతం ఇతిహాసాలు లేదా అద్భుత కావ్యాలు అన్నదాంట్లో నాకెలాంటి సందేహం లేదు."

పురుషాధిపత్యాన్ని వ్యతిరేకించడంవరకూ సరే, పాతివ్రత్యాన్ని వ్యతిరేకించడం ఎందుకు, అందులో ఉద్దేశ్యమేమిటి?

సుజాత said...

భావనా,
మనుషులని ఒప్పుకుంటే వ్యక్తిత్వం ఉందని ఒప్పుకోవాల్సిన సమస్య వస్తుందిగా! దేవతలైతే దైవత్వం ఆపాదించి వదిలేయొచ్చు. వాళ్ళొచ్చి అడగనూ అడగరు.

Kalpana Rentala said...

ఈ విలువలు ఎవరి స్వార్ధ ప్రయోజనాలకు ఉద్దేశించినవో తెలిసిన తర్వాత , ఇక వాటిని ఆచరించటం, ఆచరించకపోవటం వ్యక్తిగతం. నాకైతే తికమక లేదు. బహుశా నా వ్యక్తీకరణ లోపమేమో? ఇక hegemony- పెత్తనం గురించి ఆ విలువలు ఎవరు పాటించకపోతే అవి నిలబడవు. అప్పుడు ఆ టెక్స్ట్ కి కూడా క్రమేపీ చారిత్రక విలువ తగ్గి సాహిత్య విలువ మాత్రమే మిగులుతుందేమో. ఇవన్నీ ఆలోచనలే. సంస్కృతి ,సంప్రదాయం మార్పులకు గురవకుండా ఒకేలా ఎప్పుడూ వుండదు. ఈ విషయం ‘ లిప్ సర్వీస్ ‘ చేసే వాళ్ళకు కూడా తెలుసు కానీ వొప్పుకోరు.ఎప్పటిలాగానే మీ లోతైన ప్రశ్నలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. అందుకు థాంక్స్ మీకు.
సుజాత, మీరు చెప్పింది అక్షరాలా నిజం. వ్యక్తిత్వం లేని దేవతలు లేదా విగ్రహాలు కావాలి అందరికీ.
సూర్యుడు, మీరు ఈ ప్రశ్న తెలియకే అడిగారా? పాతివ్రత్యం అనేది ఒక భావన. కలలో కూడా పరపురుషుడి గురించో, పర స్త్రీ గురించో ఆలోచన కూడా చేయకూడని శీలం. అలాంటి శీలం ఇప్పుడు స్త్రీలకే కాదు, పురుషులకు కూడా లేదు. కాబట్టి పాతివ్రత్యం ఆచరణలో లేదు,పుస్తకాల్లో మాత్రమే వుంది.

Nrahamthulla said...

Why chastity must apply only to women?
* chastity is devotion to husband.chastity refers not only to women and that once sexual intercourse has taken place, man or woman, however pure, cannot anymore claim to be chaste.woman should hold her husband as god,be a slave to her husband and do not regard anyone other than her husband.woman who does not worship any other god except her own husband,if she orders it, the very rain would start coming down instantly.--(Tirukkural ).
* men are more powerful in wealth, income and physical strength, a favorable situation came into existence for the enslavement of women as well as for their own brutalization as though the notion of chastity is not applicable to men.--Periyar

సూర్యుడు said...

కల్పన గారు,

ప్రాతివ్రత్యం అంటే కొద్దిగా తెలుసు, అది ఆపాదించబడిన పాత్రలద్వారా (నిర్వచనమెప్పుడూ చదవలేదు) కాని దాన్నెందుకు వ్యతిరేకించాలో నిజంగా తెలీదు. దానికి మీరు చెప్పిన నిర్వచనం ప్రకారం అందులో ఏమైనా తప్పుందా, అంటే ఆ కాన్సెప్ట్ లో?

బయట ప్రపంచంలో అది కనిపించనంత మాత్రాన వ్యతిరేకించాలంటారా?, అందరూ (పురుషులూ, స్త్రీలు) అలా ఉండడమే సరియైన మార్గమైతే అందరూ అలా ఉండడానికి ప్రయత్నించాలి కాని దాన్ని వ్యతిరేకించడమెందుకు?

ఊరికే ఉత్సుకత కొద్దీ అడిగాను, ఇవే చివరి ప్రశ్నలు :-)

Praveen Communications said...

పాతివ్రత్యం అంటే ఏమిటో ఇక్కడ వ్రాసాను http://blogzine.sahityaavalokanam.gen.in/2010/01/blog-post_8968.html

భావన said...

కల్పన నిజంగా తికమక పడుతున్నా మీ సమాధానాలు చూసి మీ అభిప్రాయాల చదివి.
okay let me put it this way..

మూలకథల్ని నిరూపించలేము గనుకనే వాటిని సాహిత్యసృష్టి గానే చూద్దాము అంటాను నేను.

సాహిత్య సృష్టి... ఎవరి సాహిత్యం? వాల్మికి,వ్యాసుడి దా లేక మిగతా మూడూ వేల రామాయాణాలలో ఒకటా? ఇక్కడ ఆ ఇతిహాసాల ను మన జీవన ప్రమాణాలని అందరు అంటున్నప్పుడు (నమ్ముతున్నారా లేదా అని అడగకండీ, అందరూ ఎవరికి కుదిరినంత/ వుపయోగపడినంత వరకు వుపయోగించుకుంటున్నారు) ఒకరి సాహిత్యాన్ని తీసుకుని వదిలేయటం కుదరని పని కదా అందులోని విలువలను కూడా మనకు తెలియకుండానే అనుష్టానించుకుంటాము.

"సమాజంలో ఎంత మందికి రాముడు, సీత ఆదర్శం? ఎటు చూసినా దుర్యోధన, దుశ్శాసనులే కనిపిస్తున్నారే"

ఏ ఒక్కరు వంద శాతం దుర్యోధనులు లేదా రాముడు కాలేరేమో కదా.

"కలలో కూడా పరపురుషుడి గురించో, పర స్త్రీ గురించో ఆలోచన కూడా చేయకూడని శీలం. అలాంటి శీలం ఇప్పుడు స్త్రీలకే కాదు, పురుషులకు కూడా లేదు. కాబట్టి పాతివ్రత్యం ఆచరణలో లేదు,పుస్తకాల్లో మాత్రమే వుంది."

మీరు చెప్పిన శీలం ఇప్పుడూ ఎప్పుడూ ఇక్కడా అక్కడా ఎక్కడా లేదు అని చెప్పాలేమో కదు. చలం అన్నట్ళు ఏ కోటి కో ఒక్కరి కి సాధ్మమయ్యే అధ్బుత మానసిక నిగ్రహం, ఆధ్యాత్మిక అనుభవం చాలా మంది వలన చాలా చవుక ఐపోయి అదే దో ప్రతి ఒక్కరు పాటిస్తున్నట్లు చెప్పటం, అలా వుండని ( కనీసమ్ అలా ఆక్ట్ చెయ్యని అనాలేమో) వాళ్ళను చవటలు గా జమ కట్టటం ఒక సాధారణ ప్రక్రియ ఐపోయింది అందరికి.
ఆ ఏకత్వం, ఆధ్యాత్మిక అనుభవం కోసం ప్రయత్నించే వారు కూడా ఇన్ని రకాల దుర్భాషలు ఆడరు.

భావన said...

సుజాత: నాకు అదే అర్ధం కాదోయ్.. ఎందుకు మనకోసం ఇంత మంది ఇలా బాధ పడతారు మనకు ఏది కావాలో ఏది వుత్తమమో మనం కేవలం మనం మాత్రమే ఎందుకు నిర్ణయించుకునే సులువు లేదో. గాంధీ గారే కదు అన్నది స్త్రీ లకు ఏమి కావాలో వాళ్ళను నిర్ణయించుకోనివ్వండి అని.
అవను మనకేమి కావాలి? ఏమి కావలబ్బా.. ఏమో సొంత మెదడు తో ఆలోచించి యుగాలయ్యింది. అమ్మో ఎవరేమంటారో.అందరిని ప్లీజ్ చెయ్యొద్దు అమ్మో ఆ రామారావు గారు గబుక్కుమని నా శీలం మీద మచ్చ వచ్చేట్లు నన్ను ఎవరితోనో కలిపి అనేస్తాడో ఎం పాడో, ఆ ఎదురింటి సతీష్ మంచి గా షేక్ హేండ్ లు అవి ఇస్తూ పలకరిస్తాడు కాని కను చివరల వెక్కిరింత నేను తల పైకెత్తి స్వేచ్హగా నవ్వి బిగ్గర గా పలికినప్పుడల్లా ఆ హేళన గమనింపే కదా, ఎందుకొచ్చిన గోల లే బాబు మా ఆయన వెనుక గా వుండి నీడ లా అనుసరిస్తాను తనకిష్టం వుండదు ఇలాంటివి. ఐనా నాకేంకావాలో నాకంటే నా అన్న, మామ, బావ, పక్కిటీ అన్నయ్య ఎదురింటి తాత, అమెరికా చార్లీ బ్రో, రష్యా బ్రోమివ్ కమ్యునిజం కామ్రేడ్ అందరికి తెలుసు, రండి మీ సలహాలు ఇక్కడ సిగ్గులేకుండా స్వీకరించబడతాయి. యార్గగడ్డ, ఇంకో తుర్ల వారు లేక ఇంకో పిచ్చాపాటోరు ఎవరైనా రావొఛ్ఛు మా మనసుల్లో ఏమి వుందో మాకేమి కావాలో మాకేది పాతివ్రత్యమో మా బతుకు ల గీత లు రాదురు కాని అందరు వెల్కం మొగవాళ్ళైతే చాలు.. వో ఇలా అంటే ఫెమినిజమ్ కదు ఫెమినిజమ్ అంటే సిగ్గులేని తనం తెంపరి తనం కదు.. వూప్స్ మర్చే పోయాను సరే నేను వెనక్కి నా తెర ల వెనుక కు వెళ్ళి పోతాను రండి ఒక వెక్కిరింత తో, ఒక పైకెత్తిన కనుబొమ్మ తో, ఒక వికృతమైన వెటకారపు ఆత్మ ను చంపి వేయగల మాట తో రండి రండి.. మీ రెప్పుడూ నా ముంగిట ముఖ్యమైన అతిధులే, రండి మీ మాట కు అయ్యో వంట మాడి పోతోంది పొయ్యమీద, మా వారు వచ్చే టైం అయ్యింది వెళ్ళి వస్తాను.

భాస్కర రామి రెడ్డి said...

మహాభారతం చదివేటప్పుడు ఎవరిముఖం వాళ్ళకు అద్దంలో చాలా బాగా కనిపిస్తుంది. కాదంటారా? ఇక్కడ ద్రౌపది ప్రస్థాపన కాబట్టి, ఆ ద్రౌపది కూడా చదువరులకు రకరకాలుగా అర్థమవుతుంది. ఒకడు పతివ్రత గా కథ వ్రాయవచ్చు, మరొకడు వీరవనిత గా కథవ్రాయవచ్చు, మరొకరు మగవాడి దౌష్ట్యానికి బలైన స్త్రీగా వర్ణనలతో స్త్రీ సమాజాన్ని ఉఱ్ఱూతలూగించవచ్చు. ఇంకొకరు స్త్రీ తలచుకుంటే కానిదేముండదని ఒక శక్తిస్వరూపిణిగా చూపవచ్చు. మరొక కాముకునికి ఐదుగురుతో కామవాంఛ తీర్చుకొనే యువతిగా కనిపించవచ్చు లేదా నాటిసమాజానికి బలైన ఒక సాధారణ స్త్రీగాను చూపించవచ్చు. కారణం ఇలాంటి కావ్యాలను చదివేటప్పుడు మరీ ముఖ్యంగా కథదేనిమీద వ్రాయాలో నిర్ణయించుకొని చదివేటప్పుడు అందులో ఆ వ్యక్తి గుణగణాలన్నీ చాలా వికృతంగా కనిపిస్తాయి.ఇందుకు చక్కటి ఉదాహరణ రామాయణ విషవృక్షం. ఈ ద్రౌపదిని నేనైతే చదువలేదు కానీ సమాజానికి ఉపయోగపడని ఏకావ్యం కూడా మూడు యుగాలు కాదుకదా కనీసం మూడు తరాలు నిలువదు.అలాంటిది రామాయణం కానీ మహాభారతం కానీ ఇన్ని వేల సంవత్స్రరాలు నిలబడడానికి కారణం మనమనుకునే పాతివ్రత్యంలోనూలేదు లేదా రాముని కీర్తికాంక్ష లోనూ లేదు. జరిగిన కథను నడిపిస్తూ అంతర్లీనంగా చెప్పిన కాలానుగుణ సూక్తులల్లో వుంది. నాటి పురుషులకు ఏకపత్నీవ్రతం నిత్యమూ కాదూ అలా అని స్త్రీ మడిగట్టుకు కూర్చున్న దాఖలాలూ కనిపించవు. సామాన్య స్త్రీ పురుషులలో ఎవరి స్వేచ్చ వారికి ఆనాడే కాదు ఈనాడు వుంది. ఎటొచ్చీ సమాజంలో ఒక ఉన్నత స్థితికి రాగానే ఆ సమాజానికి భయపడటం మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలౌతుంది ఎవరి పాపాలను వాళ్ళు నానా రకాల సమర్థించుకోవడం.

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Praveen Communications said...

విమర్శకులు ద్రౌపది నవలని అశ్లీలం అని విమర్శించారు. ఈ నవలలో ఎలాంటి అశ్లీలం లేదు. ఈ నవలలోని నకుల సహదేవుల సాంగత్యం కథలోని మొదటి పారాగ్రాఫ్ ఇది
>>>>>>>>>>
నకులుడు అందమైన పసిబాలునిలా కనపడ్డాడు. మొదటి రాత్రి ద్రౌపదిని చూడగానే పసివాడు మరో అందమైన వస్తువును చూడగానే ఆనందించినట్టు ఆనందించాడు. ద్రౌపది చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు. తన అశ్వాన్ని (గుర్రాన్ని) బయటకి తీసి, ద్రౌపదిని ముందు కూర్చోబెట్టుకుని, సైకత శ్రేణుల్లో (ఇసుక దిబ్బలలో), వెన్నెల రాత్రిలో విహరించాడు. తన గుర్రపు స్వారీ నైపుణ్యాన్ని ఆమె ముందు ప్రదర్శించాడు.
>>>>>>>>>>
విమర్శకులు అన్నట్టు ఈ పేరాగ్రాఫ్ లో ఎలాంటి అశ్లీలం లేదు. మన తెలుగు సినిమాల బాష కంటే ఇది చాలా సభ్యమైన బాషే.

Kalpana Rentala said...

భావనా, మహేష్ కి , మీకు కూడా తికమక గా అనిపించ్చిందంటే తప్పనిసరిగా నేను క్లారిఫై చేయాల్సి వుంది.
మహేష్ అడిగిన వాటికి నా అభిప్రాయాలు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు. మీరు వేసింది ప్రశ్నలో , లేక నా అభిప్రాయాలకు మీ అభిప్రాయాలో అర్ధం కాలేదు. కాబట్టి అందరికి అర్ధం కావటానికి ఈ అంశం మీద నా ఆలోచనలు చెప్తాను.
1. నేను పురాణాల్ని నమ్ముతానా?, గౌరవిస్తానా? ఆచరిస్తానా? ( ఇలా అయితే పాయింట్ సూటిగా వుంటుంది కాబట్టి)
నేను పురాణాల్ని చదువుతాను. ప్రశ్నిస్తాను. వాటిని ఒక సాహిత్య వారసత్వం గా భావిస్తాను. వాటిని నిరాకరించటం అనేది అనవసరం అని నా భావన. వాటికి కాలానుగుణం గా కొత్త అర్ధం చెప్పలని, అప్పుడు వాటికున్న పౌరాణిక విలువ తగ్గి సాహిత్య విలువ పెరుగుతుందని నా నమ్మకం.తప్పో, వొప్పో నాకు తెలియదు.
2. భారత జాతిమొత్తానికి నేను ప్రాతినిద్యం వహించలేను. నాకు తెలిసినంత వరకు వాల్మీకి రామాయణం, వ్యాసుడి భారతమే ప్రామాణికం. సాహిత్యపరమ్ గా సుమా. కాబట్టి వాటినే ప్రశ్నిస్తాము. మూడు వేల రామాయణాలు నేను చదవలేదు. వేటిల్లో ఏమీ చెప్పారో నాకేలా తెలుస్తుంది.
3. రామాయణ, భారతం లో చెప్పిన విలువలని గౌరవిస్తారా? ఆచరిస్తారా?
అది ఇతిహాసమైతే యుగ ధర్మం అనుకుంటాను. సాహిత్యమైతే కవి కల్పనా అనుకుంటాను. కాబట్టి వాటిల్లో చెప్పిన విలువలు ప్రజల మీద ముఖ్యంగా స్త్రీల మీద తరతరాలుగా ఒక కుట్ర ప్రకారం రుద్దతానికి ఉపయోగించబడినవి అని నమ్మినప్పుడు వాటిని గౌరవించటం అనే ప్రశ్న లేదు. రామాయణ, భారతాల్నీ చదివి ఆనందించటానికి, (ఒక టెక్స్ట్ గా) వాటి విలువల్ని అంగీకరించటానికి రెండింటికి మధ్య వున్న తేడా ని అర్ధం చేసుకున్నాను. అదే పాయింట్ నేను చెప్పింది. మూల కథ లేదు అన్నది మహేశ్ అభిప్రాయం. వుంది అన్నది నా అభిప్రాయం. ఇందులో కన్ఫ్యూషన్ ఏమిటో నాకు తెలియలేదు. మనకు తెలియకుండానే మనం ఆ విలువల్ని అనుష్టిస్తాము అన్నారు మీరు. అయి వుండవచ్చు. కానీ ఎవరు ఏ విలువలు పాటిస్తారు? నమ్ముతారు అనేది వైయక్తికం. సమాజానికి కొన్ని విలువలు వున్నాయి ,. వాటిని అంగీకరించేవారు అంగీకరిస్తారు. ఎదురుతిరిగేవారు ఎదురుతిరుగుతారు. సీతా లాగానో, ద్రౌపదీ లాగానే, సావిత్రిలాగానో నేను వుందను. ఎవరిని వుండమని ప్రబోడించను. ఎవరైనా వుంటే అది వారి ఇష్టం. అలా వుండని వారిని నేను అగౌరవపరచను. రామాయణ, భారతాలు చదివి ఆనందించి కూడా మన వ్యక్తిత్వాల్ని మనం నిలుపుకోవచ్చు. అది నా అభిప్రాయం.
సూర్యుడు గారు, సారీ. పాతివ్రత్యం మీద ఇప్పుడు రాసే వోపిక లేదు.రోజూ చర్చించే టైం లేదు. నా మైల్ అడ్రెస్ kalpanarentala@yahoo.com మీరు మైల్ ఇస్తే నేను రిప్లై ఇస్తాను టైం చూసుకొని.
భావనా, మన మెదడు తో ఆలోచించి యుగాలైంది అనుకోవటం లేదు నేను. నిరంతరం మనం మానసికంగా, శారీరకంగా , ఇప్పుడైతే బ్లాగ్ముఖం గా నిరంతరం డైసెక్ట్ అవుతూనే వున్నాము. అయినా కూడా ఎక్కడో ఈ చెలియలికట్టలను నెమ్మదిగా, క్రమంక్రమం గా దాటుతూనే వున్నామన్న చిన్న నమ్మకం కూడా వుంది.
నా ఆలోచన్లు సరిగ్గా మళ్ళీ ఒక దారిలో పెట్టుకోవటానికి మీరు, మహేశ్ వేసిన ప్రశ్నలు ఉపయోగపడ్డాయి. అందుకు మీ ఇద్దరికి థాంక్స్.

 
Real Time Web Analytics